Sunni waqf boards
-
బాబ్రీ మసీదు పరిమాణంలోనే కొత్త మసీదు!
లక్నో: రామజన్మభూమిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయోధ్యలో కొత్తగా నిర్మించబోయే మసీదు, గతంలో ఉన్న బాబ్రీమసీదు కొలతలతోనే ఉంటుందని మసీదు నిర్మాణ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. బాబ్రీ మసీదు స్థానంలో నూతన మసీదు నిర్మాణానికి అయోధ్యలోని ధనిపూర్ గ్రామంలో ఐదు ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలంలో ఒక ఆస్పత్రి, మ్యూజియం కూడా కడతామని, మ్యూజియంకు ప్రముఖ విశ్రాంత అధ్యాపకుడు పుష్పేశ్ పంత్ క్యూరేటర్‌గా ఉంటారని ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్(ఐఐసీఎఫ్) సెక్రటరీ అతార్ హుస్సేన్ చెప్పారు. క్యూరేటర్ బాధ్యతలు నిర్వర్తించేందుకు ఆయన అంగీకరించారన్నారు. (చదవండి: సెప్టెంబర్ 17 నుంచి మందిర నిర్మాణం) ఇక ఐదెకరాల్లో జరిగే నూతన మసీదు నిర్మాణాన్ని ఐఐసీఎఫ్ పర్యవేక్షించనుంది. ఉత్తర్‌ప్రదేశ్ సున్ని సెంట్రల్ వక్ఫ్‌బోర్డ్ ఈ ట్రస్ట్‌ను ఏర్పరించింది. ఐదెకరాల్లో దాదాపు 15వేల చదరపు అడుగుల్లో మసీదు నిర్మాణం జరుగుతుందని, ఇది బాబ్రీ మసీదు ఉన్న సైజులోనే ఉంటుందని, మిగిలిన స్థలంలో ఆస్పత్రి, మ్యూజియం తదితరాలుంటాయని హుస్సేన్ చెప్పారు. ఈ ప్రాజెక్టుకు జామియా మిలియా ఇస్లామియాకు చెందిన అక్తర్ వాస్తుశిల్పిగా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ మొత్తం నిర్మాణం భారతీయ ఆత్మను, ఇస్లాం సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంటుందని అక్తర్ చెప్పారు. -
అయోధ్యలో బాబ్రీ ఆస్పత్రి: నిజమెంత?
న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్లుగా వివాదాల్లో నానుతూ వచ్చిన అయోధ్య వివాదాస్పద స్థలం(2.77 ఎకరాలు) రాముడిదేనని సుప్రీం కోర్టు గతేడాది సంచలన తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. అయితే అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి గానూ ముస్లింలకు (సున్నీ వక్ఫ్ బోర్డుకు) ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం కూడా సున్నీ వక్ఫ్ బోర్డుకు భూమి కేటాయించింది. దీంతో రామ మందిర నిర్మాణానికి ఏర్పాట్లు వేగవంతమవుతున్నాయి. అందులో భాగంగా ఆగస్టు 5న అయోధ్యలో భూమి పూజ కూడా జరిగింది. ఈ క్రమంలో అయోధ్యలో సున్నీ వక్ఫ్ బోర్డు తమకు కేటాయించిన భూమిలో బాబ్రీ ఆస్పత్రి కడుతోందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. (ఆ భూమి తీసుకుంటాం: సున్నీ వక్ఫ్‌బోర్డు) ఎయిమ్స్ తరహాలో నిర్మించనున్న ఈ ఆసుపత్రికి ప్రముఖ వైద్యుడు డా. కఫీల్ ఖాన్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారన్నది సదరు పోస్టుల సారాంశం. ఆ ఆసుపత్రి ఎలా ఉండబోతుందో తెలిపేందుకు నమూనా ఫొటోలను కూడా జత చేశారు. ఇదంతా నిజమేనని భ్రమ పడిన ముస్లిం వ్యక్తులు ఈ సందేశం అందరికీ చేరాలని విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఈ వైరల్ వార్తపై స్పందించిన సున్నీ వక్ఫ్ బోర్డు ఇది పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పింది. తమకు కేటాయించిన 5 ఎకరాల్లో ఏం నిర్మించాలనే విషయంపై ఇంకా నిర్ధారణకు రాలేమని స్పష్టం చేసింది. (రామ మందిరానికి షారుక్ రూ.5 కోట్ల విరాళం?) నిజం: అయోధ్యలో సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించిన ఐదు ఎకరాల్లో బాబ్రీ ఆస్పత్రి కట్టడం లేదు. -
ఆ భూమి తీసుకుంటాం: సున్నీ వక్ఫ్‌బోర్డు
