
లక్షలాదిగా తరలిరానున్న భక్త జనం
565 ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ
3 వేల మందితో పోలీసు బందోబస్తు
సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట రూరల్: అంగరంగ వైభవంగా సాగే తిరునాళ్లకు పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ కోటప్పకొండ సర్వాంగసుందరంగా ముస్తాబైంది. మహా శివరాత్రిని పురస్కరించుకుని నిర్వహించే ఈ మహోత్సవానికి తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది జాగరణకు తరలివస్తారు. త్రికోటేశ్వర స్వామివారికి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పట్టు వ్రస్తాలను సమర్పించనున్నారు. తిరునాళ్లలో యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ శాఖలు విస్తృత ఏర్పాట్లు చేశాయి.
ఎండ తీవ్రత దృష్ట్యా ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, షామియానాలు వేశారు. క్యూ లైన్‌లో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. దాతల సహకారంతో లక్ష వాటర్ బాటిల్స్, మజ్జిగ, పాలు పంపిణీ చేయనున్నారు. భక్తులకు అందజేసేందుకు లక్షన్నర లడ్డూలు, 75 వేల అరిసె ప్రసాదాలను అందుబాటులో ఉంచారు. పోలీసు శాఖ 3 వేల మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించనుంది. నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ ప్రాంతాల నుంచి యాత్రికులను చేరవేసేందుకు ఆర్టీసీ 565 బస్సులను నడపనుంది.
కొండ కిందనుంచి పైకి భక్తులను చేరవేసేందుకు 85 లగ్జరీ బస్సులను ఏర్పాటు చేసింది. వైద్య శాఖ ఆధ్వర్యంలో కొండ మీద, కింద 15 శిబిరాలను నిర్వహించనున్నారు. 108 వాహనాలను అందుబాటులో ఉంచారు. గ్రామాల నుంచి కొండకు వచ్చే భారీ విద్యుత్తు ప్రభలు తిరునాళ్లలో ప్రత్యేక ఆకర్షణ. ఈ ఏడాది 18 ప్రభలు కొండలో కొలువుదీరనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment