న్యూఢిల్లీ: రాజకీయంగా సున్నితమైన అయోధ్యలోని రామజన్మభూమి–బాబ్రీ మసీదు భూ వివాదానికి మధ్యవర్తిత్వం పరిష్కారం చూపనందున ఇక ఈ కేసును తామే ప్రతి రోజూ విచారిస్తామని సుప్రీంకోర్టు శుక్రవారం వెల్లడించింది. ఆగస్టు 6 నుంచి ప్రారంభించి విచారణను రోజూ బహిరంగంగా చేపడతామంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్‌ఎంఐ ఖలీఫుల్లా నేతృత్వంలోని త్రిసభ్య మధ్యవర్తిత్వ కమిటీ దాదాపు నాలుగు నెలలపాటు అయోధ్య కేసులో మధ్యవర్తిత్వానికి ప్రయత్నించినా ఫలితం రాలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదికను తాము చదివామనీ, సమస్యకు ఈ కమిటీ తుది పరిష్కారం చూపలేకపోయిందని పేర్కొంది.
కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ఇక తామే ఈ కేసును విచారించాలని నిర్ణయించినట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తెలిపింది. జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్‌లు ఈ ధర్మాసనంలో ఇతర సభ్యులుగా ఉన్నారు. జూలై 31 నాటి వరకు మధ్యవర్తిత్వంలో ఎంత పురోగతి వచ్చిందో తెలిపే నివేదికను ఆగస్టు 1న తమకు సమర్పించాల్సిందిగా త్రిసభ్య మధ్యవర్తిత్వ కమిటీని కోర్టు జూలై 18నే ఆదేశించింది. కాగా, అయోధ్య కేసుపై ప్రతి రోజూ విచారణ జరుపుతామంటూ సుప్రీంకోర్టు చెప్పడాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) స్వాగతించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి న్యాయపరమైన చిక్కులు త్వరలోనే తొలగిపోతాయని తాము ఆశిస్తున్నామని ట్విట్టర్‌లో తెలిపింది.
మధ్యవర్తిత్వంతో లాభం లేదు
త్రిసభ్య కమిటీ నివేదికను పరిశీలించిన అనంతరం, మధ్యవర్తిత్వంతో లాభం లేదనీ, కేసును తామే విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ఎఫ్‌ఎంఐ ఖలీఫుల్లా ఈ త్రిసభ్య కమిటీకి నేతృత్వం వహిస్తుండగా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌తోపాటు సీనియర్ న్యాయవాది, మధ్యవర్తిత్వంలో పేరొందిన శ్రీరామ్ పంచు సభ్యులుగా ఉండటం తెలిసిందే. క్లిష్టమైన అయోధ్య సమస్యకు హిందూ, ముస్లిం వర్గాలకు అమోదయోగ్యమైన పరిష్కారం లభించడం లేదని త్రిసభ్య కమిటీ తన నివేదికలో పేర్కొంది.
అయోధ్య కేసులో మధ్యవర్తిత్వానికి కోర్టు మార్చి 8న అనుమతినిచ్చింది. చర్చలను రహస్యంగా జరపాలనీ, 8 వారాల్లోగా పూర్తి చేయాలని అప్పట్లో గడువు విధించింది. అయితే సామరస్యక పరిష్కారం కనుగొనే దిశగా చర్చలు ఆశాజనకంగా సాగుతున్నాయనీ, మరికొంత సమయం కావాలని కమిటీ కోరడంతో, ఆగస్టు 15 వరకు కోర్టు గడువిచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో కమిటీ ఈ చర్చలు జరిపింది. 16వ శతాబ్దంలో మీర్ బఖీ నిర్మించిన బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6న కొందరు కూల్చేయడం తెలిసిందే.
20 రోజుల సమయం కావాలి...
ఈ కేసులో ముస్లింల తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ శుక్రవారం కోర్టులో వాదిస్తూ పలు సాంకేతికాంశాలను ప్రస్తావించారు. కేసులోని వివిధ అంశాలను సంపూర్ణంగా వాదించాలంటే తనకు ముందుగా కనీసం 20 రోజుల సమయం కావాలని ఆయన కోరారు. కేసులోని వివిధ అంశాలు, అప్పీళ్లను ఎలా విచారించాలో రాజీవ్ కోర్టుకు చెబుతుండగా, న్యాయమూర్తులు కలగజేసుకుంటూ ‘మేము ఏం చేయాలో మీరు మాకు గుర్తుచేయాల్సిన అవసరం లేదు. కేసులో ఏయే అంశాలున్నాయో మాకు తెలుసు. వాటన్నింటిపై మేం విచారిస్తాం. ముందు విచారణ ప్రారంభం కానివ్వండి’ అని అన్నారు. మధ్యవర్తిత్వ కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలు రహస్యంగానే ఉంటాయని కూడా కోర్టు స్పష్టం చేసింది.
6 నుంచి అయోధ్య విచారణ
Published Sat, Aug 3 2019 4:38 AM | Last Updated on Sat, Aug 3 2019 7:50 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment