జాప్యానికి సుప్రీం జవాబు | Supreme Court guidelines for dealing with death convicts bring hope to those seeking clemency | Sakshi
Sakshi News home page

జాప్యానికి సుప్రీం జవాబు

Published Wed, Jan 29 2014 3:23 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

జాప్యానికి సుప్రీం జవాబు - Sakshi

జాప్యానికి సుప్రీం జవాబు

క్షమాభిక్ష దరఖాస్తును గవర్నర్ తిరస్కరించినప్పుడు ఆ సమాచారాన్ని ఖైదీకి గానీ అతని కుటుంబ సభ్యులకు గానీ తెలియజేయాలన్న నియమం ఏదీ జైలు మాన్యువల్స్‌లో లేదు. కానీ 161వ అధికరణ ప్రకారం గవర్నర్‌కు క్షమాభిక్ష దరఖాస్తు పెట్టుకునే హక్కు ఖైదీకి ఉన్నప్పుడు, గవర్నర్ నిర్ణయం ఏమిటో తెలుసుకునే హక్కు కూడా ఆ ఖైదీ కలిగి ఉంటాడు. రాష్ట్రపతి తిరస్కరించినా ఇదే వర్తిస్తున్నది.
 
 కేసుల విచారణలో జాప్యం ఉండకూడదు. అధిక సంఖ్యలో ఉన్న కేసులతో ఇలాంటి జాప్యం తప్పడం లేదు. దీనిని అర్థం చేసుకో వచ్చు. కానీ, క్షమాభిక్ష దరఖాస్తుల పరిశీలనకి సంవత్సరాల కొద్దీ సమయం తీసుకుంటే అర్థం చేసుకోవడం కాదు, ఆందోళన తప్పదు. ఉరిశిక్ష పడిన వారి విషయంలో ఇది ఎంత కలవరపాటుకు గురిచేసే అంశమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి జాప్యంతో శిక్ష పడిన వారే కాదు, వారి స్నేహితులూ కుటుంబ సభ్యులూ అనుక్షణం పడే వేదన మాటలకు అందేది కాదు. అందుకే, 21.1.2014న సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు మరణ శిక్షల ప్రక్రియలో ఓ మైలురాయి వంటిదనిపిస్తుంది. ఆశిక్ష పడిన 15 మంది దాఖలు చేసుకున్న 13 రిట్ దరఖాస్తులను సుప్రీంకోర్టు ఆమోదించి, వారి శిక్షలను జీవిత కాల శిక్షలుగా మార్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి పి.సదాశి వం, న్యాయమూర్తులు రంజన్ గొగోయ్, శివకీర్తి సింగ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. దేవేందర్ పాల్‌సింగ్ బుల్లార్ కేసులో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుని రద్దు చేసి వారికి కూడా ఈ తీర్పును వర్తింపజేసింది.
 
  క్షమాభిక్ష కోరడమూ హక్కే
 దేవేందర్‌పాల్ సింగ్ బుల్లార్ వర్సెస్ ఢిల్లీ కేసులో మరణశిక్షపడిన ఖైదీ తన మరణశిక్షను తగ్గించమని 2003లో రాష్ట్రపతికి దరఖాస్తు చేశాడు. 8 సంవత్సరాల తరువాత దానిని రాష్ట్రపతి తోసిపుచ్చారు. క్షమాభిక్ష దరఖాస్తును తోసిపుచ్చడంలో తీవ్రమైన జాప్యం ఉందన్న కారణంగా తన మరణశిక్షని జీవిత ఖైదుగా మార్చమని ఆ ఖైదీయే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. చట్ట ప్రకారమే మరణశిక్ష విధించినందువల్ల ఆ విన్నపాన్ని మన్నించలేమని కోర్టు (న్యాయమూర్తులు ఎస్.జె.ముకోపాధ్యాయ, జి.ఎస్.సింఘ్వీలతో కూడిన ధర్మా సనం) అతని కేసుని 12 ఏప్రిల్ 2013న తోసిపుచ్చింది. ఆ తరువాత రెండు వారాలకే అదే డివిజన్ బెంచి మహేంద్రనాథ్ దాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇం డియా కేసులో 12 సంవత్సరాల జాప్యం కారణంగా మరణశిక్షని జీవిత ఖైదుగా మార్చింది.
 
  12 సంవత్సరాల తరువాత క్షమాభిక్ష దరఖాస్తుని తోసిపుచ్చడానికి ఎలాంటి కారణాలు చూపకపోవడం మన్నించరాని విషయమని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చివరలో ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్య ఇది. ‘రాజ్యాంగంలోని 72/161 అధికరణల ప్రకారం క్షమాభిక్ష కోరడమనేది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. అంతేకానీ ఎవరి ఇష్టాయిష్టాల ప్రకారం, విచక్షణాధికారం ప్రకారం ఇచ్చే హక్కు కాదు. రాజ్యాంగ బద్ధంగా చేయాల్సిన విధులని అత్యంత జాగరూకతతో నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆ రకంగా నిర్వర్తించనప్పుడు రాజ్యాంగ విలువలు కాపాడటం కోసం కోర్టులు జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. విశాల ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తిలో ‘ప్రతీకారానికి’ ఎలాంటి విలువాలేదు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. ముద్దాయికి కూడా యథార్థ రాజ్యాంగ రక్షణ ఉంటుంది. ఆ హక్కుని రక్షించాల్సిన బాధ్యత కోర్టు మీద ఉంటుంది. అందుకని న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. ఇది రాజ్యాంగంలోని 72/161 అధికరణలలో జోక్యం చేసుకుంటున్నట్టు కాదు. మరణశిక్ష పడిన ఖైదీలకు రాజ్యాంగం ప్రసాదిం చిన యథార్థ రక్షణే’.
 
 దరఖాస్తు చేసే పద్ధతి
 క్షమాభిక్ష దరఖాస్తులను రాష్ట్రపతి ముందు పెట్టడానికి భారత ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించినప్పటికి అవి సరిగ్గా అమలు కావడంలేదు. రాష్ట్ర గవర్నర్ క్షమాభిక్షని తోసిపుచ్చిన తరువాత ఎవరైనా రాష్ట్రపతిని ఆశ్రయిస్తే ఆ కేసుకు సంబంధించిన రికార్డును, విచారణ కోర్టు తీర్పును, హైకోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులను నిర్దేశించిన కాలపరిమితిలో హోంమంత్రిత్వ శాఖకు పంపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ సూచనలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర శాఖలు పాటించడం లేదు. అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం అన్నట్టు రికార్డుని పంపిస్తున్నాయి. ఈ సూచనలు కఠినంగా పాటించి జాప్యాన్ని నివారించాలి. ఈ వివరాలు హోం మంత్రిత్వ శాఖకు అందిన తరువాత తమ సిఫార్సులను, లేదా అభిప్రాయాలను తగిన సమయానికి రాష్ట్రపతికి పంపించాలి. వీటిని పంపినప్పటికీ రాష్ట్రపతి భవన్ నుంచి ఎలాంటి స్పందనా లేకుంటే, మళ్లీ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి రాష్ట్రపతి నిర్ణయాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా హోం మంత్రిత్వ శాఖపైనే ఉంది.
 
 విన్నపాన్ని తోసిపుచ్చితే...
 క్షమాభిక్ష దరఖాస్తుని గవర్నర్ తిరస్కరించినప్పుడు ఆ సమాచారాన్ని ఖైదీకి గానీ అతని కుటుంబ సభ్యులకు గానీ తెలియజేయాలన్న నియమం ఏదీ జైలు మాన్యువల్స్‌లో లేదు. కానీ 161 అధికరణ ప్రకారం గవర్నర్‌కి క్షమాభిక్ష పెట్టు కునే హక్కు ఖైదీకి ఉన్నప్పుడు, గవర్నర్ నిర్ణయం ఏమిటో తెలుసుకునే హక్కు కూడా ఆ ఖైదీ కలిగి ఉంటాడు. రాష్ట్రపతి తిరస్కరించినా ఇదే వర్తిస్తున్నది. కానీ దరఖాస్తు తిరస్కరణ విషయాన్ని ఖైదీకి అతని కుటుంబ సభ్యులకి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా తెలియజేయాలి. క్షమాభిక్ష సమాచారం అందించాలన్న నియమం ఉన్న రాష్ట్రాల్లో కూడా ఖైదీకి మౌఖికంగా మాత్రమే తెలియజేస్తు న్నారు.
 
  72 అధికరణ ప్రకారం క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి దరఖాస్తు చేయడం రాజ్యాంగ హక్కు కాబట్టి, దానిని తిరస్కరిస్తే ఆ సమాచారం కూడా తెలుసుకునే హక్కు ఖైదీకి ఉంటుంది. తమ తమ దరఖాస్తులను గవర్నర్ లేదా రాష్ట్రపతి తిరస్కరించినప్పుడు వాటి ప్రతిని పొందే హక్కు ఖైదీలకు ఉంది. శిక్ష అమలు విషయాన్ని 14 రోజుల ముందు తెలియజేయాలి. శిక్ష అమలు తేదీ గురించి ఎన్ని రోజుల ముందు తెలియజేయాలన్న విషయం చాలా జైలు మాన్యువల్స్‌లో ఏక సూత్రం కానరాదు. కొన్నింటిలో ఒకరోజు ముందు తెలియజేయాలనీ, ఇంకొన్ని కనీసం 14 రోజుల ముందు తెలియజేయాలనీ అంటున్నాయి. క్షమాభిక్ష తిర స్కరించిన తేదీకీ, శిక్ష అమలు తేదీకీ మధ్యన 14 రోజుల కనీస గడువు ఉండాలి.
 
 ఆరోగ్య నివేదికలూ కావాలి
 ఖైదీ మానసిక శారీరక ఆరోగ్యాలను బట్టి శిక్ష అమలును నిలిపే అధికారం చాలా జైలు మాన్యువల్స్ పర్యవేక్షణ అధికారులకి కల్పిస్తున్నాయి. దరఖాస్తు తిరస్క రించిన తరువాత, ఖైదీలకి వైద్యపరీక్షలు జరిపి వారి శారీరక మానసిక ఆరోగ్యం గురించిన నివేదికలను జైలు అధికారులు తీసుకోవాలి. ఖైదీ శారీరక, మానసిక ఆరోగ్యం గురించి సూపరింటెండెంట్ సంతృప్తి చెందాలి. ఆ విధంగా లేనప్పుడు శిక్ష అమలును నిలిపివేసి ఆ ఖైదీని మెడికల్ బోర్డుకి పంపించి నివేదికను తెప్పిం చుకోవాలి. తదుపరి చర్యల కోసం ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలి.
 
 మరణశిక్ష పడినవారిలో ఎక్కువ మంది బీదవాళ్లే. వారి దగ్గర తీర్పు ప్రతు లు, ఇతర కోర్టు కాగితాలు ఉండవు. అప్పీళ్లకీ, క్షమాభిక్ష దరఖాస్తులను పెట్టుకోవ డానికి, క్షమాభిక్ష తిరస్కరణ తరువాత న్యాయపరమైన ఇతర చర్యలకు ఈ కాగితాలు అవసరం. ఈ హక్కులను వినియోగించుకోవడానికి అవసరమైన అన్ని పత్రాలని వారంలోగా ఖైదీకి అందే విధంగా చర్యలు తీసుకోవాలి. శిక్ష అమలుకు ముందు ఖైదీ తన స్నేహితులతో, కుటుంబ సభ్యులతో చివరిసారి కలవడానికి అవకాశాన్ని కొన్ని రాష్ట్రాల మాన్యువల్స్ మాత్రమే కల్పిస్తున్నాయి. ఉరిశిక్ష తరువాత విధిగా శవ పరీక్షలు జరిపించాలని చెప్పే నిబంధనలు జైలు మాన్యువల్స్‌లో లేవు. చట్టం నిర్దేశించిన ప్రకారం శిక్ష అమలైనదీ లేనిదీ తెలుసు కోవడానికి ఈ శవపరీక్షలు ఉపయోగపడతాయి.
 
 మరణశిక్ష పడిన వారికీ, ఆ శిక్షపడే అవకాశం ఉన్న వారికీ సుప్రీంకోర్టు తీర్పు పెద్ద ఉపశమనం. ఉరి వంటి శిక్ష పడటం వేరు. అంత తీవ్రమైన శిక్ష అమలు కోసం ఎదురుచూడటం వేరు. ఉరి శిక్ష కోసం ఎదురు చూస్తూ క్షణక్షణం చావడం కన్నా శిక్ష ను అనుభవించడం మేలనిపిస్తుంది. ఉరిశిక్షని కోర్టులు రద్దు చేయకపోయినా ఈ తీర్పుతో మేలు చేశాయి.   

- మంగారి రాజేందర్
 డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement