
శ్రీశైలం, శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు
భక్తులతో కిక్కిరిసిన పంచారామ క్షేత్రాలు
సందడిగా మారిన కోటప్పకొండ
శివనామ స్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు
రాష్ట్రంలోని శైవక్షేత్రాలు శివనామ స్మరణతో మార్మోగాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం వేకువజాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నదులు, పుష్కరిణిలలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు భోళాశంకరుడిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఆదిదేవునికి అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి కుంకుమ పూజలు జరిపారు. అనేకచోట్ల రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపారు.
లింగోద్భవ కాలం అనంతరం పార్వతీపరమేశ్వరుల కల్యాణోత్సవాలు నేత్రపర్వంగా సాగాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, పంచారామ క్షేత్రాలతోపాటు కోటప్పకొండ త్రికూటేశ్వరస్వామి ఆలయం భక్తులతో సందడిగా మారాయి. ‘ఓం నమశ్శివాయ’ అంటూ భక్తులు కైలాసనాథుడికి తమ కోరికలను విన్నవించుకున్నారు. – సాక్షి నెట్‌వర్క్
శ్రీశైలానికి వెల్లువెత్తిన భక్తజనం
శ్రీశైలంలో ఆదిదేవుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి వెల్లువలా తరలివచ్చిన భక్తులతో శ్రీగిరి క్షేత్రం జనసంద్రమైంది. మల్లన్న, భ్రామరీలకు దేవస్థానం విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. లింగోద్భవ సమయంలో మల్లన్నకు పాగాలంకరణ జరిపారు. పండితులు, ప్రధాన అర్చకులు జ్యోతిర్లింగ మల్లికార్జునుడికి లింగోద్భవకాల మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకానికి శ్రీకారం చుట్టారు.
శంభో శివ శంబో ఓం నమశ్శివాయ అంటూ భక్తుల శివనామస్మరణ నలుమూలల నుంచి ధ్వనించింది. ప్రకాశం జిల్లా హస్తినాపురానికి చెందిన చేనేత కార్మికుడు ఫృధ్వి సుబ్బారావు స్వామివారి గర్భాలయ విమాన గోపురాన్ని, ముఖమండపంపై ఉన్న 14 నందులను కలుపుతూ పాగాలంకరణ చేశారు.
బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు శివపార్వతులకు పట్టువ్రస్తాలు, బంగారు ఆభరణాలు, పరిమళపూలతో అలంకరించారు. వేదమంత్రాల నడుమ ఆది దంపతులు ఒక్కటైన కల్యాణ ఘడియల్లో క్షేత్రమంతటా శివనామ స్మరణలు హోరెత్తాయి. ప్రభల ఉత్సవం కనుల పండువగా సాగింది.
కోటప్పకొండపై కోలాహలం
ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండపై వెలసిన త్రికోటేశ్వర స్వామి క్షేత్రం భక్తజనంతో నిండిపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున స్వామి దర్శనం కోసం తరలివచ్చారు. వేకువజామున 3 గంటలకు తీర్థబిందెతో స్వామికి అభిషేకాలు నిర్వహించారు.
త్రికూటాద్రి పర్వతంపై కొలువై ఉన్న మహానందీశ్వరునికి పంచామృతాభిషేకాలు జరిపారు. ప్రభల ఉత్సవం కోలాహలంగా జరిగింది. 20 భారీ విద్యుత్ ప్రభలతోపాటు చిన్న చిన్న ప్రభలు ప్రభల నిధికి చేరాయి. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువ్రస్తాలు సమర్పించారు.
హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.సుజాత, జస్టిస్ కె.సురేష్ రెడ్డి, జస్టిస్ కృష్ణమోహన్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్రమంత్రి టీజీ భరత్, ప్రభుత్వ విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, చదలవాడ అరవింద్‌బాబు, యరపతినేని శ్రీనివాసరావు, బి.రామాంజనేయులు, కొలికిపూడి శ్రీనివాసరావు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు త్రికోటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు.
