Mangari Rajender
-
‘జింబో’ రాజేందర్‌కు ఉస్మానియా పీహెచ్డీ
సాక్షి, హైదరాబాద్: మాజీ జడ్జి, రచయిత మంగారి రాజేందర్ (జింబో) ‘పోలీసు అధికారాలు–సమన్యాయ పాలన– ఎన్కౌంటర్ మరణాలు’ అంశంపై సమర్పించిన పరిశోధన పత్రానికి ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్‌డీని ప్రకటించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందిన మంగారి రాజేందర్ జిల్లా సెషన్స్ జడ్జిగా, జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్‌గా, టీఎస్పీఎస్సీ సభ్యుడిగా పనిచేశారు. కవిత్వం, కథలతోపాటు, యాభై వరకు ‘లా’ పుస్తకాలను తెలుగులో అనువదించారు. లా సంబంధిత వ్యాసాలు రాశారు. ప్రజలకు అర్థమయ్యేలా కోర్టు తీర్పులను తెలుగులో వెలువరించారు. ‘మా వేములవాడ కథలు, జింబో’ కథలతో తనదైన ముద్ర వేశారు. -
ట్రయలనే శిక్ష ఏపాటిది?
అఖిల భారత జిల్లా న్యాయ సేవల అథారిటీస్ ప్రథమ సమావేశంలో భారత ప్రధాని మాట్లాడుతూ చాలామంది విచారణలో ఉన్న ఖైదీలు జైళ్లలో మగ్గిపోవడం గురించి ఆందోళన వెలి బుచ్చారు. వారి విడుదల కోసం న్యాయ సేవల అధికార సంస్థలు కృషి చేయాలని అన్నారు. న్యాయం వారికి సులభంగా అందుబాటులోకి రావాలనీ, అలా వస్తే వాళ్ల జీవించే హక్కు కుదుటపడుతుందనీ ప్రధాని అన్నారు. తీవ్రమైన నేరాలు చేయని వ్యక్తులూ, ఇదివరకే 1/3 వంతు శిక్షా కాలాన్ని అనుభవించినవాళ్లూ జెలు నుంచి బయటకు రావడానికి వారిపైన ఉన్న కేసులను రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆగస్టు 5వ తేదీన ప్రభుత్వానికి సూచించింది. అంతకుముందు జూలై 11వ తేదీన సుప్రీంకోర్టు కొత్తగా బెయిల్ చట్టం తీసుకొని రావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. కాగ్నిజబుల్ నేరం చేయని ఎంతోమంది వ్యక్తులు జైళ్ళలో ఉన్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అరెస్టు చేయడం అనేది చాలా క్రూరమైన చట్టమనీ, వ్యక్తి స్వేచ్ఛ దానివల్ల పోతుందనీ, అందుకని అత్యవసరమై నప్పుడు మాత్రమే ఈ అరెస్టులను చేయాలనీ సుప్రీంకోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించింది. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో 2020లో ప్రకటించిన వివరాల ప్రకారం 4,88,551 మంది జైళ్లలో బెయిల్ రాక ఉండి పోయారు. విచారణలో ఉన్న ఖైదీల సంఖ్య తగ్గించడం కోసం పోలీస్ కమి షన్, సుప్రీంకోర్టు అనేక సూచనలు చేసినప్పటికీ ఫలితం లేదు. అరెస్టు చేసే అధికారం ఉందని అరెస్టు చేయడం తగదనీ, అరెస్టు చేయడానికి న్యాయబద్ధత ఉండాలనీ జోగిందర్ కుమార్ కేసు(1994)లో సుప్రీంకోర్టు చెప్పింది. అయినా పోలీసుల పని విధానంలో మార్పు రాలేదు. అరెస్టులను తగ్గించాలని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో 41వ నిబంధనకు మార్పులను (2009) తీసుకొని వచ్చారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ మార్పులు చేసిన నిబంధన పోలీసులకు విశేష అధికారా లను కల్పించింది. ఈ అధికార నియంత్రణ కోసం ఆర్నేష్ కుమార్ కేసులో కొన్ని మార్గదర్శకాలను కోర్టు ఏర్పరిచింది. కానీ ఆ మార్గదర్శకాలను అమలు చేసే మేజిస్ట్రేట్లు ఎంతమంది మన దేశంలో ఉన్నారు? రాజద్రోహ నేరం పేరుతో దేశంలో ఎన్నో అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. హాని కలిగించని ట్వీట్లు చేసిన జర్నలిస్టు మహమ్మద్ జుబేర్‌ని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మధ్యే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అవమానకరమైన ట్వీట్ చేశాడన్న ఆరోపణ మీద ఓ నటుడు నెల రోజులపాటు జైల్లో ఉన్నాడు. ఆయన ఎవరి గురించి అయితే ఆ ట్వీట్ చేశాడో ఆ నాయకుడు ఆ ట్వీట్‌ని పట్టించుకోలేదు. బర్షశ్రీ బురగొహెయిన్ అనే స్టూడెంట్ ఏదో కవిత రాసినందుకు రెండు నెలలు జైల్లో ఉండిపోయింది. మన జైళ్లలో కూడా చాలా దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయి. సుఖేష్ చంద్రశేఖర్ అనే విచారణలో ఉన్న ఖైదీకి సకల సౌకర్యాలు జైల్లో లభిస్తాయి. స్టాన్‌స్వామి అనే ఖైదీ ఒక రూపాయి విలువ చేసే ‘స్ట్రా’ కోసం విలవిల లాడాల్సి వచ్చింది. ఇట్లా ఎన్నో ఉదాహరణలను చెప్పవచ్చు. 2018లో అరెస్టయిన ప్రముఖ కవికి సుప్రీంకోర్టు ఇటీవల మెడికల్ గ్రౌండ్స్ మీద బెయిల్ మంజూరు చేసింది. ఆయనకి 82 సంవత్సరాలు ఉన్నాయనీ, కస్టడీ విచారణ 2018లో జరిగిందనీ, ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలైనా కూడా విచారణ ఇంకా మొదలు కాలేదన్న కారణంగా బెయిల్ మంజూరు చేసినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చాయి. అరెస్టు విషయంలో ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను, మేజిస్ట్రేట్స్ కఠినంగా అమలు చేస్తే ఈ అరెస్టులకు అడ్డుకట్ట ఏర్పడుతుంది. అదే విధంగా రిమాండ్ చేసేటప్పుడు గుడ్డిగా కాకుండా జాగ్రత్తగా రిమాండ్ చేస్తే కూడా ఈ నిర్బంధాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ‘జైలు కాదు బెయిల్’ అన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యానం స్లోగన్ మాదిరిగా మారడం శోచనీయం. నేర నిరూపణ జరిగేవరకు ముద్దాయిని అమాయకుడిగా పరిగణించాలన్న నియమం కాస్త అమాయకుడిగా నిరూపణ అయ్యేంతవరకూ నేరస్థుడు అన్న చందంగా మారడం ఓ విషాదం. రిమాండ్ విషయంలో, అదే విధంగా బెయిల్ మంజూరు చేసే విషయంలో కోర్టులు న్యాయబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సీరియస్ నేరాలను, మామూలు నేరాలను వేరువేరుగా చూసే దృష్టి అలవర్చుకోవాలి. ఈ గందరగోళ పరిస్థితి నుంచి బయటపడటానికి క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లోని అన్ని వ్యవస్థలూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. న్యాయమూర్తుల పాత్ర గురించి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన మదన్ బి. లోకూర్ మాటలను ఇక్కడ ఉదహరించాలి. ‘‘అరెస్టు విషయంలో ట్రయల్ కోర్టు న్యాయమూర్తులు పోలీసుల రబ్బర్ స్టాంపు మాదిరిగా వ్యవహరించకూడదు. మీ మనస్సుతో చూడండి. ఓ నా ప్రియమైన న్యాయమూర్తులారా! స్వేచ్ఛ అనేది అత్యంత విలువైనది. అది ఎవరూ కోల్పోకూడదు. దేశ పౌరుల రాజ్యాంగ హక్కులవైపు మీరు నిలబడండి. నాకు తెలుసు. మిమ్మల్ని రాత్రికి రాత్రి బదిలీ చేస్తారన్న భయం కూడా ఉంటుంది. నిద్రలేని రాత్రులు మీకు ఏర్పడవచ్చు. మంచి రోజులు ఏదో ఒక రోజు వస్తాయి. అంతలోపు సంవత్సరాల తరబడి విచారణలో ఉన్న ఖైదీల వైపు చూడండి. అమాయకులు జైళ్లలో ఉండి పోకుండా చూడండి. ఇది సరైనదేనా? వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి గురించి ఆలో చించండి. ఇది న్యాయమా? అన్యాయమా? ఆలోచించండి. ఇది కష్టమైన ప్రశ్న కాదు.’’ (క్లిక్: రోజురోజుకూ పెరుగుతున్న వ్యత్యాసాలు) ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయ శాఖా మంత్రి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందరూ విచారణలో ఉన్న ఖైదీల గురించి ఆందోళనల వ్యక్తపరుస్తున్నారు. ఈ ఆందోళనలను తగ్గించే అవకాశం ఉన్న వ్యక్తులు ట్రయల్ కోర్టు న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించే బాధ్యత వారిమీద లేదా? ‘విచారణలో ఉన్న ఖైదీనా, విచారణే అవసరం లేని ఖైదీనా’ తెలియజెప్పమని విచారణలో ఉన్న ఖైదీలు కోరకుండా చూసు కోవాల్సిన బాధ్యత న్యాయమూర్తుల మీదే ఉంది. (క్లిక్: గొంతు చించుకొని అడగాల్సిందే!) - మంగారి రాజేందర్ మాజీ జిల్లా జడ్జి -
న్యాయమూర్తులు పరిధులు దాటొచ్చా?
న్యాయమూర్తులు కూడా సమాజం నుంచి వచ్చిన వ్యక్తులే. వాళ్ళ మీద కూడా ప్రభావాలు ఉంటాయి. అన్ని ప్రభావాలు చెడ్డవి అని అనడానికి వీల్లేదు. వాళ్ళు తమమీద ఉన్న ఒత్తిడి వల్ల ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. న్యాయవ్యవస్థ నుంచి కొన్ని ఒత్తిడులు ఉత్పన్నమవుతాయి. న్యాయమూర్తి సాంఘిక, సాంస్కృతిక, మతపరమైన నేపథ్యం నుంచి మరికొన్ని ఒత్తిడులు ఉత్పన్నమవుతాయి. ఇవే కాకుండా వర్గపరమైన పక్షపాత ధోరణులు కూడా ఉంటాయి. ఇంటి యజమాని వల్ల బాధితుడైన న్యాయమూర్తి కిరాయిదారుల పక్షం ఉండి యజమానులకి వ్యతిరేకంగా ఉంటాడు. వరకట్నం కేసు వల్ల బాధను అనుభవించిన వ్యక్తి, ఆ కేసుల్లో పక్షపాత ధోరణి కలిగి ఉంటాడు. ఇది ఒక ఉదాహరణ. వీటికి మంచి ఉదాహరణ భన్వారీ దేవి ఉదంతం. భన్వారీ దేవి ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఆమె క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉంటుంది. బాల్య వివాహాలు జరిగితే ఆ విషయాలు ప్రభుత్వానికి తెలియజేయడం ఆమె ఉద్యోగంలోని ఒక విధి. అలాంటి సంఘటన ఒకటి జరిగే అవకాశం ఉందని ఆమె ప్రభుత్వానికి సమాచారం అందిం చింది. ఆ వివాహాన్ని పోలీసులు నిరోధించటానికి ప్రయత్నించి విఫల మయ్యారు. ఆ వివాహం రహస్యంగా జరిగింది. ఆ వివాహం జరిగే విషయంలో ఆమె జోక్యం చేసుకున్న కారణంగా వివాహం అయిన కొద్ది నెలలకి ఆమె మీద దాడి జరిగింది. ఆమె భర్త సమక్షంలో ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో ముద్దాయిలను ఆ కేసుని విచారించిన సెషన్స్ జడ్జి విడుదల చేశాడు. ఆ న్యాయమూర్తి ఇచ్చిన వివరణ చాలా విచిత్రంగా ఉంది. అత్యాచారాన్ని టీనేజీలో ఉన్న యువకులు చేస్తారు. ఈ కేసులో ఉన్న ముద్దాయిలు మధ్య వయ స్కులు. గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు. వాళ్లు ఈ నేరం చేయడానికి అవకాశం లేదు. అందులోనూ ఆధిపత్యæ కులానికి చెందిన వ్యక్తులు నిమ్న కులానికి చెందిన వ్యక్తితో అపవిత్రం కారు. ఈ తీర్పు చెప్పిన న్యాయమూర్తి ఆధిపత్య కులానికి చెందిన వ్యక్తి. కాబట్టే ఇలాంటి తీర్పు వెలువడింది. ఈ తీర్పుమీద అప్పట్లో దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. అదేవిధంగా కొంతమంది న్యాయ మూర్తులు ‘ఆమోద యోగ్యం కాని వక్రబుద్ధితో కూడిన (పర్వర్స్) తీర్పులని ప్రకటిస్తూ ఉంటారు. అలాంటి ఒక తీర్పుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని డివిజన్ బెంచ్ క్రిమినల్ అప్పీలు నెం. 1025 ఆఫ్ 2008 కేసులో 17.08.2012 నాడు ప్రకటించింది. ఈ తీర్పు పర్వర్స్ తీర్పు అని సుప్రీంకోర్టు డివిజన్ బెంచి 2017 ఫిబ్రవరి 9న ప్రకటించింది. కానీ ఈవిధంగా హైకోర్టు తీర్పుని పర్వర్స్ తీర్పు అని ప్రకటించడం సంతోషకరమైన వ్యక్తీకరణ కాదని కూడా సుప్రీంకోర్టు సి. ఏక్నాథ్ వర్సెస్ వై. అమరనాథ రెడ్డి కేసులో అభిప్రాయపడింది. ప్రభుత్వ భూముల వేలం కేసు నుంచి వైదొలగాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసుని పరిష్కరించాల్సిన జస్టిస్ రాకేశ్ కుమార్ తన పరిధిలో లేని అంశాలపై వ్యాఖ్యానించారు. ఇది ఆందోళనకరం. దేశానికి జస్టిస్ మురళీధర్, జస్టిస్ చంద్రూ వంటి న్యాయమూర్తులు అవసరం. దేశం ఇలాంటి న్యాయమూర్తులనే కోరుకుంటోంది. ఏపీ హైకోర్టులో జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ రమేష్ నేతృత్వం లోని డివిజన్ బెంచ్ 2020 డిసెంబర్ 30న ఇచ్చిన తీర్పుని గమనిం చినప్పుడు ఈ విషయాలన్నీ గుర్తుకు వచ్చాయి. ఇది ఊహించని ఉత్తర్వు. ఎందుకంటే తన విచారణ పరిధిలో లేని చాలా అంశాలని కోర్టు స్పృశించి తన అసంతృప్తిని వ్యక్తపరిచింది. ఈ అసంతృప్తికి కారణం ఏమంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయడం. అంతేకాదు. వై.యస్. జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం హైకోర్టుని తక్కువ చేస్తోందని కూడా ఈ తీర్పు అక్కసుని వెళ్లగక్కింది. కోర్టు కేసు నుంచి ఓ న్యాయమూర్తి తప్పుకోవాలన్న దరఖాస్తుని పరిష్కరిస్తూ డివిజన్ బెంచ్ ఈ కటువైన పరిశీలనలని చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏపీ హైకోర్టు నిర్వహణ మీద భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ బాబ్డేకి రాసిన లేఖల పర్యవసానంవల్లే ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బదిలీలు కూడా జరిగాయని డివిజన్ బెంచి అభిప్రాయపడింది. ముఖ్యమంత్రికి కావాల్సింది సుప్రీంకోర్టు కొలీజియం చేసిందన్న భావన కలిగేవిధంగా కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనమీద ఉన్న కేసుల విచారణలో జాప్యం జరగడానికి అలా ఆరోపణలు చేశారని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక్కడ అర్థం కాని విషయం ఏమంటే ఆ కేసు విచారణని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చేయడం లేదు. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఆ కేసులని విచారిస్తు న్నారు. ఈ బదిలీల వల్ల ఆ కేసుల విచారణ ఏ విధంగా కుంటు పడుతుందో అర్థం కాని విషయం. కోర్టు ఎన్ని రోజుల్లో పరిష్కరిం చాలో హైకోర్టులు చెబుతాయి తప్ప ఏ విధంగా పరిష్కరించాలో చెప్పజాలవు. అలా చెబితే అది న్యాయవ్యవస్థ స్వతంత్రతకే భంగం వాటిల్లుతుంది. ప్రభుత్వ భూముల వేలం కేసునుంచి న్యాయమూర్తి రాకేశ్ కుమార్ వైదొలగాలని ప్రభుత్వం దాఖలు చేసిన కేసుని పరిష్కరించా ల్సిన కోర్టు తన పరిధిలో లేని అంశాల గురించి వ్యాఖ్యానించడం ఆశ్చర్యాన్ని కాదు ఆందోళనని కల్గిస్తుంది. పైగా లెజిస్లేటివ్ కౌన్సిల్ మీద ప్రభుత్వం దాడి చేసింది. ఆ తరువాత ఎలక్షన్ కమిషన్ మీద దాడి చేసింది. ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టుల మీద అధికారంలో ఉన్న వ్యక్తులు దాడి చేస్తున్నారని కోర్టు తన ఆందోళనని వ్యక్తం చేసింది. అక్కడితో ఊరుకోలేదు. 2011 నుంచి విచారణలో ఉన్న కేసుల్లో ఇంతవరకు విచారణాంశాలను నిర్ధారించకపోవడం అపహాస్యం కాదా అని డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. కోర్టుల్లో జాప్యానికి కారణాలు అనేకం. దానికి సమాధానాన్ని సంబం ధిత కోర్టు వివరిస్తుంది. మరొకరు వివరించలేరు. సీబీఐ ఏర్పాటు న్యాయబద్ధం కాదని అస్సాం హైకోర్టు ఇచ్చిన తీర్పు దాదాపు ఎని మిదేళ్లుగా సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. ఈ జాప్యానికి కారణం ఏమిటి? సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ఇటీవల ఇదే విషయాన్ని ప్రస్తావించారు కూడా. న్యాయమూర్తి రాకేశ్ కుమార్ విచారణ అంశం కానీ చాలా విష యాలను తన ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. అందులో ముఖ్యమైంది గూగుల్‌లో ముఖ్యమంత్రి గురించిన ప్రస్తావన. కోర్టు విచారణలో ఉన్న అంశం ఏమిటి? న్యాయమూర్తి ప్రస్తావించిన అంశాలు ఏమిటి? విచిత్రమైన అంశం ఏమంటే మనదేశ జ్యురిస్ప్రుడెన్స్ ప్రకారం నేర నిరూపణ జరిగేవరకు ముద్దాయిలను అమాయకులుగా పరిగణిం చాలి. ఇది ప్రాథమిక సూత్రం. ఈ విషయాన్ని ఎవరూ విస్మరించ కూడదు. తప్పుచేసిన వ్యక్తికి శిక్ష పడటం ఎంత అవసరమో, అమాయ కులకి శిక్ష పడకుండా చూడాల్సిన బాధ్యత కూడా కోర్టుల మీద ఉంటుంది. అంతేకాని కోర్టు విచారణలో లేని అంశాల మీద మాట్లా డటం పరిశీలనలు చేయడంలోని ఔచిత్యం బోధపడటం లేదు. కోర్టుల మీద విశ్వసనీయత పెరగాలంటే కోర్టులు జారీచేసే ఉత్త ర్వులు, తీర్పులు తగు కోణాలతో ఉండాలి. అంతేకాదు అవి వెంటనే పార్టీలకు అందుబాటులో ఉండాలి. తీర్పులు నిష్పక్షపాతంగా ఉండా లంటే అవి తగు కారణాలతో ఉండాలి. కోర్టు పరిధిలో ఉన్న అంశాల మీదే చర్చ జరగాలి. వాటి గురించి విశ్లేషణ ఉండాలి. అదేవిధంగా కోర్టు ఒక నిర్ణయానికి రావడానికి కారణాలనేవి ఎలాంటి పూర్వ భావ నలు, పక్షపాతం లేకుండా ఉండాలి. విచారించాల్సిన దరఖాస్తులో కానీ కేసులో గానీ లేని విషయాలని ప్రస్తావిస్తే అది తగు కారణాలతో చెప్పిన ఉత్తర్వుగా గానీ తీర్పుగా కానీ పరిగణించ బడదు. పార్టీలు లేవనెత్తిన అంశాలన్నింటిపైనా సమాధానాలు కోర్టు ఉత్తర్వుల్లో ఉండాలి. అలా లేనప్పుడు ఆ కోర్టు మీద విశ్వసనీయత ఏర్పడదు. అనవసర కామెంట్స్, తగు కారణాలు లేనప్పుడు ఆ వ్యాఖ్యానాలని తొలగించుకోవడానికి, సరైన కోణాలలో తీర్పు కోసం పార్టీలు పై కోర్టులకి వెళ్లాల్సి వస్తుంది. దానివల్ల కోర్టులమీద అనవసర భారం పడుతుంది. తగు కారణాలతో తీర్పులు ప్రకటించడంవల్ల కోర్టుల మీద భారం తగ్గుతుంది. న్యాయమూర్తి ఏ స్థాయిలో ఉన్నప్పటికీ అతను స్వేచ్ఛగా, స్వతంత్రంగా తీర్పులను ప్రకటించాలి. తన మనఃసాక్షిగా, చట్టానికి అనుగుణంగా తీర్పులను ఇవ్వాలి తప్ప, కోర్టు విచారణలో లేని అంశాలను ప్రస్తావించకూడదు. నిష్పక్షపాతం గురించి సుప్రీంకోర్టు ఎస్.పి గుప్తా కేసులో వివరించింది. అది ఇప్పటికీ ఓ గీటురాయి. కేసు విచారణ గురించి సుప్రీంకోర్టు ఆ తీర్పుని ప్రకటించినప్పటికీ అది అన్ని ఉత్తర్వులకి, తీర్పులకి వర్తిస్తుంది. ఓ న్యాయమూర్తి నిష్పక్ష పాతాన్ని, అతని ఉత్తర్వులు ఎలాంటి పక్షపాతంలో లేవని అనుకోవ డానికి రెండు పరీక్షలు ఉన్నాయి. అవి– వ్యక్తిగత పరీక్ష: న్యాయమూర్తికి కేసులో ఎలాంటి వ్యక్తిగత ఆసక్తి ఉండకూడదు. తన విశ్వాసాల వల్ల ఎదుటి వ్యక్తికి హాని జరుగకూడదు. తటస్థ పరీక్ష (ఆబ్జెక్టివ్ టెస్ట్): తన నిష్పక్షపాతం మీద ఎలాంటి సంశయం రాకుండా ఉండే విధంగా విచారణ జరపాలి. చాలాసార్లు సుప్రీంకోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. పార్టీలకు విశ్వాసం లేనప్పుడు న్యాయమూర్తి ఆ కేసుని నిష్పక్ష పాతంగా పరిష్కరించినా అలాంటి భావన పార్టీలకు కలగదు. అలాం టప్పుడు ఆ కేసులని పరిష్కరించడం ఎందుకు? అనవసర విషయాల ప్రస్తావన మరెందుకు? ఇలాంటి వాటివల్ల కోర్టులపై గౌరవం తగ్గే అవకాశం లేదా? చివరగా ఇద్దరు న్యాయమూర్తులు గుర్తుకొస్తున్నారు. ఒకరు జస్టిస్ మురళీధర్. రెండవవారు జస్టిస్ చంద్రూ. మొదటి న్యాయమూర్తి ఢిల్లీ హైకోర్టు నుంచి పంజాబ్/హరియాణాకి బదిలీ అయినప్పుడు చండీగఢ్‌లో న్యాయమూర్తులు దారి పొడవునా నిల్చొని ఆహ్వానం పలికారు. అదే విధంగా జస్టిస్ చంద్రూ నిరాడంబరంగా తన పదవీ విరమణ చేశారు. ప్రజల న్యాయమూర్తిగా ఆయనను కొని యాడారు. దేశం ఇలాంటి న్యాయ మూర్తులనే కోరుకుంటుంది. మంగారి రాజేందర్ (వ్యాసకర్త గతంలో జిల్లా జడ్జిగా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా పనిచేశారు) ఈ–మెయిల్ : rajenderzimbo@gmail.com -
ఆ వ్యాఖ్య రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధం
రాజ్యాంగంలోని అత్యంత ముఖ్యమైన అధికరణ ఏది అని ఎవరైనా నన్ను అడిగితే అది అధికరణ 32 అని చెబుతానని రాజ్యాంగ నిర్మాత డా‘‘ బి.ఆర్ అంబేడ్కర్ ఒకసారి అన్నారు. ఈ అధికరణ రాజ్యాంగానికి ఆత్మ, హృదయం లాంటిదని అన్నారు. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే వాటికి రక్షణని ఇచ్చేది అధికరణ 32 మాత్రమే. రిపబ్లిక్ టీవీ అధినేత అర్ణబ్ గోస్వామికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం,, యూపీ పోలీసులు అరెస్టు చేసిన కేరళ జర్నలిస్టు కప్పన్ బెయిల్ పిటిషన్‌ని వారాల తరబడి వాయిదా వేయడం చర్చనీయాంశమైంది. రాజ్యాంగంలోని అధికరణ 32 ప్రకారం వ్యక్తులు దాఖలు చేస్తున్న దరఖాస్తులను ఇకనుంచి నిరుత్సాహపరచడానికి ప్రయత్నం చేస్తామని సుప్రీంకోర్టు బెంచి వ్యాఖ్యానించడం రాజ్యాంగ సూత్రాలకే విరుద్ధం. సిద్ధిక్ కప్పన్ కేరళ రాష్ట్రానికి చెందిన జర్నలిస్ట్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాథ్రస్లో జరిగిందని ఆరోపణలొచ్చిన ఓ సామూహిక మానభంగం, హత్య కేసులని రిపోర్టు చేయడానికి వెళ్తున్నపుడు ఆయన్ని ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. ఆ దరఖాస్తుని విచారిస్తున్న సుప్రీంకోర్టు బెంచి రాజ్యాంగంలోని అధికరణ 32 ప్రకారం వ్యక్తులు దాఖలు చేస్తున్న దరఖాస్తులను ఇకనుంచి నిరుత్సాహపరచడానికి ప్రయత్నం చేస్తామని వ్యాఖ్యానించింది. ఆ బెంచికి నేతృత్వం వహిస్తున్న భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. బాబ్డే.. రిపబ్లిక్ టీవీ అధినేత (యాంకర్) అర్ణబ్ గోస్వామికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినపుడే దేశ ప్రజల దృష్టి, మరీ ముఖ్యంగా మేధావుల దృష్టి అధికరణ 32 వైపు మరలింది. దేశమంతా ఈ వ్యాఖ్య మీద చర్చించడం మొదలు పెట్టారు. ఇంతకీ రాజ్యాంగంలోని అధికరణ 32 ఏం చెబుతుంది? ఈ అధికరణని రాజ్యాంగంలో పొందుపరిచేటపుడు రాజ్యాంగ నిర్మాతల అభిప్రాయం ఏమిటి? ఈ అధికరణ ప్రాముఖ్యత ఏమిటి? ఇవీ ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి జవాబులని వెతుక్కునేముందు ఇటీవల కాలంలో దేశంలో జరుగుతున్న సంఘటనలని, కేసులని పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా వుంది. వాటికీ ఈ అధికరణకీ ఉన్న సంబంధం ఏమిటీ? అన్న విషయాలను పరిశీలిద్దాం. అక్టోబర్ 5 వ తేదీన హాథ్రస్‌కి వెళ్తున్న సందర్భంలో పోలీసులు ముందుగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సె. 151 ప్రకారం కప్ప¯Œ ని ముందస్తు అరెస్టు చేశారు. ఎవరైనా నేరం చేస్తారని భావించినపుడు ఆ నేరాన్ని పోలీసులు మరో విధంగా నిలుపుదల చేయలేనపుడు ఈ అరెస్టుల్ని చేస్తారు. ఆ తరువాత రాజద్రోహం, ఇంకా యు.ఎ.పి.ఎ చట్టాలలోని కొన్ని సెక్షన్ల కింద కేసులని కూడా తనపై నమోదు చేశారు. ప్రముఖ విప్లవ కవి వరవరరావు (80) న్యూరోలాజికల్, యూరో లాజికల్ వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ మధ్యే ఆయన్ని నిర్బంధించి రెండు సంవత్సరాలు దాటింది. సుధా భరద్వాజ్ (59) కూడా ఆగస్టు 2018 నుంచి నిర్బంధంలో ఉంటూ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. స్టాన్‌స్వామి (83) పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. ఆయన జైల్లోనే ఉన్నారు. వాళ్ల కేసుల్లో అత్యవసరం లేదు. కానీ అర్ణబ్ గోస్వామి కేసులో సుప్రీం కోర్టుకి అత్యవసరం కనిపించింది. అందులో తప్పు లేకపోవచ్చు. కొన్ని కేసుల్లో హైకోర్టుకి వెళ్లమని సుప్రీంకోర్టు అంటుంది. అలాంటి కేసులని సుప్రీంకోర్టు ఎంపిక పద్ధతిన విచారిస్తుంది. దీనిపై నిలకడ లేకపోవడం ఆందోళనకరం. చట్టం ఎందుకు అందరినీ ఒకే విధంగా చూడలేకపోతోంది? రాజ్యాంగంలోని 3వ విభాగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అధికరణ 32 కూడా అందులో భాగం. తమ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినపుడు, లేదా వాటిని అమలు చేసుకోవ డానికి దేశం లోని ఏ వ్యక్తి అయినా అధికరణ 32ని ఆశ్రయించి సుప్రీంకోర్టు తలుపు తట్టవచ్చు. రాజ్యాంగంలోని అత్యంత ముఖ్యమైన అధికరణ ఏది అని ఎవరైనా నన్ను అడిగితే అది అధికరణ 32 అని చెబుతానని రాజ్యాంగ నిర్మాత డా‘‘ బి.