
ప్రియుడితో కలిసి దారుణం
నిందితుల అరెస్ట్.. 14 రోజుల రిమాండ్
మండపేట: తనను మందలించాడన్న కోపంతో ఓ మహిళ ప్రియుడి సహాయంతో కన్న తండ్రినే కిరాతకంగా హత్య చేసింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాలను గురువారం టౌన్ సీఐ దారం సురేష్ మీడియాకు వెల్లడించారు. 22వ వార్డు మేదరపేట వీధిలో సూరా రాంబాబు అనే వ్యక్తి ఉంటున్నాడు. ఇతని కుమార్తె వస్త్రాల వెంకట దుర్గకు రామచంద్రపురం కొత్తూరుకు చెందిన ముమ్మిడివరపు సురేష్‌తో వివాహేతర సంబంధం ఉంది.
ఈ విషయం తెలిసిన తండ్రి రాంబాబు కుమార్తెను మందలించాడు. దీంతో కోపోద్రిక్తురాలైన దుర్గ కన్న తండ్రిని చంపాలని నిర్ణయించుకుంది. ప్రియుడు సురేష్‌తో కలిసి హత్యకు పథకం వేసింది. ఈ నెల 16న తండ్రి ఒంటరిగా ఉన్న సమయం చూసి ప్రియుడు సురేష్‌కు ఫోన్ చేసి ఇంటికి పిలిచింది. అతను తోడుగా తన స్నేహితుడు తాటికొండ నాగార్జునతో కలిసి వచ్చాడు. ఆ ముగ్గురూ కలిసి మంచంపై నిద్రిస్తున్న రాంబాబు ఛాతిపై కూర్చొని పీక నులిమి.. డొక్కల్లో తన్ని హత్య చేశారు.
మృతుడి సోదరుడు సూరా పండు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తన సోదరుడు అనుమానాస్పదంగా మృతి చెందాడంటూ.. దుర్గపై అనుమానం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి.. విశాఖపట్నం పారిపోతున్న నిందితులు ముగ్గురినీ అరెస్ట్ చేశారు. విచారణలో నేరం అంగీకరించడంతో గురువారం వారిని రామచంద్రపురం కోర్టుకు తరలించగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
Comments
Please login to add a commentAdd a comment