పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
వెదురుపాక (రాయవరం) :
పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు రాజమండ్రి ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు తెలిపారు. మండలంలోని వెదురుపాక రూట్ పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్తికమాసంలో భక్తుల సౌకర్యార్థః పంచారామ శైవ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట పుణ్యక్షేత్రాలను ఒకే రోజులో సందర్శించే విధంగా బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రతి శని, ఆదివారం ప్రత్యేక బస్సులు రాత్రి ఏడు గంటలకు రాజమండ్రిలో బయలుదేరతాయన్నారు. టికెట్ రిజర్వేషన్ చేయించుకునే సౌకర్యం ఉందన్నారు.
ఎక్స్‌ప్రెస్, ఆల్ఫాడీలక్స్, సూపర్‌లగ్జరీ బస్సులు నడుపుతున్నామన్నారు. పంచారామాల దర్శనానికి ఎక్స్‌ప్రెస్ బస్సులో పెద్దలకు రూ.630, పిల్లలకు రూ.490, ఆల్ఫాడీలక్స్లో పెద్దలకు రూ.770, పిల్లలకు రూ.600, సూపర్‌లగ్జరీ బస్సులో పెద్దలకు రూ.810, పిల్లలకు రూ.630 టికెట్ ధరగా వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఏ గ్రామంలోనైనా 45 ప్రయాణికులుంటే అదే గ్రామం నుంచి బస్సు నడుపుతామన్నారు. అలాగే భక్తులు బృందాలుగా వస్తే ఏరోజైనా పంచారామ దర్శనానికి బస్సులు నడపుతామన్నారు. ఈ అవకాశాన్ని అయ్యప్పస్వాములు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఇతర వివరాలకు 73829 11410 నంబరుకు ఫో¯ŒS చేయాలని ఆయన సూచించారు.