పంచారామాలకు పోటెత్తిన భక్తులు
ఉమ్మడి గుంటూరు జిల్లా అమరావతి, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, పాలకొల్లు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోట, ద్రాక్షారామంలోని పంచారామ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. అమరావతిలోని అమరారామంలో ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు పవిత్ర కృష్ణా నదిలో స్నాన మాచరించి అమరేశ్వరాలయంలో దీపాలు వెలిగించి ఏకాదశ రుద్రాభిషేకాలను, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు.

అమరేశ్వరుడిని హైకోర్టు న్యాయమూర్తులు జ్యోతిర్మయి, సుమతి, రవినాథ్ తివారి, రిటైర్డ్ న్యాయమూర్తి శ్యాంప్రసాద్, ప్రభుత్వ సలహాదారు అర్‌పీ ఠాకూర్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, జగన్‌మోహనరావు, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ దర్శించుకున్నారు. భీమవరం గునుపూడిలోని ఉమాసోమేశ్వర జనార్దనస్వామి ఆలయం (సోమారామం)లో విశేష అభిషేకాలు, పూజలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు చేశారు.
శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు క్షేత్రాన్ని దర్శించుకున్నారు. పాలకొల్లులోని క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో విశేష అభిషేకాలు, మహన్యాసపూర్వక అభిషేకాలు నిర్వహించారు. రాత్రి 8.35 గంటలకు జగజ్జ్యోతి వెలిగించారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో స్వామివారికి మల్లన్న పాగా అలంకరించారు. అనంతరం లక్షపత్రి పూజ నిర్వహించారు.
ద్రాక్షారామం, సామర్లకోట సమీపంలోని భీమారామం క్షేత్రాలను దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని పట్టిసీమ శివక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానమాచరించి భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసి గోదావరిలో మైల తెప్పలు వదిలారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా మురమళ్లలో భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి, కోటిపల్లి రాజరాజేశ్వరీ సమేత సోమేశ్వరస్వామి, పిఠాపురం నియోజకవర్గంలోని పాదగయ, రాజమహేంద్రవరంలోని ఉమా మార్కండేయేశ్వరస్వామి, కోటి లింగేశ్వర స్వామి తదితర ఆలయాల్లో లింగోద్భవ అభిషేకాలకు భక్తులు పోటెత్తారు. కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం, గోదావరి ఘాట్లలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు జరిపారు.
శ్రీకాళహస్తికి పోటెత్తిన భక్తజనం
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరాలయానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఇంద్ర విమానం, చప్పర, నంది, సింహ వాహనాలపై మాడ వీధుల్లో విహరించారు. భక్తులు కర్పూర హారతులు పట్టారు. రాత్రి శివయ్య జాగరణకు వేలాది మంది భక్తులు శ్రీకాళహస్తికి చేరుకున్నారు. అర్ధరాత్రి దాటాక లింగోద్భవ దర్శనం ప్రారంభమైంది. హీరో మంచు విష్ణు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, చిత్రబృందం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.
తిరుమలలోనూ శివరాత్రి సందడి
తిరుమలలోని గోగర్భం సమీపంలో వెలసిన రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి అభిషేకం నిర్వహించారు. క్షేత్రపాలకుడి శిల వద్ద పాలు, పెరుగు, చందనం, పన్నీరు, కొబ్బరి నీళ్లు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తర్వాత నైవేద్యం సమరి్పంచారు.
యనమలకుదురులో సందడిగా ప్రబోత్సవం
కృష్ణా జిల్లా యనమలకుదురు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తుల సందడితో శివగిరి పై ఉత్సవ శోభ ఏర్పడింది. భక్తులు బుధవారం మహాశివరాత్రి పర్వదినంతో వేకువజామునే కొండ పై వేంచేసి ఉన్న స్వామివారి దర్శనానికి తరలివచ్చారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామంలో ప్ర¿ోత్సవం ఆకట్టుకుంది. సాయంత్రం 6 గంటలకు రాతిచక్రాల రథం పై ఏర్పాటు చేసిన దేవుడి ప్రభ కొండ చుట్టూ ఊరేగించారు. గ్రామంలో దాదాపు 50 ప్రభలు రంగురంగు కాగితాలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. మండపం సెంటర్లో 70 అడుగుల ప్రభ ఏర్పాటు చేశారు. గ్రామంలో ప్రభలు రాత్రి పొద్దుపోయే వరకు ప్రదర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment