
కోనసీమ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
ఆలమూరు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండల కేంద్రమైన ఆలమూరు శివారు కండ్రిగ (యానాదుల) పేటకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఒకే రోజు అదృశ్యమయ్యారు. స్కూల్‌కు వెళుతున్నామని చెప్పి నాలుగు రోజులైనా వారు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు శుక్రవారం స్థానిక పోలీసులను అశ్రయించారు. ఇప్పటి వరకూ ఇల్లు, స్కూల్‌కు తప్ప వేరే ప్రదేశం తెలియని ఒకే సామాజిక వర్గానికి చెందిన ఆ విద్యార్థులందరూ కనిపించకపోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది.
స్థానిక ఎస్సై ఎం.అశోక్ కథనం ప్రకారం.. ఆలమూరులోని బొబ్బా జయశ్రీ బాలికోన్నత పాఠశాలలో కొమరిగిరి కరుణ (8వ తరగతి), కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొమరిగిరి పృథ్వీవర్మ (6వ తరగతి), గంధం సతీష్ (8వ తరగతి), మర్రి సంతోష్ (7వ తరగతి), కొమరిగిరి పండు (6వ తరగతి), రామచంద్రపురంలోని ఎయిడెడ్ స్కూల్‌లో కొమరిగిరి మాధురి (7వ తరగతి) చదువుతున్నారు.
ఈ ఆరుగురు విద్యార్థులూ ఈ నెల 24వ తేదీన పాఠశాలలకు యథావిధిగా వెళ్లారు. ఆ తరువాత తిరిగి రాలేదు. అప్పటి నుంచీ పరిసర ప్రాంతాల్లోను, బంధువుల ఇళ్ల వద్ద ఎంత గాలించినా ప్రయోజనం లేకపోవడంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులందరూ మూకుమ్మడిగా పోలీసు స్టేషన్‌కు చేరుకుని పరిస్థితి వివరించారు.
విద్యార్థులందరూ కూడబలుక్కుని వెళ్లిపోయారా లేక వారిలో ఎవరైనా ప్రభావితం చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ప్రచార మాధ్యమాల్లో ఆ విద్యార్థుల ఫొటోలు ప్రదర్శించడంతో పాటు వివిధ పోలీసు స్టేషన్లకు సమాచారం అందించినట్లు ఎస్‌ఐ అశోక్ చెప్పారు.