Ranjan Gogoi
-
అయోధ్య కేసును సవాలుగా స్వీకరించా!
న్యూఢిల్లీ: అయోధ్య కేసును సవాలుగా స్వీకరించి పరిష్కరించానని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తెలిపారు. జస్టిస్ ఫర్ ద జడ్జ్ పేరిట రాసిన ఆత్మకథను ఆయన బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయోధ్య తీర్పు, రాజ్యసభ నామినేషన్, ఎన్ఆర్సీ, కొలీజియం తదితర పలు అంశాలపై ఇండియా టుడే, ఆజ్‌తక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఆయా అంశాలపై రంజన్ అభిప్రాయాలు ఆయన మాటల్లో.. అయోధ్య తీర్పు: అయోధ్య కేసును నేను వెలికితీయలేదు. నా ముందున్న న్యాయమూర్తి ఒక తేదీని ఈ కేసుకు కేటాయించారు. ఆ తేదీ వచ్చినప్పుడు నేను పదవిలో ఉన్నాను. ఆ సమయంలో తప్పుకొని పోవడం లేదా ధైర్యంగా కేసును పరిష్కరించడమనే ఆప్షన్లు నాముందున్నాయి. నేనే ధైర్యంగా పరిష్కారానికి యత్నించాను. లైంగిక వేధింపుల ఆరోపణ: నిజానికి ఆ బెంచ్‌పై నేను ఉండకుండా ఉండాల్సింది. కానీ 45ఏళ్లు కష్టపడి సంపాదించిన పేరు ఒక్కరాత్రిలో ధ్వంసమవుతుంటే చూస్తూ ఊరుకోలేం! సీజేఐ కూడా మానవమాత్రుడే! మీడియా మరింత అప్రమత్తతతో ఉండాలనే ఆ బెంచ్ తీర్పునిచ్చింది. కానీ మీడియా మాత్రం సీజేఐ తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకున్నారని వార్తలు రాసింది. అందుకే ఆ బెంచ్‌లో నేను లేకుండా బాగుండేదని అనుకున్నా. జడ్జీల మీడియా సమావేశం: పాత్రికేయ సమావేశం నిర్వహించడం నా ఆలోచనే! బహుశా నేను తప్పుగా ఊహించి ఉండవచ్చు. మా నలుగురు న్యాయ మూర్తుల ఆలోచనలను అప్పటి సీజేఐకి అర్థమయ్యేలా చెప్పాలన్న ప్రయత్నం చివరకు విఫలమైంది. అయితే ఇలాంటి మీడియా సమావేశాల్లో అదే మొదటిది, చివరిది కావాలని నా ఆశ. రాజ్యసభ నామినేషన్: అయోధ్య తీర్పుకు ప్రతిఫలంగా కేంద్రం నాకు రాజ్యసభ సీటిచ్చిందన్న ఆరోపణలన్నీ నిరాధారాలే! రిటైర్డ్ జడ్జీలు గవర్నర్, మానవహక్కుల కమిషన్ చైర్మన్, లాకమిషన్ చైర్మన్ పదవులకు అర్హులు. వీటిని స్వీకరించమనా మీ సూచన? నా నామినేషన్ అధికరణ 80 ప్రకారం జరిగిన అంశం. ఇందులో తప్పేమీ లేదు. రాజ్యసభకు ఎంపికైనప్పటినుంచి ఒక్క పైసా తీసుకోలేదు. స్వంత ఖర్చులతో సభ్యత్వ నిర్వహణ చేస్తున్నాను. రఫేల్ తీర్పు: రఫేల్ తీర్పు ముందు ప్రధాని సుప్రీంకోర్టుకు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వచ్చారు. ఈ సమావేశానికి బిమ్స్టెక్ దేశాల ప్రధాన న్యాయమూర్తులను ఆహ్వానించారు. ఆ సమావేశంలో ప్రధానితో సెల్ఫీలకు పోటీపడిన కొందరు జడ్జీలు ఇప్పుడు అదే ప్రధానిపై విమర్శలు గుప్పిస్తూ హడావుడి చేస్తున్నారు. కొలీజియం: ప్రతి వ్యవస్థలో మంచిచెడులుంటాయి. సీజేఐగా కొలీజియంలో నాకు ఎలాంటి సమస్య ఎదురుకాలేదు. కొలీజియంలో సుదీర్ఘ చర్చల అనంతరం ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయడం జరుగుతుంది. -
లైంగిక వేధింపుల కేసు: గొగోయ్‌కి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌కి అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆయన మీద నమోదైన సుమోటో లైంగిక వేధింపుల కేసును గురువారం సుప్రీం కోర్టు క్లోజ్ చేసింది. రంజన్ గొగోయ్‌పై నమోదైన కేసులో కుట్ర కోణం ఉండవచ్చని అనుమానించిన కోర్టు ఇలా చెప్పడానికి బలమైన కారణాలు ఉన్నాయని పేర్కొంది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్సీ) సహా జస్టిస్ గొగొయ్ తీసుకున్న నిర్ణయాలకు ఈ కుట్ర కోణాన్ని ఆపాదించవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పును వెల్లడించింది. జస్టిస్ పట్నాయక్ కమిటీ, సీజేఐ ఎస్ఏ బాబ్డేల నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ నివేదిక ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జస్టిస్ కౌల్ పేర్కొన్నారు. గొగోయ్‌పై వచ్చిన ఆరోపణల్లో కుట్రకోణం ఏదైనా ఉందా అని తెలుసుకోవడానికి నియమించిన జస్టిస్ ఏకే పట్నాయక్ కమిటీ నివేదిక మేరకు సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. 2019 నాటి ఉత్తర్వుల ఆదేశాన్ని దృష్టిలో ఉంచుకుని మాజీ ప్రధాన న్యాయమూర్తి నిర్ణయాలు ఆయనపై కుట్రను ప్రేరేపించాయని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ గొగోయ్ కేసులో కుట్ర కోణం దాగి ఉందని పట్నాయక్ కమిటీ నివేదిక స్పష్టం చేసినట్లు సుప్రీంకోర్టు తన తీర్పులో వెల్లడించింది. అయితే, దీనికి సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను మాత్రం ప్యానెల్ పొందలేకపోయిందని వ్యాఖ్యానించింది. ఎన్ఆర్సీ లాంటి కేసుల్లో జస్టిస్ గొగోయ్ ఇచ్చిన తీర్పులపై చాలా మంది అసంతృప్తిగా ఉన్నారని ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గుర్తు చేసింది. రిజిస్ట్రీ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి రంజన్ గొగోయ్ కొన్ని కఠినమైన పరిపాలనా నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా జస్టిస్ గొగోయ్‌పై వచ్చిన ఆరోపణలు విచారణర్హం కాదని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ‘ఉద్దేశపూర్వకంగా ఈ ఆరోపణలను చేసినట్టు మేం అభిప్రాయపడ్డాం.. సుమోటాగా స్వీకరించిన ఈ కేసును మూసివేస్తున్నామని’’ కోర్టు స్పష్టం చేసింది. చదవండి: జడ్జీలూ సోషల్ మీడియా బాధితులే యంత్రాంగమే ఎదుర్కోగలదు -
రాయని డైరీ... రంజన్ గొగోయ్ (మాజీ సీజేఐ)
నిందితుడు దోషిగా నిర్ధారణ కాకుండానే దోషిలా కోర్టు బోనులో నిలుచోవడం ఎలా ఉంటుందో నా నలభై రెండేళ్ల ‘లా’ కెరీర్లో నేనెప్పుడూ ఆలోచించలేదు. చట్టమే న్యాయం తరఫున ఆలోచనలు చేసి, ఆ ఆలోచనల్ని ఒక పుస్తకంగా కుట్టి, ఆ పుస్తకాన్ని న్యాయమూర్తి చేతిలో పెట్టినప్పుడు పుస్తకంలోని పేజీలు తిప్పుతూ పోవడం తప్ప, పుస్తకంలో లేని ఆలోచనలతో కోర్టు హాల్లో తలెత్తిగానీ, తలతిప్పిగానీ చూడవలసిన అవసరం న్యాయమూర్తికి ఏముంటుంది కనుక?! గురువారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేస్తున్నప్పుడు గతంలో నా ఎదుట కోర్టు బోనులో నిలబడి ‘అంతా నిజమే చెబుతాను’ అని ఎందరో నిందితులు ప్రమాణం చేసిన దృశ్యం నా కళ్ల ముందుకొచ్చింది! రాజ్యసభలో నేను ప్రమాణ స్వీకారం చేస్తుండగా ‘షేమ్ షేమ్’ అని అరిచిన అపోజిషన్ సభ్యులు.. కోర్టు హాలులో నిందితుడి వైపు వేలెత్తి చూపుతూ ‘దోషి, దోషి’ అని కేకలు వేస్తున్నవారిలా, వారిని వారిస్తూ ‘ఆర్డర్ ఆర్డర్’ అంటున్న రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రత్యేక ధర్మాసనానికి వచ్చి కూర్చున్న న్యాయమూర్తిలా నాకు కనిపించారు. ప్రమాణ స్వీకారానికి ముందు వెంకయ్యనాయుడికి నమస్కారం చేశాను. ‘ఇదిగో ఇలా నమస్కారాలు పెట్టే, రాజ్యసభ సీటు సంపాదించాడు. షేమ్ షేమ్’ అని సభలో అరుపులు! రాజ్యసభ కన్నా కోర్టు హాలే నయం అనిపించింది. అక్కడ నిందితుడైన వ్యక్తి ప్రమాణం చేస్తాడు. ఇక్కడ నేను ప్రమాణం చేస్తున్నందుకు నిందితుడినయ్యాను. ‘షేమ్ షేమ్ అంటున్న గౌరవ సభ్యులారా వినండి’ అన్నాను. ‘వినేందుకు ఏముంటుంది రంజన్ గొగోయ్! మోదీకి మీరు రామ జన్మభూమిని ఇచ్చారు. మోదీ మీకు రాజ్యసభను ఇచ్చారు. ఇచ్చిపుచ్చుకోవడం అయిపోయింది కదా..’ అంటున్నారు. అంటూ వాకౌట్ చేస్తున్నారు. ‘దిస్ ఈజ్ అన్‌ఫెయిర్’ అంటున్నారు వెంకయ్యనాయుడు. ఆ మాటను కూడా వాళ్లు వినడం లేదు. సుప్రీంకోర్టులో ఉండగా నేనొక్కడినే చీఫ్ జస్టిస్‌ని. రాజ్యసభలో పార్టీకొక రాజ్యసభ ఛైర్మన్ ఉన్నట్లున్నారు! కాంగ్రెస్, సీపీఎం, ఎండీఎంకే, ముస్లిం లీగ్, బీఎస్పీల ఎంపీలు నేను రాజ్యసభ సభ్యత్వానికి చెయ్యి చాచడంలో నీతి లేదని, రీతి లేదని తీర్పులు ఇచ్చేస్తున్నారు. ఇదంతా గ్యాలరీలోంచి నా భార్య, నా కూతురు, నా అల్లుడు చూస్తున్నారు. ‘గౌరవ సభ్యులారా.. నన్నూ చెప్పనివ్వండి’’ అన్నాను. ‘ఏముంటుంది చెప్పడానికి!’’ అని అరిచారు. ‘ఎవరేమనుకున్నా నేను భయపడే రకం కాదు. గతంలో భయపడలేదు. వర్తమానంలో భయపడటం లేదు. భవిష్యత్తులోనూ భయపడను. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో ఒక్క నా భార్య అభిప్రాయానికి తప్ప నేనెవరికీ విలువ ఇవ్వలేదు, ఇవ్వడం లేదు, ఇవ్వను’ అన్నాను. సభ ఒక్కసారిగా స్తంభించిపోయింది. వెంకయ్యనాయుడు నా వైపు అభినందనగా చూశారు. సభ ముగిసింది. ‘‘సభలో అలా అనేశారేంటీ.. నా మాటకు తప్ప ఎవరికీ విలువ ఇవ్వనని’’ అంది రూప.. ఇంటికి రాగానే. ‘‘అవును నాన్నగారూ అలా అనేశారేంటి’’ అంది నా కూతురు. ‘అవును మామగారూ అలా అనేశారేంటి’’ అన్నాడు నా అల్లుడు. ‘‘ఆరేళ్లు మాట పడుతూ పదవీ కాలం పూర్తి చేయడమా, పదవీకాలం ప్రారంభమైన రోజే మాటకు మాట చెప్పి దీటుగా నిలబడటమా అని ఆలోచించాను. దీటుగా నిలబడటమే నాకు, నన్ను నామినేట్ చేసిన రాష్ట్రపతికీ గౌరవం అనిపించింది. అందుకే నేను ఏమిటో చెప్పాను’’ అన్నాను. - మాధవ్ శింగరాజు -
రాజ్యసభలో గొగోయ్ ప్రమాణం
న్యూఢిల్లీ/చండీగఢ్: అయోధ్య వివాదం వంటి కీలక కేసుల్లో చారిత్రక తీర్పులు వెలువరించిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా రంజన్ గొగోయ్(65) కొత్త అధ్యాయం ప్రారంభించారు. గురువారం ఆయన రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుండగా ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలిపారు. ‘షేమ్, షేమ్’అని నినాదాలు చేసుకుంటూ వాకౌట్ చేశారు. ఒక సభ్యుని ప్రమాణ స్వీకారం చేస్తుండగా సభ్యులు ఇలా వాకౌట్ చేయడం రాజ్యసభ చరిత్రలో ఇదే మొదటిసారి. అంతకుముందు, ప్రమాణ స్వీకారానికి ఆయన పేరును పిలవగానే ప్రతిపక్ష సభ్యులు ‘షేమ్, డీల్’అంటూ నినాదాలు ప్రారంభించారు. -
ఏ న్యాయానికి ఈ మూల్యం!
ఒకటో ఎస్టేట్ దయతో మూడో ఎస్టేట్ నుంచి రెండో ఎస్టేట్‌కు ప్రమోట్ అయ్యారు మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్. ఈయనగారొక్కరే కాదు ఇదివరకు 44 మంది మాజీ ప్రధాన న్యాయమూర్తులు పదవి దిగిపోయిన తరువాత సర్కారు ఇచ్చిన హోదాలు అందుకుని న్యాయదేవతను సమర్చించారు. రిటైర్ మెంట్ తరువాత పదవులకోసం ఉవ్విళ్లూరే విధంగా అనేక పదవులను లెజిస్లేచర్ సృష్టించింది. లోక్‌పాల్, లోకాయుక్త, జాతీయ, రాష్ట్ర స్థాయి మానవ హక్కుల కమిషన్లు, లాకమిషన్ ఆఫ్ ఇండియా వంటి అనేక పదవులను మాజీ న్యాయ మూర్తులకే ఇవ్వాలనే చట్టాలున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం, ఇటీవలి కాలంలో రిటైరయిన నూరుమందిలో 70 మంది జడ్జీలు ఆ తరువాత అనేక పదవులు తీసుకున్నారని తేలింది. ఇటీవలే కేరళ గవర్నర్‌గా సకల అధికార సౌఖ్యాలు అనుభవించిన మాజీ ప్రధాన న్యాయమూర్తి సదాశివం గుర్తుండే ఉంటారు. అంతకుముందు రంగనాథ్ మిశ్రా గారు సీజేఐ పదవి వదిలిన ఏడేళ్ల తరువాత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యసభకు పోటీ చేయడానికి టికెట్ ఇచ్చి, గెలిపించిన విషయం కూడా గుర్తుండే ఉంటుంది. 1984 సిక్కు వ్యతిరేక హింసాకాండలో కాంగ్రెస్ ప్రమేయం ఏదీ లేదని వారంతా సచ్చీలురని రంగనాథ్ మిశ్రా న్యాయవిచారణ కమిషన్ నివేదిక ఇచ్చింది. అంత మేలు చేసిన న్యాయమూర్తికి ఆలస్యంగానైనా ధన్యవాదాలు చెప్పుకున్నారు. జస్టిస్ బహరుల్ ఇస్లాం అనే సుప్రీంకోర్టు జడ్జిగారు సుప్రీంకోర్టుకు రాజీనామా చేసి రాజ్యసభకు పోటీ చేసి 1983లో కాంగ్రెస్ టికెట్ పైన గెలిచారు. ఆయన చేసిన మేలు కూడా ఇంతాఅంతా కాదు. ఆనాటి బిహార్ సీఎం జగన్నాథ్ మిశ్రాపై వచ్చిన అవినీతి ఆరోపణల్లో అబద్ధాలను వెతికి పట్టుకున్నారు. ఇటీవలే మరణించిన పద్మభూషణ్ అరుణ్ జైట్లీ రాజ్యసభలో ప్రతిపక్ష నాయ కుడిగా ఉన్న 2012 కాలంలో న్యాయమూర్తుల పదవీ విరమణ తరువాత రెండేళ్ల దాకా ఏ పదవులను అంగీకరించకూడదనీ, వారికి ప్రభుత్వాలు ఏ పదవులూ ఇవ్వకూడదని వక్కాణించారు. చేసిన సేవలు రెండేళ్ల తరువాత గుర్తుపెట్టుకుని పదవులిచ్చే కృతజ్ఞత ఉంటుందా. ఎన్ని పనులు ఉంటాయి? మరిచిపోకముందే రుణం తీర్చుకోవడం ఉత్తమపురుషుల లక్షణం. రంజన్ గొగోయ్ చాలా సంచలన తీర్పులు ఇచ్చిన ప్రధాన న్యాయమూర్తి. సీబీఐ అలోక్ వర్మ తొలగింపు కేసులో న్యాయంచెప్పారు. తరువాత సీబీఐ డైరెక్టర్ నియామక కమిటీలో ప్రధానితో పాటు కూర్చున్నారు. ఏదో తప్పనిపించి కమిటీ నుంచి తప్పుకున్నారు. రఫేల్ కుంభకోణంలో ప్రభుత్వం తప్పే చేయలేదని గొగోయ్ గారికి అని పించింది. ఎలక్టోరల్ బాండ్స్ అనే పేరుతో కార్పొరేట్ ల నుంచి వందల కోట్ల రూపాయల విరాళాలు వసూలు చేయడానికి వీలు కల్పించే పథకంలో ఆయనకు ఏ దోషమూ కనిపించలేదు. కశ్మీర్లో అక్రమ బందీల హెబియస్ కార్పస్ కేసులు వినకుండా ఉంటేనే మేలనుకున్నారు. అయోధ్య వివాదంపైన రాజ్యాంగం కూడా ఊహించని కోత్త కోణం గొగోయ్ గారికి కనిపించింది. అయోధ్యలో రామాలయం వస్తుందా లేదా అన్నదే పాయింట్. మిగతా గోల ఎందుకంట. అస్సాంలో ఎన్నార్సీ తయారీలో సుప్రీంకోర్టు పర్యవేక్షణ చాలా ముఖ్యం. అందులో రంజన్ గొగోయ్ గారిది కీలకపాత్ర. ఎన్నార్సీని దేశం మొత్తానికి విస్తరించే ఊపునిచ్చిన పాత్ర. తనపైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళను డిసెంబర్ 2018లో ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేసారు. తన కేసులో తానే తీర్పు చెప్పు కున్నంత స్థాయిలో తానే బెంచ్ పై ఉండడం. తానే జడ్జిలను ఎంపికచేయడం, తను నిర్దోషిగా బయటపడటానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం మామూలు విషయాలు. ఈయన గారు సీజేఐ పదవి వదిలి పెట్టిన కొన్నాళ్ళకు ఆ ఆరోపణలు చేసిన మహిళకు జనవరి 23, 2020 నాడు ఉద్యోగం మళ్లీ ఇచ్చారు. అయితే తప్పెవరిది అని తల బద్దలు కొట్టుకునే వారు చాలా మంది. న్యాయవ్యవస్థ పట్ల ప్రజలకుండే విశ్వాసాన్ని గౌరవాన్ని, ప్రేమను, నమ్మకాన్ని భారీ ఎత్తున తగ్గించే చర్య ఈ నియామకం. ఎవరినైనా కొనేస్తాం అనే ధైర్యాన్ని ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్నాయి. ఎవ రైనా అమ్ముడుపోతారేమోననే అనుమానాన్ని కొందరు పెద్దలు కలిగిస్తున్నారు. వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్ కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
రంజన్ గొగోయ్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం
-
రాజ్యసభ సభ్యుడిగా గొగోయ్ ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ సభ్యుల వ్యతిరేక నినాదాల నడుమ గురువారం రాజ్యసభలో ఆయన ఎంపీగా ప్రమాణం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుండగానే విపక్షాలు సభనుంచి బయటకు వెళ్లిపోవటం గమనార్హం. విపక్షాల చర్యను కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తప్పుపట్టారు. రాజ్యసభ సభ్యుడిగా రంజన్ తన వంతు కృషి చేస్తారని పేర్కొన్నారు. ( న్యాయవ్యవస్థ స్వతంత్రతపై నీలినీడలు) సభనుంచి బయటకు వెళ్లిపోతున్న విపక్షాలు కాగా, 13 నెలల పాటు భారత ప్రధాన న్యాయమూర్తిగా తన సేవలందించిన అనంతరం గతేడాది నవంబర్‌లో ఆయన పదవీ విరమణ పొందారు. కొద్దిరోజుల క్రితం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, రంజన్ గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేశారు. అయితే రంజన్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఈ విమర్శలపై రంజన్ స్పందిస్తూ.. ‘దేశ అభివృద్ధి కోసం శాసన, న్యాయ వ్యవస్థలు ఏదో ఒక సమయంలో కలిసి పనిచేయాల్సిన అవసరముందనే నమ్మకంతోనే నేను రాజ్యసభ నామినేషన్‌ను అంగీకరించాన’అని అన్నారు. ( నా ప్రమాణం తర్వాత మాట్లాడతా ) -
న్యాయవ్యవస్థ స్వతంత్రతపై నీలినీడలు
భారత ప్రధాన న్యాయ మూర్తిగా నవంబర్ 17న పదవీ విరమణ చేసిన రంజన్ గొగోయ్‌ని రాజ్యసభ సభ్యు డిగా రాష్ట్రపతి సోమవారం నియమించారు. విరమణ చేసిన నాలుగు మాసాల్లోనే ఆయన్ని ఇలా నియమించ డంతో న్యాయవ్యవస్థ స్వతం త్రత మరోసారి ప్రశ్నార్థకమైంది. న్యాయమూర్తు లుగా పనిచేసిన వ్యక్తులు రాజకీయ పదవులను స్వీక రించడం ఇది మొదటిసారి కాదు. భారత న్యాయ చరిత్రలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తిని రాజ్యసభకి నియామకం చేయడం ఇదే మొదటిసారి. కొన్ని ప్రధాన తీర్పులని వెలువరించిన సుప్రీం కోర్టు బెంచీలకు గొగోయ్ నేతృత్వం వహించారు. వివాదాస్పద రామ జన్మభూమి హిందువులకు కేటా యించడం, రఫేల్ ఫైటర్ విమాన కేసులో దర్యాప్తు నిరాకరించడం, క్లీన్చిట్ ఇవ్వడం, ఎలక్టోరల్ బాండ్స్ స్కీములో విచారణని జాప్యం చేయడం, కశ్మీర్‌కి సంబంధించిన హెబియస్ కార్పస్ కేసులని విచారిం చడానికి అయిష్టత చూపడం, ఎన్ఆర్సీని నిర్వహించ డాన్ని పబ్లిక్‌గా సమర్థించడం లాంటి ఎన్నో తీర్పులని ఆయన వెలువరించారు. అధికారంలో వున్న పార్టీ తీసుకున్న లైన్‌కి అను కూలంగా తీర్పులు చెప్పినందుకుగానూ ఆయన్ని ఈ పదవి వరించిందని న్యాయవాదులు బహిరం గంగా కామెంట్స్ చేస్తున్నారు. ‘అంతర్గతంగా వున్న విషయం ఇప్పుడు బహిర్గతమైపోయింది. న్యాయ వ్యవస్థలోని స్వతంత్రత అధికారికంగా చనిపోయిం’ దని సుప్రీంకోర్టు న్యాయవాది గౌతమ్ భాటియా అన్నారు. తన రికార్డునే కాకుండా, తనతో బాటూ బెంచీలో వున్న న్యాయమూర్తుల స్వతంత్ర తకీ, నిష్పాక్షికతకీ మచ్చ తీసుకొచ్చే విధంగా ఆయన నడవడిక వుందని సుప్రీంకోర్టు మరో సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే అన్నారు. గొగోయ్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఉద్యోగిని కేసు విషయంలో ఏర్పాటైన ఆంత రంగిక ప్యానెల్లో బయటి వ్యక్తికి చోటు కల్పించక పోవడం, న్యాయవాదిని నియమించుకోవడానికి అవ కాశం ఇవ్వకపోవడం దారుణమనీ; ఆ కేసులో గొగో య్‌కి క్లీన్చిట్ ఇవ్వడం, ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా నియమించడంతో న్యాయ వ్యవస్థ బోలుతనం బయ టపడుతుందనీ సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు దుష్యంత్ దవే అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రంగనాథ్ మిశ్రా కూడా రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. అయితే ఆయన పదవీ విరమణ చేసింది 1991లో. అది కూడా ఏడేళ్ల తరువాత 1998లో రాజ్యసభకు ఎన్నికయ్యారు, నియామకం కాలేదు. ఈ మధ్య కాలంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. తరువాత కాంగ్రెస్‌లో చేరి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మరో జస్టిస్ ఎం.హిదయతుల్లా కూడా ఉప రాష్ట్రపతిగా ఎంపికయ్యారు, పదవీ విరమణ (1970) చేసిన తొమ్మిదేళ్ల తర్వాత. సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవీ కూడా తమిళనాడు గవర్నర్‌గా 1997లో నియమితు లైనారు. ఆమె పదవీ విరమణ చేసింది 1992లో. పదవీ విరమణ చేసిన వెంటనే న్యాయమూర్తు లకి మరో పదవి ఇవ్వడం ఎప్పుడూ చర్చనీయాం శమే. మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మాటల్లో చెప్పాలంటే– ‘పదవీ విరమణ తరువాత వచ్చే పద వులు, పదవుల్లో ఉన్నప్పుడు చెప్పే తీర్పులని ప్రభా వితం చేస్తాయి’. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుని హోదాలో 2012లో ఆయన ఇంకా ఇలా అన్నారు: ‘పదవీ విరమణ చేసిన రెండేళ్ల వరకి ఎలాంటి పదవిని న్యాయమూర్తికి ఇవ్వకూడదు. అలా గడువు లేకపోతే ప్రభుత్వం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో న్యాయమూర్తులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది.’ ఇవే మాటలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులైన ఆర్.ఎం.లోధా, టి.ఎస్. ఠాకూర్, కపాడియా లాంటివాళ్లు అన్నారు. రోజర్ మాథ్యూ కేసులో గొగోయ్ అభిప్రా యాలు నిందాస్తుతి లాంటివి. పదవీ విరమణ తరు వాత పదవుల విషయంలో కోర్టు తన ఆందోళనని వ్యక్తపరిచింది. ఆ విధంగా పదవులు ఇవ్వడం వల్ల న్యాయవ్యవస్థ స్వతంత్రతే దెబ్బతింటుందని గొగోయ్ నేతృత్వంలోని బెంచి అభిప్రాయపడింది. విరమణ వెంటనే పదవుల గురించి తీర్పులు చెప్పిన గొగోయ్ రాజ్యసభ సభ్యుడిగా పదవి స్వీకరించడం విషాదం. రాజ్యాంగంలోని అధికరణ 80 ప్రకారం కళలు, సైన్స్, సాహిత్యంలో ప్రత్యేక అనుభవం ఉన్న వ్యక్తులని రాష్ట్ర పతి రాజ్యసభ సభ్యులుగా నియమించవచ్చు. గొగో య్‌కి ఎందులో అనుభవం ఉందో మరి! వ్యాసకర్త: మంగారి రాజేందర్, గతంలో జిల్లా జడ్జిగా పనిచేశారు. మొబైల్ : 94404 83001 -
నా ప్రమాణం తర్వాత మాట్లాడతా
న్యూఢిల్లీ/గువాహటి: రాజ్యసభ సభ్యుడిగా తాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజ్యసభ నామినేషన్ గురించి మాట్లాడతానని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అన్నారు. ఆయన రాజ్యసభకు నామినేట్ అవడంపై పలు పార్టీలు ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో ఈమేరకు స్పందించారు. మంగళవారం గువాహటిలోని తన నివాసంలో గొగోయ్ విలేకరులతో మాట్లాడుతూ తాను బుధవారం ఢిల్లీకి వెళ్తానని చెప్పారు. ‘ముందు నన్ను రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేయనివ్వండి. తర్వాత ఈ నామినేషన్‌ను ఎందుకు అంగీకరించానో వివరంగా చెప్తాను’అని అన్నారు. రాజ్యసభ నామినేటెడ్ సభ్యుల్లో ఒకరు పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలో రంజన్‌గొగోయ్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పలు రాజకీయ పార్టీలు గొగోయ్ నామినేషన్‌పై దుమారం రేపాయి. కాగా, రంజన్ గొగోయ్ 13 నెలల పాటు సీజేఐగా తన సేవలందించిన అనంతరం గతేడాది నవంబర్‌లో పదవీ విరమణ పొందారు. తన నామినేషన్‌పై వచ్చిన విమర్శలపై గొగోయ్ స్పందిస్తూ ‘దేశ అభివృద్ధి కోసం శాసన, న్యాయ వ్యవస్థలు ఏదో ఒక సమయంలో కలిసి పనిచేయాల్సిన అవసరముందనే నమ్మకంతోనే నేను రాజ్యసభ నామినేషన్‌ను అంగీకరించాను’అని తెలిపారు. కాగా, గొగోయ్‌ను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ‘గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేసే ముందు ప్రధాని మోదీ.. దివంగత, మాజీ న్యాయ మంత్రి అరుణ్ జైట్లీ సలహాను పరిగణలోకి తీసుకున్నారా?’అని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ట్విట్టర్లో ప్రశ్నించారు. న్యాయ స్వతంత్రతను అణగదొక్కడమే రంజన్ గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడం ఒక పనికి మాలిన చర్య అని, ఇది న్యాయ స్వతంత్రతను అణగదొక్కేలా ఉందని వామపక్ష పార్టీలు ఆరోపించాయి. న్యాయ అధికారులు, ఉన్నత ప్రభుత్వ పదవుల్లో పనిచేసిన వారు పదవీ విరమణ పొందిన తర్వాత లాభం పొందే ఎలాంటి పోస్టులోకి వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించాలని సీపీఐ డిమాండ్చేసింది. న్యాయవ్యవస్థ, స్వతంత్రతను తుంగలో తొక్కారు నిష్పక్షపాత న్యాయ వ్యవస్థ, స్వతంత్రత వంటి ఉన్నత విలువలను రంజన్ గొగోయ్ తుంగలో తొక్కారని మాజీ సుప్రీంకోర్టు జడ్జి కురియన్ జోసెఫ్ పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై ఒక సాధారణ పౌరుడికి ఉన్న నమ్మకాన్ని రాజ్యసభ నామినేషన్‌ను అంగీకరించడం ద్వారా గొగోయ్ వమ్ము చేశారని ఆరోపించారు. -
గొగోయ్ నిర్ణయం సబబేనా?
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నాలుగు నెలలక్రితం పదవీ విరమణ చేసిన జస్టిస్ రంజన్ గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేస్తూ సోమవారం రాష్ట్రపతి నోటిఫికేషన్ వెలువడ్డాక నలు మూలలనుంచీ విమర్శలు మొదలయ్యాయి. జాతి నిర్మాణంలో శాసన, న్యాయవ్యవస్థలు రెండూ కలసికట్టుగా పనిచేయాలన్న తన దృఢ నిశ్చయానికి అనుగుణంగానే దీన్ని అంగీకరించానంటున్నారు జస్టిస్ గొగోయ్. పెద్దల సభలో ప్రమాణస్వీకారం చేశాక దీనిపై మరింత వివరణ ఇవ్వదల్చుకున్నట్టు ప్రకటించారు. న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆయన గురించి అందరికీ తెలిసింది చాలా తక్కువ. 2018 జనవరిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దీపక్ మిశ్రా ఉండగా ఆయన పనితీరుపై బాహాటంగా విమర్శలు చేసిన నలుగురు సీనియర్ న్యాయమూర్తుల్లో జస్టిస్ గొగోయ్ ఒకరు కావడంవల్లా, జస్టిస్ మిశ్రా అనంతరం ఆయనే బాధ్యతలు చేపట్టవలసివుంది గనుక, ఇతరులకన్నా ఆయనపై అందరి దృష్టి పడింది. ఆ తర్వాత జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ), రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు, రామజన్మభూమి వివాదం తదితర కేసుల్లో తీర్పులు వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనాలకు నేతృత్వం వహించడం వల్ల జస్టిస్ గొగోయ్ వార్తల్లో నిలిచారు. సుప్రీంకోర్టు మహిళా ఉద్యోగిని ఆయన లైంగికంగా వేధించారన్న ఆరోపణలు, ఆ విషయంలో బాధితురాలికి ఎదురైన సమస్యలు వగైరాల వల్లకూడా జస్టిస్ గొగోయ్ గురించి విస్తృతంగా చర్చ జరిగింది. ఇప్పుడు జస్టిస్ గొగోయ్‌కి పదవి ఇవ్వడంపై స్వరం పెంచి విమర్శిస్తున్నవారిలో కాంగ్రెస్ నేతలు అందరికన్నా ముందున్నారు. ఈ నిర్ణయం న్యాయవ్యవస్థ స్వతంత్రతపై అనుమానాలు రేకెత్తి స్తుందని... సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికుండే గౌరవప్రపత్తులకు భంగం కలిగిస్తుందని ఆ విమర్శల సారాంశం. సహజంగానే బీజేపీ ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. న్యాయవ్యవస్థ స్వతంత్రతపై అనుమానాలు రేకెత్తించడం మాటేమోగానీ, తన పాలనాకాలంలో ఇలాంటి పనులే చేసిన కాంగ్రెస్ విమర్శలకు దిగడం... ఇతరులకన్నా రెచ్చిపోయి మాట్లాడటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలాంటి అంశాల్లో విమర్శించే నైతికార్హత ఆ పార్టీకి ఎక్కడదన్న అనుమానం కలుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ మరణించిన స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన కుటుంబాన్ని ఇబ్బందులపాలు చేయడానికి, ప్రత్యేకించి ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టడానికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై ఏం చేశాయో ఎవరూ మర్చిపోలేదు. జగన్మోహన్ రెడ్డిపై అక్రమార్జన ఆరోపణలు చేస్తూ ఆ పార్టీలు రెండూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఆ పార్టీలు కోరినట్టే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిసార్ అహ్మద్ కక్రూకు పదవీ విరమణానంతరం నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ పదవి కట్టబెట్టిన ఘనత కాంగ్రెస్‌ది. ఇంకా వెనక్కుపోతే జస్టిస్ బహరుల్ ఇస్లాం మొదలుకొని రంగనాథ్ మిశ్రా, ఫాతిమా బీవీ వంటివారెందరికో ఆ పార్టీ ఇదే మాదిరిగా పదవులిచ్చింది. అందరికన్నా జస్టిస్ బహరుల్ ఇస్లాం గురించి చెప్పుకోవాలి. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికై 1972లో ఆ పదవికి రాజీనామా చేసి గౌహతి హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం అదే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి 1979లో రిటైరయ్యాక ఆ మరుసటి సంవత్సరమే ఆయన్ను మళ్లీ పిలిచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించారు. 1983లో ఆయనకు మరోసారి రాజకీయాలపై మోజు ఏర్పడి పదవిని వదులుకుని అసోం నుంచి లోక్‌సభకు కాంగ్రెస్ తరఫున పోటీచేశారు. అప్పట్లో ఉద్రిక్త పరిస్థితులు ఉండటంతో ఆ ఎన్నిక వాయిదా పడింది. దాంతో కాంగ్రెస్ ఆయన్ను రాజ్యసభకు పంపింది. ఇందిరాగాంధీ తిరుగులేని అధికారం చలాయిస్తున్న కాలంలో ఇలా ఇష్టానుసారం అటునుంచి ఇటూ... ఇటునుంచి అటూ ఒక వ్యక్తిని మార్చుతూ పోయినప్పుడు న్యాయవ్యవస్థ ఉన్నత ప్రమాణాలు ఆ పార్టీకి పట్ట లేదు. అనంతరకాలంలో రంగనాథ్ మిశ్రా, ఫాతిమా బీవీ, కక్రూ వగైరాలకు పదవులిచ్చినప్పుడు కూడా అవి గుర్తుకు రాలేదు. న్యాయవ్యవస్థలో ఉంటూ తమ నిర్ణయాల ద్వారా సమాజాన్ని ప్రభావితం చేసినవారు పదవీ విరమణ అనంతరం ప్రభుత్వాలిచ్చే రాజకీయ పదవులు చేపట్టడం సరికాదని వాదిస్తున్నవారు అనే కులున్నారు. ఎవరిదాకానో ఎందుకు... బీజేపీ నాయకులు స్వర్గీయ అరుణ్ జైట్లీ, ప్రస్తుత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వంటివారు న్యాయమూర్తులు రిటైరయ్యాక ప్రభుత్వాలిచ్చే పదవుల్ని అంగీక రించరాదని అభిప్రాయపడ్డారు. ఈ పదవుల్ని ఆశించి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు రాస్తు న్నారని జైట్లీ ఆరోపించారు కూడా. సీవీసీ పదవిలో పనిచేసి పదవీ విరమణ చేసినవారు మరే పదవి చేపట్టరాదన్న నిబంధన వుంది. దురదృష్టవశాత్తూ న్యాయమూర్తుల విషయంలో అటువంటిది లేదు. మన రాజ్యాంగ నిర్మాతలే దీన్ని ఊహించి తగిన నిబంధనలు పొందుపరిచివుంటే బాగుండేది. కానీ భవిష్యత్తులో ఇలాంటి దుస్థితి ఏర్పడుతుందని వారి ఊహకు అందకపోయి ఉండొచ్చు. పదవీ విరమణ తర్వాత న్యాయమూర్తులు కొన్నేళ్లపాటు ఏ పదవీ చేపట్టరాదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ కేటీ థామస్, జస్టిస్ లోథాలు హితవు పలికారు. అయితే ఇలాంటి హితవచనాలు పట్టించుకునేవారెవరు? జస్టిస్ గొగోయ్ మాదిరే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా రిటైరైన నాలుగు నెలలకే జస్టిస్ సదాశివం 2014లో కేరళ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఇలా పదవులు చేపట్టడం న్యాయవ్యవస్థ స్వతంత్రతకు మాయని మచ్చని సీజేగా పనిచేసినప్పుడు చెప్పిన జస్టిస్ గొగోయ్... ఇప్పటి తన నిర్ణయంపై ఏం చెబుతారో దేశమంతా ఎదురుచూస్తోంది. -
రాజ్యసభకు మాజీ సీజేఐ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌ని కేంద్రం రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కేటీఎస్ తులసి రిటైర్మెంట్తో ఖాళీ అయిన స్థానంలో జస్టిస్ గొగోయ్‌ని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. గత ఏడాది నవంబర్ 9న సున్నితమైన అయోధ్య కేసులో తీర్పు ప్రకటించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి జస్టిస్ గొగోయ్ నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. అదే నెలలో ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. రఫేల్ ఫైటర్ జెట్స్ కేసును, శబరిమలలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసును కూడా ఆయన విచారించారు. అయోధ్య కేసులో 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం మొత్తాన్ని రామాలయ నిర్మాణం కోసం వినియోగించాలని ఆయన తీర్పునిచ్చారు. మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోని మరో ప్రముఖ ప్రాంతంలో ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశించారు. సీజేఐగా పదవీకాలంలో లైంగిక వేధింపుల ఆరోపణ సహా పలు వివాదాలను ఆయన ఎదుర్కొన్నారు. రఫేల్ ఫైటర్ జెట్ డీల్‌లో మోదీ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చిన ధర్మాసనానికి కూడా జస్టిస్ గొగొయే నేతృత్వం వహించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు చట్టం పరిధిలోకే వస్తుందని సంచలన తీర్పునిచ్చింది కూడా ఆయన నేతృత్వంలోని ధర్మాసనమే. ఎన్నార్సీ ప్రక్రియను సమీక్షించిన బెంచ్‌కు కూడా జస్టిస్ గొగోయ్ నేతృత్వం వహించారు. రాజ్యసభకు నామినేట్ అవుతున్న తొలి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆయనే కావడం విశేషం. మాజీ సీజేఐ రంగనాథ్ మిశ్రా కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కానీ, ఆయన నామినేటెడ్ సభ్యుడు కాదు. కాంగ్రెస్ తరఫున ఎగువ సభకు ఎన్నికయ్యారు. -
వీకెండ్ స్పెషల్ : వార్తల్లో వ్యక్తులు
రంజన్ గొగోయ్ దేశ రాజకీయాలను మలుపుతిప్పే ఎన్నో తీర్పులు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ వెలువరించారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న రామజన్మభూమి– బాబ్రీ మసీదు సమస్యని పరిష్కరిస్తూ తీర్పునిచ్చారు. సీజేఐ కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి చేర్చారు. ఆయన పదవీ విరమణకు ఏడెనిమిది రోజుల ముందు ఈ కీలక తీర్పులు వెలువడటం విశేషం. టీఎన్ శేషన్ దేశం గర్వించదగ్గ ఐఏఎస్ అధికారి టీఎన్శేషన్. నీతికీ, నిజాయితీకీ, నిఖార్సయిన వ్యక్తిత్వానికీ పర్యాయపదంగానే ఆయన్ను చెప్పాలి. భారత ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళనకు నడుం బిగించిన శేషన్... ఎన్నికల సంస్కర్త గా పేరొందారు. ఆయన చెన్నైలో నవంబర్ 10న కన్నుమూయడం ప్రజాస్వామ్య కాంక్షాపరులందర్నీ దుఃఖసాగరంలో ముంచింది. పీఎస్ కృష్ణన్ దళిత ఆదివాసీల పక్షపాతి, నిత్య ఉద్యమకారుడు, ప్రజాస్వామ్య కాంక్షాపరుడు అయిన సీనియర్ ఐఏఎస్ అధికారి పీఎస్.కృష్ణన్ కూడా నవంబర్ పదోతేదీన టీఎన్.శేషన్ కన్నుమూసిన రోజునే మరణించారు. కేరళలోని తిరువనంతపురంలో అగ్రవర్ణ కుటుంబంలో జన్మించిన కృష్ణన్ చివరి శ్వాస వరకు అణగారిన వర్గాల కోసం అవిశ్రాంతంగా పోరాడారు. భగత్ సింగ్ కొష్యారీ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ సంసిద్ధంగా లేకపోవడంతో రాష్ట్రపతి పాలనను పరిశీలించాల్సిందిగా కేంద్రానికి నివేదిక ఇచ్చారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్రతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. షఫాలీ వర్మ హరియాణాలోని రోహతక్‌కు చెందిన పదిహేనేళ్ళ షఫాలీ వర్మ క్రికెట్ దిగ్గజం, కొన్ని దశాబ్దాల పాటు క్రికెట్ సామ్రాజ్యాన్నేలిన సచిన్ టెండూల్కర్ రికార్డుని బద్దలు కొట్టి ప్రపంచం లోనే అతిచిన్న వయ స్సులో అర్ధ సెంచరీ సాధించిన ద్వితీయ మహిళగా నిలిచారు. -
సీజేఐ గొగోయ్‌కి వీడ్కోలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ ఆదివారం పదవీ విరమణ చేయనున్నారు. సీజేఐ హోదాలో శుక్రవారమే ఆయనకు చివరి వర్కింగ్ డే. 2018, అక్టోబర్ 3న సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గొగోయ్ బాధ్యతలు స్వీకరించారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి న్యాయవ్యవస్థలో ఈ స్థాయికి ఎదిగిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. వివాదం.. సుప్రీంకోర్టులోని ఒక ఉద్యోగిని లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగా వెంటనే స్పందించిన జస్టిస్ గొగోయ్.. ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీ వేశారు. జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ఆ కమిటీలో ఇద్దరు మహిళా జడ్జీలు జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఇందిర బెనర్జీలకు స్థానం కల్పించారు. విచారణ అనంతరం ఆ కమిటీ జస్టిస్ గొగోయ్‌కి క్లీన్చిట్ ఇచ్చింది. తిరుగుబాటు.. 2018 జనవరిలో నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి సంచలనం సృష్టించిన నలుగురు సీనియర్ జడ్జీల్లో(గ్యాంగ్ ఆఫ్ ఫోర్) జస్టిస్ గొగోయ్ కూడా ఒకరు. కేసుల కేటాయింపులో సీనియర్ న్యాయమూర్తులపై వివక్షకు పాల్పడుతున్నారంటూ జస్టిస్ మిశ్రాకు వ్యతిరేకంగా నాడు జస్టిస్ గొగోయ్‌తో పాటు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ మదన్ లోకూర్‌లు గళం విప్పిన విషయం తెలిసిందే. ఇటీవలి కీలక తీర్పులు జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని పలు ధర్మాసనాలు కీలక తీర్పులను వెలువరించాయి. వాటిలో ముఖ్యమైనది, అయోధ్యలోని వివాదాస్పద స్థలం శ్రీరాముడికే చెందుతుందని స్పష్టం చేస్తూ ఇచ్చిన తీర్పు. శతాబ్దాల వివాదానికి ఆ తీర్పు తెర దించింది. రఫేల్ డీల్‌లో మోదీ ప్రభుత్వానికి క్లీన్ చిట్, శబరిమల సహా సంబంధిత వివాదాలను విస్తృత ధర్మాసనానికి నివేదించడం, ఆర్టీఐ పరిధిలోకి సుప్రీంకోర్టు తదితరాలు వీటిలో కొన్ని. జస్టిస్ గొగోయ్ శుక్రవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి హోదాలో చివరిసారి సుప్రీంకోర్టులోని కోర్టు నంబర్ 1లో కొద్దిసేపు ఆశీనులయ్యారు. కానీ కేసుల విచారణేదీ చేపట్టలేదు. అనంతరం రాజ్‌ఘాట్‌కు వెళ్లి.. మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. శుక్రవారం 650 మంది హైకోర్టు జడ్జీలతో, 15 వేల మంది న్యాయాధికారులతో సీజేఐ జస్టిస్ గొగోయ్ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి రికార్డు సృష్టించారు. వృత్తి జీవితంలో సవాళ్లను తాను కోరుకున్నానని ఈ సందర్భంగా జస్టిస్ గొగోయ్ వారికి చెప్పారు. కష్టాల వల్ల పట్టుదల మరింత పెరుగుతుందన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం న్యూఢిల్లీ: పదవీ విరమణ చేయనున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌కి శుక్రవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) వీడ్కోలు పలికింది. ఆదివారం పదవీ విరమణ చేయనున్న జస్టిస్ గొగోయ్‌కి శుక్రవారమే చివరి పనిదినం కావడంతో బార్ అసోసియేషన్ ఆయనకు వీడ్కోలు పలుకుతూ సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో ఎవరూ ఎలాంటి ప్రసంగాలు చేయలేదు. అట్టహాసాలు లేకుండా, నిరాడంబరంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే సహా అత్యున్నత న్యాయస్థానంలోని దాదాపు అందరు జడ్జీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జస్టిస్ గొగోయ్ ఆకాంక్ష మేరకే ఈ కార్యక్రమాన్ని సింపుల్‌గా నిర్వహిస్తున్నామని ఎస్సీబీఏ కార్యదర్శి ప్రీతి సింగ్ వెల్లడించారు. సుప్రీంకోర్టులో పనిచేసిన అత్యున్నత న్యాయమూర్తుల్లో జస్టిస్ గొగోయ్ ఒకరని ఎస్సీబీఏ అధ్యక్షుడు రాకేశ్‌ఖన్నా ప్రశంసించారు. జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణల పక్కన కూర్చున్న జస్టిస్ గొగోయ్.. ఇతర న్యాయమూర్తులతో కబుర్లు చెబుతూ, న్యాయవాదుల నుంచి బొకేలు స్వీకరిస్తూ సరదాగా కనిపించారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలు కూడా జడ్జీలతో పాటు కూర్చున్నారు. -
రాఫెల్‌పై మోదీ సర్కారుకు క్లీన్చిట్
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి, ఫ్రాన్స్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఎటువంటి అవకతవకలు జరగలేదు. గతంలో ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లలో ఎలాంటి పస లేదు. కాబట్టి గతంలో మేం కేంద్రానికి ఇచ్చిన క్లీన్చిట్కే కట్టుబడి ఉన్నాం. ఈ అంశంపై మోదీని ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు తప్పు. 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం.. దీనికి సంబంధించి ఫ్రాన్స్‌కు చెందిన దసో ఏవియేషన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం.. దీనికి అనుసరించిన విధానంలో ప్రభుత్వం తరఫున ఎలాంటి అవకతవకలు జరగలేదని గతేడాది డిసెంబర్ 14న సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లు సహేతుకంగా లేవని తాజాగా గురువారం కొట్టివేసిన ధర్మాసనం.. దీనిపై గతంలో ఇచ్చిన తీర్పునకే కట్టుబడి ఉన్నట్టు ప్రకటించింది. రూ.58 వేల కోట్ల విలువైన ఒప్పందం చుట్టూ నెలకొన్న వివాదంపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలన్న అభ్యర్థనలను కూడా తిరస్కరించింది. న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో మోదీ ప్రభుత్వానికి మరోసారి ఊరట లభించింది. గతంలో ఇచ్చిన తీర్పుని పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లను విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రివ్యూ పిటిషన్లలో ఎలాంటి పస లేదని సుప్రీం స్పష్టంచేసింది. గతంలో కేంద్రానికిచ్చిన క్లీన్ చిట్కే కట్టుబడి ఉన్నట్టుగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు ఇచ్చింది. ఫ్రాన్స్‌కు చెందిన దసో ఏవియేషన్‌తో కుదుర్చుకున్న 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం, దానికి అనుసరించిన విధానంలో ప్రభుత్వం తరఫున ఎలాంటి అవకతవకలు జరగలేదని 2018, డిసెంబర్ 14నే సుప్రీం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుని పునఃసమీక్షించాలని కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, లాయర్ ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లు సహేతుకంగా లేవని సుప్రీం స్పష్టంచేసింది. 58 వేల కోట్ల విలువైన ఒప్పందం చుట్టూ నెలకొన్న వివాదంపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలన్న అభ్యర్థనల్ని కూడా తిరస్కరించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అంశాలేవీ అందులో లేవని న్యాయమూర్తులంతా ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా జస్టిస్ కౌల్ తీర్పు చదివి వినిపించారు. తీర్పుపై తాను ఏకీభవిస్తానని చెబుతూనే... కొన్ని అంశాల్లో తనకు వేరే అభిప్రాయాలు ఉన్నాయంటూ జస్టిస్ జోసెఫ్ విడిగా తీర్పు ఇచ్చారు. అందుకు గల కారణాలను వెల్లడించారు. మే 10న రివ్యూ పిటిషన్లపై తీర్పుని రిజర్వ్ చేసిన సుప్రీం కోర్టు... ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న అంతర్ ప్రభుత్వ ఒప్పందంలో (ఐజీఏ) సాంకేతిక సహకారం బదిలీని ఎందుకు చేర్చలేదని, ఒప్పందానికి సంబంధించి సార్వభౌమ పూచీకత్తుని ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా విచారణ సంస్థలు కేసుల్ని నమోదు చేయలేవని కోర్టుకు విన్నవించారు. ఇక టెక్నాలజీ బదిలీ వంటి అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని చెప్పారు. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి: అమిత్ షా రాఫెల్ ఒప్పందంపై సుప్రీం ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారానికి సరైన సమాధానమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సుప్రీం తీర్పు వెల్లడయ్యాక ఆయన వరస ట్వీట్లు చేశారు. ఎన్డీయే ప్రభుత్వంపై, బీజేపీ నాయకులపై నిరాధార ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలందరూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ జాగ్రత్తగా ఉండండి: సుప్రీం కోర్టు చీవాట్లు కోర్టు ధిక్కార కేసులన్నీ క్లోజ్ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో ప్రధాని మోదీనుద్దేశించి చౌకీదార్ చోర్ హై (కాపలదారుడే దొంగ) అని వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టింది. రాహుల్ వ్యాఖ్యలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని, భవిష్యత్‌లో ఈ తరహా వ్యాఖ్యలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. రాఫెల్ ఒప్పందంలో అవకతవకలేవీ జరగలేదని కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా అప్పట్లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ పదే పదే అదే వ్యాఖ్య చేసి ప్రధాని పరువు తీశారని, ఇదంతా కోర్టు ధిక్కారం కిందకి వస్తుందని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి రాహుల్‌కు వ్యతిరేకంగా కేసు వేశారు. దీన్ని విచారించిన ప్రధానన్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగాయ్, జస్టిస్ ఎస్కే పాల్, జస్టిస్ కేఎం జోసెఫ్ రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘రాజకీయాల్లో కీలకమైన హోదా అనుభవిస్తున్న రాహుల్ వాస్తవాలు పరిశీలించకుండా ప్రధానికి వ్యతిరేకంగా మాట తూలడం దురదృష్టకరం’అని వ్యాఖ్యానించారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలు కోర్టు తీర్పునుద్దేశించి చేసినవి కాదని, అవి పూర్తిగా రాజకీయ వ్యాఖ్యలని గతంలోనే రాహుల్ అఫడివిట్ దాఖలు చేశారు. ఇప్పుడు రాహుల్ కోర్టుకి బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో ధిక్కార కేసుల్ని మూసివేస్తున్నట్టుగా న్యాయమూర్తులు ప్రకటించారు. రాఫెల్‌పై విచారణ జరపాల్సిందే: రాహుల్ రాఫెల్ ఒప్పందంపై తీర్పు వెలువరించిన జస్టిస్ కేఎం జోసెఫ్ పేర్కొన్న అంశాల ఆధారంగా దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి పేర్కొన్నారు. ‘సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ పేర్కొన్న అంశాలు రాఫెల్ కుంభకోణంపై విచారణకు మార్గం చూపాయి. దీనిపై ఇప్పుడు దర్యాప్తు పూర్తిస్థాయిలో జరగాలి. ఈ స్కాంపై జేపీసీ కూడా వేయాలి’అని గురువారం ఆయన ట్విట్టర్లో డిమాండ్ చేశారు. రాఫెల్ ఒప్పందం విషయంలో బీజేపీ ప్రజలను మోసం చేస్తోందని, సుప్రీంకోర్టు తీర్పుతో పండగ చేసుకోవడం మాని విచారణపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా కోరారు. కాంగ్రెస్ సంధించిన ప్రశ్నలు 1. జాతీయ భద్రతా ముసుగులో యుద్ధ విమానాల ధరను వెల్లడించకపోవడం ఎంతవరకు సరైనది ? ధర తడిసిమోపెడవడానికి కారణాలేంటి ? 2. రిలయెన్స్‌ను ఆఫ్సెట్ భాగస్వామిగా ఎంచుకోవాల్సిన అవసరం ఏమిటి ? 3. దేశీయ విమానాల తయారీ సంస్థ హాల్‌ను ఎందుకు పక్కన పెట్టారు ? 4. ఒప్పందం కుదుర్చుకునే క్రమంలో పరిణామాలు ఎలా జరిగాయి ? -
విస్తృత ధర్మాసనానికి ‘శబరిమల’
శబరిమల అంశం మతపరమైన ఆచారాలు, విశ్వాసాలకు సంబం ధించి అనేక ప్రశ్నలు లేవనెత్తింది. ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయడం అంటే, సమస్య ఇంకా పరిష్కారం కాలేదని అర్థం. మతపరమైన ప్రార్థన స్థలాల్లోకి మహిళలను నిరాకరించే విషయం శబరిమల ఆలయానికి మాత్రమే పరిమితం కాదు. అది ఇతర మతాల అంశాలకూ వర్తిస్తుంది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశం అంశాన్ని.. సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. కేరళలోని ఈ ఆలయంలోకి రుతుక్రమ వయసు మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం గతేడాది తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును పునఃపరిశీలించాలని దాఖలైన రివ్యూ పిటిషన్లను సమీక్షించిన సుప్రీంకోర్టు.. ఈ అంశాన్ని విస్తృత స్థాయి ధర్మాసనానికి అప్పగించింది. శబరిమల వంటి అంశం హిందూ మతానికి మాత్రమే పరిమితం కాదన్న కోర్టు.. ముస్లిం, పార్శీ మహిళలపై ఆయా మతాల్లో కొనసాగుతున్న వివక్షనూ పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు, అమ్మాయిల ప్రవేశం అంశాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం ఏడుగురు సభ్యుల విస్తృతస్థాయి ధర్మాసనానికి అప్పగించింది. దశాబ్దాలుగా అయ్యప్ప ఆలయంలోకి రుతుక్రమ వయసు మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది తీర్పునిచ్చింది. ఈ తీర్పుని పునః పరిశీలించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లను సమీక్షించిన కోర్టు ఈ అంశాన్ని ఏడుగురు సభ్యుల విస్తృతస్థాయి ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ సందర్భంగా శబరిమలలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతిస్తే అది ఒక్క హిందూ మహిళలకే పరిమితంకాదని, ముస్లిం, పార్శీ మహిళలపై ఆయా మతాల్లో జరుగుతున్న వివక్షనూ పరిశీలిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. ముస్లిం మహిళలను మసీదు, దర్గాలోకి అనుమతించకపోవడం, పార్శీ మహిళలు.. పార్శీయేతర పురుషులను పెళ్లాడటంపై నిషేధం, బొహ్రా వర్గాల్లో జరుగుతున్న జనన అవయవాల కత్తిరింపుల్లాంటి అంశాలను విస్తృతధర్మాసనం చర్చిస్తుందని కోర్టు పేర్కొంది. సంపూర్ణ న్యాయం అందించేందుకు కోర్టు ఈ అంశాలపై న్యాయవిధానాలను రూపొందించాల్సిన సమయం ఇదేనని తన తొమ్మిదిపేజీల తీర్పుని వెలువరిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గత తీర్పుపై స్టే ఇవ్వాలన్న అంశంపై స్పందిస్తూ విస్తృత ధర్మాసనానికి ఈ అంశాన్ని బదిలీ చేయడం అంటే సమస్య ఇంకా పరిష్కారం కాలేదని అర్థమని సీజేఐ రంజన్ గొగోయ్ వ్యాఖ్యానించారు. జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని జస్టిస్ నారీమన్, జస్టిస్ ఖన్వీల్కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాల ధర్మాసనం శబరిమల వివాదాన్ని పునఃపరిశీలించే అంశాన్ని 3:2 మెజార్టీ తీర్పుతో విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. అయితే 2018 సెప్టెంబర్‌లో ఇచ్చిన తీర్పు అమలుకాకుండా స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసే అంశాన్ని ఐదుగురు సభ్యుల బెంచ్ ఆమోదించినా, అన్ని వయస్సుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతిస్తూ 2018 సెప్టెంబర్‌లో ఇచ్చిన తీర్పుని సమీక్షించాలని కోరడాన్ని జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు విభేదించారు. సుప్రీంకోర్టు 2018 సెప్టెంబర్ తీర్పు అనంతరం దాఖలైన 65 పిటిషన్లు, 56 రివ్యూ పిటిషన్లు, కొత్తగా దాఖలైన నాలుగు రిట్ పిటిషన్లు, ఐదు అప్పీళ్ళను డిస్మిస్ చేయడాన్ని ఈ ఇద్దరు న్యాయమూర్తులు వ్యతిరేకించారు. శబరిమల ఒక్కటే కాదు.. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తన తరఫున, జస్టిస్ ఎఎం. ఖన్వీల్కర్, ఇందు మల్హోత్రాల తరఫున తీర్పుని చదివి వినిపిస్తూ ఈ అంశం మతపరమైన ఆచారాలూ, విశ్వాసాలకు సంబంధించి అనేక ప్రశ్నలు లేవనెత్తిందన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం శబరిమలలాంటి మతపరమైన ప్రార్థనా స్థలాలపై ఒకే రకమైన విధానాలను రూపొందించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ‘మతపరమైన ప్రార్థనాస్థలాల్లోనికి మహిళలను నిరాకరించే విషయం కేవలం శబరిమల ఆలయానికి మాత్రమే పరిమితం కాదనీ. ఇది ఇతర మతాల అంశాలకు వర్తిస్తుంది’ అని కోర్టు వ్యాఖ్యానించింది. 2018 సెప్టెంబర్ తీర్పు ఏం చెప్పింది? శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ 2018 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ధర్మాసనం 4ః1 సభ్యుల ఆమోదంతో తీర్పునిచ్చింది. రుతుక్రమం వయస్సులో ఉండే మహిళలు, అమ్మాయి లను శబరిమల ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగంలోని సమానత్వ భావనకు భిన్నమైనదని వ్యాఖ్యానించింది. ఈ యేడాది ఫిబ్రవరిలో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ శబరిమల తీర్పుని రిజర్వ్‌లో ఉంచడం తెల్సిందే. తీర్పుకి వ్యతిరేకంగా నాడు వెల్లువెత్తిన నిరసనలు కేరళలోనూ, ఇతర ప్రాంతాల్లోనూ సుప్రీంతీర్పు(2018)కి వ్యతిరేకంగా నాడు హిందూత్వవాదులు, సంఘ్‌పరివార్ లాంటి సంస్థలు పెద్దఎత్తున నిరసన తెలిపాయి. 10 నుంచి 50 ఏళ్ళలోపు వయస్సు మహిళలు అనేక మంది శబరిమల ఆలయప్రవేశానికి ప్రయత్నించారు. కొందరు సఫలమయ్యారు. మరికొందరు వెనుతిరగాల్సి వచ్చింది. అయ్యప్ప భక్తుల కోసం ఈనెల 17న దేవాలయాన్ని తెరవనున్నారు. దేవాలయం తెరుచుకోవడానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఈ తీర్పు రావడంతో ఆలయంలోకి ప్రవేశంపై సందిగ్ధత నెలకొంది. -
శబరిమల కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ
-
శబరిమల కేసు: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది. తీర్పును వెలువరిస్తున్న సమయంలో సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మతమంటే ఏంటి? మత విశ్వాసాలు ఏమున్నాయి? అనే అంశంపై చర్చ జరపాలని పిటిషనర్లు మమ్మల్ని కోరారు. నిజానికి ప్రతీ ఒక్కరికీ మత స్వేచ్ఛ ఉంది. ప్రార్థన చేసుకునే హక్కుకు లింగభేదం లేదు. అయితే ఈ కేసు కేవలం ఒక్క శబరిమల ఆలయానికే పరిమితం కాదు. మసీదులో ముస్లిం మహిళలు, బోరాలో పార్శీ మహిళల ప్రవేశాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఈ కేసులో దాఖలైన 65 పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. కాగా శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు గతేడాది సెప్టెంబరులో తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు హిందూ సంఘాలు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 65 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో రివ్యూ పిటిషన్లను సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ నారీమన్, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ నేపథ్యంలో ఈ కేసును ఎటూ తేల్చని ఐదుగురు జడ్జీల బెంచ్ దీనిని ఏడుగురు జడ్జీలున్న రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని జస్టిస్ నారీమన్, జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యతిరేకించగా.. మెజారిటీ జడ్జీల నిర్ణయం మేరకు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.(చదవండి : ‘ఆ తీర్పును పక్కనపెట్టాలి’) మరోవైపు.. సున్నిత అంశమైన ఈ కేసులో తీర్పు వెలువడుతుండటంతో శబరిమలలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ నెల 16 శబరిమల అయ్యప్ప ఆలయ తలుపులు తెరుచుకోనుండటంతో అక్కడ ఏకంగా 10 వేల మందితో భద్రత ఏర్పాటు చేశారు. కాగా గతంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 2న శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించిన విషయం తెలిసిందే. -
ట్రిబ్యునల్స్‌పై నిబంధనల కొట్టివేత
న్యూఢిల్లీ: ట్రిబ్యునల్స్‌పై కేంద్రం రూపొందిం చిన నిబంధనలను సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. కేంద్రానికి ఎదురుదెబ్బలాంటి ఈ తీర్పు వివరాల్లోకి వెళితే... జుడీషియల్ ట్రిబ్యునల్స్ కూర్పు, విధివిధానాలపై ‘ఫైనాన్స్ యాక్ట్ 2017’ మనీ బిల్లు కింద కేంద్రం కొన్ని కీలక నిబంధనలను తెచ్చింది. వివిధ ట్రిబ్యునళ్ల సభ్యుల నియామకాలు, సర్వీస్ నిబంధనలకు సంబంధించిన ఈ నిబంధనావళి పట్ల ప్రతిపక్ష పార్టీల సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ నియమాలను తోసిపుచ్చుతూ, వీటి అమలు ప్రభావాలను అధ్యయనం చేసి, అత్యున్నత న్యాయస్థానానికి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. మనీ బిల్లుగా ఫైనాన్స్ యాక్ట్ 2017 ఆమోదించడంలో చట్టబద్దతను పరిశీలించడానికి ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి సైతం ఐదుగురు సభ్యుల ధర్మాసనం నివేదించింది. 2017 ఫైనాన్స్ చట్టం 184వ సెక్షన్ కింద ఈ నిబంధనలను కేంద్రం రూపొందించిన అంశాన్ని ధర్మాసనం ప్రస్తావిస్తూ, అయితే ఈ నియామకపు ప్రక్రియ ప్రస్తుతం అమల్లో ఉన్న విధి విధానాలకు భంగం కలిగించేదిగా ఉందని పేర్కొంది. -
శబరిమల, రాఫెల్‌పై తీర్పు నేడే
న్యూఢిల్లీ: దశాబ్దాలుగా నెలకొన్న అయో«ధ్య వివాదంపై ఇటీవల తుది తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు మరో మూడు కీలక అంశాలపై తీర్పు ఇవ్వనుంది. శబరిమలలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశం, రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందంలో అక్రమాలు, రాఫెల్ తీర్పుపై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలకుగాను దాఖలైన ధిక్కరణ పిటిషన్లపై గురువారం తీర్పునివ్వనుంది. శబరిమల వివాదం.. శబరిమలలో ఉన్న ప్రముఖ అయ్యప్పస్వామి ఆలయంలోకి రుతుక్రమం (10 నుంచి 50 మధ్య వయస్సు)లోని స్త్రీల ప్రవేశంపై నిషేధం ఉంది. ఆలయంలోకి అన్ని వయస్సుల స్త్రీలను అనుమతిస్తూ 2018, సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ అనేక రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ధర్మాసనం వీటిపై విచారణ జరిపి ఫిబ్రవరి 6న తీర్పును రిజర్వులో ఉంచింది. రఫేల్ వివాదం రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు ఏమీ లేవని కేంద్ర ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇస్తూ 2018 డిసెంబర్ 14న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అయితే, ఈ కొనుగోలు ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను అణచిపెట్టి సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందన్న ఆరోపణలతో, ఈ తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరి, యశ్వంత్‌సిన్హా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై తీర్పుని మే 10న ధర్మాసనం రిజర్వ్‌లో పెట్టింది. అలాగే రాఫెల్‌పై సుప్రీంకోర్టును తప్పుగా అన్వయిస్తూ ‘కాపలాదారు దొంగ’అని ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకుగాను దాఖలైన ధిక్కరణపై పిటిషన్‌పై కూడా ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. -
ఆర్టీఐ పరిధిలోకి ‘సీజేఐ’
సమాచార హక్కు చట్టం... ఇకపై ఈ చట్టం పరిధిలోకి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కార్యాలయం కూడా వచ్చింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టే తేల్చి చెప్పింది. 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీం చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం సమర్థించింది. న్యాయవ్యవస్థ స్వతంత్రతను దృష్టిలో ఉంచుకొని పారదర్శకత కొనసాగాలనీ, పారదర్శకత న్యాయవ్యవస్థ స్వతంత్రతకు భంగకరంగా మారకూడదని వ్యాఖ్యానించింది. సీజేఐ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చేటప్పుడు పారదర్శకత, గోప్యతల మధ్య సమతుల్యత ఉండేలా చూసుకోవాల్సిన అవసరాన్ని కోర్టు నొక్కి చెప్పింది. న్యూఢిల్లీ: సామాన్యుడి చేతిలో పాశుపతాస్త్రం లాంటి సమాచార హక్కు చట్టం విస్తృతిని మరింత పరిపూర్ణం చేస్తూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ (సీజేఐ) కార్యాలయం సైతం సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని తేల్చి చెప్పింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సంపూర్ణంగా సమర్థించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్, కేంద్ర పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి దాఖలు చేసిన అప్పీళ్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. న్యాయవ్యవస్థ స్వతంత్రతను దృష్టిలో ఉంచుకొని పారదర్శకత కొనసాగాలని, పారదర్శకత న్యాయవ్యవస్థ స్వతంత్రతకు భంగకరంగా మారకూడదని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా సమాచార హక్కు చట్టాన్ని నిఘా సాధనంగా వాడకూడదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అయితే గోప్యత హక్కు ప్రాధాన్యత కలిగినదని, సీజేఐ కార్యాలయం నుంచి సమాచారం ఇవ్వాలని నిర్ణయించేటప్పుడు పారదర్శకత, గోప్యతల మధ్య సమతుల్యత ఉండేలా చూసుకోవాల్సిన అవసరాన్ని కోర్టు నొక్కిచెప్పింది. కొలీజియం సిఫారసు చేసిన న్యాయమూర్తుల పేర్లను వెల్లడించగలదని స్పష్టం చేసింది. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇతర సభ్యులుగా ఉన్నారు. హైకోర్టులో ప్రశాంత్ భూషణ్ వినిపించిన వాదనేమిటి? జడ్జీల నియామకాలు అంతుచిక్కని రహస్యంగా ఉన్నాయి. వాటిలో పారదర్శకత అవసరం ఉన్నదని ఆర్టీఐ కార్యకర్త అగర్వాల్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ హైకోర్టులో వాదించారు. జడ్జీలు మరో ప్రపంచంలో జీవిస్తున్నారా? అని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థ ప్రజల నిఘాకు మినహాయింపు కాదని, అతీతం అంతకన్నా కాదని ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. సమాచార హక్కు చట్టం కింద సమాచారమివ్వడాన్ని వ్యతిరేకించడం ‘దురదృష్టకరం. బాధాకరం’ అని అన్నారు. ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది? చీఫ్ జస్టిస్ కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెస్తూ జనవరి 10, 2010లో ఢిల్లీ హైకోర్టు ‘న్యాయవ్యవస్థ స్వతంత్రత న్యాయమూ ర్తి హక్కు కాదనీ, న్యాయమూర్తి బాధ్యత’అని అభివర్ణించింది. 2010లో నాటి ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏపీ షా, జస్టిస్ విక్రమ్‌జిత్ సేన్, ఎస్.మురళీధర్‌లతో కూడిన ధర్మాసనం 88 పేజీల తీర్పుని వెలువరించింది. చీఫ్ జస్టిస్ కార్యాలయాన్ని సమాచర హక్కు చట్టం పరిధిలోకి తేవడం వల్ల న్యాయవ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటుందన్న సుప్రీంకోర్టు వాదనను నాడు ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ తీర్పునిచ్చిన జస్టిస్ సేన్ రిటైరవగా, జస్టిస్ మురళీధర్ ప్రస్తుతం హైకోర్టు సిట్టింగ్ జడ్జిగా ఉన్నారు. సూత్రధారి ఆర్టీఐ కార్యకర్త అగర్వాల్ సీజేఐ కార్యాలయాన్ని ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలనే వాదన తొలుత తీసుకొచ్చింది ఆర్టీఐ కార్యకర్త సుభాష్ చంద్ర అగర్వాల్. జడ్జీల ఆస్తుల సమాచారాన్ని అందించాల్సిందిగా కోరుతూ అగర్వాల్ 2007లో సుప్రీంకోర్టుకి అప్పీల్ చేశారు. జడ్జీల నియామకాల్లో కొలీజియం, కేంద్రం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల సమాచారం ఇవ్వాలని కోరగా కోర్టు తిరస్కరించింది. దీంతో అగర్వాల్ కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)ని ఆశ్రయించారు. సీఐసీ అగర్వాల్‌కు అనుకూలంగా స్పందించింది. సీఐసీ ఉత్తర్వుల్ని ఢిల్లీ హైకోర్టులో సుప్రీంకోర్టు సవాల్ చేయడంతో 2010లో సీజేఐ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకొస్తుందని ఢిల్లీహైకోర్టు తీర్పుచెప్పగా దీన్ని బుధవారం సుప్రీంకోర్టు సమర్థించింది. సీజేఐ కార్యాలయాన్ని ఆర్టీఐ పరిధిలోకి ఎందుకు చేర్చాలి ► రాజ్యవ్యవస్థ మనుగడకు అవసరమైన అన్ని విభాగాల పనితీరు విషయంలో అత్యంత పారదర్శకతను ప్రదర్శించే సుప్రీంకోర్టు తన సొంత విషయాన్ని సైతం అదే కోణంలో చూడాలి. ► న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకత అవసరం ఉంది. ► కొలీజియంలోని న్యాయమూర్తుల అభిప్రాయాలకు విలువనిస్తున్నారా? లేదా? తెలుసుకోవాల్సిన బా«ధ్యత ప్రజలకు ఉంటుంది. ► సీఐసీ ఉత్తర్వుల అనంతరం సమాచారాన్ని వెల్లడించడంలో సుప్రీం కోర్టు సందేహించాల్సిన అవసరం ఏమిటి? ► సీఐసీ ఉత్తర్వులను సుప్రీంకోర్టు తన సొంత కోర్టులోనే సవాల్ చేయడం వల్ల అనుమానానికి తావుంటుంది. అందుకే ఈ కారణాలన్నింటి రీత్యా భారత అత్యున్నత న్యాయ స్థానం సాధారణ ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకు సీజేఐ కార్యాలయాన్ని సైతం సమాచార హక్కు చట్టం పరిధిలోనికి తేవాల్సిన అవసరం ఉన్నదని ఆర్టీఐ కార్యకర్త అగర్వాల్‌ని సమర్థిస్తున్న వారి వాదన. ఎప్పుడేం జరిగిందంటే..? ► నవంబర్ 11, 2007: జడ్జీల ఆస్తుల సమాచారాన్ని ఇవ్వాలని సుప్రీంకోర్టుకెళ్లిన అగర్వాల్ ► నవంబర్ 30: సమాచారమిచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ ► డిసెంబర్ 8: కోర్టులో తొలి అప్పీల్ దాఖలు ► జనవరి 12, 2008: కొట్టివేసిన కోర్టు ► మార్చి 5: సీఐసీని సంప్రదించిన అగర్వాల్ ► జనవరి 6, 2009: సీజేఐ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందన్న సీఐసీ ► జనవరి 17: సీఐసీ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసిన సుప్రీంకోర్టు ► ఫిబ్రవరి 26: తమ న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు వ్యక్తిగత సమాచారం కనుక ఆర్టీఐ పరిధిలోకి రావన్న సుప్రీంకోర్టు ► మార్చి 17: తమ జడ్జీలు ఆస్తుల సమాచారాన్ని వెల్లడించేందుకు విముఖత చూపడం లేదనీ, అయితే అందుకు పార్లమెంటులో చట్టం చేయాల్సిన అవసరం ఉన్నదనీ, అయితే ఆ చట్టాన్ని దుర్వినియోగం చేయకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్య. ► మే 4: సుప్రీంకోర్టు అప్పీల్‌పై ఆర్డర్‌ని రిజర్వులో ఉంచిన హైకోర్టు. ► సెప్టెంబర్ 2: సీఐసీ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు సింగిల్ బెంచ్. ► అక్టోబర్ 5: దీన్ని సవాల్ చేసిన సుప్రీంకోర్టు. ► అక్టోబర్ 7: ముగ్గురు జడ్జీలతో హైకోర్టు ధర్మాసనం ఏర్పాటు ► 2010 జనవరి 10: ఆర్టీఐ పరిధిలోనికి సీజేఐ ఆఫీస్ వస్తుందని హైకోర్టు తీర్పు ► నవంబర్ 26: తీర్పుపై సుప్రీంలో సవాల్చేసిన సుప్రీంకోర్టు ఎస్జీ, సీపీఐఓ ► ఏప్రిల్ 4, 2019: తీర్పుని రిజర్వులో ఉంచిన «సుప్రీంకోర్టు ► నవంబర్ 13, 2019: ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం వస్తుందని సుప్రీంకోర్టు తీర్పు. -
ఆ ఐదుగురు న్యాయమూర్తులేవరు?
-
ఈ తీర్పు రాసిందెవరు?
న్యూఢిల్లీ: సాధారణంగా తీర్పు వెలువరించే సమయంలో ధర్మాసనం తరఫున ఆ తీర్పును రాసిన న్యాయమూర్తి ఎవరో కూడా ప్రకటిస్తారు. ఒకరికి మించిన న్యాయమూర్తులు సభ్యులుగా ఉన్న ధర్మాసనాలు తీర్పు ఇచ్చే సమయంలో తీర్పును రాసిన జడ్జీ పేరును ప్రకటించడం సంప్రదాయం. కానీ అయోధ్య తీర్పు విషయంలో ఈ సంప్రదాయాన్ని పాటించకపోవడం విశేషం. అయోధ్య కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం విచారించింది. (చదవండి : ‘అయోధ్య’ రామయ్యదే..!) కోర్టుహాల్లో 1045 పేజీలున్న తుది తీర్పులోని కీలక అంశాలను జస్టిస్ గొగోయ్ చదివి వినిపించారు. తీర్పుతో పాటు 116 పేజీల అనుబంధాన్ని కూడా ప్రత్యేకంగా ఇవ్వడం ఈ తీర్పులోని మరో విశేషం. అయోధ్యలోని ప్రస్తుత వివాదాస్పద స్థలమే శ్రీరాముడి జన్మస్థలమని విశ్వసించేందుకు ఆధారాలేంటనే విషయాన్ని కూలంకశంగా ఆ అనుబంధంలో వివరించారు. ఆ అనుబంధ రచయిత ఎవరో కూడా మిస్టరీగానే ఉంచడం కొనమెరుపు. (చదవండి : ఉత్కంఠ క్షణాలు) -
న్యాయ పీఠంపై... ఆ ఐదుగురూ!!
అయోధ్య స్థల వివాదంపై తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్న న్యాయమూర్తులు ఐదుగురు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ దీనికి సారథ్యం వహించగా... జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్ ఈ తీర్పును వెలువరించారు. వ్యవహారాన్ని ఒక స్థల వివాదంలా చూసిన ధర్మాసనం... స్థలం ఎవరికి చెందుతుందనే తీర్పునిచ్చింది. తీర్పుపై ఐదుగురూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తంచేయగా... ఒక జడ్జి మాత్రం... ఆ స్థలం శ్రీరాముడి జన్మస్థానమనే హిందువుల విశ్వాసానికి, నమ్మకానికి తగిన ఆధారాలున్నాయని పేర్కొనటం గమనార్హం. ఈ ఐదుగురి వివరాలూ చూస్తే... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ ధర్మాసనానికి నేతృత్వం వహించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్... 1954 నవంబర్ 18వ తేదీన జన్మించారు. 1978లో గౌహతి బార్ కౌన్సిల్లో చేరి గౌహతి హైకోర్టులో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. 2001లో గౌహతి హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2010లో పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 2011లో పంజాబ్–హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. 2012లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, 2018లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఈ నెల 17న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ శరత్ అరవింద్ బాబ్డే రాజ్యాంగ ధర్మాసనంలో రెండో న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే. 1978లో మహారాష్ట్ర బార్ కౌన్సిల్లో సభ్యుడిగా చేరిన ఈయన... బోంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో పని చేశారు. బోంబే హైకోర్టులోనే దాదాపు 21 ఏళ్లపాటు వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. 1998లో సీనియర్ న్యాయవాది అయ్యారు. 2000లో బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2013లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఈ నెల 18వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యలు చేపడతారు. 2021 ఏప్రిల్ వరకూ ఈ పదవిలో కొనసాగుతారు. జస్టిస్ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. జస్టిస్ చంద్రచూడ్ బోంబే హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. 1998లో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. 1998 నుంచి దాదాపు రెండేళ్లపాటు భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్‌గా కూడా వ్యవహరించారు. 2000లో బోంబే హైకోర్టు న్యాయమూర్తిగా... 2013లో అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016లో సుప్రీంకోర్టుకు వచ్చారు. ప్రపంచంలోని అనేక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉపన్యాసాలిచ్చారు. జస్టిస్ అశోక్ భూషణ్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన జస్టిస్ అశోక్ భూషణ్ జాన్‌పూర్‌లో జన్మించారు. అలహాబాద్ వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందిన అశోక్ భూషణ్... 1979లో యూ పీ బార్ కౌన్సిల్ సభ్యుడయ్యారు. అలహాబాద్ హైకోర్టులో వివిధ పోస్టులలో పనిచేసిన అశోక్ భూషణ్ 2001లో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014లో కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధా న న్యాయమూర్తిగా, 2015లో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు జస్టిస్ అబ్దుల్ నజీర్ అయోధ్య కేసు ధర్మాసనంలో ఉన్న ఏకైక ముస్లిం జడ్జి జస్టిస్ అబ్దుల్ నజీర్. కర్ణాటకలోని కోస్తా ప్రాంతం బెళువాయికి చెందిన ఈయన 1983లో కర్ణాటక హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2003లో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2004లో శాశ్వత జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. 2017లో సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించకుండానే నేరుగా సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన వారిలో ఈయన మూడో వ్యక్తి కావడం గమనార్హం. ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హంగా ప్రకటించిన ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్ నజీర్ అప్పట్లో ఆ తీర్పును వ్యతిరేకించారు. -
ఉత్కంఠ క్షణాలు
సాక్షి, న్యూఢిల్లీ: తీర్పు నేపథ్యంలో శనివారం కోర్టు పరిసరాలైన తిలక్‌మార్గ్, మండిహౌస్ ప్రాంతాలు గంభీర వాతావరణాన్ని తలపించాయి. దాదాపు నలభై రోజుల పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం అయోధ్య వివాదంపై వాదనలు ఆలకించింది. తుది తీర్పు వెలువరించే ముందు సుప్రీంకోర్టులో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కోర్టు తీర్పు నేపథ్యంలో దేశంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉదయాన్నే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన నివాసంలో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. (చదవండి : ‘అయోధ్య’ రామయ్యదే..!) జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల్లో భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సుప్రీంకోర్టు వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకే న్యాయవాదులు భారీగా సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. సాధువులు, హిందూ, ముస్లిం మత పెద్దలు పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు చేరుకున్నారు. ఉదయం 10:25 గంటలకు పోలీసుల భారీ భద్రత నడుమ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. జైశ్రీరాం నినాదాలు.. ఉదయం 10:32కి జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పు చదవడం ప్రారంభించారు. 45 నిమిషాల పాటు సుదీర్ఘంగా తీర్పు వెల్లడించారు. ఆ వెంటనే కోర్టు బయట జై శ్రీరాం నినాదాలు మిన్నంటాయి. కోర్టు తీర్పును గౌరవిస్తూ హిందూ, ముస్లింలు పలువురు ఆలింగనం చేసుకోవడం కనిపించింది. నవంబరు 15 జస్టిస్ రంజన్ గొగోయ్ అఖరి పనిదినం కావడంతో అయోధ్యపై తీర్పు 13, 14 తేదీల్లో రావచ్చని అంతా భావించారు. అయితే కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం వాద, ప్రతివాదుల్లో ఎవరికైనా రివ్యూ పిటిషన్ దాఖలు చేసే హక్కు ఉండడంతో అన్ని అంశాలను పరిశీలించి శనివారం తీర్పు వెలువరించినట్టు తెలుస్తోంది. (చదవండి : అయోధ్య తీర్పు రాసిందెవరు?) -
అది.. రాముడి జన్మస్థలమే!
న్యూఢిల్లీ: ఐదుగురు సభ్యుల ధర్మాసనం ప్రధానంగా దీన్ని మత విశ్వాసాలకు సంబంధించిన వ్యాజ్యంగా కాకుండా... స్థలానికి సంబంధించిన టైటిల్ వివాధంగానే భావించింది. తమ ముందున్న సాక్ష్యాధారాలను అనుసరించి తీర్పునిచ్చింది. వీరితో ఏకీభవిస్తూనే...ఈ ఐదుగురిలో ఒక న్యాయమూర్తి మాత్రం దీన్ని హిందువుల మత విశ్వాసాలకు సంబంధించిన అంశంగా కూడా పేర్కొన్నారు. మొత్తం 1045 పేజీల తీర్పులో ఈ రెండో అభిప్రాయాన్ని దాదాపు 116 పేజీల్లో వెలువరించారు. దీన్లో ప్రధానంగా ఆయన తన ముందున్న సాక్ష్యాధారాలను మూడు కాలాలకు చెందినవిగా విభజించారు. దాని ప్రకారం మొదటిది... పురాణ కాలం. రెండోది మసీదు నిర్మించిన క్రీ.శ. 1528 నుంచి 1858 మధ్యకాలంగా పేర్కొన్నారు. పురాణాల ప్రకారం శ్రీరాముడు కౌసల్యకు జన్మించారని రామాయణంలో చెప్పారు తప్ప ఎక్కడ జన్మించాడనేది చెప్పలేదని... కానీ రామాయణంతో దాదాపు సమానంగా భావించే రామ్చరిత్ మానస్ (1574)లో రాముడు ఈశాన్యంలో పుట్టాడనే అంశం ఉందని ఆయన పేర్కొన్నారు. స్కంధ పురాణాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. దాంతో పాటు తాను విచారించిన సాక్షుల్లో సిక్కు చరిత్రపై అధ్యయనం చేసినవారు... క్రీ.శ.1510 సమయంలో గురునానక్ అయోధ్యలో రామ మందిరాన్ని సందర్శించినట్లు చెప్పారని గుర్తుచేశారు. వీటన్నిటినీ బట్టి 1528లో బాబ్రీ మసీదు నిర్మించక ముందే అక్కడ నిర్మాణం ఉందనేది ధ్రువపడుతోందని ఆయన పేర్కొన్నారు. ‘‘పురాణ కాలం నుంచి ఇప్పటిదాకా జరిగిన సంఘటనల క్రమాన్ని చూస్తే మనం ఒకటి స్పష్టంగా గుర్తించవచ్చు. శ్రీ రాముడి పుట్టిన స్థలం మసీదులోని మూడు డోమ్‌ల నిర్మాణానికి అడుగున ఉందనేది హిందువుల విశ్వాసం. జన్మస్థానం మీదనే మసీదును నిర్మించారనేది వారి నమ్మకం. ప్రహరీలోపలి మసీదు ఆవరణను రెండు భాగాలుగా విభజిస్తూ బిట్రీష్ కాలంలోనే గ్రిల్స్‌తో గోడ నిర్మించారు. గ్రిల్స్‌తో నిర్మించిన ఆ ఇనుప గోడ హిందువులను మూడు డోమ్‌ల నిర్మాణంలోకి వెళ్లకుండా నిరోధించింది. బ్రిటిష్ వారి అనుమతితో అప్పటి నుంచే వెలుపలున్న రామ్ ఛబుత్రాలో పూజలు ఆరంభమయ్యాయి. ఆ ఛబుత్రా వద్ద ఆలయం నిర్మించుకోవటానికి అనుమతివ్వాలంటూ 1885లో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. అయితే ఇక్కడొకటి గమనించాలి. మసీదు ఆవరణను విభజించి, హిందువులను మూడు డోమ్‌ల నిర్మాణానికి వెలుపల ఉంచినా... అది శ్రీరాముడి జన్మ స్థలమన్న వారి నమ్మకాన్ని మార్చుకోవాలని మాత్రం ఎవరూ చెప్పలేదు. శ్రీరాముడు ఆ అవరణలోనే జన్మించాడన్న విశ్వాసం వల్లే... దానికి సూచనగా అక్కడ ఛబుత్రాలో హిందువులు పూజలు చేస్తున్నారని భావించాలి. ముక్తాయింపు ఏమిటంటే... రాముడి జన్మస్థానంపైనే మసీదు నిర్మించారన్నది హిందువుల విశ్వాసం, నమ్మకం. పురాణకాలం నుంచి జరిగిన పరిణామాలు, ఆ తరవాతి కాలంలో దొరికిన మౌఖిక, లిఖితపూర్వక, చారిత్రక ఆధారాలు... ఇవన్నీ ఆ నమ్మకాన్ని ధ్రువపరుస్తున్నాయి’’అని తన తీర్పులో ఆయన పేర్కొన్నారు. 1850వ సంవత్సరం తరవాత లభ్యమైన ఆధారాలను ప్రస్తావిస్తూ... ► 1858లో అవధ్ థానేదార్ శీతల్ దూబే ఇచ్చిన నివేదికలో మసీదును మాస్క్ జన్మస్థా న్ అని పేర్కొన్నారు. అంటే ఇక్కడ మసీదు మాత్రమే కాక జన్మస్థానం ఉందని ధ్రువపరిచారు. దీన్నొక ఆధారంగా భావించవచ్చు. ► 1878లో ఫైజాబాద్ తాలూకా స్కెచ్‌ను నాటి అయోధ్య సెటిల్మెంట్ అధికారి కార్నెగీ రూపొందించారు. ఆ స్కెచ్‌లో ముస్లింలకు మక్కా, యూదులకు జెరూసలేం ఎలాగో హిందువులకు అయోధ్య అలాంటిదన్నారు. జన్మస్థాన్‌లో 1528లో బాబరు మసీదును నిర్మించినట్లు కార్నెగీ పేర్కొన్నారు. ► 1877లో ప్రచురించిన మరో అవధ్ గెజిటీర్లో హిందూ – ముస్లిం విభేదాలను సవివరంగా ప్రస్తావించారు. ► 1880లో ఎ.ఎఫ్.మిల్లిట్ ’ఫైజాబాద్ లాండ్ రెవెన్యూ సెటిల్మెంట్ రిపోర్ట్’లో కూడా దీన్ని ప్రస్తావించారు. ► 1889లో నార్త్‌వెస్ట్ అవధ్‌కు చెందిన అర్కియాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తన నివేదికలో జన్మస్థానంలో అద్భుతమైన పురాతన ఆలయం ఉండేదని, దాని స్థంభాలను ముస్లింలు తమ నిర్మాణంలో కూడా వాడారని పేర్కొంది.