
శ్రీశైలంలో బట్టబయలైన నకిలీ టికెట్ల వ్యవహారం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో నకిలీ టికెట్ల వ్యవహరం బట్టబయలైంది. శ్రీశైల దేవస్థాన కంపార్ట్‌మెంట్ల వద్ద విధులు నిర్వహించే ఓ వ్యక్తి దర్శనానికి వచ్చిన వారితో మాటమాట కలిపి స్వామి వారి స్పర్శదర్శనానికి పంపిస్తానని, టికెట్‌కు ఇంత ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారికి గత సంవత్సరం టికెట్లలో తేదీ, సమయం ఎడిటింగ్ చేసి టికెట్లు ఇచ్చాడు. ఇందుకుగాను ఒక టికెట్‌కు రూ.900 వసూలు చేశాడు. మాములుగా అయితే రూ.500 టికెట్ ప్రవేశ ద్వారం నుంచి ఆలయం క్యూలైన్లలోకి ప్రవేశించాలి.
అయితే వీరిని ఉచిత దర్శనం క్యూలైన్ నుంచి ఆలయంలోకి తీసుకువెళ్లి, అక్కడ వెయిట్ చేయించి స్పర్శదర్శన సమయంలో పంపించారు. మనోహర గుండం వద్ద టికెట్లు, ఆధార్ తనిఖీ చేస్తుండగా టికెట్టులో ఉన్న ఆధార్, వారు తీసుకువచి్చన ఆధార్‌కు వ్యత్యాసం ఉంది. దీంతో వారిని పర్యవేక్షకుల వద్దకు తీసుకువచ్చారు. వారిని విచారించగా జరిగిన తతంగం బయట పడింది.
నకిలీ దేవస్థాన స్టాంప్ సైతం తయారీ
మల్లన్న స్పర్శదర్శనానికి ఆన్‌లైన్‌లోనే టికెట్ పొందాలి. అలా టికెట్ పొందిన భక్తులు, టికెట్ జిరాక్స్ కాపీ, దానితో పాటు ఆధార్ కార్డులను తీసుకురావల్సి ఉంటుంది. రూ.500 ప్రవేశ ద్వారం వద్ద టికెట్‌లో ఉన్న ఆధార్ నంబర్, వారు తీసుకువచ్చిన ఆధార్‌తో సరిపొల్చుకుని దర్శనానికి అనుమతిస్తారు. టికెట్ స్కానింగ్ సెంటర్ వద్ద టికెట్లను స్కానింగ్ చేసి అక్కడే టికెట్లపై స్కానింగ్ చేసిన వ్యక్తి సంతకం చేసి దేవస్థానం స్టాంప్ వేస్తారు.
నకిలీ టికెట్లు తయారు చేసిన వ్యక్తి రూ.500 ప్రవేశ ద్వారంలో వెళితే స్కానింగ్ వద్ద తన తప్పులు బయటపడతాయని, అలా వెళ్లకుండా ఉచిత ప్రవేశ ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించేటట్లు ఏర్పాటు చేసుకున్నాడు. సదరు టికెట్‌పై దేవస్థానం స్టాంప్ సైతం నకిలీది తయారు చేసి ముద్రించినట్లు తెలుస్తోంది. సంతకం కూడా చేశారు. గర్భాలయం సమీపంలోని మనోహరగుండం వద్ద డ్యూటీ నిర్వహించే వ్యక్తి తనిఖీ చేయడంతో నకిలీ టికెట్ల వ్యవహారం బయటకువచ్చింది.
విచారణకు ఆదేశించిన ఈఓ..
నకిలీ టికెట్ల వ్యవహరంపై క్యూలైన్ పర్యవేక్షకులు ఈవో శ్రీనివాసరావు దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై అసలు టికెట్ ఎప్పటిది, టికెట్‌పై తేదీ, సమయం ఎలా ఎడిటింగ్ చేశారు? ఆ టికెట్లను ఎవరు భక్తులకు అందించారు? ఎక్కడ తయారు చేశారు? దేవస్థాన స్టాంప్ ఎక్కడిది? అనే విషయాలపై విచారించి నివేదిక ఇవ్వాలని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, క్యూలైన్ పర్యవేక్షకులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment