
మహాశివరాత్రి ఉత్సవాల్లో అతివిశిష్టమైనది పాగా అలంకరణ
దాని వస్త్ర తయారీభాగ్యం కొన్ని నేతకారుల కుటుంబాలదే
ఏళ్ల నుంచి కొనసాగుతున్న సంప్రదాయం
శ్రీకాకుళం జిల్లా నుంచి వ్రస్తాల సమర్పణ
నియమ నిష్టలతో సిద్ధం చేసిన చేనేత కార్మికులు
శ్రీశైలానికి బయల్దేరిన పవిత్ర వ్రస్తాలు
మహా శివరాత్రి వస్తోందంటే చాలు ఆ గ్రామాల్లో ఒకటే సందడి. దాదాపు ఒకటిన్నర నెలల ముందే అక్కడి చేనేత కార్మికులందరూ మిగతా అన్ని కార్యక్రమాలు పక్కనపెట్టేసి ఒకే ఒక్క కార్యక్రమంపై దృష్టి పెడతారు. అదే శ్రీశైల మల్లన్న స్వామికి సమర్పించేందుకు ప్రత్యేక వస్త్రం తయారీ. నేత పని పూర్తయిన తరువాత ప్రత్యేక పూజలు ఊరేగింపులు నిర్వహించి ప్రత్యేక వస్త్రాన్ని శ్రీశైలానికి తీసుకువెళతారు. ఈ పుణ్యక్రతువు పూర్తయింది. ప్రత్యేక వస్త్రం శ్రీశైలానికి బయల్దేరింది.
పరమ పవిత్రమైన శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామికి శివరాత్రికి సిక్కోలు.. తలపాగాలు, ఇతర వ్రస్తాలు పంపనుంది. ఎన్నో ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా తలపాగా వస్త్రాలు పంపించేందుకు పొందూరుతో పాటు జిల్లా నుంచి పలు ఊళ్లు సిద్ధమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో పొందూరు, బూర్జ, ఆమదాలవలస, ఉప్పెనవలస, లావేరు గ్రామాల నుంచి వ్రస్తాలను శివరాత్రికి మల్లికార్జున స్వామికి సమర్పించనున్నారు.
ఈ ఏడాది స్థానిక చేనేతవాడకు చెందిన బనిశెట్టి శ్రీనివాసరావు పొందూరు నుంచి తలపాగాను సమర్పించనున్నారు. చేనేత, జౌళి శాఖ ద్వారా బనిశెట్టి శ్రీనివాసరావు తలపాగా వస్త్రాలను శ్రీశైలం మల్లన్నకు సమర్పించడానికి దరఖాస్తులు చేసుకున్నారు. బనిశెట్టి ఆంజనేయులు మూడు తలపాగా వస్త్రాలను గుడివాడ, ఒంగోలు, వెంకటగిరి వాళ్లకు నేశారు. శివయ్యకు తలపాగా, అమ్మవారికి చీర, శనగల బసవన్న, వినాయకుడికి పంచె, నవనందులను, గాలి గోపురాన్ని అలంకరించేందుకు వ్రస్తాలను నేశారు. – పొందూరు
చరిత్ర సృష్టించిన ముఖలింగం..
» వాండ్రంగి వీధికి చెందిన ఆకాశం ముఖలింగం 33 సార్లు శ్రీశైలం వెళ్లి మల్లన్నకు వ్రస్తాలను సమర్పించి చరిత్ర సృష్టించారు.
» లావేటి వీధికి చెందిన బూడిద చిన్నారావు 21 సార్లు స్వామికి వ్రస్తాలను సమర్పించారు.
» వ్రస్తాలను తీసుకొచ్చే పొందూరు కార్మికులకు వసతి, భోజన సదుపాయాలను, ఇతర సౌకర్యాలను కల్పిస్తారు.
ఊరేగింపు
ఆమదాలవలస రూరల్: మందరాడ గ్రామానికి చెందిన దేవాంగులు నేసిన శ్రీశైల మల్లన్న తలపాగాను శ్రీనివాసాచార్యులపేట గ్రామ పురవీధుల్లో ఊరేగించి శివాలయం ప్రాంగణంలో ఉంచారు. మహా శివరాత్రి నాడు శ్రీశైల శిఖరానికి ఈ పాగా చుడతామని నేత కార్మికులు తెలిపారు. ముందుగా గ్రామాల్లో తలపాగాను ఊరేగిస్తూ ప్రత్యేక పూజలు చేస్తూ శ్రీశైలం మల్లన్న సన్నిధికి చేరుస్తామని చెప్పారు. కార్యక్రమంలో బొడ్డేపల్లి గౌరీపతి, కె.ప్రసాద్‌రావు, కె.తవుడుబాబు, జి.పకీర్ తదితరులు పాల్గొన్నారు.
నిష్టతో నేశాం..
ఎంతో నియమ, నిష్టల తో శ్రీశైలం మల్లన్నకు తలపాగా వ్రస్తాలను నేశాం. ఈ వ్రస్తాలను నేస్తున్నంత సేపు శివనామస్మరణలోనే ఉన్నాం. ఉపవాస దీక్షలోనే వ్రస్తాలను పూర్తిచేశాం. ఏటా వ్రస్తాలను నేసే మహాభాగ్యం మాకు దక్కుతుండటం ఎంతో సంతోషంగా ఉంది. – బనిశెట్టి శ్రీనివాసరావు, చేనేత కార్మికుడు, పొందూరు
వ్రస్తాలను సమర్పిస్తారిలా..
»మల్లికార్జున స్వామికి 366 మూరల (160 మీటర్లు) పొడవు 48 సెంటీమీటర్లు వెడల్పు ఉన్న తలపాగా.
» భ్రమరాంబ అమ్మవారికి 6 మీటర్లు పసుపు అంచు చీర.
» శనగల బసవన్న (నందీశ్వరుడు)కు 6 మీటర్ల అరుణ వర్ణ అంచు పంచె.
» వినాయకుడికి 6 మీటర్లు ఎరుపు అంచు పంచెలను నేశారు. ఈ వ్రస్తాలను శివలింగాకారంలో మలిచారు.
» ప్రతి రోజూ తల పాగా, వ్రస్తాల వద్ద భజనలు చేస్తున్నారు. చేనేత వాడలోని ప్రజలంతా పూజలు నిర్వహిస్తున్నారు.
» శివరాత్రి రోజున లింగోద్భవ కాలానికి ముందు..అంటే రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య దేవాలయంలో ప్రవేశాలు నిలిపివేసి, లైట్లన్నీ ఆర్పేస్తారు.
» మహాశివరాత్రికి రెండు రోజుల ముందు ఈ వ్రస్తాలను శ్రీశైలం తీసుకొని వెళ్తారు. దేవాంగులు సమర్పించనున్న వ్రస్తాలను మహాశివరాత్రి రోజున స్వామికి అలంకరిస్తారు.
» ఒక వస్త్రంతో తలపాగా చుట్టి మిగిలిన వ్రస్తాలను నవ నందులకు, గాలి గోపురానికి అలంకరిస్తారు. పవిత్ర వ్రస్తాలను తీసుకుని ఆదివారం ఆయా నేతకారులు శ్రీశైలానికి బయల్దేరారు.
Comments
Please login to add a commentAdd a comment