
అంతరిక్షం, స్పేస్ అప్లికేషన్స్‌పై ఇస్రో అవగాహన
తొమ్మిదో తరగతి విద్యార్థులకు అవకాశం
మార్చి 23 వరకు దరఖాస్తుల స్వీకరణ
వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): అంతరిక్ష పరిశోధనలపై మక్కువ ఉన్న విద్యార్థులను ప్రొత్సాహించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. వారిని ప్రత్యేకంగా తమ ప్రాంగణాలకు ఆహ్వానించి నూతన ఆవిష్కరణలపై ఉత్సాహాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా యువిక (యుంగ్ సైంటిస్ట్)–2025 పేరిట ఉపగ్రహ ప్రయోగాలను తెలుసుకునేందుకు, శాస్త్రవేత్తలతో మాట్లాడేందుకు తొమ్మిదో తరగతి విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది.
ఈ విధమైన అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని ఇస్రో పిలుపునిస్తుంది. అంతరిక్ష పరిశోధనల్లో ఇటీవల ఇస్రో 100 ప్రయోగాలు పూర్తి చేసుకుంది. అగ్రదేశాలకు దీటుగా భారత్ పలు పరిశోధనలు చేపడుతోంది. ఈ విజ్ఞానాన్ని విద్యార్థులకు తెలియజెప్పేందుకు, వారిలో స్ఫూర్తి నింపేందుకు ఇస్రో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.
యువిక లక్ష్యాలు ఇవీ..
» భారత అంతరిక్ష పరిశోధనలను విద్యార్థులకు పరిచయం చేయడం
» విద్యార్థులను స్పేస్ టెక్నాలజీ వైపు ప్రోత్సహించడం
» అంతరిక్ష పరిశోధకులుగా వారిని సిద్ధం చేయడం
ఎవరు అర్హులంటే...
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న తొమ్మిదో తరగతి విద్యార్థులు, ఆన్‌లైన్ పరీక్షలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఇస్రో ప్రాధాన్యతనిస్తోంది. ఎనిమిదో తరగతిలో సాధించిన మార్కుల్లో 50 శాతం, మూడేళ్లలో పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనల్లో పాల్గొంటే వాటి ఆధారంగా 2–10%, ఆన్‌లైన్ క్విజ్ పోటీల్లో చూపించిన ప్రతిభకు 10% వెయిటేజీ ఇవ్వనుంది. ఎన్సీసీ, స్కౌట్, గైడ్స్ విభాగాల్లో ఉంటే 5%, పల్లె ప్రాంతాలకు చెందిన వారికి 15% ప్రాధాన్యం ఇవ్వనుంది.
పరీక్ష ఎక్కడంటే...
ఇస్రో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 7 కేంద్రాల్లో చేపడుతోంది. డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), తిరువనంతపురం (కేరళ), సూళ్లూరుపేట (ఏపీ), బెంగళూరు (కర్ణాటక), అహ్మదాబాద్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణ), షిల్లాంగ్ (మేఘాలయ).
దరఖాస్తు ఇలా చేసుకోవాలి..
నాలుగు దశల్లో విద్యార్థులు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. మొదటగా ఈ–మెయిల్ ఐడీతో వివరాలు నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న 48 గంటల వ్యవధిలో ఇస్రో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ క్విజ్‌లో పాల్గొనాలి. క్విజ్ పూర్తి చేసిన 60 నిమిషాల తరువాత ‘యువికా’ పోర్టల్లో ఆన్‌లైన్ దరఖాస్తుతో పూర్తి వివరాలు నమోదు చేసి సమర్పించాలి.
మూడేళ్లలో వివిధ అంశాల్లో విద్యార్థి సాధించిన ప్రగతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఏవైనా ఉంటే, వాటి జెరాక్స్ కాపీలపై విద్యార్థి సంతకం చేసి అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తులు సమర్పించేందుకు మార్చి 23 వరకు అవకాశముంది. ఎంపిక జాబితాను 2 విడతల్లో ప్రకటించి అర్హత సాధించిన వారికి సమాచారం అందిస్తారు. యువికా శిక్షణకు ఎంపికైన వారికి శిక్షణకు హాజరయ్యేందుకు రవాణా చార్జీలు, బస, భోజన వసతితో పాటుగా అన్ని సౌకర్యాలను ఇస్రో కల్పిస్తుంది.
కార్యక్రమం షెడ్యూల్ ఇలా..
వచ్చిన దరఖాస్తులను ఏప్రిల్ 7నాటికి వడపోసి ఎంపికైన విద్యార్థుల జాబితాలను ఇస్రో విడుదల చేస్తుంది. మే నెల 18 నుంచి విద్యార్థులను ఆహ్వానిస్తుంది. 19 నుంచి 30వ తేదీ వరకూ యువికా–25 కార్యక్రమం చేపడుతోంది. మే 31న ముగింపు కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తుంది.
ఎంపికైన విద్యార్థులను మే లో 14 రోజులు ఇస్రోకు చెందిన స్పెస్ సెంటర్లకు తీసుకువెళ్తుంది. అక్కడి వింతలు, విశేషాలు, సప్తగహ కూటమి తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తుంది. వారు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసి వారికి విజ్ఞానాన్ని అందిస్తారు.
విద్యార్థులకు మంచి అవకాశం
విద్యార్థులకు ఇస్రో వంటి సంస్థను సందర్శించటం, ఆయా పరిశోధనలపై అవగాహన పెంచుకోవటానికి ఇది మంచి అవకాశం. భావి శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు ఇస్రో చేపడుతోన్న యువికా కార్యక్రమాన్ని అర్హతగల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. సంబంధిత పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులు పిల్లలకు సహకరించాలి. జిల్లా పరిధిలో డీవీఈవోలు, ఎంఈవోలు ఈ విషయంపై వారి పరిధిలో యంత్రాంగాన్ని చైతన్యపర్చాలి. పెద్ద సంఖ్యలో విద్యార్థులతో దరఖాస్తు చేయించాలి. – యువీ సుబ్బారావు, డీఈవో, ఎన్టీఆర్ జిల్లా
అవగాహన కల్పిస్తున్నాం
యువికాలో పాల్గొనేందుకు, దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నాం. గతంలో నిర్వహించిన అనేక సైన్స్ ఎగ్జిబిషన్లు, పోటీ పరీక్షల్లో ఎన్టీఆర్ జిల్లా విద్యార్థులు సత్తాచాటి జాతీయ స్థాయిలో వారి ప్రదర్శనలతో అబ్బురపర్చారు. ఇదేస్ఫూర్తితో పెద్ద సంఖ్యలో అర్హత గత విద్యార్థులను సిద్ధం చేస్తున్నాం. – డాక్టర్ మైనం హుస్సేన్, జిల్లా సైన్స్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment