ట్రయలనే శిక్ష ఏపాటిది? | Mangari Rajender Write on Under Trial Prisoners, Indian Jails, Judicial System | Sakshi
Sakshi News home page

ట్రయలనే శిక్ష ఏపాటిది?

Published Mon, Sep 5 2022 2:24 PM | Last Updated on Mon, Sep 5 2022 4:37 PM

Mangari Rajender Write on Under Trial Prisoners, Indian Jails, Judicial System - Sakshi

అఖిల భారత జిల్లా న్యాయ సేవల అథారిటీస్‌ ప్రథమ సమావేశంలో భారత ప్రధాని మాట్లాడుతూ చాలామంది విచారణలో ఉన్న ఖైదీలు జైళ్లలో మగ్గిపోవడం గురించి ఆందోళన వెలి బుచ్చారు. వారి విడుదల కోసం న్యాయ సేవల అధికార సంస్థలు కృషి చేయాలని అన్నారు. న్యాయం వారికి సులభంగా అందుబాటులోకి రావాలనీ, అలా వస్తే వాళ్ల జీవించే హక్కు కుదుటపడుతుందనీ ప్రధాని అన్నారు.

తీవ్రమైన నేరాలు చేయని వ్యక్తులూ, ఇదివరకే 1/3 వంతు శిక్షా కాలాన్ని అనుభవించినవాళ్లూ జెలు నుంచి బయటకు రావడానికి వారిపైన ఉన్న కేసులను రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆగస్టు 5వ తేదీన ప్రభుత్వానికి సూచించింది. అంతకుముందు జూలై 11వ తేదీన సుప్రీంకోర్టు కొత్తగా బెయిల్‌ చట్టం తీసుకొని రావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. కాగ్నిజబుల్‌ నేరం చేయని ఎంతోమంది వ్యక్తులు జైళ్ళలో ఉన్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అరెస్టు చేయడం అనేది చాలా క్రూరమైన చట్టమనీ, వ్యక్తి స్వేచ్ఛ దానివల్ల పోతుందనీ, అందుకని అత్యవసరమై నప్పుడు మాత్రమే ఈ అరెస్టులను చేయాలనీ సుప్రీంకోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించింది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డు బ్యూరో 2020లో ప్రకటించిన వివరాల ప్రకారం 4,88,551 మంది జైళ్లలో బెయిల్‌ రాక ఉండి పోయారు. విచారణలో ఉన్న ఖైదీల సంఖ్య తగ్గించడం కోసం పోలీస్‌ కమి షన్, సుప్రీంకోర్టు అనేక సూచనలు చేసినప్పటికీ ఫలితం లేదు.

అరెస్టు చేసే అధికారం ఉందని అరెస్టు చేయడం తగదనీ, అరెస్టు చేయడానికి న్యాయబద్ధత ఉండాలనీ జోగిందర్‌ కుమార్‌ కేసు(1994)లో సుప్రీంకోర్టు చెప్పింది. అయినా పోలీసుల పని విధానంలో మార్పు రాలేదు. అరెస్టులను తగ్గించాలని క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో 41వ నిబంధనకు మార్పులను (2009) తీసుకొని వచ్చారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ మార్పులు చేసిన నిబంధన పోలీసులకు విశేష అధికారా లను కల్పించింది. ఈ అధికార నియంత్రణ కోసం ఆర్నేష్‌ కుమార్‌ కేసులో కొన్ని మార్గదర్శకాలను కోర్టు ఏర్పరిచింది. కానీ ఆ మార్గదర్శకాలను అమలు చేసే మేజిస్ట్రేట్లు ఎంతమంది మన దేశంలో ఉన్నారు?

రాజద్రోహ నేరం పేరుతో దేశంలో ఎన్నో అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. హాని కలిగించని ట్వీట్లు చేసిన జర్నలిస్టు మహమ్మద్‌ జుబేర్‌ని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మధ్యే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అవమానకరమైన ట్వీట్‌ చేశాడన్న ఆరోపణ మీద ఓ నటుడు నెల రోజులపాటు జైల్లో ఉన్నాడు. ఆయన ఎవరి గురించి అయితే ఆ ట్వీట్‌ చేశాడో ఆ నాయకుడు ఆ ట్వీట్‌ని పట్టించుకోలేదు. బర్షశ్రీ బురగొహెయిన్‌ అనే స్టూడెంట్‌ ఏదో కవిత రాసినందుకు రెండు నెలలు జైల్లో ఉండిపోయింది.

మన జైళ్లలో కూడా చాలా దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయి. సుఖేష్‌ చంద్రశేఖర్‌ అనే విచారణలో ఉన్న ఖైదీకి సకల సౌకర్యాలు జైల్లో లభిస్తాయి. స్టాన్‌స్వామి అనే ఖైదీ ఒక రూపాయి విలువ చేసే ‘స్ట్రా’ కోసం విలవిల లాడాల్సి వచ్చింది. ఇట్లా ఎన్నో ఉదాహరణలను చెప్పవచ్చు. 2018లో అరెస్టయిన ప్రముఖ కవికి సుప్రీంకోర్టు ఇటీవల మెడికల్‌ గ్రౌండ్స్‌ మీద బెయిల్‌ మంజూరు చేసింది. ఆయనకి 82 సంవత్సరాలు ఉన్నాయనీ, కస్టడీ విచారణ 2018లో జరిగిందనీ, ఈ కేసులో ఛార్జిషీట్‌ దాఖలైనా కూడా విచారణ ఇంకా మొదలు కాలేదన్న కారణంగా బెయిల్‌ మంజూరు చేసినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చాయి. అరెస్టు విషయంలో ఆర్నేష్‌ కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను, మేజిస్ట్రేట్స్‌ కఠినంగా అమలు చేస్తే ఈ అరెస్టులకు అడ్డుకట్ట ఏర్పడుతుంది. అదే విధంగా రిమాండ్‌ చేసేటప్పుడు గుడ్డిగా కాకుండా జాగ్రత్తగా రిమాండ్‌ చేస్తే కూడా ఈ నిర్బంధాలు తగ్గే అవకాశం ఉంటుంది.

ఇదే కాకుండా ‘జైలు కాదు బెయిల్‌’ అన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యానం స్లోగన్‌ మాదిరిగా మారడం శోచనీయం. నేర నిరూపణ జరిగేవరకు ముద్దాయిని అమాయకుడిగా పరిగణించాలన్న నియమం కాస్త అమాయకుడిగా నిరూపణ అయ్యేంతవరకూ నేరస్థుడు అన్న చందంగా మారడం ఓ విషాదం. రిమాండ్‌ విషయంలో, అదే విధంగా బెయిల్‌ మంజూరు చేసే విషయంలో కోర్టులు న్యాయబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సీరియస్‌ నేరాలను, మామూలు నేరాలను వేరువేరుగా చూసే దృష్టి అలవర్చుకోవాలి. ఈ గందరగోళ పరిస్థితి నుంచి బయటపడటానికి క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌లోని అన్ని వ్యవస్థలూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. న్యాయమూర్తుల పాత్ర గురించి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన మదన్‌ బి. లోకూర్‌ మాటలను ఇక్కడ ఉదహరించాలి.

‘‘అరెస్టు విషయంలో ట్రయల్‌ కోర్టు న్యాయమూర్తులు పోలీసుల రబ్బర్‌ స్టాంపు మాదిరిగా వ్యవహరించకూడదు. మీ మనస్సుతో చూడండి. ఓ నా ప్రియమైన న్యాయమూర్తులారా! స్వేచ్ఛ అనేది అత్యంత విలువైనది. అది ఎవరూ కోల్పోకూడదు. దేశ పౌరుల రాజ్యాంగ హక్కులవైపు మీరు నిలబడండి. నాకు తెలుసు. మిమ్మల్ని రాత్రికి రాత్రి బదిలీ చేస్తారన్న భయం కూడా ఉంటుంది. నిద్రలేని రాత్రులు మీకు ఏర్పడవచ్చు. మంచి రోజులు ఏదో ఒక రోజు వస్తాయి. అంతలోపు సంవత్సరాల తరబడి విచారణలో ఉన్న ఖైదీల వైపు చూడండి. అమాయకులు జైళ్లలో ఉండి పోకుండా చూడండి. ఇది సరైనదేనా? వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి గురించి ఆలో చించండి. ఇది న్యాయమా? అన్యాయమా? ఆలోచించండి. ఇది కష్టమైన ప్రశ్న కాదు.’’ (క్లిక్‌: రోజురోజుకూ పెరుగుతున్న వ్యత్యాసాలు)

ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయ శాఖా మంత్రి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందరూ విచారణలో ఉన్న ఖైదీల గురించి ఆందోళనల వ్యక్తపరుస్తున్నారు. ఈ ఆందోళనలను తగ్గించే అవకాశం ఉన్న వ్యక్తులు ట్రయల్‌ కోర్టు న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించే బాధ్యత వారిమీద లేదా? ‘విచారణలో ఉన్న ఖైదీనా, విచారణే అవసరం లేని ఖైదీనా’ తెలియజెప్పమని విచారణలో ఉన్న ఖైదీలు కోరకుండా చూసు కోవాల్సిన బాధ్యత న్యాయమూర్తుల మీదే ఉంది. (క్లిక్‌: గొంతు చించుకొని అడగాల్సిందే!)


- మంగారి రాజేందర్‌ 
మాజీ జిల్లా జడ్జి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement