
సాక్షి, న్యూఢిల్లీ: తీర్పు నేపథ్యంలో శనివారం కోర్టు పరిసరాలైన తిలక్‌మార్గ్, మండిహౌస్ ప్రాంతాలు గంభీర వాతావరణాన్ని తలపించాయి. దాదాపు నలభై రోజుల పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం అయోధ్య వివాదంపై వాదనలు ఆలకించింది. తుది తీర్పు వెలువరించే ముందు సుప్రీంకోర్టులో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కోర్టు తీర్పు నేపథ్యంలో దేశంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉదయాన్నే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన నివాసంలో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
(చదవండి : ‘అయోధ్య’ రామయ్యదే..!)
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల్లో భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సుప్రీంకోర్టు వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకే న్యాయవాదులు భారీగా సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. సాధువులు, హిందూ, ముస్లిం మత పెద్దలు పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు చేరుకున్నారు. ఉదయం 10:25 గంటలకు పోలీసుల భారీ భద్రత నడుమ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టుకు చేరుకున్నారు.
జైశ్రీరాం నినాదాలు..
ఉదయం 10:32కి జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పు చదవడం ప్రారంభించారు. 45 నిమిషాల పాటు సుదీర్ఘంగా తీర్పు వెల్లడించారు. ఆ వెంటనే కోర్టు బయట జై శ్రీరాం నినాదాలు మిన్నంటాయి. కోర్టు తీర్పును గౌరవిస్తూ హిందూ, ముస్లింలు పలువురు ఆలింగనం చేసుకోవడం కనిపించింది. నవంబరు 15 జస్టిస్ రంజన్ గొగోయ్ అఖరి పనిదినం కావడంతో అయోధ్యపై తీర్పు 13, 14 తేదీల్లో రావచ్చని అంతా భావించారు. అయితే కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం వాద, ప్రతివాదుల్లో ఎవరికైనా రివ్యూ పిటిషన్ దాఖలు చేసే హక్కు ఉండడంతో అన్ని అంశాలను పరిశీలించి శనివారం తీర్పు వెలువరించినట్టు తెలుస్తోంది.
(చదవండి : అయోధ్య తీర్పు రాసిందెవరు?)
Comments
Please login to add a commentAdd a comment