శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. అయినా దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు. మంగళవారం సాయంత్రానికి జూరాల, సుంకేసుల నుంచి 40,947 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. సోమవారం నుంచి మంగళవారం వరకు శ్రీశైలానికి ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి 35,945 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది.
జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 1,05,142 క్యూసెక్కులు విడుదల చేశారు. కుడిగట్టు కేంద్రంలో 14.962 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.838 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ప్రస్తుతం జలాశయంలో 197.4616 టిఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటి మట్టం 881.70 అడుగులకు చేరింది.
సాగర్ నీటి మట్టం 589.90 అడుగులు
నాగార్జునసాగర్‌లో మంగళవారం 2 రేడియల్ క్రస్ట్‌గేట్ల ద్వారా 24,884 క్యూసెక్కులు దిగువ కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి శ్రీశైలం నుంచి 70,762 క్యూసెక్కులు వస్తుండగా అంతే నీటిని విడుదల చేస్తున్నారు.
కుడి కాలువ ద్వారా 10,080, ఎడమ కాలువ ద్వారా 4,613, ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా 28,785 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీకి 1800 క్యూసెక్కులు, వరదకాల్వకు 600 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయ నీటిమట్టం 589.90 అడుగుల వద్ద ఉంది. ఇది 311.7462 టీఎంసీలకు సమానం.
Comments
Please login to add a commentAdd a comment