అయోధ్యలో సరయూ నదీ తీరంలో ఆలయాలు
లక్నో/అయోధ్య/న్యూఢిల్లీ: శతాబ్దాల నాటి మందిరం–మసీదు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పు అనంతరం దేశవ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ హిందూ ముస్లిం నేతలతో సమావేశమై తీర్పు అనంతర పరిస్థితులపై చర్చించారు. కీలక తీర్పు వెలువరించిన ధర్మాసనంలోని జడ్జీల భద్రత కోసం అధికారులు ముందుజాగ్రత్తగా మరిన్ని చర్యలు తీసుకున్నారు. కాగా, కోర్టు తీర్పు ప్రకారం మసీదు కోసం ఐదెకరాల భూమిపై చర్చించేందుకు ఈ నెల 26న సున్నీ వక్ఫ్‌బోర్డు సమావేశం కానుంది.
ఆలయ పట్టణం అయోధ్యలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పోలీసు బలగాల గస్తీ, తనిఖీలు కొనసాగుతున్నా పట్టణంలోని ప్రధాన ఆలయాల్లో ఆదివారం భక్తుల సందడి తిరిగి మొదలయింది. తీర్పు సందర్భంగా శనివారం నాటి ఉత్కంఠ, ఉద్రిక్త పరిస్థితులకు బదులుగా ఉత్సాహ పూరిత వాతావరణం కనిపించింది. హనుమాన్ గర్హి, నయాఘాట్‌ల వద్ద జరిగే శ్రీరామ, హనుమాన్ పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సుప్రీం తీర్పు, తదనంతర పరిణామాలు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు రికాబ్‌గంజ్ తదితర ప్రాంతాల ప్రజలు వార్తా పత్రికలు చదివేందుకు ఆసక్తి చూపారు.
‘మాకిది చాలా అరుదైన, కొత్త శుభోదయం, ప్రత్యేకమైన ఆదివారం. అయోధ్య వివాదం శాశ్వతంగా పరిష్కారం కావడం ఎంతో ఊరట కలిగించింది’ అని అయోధ్యలోని ఓ హోటల్ మేనేజర్ సందీప్ సింగ్ అన్నారు. ‘రామ్‌లల్లాకు అనుకూలంగా తీర్పు రావడంతో పూలు, పూలదండలకు బాగా డిమాండ్ పెరుగుతుందని వారణాసి తదితర నగరాల నుంచి అదనంగా తెప్పిస్తున్నాం’ అని పూల దుకాణం యజమాని అనూప్ తెలిపారు.
శనివారం హోం మంత్రి బిజీబిజీ
తీర్పు వెలువడిన శనివారం హోం మంత్రి అమిత్ షా మిగతా కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకున్నారు. తీర్పు అనంతర పరిస్థితులపై వివిధ రాష్ట్రాల సీఎంలు, సీనియర్ పోలీసులు, నిఘా విభాగాల అధికారులతో ఆయన రోజంతా మాట్లాడారని అధికార వర్గాలు తెలిపాయి. తాజా పరిస్థితులపై చర్చించేందుకు జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ ధోవల్ ప్రముఖ హిందు, ముస్లిం నేతలతో సమావేశమయ్యారు. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మత పెద్దలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
యూపీలో 77 మంది అరెస్ట్
ఉత్తరప్రదేశ్‌లో సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టి మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన 77 మందిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై 34 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా సామాజిక మాధ్యమాల్లోని 8,275 పోస్టింగ్‌లపై చర్యలు తీసుకోగా, అందులో 4,563 పోస్టులు ఆదివారం పోస్టు చేసినవిగా తెలిపారు. మధ్యప్రదేశ్‌లోనూ అభ్యంతరకర పోస్ట్‌లు పెట్టిన 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
26న సున్నీ వక్ఫ్ బోర్డు భేటీ
మసీదు నిర్మాణానికి ఐదెకరాల భూమిని కేటాయించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై చర్చించేందుకు సున్నీ సెంట్రల్ వక్ఫ్‌బోర్డు ఈనెల 26వ తేదీన సమావేశం కానుంది. ఆ ఐదెకరాల భూమిని తీసుకోవాలా వద్దా అనే విషయమై ఆ సమావేశంలో నిర్ణయిస్తామని యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ జఫర్ ఫరూఖీ తెలిపారు. ‘కోర్టు తీర్పును సవాల్ చేసే ఉద్దేశం మాకు లేదు. అయితే, మసీదు కోసం ఆ స్థలాన్ని తీసుకోరాదని కొందరు.. ఆ స్థలంలో విద్యా సంస్థను ఏర్పాటు చేసి, పక్కనే మసీదు నిర్మిస్తే బాగుంటుందని మరికొందరు అంటున్నారు. దీనిపై వివరంగా చర్చిస్తాం’అని ఫరూఖీ వెల్లడించారు.
జడ్జీలకు భద్రత పెంపు
అయోధ్య కేసు తీర్పును ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో ఐదుగురు జడ్జీలకు భద్రతను ప్రభుత్వం మరింత పెంచింది. ‘ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, కాబోయే సీజేఐ జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌ల నివాసాల వద్ద అదనపు బలగాలను మోహరించాం. వీరి నివాసాలకు దారితీసే రోడ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశాం. ఈ జడ్జీల వాహనాల వెంట సాయుధ బలగాలతో ఎస్కార్ట్ వాహనం ఉంటుంది’అని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
7 భాషలు, 533 డాక్యుమెంట్లు
ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అయోధ్య భూవివాదానికి సంబంధించిన తీర్పు కోసం సుప్రీంకోర్టు భారీ కసరత్తే చేసింది. సంస్కృతం, హిందీ, ఉర్దూ, పర్షియన్, టర్కిష్, ఫ్రెంచ్, ఇంగ్లిష్ భాషల్లోని చరిత్ర, సంస్కృతి, పురావస్తు, మత పుస్తకాలను తిరగేసింది. ఇవేకాక మత సంబంధిత కావ్యాలు, యాత్రా వర్ణనలు, పురావస్తు నివేదికలు, బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందరి చిత్రాలు, గెజిటీర్లు, స్థూపాలపై గల శాసనాల అనువాదాలు, ఇలా 533 డాక్యుమెంట్లను పరిశీలించింది.
Comments
Please login to add a commentAdd a comment