under trials
-
ట్రయలనే శిక్ష ఏపాటిది?
అఖిల భారత జిల్లా న్యాయ సేవల అథారిటీస్ ప్రథమ సమావేశంలో భారత ప్రధాని మాట్లాడుతూ చాలామంది విచారణలో ఉన్న ఖైదీలు జైళ్లలో మగ్గిపోవడం గురించి ఆందోళన వెలి బుచ్చారు. వారి విడుదల కోసం న్యాయ సేవల అధికార సంస్థలు కృషి చేయాలని అన్నారు. న్యాయం వారికి సులభంగా అందుబాటులోకి రావాలనీ, అలా వస్తే వాళ్ల జీవించే హక్కు కుదుటపడుతుందనీ ప్రధాని అన్నారు. తీవ్రమైన నేరాలు చేయని వ్యక్తులూ, ఇదివరకే 1/3 వంతు శిక్షా కాలాన్ని అనుభవించినవాళ్లూ జెలు నుంచి బయటకు రావడానికి వారిపైన ఉన్న కేసులను రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆగస్టు 5వ తేదీన ప్రభుత్వానికి సూచించింది. అంతకుముందు జూలై 11వ తేదీన సుప్రీంకోర్టు కొత్తగా బెయిల్ చట్టం తీసుకొని రావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. కాగ్నిజబుల్ నేరం చేయని ఎంతోమంది వ్యక్తులు జైళ్ళలో ఉన్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అరెస్టు చేయడం అనేది చాలా క్రూరమైన చట్టమనీ, వ్యక్తి స్వేచ్ఛ దానివల్ల పోతుందనీ, అందుకని అత్యవసరమై నప్పుడు మాత్రమే ఈ అరెస్టులను చేయాలనీ సుప్రీంకోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించింది. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో 2020లో ప్రకటించిన వివరాల ప్రకారం 4,88,551 మంది జైళ్లలో బెయిల్ రాక ఉండి పోయారు. విచారణలో ఉన్న ఖైదీల సంఖ్య తగ్గించడం కోసం పోలీస్ కమి షన్, సుప్రీంకోర్టు అనేక సూచనలు చేసినప్పటికీ ఫలితం లేదు. అరెస్టు చేసే అధికారం ఉందని అరెస్టు చేయడం తగదనీ, అరెస్టు చేయడానికి న్యాయబద్ధత ఉండాలనీ జోగిందర్ కుమార్ కేసు(1994)లో సుప్రీంకోర్టు చెప్పింది. అయినా పోలీసుల పని విధానంలో మార్పు రాలేదు. అరెస్టులను తగ్గించాలని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో 41వ నిబంధనకు మార్పులను (2009) తీసుకొని వచ్చారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ మార్పులు చేసిన నిబంధన పోలీసులకు విశేష అధికారా లను కల్పించింది. ఈ అధికార నియంత్రణ కోసం ఆర్నేష్ కుమార్ కేసులో కొన్ని మార్గదర్శకాలను కోర్టు ఏర్పరిచింది. కానీ ఆ మార్గదర్శకాలను అమలు చేసే మేజిస్ట్రేట్లు ఎంతమంది మన దేశంలో ఉన్నారు? రాజద్రోహ నేరం పేరుతో దేశంలో ఎన్నో అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. హాని కలిగించని ట్వీట్లు చేసిన జర్నలిస్టు మహమ్మద్ జుబేర్‌ని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మధ్యే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అవమానకరమైన ట్వీట్ చేశాడన్న ఆరోపణ మీద ఓ నటుడు నెల రోజులపాటు జైల్లో ఉన్నాడు. ఆయన ఎవరి గురించి అయితే ఆ ట్వీట్ చేశాడో ఆ నాయకుడు ఆ ట్వీట్‌ని పట్టించుకోలేదు. బర్షశ్రీ బురగొహెయిన్ అనే స్టూడెంట్ ఏదో కవిత రాసినందుకు రెండు నెలలు జైల్లో ఉండిపోయింది. మన జైళ్లలో కూడా చాలా దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయి. సుఖేష్ చంద్రశేఖర్ అనే విచారణలో ఉన్న ఖైదీకి సకల సౌకర్యాలు జైల్లో లభిస్తాయి. స్టాన్‌స్వామి అనే ఖైదీ ఒక రూపాయి విలువ చేసే ‘స్ట్రా’ కోసం విలవిల లాడాల్సి వచ్చింది. ఇట్లా ఎన్నో ఉదాహరణలను చెప్పవచ్చు. 2018లో అరెస్టయిన ప్రముఖ కవికి సుప్రీంకోర్టు ఇటీవల మెడికల్ గ్రౌండ్స్ మీద బెయిల్ మంజూరు చేసింది. ఆయనకి 82 సంవత్సరాలు ఉన్నాయనీ, కస్టడీ విచారణ 2018లో జరిగిందనీ, ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలైనా కూడా విచారణ ఇంకా మొదలు కాలేదన్న కారణంగా బెయిల్ మంజూరు చేసినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చాయి. అరెస్టు విషయంలో ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను, మేజిస్ట్రేట్స్ కఠినంగా అమలు చేస్తే ఈ అరెస్టులకు అడ్డుకట్ట ఏర్పడుతుంది. అదే విధంగా రిమాండ్ చేసేటప్పుడు గుడ్డిగా కాకుండా జాగ్రత్తగా రిమాండ్ చేస్తే కూడా ఈ నిర్బంధాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ‘జైలు కాదు బెయిల్’ అన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యానం స్లోగన్ మాదిరిగా మారడం శోచనీయం. నేర నిరూపణ జరిగేవరకు ముద్దాయిని అమాయకుడిగా పరిగణించాలన్న నియమం కాస్త అమాయకుడిగా నిరూపణ అయ్యేంతవరకూ నేరస్థుడు అన్న చందంగా మారడం ఓ విషాదం. రిమాండ్ విషయంలో, అదే విధంగా బెయిల్ మంజూరు చేసే విషయంలో కోర్టులు న్యాయబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సీరియస్ నేరాలను, మామూలు నేరాలను వేరువేరుగా చూసే దృష్టి అలవర్చుకోవాలి. ఈ గందరగోళ పరిస్థితి నుంచి బయటపడటానికి క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లోని అన్ని వ్యవస్థలూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. న్యాయమూర్తుల పాత్ర గురించి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన మదన్ బి. లోకూర్ మాటలను ఇక్కడ ఉదహరించాలి. ‘‘అరెస్టు విషయంలో ట్రయల్ కోర్టు న్యాయమూర్తులు పోలీసుల రబ్బర్ స్టాంపు మాదిరిగా వ్యవహరించకూడదు. మీ మనస్సుతో చూడండి. ఓ నా ప్రియమైన న్యాయమూర్తులారా! స్వేచ్ఛ అనేది అత్యంత విలువైనది. అది ఎవరూ కోల్పోకూడదు. దేశ పౌరుల రాజ్యాంగ హక్కులవైపు మీరు నిలబడండి. నాకు తెలుసు. మిమ్మల్ని రాత్రికి రాత్రి బదిలీ చేస్తారన్న భయం కూడా ఉంటుంది. నిద్రలేని రాత్రులు మీకు ఏర్పడవచ్చు. మంచి రోజులు ఏదో ఒక రోజు వస్తాయి. అంతలోపు సంవత్సరాల తరబడి విచారణలో ఉన్న ఖైదీల వైపు చూడండి. అమాయకులు జైళ్లలో ఉండి పోకుండా చూడండి. ఇది సరైనదేనా? వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి గురించి ఆలో చించండి. ఇది న్యాయమా? అన్యాయమా? ఆలోచించండి. ఇది కష్టమైన ప్రశ్న కాదు.’’ (క్లిక్: రోజురోజుకూ పెరుగుతున్న వ్యత్యాసాలు) ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయ శాఖా మంత్రి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందరూ విచారణలో ఉన్న ఖైదీల గురించి ఆందోళనల వ్యక్తపరుస్తున్నారు. ఈ ఆందోళనలను తగ్గించే అవకాశం ఉన్న వ్యక్తులు ట్రయల్ కోర్టు న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించే బాధ్యత వారిమీద లేదా? ‘విచారణలో ఉన్న ఖైదీనా, విచారణే అవసరం లేని ఖైదీనా’ తెలియజెప్పమని విచారణలో ఉన్న ఖైదీలు కోరకుండా చూసు కోవాల్సిన బాధ్యత న్యాయమూర్తుల మీదే ఉంది. (క్లిక్: గొంతు చించుకొని అడగాల్సిందే!) - మంగారి రాజేందర్ మాజీ జిల్లా జడ్జి -
అడ్వాన్స్డ్ స్టేజ్‌లో రెండు కరోనా వ్యాక్సిన్లు
సాక్షి,న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి అంతానికి వ్యాక్సిన్లను రూపొందించే ప్రక్రియ వేగం పుంజుకుంది. అంతర్జాతీయంగా కీలక దశ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలతో వ్యాక్సిన్‌పై ఆశలను పెంచుతున్నాయి. దేశీయంగా కనీసం ఐదు వ్యాక్సిన్లు వివిధ దశల ప్రయోగాల్లో ఉన్నాయని, వాటిలో రెండు అడ్వాన్స్డ్ స్టేజ్‌కు చేరుకున్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు, వ్యాక్సిన్ ఉత్పత్తి , పంపిణీపై ప్రధానమంత్రికి సలహా ఇచ్చే ప్యానెల్ అధిపతి డాక్టర్ వినోద్ పాల్ అన్నారు. ముఖ్యంగా భారత్ బయోటెక్‌కు చెందిన భారతీయ వ్యాక్సిన్ కోవాక్సిన్ ఇప్పటికే దశ-3 క్లినికల్ ట్రయల్ ప్రారంభించిందన్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఐదు వ్యాక్సిన్లు వివిధ దశల ట్రయల్స్‌లో ఉన్నాయని పాల్ తెలిపారు. ముఖ్యంగా ఆస్ట్రాజెనెకా ఫేజ్-3 అధునాతన దశలో ఉందన్నారు. అలాగే కాడిలా వ్యాక్సిన్ , రష్యాకుచెందిన స్పుత్నిక్వి ట్రయల్ ఫేజ్-2 ట్రయల్ ప్రిపరేషన్ పూర్తయిందని ఆయన పేర్కొన్నారు, దీంతోపాటు జైడస్ కాడిలా రూపొందించిన జైకోవ్-డి దేశంలో రెండవ దశ క్లినికల్ ట్రయల్‌లో ఉందని చెప్పారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన మరో టీకా కోవిషీల్డ్ ఇటీవల భారతదేశంలో మూడవ దశ క్లినికల్ ట్రయల్ ను ప్రారంభించింది.అలాగే డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ త్వరలో దేశంలో రష్యన్ కోవిడ్-19 వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ రెండవ దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనుందని తెలిపారు. (కీలక దశకు దేశీయ కరోనా వ్యాక్సిన్) దేశంలో టీకా అందుబాటులోకి వచ్చాక ఫ్రంట్‌లైన్ కార్మికులకే తొలి ప్రాధాన్యమన్నారు. మరణాలను తగ్గించడం, ఫ్రంట్‌లైన్ కార్మికులను రక్షించడానికే మొదటి ప్రాధాన్యతనివ్వాలని పాల్ తెలిపారు. సుమారు 30 కోట్ల ప్రాధాన్యతా లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది.ప్రారంభ దశలో టీకా అందించేవారిని నాలుగువర్గాల వ్యక్తులుగా వర్గీకరించింది. వైద్యులు, ఎంబిబిఎస్ విద్యార్థులు, నర్సులు, ఆశా కార్మికులతో సహా ఒక కోటి మంది ఆరోగ్య నిపుణులు, మునిసిపల్ కార్పొరేషన్ కార్మికులు, పోలీసు సిబ్బంది, సాయుధ దళాలతో సహా రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ కార్మికులు ఉంటారు. వీరితోపాటు 50 ఏళ్లు పైబడిన 26 కోట్ల మంది; 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండి, తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. -
నిర్దోషికి శిక్ష పడొద్దంటే.. ఇదా పరిస్థితి
'వంద మంది దోషులు తప్పించుకన్నా ఫర్వాలేదుగానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు' అన్నది మన భారత న్యాయవ్యవస్థ మౌలికసూత్రం. వివిధ కేసుల్లో అరెస్టై ఎలాంటి శిక్షలు పడకుండా ఏళ్లపాటు జైళ్లలో మగ్గుతున్న పారుల విషయంలో ఈ సూత్రానికి ఎలాంటి భాష్యం చెప్పాలి? రుడాలి షా అనే యువకుడు ఓ కేసులో 1953లో అరెస్టయ్యారు. 1968లోనే న్యాయస్థానం ఆయనపై కేసును కొట్టివేసింది. అయినా.. ఆయన 1983 వరకు, అంటే 30 ఏళ్ల పాటు బిహార్‌లోని ముజఫర్‌పూర్ జైల్లో ఉన్నారు. బోకా ఠాకూర్ అనే యువకుడు తన 16వ ఏట ఓ కేసులో అరెస్టయ్యాడు. ఎలాంటి నేరం చేయకుండానే బీహార్‌లోని మధుబని జైల్లో 36 ఏళ్లపాటు జైల్లో ఉన్నారు. ఎలాంటి నేరం చేయకుండానే వీరిద్దరు జైలు శిక్ష అనుభవించారు. మరి ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదని చెబుతున్న మన న్యాయవ్యవస్థ మౌలిక సూత్రం ఏమైంది? ఇలాంటి వారు ఇద్దరే కాదు. అండర్ ట్రయల్స్‌గా జైల్లో మగ్గుతున్న 2,82,879 (2014 లెక్కల ప్రకారం) మంది పౌరుల్లో ఎన్ని వేల మంది నిర్దోషులు ఉన్నారో! వారిలో ఆరు నెలల నుంచి ఏడాదికి పైగా జైల్లో మగ్గుతున్నవారు 1,22,056 మందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లెక్కలు తెలియజేస్తున్నాయి. రెండున్నర లక్షల మందికి పైగా అండర్ ట్రయల్స్ ఉన్నారంటే అది కరేబియన్ దేశమైన బార్బడోస్ జనాభాకు సమానం. వీరిలో ఏడాదికి పైగా జైల్లో ఉంటున్న వారి సంఖ్య 25 శాతం ఉందంటే ఆశ్చర్యం వేస్తోంది. మొత్తం జైల్లో ఉంటున్న నేరస్థుల్లో 65 శాతం మంది కేసు విచారణను ఎదుర్కొంటున్న ఖైదీలే. వారిలో ప్రతి పది మందిలో ఏడుగురు ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైల్లో ఉంటున్న వాళ్లు కాగా, ప్రతి పదిమందిలో ఇద్దరు ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైల్లో ఉంటున్నారు. రెండు కారణాల వల్ల వీరు అన్యాయంగా జైల్లో మగ్గిపోతున్నారు. న్యాయసహాయం స్వీకరించే స్థోమత లేకపోవడం ఒకటి కాగా, న్యాయం కోసం లాయర్లను సంప్రదించే అవకాశాన్ని జైలు అధికారులు కల్పించక పోవడం మరో కారణం. వారు జైల్లో ఉండడం వల్ల వారిలో ఎక్కువమంది కుటుంబ సంబంధాలు కోల్పోవడమే కాకుండా చేస్తున్న ఉద్యోగాలను కూడా కోల్పోతున్నారు. ఫలితంగా మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు. కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. దేశంలోని జైళ్లలో మగ్గుతున్న విచారణ ఖైదీల్లో ఎక్కువ మంది కశ్మీరు రాష్ట్రానికి చెందినవారే ఉన్నారు. కశ్మీర్లో 54 శాతం, గోవాలో 50 శాతం, గుజరాత్లో 42 శాతం, ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 40 శాతం మంది ఉన్నారు. ఈ దుస్థితి తన దృష్టికి రావడంతో సుప్రీం కోర్టు 1980లో రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం అండర్ ట్రయల్స్‌కు వేగంగా సముచిత న్యాయాన్ని అందించాల్సి ఉందని తీర్పు చెప్పింది. ఈ తీర్పును ప్రభువులు ఎలా అర్థం చేసుకున్నారో, జైలు అధికారులకు ఈ తీర్పు గురించి కబురైనా ఉందో, లేదో తెలియదుగానీ పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. పరిస్థితిని చక్కదిద్దాలనే సదుద్దేశంతో 2005లో అప్పట్లో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం భారతీయ శిక్షాస్మృతిలోని 436ఏ సెక్షన్లో సవరణ తీసుకొచ్చింది. ఓ కేసు కింద విచారణ ఎదుర్కొంటున్న ఖైదీ ఆ కేసు కింద తనకు పడే శిక్షలో సగభాగాన్ని జైల్లోనే గడిపితే, ఎలాంటి పూచీకత్తులు లేకుండా, కేవలం వ్యక్తిగత బాండుతోనే విడుదల చేయాలన్నది ఆ సెక్షన్లో తెచ్చిన మార్పు. ఈ సవరణ కూడా అండర్ ట్రయల్స్ విషయంలో పెద్దగా మార్పును తీసుకురాలేదు. సుప్రీంకోర్టు 2013లో తాను ఇచ్చిన తీర్పునకు కొనసాగింపుగా 2014లో మరో తీర్పును వెలువరించింది. భారతీయ శిక్షాస్మృతిలోని 436ఏ సెక్షన్‌ను స్ఫూర్తిగా తీసుకొని సగం శిక్షను పూర్తిచేసుకున్న వారిని ఎలాంటి బాండులు లేకుండా బెయిల్‌పై విడుదల చేయాలని, అప్పటికే పూర్తి శిక్షను అనుభవించిన వారిని కూడా బేషరతుగా విడుదల చేయాలని తీర్పు చెప్పింది. దీనికి జిల్లా మేజిస్ట్రేట్, జిల్లా జడ్జీ, జిల్లా ఎస్పీలతో కలిపి ఓ సమీక్షా కమిటీని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలంటూ మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఏడు వేల మంది అండర్ ట్రయల్స్ విడుదలయ్యారు. మొత్తం అండర్ ట్రయల్స్‌లో విడుదలైన వారు రెండు శాతం కూడా లేరంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.