లక్నో: అయోధ్య జిల్లాలో మసీదు నిర్మాణం కోసం తమకు కేటాయించిన ఐదెకరాల స్థలాన్ని తీసుకోవడానికి అంగీకరిస్తున్నట్లు సున్నీ సెంట్రల్ వక్ఫ్‌బోర్డు సోమవారం పేర్కొంది. ఈ స్థలంలో మసీదు నిర్మాణంతో పాటుగా.. ఇండో- ఇస్లామిక్ పరిశోధన సంస్థ, ఆస్పత్రి, గ్రంథాలయం నిర్మిస్తామని తెలిపింది. ఈ మేరకు త్వరలోనే మసీదు నిర్మాణానికై ట్రస్టు ఏర్పాటు చేస్తామని పేర్కొంది. అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు గతేడాది నవంబరులో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వివాదానికి కారణమైన 2.77 ఎకరాల భూమి రాంలల్లాకు చెందుతుందని పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం.. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికై సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని ఆదేశించింది. ఈ క్రమంలో అయోధ్య నుంచి 18 కి.మీల దూరంలో లక్నో హైవే సమీపంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు స్థలం కేటాయించింది. ఈ క్రమంలో ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలాన్ని తాము స్వీకరిస్తున్నామని సున్నీవక్ఫ్ బోర్డు చైర్మన్ జుఫర్ ఫరూఖీ సోమవారం తెలిపారు. బోర్డు సభ్యులతో చర్చించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘‘త్వరలోనే ట్రస్టు ఏర్పాటు చేస్తాం. మసీదుకు ఏ పేరు పెట్టాలన్న విషయాన్ని ట్రస్టు నిర్ణయిస్తుంది. బోర్డుతో ఆ విషయాలకు ఎటువంటి సంబంధం ఉండబోదు. మసీదుతో పాటు లైబ్రరీ, పరిశోధన సంస్థ, ఆస్పత్రి.. నిర్మించడంతో పాటుగా.. భూమిని అన్నిరకాలుగా వినియోగించుకుంటాం. స్థానికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మసీదు ఎంత విస్తీర్ణంలో నిర్మించాలో నిర్ణయిస్తారు’’అని పేర్కొన్నారు. కాగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ట్రస్టును ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయోధ్యలోని వివాదాస్పద స్థలం సహా మొత్తం 67.703 ఎకరాలను ఈ ట్రస్ట్‌కు బదిలీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.(రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్) -
రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మరో ముందడుగు పడింది. మందిర నిర్మాణ పర్యవేక్షణకు ఒక స్వతంత్ర సంస్థ(ట్రస్ట్) ఏర్పాటైంది. అత్యద్భుతంగా మందిర నిర్మాణం జరిపేందుకు ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ పేరుతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రకటించారు. మందిర నిర్మాణానికి ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని ‘అయోధ్య’ తీర్పులో సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. 3 నెలల్లోగా ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించగా, ఆ గడువు ఫిబ్రవరి 9తో ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం.. బుధవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రధాని ఈ ప్రకటన చేశారు. ‘ఒక ముఖ్యమైన, చరిత్రాత్మక అంశంపై మీతో ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నా. ఇది లక్షలాది ప్రజలలాగే నా హృదయానికి కూడా చాలా దగ్గరైన విషయం. దీనిపై ప్రకటన చేసే అవకాశం లభించడం నా అదృష్టం’ అంటూ ట్రస్ట్ ఏర్పాటుపై ప్రధాని ప్రకటన చేశారు. అయోధ్యలో రామ మందిర అభివృద్ధి కోసం ఒక విస్తృత పథకాన్ని సిద్ధం చేశామన్నారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలం సహా మొత్తం 67.703 ఎకరాలను ఈ ట్రస్ట్‌కు బదిలీ చేస్తామన్నారు. శ్రీరాముడి జన్మస్థలంలో అద్భుతమైన రామాలయ నిర్మాణానికి భారతీయులంతా సహకరించాలని మోదీ కోరారు. ప్రధాని ప్రకటన సందర్భంగా అధికార పక్ష సభ్యులు జై శ్రీరాం నినాదాలతో సభను హోరెత్తించారు. అయోధ్య తీర్పు అనంతరం దేశ ప్రజలంతా ప్రజాస్వామ్య విధివిధానాలపై గొప్ప విశ్వాసాన్ని చూపారని, అందుకు 130 కోట్ల భారతీయులకు సెల్యూట్ చేస్తున్నానని మోదీ తెలిపారు. భారత్‌లో అన్ని మతాల వారు ఒక ఉమ్మడి కుటుంబంలా కలిసి ఉంటారన్నారు. మన సంస్కృతిలోనే ఆ వసుధైక కుటుంబ భావన ఉందన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ మార్గంలో తన ప్రభుత్వం పయనిస్తోందన్నారు. ఒక దళితుడు సహా 15 మంది ట్రస్టీలు రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటైన ట్రస్ట్‌లో 15 మంది సభ్యులుంటారని, వారిలో ఒకరు దళిత వర్గానికి చెందినవారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ ట్రస్ట్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ‘లక్షలాది భక్తుల కోరిక త్వరలో నెరవేరుతుందని ఆశిస్తున్నా. రాముడు జన్మించిన పుణ్యక్షేత్రంలో భక్తులు పూజలు చేసుకునే అవకాశం త్వరలోనే లభించనుంది’ అన్నారు. అయితే, ట్రస్టీల పేర్లను ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు. ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. కాగా, రామ మందిర నిర్మాణం గతంలో ‘రామజన్మభూమి న్యాస్’ ప్రతిపాదించిన నమూనాలో ఉంటుందని ఆశిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు విష్ణు సదాశివ్ పేర్కొన్నారు. సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు ఐదెకరాలు మసీదు నిర్మాణం కోసం అయోధ్య జిల్లాలో సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు ఐదెకరాల స్థలాన్ని కేటాయిస్తూ యూపీ సర్కార్ నిర్ణయించింది. సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు మసీదు నిర్మాణం కోసం ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని అయోధ్య తీర్పులో సుప్రీంకోర్టు ఆదేశించడం తెల్సిందే. అయోధ్య నుంచి 18 కి.మీల దూరంలో లక్నో హైవేపై ఈ స్థలాన్ని కేటాయించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. కాగా, రామాలయ నిర్మాణం కోసం ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడానికి తన అనుమతి అవసరం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. -
'రివ్యూ పిటిషన్‌పై నేడు నిర్ణయం తీసుకుంటాం'
లక్నో: అయోధ్య రామాలయం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసే విషయంలో నేడు నిర్ణయం తీసుకోనున్నట్టు సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు లాయర్ జఫర్యాబ్ జిలానీ తెలిపారు. ఇందుకోసం ఆదివారం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు, బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ, మత పెద్దలు, అయోధ్య కేసులో ముస్లిం పక్షాలతో లక్నోలోని నద్వా కళాశాలలో సమావేశం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. జిలానీ ఇంకా మాట్లాడుతూ.. ‘మాకు ఐదెకరాలు ఇవ్వాలని సుప్రీ ఇచ్చిన తీర్పుపై మాకు అసంతృప్తి ఉంది. నా వ్యక్తిగత అభిప్రాయమైతే ఐదెకరాలు కాదు. 500 ఎకరాలు ఇచ్చినా సమ్మతం కాదు. మాకు మసీదే కావాలని వ్యాఖ్యానించిన ఎమ్ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీతో నేను ఏకీభవిస్తా’నని వెల్లడించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ జుఫర్ ఫారూఖీ సుప్రీం తీర్పును స్వాగతించారు కదా అని ప్రశ్నించగా, ఆయన చెప్పేదే ఫైనల్ కాదు. అతనిని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించామని తెలిపారు. ఇదిలా ఉండగా, అయోధ్య కేసులో తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఆదివారం పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. -
అయోధ్య ప్రశాంతం
లక్నో/అయోధ్య/న్యూఢిల్లీ: శతాబ్దాల నాటి మందిరం–మసీదు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పు అనంతరం దేశవ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ హిందూ ముస్లిం నేతలతో సమావేశమై తీర్పు అనంతర పరిస్థితులపై చర్చించారు. కీలక తీర్పు వెలువరించిన ధర్మాసనంలోని జడ్జీల భద్రత కోసం అధికారులు ముందుజాగ్రత్తగా మరిన్ని చర్యలు తీసుకున్నారు. కాగా, కోర్టు తీర్పు ప్రకారం మసీదు కోసం ఐదెకరాల భూమిపై చర్చించేందుకు ఈ నెల 26న సున్నీ వక్ఫ్‌బోర్డు సమావేశం కానుంది. ఆలయ పట్టణం అయోధ్యలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పోలీసు బలగాల గస్తీ, తనిఖీలు కొనసాగుతున్నా పట్టణంలోని ప్రధాన ఆలయాల్లో ఆదివారం భక్తుల సందడి తిరిగి మొదలయింది. తీర్పు సందర్భంగా శనివారం నాటి ఉత్కంఠ, ఉద్రిక్త పరిస్థితులకు బదులుగా ఉత్సాహ పూరిత వాతావరణం కనిపించింది. హనుమాన్ గర్హి, నయాఘాట్ల వద్ద జరిగే శ్రీరామ, హనుమాన్ పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సుప్రీం తీర్పు, తదనంతర పరిణామాలు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు రికాబ్‌గంజ్ తదితర ప్రాంతాల ప్రజలు వార్తా పత్రికలు చదివేందుకు ఆసక్తి చూపారు. ‘మాకిది చాలా అరుదైన, కొత్త శుభోదయం, ప్రత్యేకమైన ఆదివారం. అయోధ్య వివాదం శాశ్వతంగా పరిష్కారం కావడం ఎంతో ఊరట కలిగించింది’ అని అయోధ్యలోని ఓ హోటల్ మేనేజర్ సందీప్ సింగ్ అన్నారు. ‘రామ్‌లల్లాకు అనుకూలంగా తీర్పు రావడంతో పూలు, పూలదండలకు బాగా డిమాండ్ పెరుగుతుందని వారణాసి తదితర నగరాల నుంచి అదనంగా తెప్పిస్తున్నాం’ అని పూల దుకాణం యజమాని అనూప్ తెలిపారు. శనివారం హోం మంత్రి బిజీబిజీ తీర్పు వెలువడిన శనివారం హోం మంత్రి అమిత్ షా మిగతా కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకున్నారు. తీర్పు అనంతర పరిస్థితులపై వివిధ రాష్ట్రాల సీఎంలు, సీనియర్ పోలీసులు, నిఘా విభాగాల అధికారులతో ఆయన రోజంతా మాట్లాడారని అధికార వర్గాలు తెలిపాయి. తాజా పరిస్థితులపై చర్చించేందుకు జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ ధోవల్ ప్రముఖ హిందు, ముస్లిం నేతలతో సమావేశమయ్యారు. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మత పెద్దలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. యూపీలో 77 మంది అరెస్ట్ ఉత్తరప్రదేశ్‌లో సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టి మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన 77 మందిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై 34 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా సామాజిక మాధ్యమాల్లోని 8,275 పోస్టింగ్‌లపై చర్యలు తీసుకోగా, అందులో 4,563 పోస్టులు ఆదివారం పోస్టు చేసినవిగా తెలిపారు. మధ్యప్రదేశ్‌లోనూ అభ్యంతరకర పోస్ట్‌లు పెట్టిన 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 26న సున్నీ వక్ఫ్ బోర్డు భేటీ మసీదు నిర్మాణానికి ఐదెకరాల భూమిని కేటాయించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై చర్చించేందుకు సున్నీ సెంట్రల్ వక్ఫ్‌బోర్డు ఈనెల 26వ తేదీన సమావేశం కానుంది. ఆ ఐదెకరాల భూమిని తీసుకోవాలా వద్దా అనే విషయమై ఆ సమావేశంలో నిర్ణయిస్తామని యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ జఫర్ ఫరూఖీ తెలిపారు. ‘కోర్టు తీర్పును సవాల్ చేసే ఉద్దేశం మాకు లేదు. అయితే, మసీదు కోసం ఆ స్థలాన్ని తీసుకోరాదని కొందరు.. ఆ స్థలంలో విద్యా సంస్థను ఏర్పాటు చేసి, పక్కనే మసీదు నిర్మిస్తే బాగుంటుందని మరికొందరు అంటున్నారు. దీనిపై వివరంగా చర్చిస్తాం’అని ఫరూఖీ వెల్లడించారు. జడ్జీలకు భద్రత పెంపు అయోధ్య కేసు తీర్పును ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో ఐదుగురు జడ్జీలకు భద్రతను ప్రభుత్వం మరింత పెంచింది. ‘ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, కాబోయే సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌ల నివాసాల వద్ద అదనపు బలగాలను మోహరించాం. వీరి నివాసాలకు దారితీసే రోడ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశాం. ఈ జడ్జీల వాహనాల వెంట సాయుధ బలగాలతో ఎస్కార్ట్ వాహనం ఉంటుంది’అని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. 7 భాషలు, 533 డాక్యుమెంట్లు ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అయోధ్య భూవివాదానికి సంబంధించిన తీర్పు కోసం సుప్రీంకోర్టు భారీ కసరత్తే చేసింది. సంస్కృతం, హిందీ, ఉర్దూ, పర్షియన్, టర్కిష్, ఫ్రెంచ్, ఇంగ్లిష్ భాషల్లోని చరిత్ర, సంస్కృతి, పురావస్తు, మత పుస్తకాలను తిరగేసింది. ఇవేకాక మత సంబంధిత కావ్యాలు, యాత్రా వర్ణనలు, పురావస్తు నివేదికలు, బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందరి చిత్రాలు, గెజిటీర్లు, స్థూపాలపై గల శాసనాల అనువాదాలు, ఇలా 533 డాక్యుమెంట్లను పరిశీలించింది. -
సున్నీ వక్ఫ్ బోర్డు కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని సున్నీ వక్ఫ్ బోర్డు ప్రకటించింది. కీలకమైన తీర్పు వెలువడిన అనంతరం రివ్యూ పిటిషన్ వేయాలని భావించినా.. తీర్పు సమీక్షించిన తరువాత తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిపింది. దీంతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయట్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సున్నీ వక్ఫ్ బోర్డు ప్రతినిధులు ఓ ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో తాము సంతృప్తి చెందలేదని.. ఈ తీర్పుపై చర్చించిన తర్వాతే తదుపరి కార్యాచరణకు సిద్ధవుతామని సున్నీ వక్ఫ్ బోర్డు న్యాయవాది జఫర్యాబ్ జిలానీ తొలుత వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తీర్పు కాపీ పూర్తిగా చదివిన తర్వాతే రివ్యూ పిటిషన్ వేయాలో లేదో నిర్ణయించుకుంటామని అన్నారు. ఏఎస్ఐ నివేదికలో ముస్లింలకు అనుకూలంగా ఉన్న అంశాలను కోర్టు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కమిటీతో చర్చించిన తర్వాతే వారి నిర్ణయం మేరకు రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని బోర్డు వెల్లడించింది. అయితే తీర్పుపై దాదాపు రెండు గంటల పాటు చర్చించిన కమిటీ సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. కాగా దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన రామజన్మభూమి కేసులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం శనివారం కీలక తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. వివాదాస్పద స్ధలం తమదేనంటూ షియా బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు... నిర్మోహి అఖాడా పిటిషన్‌ను సైతం తోసిపుచ్చింది. అదే విధంగా అయోధ్య చట్టం కింద మందిర నిర్మాణానికి మూడు నెలల్లోగా ట్రస్ట్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేయడంతో పాటుగా. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ముస్లింలకు (సున్నీ వక్ఫ్ బోర్డుకు) ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వివాదాస్పద స్థలాన్ని (2.77 ఎకరాలు) రామజన్మ న్యాస్‌కే అప్పగించాలని తీర్పు వెలువరించింది. చదవండి: అయోధ్య తీర్పు: సున్నీ వక్ఫ్‌బోర్డు స్పందన -
భవిష్యత్ తరాలపై ప్రభావం
న్యూఢిల్లీ: సున్నితమైన అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు భవిష్యత్ తరాలపై ప్రభావం చూపుతుందని సున్నీ వక్ఫ్ బోర్డు సహా ముస్లింల తరఫు కక్షిదారులు పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు తీర్పులో తామేం కోరుకుంటున్నారో సంక్షిప్తంగా, లిఖిత పూర్వకంగా సీజేఐ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్‌కు వారు సోమవారం సమర్పించారు. ‘ఆ కాపీ సీల్డ్ కవర్లో నాముందుంది. కానీ అందులోని అంశాలు ఈరోజు పత్రికలో పతాక శీర్షికలో వచ్చాయి’ జస్టిస్ గొగోయ్ అన్నారు. ‘ఈ కోర్టు ఇచ్చే తీర్పు ఏదైనా.. దాని ప్రభావం భవిష్యత్ తరాలపై ఉంటుంది. తీర్పు పరిణామాలు దేశ రాజకీయాలపై కనిపిస్తాయి. 1950 జనవరి 26న దేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించినప్పుడు ఆమోదించిన రాజ్యాంగవిలువలపై విశ్వాసం ఉన్న ప్రజల ఆలోచనలపై ఈ కోర్టు నిర్ణయం ప్రబల ప్రభావం చూపుతుంది’ అని ఆ కాపీలో పేర్కొన్నారు. ఆ కాపీని ముస్లింల తరఫు వాదించిన సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ రూపొందించారు. ‘సమాజంపై ఈ తీర్పు చూపే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని, ఈ చరిత్రాత్మక తీర్పు వల్ల తలెత్తే పరిణామాలను అంచనా వేసి, దేశం నమ్ముతున్న రాజ్యాంగ విలువలను ప్రతిబింబించేలా తీర్పు ప్రకటించాల్సిందిగా కోరుతున్నాం’ అని అందులో అభ్యర్థించారు. తీర్పులో తామేం కోరుకుంటున్నారో సంక్షిప్తంగా పేర్కొంటూ హిందూ వర్గాలు శనివారమే తమ కాపీలను సుప్రీంకోర్టుకు అందించాయి. వివాదాస్పద స్థలంలో హిందువులు పూజలు చేస్తున్నారని రామ్ లల్లా తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ తాను రూపొందించిన కాపీలో పేర్కొన్నారు. -
షాజహాన్ సంతకం పెట్టి రాసిచ్చారా మీకేమైనా?
-
తాజ్‌మహల్ మాదే: షాజహాన్ విల్లు ఉందా ?
న్యూఢిల్లీ: మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్ తమకే చెందుతుందని ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు షాజహాన్ అప్పట్లో వక్ఫ్‌నామాను తమకు అనుకూలంగా జారీచేశారని తెలిపింది. వాదనలు విన్న కోర్టు షాజహాన్ సంతకంతో జారీచేసిన పత్రాలను వారం రోజుల్లో సమర్పించాలని ఆదేశించింది. తాజ్ హక్కులపై యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు, భారత పురావస్తు శాఖల మధ్య కేసు నడుస్తోంది. తాజ్ తమ పేరిట రిజిస్టర్ చేయాలని వక్ఫ్ బోర్డు ఉత్తర్వులు జారీచేయగా దాన్ని సవాలుచేస్తూ భారత పురావస్తు శాఖ 2010లో సుప్రీంలో కేసు వేసింది. విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ మిశ్రా స్పందిస్తూ.. 1658లో గృహనిర్బంధంలో ఉన్న షాజహాన్ తాజ్ హక్కుల్ని ఎలా రాసిచ్చారని వక్ఫ్ లాయర్‌ను ప్రశ్నించారు. -
బాబ్రీ మసీదుపై సున్నీ వక్ఫ్ బోర్డు కొత్త ట్విస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో సున్నీ వక్ఫ్ బోర్డు కొత్త ట్విస్ట్ ఇచ్చింది. బాబ్రీ మసీదు విచారణను వాయిదావేయాలన్న ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్‌తో సున్నీ వక్ఫ్ బోర్డు తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పటికే సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ వివాదానికి సత్వరమే ముగింపు పలకాలని సున్నీ వక్ప్ బోర్డు సభ్యుడు హాజీ మెహబూబ్ కోరారు. ఎన్నికల కారణంగా విచారణను 2018 ఫిబ్రవరికి వాయిదా వేయించడంపైనా ఆయన అసహనం వ్యక్తం చేశారు. మందిర్ - మసీదు కేసులో కపిల్ సిబల్ కాంగ్రెస్ నాయకుడిగానే సుప్రీంకోర్టులో వాదించారని, ఆయనతో వక్ఫ్ బోర్డుకు ఎటువంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. మంగళవారం రామజన్మ భూమి-మసీదుపై సుప్రీంలో విచారణ జరగాల్సి ఉండగా.. సున్నితమైన అంశం అంటూ ఫిబ్రవరి వరకూ వాయిదా వేయాలని సిబల్ సుప్రీంలో వాదించారు. అంతేకాక 2019 లోక్‌సభ ఎన్నికల వరకూ ఈ విచారణ వాయిదా వేయాలని ఆయన సుప్రీంను కోరారు. అయోధ్య వివాదం పూర్తిగా రాజకీయం అయిందని.. ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా.. రాజకీయాలను పూర్తిగా ప్రభావితం చేస్తుందని కోర్టుకు సిబల్ తెలిపారు. బీజేపీ 2014 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని చేర్చిందని ఆయన కోర్టుకు తెలిపారు. -
‘అయోధ్యపై మీకు హక్కు లేదు’
సాక్షి, లక్నో: అయోధ్య వివాదం సున్నీ, షియా వర్గాల మధ్య మంటలు రేపుతోంది. బాబ్రీ మసీదు విషయంలో సున్నీ వక్ప్ బోర్డుకు ఎటువంటి హక్కులు లేవని షియా వక్ఫ్ బోర్డు ప్రకటించింది. బాబ్రీ మసీదు, వివాదాస్పద స్థలం గురించి తమ వద్ద తగిన డాక్యుమెంట్లు ఉన్నాయని షియా వక్ప్‌బోర్డు ఛైర్మన్ వాసిమ్ రిజ్వీ ప్రకటించారు. ఈ డాక్యుమెంట్లను ఇప్పటికే సుప్రీం కోర్టు ముందుంచినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సున్నీ వక్ఫ్ బోర్డు మధుర, కాశీలోని మందిర్-మసీదు వివాదాలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. అదే సమయంలో అయోధ్య వివాదంలో సున్నీ వక్ఫ్ బోర్డు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని వాసిమ్ రిజ్వీ స్పష్టం చేశారు. వివాదాస్పద స్థలంపై కోర్టు షియా వక్ఫ్ బోర్డుకు అనులకూంగా తీర్పునిస్తే.. అందులో హిందువుల మనోభావాలకు అనుగుణంగా ఆలయం నిర్మించుకునేందుకు ఇచ్చేస్తామని ఆయన చెప్పారు. అదే సమయంలో లక్నోలో మరో మసీదు నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. -
సీఎం యోగి మరో సంచలన నిర్ణయం
యూపీలో సున్నీ, షియా వక్ఫ్ బోర్డులు రద్దు లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సున్నీ, షియా వక్ఫ్ బోర్డులను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. వక్ఫ్ బోర్డుల ఆస్తుల విషయంలో తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతోనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ వక్ఫ్ మంత్రి మొహసీన్ రజా మీడియాకు తెలిపారు. బోర్డుల రద్దుకు ముందు అన్ని న్యాయపరమైన అంశాలను పరిశీలించినట్లు వెల్లడించారు. వక్ఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూసీఐ) జరిపిన విచారణలో కూడా ఈ రెండు బోర్డుల్లో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నట్లు తేలిందని రజా పేర్కొన్నారు. ఈ అవినీతిలో సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, యూపీ మాజీ మంత్రి అజాం ఖాన్‌తో పాటు షియా బోర్డు చైర్మన్ వసీమ్ రజ్వీల పాత్ర ఉన్నట్లు డబ్ల్యూసీఐ నిర్ధారించిందని వెల్లడించారు. మౌలానా జొహర్ అలీ ఎడ్యుకేషన్ పేరిట ట్రస్ట్‌ను ఏర్పాటు చేసిన అజాం ఖాన్.. వక్ఫ్ ఆస్తుల్ని దానికి మళ్లించారని రజా ఆరోపించారు. ఈ రెండు సంస్థల్లో చోటు చేసుకున్న కోట్లాది రూపాయల అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు లేఖ రాసినట్టు వెల్లడించారు. వక్ఫ్ బోర్డులను రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని మంత్రిని ప్రశ్నించగా... 1995 వక్ఫ్ బోర్డు చట్టం ఈ హక్కు కల్పిస్తోందని సమాధానమిచ్చారు. చట్టబద్ధంగానే తాము వ్యవహరించామని చెప్పారు. వక్ఫ్ బోర్డుల రద్దు ప్రక్రియ పూర్తైన తర్వాత శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. వక్ఫ్ బోర్డులకు కొత్త పాలక మండలిని లేదా అధికారిని నియమిస్తామని తెలిపారు.