ఆర్ అంబేడ్కర్ ఒకసారి అన్నారు. అది లేకుండా రాజ్యాంగాన్ని ఊహించలేం. దాన్ని తప్ప మరే అధికరణని నేను ఉదహరించలేను. ఈ అధికరణ రాజ్యాంగానికి ఆత్మ, హృదయం లాంటిదని అంబేడ్కర్ అన్నారు. రాజ్యాంగ నిర్మాతలు ఈ విధంగా కూడా అన్నారు. ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్లితే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఉపశమనాలని పొందవచ్చు. అన్ని ప్రాథమిక హక్కులకి రక్షణని ఇచ్చేదీ.. ముఖ్యమైనదీ అధికరణ 32 మాత్రమే. సివిల్, క్రిమినల్ కేసుల్లో ఓడిపోయిన వ్యక్తి హైకోర్టులో అప్పీలుని దాఖలు చేసుకోవచ్చు. ఆ తరువాత సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు. అయితే ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్లితే, బాధిత వ్యక్తి అధికరణ 32 ప్రకారం సుప్రీంకోర్టునీ, అధికరణ 226 ప్రకారం హైకోర్టునీ ఆశ్ర యించవచ్చు. హైకోర్టుని ముందుగా ఆశ్రయించి ఆ తరువాత సుప్రీం కోర్టుకి వెళ్ళాలన్న నియమం లేదు. బాధిత వ్యక్తి నేరుగా తన ప్రాథ మిక హక్కులకి భంగం వాటిల్లినపుడు, లేదా అమలు పరచుకోవ డానికి నేరుగా సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు. అధికరణ 32 ప్రాథ మిక హక్కు. కానీ అధికరణ 226 ప్రాథమిక హక్కు కాదు. గతంలో పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ఇప్పుడు సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న అంజనా ప్రకాశ్ అర్ణబ్ గోస్వామికి బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ వ్యాసంలో ఇలా అభిప్రాయపడ్డారు. నవంబర్ 11వ తేదీన సుప్రీం కోర్టు బెంచి ప్రత్యేకంగా సమావేశమై బెయిల్ మంజూరు చేయడం ద్వారా భారత సుప్రీంకోర్టు ప్రపంచంలోనే ఎంత శక్తివంతమైనదో మరోసారి ఈ కేసు ద్వారా రుజువైంది. సుప్రీంకోర్టు ఎంత శక్తివం తమైనది అనే అంశంపై న్యాయవాదులు ఏ విధంగా జోక్ చేస్తారో కూడా ఆవిడ తన వ్యాసంలో ప్రస్తావించారు. ఆడని మగగా, మగని ఆడగా మాత్రం సుప్రీంకోర్టు ప్రకటించలేదు. ఇది తప్ప సుప్రీంకోర్టు ఏదైనా చేయగలదని అన్నారామె. సెలవు రోజైన నవంబర్ 9న బొంబాయి హైకోర్టు అర్ణబ్ గోస్వామి కేసుని ఐదుగంటలపాటూ విన్నది. సుప్రీం కోర్టులో కూడా అర్ణబ్ దరఖాస్తుని దాఖలు చేశాడు. అది 11న లిస్ట్ అయింది. ఆ రోజంతా సుప్రీంకోర్టు వాదనలని విని అర్ణబ్ని విడుదల చేయాలని ఆదేశించింది. కోర్టులు చాలాసార్లు ఏకపక్షంగా, సహేతుకంగానే కేసుల్లో జోక్యం చేసుకుంటాయి. వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకి కోర్టు అత్యంత ప్రాధాన్యతలని ఇవ్వాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 22 దీన్నే చెబుతున్నాయి. అయితే ఆర్టికల్ 14ని కూడా మనం మరచిపోకూడదు. గోస్వామి కేసు వాదనలు ముగిస్తూ న్యాయవాది కపిల్ సిబల్ ఇలా అన్నారు. ‘కేరళ రాష్ట్రానికి చెందిన కప్పన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అధికరణ 32 ప్రకారం మేం కోర్టు తలుపు తట్టాం. కింది కోర్టుకి వెళ్ళండి అని 4 వారాల తరువాత ఆ కేసుని పోస్ట్ చేశారు’. కానీ ఈ వాదన మీద సుప్రీంకోర్టు ఎలాంటి వ్యాఖ్యానాన్ని చేయలేదు. అలా కప్పన్ కేసు మళ్ళీ సుప్రీంకోర్టు ముందుకు వచ్చినపుడు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే అధికరణ 32 ప్రకారం సుప్రీంకోర్టుకి రావడాన్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నం చేస్తామని అన్నారు. ఈ వ్యాఖ్యతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. అధికరణ 32 ప్రకారం వచ్చిన హక్కులని రాజ్యాంగం ప్రకారం మాత్రమే సస్పెండ్ చేయ వచ్చు. ఎల్. చంద్రకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏడుగురు సభ్యులు గల సుప్రీంకోర్టు బెంచి అధికరణ 32 అనేది రాజ్యాంగంలోని మౌలిక అంశమని, అది అంతర్భాగమని వ్యాఖ్యానించింది. ఎమర్జెన్సీ కాలంలో ఏడీఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసులో సుప్రీంకోర్టు మరోవిధంగా అభిప్రాయ పడింది. ఎమర్జెన్సీలో ఈ హక్కు ఉండదని మెజారిటీ న్యాయ మూర్తులు అభిప్రాయపడ్డారు. ఆ తరువాత 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అభిప్రాయాన్ని పార్లమెంట్ సవరించింది. ఎమర్జెన్సీ కాలంలో కూడా అధికరణ 20, 21లలో పేర్కొన్న హక్కులకి భంగం వాటిల్లితే సుప్రీంకోర్టునీ అదేవిధంగా హైకోర్టునీ ఆశ్రయించవచ్చు. ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్లితే సుప్రీంకోర్టు అధికరణ 32 ప్రకారం అవసరమైన ఉత్తర్వులని, రిట్స్‌ని జారీ చేయవచ్చు. అధికరణ 32 ప్రకారం దేశంలోని ప్రతి వ్యక్తికీ హక్కుల అమలుని నిరుత్సాహపరుస్తామని బహుశా పనిభారం వల్ల ప్రధాన న్యాయ మూర్తి అని అంటారు. సుప్రీంకోర్టు విపరీత పనిభారంతో ఉంది. ఆ మాటకొస్తే దేశంలోని ప్రతికోర్టూ పనిభారంతో నలిగిపోతున్నాయి. ఏది ఏమైనా ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలోని ఆంతర్యం బోధ పడలేదు. సుప్రీంకోర్టు పనిభారం తగ్గించడానికి కోర్టు ఆఫ్ అప్పీల్స్ అన్న వ్యవస్థ ఏర్పాటు చేసి దేశంలోని ఐదారు ప్రాంతాల్లో వీటి బెంచీలు ఏర్పాటు చేయాలని కొంతమంది న్యాయకోవిదులు సూచిం చారు. ఆ సూచనలు అలాగే ఉండిపోయాయి. ఆ విధంగా వాటిని ఏర్పాటు చేసినా, అధికరణ 32 ప్రకారం పనిభారం సుప్రీం కోర్టు పైనే ఉంటుంది. కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ లాంటి మరో వ్యవస్థ కన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచి దేశంలో నాలుగైదు బెంచీలు ఏర్పాటు చేయడం వల్ల ఈ సమస్యని కొంతమేరకు అధి గమించ వచ్చేమో. ఈ మధ్యన కోర్టు ధిక్కార కేసుల సంఖ్య కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితికి అందరూ కారకులే. వీటి పరిష్కా రానికి మరో వ్యవస్థ రావాల్సి ఉంటుందా? ఆలోచించాలి. అంతేగానీ రాజ్యాంగ ఆత్మని చంపినా, తగ్గించినా రాజ్యాంగం నిరర్థకం అవు తుంది. వ్యాసకర్త మంగారి రాజేందర్ ఈ–మెయిల్ : rajenderzimbo@gmail.com -
హైకోర్టు ఆదేశాలు అసాధారణం
దర్యాప్తు నిలిపివేయడమే కాకుండా, ఎఫ్ఐఆర్ గురించిగానీ, ఎఫ్ఐఆర్లోని విషయాలనుగానీ ఏ మాధ్యమంలో కూడా ప్రచురించకూడదన్న అసాధారణ ఆదేశాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీ చేసింది. ఇలాంటి ఉత్తర్వులు ఏ కారణాలతో జారీ చేసిందో అర్థం కాలేదు. కోర్టులు జారీ చేసే ప్రతి ఉత్తర్వు, ప్రతి తీర్పు సహేతుక కారణాలతో ఉండాలి. సహేతుక కారణాలు ఉన్నప్పుడు కోర్టులమీద విశ్వసనీయత పెరుగుతుంది. న్యాయపరిపాలనలో అత్యంత ముఖ్యమైన అంశం సహేతుక కారణాలు. అప్పుడే ప్రజాస్వామ్యయుతంగా కన్పిస్తుంది. సహేతుక కారణాలతో ఉత్తర్వులు, తీర్పులు అనేవి సహజ న్యాయసూత్రాలకి వెన్నెముక లాంటివి. అప్పీలుకి వెళ్లడానికి, పోకుండా ఉండటానికి ఆ కారణాలు మార్గనిర్దేశనం చేస్తాయి. నా గొంతు కింద ఆర్టికల్ 19 నలిగిపోతుంది నేనిక మాట్లాడను / ధిక్కారమో, దండనో నన్ను పరుగెత్తిస్తుంది / భయపడుతుంది అంటాడు ఓ తెలుగు కవి. ఆ విధంగా అంటూనే ఆయన చెప్పా ల్సింది చెబుతాడు. భావ ప్రకటనా స్వేచ్ఛని, పత్రికా స్వేచ్ఛని పాల కులు అణిచివేసే అవకాశాలు ఉంటాయి. కోర్టులు రక్షిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఇందుకు భిన్నమైన పరిస్థితి మన దేశంలో కనిపిస్తూ ఉంది. అమరావతిలో జరిగిన భూమి అమ్మకాల్లో జరిగిన అవకతవక కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీసుల దర్యాప్తుని నిలిపివేయడంతో పాటు ప్రథమ సమాచార నివేదికలోని విషయాలని పత్రికల్లో కానీ, ఎలెక్ట్రానిక్ సాంఘిక మాధ్యమాల్లో కానీ ప్రచురించకూడదని, హైకోర్టు ఇటీవల ఆదరాబాదరాగా ఆదేశాలను జారీ చేసింది. రాజకీయంగా ప్రతీకారం తీర్చుకోవడానికి తన క్లయింట్ అయిన మాజీ అడ్వొకేట్ జనరల్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని, అతని న్యాయవాది ముకుల్ రోహత్గీ హైకోర్టు ముందు వాదనలు చేశారు. తన క్లయింట్ రిట్ పిటిషన్ వేసిన తర్వాత ఈ కేసు నుంచి ఓ న్యాయమూర్తి వైదొలిగిన తర్వాత ప్రథమ సమా చార నివేదికను విడుదల చేశారని, దాన్ని పత్రికలకూ పంపించి నానా హంగామా సృష్టించారని, అందుకని అతడిని అరెస్టు చేయ కూడదనీ, దర్యాప్తుని కూడా నిలిపివేయాలని ఇంకా కొన్ని ఉపశమనాలని ఇవ్వా లని కోర్టుని కోరారు. ప్రథమ సమాచార నివేదికలోని అంశాలను ప్రింట్, ఎలక్ట్రానిక్ సాంఘిక మాధ్యమాల్లో ప్రచురించ కుండా ఆదే శాలు జారీ చేయాలని కోర్టును కోరారు. ఇదివరకే ఈ విషయాలు అన్ని మాధ్యమాల్లో వచ్చేశాయని అందుకని ఇప్పుడు అలాంటి ఉత్తర్వులు జారీ చేసినా అవి నిష్ఫలమని ప్రతివాదుల న్యాయవాది కోర్టుకు విన్నవించాడు. ఆరోపణలు ఉన్నాయి కాబట్టే కేసుని నమోదు చేశారని, దర్యాప్తులో ఇప్పుడు జోక్యం చేసుకోవడం తగదని ప్రతివాదుల న్యాయవాదులు కోర్టుకి విన్నవించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు దరఖాస్తుదారు కోరిన ఉపశమనాలని మంజూరు చేసింది. దర్యాప్తుని నిలిపివేసింది. ప్రథమ సమాచార నివేదికలో ఆరోపించిన విషయాలని ఏ మాధ్యమాల్లో ప్రచురించకూడదని నిషేధిస్తూ ఉత్తర్వులని హైకోర్టు జారీ చేసింది. ఇందులో విశేషం ఏమంటే కోర్టు ముందు దరఖాస్తు చేసుకోని వ్యక్తులకి కూడా ఈ ఉపశమనాలు వర్తిస్తాయని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. గతంలో ఇలాంటిది ఏ కోర్టూ ఇచ్చిన సందర్భం నాకేతే కనిపించలేదు. ఇది చాలా అరుదైన ఆదేశం. ఈ నేపథ్యంలో ప్రథమ సమాచార నివేదికని పోలీసులు ఎప్పుడూ విడుదల చేయాల్సి ఉంటుంది? పోలీసుల దర్యాప్తులో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా? అదేవిధంగా పత్రికా స్వేచ్ఛని, భావ ప్రకటనా స్వేచ్చని నిలిపి వేయవచ్చా? ఇవి అందరినీ వేధిస్తున్న ప్రశ్నలు. ప్రాథమిక దృష్టితో చూసినప్పుడు విచారణకు అర్హమైన (కాగ్నిజ బుల్) నేర సమాచారం అందుకున్న పోలీసులు ఎలాంటి జాప్యం లేకుండా ప్రథమ సమాచార నివేదికను విడుదల చేసి, దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన 154 చెబుతున్న విషయం ఇదే. ఈ విషయంలో ఎంపిక చేసుకునే అవ కాశాన్ని చట్టం పోలీసు అధికారికి ఇవ్వలేదు. అది విశ్వసనీయమైన సమాచారమా? కాదా అనే విషయంలో కూడా పోలీసు అధికారికి ఎలాంటి విచక్షణాధికారం లేదు. సమాచారంలో విశ్వసనీయత కన్పిం చడం లేదన్న కారణంగా కానీ, అవసరమైన వివరాలు లేవని గానీ ప్రథమ సమాచార నివేదికను విడుదల చేయకుండా ఉండే అవకాశం లేదు. కేసు ప్రాథమిక దశలో కాగ్నిజబుల్ సమాచారం అన్నదే కీలక మైన విషయం. అందులోని విశ్వసనీయత గురించి చూడాల్సిన అవసరం లేదు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారన్న విషయం దర్యాప్తులో తేలితే కేసుని పోలీసు అధికారి మూసివేసి, ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తిపై చర్య తీసుకోవచ్చు. (తులసీరామ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎం.పి. 1993, క్రిమినల్ లా జర్నల్ 1165 సుప్రీం కోర్టు). ప్రథమ సమాచార నివేదిక విడుదల అయిన తరువాత దర్యాప్తుని కోర్టు నిలిపివేయవచ్చా? ప్రథమ సమాచార నివేదికలను నిలిపివేసే అధికారం, కొట్టివేసే అధికారం రాష్ట్ర హైకోర్టులకి, సుప్రీంకోర్టులకి ఉన్నాయి. అయితే ప్రథమ సమాచార నివేదికలోని ఆరోపణల్లో ఎలాంటి కాగ్నిజబుల్ నేరం లేనప్పుడు మాత్రమే ఈ కోర్టులు జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. దేశ పౌరులను అన్యా యంగా కేసుల్లో ఇరి కించకుండా, వాళ్లు ఇబ్బంది పడకుండా ఉండటా నికి హైకోర్టు తన స్వయంసిద్ధ అధికారాలని ఉపయోగించవచ్చు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సె.482 ప్రకారంగా రాజ్యాంగంలోని అధికరణ 226 ప్రకారంగా హైకోర్టుకి ఈ అధికారాలు ఉంటాయి. కాగ్నిజబుల్ నేరాలని, కోర్టు అనుమతి లేకుండా పోలీసులు నేరుగా దర్యాప్తు చేసుకోవచ్చు. తమ స్వయంసిద్ధ అధికారాలని ఉప యోగించి కోర్టులు ఈ దర్యాప్తులో జోక్యం చేసుకోకూడదు. కోర్టులు వ్యక్తిగత స్వేచ్ఛని చట్టం పరిధిలో నియంత్రించాలి. కోర్టుకి తన విచక్షణాధికారాలని అవసరమైన కేసులో వినియోగించవచ్చు. ఇదే విషయాలని స్టేట్ ఆఫ్ హరియాణా వర్సెస్ భజన్ లాల్ 1992, ఏఐఆర్ 604 సుప్రీంకోర్టు కేసులో కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు ఎలా చేయాలి? ఎవరు చేయాలి అన్నది పోలీసుల విచక్షణను బట్టి ఉంటుంది తప్ప హైకోర్టు నిర్దేశించకూడదు. ఏ విధంగా దర్యాప్తు చేయాలన్న విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోకూడదు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు యం.సి. అబ్రహాం వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర (2003) 2 ఎస్సిసి 649 కేసులో చెప్పింది. ఇదే విషయాన్ని మళ్లీ సుప్రీంకోర్టు స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వర్సెస్ అమన్ మిట్టల్ మరి ఒకరు (తీర్పు తేది సెప్టెంబర్ 4, 2019) కేసులో మళ్లీ చెప్పింది. అరుదైన కేసులో మాత్రమే కోర్టులు దర్యాప్తులో జోక్యం చేసు కొని దర్యాప్తుని నిలిపివేయవచ్చు. కోర్టుని ఆశ్రయించిన వ్యక్తులకే ఉపశమ నాలని ఇవ్వడం ఇంతకాలం వస్తూ ఉంది. ఇప్పుడు అది మారుతుం దేమో వేచి చూడాలి. రాజ్యాంగంలోని అధికరణ 226 ప్రకారం హైకోర్టు తన అసా ధారణ అధికారాలని ఉపయోగించి, అవసరమైనప్పుడు న్యాయాన్ని రక్షించడానికి దర్యాప్తుని నిలిపివేయవచ్చు. చాలా కేసుల్లో దర్యాప్తులని నిలిపివేయడాన్ని గమనించిన సుప్రీంకోర్టు తన ఆందోళనని వ్యక్తపరి చింది. ఇంతియాజ్ అహ్మద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ (2012) కేసులో దర్యాప్తు నిలుపుదల గురించిన ప్రాముఖ్యతని కోర్టు ఇలా వివరిం చింది. ‘ప్రథమ సమాచార నివేదిక విడుదల అయిన తరువాత అదే విధంగా కేసు విచారణ జరుగుతున్నప్పుడు అవసరమైన కేసుని నిలుపుదల చేసే హైకోర్టు అధికారం విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ అధికారాన్ని బాధ్యతాయుతంగా హైకోర్టులు నిర్వ ర్తించాలి. దర్యాప్తుని, అదే విధంగా కోర్టుల్లో విచారణని నిలిపివేయడ మన్నది చాలా అసాధారణ ప్రక్రియ. దీన్ని చాలా అవసరమైన కేసుల్లో మితంగా ఉపయోగించాలి. అది కూడా అధికార దుర్వినియోగం అయిన కేసుల్లో, న్యాయహితం కోసం మాత్రమే ఉపయోగించాలి’. ఏది అధికార దుర్వినియోగం? ప్రథమ సమాచార నివేదిక విడు దల కావడం అధికార దుర్వినియోగం అవుతుందా? ఒకవేళ అయితే ప్రతి కేసులో ఇలాంటి పరిస్థితే ఉంటుందేమో. స్టేలు మంజూరు చేసినప్పుడు వాటిని సత్వరంగా విని పరిష్కరిం చాలి. అలాంటి పరిస్థితి మన దేశంలో ఉందా? దర్యాప్తు నిలిపివేయ డమే కాకుండా, ఎఫ్ఐఆర్ గురించిగానీ, ఎఫ్ఐఆర్లోని విషయాలను గానీ ఏ మాధ్యమంలో కూడా ప్రచురించకూడదన్న అసాధారణ ఆదేశాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీ చేసింది. ఇలాంటి ఉత్తర్వులు ఏ కారణాలతో జారీ చేసిందో అర్థం కాలేదు. కోర్టులు జారీ చేసే ప్రతి ఉత్తర్వు, ప్రతి తీర్పు సహేతుక కారణాలతో ఉండాలి. సహేతుక కారణాలు ఉన్నప్పుడు కోర్టులమీద విశ్వసనీయత పెరుగుతుంది. న్యాయపరిపాలనలో అత్యంత ముఖ్యమైన అంశం సహేతుక కార ణాలు. అప్పుడే ప్రజాస్వామ్యయుతంగా కన్పిస్తుంది. సహేతుక కార ణాలతో ఉత్తర్వులు, తీర్పులు అనేవి సహజ న్యాయసూత్రాలకి వెన్నె ముక లాంటివి. అప్పీలుకి వెళ్లడానికి, పోకుండా ఉండటానికి ఆ కార ణాలు మార్గనిర్దేశనం చేస్తాయి. ప్రతి ఉత్తర్వూ తీర్పు మూడు విషయాలని సంతృప్తి పరచాలి. అది ప్రజలకి అందుబాటులో ఉండాలి. ఇరుపక్షాలకి అందుబాటులో ఉండాలి. మూడవది ముఖ్యమైనది తగు కారణాలు కలిగి ఉండాలి. ప్రథమ సమాచార నివేదిక అనేది పబ్లిక్ డాక్యుమెంట్. ఎవరైనా దాన్ని చూడవచ్చు. వ్యాసకర్త: మంగారి రాజేందర్, (గతంలో జిల్లా జడ్జిగా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా పనిచేశారు) మొబైల్ : 94404 83001 -
‘మరడు’ చెబుతున్న గుణపాఠం
నదీ ప్రవాహక ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం కూల్చి వేసినప్పుడు మీడియా గగ్గోలు పెట్టింది. నదీ ప్రవాహక ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టకూడదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా 111 జీవో ఒకటి ఉంది. ఈ జీవో వర్తించే ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలని చేపట్టకూడదు. ‘మరడు’ ఉదంతం ద్వారా నేర్చుకోవాల్సిన గుణపాఠం ఇదే. కేరళ రాష్ట్రంలోని కొచ్చి ప్రాంతంలో జీవ వైవిధ్యం ఉన్న నది పరీవాహక ప్రాంతం వెంబనాడ్ నది పరీవాహక ప్రాంతం. ఈ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదన్న ‘సీఆర్‌జెడ్’ ప్రకటనలు ఉన్నాయి. ఒకవేళ చేపడితే ప్రభుత్వాలు ఉపేక్షించినా కోర్టులు ఉపేక్షించే పరిస్థితి ఉండదు. అందుకు ఉదాహరణే ‘మరడు’ కూల్చివేత ఉదంతం. నాలుగువందల కుటుంబాలు నివాసముంటున్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌ని కొచ్చీ దగ్గరలోని మరడులో నాలుగు నిర్మాణ సంస్థలు నిర్మించాయి. ఆ నిర్మాణాలని సుప్రీంకోర్టు ఆదేశాలతో జనవరి 11, 12న ఇంప్లోషన్ పద్ధతిలో కూలి్చవేశారు. హోలీ ఫెమిత్ బిల్డర్స్ ఫ్లాట్స్ నిర్మాణం కోసం మరడు గ్రామ పంచాయతీ నుంచి 18.8.2006 నాడు అను మతి తీసుకున్నారు. ఆల్ఫా వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 19.9.2006 రోజున పంచాయతీ నుంచి ఫ్లాట్స్ నిర్మాణానికి అనుమతి తీసుకుంది. ఈ నిర్మాణాలలో చాలా ఉల్లంఘనలు ఉన్నాయని సీనియర్ టౌన్ ప్లానర్ కేరళ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి తెలియజేశాడు. దీంతో సంబంధిత నిర్మాణ సంస్థలకు షోకాజ్ నోటీసులను జారీ చేయమని ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ గ్రామ పంచాయతీని ఆదేశించారు. గ్రామ పంచాయతీ నుంచి నోటీసు అందగానే ఆ నిర్మాణ సంస్థలు కేరళ హైకోర్టులో రిట్ దాఖలు చేసి సింగిల్ జడ్జి ద్వారా స్టే ఉత్తర్వులు పొంది తమ నిర్మాణాలని పూర్తి చేశారు. ఆ తరువాత గ్రామ పంచాయతీ నుంచి నెంబర్లని కూడా పొందారు. ఆ తరువాత ఆ నోటీసులను సింగిల్ జడ్జి కొట్టివేశారు. ఈ ఉత్తర్వులకి వ్యతిరేకంగా మరడు గ్రామ పంచాయతీ, మరడు మున్సిపాలిటీలు డివిజన్ బెంచి ముందు అప్పీలుని 2013లో దాఖలు చేశాయి. ఈ రెండింటినీ హైకోర్టు 2 జూన్ 2015న తన తీర్పుని బిల్డర్స్ వైపున చెప్పింది. రివ్యూ దరఖాస్తుని కూడా కొట్టివేసింది. కేరళ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ సుప్రీంకోర్టులో ప్రత్యేక అనుమతి దరఖాస్తుని 2016లో దాఖలు చేసింది. నవంబర్ 27, 2018 రోజున సుప్రీంకోర్టు, ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆ జోన్లో ఆ నిర్మాణాలు ఉన్నాయో లేదా చూడాలని కమిటీని ఆదేశించింది. ఈ కట్టడాలు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలోకి వస్తాయని కమిటీ సుప్రీంకోర్టుకి తెలియచేసింది. కమిటీ నిర్ణయాంశాలని అంగీకరిస్తూ న్యాయమూర్తులు అరుణ్‌మిశ్రా, నవీన్ సిన్హాలతో కూడిన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఈ నిర్మాణాలని ఒక నెల లోపు కూలి్చవేయాలని మే 8, 2019న ఆదేశించింది. తమ వాదనలని వినలేదని ఆ ఫ్లాట్స్‌లో నివాసం ఉంటున్న వ్యక్తులతో బిల్డర్స్ వేసవి రోజుల్లో దరఖాస్తులు దాఖలు చేసి ఆరువారాల స్టేని పొందారు. వేసవి సెలవుల తరువాత ఈ కేసు మళ్లీ న్యాయ మూర్తి అరుణ్ మిశ్రా నేతృత్వంలోని బెంచి ముందుకు వచ్చింది. ‘బెంచి హంటింగ్’ పద్ధతిని విమర్శిస్తూ ఆ దరఖాస్తులని జూలై 5, 2019 రోజున కొట్టివేశారు. ఆ తరువాత బిల్డర్స్ దాఖలు చేసిన రివ్యూ దరఖాస్తులని కూడా కొట్టివేశారు. తమ ఉత్తర్వులని అమలుపరచడంలేదని తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరుస్తూ సెపె్టంబర్ 20 లోగా కూల్చివేయాలని, అలా చేయని పక్షంలో సెపె్టంబర్ 23 రోజున కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ ముందు హాజరు కావాలని సుప్రీంకోర్టు డివిజన్ బెంచి సెపె్టంబర్ 6, 2019న ఆదేశించింది. కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సెపె్టంబర్ 23న సుప్రీంకోర్టు ముందు హాజరైనాడు. కూల్చివేత అమలు గురించి ప్రణాళికను సిద్ధం చేసి కోర్టుకు సమర్పించమని కోర్టు ఆదేశించింది. కూల్చివేత వల్ల తమ ఇళ్లు దెబ్బతింటాయని మరికొందరు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. కానీ ఫలితం లేకపోయింది. ఆ ఫ్లాట్స్‌లోని నివాసితుల నష్టపరిహారం అంచనా వేయడానికి ఓ హైకోర్టు మాజీ న్యాయమూర్తి బాలక్రిష్ణన్ నాయర్‌ని కోర్టు నియమించింది. మార్చి 2018 కోస్టల్ జోన్ నియమాలకి సవరణలు తీసుకొని వచ్చారని, దాని ప్రకారం తమ నిర్మాణాలు సక్రమమేనని, ప్రొసీజరల్ తప్పిదాన్ని సరిచేసుకోవచ్చని, నాలుగు వందల కుటుంబాల జీవితం ఈ కూలి్చవేతతో ముడిపడి ఉందని బిల్డర్స్ కోర్టుకి విన్నవించారు. కోర్టు ఈ వాదనని అంగీకరించలేదు. మంగారి రాజేందర్ మొబైల్ : 94404 83001 (వ్యాసకర్త గతంలో జిల్లా సెషన్స్ జడ్జీగా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా పనిచేశారు) -
పదవ షెడ్యూలు కింద నిష్పక్షపాత ట్రిబ్యునల్
భారతదేశంలో ఆయారామ్ గయారామ్‌లు లెక్కకు మించి ఉన్నారు. ఆయారామ్, గయారామ్ అన్న పదబంధం రావడానికి కారణం హరియాణా రాష్ట్ర ఎమ్మెల్యే గయారామ్. 1967లో ఒకేరోజు ఆయన మూడుసార్లు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారాడు. ఈ పార్టీ ఫిరాయింపులను అరిగట్టడానికి 1985లో రాజ్యాంగంలో పదవ షెడ్యూలుని పొందుపరిచారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించినా, వేరే పార్టీలో స్వచ్ఛంగంగా చేరినా ఆయన పదవిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అయితే వారిని అనర్హులుగా నిర్ణయించే అధికారం స్పీకర్లకీ, చైర్మన్లకీ ఇవ్వడం వల్ల ఈ చట్టం నిరుపయోగంగా మారిపోయింది. మరో విధంగా చెప్పాలంటే అన్ని చట్టాలకు మించి ఇది దుర్వినియోగం అవుతోంది. అయినా ఈ పరిస్థితులను సరిచేయడానికి దేశంలోని ఏ పార్టీ సంసిద్ధతను చూపలేదు. తమ పార్టీ సభ్యులను ఇతర పార్టీలు ఆకర్షించినప్పుడు మాత్రం గగ్గోలు పెట్టడం మామూలు విషయంగా మారింది. శాసన సభ స్పీకర్లు, పరిషత్తు చైర్మన్లుగా అధికార పార్టీకి చెందిన సభ్యులే వుంటారు. వారు పార్టీ సభ్యులుగా కాకుండా తటస్థంగా వుండాలి. కానీ, ఆ సరిస్థితి మన దేశంలో లేదు. అనర్హత దరఖాస్తులను నెలల తరబడి పరిష్కరించకపోవడం, అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు ప్రకటించడం సర్వసాధారణంగా మారిపోయింది. తాము చేస్తున్నది తప్పే అయినా చేస్తున్నానని చెబుతున్న చైర్మన్లని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇటీవల కిషన్ మేఘా చంద్రసింగ్ వర్సెస్ గౌరవ స్పీకర్ మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కేసులో కొన్ని అత్యంత అవసరమైన సూచనలని చేసింది. ఈ సూచనలను మన శాసనకర్తలు గౌరవిస్తారా లేదా అన్నది కాలం నిర్ణయిస్తుంది. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం దాఖలైన శాసనకర్తల అనర్హత దరఖాస్తులను అసాధారణ కారణాలు ఉన్నప్పుడు తప్ప, మిగతా సందర్భాలలో మూడు నెలల కాలపరిమితిలో పరిష్కరించి నిర్ణయాన్ని ప్రకటించాలి. ఏది సముచిత కాలపరిమితి అన్న విషయం కేసులోని వాస్తవ పరిస్థితిని బట్టి ఉంటుంది. పదవ షెడ్యూలను ఉల్లంఘించిన శాసనకర్తలపై దాఖలైన దర ఖాస్తులను ఈ కాలపరిమితిలో పరిష్కరించడ మనేది స్పీకర్, చైర్మెన్ల రాజ్యాంగ విధి. న్యాయమూర్తులు ఆర్.ఎఫ్. నారీమన్, అనిరుద్ధ బోస్, రామసుబ్రమణియన్‌లతో కూడిన బెంచీ ఈ తీర్పుని వెలువరించింది. సుప్రీంకోర్టు ఈ విధమైన సూచనలు చేసింది. ‘స్పీకర్ అనే వ్యక్తి ఒక పార్టీకి చెందిన వ్యక్తి. అలాంటి వ్యక్తి క్వాసీ జ్యుడీషియల్ అథారిటీకి అధ్యక్షత వహించి ఈ అనర్హత దరఖాస్తులను పరిష్కరించడం ఎంత వరకు సమంజసమో పార్ల మెంట్ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అనర్హత దరఖాస్తులను పరిష్కరించడానికి ఓ శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి, సుప్రీంకోర్టు లేదా హైకోర్టు మాజీ న్యాయమూర్తులను ఆ ట్రిబ్యునల్ చైర్మన్‌గా నియమించాల్సిన అవసరం ఉంది. ఈ అనర్హత దరఖాస్తులను సత్వరం పరిష్కరించే విధంగా అవసరమైన మార్పులను పదవ షెడ్యూల్‌కు చేయాల్సిన అవసరం ఉంది’. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన మణిపూర్ శాసన సభ్యుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 2017లో సహకరించాడు. శాసన సభ్యుడిగా అతడు అర్హుడు కాదని, అనర్హత వేటు వేయాలని దరఖాస్తు చేశారు. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా దాన్ని పెండింగ్‌లో ఉంచాడు. దానిపై హైకోర్టులో దరఖాస్తు చేస్తే జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. దీన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టులు ఏం చేయాలో రాజేంద్ర సింగ్ రానా వర్సెస్ స్వామి ప్రసాద్ మౌర్య(2007) ఎస్ సిసి (4) 270 కేసులో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. స్పీకర్ తన అధికార పరిధిని ఉపయోగించనప్పుడు ఆ నిర్వా్యపకత్వంపై న్యాయ సమీక్ష చేయవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రతి అందిన నాలుగు వారాల్లో అనర్హత పిటీషన్లని పరిష్కరించాలని సుప్రీం కోర్టు మణిపూర్ అసెంబ్లీ స్పీకర్‌ని ఆదేశించింది. సుప్రీం కోర్టు చేసిన సూచనను పార్లమెంట్ ఏం చేస్తుందో వేచి చూడాలి. స్పీకర్లుగా బయటి వ్యక్తులను నియమిస్తే ఎలా ఉంటుంది? ఇది సాధ్యమా? పార్లమెంట్ ఆలోచించాలి. మంగారి రాజేందర్ వ్యాసకర్త గతంలో జిల్లా సెషన్స్ జడ్జీగా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా పనిచేశారు మొబైల్ : 94404 83001 -
బిల్లుల మీద చర్చలు తగ్గుతున్నాయా?
ప్రజలకు అవసరమైన శాసనాలు తయారు చేయడం శాసన వ్యవస్థ ప్రధాన కర్తవ్యం. శాసనాలు తయారు చేసే క్రమంలో చర్చలు జరగాలి. బిల్లులలోని నిబంధనలను నిశితంగా పరిశీలించాలి. ప్రజల సొమ్ముని ఏ విధంగా వినియోగించాలి అన్న విషయం మీద కూడా కొన్ని శాసనాలు ఉంటాయి. ప్రజల జీవితాలని ప్రభావితం చేసే శాసనాలని, సంక్షేమ పథకాలకు సంబంధించిన శాసనాలను, వాటిలోని అంశాలని చర్చించడం కూడా శాసనకర్తల విధి. ఈ విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడం కోసమే శాసనసభ్యులని, పార్లమెంటు సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారు. శాసనమండలి సభ్యులని, రాజ్యసభ సభ్యులని కూడా ఈ విధులు నిర్వర్తించడం కోసమే ఎన్నుకుంటారు. ఈ విధ్యుక్త బాధ్యతని సభ్యులు విస్మరిస్తున్నట్లు అనిపిస్తుంది. శాసనాల మీద జరగాల్సినంత చర్చ జరగడం లేదు. జరిగినా కూడా అది బలహీనంగా ఉంటుంది. బిల్లుమీద, బిల్లులోని అంశాల మీదా మాట్లాడుతున్న శాసనకర్తలు అరుదుగా కన్పిస్తున్నారు. బిల్లు ప్రతులని శాసనకర్తలకి ముందుగానే ఇచ్చినప్పటికీ వాటిని అధ్యయనం చేసి వస్తున్న సభ్యుల సంఖ్య తక్కువగా కన్పిస్తుంది. గత పది సంవత్సరాలలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులో 44 శాతం బిల్లులు ఎలాంటి చర్చ లేకుండా చట్టరూపం దాల్చాయని ఓ సర్వే సారాంశం. ఇలా శాసనాలు రావడం వల్ల కార్యనిర్వాహక వ్యవస్థ శాసనాల మాదిరిగా నియమాలు తయారు చేసే విధంగా కొన్ని నిబంధనలు శాసనాల్లో చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా పార్లమెంటు తయారు చేసే శాసనాలు ప్రాతినిధ్య శాసన నిర్మాణం ద్వారా శాసనాలుగా వస్తున్నాయి. పార్లమెంటు, శాసనసభలు చేయాల్సిన పనిని కార్యనిర్వాహక వ్యవస్థకి చేస్తుంది. ఇందుకు ఉదాహరణలుగా కొన్ని శాసనాలని ఉదహరించవచ్చు. చార్టెడ్ అకౌంటెంట్స్ విషయంలో అలాంటిదే జరిగింది. చార్టెడ్ అకౌంటెంట్స్ సంస్థని తొలగించి నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ)ని ఏర్పాటు చేశారు. చార్టెడ్ అకౌంటెట్స్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకునే సంస్థ ఇది. ఈ సంస్థ ఏర్పాటులో పార్లమెంటు పాత్ర శూన్యం. కంపెనీ చట్టం, 2013లో ఏర్పరిచిన ఒకే ఒక నిబంధన సి. 132. ఆ నిబంధనని ఆధారం చేసుకుని ఈ సంస్థని కార్యనిర్వాహక వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఇలాంటి నిబంధనలు చాలా శాసనాల్లో ఉంటున్నాయి. కొత్తగా తయారు చేసే శాసనాల మీద చర్చలు జరుగకపోవడానికి కారణాలు – శాసనాల గురించి అవగాహన ఉన్న సభ్యుల సంఖ్య తగ్గిపోవడం, పార్టీ మార్పిడి వ్యతిరేక చట్టం. దీనికి రెండు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. రాజ్యాంగ నిర్మాణ అసెంబ్లీలో చాలా మంది న్యాయవాదులు ఉండేవారు. మొదటి లోక్‌సభలో న్యాయవాదుల సంఖ్య 36 శాతం. ఈ సంఖ్య మెల్లమెల్లగా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన లోక్‌సభ సభ్యుల్లో 4 శాతం మంది మాత్రమే న్యాయవాదులు ఉన్నారు. న్యాయవాదులు ఉంటేనే బిల్లుల మీద చర్చ ఎక్కువగా జరుగుతుందని కూడా అనలేం. కానీ కొంత ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం వల్ల పార్టీలు మారటం ఏమాత్రం తగ్గలేదు కానీ బిల్లులమీద చర్చ జరుగకుండా ఉండటానికి ఆ చట్టం దోహదపడుతుందని చెప్పవచ్చు. అధికారంలో ఉన్న పార్టీ బిల్లుకు అనుకూలంగా ఓటువేయమని విప్ జారీ చేస్తుంది. సభ్యులందరూ అదేవిధంగా ఓటువేస్తారు. ప్రతిపక్ష పార్టీలలోకూడా ఇదే పరిస్థితి. దాని వల్ల కూడా బిల్లులమీద ఎలాంటి చర్చ జరగటం లేదని అనుకోవచ్చు. కార్యనిర్వాహక వ్యవస్థే బిల్లులని తయారు చేస్తుంది. విప్ ప్రభావం వల్ల అవసరమైన చర్చ జరుగకుండా బిల్లులు ఆ చట్టసభల్లో ఆమోదం పొందుతున్నాయి. పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం ద్వారా శాసనకర్తలు తమ స్వేచ్ఛని పోగొట్టుకున్నారని చెప్పవచ్చు. ఉద్దేశించిన ప్రధాన సమస్యని ఈ చట్టం ఆపలేకపోయింది. కానీ ఈ విషయంలో శాసనకర్తల స్వేచ్ఛని హరించిందని చెప్పవచ్చు. ఇప్పుడు కాలం మారింది. గతంలో మాదిరిగా ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తుల సంఖ్య, న్యాయవాదుల సంఖ్య, ఇతర విద్యావేత్తల సంఖ్య చట్టసభల్లో రోజురోజుకీ తగ్గిపోతుంది. పెద్దల సభలో కూడా ఇదే పరిస్థితి. అది ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయింది. ఇప్పుడు అంతటా ఆ వ్యాపార వేత్తలే కన్పిస్తున్నారు. వాళ్ల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. ప్రజాసమస్యల కన్నా తమ వ్యాపార విషయాల మీద వారి దృష్టి ఎక్కువగా ఉంటుందని అనడం అతిశయోక్తి కాదు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులు దాఖలు చేసిన ప్రమాణ పత్రాల్లో 39 శాతం మంది తమ వృత్తి రాజకీయం–సాంఘిక సేవ అని పేర్కొంటున్నారు. నిజానికి సాంఘిక సేవ అనేది ఏమీ లేదు. వాళ్లలో వ్యాపారస్తులే అధికం. ఈ పరిస్థితులు నెలకొని ఉన్న మన దేశంలో శాసనాల మీద, బిల్లుల మీద, ప్రజాసమస్యల మీద చర్చ జరగాలని కోరుకోవడం అత్యాశ అవుతుందేమో. కొన్ని రాజ్యాంగ పదవులకు వ్యాపారవేత్తలు అర్హులు కారు. ఆ పదవులు చేపట్టిన తర్వాత ఎలాంటి వ్యాపార లావాదేవీలూ చేయడానికి వీల్లేదు. అలాంటి నిబంధన శాసనకర్తల విషయంలో కూడా ఏర్పరిస్తే మంచిదనే అభిప్రాయం కలుగుతుంది. మంగారి రాజేందర్ వ్యాసకర్త గతంలో జిల్లా జడ్జిగా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ సభ్యులుగా పనిచేశారు మొబైల్ : 94404 83001 -
ఆత్మగల మనిషి జస్టిస్ బి. సుభాషణ్ రెడ్డి
ప్రజలకి చేరువ కావడంలో న్యాయ వ్యవస్థకి ఎన్నో అవరోధాలు ఉన్నాయి. న్యాయం అందించడంలో జాప్యం ఉంది. కోర్టులకి రావాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. ఈ విష యాలు అన్నీ తెలిసిన న్యాయమూర్తి జస్టిస్ బి. సుభాషణ్ రెడ్డి మే 1, 2019 రోజున అనారోగ్యంతో మరణించినారన్న వార్త బాగా కృంగదీసింది. గత పదిహేను రోజులుగా ఆయన అనారోగ్యం గురించి కొంత తెలిసినప్పటికీ ఇంత త్వరగా మరణిస్తారని ఊహించలేదు. లోకాయుక్తగా పదవీ విరమణ చేసిన తరువాత ఓ రెండుసార్లు ఆయన్ను కలిశాను. మనిషి ఆరో గ్యంగా, ఆనందంగా కనిపించారు. అలాంటి వ్యక్తి చనిపోతారని ఊహించలేం. న్యాయ వ్యవస్థలోని అవరోధాలని గమనించి ఆయన మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా ఎనలేని కృషి చేశారు. చట్టాన్ని అధిగమించి ప్రజలకి చేరువగా న్యాయాన్ని తీసుకెళ్లారు. సుభాషణ్‌రెడ్డి అంటేనే మానవ హక్కులు అనే పరిస్థితులు కల్పించారు. ప్రజలకి ఏ సమస్య వచ్చినా మానవ హక్కుల కమిషన్ దగ్గరికి వెళ్లే విధంగా ప్రజలని తీసుకొని వెళ్లారు. మామూలు ప్రజలే కాదు రాజ కీయ నాయకులు కూడా చాలా సమస్యల పరి ష్కారానికి కమిషన్ దగ్గరికి వెళ్లేవారు. ఆయన వేసిన దారి ఇంకా చెరిగిపోలేదు. మానవ హక్కుల కమిషన్‌లో ఎవరూ లేకున్నా, ఈరోజు కూడా ప్రజలు, నిరుద్యోగులు ఇంకా మానవ హక్కుల కమిషన్ వైపు పరుగులు తీస్తున్నారు. ఏదో ఉపశమనం లభిస్తుందన్న ఆశతో వెళుతున్నారు. ఆయన మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా ఉన్న కాలంలో చాలా విషయాల్లో, చాలా మందికి ఉపశమనాలు లభించాయి. ఒక విధంగా చెప్పాలంటే కోర్టుల భారాన్ని ఆయన తగ్గించారు. మరీ ముఖ్యంగా హైకోర్టు భారాన్ని, కోర్టులు ప్రజలకి చేరువ కాలేని పరిస్థితిని ఆయన కమిషన్ ఛైర్మన్‌గా తొలగించారు. అక్కడికి వెళ్తే ఏదో ఒక ఉపశమనం లభిస్తుందన్న ఆశని ప్రజలకి కలిగించారు. రాష్ట్ర మానవహక్కుల కమిషన్ తరువాత కొంత కాలానికి ఆయన లోకాయుక్తగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. మానవ హక్కుల కమిషన్ మాదిరిగా ఆ సంస్థ కూడా ప్రజలకి చేరువైంది. ప్రజల సమ స్యలు తొలగించడంలో లోకాయుక్తగా ఆయన కీలక పాత్రని పోషించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసినప్పుడు కూడా తీర్పులని సత్వరంగా పరిష్క రించడంలో విశేషమైన కృషి చేశారు. మరీ ముఖ్యంగా దంపతుల మధ్య ఉన్న లీగల్ సమస్యలని లోకజ్ఞానంతో (కామన్సెన్స్)తో పరిష్క రించేవారు. హైకోర్టు న్యాయవాదిగా ఉన్నా, న్యాయ మూర్తిగా ఉన్నా, ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నా, ఏ పదవిలో ఉన్నా సామాన్యుడిగా ఎలాంటి ఆడం బరాలు లేకుండా ఉండటం ఆయన నైజం. అందరినీ అభిమానంగా పలకరించేవారు. అపాయింట్మెంట్ లేకుండా వెళ్లినా, డిక్టేషన్‌లో ఉన్నా కూడా క్రింది కోర్టు న్యాయమూర్తులని పలకరించేవారు. వారి సమస్యలను వినేవారు, పరిష్కరించడానికి ప్రయ త్నించేవారు. జస్టిస్ సుభాషణ్ రెడ్డికి డాక్టర్ కావాలని కోరిక. వారి తండ్రికి డిప్యూటీ కలెక్టర్ కావాలని, వాళ్ల తాతకి ‘లా’ చదవాలని. చివరికి ఆయన ‘లా’ చదివారు. కింది కోర్టు నుంచి, రెవెన్యూ కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా ఆయన కేసులని వాదించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా 1991లో పదవీ బాధ్యతలు చేపట్టారు. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆ తరువాత కేరళ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి గౌరవం తెచ్చే విధంగా పనిచేశారు. ఆయనను కలిస్తే ఓ న్యాయ మూర్తిని కలిసినట్టుగా అనిపించేది కాదు. ఇంటిలోని పెద్దవాళ్లని కలిసినట్టు అనిపించేది. ఇంత త్వరగా ఈ లోకాన్ని వదిలి వెళతారని ఎవరూ ఊహించలేదు. మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా ఆయనను ప్రజలు చిరకాలం గుర్తు పెట్టుకుంటారు. ఓ గొప్ప ఆత్మ మనలని వదలి వెళ్లింది. మంగారి రాజేందర్ వ్యాసకర్త గతంలో జిల్లా జడ్జిగా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా పనిచేశారు. మొబైల్ : 94404 83001 -
తీరిన కోరిక తెలంగాణ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకి రెండు హైకోర్టులు ఉండాలి. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పడాలి. తెలంగాణకు కేటాయించిన న్యాయమూర్తుల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన న్యాయమూర్తులు అధికంగా ఉన్నారు. గత 62 సంవత్సరాలుగా న్యాయవ్యవస్థతో తెలంగాణ నలిగిపోయింది. ఈ అసమానతలు తొలగడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో చెప్పలేం. దాని కోసం మరో పోరాటం అవసరమేమో. ఏమైనా, 1 జనవరి 2019 తెలంగాణ ప్రజలకు చిరకాలం గుర్తుంటుంది. 2 జూన్ 2014వ తేదీ మాదిరిగా, 1 జనవరి 2019వ తేదీ తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు ఐదు సంవత్సరాలు అయినప్పటికీ తెలంగాణ ప్రజలు సంపూర్ణ తెలంగాణ ఏర్పడినట్టు భావించలేదు. తెలంగాణ ప్రత్యేక హైకోర్టు లేకపోవడమే అందుకు ప్రధాన కారణం. ఈ జనవరితో ఆ కోరిక తీరింది. 1947 నుంచి 1956 వరకు ఉన్న చరిత్ర ఎవరికీ తెలియకుండా చరిత్ర పుస్తకాలు వచ్చేశాయి. అందుకని హైదరాబాద్ రాష్ట్రానికి ప్రత్యే కంగా హైకోర్టు ఉండేదని, దానికి ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు ఉండేవారని ఎవరికీ తెలియదు. ఆంధ్రా హైకోర్టు, హైదరాబాద్ హైకోర్టులను 1 నవంబర్ 1956న విలీనం చేశారు. కానీ, హైదరాబాద్ హైకోర్టు ఆంధ్రా హైకోర్టులో విలీనం అయినట్టు భ్రమింపజేసి హైదరాబాద్ హైకోర్టు న్యాయమూర్తులతో ప్రమాణస్వీకారం చేయించి వాళ్లను తమకన్నా జూనియర్లు అయిన ఆంధ్రా న్యాయమూర్తులకన్నా జూనియర్లుగా మార్చి తెలంగాణ ప్రాంతానికి తీరని ద్రోహం చేశారు. హైదరాబాద్ హైకోర్టు పద్ధ్దతులను మంటగలిపి ఆంధ్రా పద్ధతులను హైకోర్టులో నెలకొల్పారు. అది చాలా సులువుగా అమలు జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు ఆం్ర«ధా ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆంధ్రా రాష్ట్రానికి, హైదరాబాద్ రాష్ట్రానికి చాలా భేదం ఉంది. అది బ్రిటీష్ వారి ఆధిపత్యంలో నుంచి ఏర్పడిన రాష్ట్రం. భారతదేశానికి చెందిన ముస్లిం రాజు ఆధిపత్యం నుంచి బయటపడి ఏర్పడిన రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రం. ఆంధ్రా శాసనాలు అన్నీ బ్రిటీష్ పార్లమెంట్ తయారు చేసినవి. హైదరాబాద్ రాష్ట్రంలోని శాసనాలు అన్నీ హైదరాబాద్ స్వంత శాసనాలు. ఇక భాష విషయానికి వస్తే వాళ్లది ఆంగ్లం, హైదరాబాద్ వాళ్లది ఉర్దూ. ఇక్కడి శాసనాలన్నీ ఉర్దూలో ఉండేవి. పరిపాలన ఉర్దూలో జరిగేది. హైకోర్టులో కూడా ఉర్దూలో వాదనలు వినిపించేవాళ్లు. ఇక్కడి న్యాయవాదుల సౌకర్యార్థం ఓ ఉర్దూ బెంచిని ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు దశలో వాగ్ధానం చేశారు. కానీ చేయలేదు. చాలామంది తెలంగాణ న్యాయవాదులకు ఇంగ్లీషులో ఆంధ్రావాళ్లకి ఉన్న ప్రావీణ్యం లేకపోవడం వల్ల రెండవ శ్రేణి న్యాయవాదులుగా పరిగణించబడినారు. దానికి తోడు ఆంధ్ర రిజిస్ట్రార్ల, అధికారుల ఆధిపత్యం కింద నలిగిపోయినారు. హైకోర్టు న్యాయమూర్తులను ఎంపికచేసే కొలీజియమ్‌లో ఆంధ్రా ప్రాంతానికి చెందిన న్యాయమూర్తులే ఉండటం వల్ల ఆంధ్రా ప్రాంతానికి చెందినవారే హైకోర్టు న్యాయమూర్తులుగా, వారు నేరుగా ఎంపిక చేసిన ఆంధ్రా న్యాయవాదులే జిల్లా జడ్జీలుగా నియమితులైనారు. న్యాయవ్యవస్థ మొత్తం ఆంధ్రా ప్రాంత వాసుల గుప్పిటిలోకి వెళ్లిపోయింది. తెలంగాణ ఏర్పడటానికి ముందు మాత్రమే అడ్వకేట్ జనరల్ తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి నియామకం కావడం వల్ల ప్రభుత్వ న్యాయవాదుల ఎంపికలో ఎంత వివక్ష జరిగిందో ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం రావడం, న్యాయవాదులు చురుగ్గా పాల్గొనడం నేటి ఆధునిక చరిత్ర. 14 మార్చి, 2004న తెలం గాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మూడవ మహాసభలు జరిగాయి. ఈ సమావేశానికి అప్పటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి (సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పని చేసి పదవీ విరమణ చేశారు.)ని ఆహ్వానించాం. ఆ సమయంలో ఎంతో భవిష్యత్ ఉన్న హైకోర్టు న్యాయమూర్తి ఆ సమావేశాలకు రావడం సాహసమనే చెప్పాలి. సీనియర్ సివిల్ జడ్జిగా పని చేస్తున్న నేను క్రియాశీలక పాత్ర పోషించడమూ అంతే సాహసమని చెప్పుకోక తప్పదు. ఆ రోజు న్యాయ మూర్తుల ఎంపికకు పరీక్ష జరుగుతోంది. అందరు న్యాయమూర్తులు ఆ డ్యూటీలో ఉన్నారు. నాకు మాత్రం మినహాయింపునిచ్చారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి, జస్టిస్ నర్సింహారెడ్డి తదితరులు తెలంగాణ ఉద్యమాన్ని ప్రత్యక్షంగా బలపరిస్తే పరోక్షంగా బలపరిచిన న్యాయమూర్తులు ఎందరో. దేశంలో ఉండేటువంటి మౌలిక వనరులు ఎవరి చేతిలో కేంద్రీకృతం కాకూడదు. అవి వివిధ ప్రాంతాలలో నివసించేటువంటి ప్రజల మధ్యన సమానత్వం పెంపొందించడానికి ఉపయోగపడాలి. రాజ్యం ఏర్పాటు చేసేటువంటి ప్రతి వ్యవస్థ ఆర్థిక రాజకీయ, సాంఘిక సమానత్వం సంపాదించడానికి, పెంపొందించడానికి సాధనాలుగా ఉపయోగపడాలి. భిన్న ప్రాంతాల, వృత్తుల ప్రజల మధ్యన ఉన్నటువంటి ఆర్థిక తారతమ్యాలను రూపుమాపడాన్ని రాజ్యాంగం ఆదేశిస్తుంది. ఈ స్ఫూర్తితో న్యాయమూర్తులు తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచారు. ఈ మూడవ సభ జరిగిన పది సంవత్సరాల తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాలుగున్నర సంవత్స రాల తరువాత తెలంగాణకి హైకోర్టు ఏర్పడుతోంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పేరుని హైదరాబాద్ హైకోర్టుగా మార్చి దాన్ని రెండు రాష్ట్రాలకు కామన్ హైకోర్టుగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. ఒక్కపేరు తప్ప ఏమీ మారలేదు. మిగతా కొత్త రాష్ట్రాల్లో విభజించినట్టు క్రిందికోర్టు న్యాయమూర్తుల విభజన కూడా జరుగలేదు. ఈ విషయం పట్ల దృష్టి కేంద్రీకరించాలన్న హైకోర్టు న్యాయమూర్తి నర్సింహారెడ్డి వాదనని ఎవరూ పట్టించుకోలేదు. దాని ఫలితంగా ఎంతోమంది తెలంగాణ న్యాయమూర్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాందిశీకుల్లా బతికారు. 31 డిసెంబర్న వారి విభజన జరిగింది. ఈ విభజనపట్ల ఎన్నో అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని పట్టించుకునే నాథుడే లేడు. ఇప్పటికైనా ప్రత్యేక హైకోర్టు ఏర్పడుతున్నందుకు సంతోషిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఏర్పాటుని కూడా రాజకీయం చేసి పబ్బం గడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం పూర్వ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా 2 జూన్ 2014న ఏర్పడినాయి. ఈ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకి రెండు హైకోర్టులు ఉండాలి. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పడాలి. ఈ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా హైదరబాద్ హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని విడదీసి ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రజలు కోరినారు. హైదరాబాద్‌లోనే రెండు హైకోర్టులు వేరువేరుగా ఏర్పాటు చేయడానికి అవసరమైన సౌకర్యాలని కల్పిస్తామని ధన్‌గోపాల్ కేసులో తెలంగాణ ప్రభుత్వం వివరించింది. అలా వీల్లేదని హైదరాబాద్ హైకోర్టు తీర్పుని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆంధ్రప్రదేశ్ భూభాగంలోనే ఏర్పాటు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తీర్పుకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా అప్పీలుని దాఖలు చేసింది. హైదరాబాద్ హైకోర్టు సుప్రీంకోర్టు ముందు ప్రమాణ పత్రాన్ని దాఖలు చేసింది. 16 నుంచి 18 నెలల లోపు పూర్తిస్థాయిలో హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తి అవుతుందని అంతలోపు తాత్కాలిక భవనంలో హైకోర్టుని ఏర్పాటు చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలిపారని హైకోర్టు తమ ప్రమాణ పత్రంలో పేర్కొంది. హైదరాబాద్ హైకోర్టు నియమించిన హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ అమరావతిలోని భవనాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ మధ్య కాలంలో ఆ హైకోర్టుకు వెళ్లడానికి ఇష్టపడే న్యాయమూర్తులు తమ ఇష్టాన్ని సుప్రీంకోర్టుకి పంపించారు. న్యాయమూర్తులు అమరావతి వెళ్లడానికి ఇష్టపడటం లేదన్న అపప్రధని తొలగించారు. డిసెంబర్ 15నాటికి హైకోర్టు తాత్కాలిక భవనం సిద్ధమవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి నివేదించింది. న్యాయమూర్తులు కూడా అక్కడ ఉన్న సౌకర్యాల పట్ల సంతృప్తి చెం దారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటుకు ఎలాంటి ఆటంకాలు లేవని అందుకని కాంపిటెంట్ అథారిటీ (రాష్ట్రపతి) తగు చర్యలు తీసుకొని నోటిఫికేషన్ని జారీ చేయాలని సూచించింది. 1 జనవరి 2019 నాటికి రెండు హైకోర్టులు వేర్వేరుగా పని చేస్తాయని సుప్రీంకోర్టు ఆశించింది. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం జనవరి 1 నుంచి అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు అవుతుందని నోటిఫికేషన్ని విడుదల చేసింది. రెండు హైకోర్టుల న్యాయమూర్తుల జాబితాని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సి.ప్రవీణ్‌కుమార్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది. ఈ దశలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనవసర సందేహాలు,అపో హలు కావాలని సృష్టించారు. ఈ విభజన వల్ల జగన్మోహన్రెడ్డి కేసులు మళ్లీ మొదటి దశకు చేరుకుంటాయన్న వాదనను లేవనెత్తారు. కేసుల విచారణకి అధికార పరిధి ఉంటుంది. ఆ అధికార పరిధిలోని కోర్టుల్లో కేసుల విచారణ జరుగుతుంది. న్యాయమూర్తులు బదిలీ అయినంత మాత్రాన అవి మళ్లీ మొదటిదశకు చేరుకోవు. ఎందుకంటే, అవి వారంట్ కేసులు. సమ్మరీ(చిన్న కేసులు)ల్లో మాత్రమే అలాంటి అవకాశం ఉం టుంది. ఈ విషయాన్ని న్యాయకోవిదులు ముఖ్యమంత్రికి చెబుతారు. అయినా, అన్నీ తెలిసీ ముఖ్యమంత్రి ఇలాంటి అపోహలని సృష్టిస్తున్నా రని భావించాల్సి ఉంటుంది. చేరువలో న్యాయం ఉండాలి. సత్వర న్యాయం అందాలి. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక సూత్రాలు చెబుతున్నది ఇదే. హైకోర్టు దగ్గరలో ఉండటం న్యాయవాదులకే కాదు, కక్షిదారులకీ అవసరం. మన దేశంలో న్యాయవ్యవస్థ నత్తనడక నడుస్తున్నదని పేరుంది. 28 డిసెంబర్ 2018నాటికి మన దేశంలో 30 సంవత్సరాలకు మించి కోర్టు పరిశీలనలో 66వేల కేసులు ఉన్నాయి. ఐదు సంవత్సరాలకు పైబడిన కేసులు 60లక్షలు ఉన్నాయి. 1800 కేసులు గత 48–58 సంవత్సరాలుగా వాదన దశలో ఉన్నాయి. 60 సంవత్సరాలకు పైబిన కేసులు 140ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతి కొత్త కోర్టునీ, అందులో హైకోర్టునీ స్వాగతించాల్సింది పోయి అనవసర అపోహలు సృష్టించడం, ఆటంకాలు సృష్టించడం ఎవరికీ తగదు. గత 62 సంవత్సరాలుగా న్యాయవ్యవస్థతో తెలంగాణ నలిగిపోయింది. తెలంగాణ న్యాయమూర్తులు తక్కువ మంది ఉన్నారు. తెలంగాణకు కేటాయించిన న్యాయమూర్తుల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందినవారే అధికంగా ఉన్నారు. హైకోర్టు న్యాయమూర్తుల్లో సీనియర్ న్యాయమూర్తులు, జిల్లా జడ్జీల్లో సీనియర్లు ఎక్కువగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తులే ఉన్నారు. ఈ అసమానతలు తొలగడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో చెప్పలేం. ఏమైనా, 1 జనవరి 2019 తెలంగాణ ప్రజలకు చిరకాలం గుర్తుంటుంది. ఆంధ్రప్రదేశ్ న్యాయ వ్యవస్థలో న్యాయవాదిగా, న్యాయమూర్తిగా నేను పని చేశాను. అది హైదరాబాద్ హైకోర్టుగా రూపాంతరం చెందిన తరువాత పదవీ విరమణ చేశాను. ఇప్పుడు న్యాయవాదిగా తెలంగాణ హైకోర్టులోకి ప్రవేశించడం ఓ భావోద్వేగానికి సంబంధించిన అంశం. ఇది ఒక్క నాకే కాదు, ఎంతోమంది న్యాయవాదులకీ, న్యాయమూర్తులకీ కూడా. అందరికీ అభినందనలు. వ్యాసకర్త: మంగారి రాజేందర్, మాజీ న్యాయమూర్తి మొబైల్: 9440483001 -
జరిమానాలు పెరగాలా?
‘భరత్ అనే నేను’ అన్న సినిమాలో అనుకోకుండా హీరో ముఖ్యమంత్రి అవు తాడు. గందరగోళంగా ఉన్న ట్రాఫిక్‌ను చూసిన అతను జరిమానాలను విప రీతంగా పెంచేస్తాడు. జరి మానాలను పెంచడం అవ సరమా? ఇప్పుడున్న పరిస్థి తులకు అనుగుణంగా, పడిపోయిన రూపాయి విలు వకు దగ్గర్లో ఈ జరిమానాలు ఉన్నాయా? అనే సందే హాలు సహజంగానే వస్తాయి. డబ్బును జప్తు చేసు కోవడమే జరిమానా. కోర్టులు విధించే జరిమానాకు గాను ముద్దాయి చెల్లించే రుసుము. ట్రాఫిక్ జరిమా నాలు నేరాలే అయినా ఆ నేరాలు చేసిన వ్యక్తులు నేర స్తులు కాదు. చట్టాన్ని ఉల్లంఘించినవారుగా వారిని పరిగణిస్తారు. జరిమానా అనేది ఆర్థికంగా నష్టం కలి గిస్తుంది కానీ అది సమాజంలో ఆ వ్యక్తిపై మచ్చగా ఉండదు. జైలుకు వెళ్లినప్పుడు కలిగే మనోవ్యథ జరిమానా చెల్లించడంలో ఉండదు. సంస్కరణ అనేది సాధ్యం కాని కేసుల్లో కోర్టులు సాధారణంగా నేర స్తులకి జరిమానాలను విధిస్తాయి. దానివల్ల ఆ వ్యక్తి మళ్లీ ఆ నేరాలు చేయకుండా ఉంటాడన్న భావనతో కోర్టులు అలా జరిమానాలు విధిస్తుంటాయి. ఇప్పుడు మనకు చాలా శాసనాలు వచ్చేశాయి. గతంలో ఉన్న శాసనం ఒక్కటే. అది భారతీయ శిక్షాస్మృతి. అది తయారు చేసినప్పుడు జరిమానా గురించి చాలా చర్చలు జరిగాయి. కొన్ని నేరాలకు జరిమానా విధించడమే సరైన శిక్ష అని వారు నిర్ధా రణకి వచ్చి, ‘‘ప్రపంచవ్యాప్తంగా జరిమానాలు విధించడం అనేది ఉంది. దాని వల్ల చాలా ప్రయో జనాలు ఉన్నాయి. అందుకని జరిమానాలని కోర్టులు విధించాలని మేం ప్రతిపాదిస్తున్నాము!’’ అని అభి ప్రాయపడ్డారు. భారత శిక్షాస్మృతి కోసం మెకాలే 1861లో గట్టి పునాదిని వేశారు. చాలా నేరాలకి జరిమానాలను ఆయన ప్రతిపాదించారు. స్వాతం త్య్రం వచ్చాక మెకాలే రూపొందించిన శిక్షాస్మృతికి కొనసాగింపుగా భారతీయ శిక్షాస్మృతి నడుస్తోంది. నేరస్తులను జైల్లో ఉంచడం వల్ల ప్రభుత్వ ఖజా నాకి నష్టం ఎక్కువ జరుగుతుంది. అందుకని కొన్ని నేరాలకి ఎక్కువ జరిమానాలు విధించడం వల్ల ఆ నేరాలు తిరిగి చేయడానికి మనుషులు వెనుకంజ వేస్తారనీ, ఇంకా ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని మెకాలే భావించారు. అయితే, నేరస్తుని ఆర్థిక స్తోమతను దృష్టిలో ఉంచుకుని కోర్టులు జరి మానాలను విధించాలని ఆయన చెప్పారు. భార తీయ శిక్షాస్మృతిలోని నేరాలను గమనిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. తాగి రోడ్డు మీద గొడవ చేస్తే 10 రూపాయల జరిమానాను కోర్టులు విధిం చాలి. స్వచ్ఛందంగా ఎవరైనా గాయపరిస్తే రూ. 500 జరిమానాని, అదే వి«ధంగా వ్యక్తుల ప్రాణాలకి, రక్ష ణకి హాని కలిగిస్తే రూ.200 జరిమానాను, ఒక మందుకు బదులు మరో మందు విక్రయిస్తే రూ.100 జరిమానాను కోర్టు విధించే విధంగా శిక్షాస్మృతిలో నిబంధనలు ఏర్పరిచారు. భారతీయ శిక్షాస్మృతిని రూపొందించింది 1860లో. అంటే 158 సంవత్స రాల క్రితం అన్నమాట. అప్పుడున్న రూపాయి విలువని పోలిస్తే ఈ జరిమానా అధ్వానంగా అనిపి స్తుంది. అందుకే 158 ఏళ్ల క్రితం నిర్ణయించిన 10 రూపాయల జరిమానాను తగ్గిన రూపాయి విలువ కారణంగా ఎంతకు పెంచాలోనని ఆలోచిస్తే కాస్త భయం వేసినా, పెంచడం అవసరమనిపిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జరిమా నాల విషయంలో అవసరమైన సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జరిమానాను విధించే సమయంలో కోర్టులు నేర తీవ్రతను, ముద్దాయి గత చరిత్రను పరిగణనలోకి తీసుకుంటాయి. జైలు శిక్షను లేదా జరిమానాను లేదా రెండింటినీ విధించే అవకాశం ఉన్న కేసులో అవసరమని భావించినప్పుడు కోర్టులు రెండు శిక్షలనూ ఖరారు చేస్తాయి. జరిమానా విధించే విషయంలో ముద్దాయి ఆర్థికస్తోమతని కూడా కోర్టులు పరిగణనలోకి తీసుకుంటాయి. అదే విధంగా ఆర్థిక నేరాలు చేసే వ్యక్తుల విషయంలో వైట్‌కాలర్ నేరాలు చేసే వ్యక్తుల విషయంలో జరి మానాలను భారీగానే విధించాల్సి ఉంటుంది. వారు మళ్లీ అలాంటి నేరాలు చేయ కుండా నిరోధించడానికి ఇది అవసరం. జరిమానా చెల్లించకపోతే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఓ వ్యక్తి ఒకే సంఘ టనలో రెండు మూడు నేరాలు చేసినప్పుడు ఆ శిక్షలు ఏకకాలంలో అమలయ్యే విధంగా కోర్టులు ఆదేశించే వీలుంది. కానీ జరిమానా చెల్లించనపుడు అనుభవిం చాల్సిన శిక్ష మాత్రం వాటి తోబాటు ఏకకాలంలో అమలయ్యే అవకాశమే లేదు. నేరానికి వేసిన శిక్షలు అమలయ్యాక ఈ శిక్ష కొనసాగుతుంది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 64 ఈ విషయం చెబుతోంది. 1860లో తయారైన ఈ శిక్షా స్మృతిలో జరిమానా విష యంలో ఇంత బాగా ఆలోచించారు. మన శాసన వ్యవస్థకి ఈ జరిమానాలపై ఆలోచించే తీరుబడి లేదు. జైల్లో ఉంచితే ఆ భారం రాజ్యం మీద పడుతుందని గ్రహిస్తే మంచిది. జరిమానాలను ముద్దాయి ఆస్తి నుంచి వసూలు చేసే అవకాశం ఉంది. మంగారి రాజేందర్ వ్యాసకర్త కవి, రచయిత ‘ 94404 83001 -
ధర్మాసనంపై చెరగని ముద్ర
న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమించుకోవటం సమంజసం కాదన్న చలమేశ్వర్, కార్యనిర్వాహక వ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ సుప్రీంకోర్టుని ప్రభావితం చేయరాదని అన్నారు. ఆ విషయంలోనే ఆయన భారత ప్రధాన న్యాయమూర్తికి ఎన్నో లేఖలు రాశారు. ప్రజాస్వామ్య రక్షణ కోసమే మీడియా సమావేశానికి నేతృత్వం వహించారు. మీడియా సమావేశాన్ని జీర్ణించుకోలేని వ్యక్తులు తాము గీసుకున్న పరిధిని దాటితే తప్ప ప్రజాస్వామ్య ప్రమాదం ఏమిటో అర్థం కాదు. అస్వతంత్రతలో న్యాయ వ్యవస్థ నలిగిపోతున్న ఈ సమయంలో చలమేశ్వర్ పదవీ విరమణ కించిత్తు బాధను కలిగించినా మరెందరో ఆయన స్ఫూర్తిని అందుకుంటారని ఆశ. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపిక పద్ధతిలో పారదర్శకత లేదని గళమెత్తడంతోపాటు, సుప్రీంకోర్టులో అమల వుతున్న ఏకపక్ష విధానాలపై ముగ్గురు సహచర న్యాయమూర్తులతో కలిసి మీడియా సమావేశం నిర్వ హించి సంచలనం సృష్టించిన సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేడు (శుక్రవారం) పదవీ విరమణ చేస్తున్నారు. ఆయన తన పదవీ కాలంలో ఇచ్చిన వివిధ తీర్పులు శిఖరాయమానమై నవి. ముఖ్యంగా కొలీజియం పనితీరు విషయంలో జస్టిస్ చలమేశ్వర్ అభ్యంతరాలు గమనించదగ్గవి. ఒకరిని న్యాయమూర్తిగా ఎందుకు ఎంపిక చేశారో, ఎందుకు చేయలేదో కారణాలు నమోదు చేయ కుండా నియామక ప్రక్రియ ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. దీనిపై స్పష్టత రాని కారణంగా ఆయన కొంత కాలంపాటు కొలీజియం సమావేశా లకు కూడా హాజరుకాలేదు. జాతీయ న్యాయమూ ర్తుల నియామక కమిషన్ని కొట్టివేసిన తీర్పులో చలమేశ్వర్ తన అస మ్మతి తీర్పుని వెలువరించారు. కొలీజియం విధానం పారదర్శకంగా లేదని వ్యాఖ్యా నించారు. న్యాయ మూర్తుల ఎంపిక విధానంలో న్యాయమూర్తుల మాటకే ప్రాధాన్యం ఉండటం సరైంది కాదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పాల నలో పారదర్శక తకి అధిక ప్రాధాన్యత ఉండాలని కూడా సూచించారు. హైకోర్టు కొలీజియమ్ ఎంపిక చేసిన న్యాయమూర్తుల పేర్లను తిరస్కరించి మళ్లీ తిరిగి సుప్రీంకోర్టు పరిశీలించిన సందర్భాలు ఉన్నాయి. దానివల్ల అనవసర ఊహాగానాలకి అవ కాశం ఏర్పడుతుంది. ఈ విషయంలో జవాబుదారీ తనం లేదు. ఆ రికార్డులు ఎవరికీ అందుబాటులో ఉండవు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి కూడా. అవి చూడాలని అనుకున్న వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయితే తప్ప చూడలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితివల్ల సుప్రీంకోర్టు విశ్వసనీయత పెరగదు. అది ఈ దేశ ప్రజలకి మంచి చేయదు. న్యాయమూర్తుల నియామకాల్లో ప్రభుత్వాన్ని పూర్తిగా దూరం పెట్టడం సరైంది కాదని ఆయన భావించారు. అయితే మెజారిటీ నిర్ణయం మరోలా ఉన్నందువల్ల చట్టాన్ని ఇంకా పరిశీలించదల్చు కోలేదని చలమేశ్వర్ తన అసమ్మతి తీర్పులో ప్రక టించారు. ఆయన 19 సంవత్సరాలు న్యాయవాదిగా, ఆ తరువాత సీనియర్ న్యాయవాదిగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, ఆ తరువాత న్యాయమూర్తిగా పనిచేశారు. గౌహతీ, కేరళ హైకో ర్టుల ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిం చారు. 2011లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. సంప్రదాయం ప్రకారం వేసవి సెలవులకి ముందు చివరి రోజైన గత నెల 18న చలమేశ్వర్ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, మరో న్యాయమూర్తి జి.వై. చంద్రచూడ్‌లతో కలసి ధర్మాసనంలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టు న్యాయ వాదుల సంఘం ఏర్పాటు చేయదల్చిన వీడ్కోలు సమావేశాన్ని ఆయన తిరస్కరించారు. మొన్న జన వరి 12న ముగ్గురు సహచర సుప్రీంకోర్టు న్యాయ మూర్తులతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి సుప్రీంకోర్టులో జరుగుతున్న ఏకపక్ష నిర్ణయాలని ఎత్తిచూపారు. ఈ కారణంవల్ల ఆయన ప్రధాన న్యాయమూర్తితోబాటు ధర్మాసనంలో ఉంటారా లేదా అన్న సందేహాలు తలెత్తాయి. కానీ ఆయన సుప్రీంకోర్టులో కొనసాగుతున్న సాంప్రదా యాన్ని గౌరవించారు. తన తీర్పుల ద్వారా, తన ఉత్తరాల ద్వారా, తన చర్యల ద్వారా చలమేశ్వర్ సుప్రీంకోర్టులోని రెండవ కోర్టు గౌరవాన్ని ఇనుమడింపజేశారు. ఆయన నేతృత్వం వహించిన మీడియా సమావేశం దేశ న్యాయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యాన్ని ఎత్తిచూపిన సమా వేశం అది. ఆయన రాసిన ఉత్తరాల ప్రభావంగానీ, మీడియా సమావేశ ఫలితాలుగానీ వెనువెంటనే కన్పించకపోవచ్చు. కానీ భవిష్యత్తులో అవి సత్ఫలి తాలని ఇస్తాయి. తన ముందుకొచ్చిన భారత వైద్య మండలి(ఎంసీఐ) కేసును జస్టిస్ చలమేశ్వర్ ఒక బెంచ్‌కు పంపడం, ప్రధాన న్యాయమూర్తి మాస్టర్ ఆఫ్ రోస్టర్ తానేనని చెబుతూ ఆ ఉత్తర్వులు నిలిపే యడం సంచలనం కలిగించింది. తన కేసుకి తానే న్యాయమూర్తి కాకూడదన్న ప్రాథమిక న్యాయసూ త్రానికి సుప్రీంకోర్టు తిలోదకాలు ఇచ్చింది. ఐటీ చట్టంపై సంచలనాత్మక తీర్పు జస్టిస్ చలమేశ్వర్ మరో న్యాయమూర్తి రోహింగ్టన్ ఫాలీ నారీమన్‌తో కలిసి భావ ప్రకటనా స్వేచ్ఛకి విఘాతం కలిగిస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం లోని సెక్షన్ 66ఏ రాజ్యాంగ విరుద్ధమని చెబుతూ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదపడు తుంది. అలాగే ఆధార్ కార్డు లేని కారణంగా సబ్సి డీలు ఏ పౌరునికి నిరాకరించడానికి వీల్లేదన్న బెంచ్‌లో ఆయన భాగస్వామి. ఇక లేఖల విషయానికి వస్తే– ఓ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుచిత సామీప్యత ఉందని ఆరోపిస్తూ ఆయన రాసిన లేఖ శిఖరాయమానమైనది. మన హైకోర్టు న్యాయమూ ర్తుల నియామకాలలో ఆ ఇద్దరి అభిప్రాయాలు దాదాపు ఒకేలా ఉండటం బయటి రాష్ట్రాలలోని వ్యక్తులని ఆశ్చర్యానికి గురి చేసింది. గళం విప్పిన న్యాయమూర్తులు న్యాయ పరిపాలనలో ఏకపక్ష నిర్ణయాలు జరుగుతు న్నప్పుడు నలుగురు సీనియర్ న్యాయమూర్తులు చల మేశ్వర్ నేతృత్వంలో గొంతెత్తడం దేశ చరిత్రలో అరు దైన సంఘటన. చరిత్రాత్మక సన్నివేశం. న్యాయవ్యవ స్థలో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యాన్ని ఆ సమా వేశంలో బహిర్గతం చేశారు చలమేశ్వర్. న్యాయమూ ర్తులు మీడియాతో మాట్లాడకూడదన్న విమర్శలు చెలరేగాయిగానీ వారు తమ తీర్పుల గురించి మాత్రమే మాట్లాడకూడదు. న్యాయ పరిపాలన గురించి అభిప్రాయాలు వెల్లడించడంలో తప్పేం లేదు. అది న్యాయమూర్తుల నడవడికకు విరుద్ధం కాదు. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల మేరకు కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దినేశ్ మహేశ్వరి కొలీజియమ్ సిఫారస్ చేసిన ఓ సీనియర్ జిల్లా జడ్జి మీద దర్యాప్తు చేయడం న్యాయ పరిపాలనలో ప్రభుత్వ జోక్యమని చలమేశ్వర్ స్పష్టం చేస్తూ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. కర్ణాటక రాష్ట్రంలో జిల్లా, సెషన్స్ న్యాయమూర్తిగా పని చేస్తున్న పి.క్రిష్ణ భట్ని హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఆయన నియామకాన్ని నిలిపి వేసింది. కానీ ఆయనతోపాటు పంపిన ఇతరుల పేర్లను ఆమోదించింది. ఓ మహిళా న్యాయమూర్తి పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించాడన్న ఫిర్యాదు కారణాన్ని కేంద్ర ప్రభుత్వం చూపింది. ఈ విష యమై అంతకుముందే ప్రధాన న్యాయమూర్తి విచా రణ జరిపి అందులో నిజం లేదని తేల్చారు. జస్టిస్ చలమేశ్వర్ రాసిన లేఖతో క్రిష్ణభట్పై విచారణ నిలిచి పోయింది. జస్టిస్ జోసెఫ్ నియామకం వ్యవహారం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఇందూ మల్హోత్రా పేరుని, ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి కె.ఎం. జోసఫ్ పేర్లని సుప్రీంకోర్టు కొలీజియం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇందూ మల్హోత్రా పేరుని ఆమోదించి కేఎమ్ జోసఫ్ పేరుని కొన్ని బలహీ నమైన కారణాలు పేర్కొంటూ తిరిగి పంపించింది. ఈ విషయమై చలమేశ్వర్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. దాంతో కొలీజియం సమావేశమై తిరిగి జస్టిస్ జోసెఫ్ పేరును సిఫార్సు చేయాలని సూత్ర ప్రాయంగా అంగీకరించింది. కానీ ఇంతవరకూ ఆ పేరును తిరిగి పంపలేదు. చలమేశ్వర్ పదవీ విర మణ చేసే వరకు కొలీజియం సమావేశం జరుగ లేదు. ఆయన పేరుని పరిశీలనకు పంపిస్తారో లేదో తెలియని సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. చలమేశ్వర్ మాదిరిగా కొత్తగా కొలీజియంలో చేరిన న్యాయ మూర్తి సిక్రీ మాట్లాడుతారా అన్నది వేచి చూడాలి. సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం నుంచి ఆయన వీడ్కోలుని తీసుకోలేదు కానీ ఆయన పనిచేసిన చివరి రెండు రోజులు సీనియర్ న్యాయవాదులు ఆయనకు సేవలను ఎంతగానో కొనియాడి ఆయ నను జస్టిస్ హెచ్ఆర్ ఖన్నాతో పోల్చారు. ఖన్నా చిత్రçపటం చలమేశ్వర్ నిర్వహించిన రెండవ కోర్టులో ఉంటుంది. సుప్రీంకోర్టు హాల్స్‌లో వ్రేలాడదీసిన చిత్ర పటం అదొక్కటే. భవిష్యత్తులో చలమేశ్వర్ చిత్రపటా నికి కూడా అక్కడ స్థానం లభించవచ్చు. న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియ మించుకోవటం సమంజసం కాదన్న చలమేశ్వర్, కార్యనిర్వాహక వ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ సుప్రీం కోర్టుని ప్రభావితం చేయరాదని అన్నారు. ఆ విష యంలోనే ఆయన భారత ప్రధాన న్యాయమూర్తికి ఎన్నో లేఖలు రాశారు. ప్రజాస్వామ్య రక్షణ కోసమే మీడియా సమావేశానికి నేతృత్వం వహించారు. మీడియా సమావేశాన్ని జీర్ణించుకోలేని వ్యక్తులు తాము గీసుకున్న పరిధిని దాటితే తప్ప ప్రజా స్వామ్య ప్రమాదం ఏమిటో అర్థం కాదు. దాని నేపథ్యం బోధపడదు. అస్వతంత్రతలో న్యాయ వ్యవస్థ నలిగిపోతున్న ఈ సమయంలో చలమేశ్వర్ పదవీ విరమణ కించిత్తు బాధను కలిగించినా మరెం దరో ఆయన స్ఫూర్తిని అందుకుంటారని ఆశ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా చల మేశ్వర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సాయంత్రం ఓ అభినందన సమావేశం జరిగింది. అప్పుడు నేను మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్నాను. నేను న్యాయవ్యవస్థ మీద రాసిన ‘హాజిర్హై’ కవితా సంపుటిని ఇచ్చాను. దాన్ని మెచ్చుకుంటూ ఆయన నాకు ఉత్తరం రాశారు. అందులో ‘మూడు తలల రాజసింహం’ అన్న ఓ కవిత ఉంటుంది. ఈ చరణాలు అందులో ఉన్నాయి. ‘... మూడు తలల్తో రాజసింహం కుర్చీమీద నిఘా వేసుక్కూర్చుంటుంది’ ఇప్పటికీ పరిస్థితి మారలేదు. పైపెచ్చు దుర్భ రంగా తయారవుతోంది. వ్యాసకర్త కవి, రచయిత మంగారి రాజేందర్ 94404 83001 -
సీబీఐ మెడకు సుప్రీం ‘స్టే’ తీర్పు
వివరణాత్మక ఉత్తర్వులు సుప్రీంకోర్టు వెంటనే ఇవ్వకపోతే సీబీఐ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. సీబీఐని పోలీసు సంస్థగా పరిగణించడానికి అవకాశం ఉండదు. అప్పుడు సీబీఐ పెట్టిన కేసులన్నీ గంగలో కలుస్తాయి. స్టే తీర్పు సీబీఐ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. సత్వర న్యాయం అన్నది మన రాజ్యాంగంలోని అధికరణలు 14, 21లలో మిళితమై ఉంది. అయితే ఇది అమలు జరగడం లేదు. కేసుల పరిష్కారాల్లో ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు. అందులో ‘స్టే’లు ముఖ్యమైనవి. ఈ పరిస్థితిని గమనించి సుప్రీంకోర్టు మార్చి 28వ తేదీన కృష్ణకాంత్ తామ్రాకర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో ఓ ప్రధానమైన అంశాన్ని సృష్టించింది. ఈ తీర్పులో చాలా విషయాలను సుప్రీంకోర్టు ప్రస్తావించింది. న్యాయమూర్తుల నియామకం, న్యాయవాదుల బంద్‌లు, అఖిల భారత స్థాయిలో న్యాయమూర్తుల నియామకం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులు లాంటి చాలా విషయాలని ప్రస్తావిస్తూ స్టేల గురించి కూడా ప్రస్తావించింది. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ఈ స్టేల గురించి ఎక్కువగా ప్రస్తావించాయి. తెలిసి చేసినా తెలియక చేసినా ఇది చాలా ముఖ్యమైన అంశం. హైకోర్టులు, సుప్రీంకోర్టులు సామాన్యులకి అందనంత దూరంలో ఉంటాయి. ఈ కోర్టులు ఏదైనా కేసులో స్టేలు మంజూరు చేస్తే వాటిని వెకేట్ చేయించడం మామూలు వ్యక్తులతో అయ్యేపని కాదు. కొంతమంది రాజకీయ నాయకులు ఈ స్టేలను ఆసరా చేసుకొని వినోదం చూస్తున్నారు. అలాంటి వ్యక్తులకి ఈ తీర్పు కష్టం కలిగిస్తుంది. ఇది బయటకు కన్పించే పరిస్థితి కానీ ఈ తీర్పు వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ పరిణామాల్లో ముఖ్యమైంది సీబీఐ ఏర్పాటు. అదే విధంగా ఆ సంస్థ దర్యాప్తు చేసిన కేసుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం ఏ కోర్టు మంజూరు చేసినా స్టేల తుది గడువు 6 మాసాలు మాత్రమే. ఈ 6 మాసాల తరువాత ఆ స్టే పొడిగింపు కోసం ఆ కోర్టు వివరణాత్మక తీర్పులని జారీ చేయాల్సి ఉంటుంది. ఆ ఉత్తర్వులని ఆ స్టే పొందిన వ్యక్తులు తీసుకున్నప్పుడే వాళ్లు పొందుతున్న ఉపశమనం కొనసాగుతుంది. అలా తీసుకొని రానప్పుడు వాళ్లు చట్టం పరిధిలోకి వస్తారు. ఉదాహరణకు, ఒక రాజకీయ నాయకుడి మీద అవినీతి నిరోధక శాఖ ప్రథమ సమాచార నివేదికను విడుదల చేయగానే అతను హైకోర్టుకో, సుప్రీంకోర్టుకో వెళ్లి స్టే తెచ్చుకుంటాడు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేయకూడదని అతను కోర్టు నుంచి ఉత్తర్వులు పొందాడని అనుకుందాం. ఆ కేసు కోర్టు ముందుకు రాకుండా అతను చాలా చర్యలు తీసుకుంటాడు. ఈ తీర్పువల్ల ఆ పరిస్థితికి కొంతమేర అవరోధం ఏర్పడుతుంది. అతను మళ్లీ కోర్టు నుంచి వివరణాత్మక ఉత్తర్వులు తెచ్చుకొని పోలీసులకు అందచేయకపోతే పోలీసులు దర్యాప్తుని కొనసాగించవచ్చు. అవసరమైతే అతన్ని అరెస్టు కూడా చేయవచ్చు. ఇది ఒక పరిస్థితి. ఇంకో పరిస్థితిని మనం గమనిద్దాం. 1963వ సంవత్సరంలో కార్యనిర్వాహక వ్యవస్థ జారీ చేసిన ఉత్తర్వు ద్వారా సీబీఐని ఏర్పాటు చేశారు. చట్టం ద్వారా కాకుండా కార్యనిర్వాహక వ్యవస్థ ద్వారా ఏర్పాటైన సంస్థ రాజ్యాంగ వ్యతిరేకమైన సంస్థ అని గౌహతి హైకోర్టు నవీంద్ర కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో న్యాయమూర్తులు ఇక్బాల్ అహ్మద్ అన్సారీ, ఇందిరా షాలు 7 నవంబర్ 2013లో తీర్పు చెప్పారు. నవీంద్రకుమార్ పై 2001వ సంవత్సరంలో అవినీతి నిరోధక చట్టప్రకారం ఓ కేసుని సీబీఐ నమోదు చేసింది. 2004వ సంవత్సరంలో సీబీఐ చార్జిషీట్‌ని దాఖలు చేసింది. సీబీఐ రాజ్యాంగబద్ధత గురించి నవీంద్రకుమార్ హైకోర్టులో రిట్ పిటీషన్ని దాఖలు చేశాడు. పోలీసు విధులు నిర్వర్తించే అధికారం సీబీఐకి లేదని అతను తన రిట్ పిటీషన్లో పేర్కొన్నాడు. హైకోర్టులోని సింగిల్ బెంచ్ అతని రిట్ పిటీషన్ని 30.11.2007 రోజున డిస్మిస్ చేసింది. ఆ తీర్పుకి వ్యతిరేకంగా డివిజన్ బెంచ్ ముందు అతను అప్పీలుని దాఖలు చేశాడు. అతని అప్పీలుని ఆమోదిస్తూ డివిజన్ బెంచ్ ఈ విధమైన ఫైండింగ్స్ (నిర్ణయాంశాలు)ని ఇచ్చింది. డి.ఎస్.పి. ఈ చట్టంలోని ఫలానా నిబంధన ప్రకారం సీబీఐని ఏర్పాటు చేసినట్టు, సీబీఐ ఏర్పాటు తీర్మానంలో ఎక్కడా పేర్కొనలేదు. అందుకని ఆ చట్ట ప్రకారం సీబీఐ ఏర్పడినట్టు కాదు. ఏదైనా సంస్థకి ప్రత్యేకమైన పేరుని ఇస్తే అదే పేరుతో సంస్థ ఉండాలి. ఈ సంస్థ ఆ విధంగా లేదు. అందుకని అది ఈ చట్ట ప్రకారం ఏర్పాటైన సంస్థ కాదు. అన్నింటికన్నా ముఖ్యమైంది– సీబీఐ ఏర్పాటు తీర్మాన ప్రతిని రాష్ట్రపతి ముందు పెట్టలేదు. ఆయన అనుమతి కూడా తీసుకోలేదు. భారత ప్రభుత్వ కార్యదర్శి వి. విశ్వనాథన్ 1.4.1963వ తేదీన జారీ చేసిన ఉత్తర్వుతో ఏర్పడిన సంస్థ సీబీఐ. ఇంకా కొన్ని కారణాలని పేర్కొంటూ సీబీఐ అనేది పోలీసు సంస్థ కాదని గౌహతి హైకోర్టు డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. అందుకని నవీంద్రకుమార్పై దాఖలు చేసిన చార్జిషీట్‌ని డివిజన్ బెంచ్ కొట్టివేసింది. భారత ప్రభుత్వం ఈ తీర్పుకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అప్పీలుని దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఆ తీర్పుపై స్టేని మంజూరు చేసింది. ఆ స్టే ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు. ఆ కేసు ఎప్పుడు పరి ష్కారం అవుతుందో తెలియదు. ఇప్పుడు సుప్రీంకోర్టు కృష్ణకాంత్ తీర్పులో చెప్పిన ప్రకారం కోర్టులు మంజూరు చేసిన స్టేలు ఆరుమాసాలకి మించి కొనసాగడానికి వీల్లేదు. ఒకవేళ స్టే కొనసాగాలంటే కోర్టు వివరణాత్మక ఉత్తర్వులను పరిశీలించాలి. ‘స్టే’పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టుకి కూడా వర్తిస్తుంది. వివరణాత్మక ఉత్తర్వులు సుప్రీంకోర్టు వెంటనే ఇవ్వకపోతే సీబీఐ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. సీబీఐ అనేది పోలీసు సంస్థగా పరిగణించడానికి అవకాశం ఉండదు. అప్పుడు సీబీఐ పెట్టిన కేసులన్నీ గంగలో కలుస్తాయి. స్టే తీర్పు సీబీఐ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. సుప్రీం కోర్టు మార్చి 28న జారీ చేసిన తీర్పువల్ల తీవ్రమైన పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. ఈ తీర్పుని లోతుగా చూస్తే తప్ప ఈ విషయం బోధపడదు. ఈ తీవ్ర పరిణామాలని భారత ప్రభుత్వం గమనిస్తే ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్లే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు తామ్రాకర్ కేసులో ‘స్టే’ని మంజూరు చేయడం అంత సులువు కాదు. మంగారి రాజేందర్ వ్యాసకర్త కవి, రచయిత మొబైల్ : 94404 83001 -
న్యాయమూర్తులకి అవార్డులా?
అభిప్రాయం అవి అవార్డులు కావొచ్చు. రివార్డులు కావొచ్చు. న్యాయమూర్తులకి అవార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నించకూడదు. న్యాయమూర్తులు అలాంటివి స్వీకరించకూడదు. ఇది ఎక్కడా వ్రాయని, నమోదు చేయని నీతి, నియమం. ప్రజాస్వామ్య మనుగడకి స్వతంత్ర, నిర్భయ, నిష్పక్ష పాత న్యాయ వ్యవస్థ అవసరం. న్యాయమూర్తులు నిర్భయంగా లేకపోతే వాళ్లు భారత పౌరులకి రాజ్యాం గం ప్రసాదించిన ప్రాథమిక హక్కులని, ఇతర హక్కులని పరిరక్షించలేరు. న్యాయమూర్తులు బలహీనంగా ఉండి ఒత్తిడులకి, ప్రలోభాలకి లొంగిపోతే వాళ్లు ప్రజల హక్కులని పరిరక్షించలేరు. ఫలితంగా న్యాయవ్యవస్థ మీద విశ్వసనీయత సన్నగిల్లుతుంది. చిన్న చిన్న ప్రలోభాలకి కూడా న్యాయమూర్తులు లొంగకూడదు. మన దేశంలో న్యాయ వ్యవస్థ సంక్షోభంలో ఉంది. న్యాయమూర్తుల నియామకాల్లో జాప్యం, అభిప్రాయభేదాలు ఇలాంటి వాటితో న్యాయ వ్యవస్థ విశ్వసనీయత మసకబారుతుంది. కొన్ని సంఘటనలు చిన్నవిగా అన్పించినా వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అవి న్యాయ వ్యవస్థ స్వతంత్రత మీద అనుమానాలు వచ్చేవిధంగా ఉంటున్నాయి. మిగతా వ్యవస్థల్లో ఉన్న అవలక్షణాలు మెల్లమెల్లగా న్యాయ వ్యవస్థకి సంక్రమిస్తున్నాయని అన్పిస్తుంది. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన న్యాయవ్యవస్థని ప్రభుత్వం ఏ విధంగా కూడా ప్రభావితం చేయకూడదు. న్యాయం జరగడం ఎంత ముఖ్యమో, న్యాయం జరిగిందని అన్పించడం అంతకన్నా ముఖ్యం. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ విషయాలని జాగ్రత్తగా గమనించి అలాంటి ప్రభావితం చేసే విషయాలకి దూరంగా ఉండాలి. అవి అవార్డులు కావొచ్చు. రివా ర్డులు కావొచ్చు. న్యాయమూర్తులకి అవార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నించకూడదు. న్యాయమూర్తులు అలాంటివి స్వీకరించకూడదు. ఇది ఎక్కడా రాయని, నమోదు చేయని నీతి, నియమం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వ స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఓ 30 మంది మహిళలకి నారీ శక్తి పురస్కారాలను ప్రకటించింది. మహిళలకి న్యాయం అందే విధంగా, వాళ్లకి స్వాధికారికత లభించే విధంగా కృషి చేసినందుకు గుర్తింపుగా నారీ శక్తి పురస్కారాన్ని ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్‌కి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆమె స్వీకరించింది కూడా. గతంలో ఏ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ విధంగా అవార్డులని ప్రభుత్వం నుంచి గానీ, ప్రైవేట్ సంస్థల నుంచి గానీ స్వీకరించలేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఎం.ఎల్. వెంకటాచలయ్యకి, పి.ఎన్. భగవతికి పద్మభూషణ్ల్ని ప్రభుత్వం ఇచ్చింది. అయితే వాళ్లు పదవీ విరమణ చేసిన తరువాత ఇచ్చింది. మరో ప్రధాన న్యాయమూర్తి జె.ఎస్. వర్మకి ఆయన మరణించిన తరువాత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుని ప్రకటించింది. అయితే ఆయన కుటుంబ సభ్యులు ఆ అవార్డుని నిరాకరించారు. కానీ ఢిల్లీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న గీతా మిట్టల్ ఈ అవార్డుని స్వీకరించారు. ప్రభుత్వం ఇచ్చిన లక్ష రూపాయల మొత్తాన్ని ధార్మిక సంస్థలకి ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. ఏమైనా అవార్డు స్వీకరించడంవల్ల ఆమె ప్రభుత్వం నుంచి కొంత లబ్ధిని పొందినట్టుగా భావించాల్సి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కేసులని ఆమె పరిష్కరించటంలో స్వతంత్రత కోల్పోతుందన్న భావన ప్రజలకి కలిగే అవకాశం ఉంది. మరో విధంగా చెప్పాలంటే అవార్డు స్వీకరించడంవల్ల న్యాయవ్యవస్థ స్వతంత్రతకి భంగం వాటిల్లుతుందని భావించవచ్చు. పదవీ విరమణ తరువాత న్యాయమూర్తులు ఏదో ఒక పదవిని స్వీకరించడం విషయంలోనే దేశంలో విమర్శలు వస్తున్నాయి. అప్పటి ప్రధాన న్యాయమూర్తి సదాశివం గవర్నర్ పదవి స్వీకరించడంలో చాలా విమర్శలు వచ్చాయి. పదవీ విరమణ తరువాత కనీసం రెండు సంవత్సరాలు ఏ పదవీ స్వీకరించకుండా కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉండాలని మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా అన్నారు. పదవీ విరమణ చేసిన వెంటనే మరో పదవిని స్వీకరించడమంటే న్యాయమూర్తిగా చేసిన ప్రమాణానికి ద్రోహం చేసినట్టేనని మరో మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి గోపాల గౌడ అన్నారు. ఈ మాట లని ఎవరూ పట్టించుకోవడం లేదు. న్యాయమూర్తి లోధా తరువాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన హెచ్ఎల్. దత్తు జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా ఉండటానికి తన సంసిద్ధతని వెలిబుచ్చారు. ఆ పదవిని స్వీకరించారు. ఆయనే కాదు. చాలామంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ తరువాత వివిధ చదువుల్లో ఉన్నారు. అవార్డు స్వీకరించడం అనేది చిన్న విషయంగా కన్పిస్తూ ఉండవచ్చు. కానీ పదవిలో ఉన్న న్యాయమూర్తి ఈ విధంగా అవార్డు స్వీకరించడంవల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. న్యాయ వ్యవస్థ స్వతంత్రతని దెబ్బతీస్తాయి. మిగతా వ్యవస్థలకి భిన్నంగా న్యాయవ్యవస్థ ఉండాలి. కానీ రోజు రోజుకూ అన్ని వ్యవస్థల్లాగే ఇది కూడా మారిపోతోందని అన్పిస్తుంది. న్యాయమూర్తులని రిసీవ్ చేసుకోవడానికి ప్లకార్డులు ఫ్లెక్సీలు, నిలువెత్తు బొమ్మలు, గజమాలలు కన్పిస్తుంటే న్యాయ వ్యవస్థ ఎటు ప్రయాణం చేస్తుందని భయమేస్తుంది. విజిల్ బౌలర్లుగా ఉండాల్సిన న్యాయవాదులే ఈ పని చేస్తుంటే ఈ పరిస్థితికి ఆనకట్ట వేసేదెవరు? - మంగారి రాజేందర్ వ్యాసకర్త కవి, రచయిత ‘ 94404 83001 -
బుల్లెట్‌కి బుల్లెట్టే సమాధానమా?
బుల్లెట్‌కి బుల్లెట్ ఎప్పుడూ సమాధానం కాదు. పోలీసులకి చట్టాన్ని మించిన అధికారాలు ఇస్తే జిమ్ ట్రైనర్ లాంటి వ్యక్తులు బలయ్యే అవకాశం ఉంది. మరణ శిక్షను తొలగించాలన్న వాదన బలపడుతున్న దశలో బూటకపు ఎన్కౌంటర్లు ఎంతవరకు సమంజసం? గత వారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 18 ఎన్కౌంటర్లు జరిగాయి. గత సంవత్సరం మార్చి నెల నుంచి ఇప్పటివరకు దాదాపు 34 మంది ఎన్కౌంటర్లలో మరణించారు? ఎన్కౌంటర్ల రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ప్రసిద్ధి చెందుతోంది. ఎలాంటి కారణాలు లేకుండా ఇద్దరు వ్యక్తులు పోలీసు కాల్పుల్లో గాయపడ్డారు. వాళ్ల తప్పిదం ఉన్నట్టు ఎలాంటి వార్తలు ఇప్పటివరకు రాలేదు. ఒక వ్యక్తి జిమ్ ట్రైనర్. రెండవ వ్యక్తి అతని సన్నిహితుడు. ఓ వివాహానికి హాజరై ఇంటికి వెళ్తున్నప్పుడు పోలీసులు వాళ్లను ఆపి కాల్చారు. అక్కడ ఎలాంటి ఎదురు కాల్పులు లేవు. అది ఎన్కౌంటర్ అని, ఆ వ్యక్తుల బంధువులు, వ్యక్తిగత కారణాలవల్ల కాల్చారని పోలీసులు అంటున్నారు. ఈ సంఘ టనలో పాలుపంచుకున్న పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ని అరెస్టు చేశారు. ముగ్గురు పోలీసులని సస్పెండ్ చేశారు. న్యాయపాలన ఉన్న మన దేశంలో ఎన్కౌంటర్లు కొత్త కాదు. ఏ రాష్ట్రమూ దానికి మినహాయింపు కాదు. పోలీసుల చర్యల్లో వ్యక్తులు మరణించినప్పుడు ఆ చర్యలని ఆత్మరక్షణార్థం జరిపిన కాల్పులని పోలీసులు చెబుతారు. బూటకపు ఎన్కౌంటరని ప్రజాసంఘాలు అంటూ ఉంటాయి. పోలీసులు చేసే ఎన్కౌంటర్ మరణాల్లో ఆత్మరక్షణ అనేది అరుదుగా ఉంటుంది. ఎందుకంటే అవి దాదాపు కావాలని చేసినవి కావొచ్చు లేదా ప్రతీకారంతో చేసినవి కావొచ్చు. ఆత్మరక్షణ కోసం చేసిన వాటిని, ప్రతీకారంతో చేసిన వాటిని స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎదుటి వ్యక్తిని చంపితే తప్ప అతని నుంచి ప్రాణాన్ని రక్షించుకోలేని పరిస్థితుల్లోనే ఆత్మరక్షణ కోసం అతణ్ని చంపే అవకాశం ఉంటుంది. అంతే తప్ప మిగతా సందర్భాలలో లేదు. ఎదుటి వ్యక్తుల దగ్గర ఎలాంటి ఆయుధాలు లేనప్పుడు చంపితే అది ఆత్మరక్షణ కోసం చేసినదిగా భావించే అవకాశం లేదు. ఎదుటి వ్యక్తులని పట్టుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా కాల్పులు జరిపి చంపితే అది ప్రతీకార చర్య అవుతుంది. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు ‘ఎక్స్ట్రా జ్యుడీషియల్ ఎగ్జిబిషన్ విక్టిమ్ ఫ్యామిలీస్ అసో సియేషన్, ఇతరులు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఏ.ఐ.ఆర్ 2016 సుప్రీంకోర్టు 3400)’ కేసులో చెప్పింది. ఎవరిమీద అయితే దాడి జరిగిందో ఆ వ్యక్తి అవసరమైన దానికన్నా ఎక్కువ బలాన్ని ఉపయోగిస్తే ఆ వ్యక్తే దురాక్రమణదారు అవుతాడు. అతను శిక్షార్హుడవుతాడు. ఒకవేళ ‘రాజ్యం’ దాని ప్రతినిధులు అవసరమైన దానికన్నా, ఎక్కువ బలాన్ని ఉపయోగించి మొదటి దురాక్రమణదారుని చంపితే అది న్యాయేతర మరణం అవుతుంది. (ఎక్స్ట్రా జ్యుడీషియల్ కిల్లింగ్). దురాక్రమణదారు తనని చంపుతాడన్న నిజమైన భయాందోళన ఉన్నప్పుడు ఆత్మరక్షణ అనేది అమల్లోకి వస్తుంది. కానీ ప్రతీకారం తీర్చు కునేందుకు కాదు. (దర్శన్‌సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, ఏ.ఐ.ఆర్ 2010 సుప్రీంకోర్టు 1212). చాలా ఎన్కౌంటర్లు ఆత్మరక్షణ కోసం చేసినవి కాదు. ప్రతీకారం కోసమో లేదా కావాలని చంపినవి మాత్రమే. వీటి విషయంలో సరైన దర్యాప్తు జరిగితే ఈ విషయాలు బయటకు వస్తాయి. అపాయకరమైన వ్యక్తులని, తీవ్రమైన నేరాలు చేసిన వ్యక్తులని పోలీసులు చంపుతూ ఉంటారు. ఉత్తరప్రదేశ్‌లో ఆ విధంగా జరుగు తుందన్న ఆరోపణలు ఉన్నాయి. ‘ఓంప్రకాశ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్ 2012 (12) ఎన్.సి.సి. 72’ కేసులో సుప్రీంకోర్టు ఈ విధంగా అభిప్రా యపడింది. ‘‘అపాయకరమైన నేరస్తులన్న కారణంగా వాళ్లను పోలీ సులు మట్టుపెట్టడానికి వీల్లేదు. వాళ్లని అరెస్టు చేసి కోర్టుకి పంపిం చాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది’’. దురాక్రమణదారు ఎవరు అన్నది తెలుసుకోవడం కోసం దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. బాధితుల అసోసియేషన్ దాఖలు చేసిన కేసులో ఈ విషయమే సుప్రీంకోర్టు చెప్పింది. మానవ హక్కుల జాతీయ కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఎన్కౌంటర్లు జరిగిన ప్పుడు సి.బి.సి.ఐ.డి. ద్వారా గానీ వేరే ఏజెన్సీ ద్వారాగానీ దర్యాప్తు జరిపించాలి. పి.యు.సి.ఎల్ వర్సెస్ సివిల్ లిబర్టీస్ 2015 క్రిమినల్ జర్నల్ 610 కేసులో ఈ మార్గదర్శకాలు పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారతీయ శిక్షాస్మృతిలోని ఆత్మరక్షణ నిబంధనలు ఏమి చెప్పినా, సుప్రీంకోర్టు ఎన్ని తీర్పులు చెప్పినా మానవ హక్కుల కమిషన్ ఎన్ని మార్గదర్శకాలు జారీ చేసినా మన దేశంలో ఎన్కౌంటర్ల విషయంలో ఎలాంటి గుణాత్మకమైన మార్పు కన్పించడం లేదు. బుల్లెట్‌కి బుల్లెట్ ఎప్పుడూ సమాధానం కాదు. పోలీసులకి చట్టాన్ని మించిన అధికారాలు ఇస్తే జిమ్ ట్రైనర్ లాంటి వ్యక్తులు బలయ్యే అవకాశం ఉంది. మరణ శిక్షను తొలగించాలన్న వాదన బలపడు తున్న దశలో బూటకపు ఎన్కౌంటర్లు ఎంతవరకు సమంజసం? ఎలాంటి దర్యాప్తూ, కోర్టు విచారణలు లేకుండా క్రిమినల్స్‌కి, ఆ పేరుతో మరికొందరిని మట్టుపెట్టవచ్చు. వాళ్లలో భయాన్ని కలిగించ వచ్చు. క్రిమినల్స్ ఈ విధంగా పెరగడానికి కారణాలను నిరోధించడా నికి తగు చర్యలని అన్వేషించకుండా చంపడం అనేది ఎప్పుడూ సమా ధానం కాదు. ఈ చర్యలు న్యాయపాలనకి విఘాతం కలిగిస్తాయి. మన రాజ్యాం గాన్ని, శాసనాలని లెక్క చేయకపోవడం ఎంతవరకు సమంజసం? - మంగారి రాజేందర్ వ్యాసకర్త కవి, రచయిత మొబైల్ : 94404 83001 -
బహిరంగ విచారణలే మేలు
విశ్లేషణ న్యాయానికి అన్యాయం జరుగుతుందని భావించినప్పుడు ఏదైనా కేసుని గోప్యంగా విచారించమని హైకోర్టు ఆదేశించవచ్చు. బహిరంగంగా విచారణలు జరపడం వల్ల ఉచితమైన, నిష్పాక్షిక న్యాయం అందుతుంది. ఈ భావనకి నష్టం కలిగినప్పుడు మాత్రమే హైకోర్టు గోప్యతను పాటించవచ్చు. మన దేశంలో ఎన్కౌంటర్ మరణాలు సహజమైపోయాయి. నిందితులే దాడి చేసినట్టుగా ప్రథమ సమాచార నివేదికలు విడుదల అవుతాయి. ఈ కేసుల్లో భారతీయ శిక్షాస్మృతిలోని నిబంధన 302 ప్రకారం కేసు నమోదు చేయాలని ఏపీ హైకోర్టు తీర్పుని ప్రకటించి చాలా కాలమైంది. దానిపై అప్పీలు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏదైనా ఎన్కౌంటర్ కేసు దర్యాప్తు జరిగి, కోర్టులో విచారణ జరు గుతూ ఉంటే సహజంగానే దేశ ప్రజలకి ఆ కేసు గురించి ఆసక్తి ఏర్పడు తుంది. మీడియా కూడా ఈ కేసులని రిపోర్టు చేయడంలో ఉత్సాహాన్ని ప్రకటిస్తుంది. ఇలాంటి కేసుల విచారణ విషయాలను మీడియాలో ప్రక టించకూడదన్న నిషేధపు ఉత్తర్వులు ఆందోళన కలుగజేస్తాయి. సొహ్రా బుద్దీన్ షేక్, ప్రజాపతి మాసిరామ్, కవుసర్బీ ఎన్కౌంటర్ కేసులని విచా రిస్తున్న సీబీఐ కోర్టు న్యాయమూర్తి అలాంటి ఉత్తర్వులనే ఆ కేసుల విష యంలో జారీ చేశారు. ఆ ఉత్తర్వులని బొంబాయి హైకోర్టు రద్దు చేసింది. అలాంటి ఉత్తర్వులు జారీ చేసే అధికారం కోర్టుకి లేదని, ఆ పరిస్థితులూ లేవని హైకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ న్యాయమూర్తి జారీ చేసిన మీడియా నిషేధపు ఉత్తర్వులకి వ్యతిరేకంగా టీవీ, ప్రింట్ మీడియా జర్న లిస్టులు హైకోర్టులో రిట్ పిటిషన్‌ని దాఖలు చేశారు. ఆ కేసులో జరుగుతున్న రోజువారీ వ్యవహారాలని మీడియా ప్రచు రించవచ్చని, ప్రసారం చేసుకోవచ్చని బొంబాయి హైకోర్టు తమ ఉత్త ర్వులో స్పష్టం చేసింది. మీడియా గొంతు నొక్కడం లాంటి ఉత్తర్వులు జారీ చేసే అధికారం కోర్టుకి లేదని హైకోర్టు న్యాయమూర్తి మోహన్ డిరే స్పష్టం చేశారు. రాజ్యాంగం హామీ ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛ మీడి యాకూ వర్తిస్తుంది. బహిరంగ విచారణ జరుగుతున్నప్పుడు ఆ విష యాలు ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత మీడియాపై ఉంది. అది ప్రజాహితం కోసమేనని కూడా జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సొహ్రాబుద్దీన్ కేసు ఈ చరిత్రను సృష్టించింది. 2003 నుంచి 2006 వరకు జరిగిన ఎన్కౌంటర్ మరణాల గురించి దర్యాప్తు చేయమని సుప్రీంకోర్టు ఆదేశించిన క్రమంలో దర్యాప్తు జరిగి విచారణ దాకా వచ్చిన కేసు అది. ఈ కేసు ఫలితంగా గుజరాత్ రాష్ట్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తరువాత జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చింది. ఆ కేసుని విచారించిన రెండవ న్యాయమూర్తి బీహెచ్ లోయా అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అతని మరణం ఇప్పుడు ప్రశ్నా ర్థకమైంది. 2014లో ఆ కోర్టుని నిర్వహించిన మూడవ న్యాయమూర్తి అప్పటి హోంమంత్రి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాని డిశ్చార్జ్ చేశారు. న్యాయమూర్తి లోయా మరణం గురించిన కేసు విచారణ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీడియా సమావేశం దాకా చేరింది. ఈ దశలో సీబీఐ న్యాయమూర్తి మీడియా గొంతు నొక్కడం వివాదాస్పదమైంది. న్యాయస్థానాల్లో విచారణలు బహిరంగంగా జరుగుతాయి. ఈ విచారణలను ప్రజలు హాజరై గమనించవచ్చు. ఈ బహిరంగ విచారణల వల్ల వ్యక్తులకి, సమాజానికి మేలు జరుగుతుంది. బహిరంగ విచారణ హక్కు అనేది రాజ్యాంగంలోని అధికరణ 21లో మిళితమై ఉంది. ఈ బహిరంగ విచారణలవల్ల కోర్టుల విశ్వసనీయత పెరుగుతుంది. బహిరంగ విచారణ నియమం లాంటిది. గోప్యంగా జరపడం ఈ నియమానికి మినహాయింపు. న్యాయానికి అన్యాయం జరుగుతుందని భావించినప్పుడు ఏదైనా కేసుని గోప్యంగా విచారించ మని హైకోర్టు ఆదేశించవచ్చు. బహిరంగంగా విచారణలని జరపడం వల్ల ఉచితమైన, నిష్పాక్షికంగా న్యాయం అందుతుంది. ఈ భావనకి నష్టం కలిగినప్పుడు మాత్రమే హైకోర్టు ఇలాంటి ఉత్తర్వులని జారీ చేసే అవకాశం ఉంది. క్రింది కోర్టుల్లో కూడా విచారణలు బహిరంగంగా జరగాలి. క్రిమి నల్ ప్రొసీజర్ కోడ్‌లోని సె. 327 ఇదే విషయాన్ని చెబుతుంది. అయితే లైంగిక దాడులకి సంబంధించిన నేరాల విచారణని గోప్యంగా జరపాల్సి ఉంటుంది. అదే విధంగా అందరినీ కానీ, కొంతమందినిగానీ కోర్టు నుంచి బయటకు పంపే అధికారం కోర్టుకి ఉంటుంది. ఈ విషయాలను బొంబాయి హైకోర్టు పరిశీలించి ఈ విధంగా అభిప్రాయపడింది. ‘‘ఈ కేసులో బహిరంగ విచారణ జరపడంవల్ల ప్రాణానికి హాని ఉందని, అలాంటి పరిస్థితి ఉందనిగానీ సీబీఐ న్యాయమూర్తి తమ ఉత్త ర్వులలో పేర్కొనలేదు. ఈ కేసులో ఇప్పటికే 15 మందిని కోర్టు డిశ్చార్జి చేసింది. అందుకని అలాంటి భయాందోళనలకి అవకాశం లేదు’’. దేశంలోని కోర్టులు నిష్పక్షపాతంగా ఉన్నాయని అనడానికి పార దర్శకత అవసరం. న్యాయ ప్రక్రియలో ఇదే మౌలికమైన అంశం. ఆ విశ్వ సనీయతవల్లే ప్రజలు కోర్టు తీర్పులకి బద్ధులై ఉంటున్నారు. బొంబాయి హైకోర్టు ఈ విధంగా అభిప్రాయపడింది. ‘‘భారత ప్రజాస్వామ్యాన్ని అనుక్షణం కాపాడే వ్యవస్థ మీడియా. ప్రజలకి కళ్లూ చెవులూ మీడియానే. అందుకని సమాజహితం కోసం మీడియాకు స్వేచ్ఛ ఉండాలి’’. అవును– ఖచ్చితంగా మీడియాకు స్వేచ్ఛ ఉండాలి. - మంగారి రాజేందర్ వ్యాసకర్త కవి, రచయిత మొబైల్ : 94404 83001 -
మీడియాపై ఆంక్షలు సబబా?
ప్రధాన న్యాయమూర్తి సహా అన్ని కోర్టుల కార్యకలాపాలను వీక్షించే అవకాశాన్ని మన న్యాయవ్యవస్థ ప్రజలకు కల్పించింది. ఈ హక్కుని తగ్గించడం వల్ల న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఉన్న విశ్వసనీయత తగ్గుతుంది. న్యాయస్థానాల్లో విచారణలు బహిరంగంగా జరుగుతాయి. ఈ విచారణలను ప్రజలు హాజరై గమనించవచ్చు. ఈ బహిరంగ విచారణల వల్ల వ్యక్తులకి, సమాజానికి మేలు జరుగుతుంది. బహిరంగ విచా రణ హక్కు ఉండటం వల్ల న్యాయపాలన ఎలా జరుగు తుందో, నిర్ణయాలు ఎలా జరుగుతాయో ప్రజలకు తెలుస్తుంది. మన దేశంలో సివిల్, క్రిమినల్ కోర్టుల విచారణలు బహిరంగంగానే జరుగుతాయి. ఈ బహి రంగ విచారణల వల్ల ప్రజల్లో కోర్టుల పట్ల విశ్వసనీ యత పెరుగుతుంది. బహిరంగ విచారణలను వీక్షించి, ప్రచురించే అవకాశం మీడియాకు ఉంది. కానీ ఇటీవలి కాలంలో కోర్టులు జారీ చేస్తున్న ఉత్తర్వుల వల్ల కోర్టు కార్యకలాపాలను ప్రచురించే అవకాశాన్ని మీడియా కోల్పోతుంది. ఇవి, ఒక రకంగా బహిరంగ విచారణలకి వ్యతిరేకమైన ఉత్తర్వులని అనుకోవచ్చు. కోర్టుల కార్య కలాపాల్లో ఉన్నంత పారదర్శకత ఏ వ్యవస్థలోనూ కన్పించదు. ఇది న్యాయ వ్యవస్థకు ఉన్న విశిష్ట లక్షణం. ఈ విశిష్టత బీటలు వారుతున్నట్టు అనిపిస్తుంది. సోహ్రాబుద్దీన్ షేక్ కేసును విచారిస్తున్న సీబీఐ న్యాయమూర్తి ఆ విచారణకు సంబంధించిన విషయా లను ప్రచురించకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. మీడియా రిపోర్టుల వల్ల విచారణకు అంతరాయం కలు గుతుంది, ముద్దాయిల ప్రాణాలకు నష్టం వాటిల్లు తుంది అన్న డిఫెన్స్ వాదనలను అంగీకరిస్తూ సీబీఐ న్యాయమూర్తి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. యూపీ ముఖ్యమంత్రిపై కేసు సందర్భంగా అలహాబాద్ హైకోర్టు నవంబర్ 7న ఇలాంటి ఉత్తర్వులనే జారీ చేసింది. వీటి కంటే ముందే సుప్రీంకోర్టు ఈ ఏడాది మొదట్లో దాదాపు ఇలాంటి ఉత్తర్వులనే జారీ చేసింది. న్యాయమూర్తి కర్ణ న్కు కోర్టు ధిక్కార కేసులో శిక్ష విధిస్తూ అది ఆయన ప్రకటనలను ఏ పత్రిక ప్రచురించకూడదంటూ మీడి యాపై ఆంక్షలను విధించింది. ఈ ఉత్తర్వులు మిగతా కోర్టులను కూడా ప్రభావితం చేశాయని అనుకోవచ్చు. చాలా కేసుల్లో మీడియా కాపలా కుక్కలా పని చేస్తుంది. విచారణలో ఉన్న వ్యక్తులకు హాని కలగకుండా మీడియా కేసు వార్తలను ప్రచురించాల్సి ఉంటుంది. హాని కలిగించే విధంగా ప్రచురించినప్పుడు ఆ మీడియా సంస్థపై చర్య తీసుకునే అధికారం కోర్టులకు ఉంది. అయినా మీడియా గొంతు నొక్కడం ఎంతవరకు సమం జసం అన్న వాదన వినిపిస్తోంది. మన దేశంలో ఉన్న చట్టాల ప్రకారమేగాక అంతర్జాతీయ ఒడంబడికల ప్రకారం ప్రతి వ్యక్తికి బహిరంగ విచారణ హక్కులు ఉంటాయి. బహిరంగ విచారణలు జరపడం అనేది నియమం లాంటిది. ఈ నియమానికి మినహాయింపులు ఇచ్చే అధికారం న్యాయమూర్తికి ఉంటుంది. విచారణకు మొత్తంగా ప్రజలందరిని దూరంగా ఉంచాలా, ప్రత్యే కించి ఎవరిని దూరంగా ఉంచాలి అన్న విషయాలు సంబంధిత కోర్టుని బట్టి, ఆ వ్యవహారం తీవ్రతను బట్టి ఉంటుంది. అలాగే కోర్టు కార్యకలాపాలను కొంత కాలం కానీ, పూర్తిగా కానీ పత్రికలు ప్రచురించరాదని ఆదేశించే అధికారం కోర్టుకు ఉంటాయి. క్రిమినల్ ప్రొసీ జర్ కోడ్ సెక్షన్ 327 ప్రకారం క్రిమినల్ కోర్టులకు ఈ అధికారం ఉంటుంది. సివిల్ ప్రొసిజర్ కోడ్‌లో అలాంటి ప్రత్యేక నిబంధన లేదు. కానీ సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 151 ప్రకారం సివిల్ కోర్టుకు స్వయంసిద్ధ అధికా రాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించి కోర్టు విచారణ జరుపుతున్న క్రమంలో ఎవరినైనా బయటికి పంపించే అధికారం కోర్టుకు ఉంటుంది. అధికారం ఉండడం ఒక ఎత్తు, దానిని న్యాయబద్ధంగా ఉపయోగించడం మరొక ఎత్తు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని కోర్టులు తమ అధికారాలను వినియోగించాల్సి ఉంటుంది. బహిరంగ విచారణలనేవి ఆరోగ్యకరమైన, నిష్పా క్షిక న్యాయపాలనకు పునాది లాంటివి. న్యాయవ్యవస్థ నిష్పాక్షికంగా ఉండటానికి న్యాయమూర్తులు చపలత్వా నికి లోనుకాకుండా ఉండటానికి ఇది ఉపయోగపడు తుంది. భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చిన హక్కు. భావాలను ప్రకటించిన తర్వాత, అవి చట్ట వ్యతిరేకంగా ఉంటే చర్యలు తీసుకోవచ్చు. ముందుగానే భావ ప్రక టనను నిరోధించడం ప్రజాస్వామ్యానికి హాని కలిగిం చేది అవుతుందని అనుకోవచ్చు. 1950లో సుప్రీంకోర్టు, బ్రిజ్‌భూషణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ కేసులో బ్రిటిష్ న్యాయ కోవిదుడు బ్లాక్ స్టోన్ అభిప్రాయాన్ని ఉటంకిస్తూ పత్రికా స్వేచ్ఛ గురించి ఇలా అభిప్రాయపడింది. ‘‘ప్రచురించడానికన్నా ముందే పత్రి కపై పరిమితులు విధించకూడదు. ఈ స్వేచ్ఛ ఇచ్చి నంత మాత్రాన తప్పుడు రాతలపై చర్యలు తీసు కోవద్దని కాదు’’. ఇప్పుడు కోర్టులు ఇస్తున్న ఉత్తర్వుల వల్ల ప్రచురణకన్నా ముందే పత్రికలపై పరిమితులను విధిస్తున్నట్టుగా అనిపిస్తుంది. నిష్పాక్షిక విచారణ కోసం కోర్టులు ఈ పరిమి తులను విధించవచ్చు. అయితే బహిరంగ విచారణల వల్ల, కోర్టులో ఏం జరుగుతుందో తెలుసుకోవడం వల్ల కోర్టుల పట్ల ప్రజల విశ్వసనీయత మరింత పెరిగే అవకాశం ఉంది. భారత ప్రధాన న్యాయ మూర్తి కోర్టు కార్యకలాపాలను వీక్షించే అవకాశాన్ని కూడా కోర్టులు కల్పించాయి. మిగతా వ్యవస్థల కన్నా భిన్నంగా ఈ హక్కుని కోర్టులు ప్రజలకి ఇచ్చాయి. ఈ హక్కుని తగ్గించడం వల్ల న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు వున్న విశ్వసనీయత తగ్గుతుంది. ఈ విషయాలని దృష్టిలో పెట్టుకొని కోర్టులు పరిమితులని విధిస్తే ఆరోగ్యకరంగా ఉంటుంది. - మంగారి రాజేందర్ వ్యాసకర్త తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు ‘ మొబైల్ : 94404 83001 -
ఈ అంతరంతో అనర్థమే!
విశ్లేషణ న్యాయమూర్తుల పదవీ విరమణ వయసుని 65 ఏళ్లకు పెంచడానికి కేంద్రం రాజ్యాంగ సవరణ బిల్లు– 2010ని లోక్‌సభలో ప్రవేశపెట్టింది. లోక్‌సభ పదవీకాలం ముగిసిపోవడం వల్ల అప్పుడు ఆ బిల్లు ప్రాధాన్యం కోల్పోయింది. కొత్త బిల్లు ప్రవేశపెట్టడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించదు. రాజ్యాంగ విలువల రక్షణలో న్యాయ వ్యవ స్థది ప్రముఖ పాత్ర.. న్యాయమూర్తుల ఎంపి కలో ఇటీవలి కాలంలో న్యాయ వ్యవస్థకీ, కార్య నిర్వాహక వ్యవస్థకీ మధ్య తలెత్తిన ఘర్షణ వాతావరణం కలవరపెట్టింది. అయితే ఆ పద వుల నియామకంలో ఈ రెండు వ్యవస్థల మధ్య అంగీకారం కూడా కుదురుతుందన్న వార్త ఆశా వహమైనదే. దేశ జనాభాతో పోలిస్తే న్యాయమూర్తుల సంఖ్య అతి తక్కువ నిష్పత్తిలో ఉంది. 10 లక్షల జనాభాకి 15.5 న్యాయ మూర్తుల వంతున మాత్రమే ఉన్నారు. కేసుల సంఖ్య 3 కోట్లు దాటిం దని అంచనా. ఈ పరిస్థితిని అధిగమించడానికి రాజ్యాంగంలోని అధి కరణ 224ఎ ప్రకారం న్యాయమూర్తులని నియమించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో ఏకగ్రీవ నిర్ణయం జరిగింది. రాజ్యాంగంలోని అధికరణ 128, 224(ఎ) ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో గతంలో పనిచేసిన వారిని తాత్కాలిక న్యాయ మూర్తులుగా నియమించే అవకాశం ఉంది. కానీ ఈ విధంగా నియ మించే బదులు న్యాయమూర్తుల వయోపరిమితి పెంచడం మంచిది. అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల పదవీ విరమణ వయ సులోని అంతరం సమంజసమనిపించదు. 1949లో రాజ్యాంగాన్ని ఆమోదించిన నాడు హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లు. 1963లో రాజ్యాంగాన్ని సవరించి హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసుని 62 ఏళ్లకు పెంచారు. అమెరికాలో ఫెడరల్ న్యాయ మూర్తులకి పదవీ విరమణ వయసు లేదు. తమ బాధ్యతలని నిర్వర్తించ లేనప్పుడు వారు పదవీ విరమణ చేయవచ్చు. యూకే న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 75 ఏళ్లు. కానీ భారతదేశంలో ఆ అంతరం ఎందుకో అర్థం కాదు. భారత ప్రభుత్వ చట్టం–1935లోని సెక్షన్ 200 ప్రకారం ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియాలో ప్రధాన న్యాయమూర్తితో పాటు మరో ఆర్గురు న్యాయమూర్తులు ఉంటారు. వీరి పదవీ విరమణ వయసు 65 ఏళ్లు. దీనినే భారత రాజ్యాంగ సంస్కరణల సంయుక్త సంఘం ఆమోదిం చింది. ఐదేళ్ల ఆ అంతరం ఇలా కొనసాగుతున్నది. రాజ్యాంగ నిర్మాణ మండలి ఇదే విషయాన్ని ఆమోదించింది. గతంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడానికే కానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేయడానికి ఇష్టపడలేదు. ఈ విష యం జార్జ్ హెచ్. గాడ్బోయిస్ తన ‘జూనియర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా’ పుస్తకంలో పేర్కొన్నారు. కానీ పరిస్థితులు మారాయి. మన సుప్రీంకోర్టు ప్రపంచంలోనే శక్తిమంతమైనదిగా రూపొందింది. ఇవాళ వారు సుప్రీం కోర్టు న్యాయమూర్తి పదవిని తిరస్కరించే అవకాశం లేదు. 1980 నుంచి ఇప్పటి వరకు గమనిస్తే హైకోర్టు నుంచి వచ్చిన న్యాయమూర్తుల సంఖ్యే సుప్రీంకోర్టులో ఎక్కువ. అలాగే ఉన్నత న్యాయ స్థానాల న్యాయమూర్తులని సివిల్ సర్వెంట్స్‌తో పోల్చడానికి వీల్లేదు. ఈ విషయం గురించి జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ సభలో చెప్పిన మాటలు ఉదహరించక తప్పదు. ‘‘న్యాయమూర్తులు చేసే పని సివిల్ సర్వెంట్స్ పనికి భిన్నమైనది. శారీరక శ్రమ తక్కువ అనిపిస్తుంది. సివిల్ సర్వీస్ ఎదుర్కొనే పరిస్థితి న్యాయమూర్తికి ఉండదు కానీ న్యాయమూర్తులు చాలా బాధ్యతాయుత మైన పనులను నిర్వహిస్తారు. మిగతా దేశాల్లో ఈ పదవీ విరమణ వయసు మన దేశంలో కన్నా ఎక్కువ. అమెరికాలో 92 సంవత్సరాల దాకా న్యాయమూర్తులు బాగా పనిచేస్తున్నారు. ఇంగ్లండ్‌లోని ప్రివీ కౌన్సిల్లో కూడా న్యాయమూర్తులు చాలాకాలం పనిచేస్తున్నారు. న్యాయమూర్తి పదవి యువకుల ఉద్యోగం ఇవ్వడం లాంటిది కాదు. మంచి వ్యక్తులు కావాలనుకున్నప్పుడు వయసనేది ఆటంకంగా ఉండ రాదు.’’ (రాజ్యాంగ సభ డిబేట్ వాల్యూమ్ 7, పేజీ 246,47) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, యూనివర్సిటీ అధ్యాపకుల పదవీ విమరణ వయసు పెంచారు. కానీ హైకోర్టుల న్యాయమూర్తుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం వరకే పరి మితమయ్యారు. న్యాయమూర్తుల పదవీ విరమణ వయసుని 65 ఏళ్లకు పెంచడానికి కేంద్రం రాజ్యాంగ (114వ సవరణ) బిల్లు, 2010ని లోక్‌సభలో ప్రవేశ పెట్టింది. లోక్‌సభ పదవీ కాలం ముగిసిపోవడం వల్ల అప్పుడు ఆ బిల్లు ప్రాధాన్యం కోల్పోయింది. కొత్త బిల్లు ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించదు. న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు పెంచాలని జస్టిస్ వెంకటాచలయ్య కమిటీ, లా కమి షన్ 232 నివేదికలో సిఫారసు చేసినప్పటికీ, న్యాయమూర్తుల కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ అంతరం సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల మధ్యనే కాదు, మరో రాజ్యాంగ సంస్థ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల దగ్గరా ఉంది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లు కాగా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లు. కానీ ఈ రెండు సంస్థలు నిర్వహించే బాధ్యతలు ఒకే విధమైనవి. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల పదవీ విరమణ వయసులోని వ్యత్యాసమే యూనియన్, రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమి షన్ల చైర్మన్, సభ్యుల పదవీ విరమణ వయసులో అంతరాన్ని ఏర్పరి చినట్టు కనిపిస్తుంది. సమాచార హక్కు కమిషన్, మానవ హక్కుల కమి షన్లో కూడా పదవీ విరమణ వయసు 65, 70 సంవత్సరాలు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల న్యాయమూర్తులు ఒకే రకమైన విధులు నిర్వర్తిస్తున్నారు. కానీ వీరి పదవీ విరమణ వయసు లోని అంతరం ఎందుకో అర్థం కాదు. శాసనానికి కారణమనేది ఆత్మ లాంటిది. అలాంటి ఆత్మే లేనప్పుడు అంతరం ఉండాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం అమల్లోకి తెచ్చినపుడు అలాంటి అవసరం ఉందేమో కానీ ఇప్పుడు అలాంటి అవసరం లేదు. - మంగారి రాజేందర్ వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు, జ్యుడీషియల్ అకాడమీ మాజీ డైరెక్టర్ -
నవ న్యాయవ్యవస్థ నిర్మాత
సందర్భం కేంద్ర న్యాయశాఖ మంత్రిగా శివశంకర్ చేపట్టిన సంస్కరణల వల్లే బడుగు బల హీన వర్గాలకు చెందిన పలువురు లాయర్లు హైకోర్టు, సుప్రీంకోర్టు స్థాయికి చేరుకో గలిగారు. ఆయన చేసిన మార్పులు న్యాయ వ్యవస్థ చరిత్రలో నిలచిపోతాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా, రెండు రాష్ట్రాలకి గవర్నర్‌గా పనిచేసిన పి. శివశంకర్ 89 ఏళ్ల వయస్సులో సోమవారం నాడు కన్నుమూశారు. ఆయన మర ణాన్ని సాంఘిక మాధ్యమాలు పట్టించుకున్నంతగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు పట్టిం చుకున్నట్లు లేదు. ఆయన చాలా పదవులని అధిష్టించినప్పటికీ కేంద్ర న్యాయశాఖలో చేసిన మార్పులు న్యాయవ్యవస్థ చరిత్రలో మిగిలిపోతాయి. 1927లో వెనుకబడిన కులంలో పుట్టిన శివశంకర్ చాలా కష్టపడి పైకి వచ్చారు. తల్లిదండ్రులకి ఉన్న 11 మంది సంతానంలో ఆయన రెండవ వ్యక్తి. కుటుంబానికి చేయూతనివ్వడానికి చిన్న చిన్న ఉద్యోగాలను చాలా చేశారు. శివశంకర్, ఆయన సోదరుడు కలిసి అమృత్ సర్‌లో చదువుకున్నారు. చిన్న చిన్న పనులు చేస్తూ బీఏ ఎల్ఎల్బీని పూర్తి చేశారు. ఆ కాలంలోనే తీవ్రమైన ఆకలి బాధలతో సతమతమై అతని సోదరుడు అమృత్‌సర్‌లో మరణించాడు. అతని పార్థివ శరీరాన్ని హైదరాబాద్‌కి పంపించే స్తోమత కాదు కదా దహనం చేసే స్తోమత కూడా శివశంకర్‌కి అప్పుడు లేదు. చివరికి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్లు ఆ శవాన్ని తీసుకొని వెళ్ళారు. లా చదువు పూర్తయ్యాక హైదరా బాద్‌కి వచ్చి న్యాయవాదిగా ప్రాక్టీస్ మెుదలుపెట్టారు. ఇంగ్లిష్ భాష మీద, న్యాయశాస్త్రాల మీద మంచి పట్టు ఉండ డం వల్ల స్వల్ప కాలంలో మంచి న్యాయ వాదిగా పేరు గడించారు. ఎమర్జెన్సీ తరువాత చాలా కేసులను ఎదుర్కొం టున్న ఇందిరాగాంధీ శివశంకర్ సేవలను విని యోగించి, కేసులని, కమిషన్లని ఎదుర్కొన్నారు. ఆమె ప్రభుత్వంలో ఆయన న్యాయశాఖ మంత్రిగా పనిచేయడం న్యాయ వ్యవస్థలో చాలా మార్పులు రావడానికి దోహదపడింది. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ గురించి శివశంకర్ కొన్ని చర్యలు చేపట్టినారు. మార్చి 18, 1981 రోజున అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, గవర్నర్లకి న్యాయ మూర్తుల బదిలీ గురించి ఓ సర్క్యులర్ని పంపించారు. హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యే వ్యక్తుల దగ్గర నుంచి శాశ్వత న్యాయమూర్తులుగా ఇతర హైకోర్టులలో పనిచేయడానికి అనుమతి తీసుకోవాలన్నది సర్క్యులర్ సారాంశం. ఈ బదిలీల వల్ల జాతీయ సమై క్యత ఏర్పడటంతోపాటు కుల, బంధుత్వ, స్థానిక అంశాలు ప్రభావం చూపవని ఆయన ఉద్దేశం. కానీ ఇది న్యాయవ్యవస్థ మీద విశ్వాసం లేకుండా చేస్తుందని, న్యాయమూర్తులను అసౌకర్యానికి గురి చేస్తుం దనీ విమర్శలు ఈ సర్క్యులర్‌పై వచ్చాయి. అయితే న్యాయ వ్యవస్థ తనను ఎవరూ తాకకూడదన్నట్టుగా ఉండ కూడదని శివశంకర్ లోక్‌సభలో న్యాయవ్యవస్థ స్వతం త్రత గురించి జవాబు చెప్పారు. ఆ తరువాత జరిగిన పరిణామాలు న్యాయవ్యవస్థ చరిత్రలో ప్రధానమైన మలుపుగా అనుకోవచ్చు. డిసెం బర్ 30, 1981 రోజున ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో న్యాయమూర్తుల ఎంపిక, బదిలీల గురించి తీర్పుని ప్రకటించింది. ఆ సర్క్యులర్ అమలుకు చట్టపరమైన బలం లేదు కానీ అది రాజ్యాంగ వ్యతిరేకం కాదని సుప్రీంకోర్టు ప్రకటించింది. న్యాయమూర్తులు ఎక్కువగా అగ్రవర్ణాల నుంచి, పాలక వర్గాల నుంచి, ఆర్థికంగా బలంగా ఉన్న సామాజిక వర్గాల నుంచి వస్తున్నారని వాస్తవాన్ని గ్రహించి న్యాయ మూర్తుల బదిలీల ప్రక్రియ గురించి శివశంకర్ గట్టిగా పట్టుబట్టారు. హైకోర్టు న్యాయమూర్తుల ఎంపిక విష యంలో ప్రధాన న్యాయమూర్తులు ఎక్కువగా అగ్రకులా లకి ప్రాధాన్యతని ఇస్తున్నారని, ప్రధాన న్యాయమూర్తులు స్థానికులు కాకుండా బయటి వ్యక్తులు అయితే ఈ పద్ధతి పోతుందని శివశంకర్ అభిప్రాయపడి సర్క్యులర్ జారీ చేశారు. ఈ అగ్ర కుల గుత్తాధిపత్యానికి భంగం కలిగించి వెనుకబడిన తరగతుల నుంచి షెడ్యూల్డు కులాల, తెగల నుంచి ప్రతిభ ఉన్న న్యాయవాదులని న్యాయమూర్తు లుగా పైకి తీసుకొని రావాలన్న ఉద్దేశ్యంతో ఆయన మంత్రిగా ఉన్నంతకాలం కృషి చేశారు. ఎస్పీ గుప్తా కేసు తరువాత న్యాయ మూర్తుల బదిలీల ప్రక్రియ పద్ధతిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దాని ప్రకారం ప్రతి హైకోర్టుకి ప్రధాన న్యాయ మూర్తి వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఉండాలి. అదే విధంగా 1/3 మంది న్యాయమూర్తులు వేరే రాష్ట్రాల హైకోర్టు లకి చెందిన వ్యక్తులు ఉండాలి. కొంత కాలం ఇది అమలు జరిగింది కానీ ఆ తరువాత పూర్తిగా ఈ ప్రక్రియ అమలు కావడం లేదు. న్యాయమూర్తుల ఎంపిక, బదిలీలు అనేది సుప్రీంకోర్టు కొలీజియానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన సమస్యగా పరిణమించిన పరిస్థితులలో శివశంకర్ మరణం ఈ దిశగా ఆలోచించాల్సిన ఆవశ్యకతను గుర్తుకు తెస్తుంది. శివశంకర్ చేపట్టిన కొన్ని సంస్కరణల ఫలితంగానే బడుగు బలహీన వర్గాలకు చెందిన అనేకులు హైకోర్టు, సుప్రీంకోర్టు స్థాయికి చేరుకోగలిగారు. కానీ ఇటీవల కాలంలో ఈ విషయం గురించి ఆలోచించే వ్యక్తులు తగ్గిపోతున్న సమయంలో ఆయన మరణం ఈ విష యాన్ని జ్ఞప్తికి తెచ్చే విధంగా వుంటుంది. జాతీయ సమై క్యతతో పాటు, అన్ని వర్గాలకి ప్రాతినిద్యం ఉండేలా న్యాయమూర్తుల ఎంపిక జరగాలన్న భావం కూడా ఈ బదిలీ ప్రక్రియలో మిళితమై ఉంది. బడుగు బలహీన వర్గాల ప్రజలే కాదు జాతీయ సమై క్యత కోరుకుంటున్న అందరూ శివశంకర్ స్ఫూర్తిని నిల బెట్టే ప్రయత్నం చేయాలి. ఇదే ఆయనకు మనమందరం ఇచ్చే నివాళి. - మంగారి రాజేందర్ వ్యాసకర్త సభ్యులు, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ -
దర్యాప్తులో జోక్యం సమంజసమేనా?
సందర్భం రాజకీయ నాయకులు క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్నప్పుడు ఆ కేసులు అత్యంత ప్రాముఖ్యాన్ని చూరగొంటాయి. ఈ మధ్యన రెండు, మూడు నిబంధనలు ఆ రకమైన ప్రాముఖ్యాన్ని సంత రించుకున్నాయి. అవి- క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 154, సె.156(3), సె. 482. మొదటి నిబంధన ప్రథమ సమా చార నివేదిక (ఎఫ్ఐఆర్) గురించి వివరిస్తుంది. రెండో నిబం ధన ఎఫ్ఐఆర్ని విడుదల చేసి దర్యాప్తు చేసి దానిని మేజిస్ట్రేట్‌కి సమర్పించడం గురించి వివరిస్తుంది. హైకోర్టుకి ఉన్న స్వయం సిద్ధ అధికారాలను సె.482 వివరిస్తుంది. ఈ నిబంధన ప్రకారం కోర్టు ప్రక్రియ దుర్విని యోగం అవుతున్నప్పుడు లేదా న్యాయాన్ని సంరక్షించడానికి కోర్టు జోక్యం చేసుకునే అధికారాలను తెలియచేస్తుంది. ముద్దాయిపై ఎఫ్ఐఆర్ విడుదల అయ్యాక, ఆ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని ముద్దాయి భావించినప్పుడు ఆ ఎఫ్ఐఆర్ని రద్దు చేయమని సె.482 ద్వారా కానీ, రాజ్యాంగంలోని అధికరణ 226 ప్రకారం కానీ కేసుని దాఖలు చేయవచ్చు. యోగ్యత ఉన్న కేసుల్లో హైకోర్టు ఆ కేసుని రద్దు చేయవచ్చు. అదే విధంగా నేర అభియోగం (చార్జిషీట్) దాఖలు చేసిన తర్వాత అందులో బలం లేదని ముద్దాయి భావించినప్పుడు దాన్ని రద్దు చేయమని హైకోర్టుని ఆశ్రయించవచ్చు. ఈ రెండు దశలు లేనప్పుడు హైకోర్టుని ఆశ్ర యించే అవకాశం లేదు. కేసుల దర్యాప్తు అనేది పోలీసులకి శాసనం ఇచ్చిన అధికారం. ఇందులో కోర్టులు సాధారణంగా జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. ఎఫ్ఐఆర్లను పూర్తిగా పరిశీలించినప్పటికీ అది ఎలాంటి నేరాన్ని చూపించలేన ప్పుడు దాన్ని రద్దు చేసే అధికారం హైకోర్టుకి ఉంటుంది. దేశ పౌరులను, వ్యక్తులను అన్యాయంగా కేసుల్లో ఇరికించకుండా ఉండటానికి హైకోర్టు తన స్వయంసిద్ధ అధికారాలను ఉపయోగించి ఎఫ్ఐఆర్లను, క్రిమినల్ కేసులను కొట్టివేయవచ్చు. ఎఫ్ఐఆర్ను ముఖదృష్టితో పరిశీ లించినప్పుడు ఎలాంటి నేరం లేని సందర్భాల్లో దాన్ని కొట్టివేయవ చ్చని చాలా కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎఫ్ఐఆర్లోని ఆరోపణలు ఎలాంటి నేరాన్ని సూచించనప్పుడు దాన్ని కొట్టివేసే అధికారం హైకోర్టుకి ఉంటుంది. ముద్దాయిపై ఆరోపించిన క్రిమినల్ నేరాల్ని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని నిబంధనల ప్రకారం విచారించాలి. హైకోర్టు ఈ దశలో జోక్యం చేసుకోకూడదు. కాని ఏ నేరమూ కన్పించనప్పుడు మాత్రమే ఆ కేసుల్లో కోర్టు జోక్యంచేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎఫ్ఐఆర్ను కొట్టివేయడానికి సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలు: ఎఫ్ఐఆర్ను ఎప్పుడు కొట్టివేయాలి? ఎప్పుడు కొట్టివేయకూడదు అనే అంశాలపై సుప్రీంకోర్టు స్టేట్ ఆఫ్ హర్యానా వర్సెస్ భజన్‌లాల్, ఏఐఆర్ 1992 కేసు (602)లో సుప్రీం కోర్టు కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది. 1. ఎఫ్ఐఆర్లోని లేదా ఫిర్యాదులోని ఆరోపణలని ముఖవిలువతో గమనించిన ప్పుడు వాటిని మొత్తంగా ఆమోదించినప్పటికీ కూడా అది ఎలాంటి నేరాన్ని చూపించన ప్పుడు వాటిని రద్దు చేసే అవకాశం ఉంది. 2. ఎఫ్ఐఆర్లోని విషయాలను అదేవిధంగా నివేదికతోపాటు వచ్చిన ఇతర సమాచారాలని గమనించినప్పుడు అది ఎలాంటి విచారణా ర్హమైన (కాగ్నిజబుల్) నేరాన్ని సూచించనప్పుడు దాన్ని రద్దు చేయవచ్చు. 3. ఎఫ్ఐఆర్ లోని ఆరోపణలు, సాక్ష్యాల ద్వారా సేకరించిన సాక్ష్యాలు ఎలాంటి విచారణార్హమైన నేరాన్ని సూచించనప్పుడు దాన్ని రద్దు చేయవచ్చు. 4. ఎఫ్ఐఆర్లోని ఆరోపణలు విచార ణార్హమైన నేర సమాచారాన్ని సూచించకుండా, విచారణార్హం కాని (నాన్ కాగ్నిజబుల్) నేరాన్ని చూపించినప్పుడు, దానికి సె.155 (2) ప్రకారం సంబంధిత మేజిస్ట్రేట్ అనుమతి లేనప్పుడు రద్దు చేసే అవకాశం ఉంది. 5. ఎఫ్ఐఆర్లోని లేదా ఫిర్యాదులోని ఆరోపణలు అర్థరహితంగా ఉండి నమ్మశక్యంగా లేన ప్పుడు దాన్ని రద్దు చేయవచ్చు. 6. ఏదైనా శాసనపరమైన నిషేధం ఉన్నప్పుడు అది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం లేదా వేరే శాసనాల ప్రకారం కానీ ఉన్నప్పుడు రద్దు చేయవచ్చు. అదే విధంగా బాధిత వ్యక్తి ఉపశమనం పొందడానికి వేరే నిబంధనలు ఉన్నప్పుడు కూడా రద్దు చేయవచ్చు.7. దురుద్దేశపూర్వకంగా లేదా ద్వేషపూర్వకంగా లేదా పగ సాధించడానికి కేసు నమోదు చేయించినప్పుడు రద్దు చేయవచ్చు. పైన పేర్కొన్న సందర్భాలు లేనప్పుడు ఎఫ్ఐఆర్ను రద్దు చేయడం సమంజసం కాదు. ఎఫ్ఐఆర్ నివేదికను ఎప్పుడు కొట్టివేయకూడదు? ఎఫ్ఐఆర్ నివేదికను కొట్టివేసేటప్పుడు అందులో ఉన్న విషయాలను గమనించాలి. అంతేకానీ సాక్ష్యాలలోని నిజానిజాల గురించి పరిశీలించకూడదు. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ రు.సి.కుట్టన్ కేసులో (1999 (2) ఎస్.సి.సి 65) అభిప్రాయ పడింది. సుప్రీంకోర్టు ఇంకా ఇలా చెప్పింది. సాక్ష్యాలను గురించి విచారించడం హైకోర్టుకు తగని పని. తన అధికార పరిధిని దాటడమే అవుతుంది. కేసు దర్యాప్తులో ఉన్నప్పుడు దర్యాప్తుని ఆపడం, ఎఫ్ఐఆర్ని కొట్టివేయడం సరైంది కాదు. ఎఫ్ఐఆర్ అనేది దర్యాప్తు అధికారికి తమ ప్రక్రియను మొదలు పెట్టడానికి ఉపయోగపడుతుంది. అందుకని ఎఫ్ఐ ఆర్ని రద్దు చేసేటప్పుడు కోర్టులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ దశలో సాక్ష్యాలలోని నిజానిజాల వైపు చూడకూడదు. సాక్ష్యాలను సమీక్షించే అధికారం, వాటిపై వ్యాఖ్యానించే అధికారం కేసు విచారించే క్రమంలో ఉంటుంది. అంతే తప్ప కేసు దర్యాప్తు దశలో ఉన్నప్పుడు ఈ అధికారం కోర్టు లకు ఉండదు. క్రిమినల్ కేసులని కొట్టివేసే దశలో కేసులోని సాక్ష్యాల గురించి హైకోర్టులు వ్యాఖ్యానించకూడదు. అట్లా వ్యాఖ్యానించి కేసులని రద్దుచేయకూడదు. దర్యాప్తు దశలో ఈ అధికారం కోర్టులకి లేదు. భజన్‌లాల్ కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శ కాలను సుప్రీంకోర్టు నేటికీ ప్రతికేసులోనూ ఉటంకిస్తూనే ఉంది. అదే స్థిరమైన న్యాయం అయినా కొంతమంది కోర్టులకి వెళ్లి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు. వ్యాసకర్త: మంగారి రాజేందర్ పూర్వ డెరైక్టర్, ఏపీ జ్యుడీషియల్ అకాడమి lopalivarsham@gmail.com -
నేరం రుజువయ్యే వరకు ముద్దాయి నిరపరాధే!!
సందర్భం నేరారోపణ ఎదుర్కొంటున్న వారిని నేరస్తులుగా చూడటం సరికాదు. నేరం రుజువయ్యే వరకు ముద్దాయిని నిరపరాధిగా పరిగణించాల్సి ఉంటుంది. మన శాసనకర్తలకు శాసనాల గురించిన స్పృహ కూడా లేదా? మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉంది. కానీ పార్లమెంట్లో వివిధ రాష్ట్రాల లోని శాసన సభల్లో అదే విధంగా పెద్ద సభల్లో కూడా సభ్యు ల ప్రవర్తన బలహీనంగా ఉంది. అన్ని రాష్ట్రాలలోని శాసన సభ్యుల ప్రవర్తన ఒకేలా ఉంది. అక్రమాల గురించి ఎవరైనా సభ్యుడు లేదా ప్రతి పక్ష నాయకుడు ప్రశ్నించినప్పుడు, ఏవైనా వివరణలని కోరి నప్పుడు పాలకపక్షం తగు జవాబు ఇవ్వడంలేదు. పైగా వ్యక్తిగత దూషణలతో ఎదురు దాడి చేస్తున్నారు. 420 అని, జైలు పక్షి అని కూడా అరుస్తున్నారు. ప్రజలు గమ నిస్తున్నారన్న స్పృహ కూడా లేకుండా దారుణంగా ప్రవ ర్తిస్తున్నారు. దీనికి ఏ రాష్ట్రమూ మినహాయింపు కాదు. శాసనాలు చేసే వ్యక్తులు శాసనాల గురించిన స్పృ హ కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 ప్రకారం శాసనం నిర్దేశించిన పద్ధతుల్లో తప్ప ఏ వ్యక్తి జీవితాన్ని గాని, లేక వ్యక్తిగత స్వేచ్ఛను గాని హరించడానికి వీల్లేదు. మన శాసనాల ప్రకారం కేసుల దర్యాప్తు విచారణ నిష్పక్షపాతంగా జరగాలి అం టే అవి ముద్దాయికి అదే విధంగా ప్రాసిక్యూటర్‌కి కూడా నిష్పక్షపాతంగా ఉండాలి. అంటే ఇద్దరినీ సమానంగా చూడాలి. మన దేశంలో విరోధి (అడ్వసెరీ) పద్ధతిలో విచారణలు జరుగుతాయి. ఈ పద్ధతిలో న్యాయమూర్తి ఇరుపక్షాలకి నిష్పక్షపాతంగా ఉండాలి. అతను కేసుల విచారణలో సాధారణంగా చురుకుగా పాల్గొనగూడదు. ఈ పద్ధతి ఎక్కువగా ‘కామన్ లా’ దేశాలలో ఉంది. ఈ పద్ధతిలో ఇరుపక్షాలు ఉంటాయి. ముద్దాయి పక్షం ఒకటి ప్రాసిక్యూషన్ పక్షం మరొకటి. కేసును ఋజువు చేయా ల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్‌పై ఉంటుంది. ఈ పద్ధతిలో ముద్దాయి సాక్ష్యం ప్రవేశపెట్టాలని ఒత్తిడి చేయడానికి వీల్లేదు. అదే విధంగా అతన్ని ప్రాసిక్యూటర్ ప్రశ్నించ డానికి వీల్లేదు. కాని ముద్దాయి తనని తాను విచారిం చుకోవడానికి అతనికి విచక్షణాధికారం ఉంది. ఆ విధం గా అతను నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే అతన్ని ప్రాసిక్యూటర్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాలలో తప్పుడు సాక్ష్యం ఇస్తే అతన్ని శిక్షించడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా కేసు దర్యాప్తులో ఉన్నప్పుడు మౌనంగా ఉండే అవకాశం ఉంది. ఈ పద్ధతి ఇన్క్విస్టోరియల్కి విరుద్ధం. ఆ పద్ధతిలో న్యాయమూర్తి చురుకైన పాత్ర వహిస్తాడు. విచారణలో సాక్ష్యులను విచారించేది న్యాయమూర్తే. సత్యాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత న్యాయమూర్తిదే. మన జ్యురిస్ప్రుడెన్స్ ప్రకారం ఆరు ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి. ఇప్పుడు వాటికి కొత్తగా మరొకటి చేరింది. అవి :- 1. నేరం నిరూపణ అయ్యేంత వరకు ముద్దాయిని అమాయకునిగా పరిగణించాలి. 2. నేర నిరూపణ భారం ఎప్పుడూ ప్రాసిక్యూషన్‌పైనే ఉంటుం ది. తాను అమాయకుడినని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ముద్దాయిపై ఉండదు. 3. అనుమానానికి అతీ తంగా నేర నిరూపణ చెయ్యాలి. 4. ప్రాసిక్యూషన్ కథ నంలో సహేతుకమైన సంశయం ఉంటే ఆ సంశయ లబ్ది ముద్దాయికే లభిస్తుంది. 5. భారతీయ శిక్షా స్మృతిలోని సాధారణ మినహాయింపుల విషయంలో ముద్దాయి కేసు ప్రబలతని బట్టి రుజువు చేస్తే సరిపోతుంది. 6. తొంభై తొమ్మిది మంది ముద్దాయిలు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క అమాయకుడికి శిక్ష పడకూడదు. కాలక్రమంలో చివరి సూత్రానికి కొంత మార్పు వచ్చింది. ఇప్పుడు మారిన జ్యురిస్ప్రుడెన్స్ ప్రకారం - అమాయకుడికి శిక్ష పడకుండా చూడాల్సిన బాధ్యత న్యాయమూర్తిపై ఎలా ఉందో, అదేవిధంగా తప్పు చేసిన వ్యక్తి తప్పించుకోకుండా చూడాల్సిన బాధ్యత కూడా న్యాయమూర్తిపై ఉంది. నేర నిరూపణ జరిగే వరకు ముద్దాయి నిరపరాధి అనే మౌలికమైన హక్కు భావన దర్యాప్తు నుంచి నేరనిరూపణ జరిగే వరకు ఉంటుంది. దీని అర్థం నేరనిరూపణ చేయాల్సిన బాధ్యత ప్రాసి క్యూషన్‌పై ఉంటుంది. ఈ విషయం మీద భిన్నాభిప్రా యాలు ఉన్నాయి. బాధితులకు కష్టం కలిగే విధంగా సమాజానికి నష్టం వాటిల్లే విధంగా ఈ నిబంధన ఉంద ని చాలా మంది వాదిస్తూ ఉంటారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సాక్ష్యాధారాల చట్టంలో ఏ ఒక్కరికో లబ్ది చేకూర్చే విధంగా తయారు చేయలేదు. ఇద్దరికీ మరీ ముఖ్యంగా చెప్పాలంటే సమాజానికి తగు న్యాయం జరిగే విధంగా తయారు చేశారు. నేర నిరూపణ భారం ప్రాసిక్యూషన్‌పై ఉండకూడదని నేరం తాను చెయ్యలేదని రుజువు చేసు కోవాల్సిన బాధ్యత ముద్దాయిపై ఉంచాలన్న వాదన తరుచూ వస్తుంది. అయితే ఈ వాదనతో ఏకీభవిం చలేం. మన దేశంలోని నేరస్తులు ఎక్కువ మంది నిరు పేదలు, దిక్కూదివాణం లేని వ్యక్తులు. వాళ్లు తాము నేరం చేయలేదని రుజువు చేసుకోవడంలో విఫలమ వుతారు. అలాంటి సందర్భాలలో న్యాయమూర్తి వాళ్లకి శిక్ష విధించాల్సి వస్తుంది. దాని వల్ల అమాయకులకి పెద్ద ఆపద వస్తుంది. కేసుని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మ న దేశంలోని చాలా మంది ప్రజలకి లేవు. తమపై మో పిన నేరారోపణలని ఎదుర్కొనే సామర్థ్యం ఇంకా భార తదేశ ప్రజలకి రాలేదు. ఇక ‘రాజ్యం’ విషయానికి వస్తే విచారణని రుజువు చేసే క్రమంలో దానికి ఎంతో శక్తి ఉంది. వనరులు ఉన్నాయి. పోలీసులు, ప్రాసిక్యూషన్ వ్యవస్థలాంటి ఎన్నో అంశాలు రాజ్యం వద్ద ఉన్నాయి. అందుకని నేరం నిరూపణ అయ్యేంత వరకు ముద్దాయిని నిరపరాధిగా చూడాలి అన్న సూత్రం ఆవ శ్యకత ఎంతో ఉంది. అది ముద్దాయికి డాలుగా ఉపయో గపడుతుంది. నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తులపై కోర్టు శిక్ష విధించే వరకు నిరపరాధిగానే భావించాల్సి ఉంటుంది. ఇదీ మన దేశంలోని జ్యురిస్ప్రుడెన్స్. ఈ విషయం అందరూ గ్రహించాలి. మంగారి రాజేందర్, న్యాయనిపుణులు మొబైల్ : 94404 83001 -
మండే కన్నీటి బిందువు కాళోజీ
హన్మకొండ కల్చరల్ : కాళోజీ నారాయణరావు మండే కన్నీటి బిందువని, నిలువెత్తు మానవత్వానికి ప్రతీకగా నిలిచాడని న్యాయమూర్తి మంగారి రాజేందర్ (జింబో) అన్నారు. హన్మకొండ హంటర్‌రోడ్‌లోని వరంగల్ పబ్లిక్ స్కూల్లో కాళోజీ ఫౌండేషన్, మిత్రమండలి ఆధ్వర్యంలో గురువారం కాళోజీ సోదరుల యాది సభ జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కాళోజీ నారాయణరావు, కాళోజీ రామేశ్వర్రావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాళోజీ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు ఎస్.జీవన్‌కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంగారి రాజేందర్ మాట్లాడుతూ ఉర్దూ భాష భారతదేశంలోనే పుట్టిందన్నారు. పాకిస్తాన్లో అధికార భాష ఉర్దూ అయినప్పటికీ... ఆ భాషను భారతదేశ ప్రజలే ఎక్కువగా మాట్లాడతారని తెలిపారు. అదేవిధంగా సంస్కృతం హిందూ మతానికి చెందినదిగా భావించడం తప్పన్నా రు. న్యాయవ్యవస్థతోనూ, మనుషులతోనూ, మానవీయ విలువలతోనూ సంబంధం ఉన్న ప్రజల మనిషి పరిపూర్ణ మానవుడు కాళోజీ అని కొనియూడారు.తెలంగాణ వచ్చిన తర్వాత కాళోజీ వర్ధంతి సభకు వందలాది మంది వస్తారని ఆశించామని, అలా జరగకపోవడం బాధాకరమేనన్నారు. ప్రస్తుతం కవిత్వం అనేది ఫేస్బుక్ ద్వారా చర్చలో ఉందన్నారు. డాక్టర్ ఎం.విజయ్‌కుమార్ మాట్లాడుతూ కాళోజీ రామేశ్వర్రావు రాసిన ఉర్దూ సాహిత్యంలోని విశేషాలను వివరించారు. ఎస్.జీవన్‌కుమార్ మాట్లాడుతూ కాళోజీ రామేశ్వర్‌రావుకు ఉర్ధూ అంటే ఎనలేని మక్కువ అని... చెరుకు గడలోని తీపి రసంలా ఉంటుందని అనేవారని గుర్తుచేశారు. కాళోజీ నారాయణరావు విషయానికి వస్తే ప్రజాస్వామ్యం గురించి ఆయన రాసినంతగా ఎవ్వరూ రాయలేరని, ప్రభుత్వ జవాబుదారీతనం గురించి అడిగేవారని పేర్కొన్నారు. కర్షకా నీ కర్రు కదిలినన్నాల్లే అన్న కవితను ఈనాటి పరిస్థితులలో గుర్తుంచుకోవాల్సిన అవసరముందన్నారు. నాగిళ్ల రామశాస్త్రి మాట్లాడుతూ కాళోజీ అవార్డును సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డికి ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన లండన్‌లో ఉన్నందున మరో ప్రత్యేక సమావేశంలో అవార్డును అందజేయనున్నట్లు తెలిపారు. పొట్లపల్లి శ్రీనివాసరావు వందన సమర్పణ చేశారు. కవి లోచన్, కాళోజీ కుమారుడు రవికుమార్, పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్, శోభ దంపతులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు డాక్టర్ అంపశయ్య నవీన్, ఆచార్య కాత్యాయని విద్మహే, టి.జితేందర్‌రావు, మహ్మద్ సిరాజూద్దిన్, అన్వర్, కుందావజుజల కృష్ణమూర్తి, చెలిమె సుధాకర్, బిల్లా మహేందర్, రంగ చక్రపాణి, పొట్లపల్లి ధరణీశ్వర్‌రావు, రంగు చక్రపాణి, కాళోజీ అభిమానులు పాల్గొన్నారు. -
జాప్యానికి సుప్రీం జవాబు
క్షమాభిక్ష దరఖాస్తును గవర్నర్ తిరస్కరించినప్పుడు ఆ సమాచారాన్ని ఖైదీకి గానీ అతని కుటుంబ సభ్యులకు గానీ తెలియజేయాలన్న నియమం ఏదీ జైలు మాన్యువల్స్‌లో లేదు. కానీ 161వ అధికరణ ప్రకారం గవర్నర్‌కు క్షమాభిక్ష దరఖాస్తు పెట్టుకునే హక్కు ఖైదీకి ఉన్నప్పుడు, గవర్నర్ నిర్ణయం ఏమిటో తెలుసుకునే హక్కు కూడా ఆ ఖైదీ కలిగి ఉంటాడు. రాష్ట్రపతి తిరస్కరించినా ఇదే వర్తిస్తున్నది. కేసుల విచారణలో జాప్యం ఉండకూడదు. అధిక సంఖ్యలో ఉన్న కేసులతో ఇలాంటి జాప్యం తప్పడం లేదు. దీనిని అర్థం చేసుకో వచ్చు. కానీ, క్షమాభిక్ష దరఖాస్తుల పరిశీలనకి సంవత్సరాల కొద్దీ సమయం తీసుకుంటే అర్థం చేసుకోవడం కాదు, ఆందోళన తప్పదు. ఉరిశిక్ష పడిన వారి విషయంలో ఇది ఎంత కలవరపాటుకు గురిచేసే అంశమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి జాప్యంతో శిక్ష పడిన వారే కాదు, వారి స్నేహితులూ కుటుంబ సభ్యులూ అనుక్షణం పడే వేదన మాటలకు అందేది కాదు. అందుకే, 21.1.2014న సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు మరణ శిక్షల ప్రక్రియలో ఓ మైలురాయి వంటిదనిపిస్తుంది. ఆశిక్ష పడిన 15 మంది దాఖలు చేసుకున్న 13 రిట్ దరఖాస్తులను సుప్రీంకోర్టు ఆమోదించి, వారి శిక్షలను జీవిత కాల శిక్షలుగా మార్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి పి.సదాశి వం, న్యాయమూర్తులు రంజన్ గొగోయ్, శివకీర్తి సింగ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. దేవేందర్ పాల్‌సింగ్ బుల్లార్ కేసులో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుని రద్దు చేసి వారికి కూడా ఈ తీర్పును వర్తింపజేసింది. క్షమాభిక్ష కోరడమూ హక్కే దేవేందర్‌పాల్ సింగ్ బుల్లార్ వర్సెస్ ఢిల్లీ కేసులో మరణశిక్షపడిన ఖైదీ తన మరణశిక్షను తగ్గించమని 2003లో రాష్ట్రపతికి దరఖాస్తు చేశాడు. 8 సంవత్సరాల తరువాత దానిని రాష్ట్రపతి తోసిపుచ్చారు. క్షమాభిక్ష దరఖాస్తును తోసిపుచ్చడంలో తీవ్రమైన జాప్యం ఉందన్న కారణంగా తన మరణశిక్షని జీవిత ఖైదుగా మార్చమని ఆ ఖైదీయే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. చట్ట ప్రకారమే మరణశిక్ష విధించినందువల్ల ఆ విన్నపాన్ని మన్నించలేమని కోర్టు (న్యాయమూర్తులు ఎస్.జె.ముకోపాధ్యాయ, జి.ఎస్.సింఘ్వీలతో కూడిన ధర్మా సనం) అతని కేసుని 12 ఏప్రిల్ 2013న తోసిపుచ్చింది. ఆ తరువాత రెండు వారాలకే అదే డివిజన్ బెంచి మహేంద్రనాథ్ దాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇం డియా కేసులో 12 సంవత్సరాల జాప్యం కారణంగా మరణశిక్షని జీవిత ఖైదుగా మార్చింది. 12 సంవత్సరాల తరువాత క్షమాభిక్ష దరఖాస్తుని తోసిపుచ్చడానికి ఎలాంటి కారణాలు చూపకపోవడం మన్నించరాని విషయమని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చివరలో ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్య ఇది. ‘రాజ్యాంగంలోని 72/161 అధికరణల ప్రకారం క్షమాభిక్ష కోరడమనేది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. అంతేకానీ ఎవరి ఇష్టాయిష్టాల ప్రకారం, విచక్షణాధికారం ప్రకారం ఇచ్చే హక్కు కాదు. రాజ్యాంగ బద్ధంగా చేయాల్సిన విధులని అత్యంత జాగరూకతతో నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆ రకంగా నిర్వర్తించనప్పుడు రాజ్యాంగ విలువలు కాపాడటం కోసం కోర్టులు జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. విశాల ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తిలో ‘ప్రతీకారానికి’ ఎలాంటి విలువాలేదు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. ముద్దాయికి కూడా యథార్థ రాజ్యాంగ రక్షణ ఉంటుంది. ఆ హక్కుని రక్షించాల్సిన బాధ్యత కోర్టు మీద ఉంటుంది. అందుకని న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. ఇది రాజ్యాంగంలోని 72/161 అధికరణలలో జోక్యం చేసుకుంటున్నట్టు కాదు. మరణశిక్ష పడిన ఖైదీలకు రాజ్యాంగం ప్రసాదిం చిన యథార్థ రక్షణే’. దరఖాస్తు చేసే పద్ధతి క్షమాభిక్ష దరఖాస్తులను రాష్ట్రపతి ముందు పెట్టడానికి భారత ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించినప్పటికి అవి సరిగ్గా అమలు కావడంలేదు. రాష్ట్ర గవర్నర్ క్షమాభిక్షని తోసిపుచ్చిన తరువాత ఎవరైనా రాష్ట్రపతిని ఆశ్రయిస్తే ఆ కేసుకు సంబంధించిన రికార్డును, విచారణ కోర్టు తీర్పును, హైకోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులను నిర్దేశించిన కాలపరిమితిలో హోంమంత్రిత్వ శాఖకు పంపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ సూచనలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర శాఖలు పాటించడం లేదు. అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం అన్నట్టు రికార్డుని పంపిస్తున్నాయి. ఈ సూచనలు కఠినంగా పాటించి జాప్యాన్ని నివారించాలి. ఈ వివరాలు హోం మంత్రిత్వ శాఖకు అందిన తరువాత తమ సిఫార్సులను, లేదా అభిప్రాయాలను తగిన సమయానికి రాష్ట్రపతికి పంపించాలి. వీటిని పంపినప్పటికీ రాష్ట్రపతి భవన్ నుంచి ఎలాంటి స్పందనా లేకుంటే, మళ్లీ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి రాష్ట్రపతి నిర్ణయాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా హోం మంత్రిత్వ శాఖపైనే ఉంది. విన్నపాన్ని తోసిపుచ్చితే... క్షమాభిక్ష దరఖాస్తుని గవర్నర్ తిరస్కరించినప్పుడు ఆ సమాచారాన్ని ఖైదీకి గానీ అతని కుటుంబ సభ్యులకు గానీ తెలియజేయాలన్న నియమం ఏదీ జైలు మాన్యువల్స్‌లో లేదు. కానీ 161 అధికరణ ప్రకారం గవర్నర్‌కి క్షమాభిక్ష పెట్టు కునే హక్కు ఖైదీకి ఉన్నప్పుడు, గవర్నర్ నిర్ణయం ఏమిటో తెలుసుకునే హక్కు కూడా ఆ ఖైదీ కలిగి ఉంటాడు. రాష్ట్రపతి తిరస్కరించినా ఇదే వర్తిస్తున్నది. కానీ దరఖాస్తు తిరస్కరణ విషయాన్ని ఖైదీకి అతని కుటుంబ సభ్యులకి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా తెలియజేయాలి. క్షమాభిక్ష సమాచారం అందించాలన్న నియమం ఉన్న రాష్ట్రాల్లో కూడా ఖైదీకి మౌఖికంగా మాత్రమే తెలియజేస్తు న్నారు. 72 అధికరణ ప్రకారం క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి దరఖాస్తు చేయడం రాజ్యాంగ హక్కు కాబట్టి, దానిని తిరస్కరిస్తే ఆ సమాచారం కూడా తెలుసుకునే హక్కు ఖైదీకి ఉంటుంది. తమ తమ దరఖాస్తులను గవర్నర్ లేదా రాష్ట్రపతి తిరస్కరించినప్పుడు వాటి ప్రతిని పొందే హక్కు ఖైదీలకు ఉంది. శిక్ష అమలు విషయాన్ని 14 రోజుల ముందు తెలియజేయాలి. శిక్ష అమలు తేదీ గురించి ఎన్ని రోజుల ముందు తెలియజేయాలన్న విషయం చాలా జైలు మాన్యువల్స్‌లో ఏక సూత్రం కానరాదు. కొన్నింటిలో ఒకరోజు ముందు తెలియజేయాలనీ, ఇంకొన్ని కనీసం 14 రోజుల ముందు తెలియజేయాలనీ అంటున్నాయి. క్షమాభిక్ష తిర స్కరించిన తేదీకీ, శిక్ష అమలు తేదీకీ మధ్యన 14 రోజుల కనీస గడువు ఉండాలి. ఆరోగ్య నివేదికలూ కావాలి ఖైదీ మానసిక శారీరక ఆరోగ్యాలను బట్టి శిక్ష అమలును నిలిపే అధికారం చాలా జైలు మాన్యువల్స్ పర్యవేక్షణ అధికారులకి కల్పిస్తున్నాయి. దరఖాస్తు తిరస్క రించిన తరువాత, ఖైదీలకి వైద్యపరీక్షలు జరిపి వారి శారీరక మానసిక ఆరోగ్యం గురించిన నివేదికలను జైలు అధికారులు తీసుకోవాలి. ఖైదీ శారీరక, మానసిక ఆరోగ్యం గురించి సూపరింటెండెంట్ సంతృప్తి చెందాలి. ఆ విధంగా లేనప్పుడు శిక్ష అమలును నిలిపివేసి ఆ ఖైదీని మెడికల్ బోర్డుకి పంపించి నివేదికను తెప్పిం చుకోవాలి. తదుపరి చర్యల కోసం ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలి. మరణశిక్ష పడినవారిలో ఎక్కువ మంది బీదవాళ్లే. వారి దగ్గర తీర్పు ప్రతు లు, ఇతర కోర్టు కాగితాలు ఉండవు. అప్పీళ్లకీ, క్షమాభిక్ష దరఖాస్తులను పెట్టుకోవ డానికి, క్షమాభిక్ష తిరస్కరణ తరువాత న్యాయపరమైన ఇతర చర్యలకు ఈ కాగితాలు అవసరం. ఈ హక్కులను వినియోగించుకోవడానికి అవసరమైన అన్ని పత్రాలని వారంలోగా ఖైదీకి అందే విధంగా చర్యలు తీసుకోవాలి. శిక్ష అమలుకు ముందు ఖైదీ తన స్నేహితులతో, కుటుంబ సభ్యులతో చివరిసారి కలవడానికి అవకాశాన్ని కొన్ని రాష్ట్రాల మాన్యువల్స్ మాత్రమే కల్పిస్తున్నాయి. ఉరిశిక్ష తరువాత విధిగా శవ పరీక్షలు జరిపించాలని చెప్పే నిబంధనలు జైలు మాన్యువల్స్‌లో లేవు. చట్టం నిర్దేశించిన ప్రకారం శిక్ష అమలైనదీ లేనిదీ తెలుసు కోవడానికి ఈ శవపరీక్షలు ఉపయోగపడతాయి. మరణశిక్ష పడిన వారికీ, ఆ శిక్షపడే అవకాశం ఉన్న వారికీ సుప్రీంకోర్టు తీర్పు పెద్ద ఉపశమనం. ఉరి వంటి శిక్ష పడటం వేరు. అంత తీవ్రమైన శిక్ష అమలు కోసం ఎదురుచూడటం వేరు. ఉరి శిక్ష కోసం ఎదురు చూస్తూ క్షణక్షణం చావడం కన్నా శిక్ష ను అనుభవించడం మేలనిపిస్తుంది. ఉరిశిక్షని కోర్టులు రద్దు చేయకపోయినా ఈ తీర్పుతో మేలు చేశాయి. - మంగారి రాజేందర్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి -
భావోద్వేగానికి లొంగనిదే న్యాయం
రాజ్యాంగంలోని అధికరణ 22(1) ప్రకారం - ఎవరినైనా అరెస్టు చేసిన వెంటనే, ఏ కారణాలతో అరెస్టు చేశారో అతనికి తెలియజేయాలి. ఇష్టమైన న్యాయవాదిని సంప్రదించుకునే అవకాశాన్ని కల్పించాలి. ‘నిర్భయ’, ‘అభయ’ కేసులు మానవతా వాదులందరినీ బాధిస్తాయి. భావోద్వేగానికి గురిచేస్తాయి. ఫలితంగా నేరగాళ్ల విషయంలో వారు రాజ్యాంగ వ్యతిరేక, చట్టవ్యతిరేక ప్రక టనలు చేస్తూ ఉంటారు. అభయ కేసు తరువాత నిందితులను కాల్చివేయాలని ఒక నాయకుడు, అంగచ్ఛేదనం చేయాలని ఓ నాయకురాలు ప్రకటించారు. వారి ఆవేశాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ బాధ్యతాయుత మైన పదవుల్లో ఉన్నవారు అలాంటి ప్రకటనలు చేయకూడదు. కొన్నేళ్ల క్రితం యాసిడ్ దాడి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు ‘ఎదు రు కాల్పుల్లో’ చనిపోయారు. దాని ప్రభావం తాత్కాలికమే. ఈ నాగరిక సమాజంలో న్యాయాధిక్యం (రూల్ ఆఫ్ లా) గెలవాలి. మనసుల్లో అనుకున్నట్టుగా శిక్షలు విధిస్తే మనది అనాగరిక సమాజం అయిపోతుంది. ‘నిర్భయ’, ‘అభయ’ కేసుల లాంటివి, ఉగ్రవాద చర్యలు జరిగినప్పుడు నాయకు లూ, సాధారణ ప్రజానీకంతో పాటు, న్యాయ వాదులూ విచిత్రంగా స్పందిస్తూ ఉంటారు. నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తుల కేసులని వాదించబోమని న్యాయవాదుల సంఘాలు తీర్మానిస్తుంటాయి. దేశవ్యాప్తంగా ఇదే పరి స్థితి. రాజ్యాంగం చదువుకొని, రోజూ శాసనా లని చదువుతూ వ్యాజ్యాలలో వాదిస్తున్న వారు ఇలాంటి తీర్మానాలు చేయడం ఎంత వరకు సమంజసం? పోలీసుల ముందు ఒప్పుకున్నంత మాత్రాన నేరం రుజువైనట్టు కాదు కదా! నేరం రుజువయ్యే వరకు ముద్దా యిని అమాయకుడిగా పరిగణించాలని న్యాయశాస్త్రం చెబుతుంది. వాదించుకోవడా నికి, నడపడానికి న్యాయవాది సాయం లేక పోతే ఆ కేసుకి విలువ ఉండదు. శిక్ష పడినా పై కోర్టులలో నిలవదు. ఈ విషయం గురించి సుప్రీంకోర్టు, రాజ్యాంగం ఏమని నిర్దేశిస్తు న్నాయో చూద్దాం. రాజ్యాంగంలోని అధికరణ 22(1) ప్రకారం - ఎవరినైనా అరెస్టు చేసిన వెంటనే, ఏ కారణాలతో అరెస్టు చేశారో అతనికి తెలియ జేయాలి. ఇష్టమైన న్యాయవాదిని సంప్రదిం చుకునే అవకాశాన్ని కల్పించాలి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన అధ్యాయం -2లోని నియమాల ప్రకారం ఆ న్యాయవాది వచ్చిన కేసుని విధిగా స్వీకరించాలి. నిరాకరిం చడానికి వీల్లేదు. ఎ.ఎస్. మహమ్మద్ రఫీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు (ఏ.ఐ.ఆర్. 2011 సుప్రీం కోర్టు 308- తీర్పు తేదీ, 6.12.2010) కేసు విషయాలని పరిశీలించి కోర్టు ఈ ఆదేశాలని జారీ చేసింది. ‘న్యాయవాదుల నీతి నియమాల సూత్రాల ప్రకారం, న్యాయవాది చట్ట ప్రకారం కోరిన ఫీజుని ముద్దాయి గానీ వాది గానీ చెల్లించడానికి ఇష్టపడినప్పుడు ఆ కేసు లని నిరాకరించడానికి వీల్లేదు. అందుకని న్యాయవాదుల సంఘం తీర్మానం చేసినంత మాత్రాన నేరం ఆరోపించిన పోలీసుల కేసు లని, అనుమానిత ఉగ్రవాదుల కేసులని, హత్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటు న్న వారి కేసులని, మానభంగం ఆరోపణలు ఉన్న వ్యక్తుల కేసులని వాదించడానికి నిరాక రించకూడదు. ఇలాంటి కేసులని స్వీకరించ కూడదన్న తీర్మానాలు రాజ్యాంగ వ్యతిరేకం, శాసన విరుద్ధం, వృత్తి నియమాలకి విఘా తం. అంతేకాదు భారత న్యాయవాదులకి ఉన్న సంస్కృతికి మాయని మచ్చ. అందుకని ఇలాంటి తీర్మానాలు చెల్లవని, శాసన వ్యతిరే కమని ప్రకటిస్తున్నాం. అలాంటి తీర్మానాలని న్యాయవాదులు ఉల్లంఘించాలి. ప్రజాస్వా మ్యాన్ని న్యాయాధిక్యాన్ని కాపాడాలి. ఎలాం టి పరిణామాలు ఎదురైనా న్యాయవాదులు తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలి. ఈ విధం గా విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించని న్యాయ వాదులు గీతలోని సందేశాన్ని పాటించడం లేదని అనుకోవాల్సి ఉంటుంది’. న్యాయవాదులు ఈ విషయాలను గుర్తిం చుకోవాలి. 1792లో ‘మనుషుల హక్కులు’ అన్న కరపత్రం రాసిన ధామస్ ఫైన్ మీద బ్రిటిష్ ప్రభుత్వం రాజద్రోహాన్ని ఆపాదిం చింది. ఆ కేసుని వాదించడానికి థామస్ ఎక్క న్ అన్న ప్రముఖ న్యాయవాది ముందుకొచ్చా డు. అప్పుడు ఆయన ఫ్రిన్స్ ఆఫ్ వేల్స్‌కి అటా ర్నీ జనరల్. కేసు వాదిస్తే ఆ పదవి నుంచి తొలగిస్తామని చెప్పారు. అయినా వాదిం చాడు. పదవిని కోల్పోయాడు. ఆ సందర్భం లో అతను చెప్పిన మాటలు న్యాయవాదులు గుర్తించుకోవాలి. ‘రాజుకీ కోర్టుకీ మధ్య ఉండను అని ఎవ రైనా న్యాయవాది అనుకుంటే ఇంగ్లాండ్‌లో వ్యక్తి స్వేచ్ఛకి ముగింపు వచ్చినట్టే. కేసుని స్వీకరించకూడదని న్యాయవాది అనుకుంటే అతను తీర్పు కన్నా ముందే నిర్ణయానికి వచ్చి నట్టు. ముద్దాయికి వ్యతిరేకంగా త్రాసు మొగ్గి నట్టుగా భావించాల్సి ఉంటుంది.’ లక్షలాది మందిని హతమార్చిన నాజీల తరఫున కూడా న్యూరమ్బర్గ్ విచారణల్లో న్యాయవాదులు వాదించారు. చరిత్రలో ఇట్లా ఎన్నో. కోర్టుల్లో రుజువైతేనే నేరం చేసినట్టు. ఇప్పుడు కావాల్సింది సత్వర దర్యాప్తు. ఆ తరువాత సత్వర విచారణ. ఇవి రెండూ సత్వ రం జరిగితే న్యాయాధిక్యం నిలుస్తుంది. మరో విధంగా ఉంటే అది సత్ఫలితాలను ఇవ్వదు. సరికదా చెడు పరిణామాలకు దారితీస్తుంది. -మంగారి రాజేందర్ -
యావజ్జీవ ‘మరణ’ శిక్ష?!
కామెంట్: దర్యాప్తులో, విచారణలో జాప్యం జరగలేదు. కానీ అతని క్షమాభిక్ష దరఖాస్తును తిరస్కరించడంలో 17 నెలల కాలం గడచింది. ఉరిశిక్షను నిలిపివేయడానికి ఇది ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. మరి...? మంగన్‌లాల్ మరణశిక్ష అనుభవిస్తూ బతకాల్సి ఉంటుందేమో! కాల్పనిక ప్రపంచంలోనే వింతలు ఉంటా యని అనుకుంటాం. కానీ జీవితంలోనే విం తలు ఉంటాయి. ఆశ్చర్యం గొలిపే సంఘ టనలు, భయంగొలిపే సంఘటనలు జీవితం లోనే ఎక్కువగా ఉంటాయి. అందుకు ఉదా హరణ మంగన్‌లాల్ బరేలా ఉరిశిక్ష ఉదం తం. మృత్యువు దరిదాపుల్లోకి వెళ్లి తాత్కాలి కంగా బయటపడిన వ్యక్తి మంగన్‌లాల్.ఆగస్టు 8 గురువారం ఉదయం మంగల్ లాల్‌ని ఉరితీయడానికి మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జైలు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. అతన్ని ఉరితీయడానికి సెహోర్ జిల్లా కోర్టు ‘బ్లాక్ వారెంట్స్’ జారీ చేసింది. జబల్ పూర్ జిల్లాలోని కేంద్ర కారాగారంలో అతడిని ఉరి తీయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. పత్రి కల్లో వచ్చిన వార్తల ప్రకారం అజ్మల్ కసబ్‌ని ఉరి తీసిన తలారిని ఈ ఉరి తీయడానికి ఎం పిక చేశారు. అతను సోమవారం నాడు జబల్ పూర్ చేరుకున్నాడు. కష్టం కలుగకుండా అతని ఉరిశిక్ష అమలు కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నారు. సరిగ్గా అతన్ని ఉరి తీయడానికి ఆరు గంటల ముందు ఉరిశిక్షని నిలిపివేయమని సుప్రీంకోర్టు ఆదేశించింది. గురువారం ఉదయం అతన్ని ఉరితీస్తా రన్న వార్త పత్రికల్లో చదివి మరణశిక్షని వ్యతి రేకించే న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తలుపు బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తట్టారు. ప్రజాహిత కేసుని దాఖలుచేసి ఉరిశిక్ష అమ లుని నిలిపివేయమని కోరారు. దాదాపు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఉరిశిక్షని నిలిపి వేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గురువా రం ఉదయం ప్రధాన న్యాయమూర్తి మొదటి కేసుగా ఈ కేసుని విచారించి ఉరిశిక్ష అమలు నిలుపుదలని పొడిగించారు. సుప్రీంకోర్టు ముందు ఇంకా విచారణలో ఉన్న ఇతర మర ణశిక్ష కేసులతో పాటు 2013, అక్టోబర్ 22న మంగన్‌లాల్ కేసును విచారించడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. ఆ కేసులతో పాటు అతని కేసుని విచారణ జరిపిన తరువాత మర ణశిక్ష అమలుచేస్తారు. మరణశిక్ష విధించడం లో జాప్యం జరిగిన కారణంగా ఆ కేసును యావజ్జీవశిక్షగా మార్చడానికి వీలుందా అనే అంశాన్ని సుప్రీంకోర్టు నిర్ధారించాల్సి ఉంది. అంటే మరణశిక్ష కోసం లేదా జీవితఖైదు కో సం మంగల్లాల్ వేచి ఉండాల్సి ఉంటుంది. మంగన్లాల్కు మరణశిక్షను విధించడా నికి కారణం ఏమిటి? రాష్ట్రపతి క్షమాభిక్ష ఇవ్వ కుండా తిరస్కరించిన తరువాత ఉరి నిలిపి వేయడానికి కారణం ఏమిటి? మరణశిక్ష కోసం ఎంతకాలం వేచి ఉండాలి? ఈ ప్రశ్నల కి సమాధానాలను వెతికే ప్రయత్నం చేద్దాం. జమున (1 సంవత్సరం), లీల (3), ఆర్వా (4), సబిత (50), కున్వర్ (6)లను హత్య చేసిన వ్యక్తి మంగన్‌లాల్. అతనికి ఇద్దరు భార్యలు. ఈ పిల్లలు అతని ఇద్దరు భార్యల ద్వారా జన్మించిన సంతతి. అతనికి కొంత వ్యవసాయ భూమి ఉంది. దాన్ని అమ్మడానికి అతను ప్రయత్నించాడు. అతని ప్రయత్నాన్ని అతని సోదరులు, అతని ఇద్దరు భార్యలు విరమింపచేశారు. ఆ భూమి అమ్మే సి పిల్లల్ని ఎలా పోషిస్తావని కూడా వాళ్లు ప్రశ్నించారు. కోపగించుకున్న మంగన్‌లాల్ 2010, జూన్ 10/11 రాత్రి భోజనం చేయ లేదు. ఉదయం కూడా అతను భోజనం చేయ డానికి నిరాకరించాడు. అతని భార్యలు వ్యవ సాయ పనులకు వెళ్లిపోయిన తరువాత తన ఐదుగురు పిల్లలను అతను గొడ్డలితో దారు ణంగా నరికి చంపాడు. ఆ సంఘటన జరిగిన కొద్ది సేపటికి అతని ఇద్దరు భార్యలు ఇంటికి వచ్చి చూసి భయభ్రాంతులై కేకలు వేశారు. గుండెలు బాదుకున్నారు. వాళ్లను చంపడానికి అతను విఫలయత్నం చేశాడు. ఆ తరువాత అతను ఉరివేసుకొని చనిపోవడానికి ప్రయ త్నం చేశాడు. ఆ తాడుని కోసేసి అతని ప్రయ త్నాన్ని నిలిపివేశారు అతని భార్యలు. అతన్ని తాడుతో కట్టేసి పోలీసులకి అప్పగించారు. కేసుని విచారించిన సెహోర్ సెషన్స్ న్యాయ మూర్తి అతనికి మరణశిక్ష 2011, ఫిబ్రవరి 3న విధించి ధృవీకరణ కోసం మధ్యప్రదేశ్ హైకో ర్టుకు పంపించారు. మధ్యప్రదేశ్ హైకోర్టు కేసును విచారించి మరణశిక్ష ధృవీకరించింది. శిక్ష తగ్గించడానికి, శిక్షను అదేవిధంగా నిర్ధా రించడానికి గల కారణాలను పరిశీలించి మర ణశిక్షను హైకోర్టు ధృవీకరించింది. మృతుల వయస్సు, నేరం చేసిన విధానం, అత్యంత కిరాతకంగా చంపిన తీరు, ఎలాంటి పురికొల్పే కారణాలు లేకుండా కన్నపిల్లల్ని చంపిన తీరును, ఇతర అంశాలను గమనించి హైకోర్టు 2011, సెప్టెంబర్ 12న మరణశిక్షను ధృవీ కరించింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా ప్రత్యే క అనుమతి అప్పీలును మంగన్‌లాల్ సుప్రీం కోర్టు ముందు దాఖలు చేశాడు. న్యాయ మూర్తులు హెచ్ఎల్ దత్తు, సి.కె.ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం అప్పీలుకు అనుమతి ఇవ్వ కుండా 2012, జనవరిలో అప్పీలును కొట్టి వేసింది. ఆ తరువాత క్షమాభిక్ష ప్రసాదించమని రాష్ట్రపతికి మంగన్‌లాల్ దరఖాస్తు చేసుకు న్నాడు. మరణశిక్షను జీవితఖైదుగా మార్చ మని అతను తన దరఖాస్తులో వేడుకున్నాడు. అతని దరఖాస్తును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2013, జూలై 22న తిరస్కరించారు. ఆ తరు వాత అతనికి విధించిన ఉరిశిక్షను అమలు చేయమని సెషన్స్ కోర్టు బ్లాక్ వారెంట్స్‌ను జారీచేసింది. ఉరిశిక్ష సమాచారం పత్రికల్లో రావడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి ముందు ఉరిశిక్ష అమలు నిలిపివేత కోరుతూ రిట్ పిటిషన్ దాఖలైంది. ఉరిశిక్ష అమలుకు 6 గంటల ముందు ఆ శిక్షని నిలిపి వేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అతను ఉరిశిక్షకు అర్హుడా కాదా? ఉరి శిక్ష లు ఉండాలా వద్దా? వంటి వివాదాస్పద అంశాల జోలికిపోకుండా, సుప్రీంకోర్టు ముం దు ఉరిశిక్ష రద్దు పిటిషన్లో పీయూడీఆర్ లేవనెత్తిన అంశాలు ఏమిటి? ఈ నేపథ్యంలో జాప్యం ఎక్కడ జరిగిందో పరిశీలించాలి. నేరం జరిగింది. 2010, జూన్ 11న. సెషన్స్ కోర్టు తీర్పును ప్రకటించింది 2011, ఫిబ్రవరి 3న. హైకోర్టు మరణశిక్షను ధృవీకరిస్తూ తీర్పు చెప్పింది 2011, సెప్టెంబర్ 12న. సుప్రీంకోర్టు అతని అనుమతి అప్పీలును తిరస్కరించింది. 2012 జనవరిలో క్షమాభిక్ష విన్నపాన్ని రాష్ట్ర పతి ప్రణబ్‌ముఖర్జీ 2013, జూలై 22న తిర స్కరించారు. దర్యాప్తులో, విచారణలో జాప్యం జర గలేదు. కానీ అతని క్షమాభిక్ష దరఖాస్తును తిరస్కరించడంలో 17 నెలల కాలం గడచిం ది. ఉరిశిక్షను నిలిపివేయడానికి ఇది ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. కోర్టుల్లో జాప్యానికి అనేక కారణాలు ఉంటాయి. మరి...? మం గన్లాల్ మరణశిక్ష అనుభవిస్తూ బతకాల్సి ఉంటుందేమో! - మంగారి రాజేందర్ జిల్లా జడ్జి, సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్, ఏపీ జ్యుడీషియల్ అకాడమీ, సికింద్రాబాద్