విగ్రహాలు ‘ప్రత్యక్షం’.. గోరఖ్‌నాథ్‌ పరోక్షం! | Land dispute history on ayodhya and ram janam bhumi | Sakshi
Sakshi News home page

విగ్రహాలు ‘ప్రత్యక్షం’.. గోరఖ్‌నాథ్‌ పరోక్షం!

Published Sun, Nov 10 2019 6:51 AM | Last Updated on Sun, Nov 10 2019 7:05 AM

Land dispute history on ayodhya and ram janam bhumi - Sakshi

1949లో తొమ్మిది రోజుల పాటు రామచరిత మానస్‌ను పారాయణం చేశారు. చివర్లో బాబ్రీ మసీదులో రాముడు, సీత విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి! ఫలితంగా బాబ్రీ మసీదుని మూసివేశారు. ఈ పారాయణం చేసింది, అప్పటి రామ జన్మభూమి ఉద్యమానికి నాయకత్వం వహించింది మహంత్‌ దిగ్విజయ్‌ నాథ్‌. ఈ సంఘటనే నాథ్‌ని హిందూమహాసభలో తిరుగులేని నాయకుడిని చేసింది. తరవాత హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శిగా ఎంపికై, జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాడు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 1967లో గోరఖ్‌పూర్‌ ఎంపీగా గెలిచారు. నిజానికి 1921లోనే దిగ్విజయ్‌నాథ్‌ కాంగ్రెస్‌లో చేరి, చౌరీచౌరా సంఘటనలో కీలకపాత్ర పోషించారు. అదే ఘటనలో ఆరెస్టయ్యారు. తరవాత హిందుత్వ వాదులతో కలిసి పనిచేస్తూ హిందూ మహాసభలో చేరారు. హిందూ మహాసభ సభ్యుడు గాడ్సేని మహాత్మాగాంధీ హత్యకు ఉసిగొల్పారన్న నేరారోపణపై నాథ్‌ 9 నెలల పాటు జైల్లో గడిపారు. బయటికి వచ్చాకే రామజన్మభూమి ఉద్యమాన్ని ఆరంభించారు.
మఠం నుంచి రాజకీయాల్లోకి...
గోరఖ్‌నాథ్‌ మఠం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఉంది. 11వ శతాబ్దారంభంలో హిందూ యోగి, సాధువు యోగి గోరఖ్‌నాథ్‌ దీనికి బీజం వేశారు. దిగ్విజయ్‌నాథ్‌ తరవాత ఆయన వారసుడు మహంత్‌ అవైద్యనాథ్‌ 1962, 1967, 1969, 1974, 1977లో మణిరామ్‌  స్వతంత్ర ఎమ్మెల్యేగా, 1970, 1989లో గోరఖ్‌పూర్‌ ఎంపీగా ఎన్నికయ్యారు. సంఘ్‌ పరివార్‌ స్వయంగా రామజన్మభూమి ఉద్యమానికి శ్రీకారం చుట్టడంతో అవైద్యనాథ్‌ బీజేపీలో చేరి గోరఖ్‌పూర్‌ ఎంపీగా 1991, 1996లో ఎన్నికయ్యారు. ఇదే మఠం నుంచి వచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ 1998 నుంచి ఎంపీగా గెలిచారు. ఎంపీగా ఉంటూ∙ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా అయ్యారు. బాబ్రీ కూల్చివేతలోనూ యోగి ఆదిత్యనాథ్‌ పాత్ర కీలకమని చెబుతారు.
మూలవిరాట్టునాయర్‌...
రామ జన్మభూమి–బాబ్రీ మసీదు వివాదానికి మూలవిరాట్టు ఎవరైనా ఉన్నారంటే 1949 నాటి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కె.కె.కె.నాయర్‌ అనే యూపీ అధికారి. కృష్ణకుమార్‌ కరుణాకరన్‌ నాయర్‌ కేరళ వాస్తవ్యుడు. కేరళలోని అలెప్పీలో పుట్టి, మద్రాస్‌ యూనివర్సిటీలో బారాసెనీ కాలేజీలోనూ, అలీగఢ్‌ యూనివర్సిటీలోనూ, లండన్‌లోనూ ఉన్నత విద్యనభ్యసించారు. 1930లో ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌లో చేరారు. నాయర్‌ ఉత్తరప్రదేశ్‌లో వివిధ పదవుల్లో పనిచేశారు. 1949లో ఫైజాబాద్‌ జిల్లా మేజిస్ట్రేట్‌గా పనిచేశారు.

1949లో గోరఖ్‌నాథ్‌ మఠం సభ్యుల రామచరిత మానస్‌ పారాయణం సందర్భంగా బాబ్రీ మసీదులోని ప్రధాన గుమ్మటంలోపల హిందూ దేవతా విగ్రహాలు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాయి. దీనిపై విచారణ జరిపిన నాటి ప్రభుత్వం విగ్రహాలను మసీదులో పెట్టడంలో నాటి జిల్లా అధికారి నాయర్‌ కీలక సూత్రధారి అని నిర్ధారించింది. సంఘటన జరిగిన క్షణాల్లోనే నాయర్‌ అక్కడికి చేరుకున్నారని, విగ్రహాలు పెట్టి, వ్యవహారమంతా పూర్తయ్యాకే పై అధికారులకు సమాచారమిచ్చారని ఆరోపణలొచ్చాయి. నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ విగ్రహాలను అక్కడి నుంచి తరలించాలని, నాయర్‌ని పదవి నుంచి తొలగించాలని ఆదేశించారు. నాయర్‌ పదవిని వదిలి నేరుగా హిందూ మహాసభలో చేరారు. ఈ చర్యతో హిందూత్వ వాదుల్లో కె.కె.నాయర్‌ హీరోగా మారాడు. నాల్గవ లోక్‌సభలో భారతీయ జనసంఘ్‌ పార్టీ తరఫున పోటీ చేసి    నాయర్‌ గెలిచారు కూడా.
 

మందిరం.. మసీదు
1528 నుంచి 2019 వరకూ...డేట్‌ టు డేట్‌
1528: మొఘల్‌ చక్రవర్తి బాబర్‌ కమాండర్‌ మిర్‌ బక్వి బాబ్రీ మసీదును నిర్మించారు.
1885: బాబ్రీ మసీదు ప్రాంతానికి పక్కనే దేవాలయ నిర్మాణానికి అనుమతివ్వాల్సిందిగా ఫైజాబాద్‌ కోర్టులో మహంత్‌ రఘుబీర్‌ దాస్‌ దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టివేత.
డిసెంబర్‌ 22–23, 1949: బాబ్రీ మసీదు లోపల రాముడి విగ్రహాలు ప్రత్యక్షం. హిందువులు దీనిని స్వయంభూగా భావించారు. పూజలకు ప్రయత్నించడం ప్రారంభించారు. విగ్రహాలను తీసుకుని వచ్చి అక్కడ పెట్టారని కొందరి ఆరోపణ.
1950: విగ్రహాలకు పూజలు చేసేందుకు అనుమతివ్వాలని ఫైజాబాద్‌ కోర్టును కోరిన గోపాల్‌ విశారద్, పరమహంస రామచంద్రదాస్‌.
1959: వివాదాస్పద స్థలాన్ని తమ అధీనం చేయాలని కేసు వేసిన నిర్మోహీ అఖాడా.
1961: బాబ్రీ మసీదులోని విగ్రహాలను తొలగించడంతోపాటు వివాదాస్పద స్థలం తమకు చెందినదిగా ప్రకటించాలని కోర్టును ఆశ్రయించిన యూపీ  సెంట్రల్‌ సున్నీ వక్ఫ్‌ బోర్డు.
1984: రామ జన్మభూమి ఉద్యమాన్ని ప్రారంభించిన విశ్వహిందూ పరిషత్‌.
ఫిబ్రవరి 1, 1986: రామ్‌లల్లా విగ్రహాలకు పూజలు చేసేందుకు హిందువులకు అనుమతిస్తూ ఫైజాబాద్‌ సెషన్స్‌ కోర్టు తీర్పు. నిరసన తెలిపేందుకు బాబ్రీ మసీద్‌ యాక్షన్‌ కమిటీ ఏర్పాటు.  
ఆగస్టు 14, 1989: అలహాబాద్‌ హైకోర్టుకు స్థల వివాదం. వివాదాస్పద స్థలానికి సంబంధించి యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశం.
నవంబర్‌ 9, 1989: వివాదాస్పద రామ జన్మభూమి స్థలం సమీపంలో శిలాన్యాస్‌  నిర్వహించేందుకు విశ్వహిందూ పరిషత్‌కు అనుమతిస్తూ అప్పటి రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ నిర్ణయం.
సెప్టెంబర్‌ 1990: భవ్య రామమందిర నిర్మాణం లక్ష్యంగా గుజరాత్‌లోని సోమనాథ్‌ నుంచి భారతీయ జనతాపార్టీ నేత ఎల్‌.కె.అద్వానీ రథయాత్ర ప్రారంభం.
డిసెంబర్‌ 6, 1992: కరసేవకుల చేతుల్లో నేలమట్టమైన బాబ్రీ మసీదు. చెలరేగిన హింస.
డిసెంబర్‌ 16, 1992:  బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసిన పరిస్థితులపై విచారణకు  జస్టిస్‌ లిబర్‌హాన్‌ కమిషన్‌ ఏర్పాటు.  
1993: రామజన్మభూమి తాలూకూ వివాదాస్పద స్థలంతోపాటు పరిసరాల్లోని సుమారు 67 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న పి.వి.నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వం.
1994 : స్థల స్వాధీనానికి సుప్రీంకోర్టు సమర్థింపు. ఇస్లామ్‌ మతంలో మసీదు ఒక భాగం కాదంటూ డాక్టర్‌ ఇస్మాయిల్‌ ఫారూఖీ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు వ్యాఖ్య.  
ఏప్రిల్‌ 2002: వివాదాస్పద రామజన్మభూమి స్థల యాజమాన్య హక్కులపై అలహాబాద్‌ హైకోర్టులో విచారణ ప్రారంభం.
మార్చి 2003: కేంద్రం స్వాధీనం చేసుకన్న భూమిలో మతపరమైన కార్యకలాపాలపై సుప్రీంకోర్టు నిషేధం.
2005: వివాదాస్పద స్థలంపై పేలుడు పదార్థాలు నిండిన జీపుతో ఉగ్రవాదుల దాడి. ఎదురు కాల్పుల్లో అందరూ హతం.  
2009: ప్రభుత్వానికి జస్టిస్‌ లిబర్‌హాన్‌ కమిషన్‌  నివేదిక
సెప్టెంబర్‌ 30, 2010: సున్నీ వక్ఫ్‌ బోర్డ్, రామ్‌లీలా, నిర్మోహీ అఖాడాకు సమానంగా స్థలాన్ని విభజించాలని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశం.  
మే 2011: హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ç14 పిటిషన్లు దాఖలు. హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీం.
మార్చి 2017: అయోధ్య వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జె.ఎస్‌.ఖేహర్‌ సూచన.   
ఆగస్టు 2017: సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన త్రిసభ్య బెంచ్‌ విచారణ ప్రారంభం.   
సెప్టెంబర్‌ 2018: 1994 నాటి ఇస్మాయిల్‌ ఫారూఖీ తీర్పును పునః పరిశీలించాలన్న పిటిషనర్ల అప్పీళ్లపై విచారించిన సుప్రీంకోర్టు. విషయాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించరాదంటూ 2:1 తేడాతో న్యాయమూర్తుల తీర్మానం.
జనవరి 8, 2019: అయోధ్య వివాదంపై దాఖలైన పిటిషన్ల విచారణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు.  చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలో జస్టిస్‌. ఎస్‌.ఎ.బొబ్డే, జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ యు.యు.లలిత్, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌లతో ధర్మాసనం. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా సూచించిన చీఫ్‌ జస్టిస్‌.
జనవరి 10, 2019: విచారణ బెంచ్‌లో తాను ఉండరాదని జస్టిస్‌ యు.యు. లలిత్‌ నిర్ణయం. దీంతో బెంచ్‌ పునర్‌వ్యవస్థీకరణ. జస్టిస్‌ ఎన్‌.వి. నారాయణ, జస్టిస్‌ యు.యు.లలిత్‌ స్థానంలోకి జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌.  
మార్చి 8, 2019: కోర్టు పర్యవేక్షణలో ఉండే మధ్యవర్తిత్వ కమిటీకి వివాదాస్పద అంశం.
అక్టోబర్‌ 2019: సమస్య సామరస్య పరిష్కారంలో మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎఫ్‌.ఎం.ఐ.ఖలీఫుల్లా నేతృత్వంలోని మధ్యవర్తిత్వ కమిటీ విఫలం. నివేదిక సమర్పణ.
ఆగస్టు 6, 2019: రోజూవారీ విచారణకు చేపట్టిన  ధర్మాసనం.  
అక్టోబర్‌ 16, 2019: తుదితీర్పు రిజర్వ్‌.
నవంబర్‌ 9, 2019: వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మాణానికి అనుకూలంగా సుప్రీం తీర్పు
బాబర్‌ ఆదేశాల మేరకు మసీదు నిర్మాణం జరిగిందంటూ గోడలపై ఉన్న శాసనాలు చెబుతున్నాయి. రాముడు జన్మించిన ప్రాంతంలో దేవాలయాన్ని కూల్చివేసి ఆ శిథిలాలపై మసీదు కట్టారన్నది స్థానికులు చెప్పే మాట.
1717: మసీదు స్థలాన్ని కొనుగోలు చేసి రాముడికి దఖలు చేసిన రాజ్‌పూత్‌ వంశీకుడు
జై సింగ్‌ –2. మసీదు బయట రాముడి విగ్రహాలకు పూజలు.
1768: బాబ్రీ మసీదును ఔరంగజేబు నిర్మించారని కొందరు, బాబర్‌ కట్టించాడని మరికొందరు స్థానికులు చెప్పినట్లు రికార్డు నమోదు చేసిన జెసూట్‌ పూజారి జోసెఫ్‌ టీఫెన్ట్‌హాలర్‌.  
1853:బాబ్రీ–మందిర్‌ వివాదంపై  దేశంలో తొలిసారి మతఘర్షణలు నమోదు.
1859: బాబ్రీ మసీదు ప్రాంతంలో హిందువులు, ముస్లింలు ప్రార్థనలు చేసేందుకు కంచె రూపంలో వేర్వేరు ప్రాంతాలను కేటాయించిన బ్రిటిష్‌ ప్రభుత్వం. సుమారు 90 ఏళ్లు ఈ పద్ధతి కొనసాగింపు.


శనివారం అయోధ్యలోని ఓ ఆలయంలో సీతారాముల విగ్రహాలకు నమస్కరిస్తున్న ఓ భక్తురాలు


బాబ్రీ మసీదులో పూజలు చేస్తున్న దృశ్యం (ఫైల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement