నవ న్యాయవ్యవస్థ నిర్మాత
సందర్భం
కేంద్ర న్యాయశాఖ మంత్రిగా శివశంకర్ చేపట్టిన సంస్కరణల వల్లే బడుగు బల హీన వర్గాలకు చెందిన పలువురు లాయర్లు హైకోర్టు, సుప్రీంకోర్టు స్థాయికి చేరుకో గలిగారు. ఆయన చేసిన మార్పులు న్యాయ వ్యవస్థ చరిత్రలో నిలచిపోతాయి.
కేంద్ర న్యాయశాఖ మంత్రిగా, రెండు రాష్ట్రాలకి గవర్నర్‌గా పనిచేసిన పి. శివశంకర్ 89 ఏళ్ల వయస్సులో సోమవారం నాడు కన్నుమూశారు. ఆయన మర ణాన్ని సాంఘిక మాధ్యమాలు పట్టించుకున్నంతగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు పట్టిం చుకున్నట్లు లేదు. ఆయన చాలా పదవులని అధిష్టించినప్పటికీ కేంద్ర న్యాయశాఖలో చేసిన మార్పులు న్యాయవ్యవస్థ చరిత్రలో మిగిలిపోతాయి.
1927లో వెనుకబడిన కులంలో పుట్టిన శివశంకర్ చాలా కష్టపడి పైకి వచ్చారు. తల్లిదండ్రులకి ఉన్న 11 మంది సంతానంలో ఆయన రెండవ వ్యక్తి. కుటుంబానికి చేయూతనివ్వడానికి చిన్న చిన్న ఉద్యోగాలను చాలా చేశారు. శివశంకర్, ఆయన సోదరుడు కలిసి అమృత్ సర్‌లో చదువుకున్నారు. చిన్న చిన్న పనులు చేస్తూ బీఏ ఎల్‌ఎల్‌బీని పూర్తి చేశారు. ఆ కాలంలోనే తీవ్రమైన ఆకలి బాధలతో సతమతమై అతని సోదరుడు అమృత్‌సర్‌లో మరణించాడు. అతని పార్థివ శరీరాన్ని హైదరాబాద్‌కి పంపించే స్తోమత కాదు కదా దహనం చేసే స్తోమత కూడా శివశంకర్‌కి అప్పుడు లేదు. చివరికి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్లు ఆ శవాన్ని తీసుకొని వెళ్ళారు.
లా చదువు పూర్తయ్యాక హైదరా బాద్‌కి వచ్చి న్యాయవాదిగా ప్రాక్టీస్ మెుదలుపెట్టారు. ఇంగ్లిష్ భాష మీద, న్యాయశాస్త్రాల మీద మంచి పట్టు ఉండ డం వల్ల స్వల్ప కాలంలో మంచి న్యాయ వాదిగా పేరు గడించారు. ఎమర్జెన్సీ తరువాత చాలా కేసులను ఎదుర్కొం టున్న ఇందిరాగాంధీ శివశంకర్ సేవలను విని యోగించి, కేసులని, కమిషన్లని ఎదుర్కొన్నారు. ఆమె ప్రభుత్వంలో ఆయన న్యాయశాఖ మంత్రిగా పనిచేయడం న్యాయ వ్యవస్థలో చాలా మార్పులు రావడానికి దోహదపడింది.
హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ గురించి శివశంకర్ కొన్ని చర్యలు చేపట్టినారు. మార్చి 18, 1981 రోజున అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, గవర్నర్‌లకి న్యాయ మూర్తుల బదిలీ గురించి ఓ సర్క్యులర్‌ని పంపించారు. హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యే వ్యక్తుల దగ్గర నుంచి శాశ్వత న్యాయమూర్తులుగా ఇతర హైకోర్టులలో పనిచేయడానికి అనుమతి తీసుకోవాలన్నది సర్క్యులర్ సారాంశం. ఈ బదిలీల వల్ల జాతీయ సమై క్యత ఏర్పడటంతోపాటు కుల, బంధుత్వ, స్థానిక అంశాలు ప్రభావం చూపవని ఆయన ఉద్దేశం.
కానీ ఇది న్యాయవ్యవస్థ మీద విశ్వాసం లేకుండా చేస్తుందని, న్యాయమూర్తులను అసౌకర్యానికి గురి చేస్తుం దనీ విమర్శలు ఈ సర్క్యులర్‌పై వచ్చాయి. అయితే న్యాయ వ్యవస్థ తనను ఎవరూ తాకకూడదన్నట్టుగా ఉండ కూడదని శివశంకర్ లోక్‌సభలో న్యాయవ్యవస్థ స్వతం త్రత గురించి జవాబు చెప్పారు.
ఆ తరువాత జరిగిన పరిణామాలు న్యాయవ్యవస్థ చరిత్రలో ప్రధానమైన మలుపుగా అనుకోవచ్చు. డిసెం బర్ 30, 1981 రోజున ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో న్యాయమూర్తుల ఎంపిక, బదిలీల గురించి తీర్పుని ప్రకటించింది. ఆ సర్క్యులర్ అమలుకు చట్టపరమైన బలం లేదు కానీ అది రాజ్యాంగ వ్యతిరేకం కాదని సుప్రీంకోర్టు ప్రకటించింది.
న్యాయమూర్తులు ఎక్కువగా అగ్రవర్ణాల నుంచి, పాలక వర్గాల నుంచి, ఆర్థికంగా బలంగా ఉన్న సామాజిక వర్గాల నుంచి వస్తున్నారని వాస్తవాన్ని గ్రహించి న్యాయ మూర్తుల బదిలీల ప్రక్రియ గురించి శివశంకర్ గట్టిగా పట్టుబట్టారు. హైకోర్టు న్యాయమూర్తుల ఎంపిక విష యంలో ప్రధాన న్యాయమూర్తులు ఎక్కువగా అగ్రకులా లకి ప్రాధాన్యతని ఇస్తున్నారని, ప్రధాన న్యాయమూర్తులు స్థానికులు కాకుండా బయటి వ్యక్తులు అయితే ఈ పద్ధతి పోతుందని శివశంకర్ అభిప్రాయపడి సర్క్యులర్ జారీ చేశారు. ఈ అగ్ర కుల గుత్తాధిపత్యానికి భంగం కలిగించి వెనుకబడిన తరగతుల నుంచి షెడ్యూల్డు కులాల, తెగల నుంచి ప్రతిభ ఉన్న న్యాయవాదులని న్యాయమూర్తు లుగా పైకి తీసుకొని రావాలన్న ఉద్దేశ్యంతో ఆయన మంత్రిగా ఉన్నంతకాలం కృషి చేశారు.
ఎస్పీ గుప్తా కేసు తరువాత న్యాయ మూర్తుల బదిలీల ప్రక్రియ పద్ధతిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దాని ప్రకారం ప్రతి హైకోర్టుకి ప్రధాన న్యాయ మూర్తి వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఉండాలి. అదే విధంగా 1/3 మంది న్యాయమూర్తులు వేరే రాష్ట్రాల హైకోర్టు లకి చెందిన వ్యక్తులు ఉండాలి. కొంత కాలం ఇది అమలు జరిగింది కానీ ఆ తరువాత పూర్తిగా ఈ ప్రక్రియ అమలు కావడం లేదు. న్యాయమూర్తుల ఎంపిక, బదిలీలు అనేది సుప్రీంకోర్టు కొలీజియానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన సమస్యగా పరిణమించిన పరిస్థితులలో శివశంకర్ మరణం ఈ దిశగా ఆలోచించాల్సిన ఆవశ్యకతను గుర్తుకు తెస్తుంది.
శివశంకర్ చేపట్టిన కొన్ని సంస్కరణల ఫలితంగానే బడుగు బలహీన వర్గాలకు చెందిన అనేకులు హైకోర్టు, సుప్రీంకోర్టు స్థాయికి చేరుకోగలిగారు. కానీ ఇటీవల కాలంలో ఈ విషయం గురించి ఆలోచించే వ్యక్తులు తగ్గిపోతున్న సమయంలో ఆయన మరణం ఈ విష యాన్ని జ్ఞప్తికి తెచ్చే విధంగా వుంటుంది. జాతీయ సమై క్యతతో పాటు, అన్ని వర్గాలకి ప్రాతినిద్యం ఉండేలా న్యాయమూర్తుల ఎంపిక జరగాలన్న భావం కూడా ఈ బదిలీ ప్రక్రియలో మిళితమై ఉంది.
బడుగు బలహీన వర్గాల ప్రజలే కాదు జాతీయ సమై క్యత కోరుకుంటున్న అందరూ శివశంకర్ స్ఫూర్తిని నిల బెట్టే ప్రయత్నం చేయాలి. ఇదే ఆయనకు మనమందరం ఇచ్చే నివాళి.
- మంగారి రాజేందర్
వ్యాసకర్త సభ్యులు, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్