judicial system
-
DY Chandrachud: న్యాయ వ్యవస్థకు ప్రజా విశ్వాసమే కీలకం
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థకు, న్యాయమూర్తులకు ప్రజా విశ్వాసమే అత్యంత కీలకమని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. ప్రజల నమ్మకం చూరగొనేలా పని చేయాలని న్యాయమూర్తులకు సూచించారు. ప్రజలు నేరుగా ఎన్నుకోనప్పటికీ, ప్రజా తీర్పునకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ న్యాయమూర్తులపై గురుతర బాధ్యత ఉందని చెప్పారు. జడ్జిగా విశ్వసనీయత, తగిన గుర్తింపు పొందాలంటే ప్రజల ఆమోదం, నమ్మకం చాలా ముఖ్యమని అన్నారు. భూటాన్‌లోని ‘జేఎస్‌డబ్ల్యూ స్కూల్ ఆఫ్ లా’లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో జస్టిస్ చంద్రచూడ్ ప్రసంగించారు. ప్రజలకు నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను కూడా కోర్టులు పరిష్కరిస్తుంటాయని పేర్కొన్నారు. అందుకే వారి విశ్వాసం పొందడం చాలా ముఖ్యమని స్పష్టంచేశారు. ఏ దేశంలోనైనా ప్రజల మద్దతుతో న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే అక్కడ రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన పాలన సజావుగా సాగుతుందని వివరించారు. ప్రజాభిప్రాయం అనేది న్యాయ వ్యవస్థలో అంతర్గత తనిఖీగా తోడ్పడుతుందని సూచించారు. న్యాయ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేవలం న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్లు ప్రజలకు కనిపించాలని స్పష్టంచేరు. భారత్‌లోని కోర్టుల్లో ప్రవేశపెట్టిన సాంకేతిక విధానాలను జస్టిస్ చంద్రచూడ్ ప్రస్తావించారు. వర్చువల్ విచారణ, కోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం, కేసుల ఈ–ఫైలింగ్, ఆన్లైన్ కేసు సమాచార వ్యవస్థ, కృత్రిమ మేధ(ఏఐ)తో కోర్టు తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించడం వంటి విధానాలు తీసుకొచ్చామని వెల్లడించారు. ఇవి సత్ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. సామాన్య ప్రజల కోసం సుప్రీంకోర్టు ప్రక్రియలను మరింత సులభతరం చేశామని చెప్పారు. -
పవన్‌కూ కోర్టులో మొట్టికాయలు తప్పవా?
తిరుపతి: సనాతన ధర్మాన్ని ముందు ఉంచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి ఊగిపోయారు. గురువారం సాయంత్రం వారాహి డిక్లరేషన్ సభలో ఏకంగా న్యాయవ్యవస్థపైనే తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒకవైపు తిరుమల లడ్డూ ప్రసాదంపై సుప్రీం కోర్టులో పిటిషన్లపై విచారణ నడుస్తున్న వేళ.. పవన్ తాజా వ్యాఖ్యలు కచ్చితంగా చర్చనీయాంశంగా మారే అవకాశం కనిపిస్తోంది.‘‘నా జీవితంలో ఇలా మాట్లాడే రోజు వస్తుందని ఊహించలేదు. సనాతన ధర్మం పాటించే వాళ్ల పట్ల చట్టాలు నిర్ధాక్షిణ్యంగా పని చేస్తున్నాయి. సనాతన ధర్మాన్ని దూషించేవారిని కోర్టులే రక్షిస్తున్నాయి. అయినవాళ్లకు ఆకులు.. కానివాళ్లకు కంచాలు అన్నట్లు ఉంది పరిస్థితి. ఇప్పుడు ఆకులు కూడా పోయాయి.. చేతుల్లో పెట్టి నాకేసుకోమంటున్నారు... సనాతన ధర్మం వైరస్లాంటిదని, నాశనం చేస్తానని ఓ యువనేత అన్నారు. ఇలాంటి మాటలు ఇస్లాం గురించి అంటే తక్షణం కోర్టులు స్పందించేవి. వాళ్లను నిర్దాక్షిణ్యంగా శిక్షించేవి. సనాతన ధర్మాన్ని తిట్టినా.. శ్రీరాముడిని, సరస్వతి దేవిని తిట్టినా.. దాడి చేసినా ఏ ఒక్కకోర్టు మాట్లాడదు. అలాంటి వారిని ఏమైనా అనాలంటే కోర్టులు భయపడతాయి. ఇది న్యాయానికి ఉదాహరణ... నాకు ఏదో అన్యాయం జరిగిందని నేను బయటకు రాలేదు. జనసేన అధ్యక్షుడిగానో, ఏపీ డిప్యూటీ సీఎంగానో ఇక్కడికి రాలేదు. సనాతన ధర్మ విరోధులతో గొడవ పడడానికే వచ్చా. అన్నీ ఓట్ల కోసమే చేస్తామా? ఓట్ల కోసమే మాట్లాడతామా?. లడ్డూ విషయంలో కోర్టులు తీర్పులు ఇచ్చే ముందు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి’’ అని పవన్ అన్నారు.ఈమధ్యకాలంలో కోర్టులు ఈ తరహా వ్యాఖ్యలను అస్సలు ఉపేక్షించడం లేదు. తమ తీర్పును రాజకీయాలకు ముడిపెట్టి స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీరును తీవ్రంగా పరిగణించి సుప్రీం కోర్టు మందలించింది. అలాగే లడ్డూ ప్రసాదంపై ఏపీ సీఎం చంద్రబాబు తన రాజకీయం కోసం చేసిన ప్రచారంపైనా మండిపడింది. ఇవేకావు.. బాధ్యతగల పదవుల్లో ఉంటూ ఈ తరహా వ్యాఖ్యలు చేసిన వాళ్లపట్ల న్యాయస్థానాలు అసంతృప్తి వ్యక్తం చేసిన దాఖలాలున్నాయి. అలాంటిది.. పవన్ నేరుగా కోర్టులపైనే బహిరంగ సభలో వ్యాఖ్యలు చేశారు. మరి వీటిని తీవ్రంగా పరిగణనలోకి తీసుకోకుండా ఉంటుందా?. మొట్టికాయలు వేయకుండా ఉంటుందా?. ::లోకేష్ఇదీ చదవండి: చివరి నిమిషంలో లడ్డూ పిటిషన్ల విచారణ వాయిదా -
Justice D.Y. Chandrachud: న్యాయప్రక్రియతో జనం విసుగెత్తిపోయారు
న్యూఢిల్లీ: దేశంలో కోర్టులకు సంబంధించిన వ్యవహారాలు, సుదీర్ఘంగా సాగే న్యాయ వ్యవస్థ ప్రక్రియతో ప్రజలు విసుగెత్తిపోయారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్‌లు చక్కటి ప్రత్యామ్నాయ వేదికలని చెప్పారు. వాటిని ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచించారు. శనివారం సుప్రీంకోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ వారోత్సవంలో ఆయన మాట్లాడారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న వివాదాలను, కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకొనే అవకాశం ఉందని, ఇరుపక్షాల అంగీకారంతో రాజీ పడొచ్చని వెల్లడించారు. న్యాయస్థానాల్లో న్యాయం చేకూర్చే ప్రక్రియ కక్షిదారులకు ఒక శిక్షగా మారిపోయిందని, ఇది నిజంగా న్యాయమూర్తులకు ఆందోళన కలిగించే విషయమని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని ఆకాంక్షించారు. -
అంతా సిద్ధమేనా?
భారత న్యాయశాస్త్ర చరిత్రలో మొన్న జూలై 1న ఒక కొత్త అధ్యాయం మొదలైంది. బ్రిటీషు కాలం నాటి నేర చట్టాల స్థానంలో మూడు కొత్త చట్టాలను మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. భారత శిక్షాస్మృతి– 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్– 1973, భారతీయ సాక్ష్యాల చట్టం – 1872... ఈ మూడింటి బదులు ‘భారతీయ న్యాయ సంహిత’, ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’, ‘భారతీయ సాక్ష్య అధినియమ్’లు సోమవారం నుంచి ఆచరణలోకి వచ్చాయి. అయితే, న్యాయకోవిదుల మొదలు సాధారణ కక్షిదారుల వరకు ఈ కొత్త చట్టాలపై భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. నేరన్యాయవ్యవస్థను ఆధునికీకరించడంలో ఈ కొత్త చట్టాలు గణనీయమైన ముందడుగు అని కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు పాతవాటికి పైపై మెరుగులు దిద్ది, అమానుషంగా మార్చారని విమర్శిస్తున్నారు. పోలీస్స్టేషన్ల నుంచి కోర్టుల దాకా అన్నిటా పనితీరును మార్చేసి, సామాన్యులపై పెను ప్రభావం చూపే ఈ శాసనాలపైనే ఇప్పుడు దేశమంతటా చర్చ సాగుతోంది. కొత్త నేర చట్టాల వ్యవహారం సహజంగానే అధికార బీజేపీకీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌కూ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. వలసవాద పాలన తాలూకు అవశేషాలను వదిలించుకొనే ఈ ప్రయత్నం దేశపురోగతికీ, స్థితిస్థాపకతకూ ప్రతీక అన్నది బీజేపీ మాట. కాంగ్రెస్ మాత్రం గడచిన ప్రభుత్వ హయాంలో పార్లమెంట్లో ఏకంగా 146 మంది ప్రతిపక్ష సభ్యులు సస్పెండైన వేళ, కేవలం మూజువాణి ఓటుతో బలవంతాన ఈ చట్టాలకు ఆమోదముద్ర వేశారనీ, పార్లమెంటరీ వ్యవస్థలో ఈ రకమైన ‘బుల్డోజర్ న్యాయాన్ని’ తమ ప్రతిపక్ష కూటమి సహించబోదనీ పేర్కొంది. శతాబ్ద కాలానికి ముందెప్పుడో బ్రిటీషు హయాంలో చేసిన చట్టాలు శిక్షల మీద ప్రధానంగా దృష్టి పెడుతుంటే, ఈ కొత్త చట్టాలు మటుకు అందరికీ న్యాయం, హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తాయనేది అధికార పక్షం కథనం. కానీ, ఆ మాటలతో ప్రతిపక్షాలే కాదు... చివరకు పలువురు న్యాయశాస్త్ర నిపుణులు సైతం విభేదిస్తుండడం గమనార్హం. ఇంకా చెప్పాలంటే, సరికొత్త శాసనాలు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఎంతైనా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, మారుతున్న సమాజ పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టుగా పాతకాలపు చట్టాలను మార్చాలన్న ఆలోచన మంచిదే. ప్రస్తుతం విచారణలోని ఖైదీలు లెక్కకు మిక్కిలిగా జైళ్ళలో మగ్గిపోతున్నారు. అసంఖ్యాకంగా బాధితులు న్యాయం కోసం ఏళ్ళ తరబడి నిరీక్షిస్తున్నారు. లక్షల కొద్దీ కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేర న్యాయవ్యవస్థలో సంస్కరణలు అత్యవసరం. అయితే, అందుకు గడచిన మోదీ సర్కార్ హడావిడిగా అనుసరించిన పద్ధతి, తగిన చర్చకు తావివ్వకుండా పార్లమెంట్లో చూపిన ఆధిపత్యం, చేసిన మంచి సూచనల్నీ – చెప్పిన అభ్యంతరాలను సైతం పట్టించుకోని తెంపరితనంతోనే అసలు చిక్కంతా! అసలు 2020 జూలైలోనే కేంద్ర హోమ్ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల సంఘం వైవాహిక అత్యాచారం మొదలు కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేయడం, రాజద్రోహ నేరంపై పునస్సమీక్ష లాంటి అనేక అంశాలపై పౌరులకు వివరమైన ప్రశ్నావళిని జారీ చేసింది. అయితే, కరోనా కాలంలోనే సంప్రతింపుల ప్రక్రియలో అధిక భాగం జరిగింది. అడిగిన, ఆశించిన భారీ మార్పులేమీ లేకుండానే కొత్త చట్టాలు వచ్చేశాయి. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు ఏకంగా 14 రోజుల పాటు పోలీసు అధికారి ప్రాథమిక దర్యాప్తు చేయవచ్చనడం, పోలీసు కస్టడీ కాలవ్యవధిని 15 రోజుల నుంచి అనేక వారాలు పెంచేయడం, చేతులకు బేడీలు సహా కొన్ని అంశాల్లో పోలీసులకు అపరిమిత అధికారాలు కట్టబెట్టడం లాంటివి ఇప్పటికే వివాదాస్పదమయ్యాయి. అలాగని కొత్త చట్టాల్లో ఏ మంచీ లేదనలేం. కొన్ని ముందడుగులు పడ్డాయి. కొన్ని రకాల నేరాల్లో శిక్షకు ప్రత్యామ్నాయంగా సామాజిక సేవ చేయడాన్ని ప్రవేశపెట్టారు. అలాగే, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణలకూ వీలు కల్పించారు. త్వరితగతిన విచారణలు పూర్తయ్యేలా నిర్ణీత కాలవ్యవధులను నిర్ణయించడం మరో మంచి ప్రయత్నం. అయితే, చట్టాలకు అన్ని ప్రాంతాలకు అర్థమయ్యే ఇంగ్లీష్ పేర్లు పెట్టనే లేదు. ప్రాంతీయ భాషల్లో అనువాదం పూర్తి కానేలేదు. రాష్ట్రాలు స్థానికంగా అవసరమైన మార్పులు చేసుకోవచ్చంటున్నా, చిక్కులున్నాయి.ఏమైనా, కొత్త చట్టాల అమలు సైతం సవాలే. దశాబ్దాలుగా అలవాటైపోయిన సెక్షన్లు, చట్టాలను ఒక్కసారిగా మార్చేయడం ఇతర సమస్యలు తెచ్చింది. ఏ నేరానికి ఏ సెక్షన్ ఎంతమేరకు వర్తిస్తుందో ఇప్పటికిప్పుడు చటుక్కున అర్థం కాని పరిస్థితి. పోలీసు, న్యాయ వ్యవస్థలు కొత్త పద్ధతులకు ఏ మేరకు సుశిక్షితమైనదీ చెప్పలేం. అన్నీ అర్థమై, అలవాటయ్యే వరకు చట్టాల అమలు సంస్థలు, జడ్జీలు, లాయర్ల నుంచి కక్షిదారుల వరకు అందరికీ గందరగోళమే. అలాగే జూలై 1కి ముందు కేసులను పాత చట్టాలతో, ఆ తరువాతి కేసులను కొత్త చట్టాలతో విచారించాల్సి ఉంటుంది. ఇప్పటికీ లక్షల కొద్దీ పాత కేసులు పెండింగ్‌లో ఉన్నందున చాలాకాలం రెండు రకాల చట్టాలనూ అనుసరించాల్సి వస్తుంది. ఇది మరో పెద్ద చిక్కు. అలాగే, ఏ చట్టాలైనా వ్యక్తిగత స్వేచ్ఛ, పౌరహక్కులకు అండగా నిలిస్తేనే వాటికి విలువ. కొత్త చట్టాలపై ఆ విషయంలోనూ అనేక అనుమానాలున్నాయి. కాబట్టి వీటిపై పార్లమెంట్‌లోనే కాదు... పౌర సమాజంలోనూ విస్తృత చర్చ జరగనివ్వాలి. ఆ స్వరాలకు పాలకులు చెవి ఒగ్గాలి. లోపాలను సరిచేయాలి. వ్యవస్థలో సంస్కరణ ఒక్కరోజులో, ఒక్కసారిగా జరిగేది కాదని గుర్తించి, మార్పులు చేర్పులతో సాగాలి. అందుకిది మొదటి అడుగు అవ్వాలి. -
నల్ల కోటు... రాజకీయం!
కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ రాజ్యానికి మూలస్తంభాలు. ఇందులో న్యాయ వ్యవస్థ మిగిలిన రెండింటికంటే విశిష్టమైనది. ఎందుకంటే మొత్తం మూడు వ్యవస్థల పరిధులనూ, పరిమితులనూ నిర్ణయించగల, నిర్దేశించగల స్థానం ఆ ఒక్క వ్యవస్థకు మాత్రమే వుంది. ఇతర రెండు వ్యవస్థలతో పోలిస్తే ఇప్పటికీ న్యాయ వ్యవస్థపై ప్రజలకు కొద్దో గొప్పో విశ్వనీయత వుంది. దానికి విఘాతం కలిగించే పరిణామాలు అడపా దడపా చోటుచేసుకుంటున్న సంగతి కూడా కాదనలేనిది. 175 ఏళ్ల చరిత్ర కలిగిన కలకత్తా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి, ఆ పదవికి రాజీనామా ఇచ్చిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ వైనం అటువంటిదే. తన రాజకీయ రంగ ప్రవేశంపై జస్టిస్ గంగోపాధ్యాయ ఇచ్చిన సంజాయిషీ ఆశ్చర్యం కలిగిస్తుంది. అధికార పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ తనను రోజూ దుమ్మెత్తిపోయటం, అసభ్య పదజాలంతో దూషించటం ఆయన తట్టుకోలేకపోయారట. కనుక నల్లకోటు, న్యాయదండం విడిచిపెట్టి ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకోవటమే ఆయనకు పరిష్కారంగా తోచింది! అలా అసభ్య పదజాలంతో దూషించే నేతలకు చదువు సక్రమంగా లేదన్న జస్టిస్ గంగోపాధ్యాయ విమర్శలో నిజం వుండొచ్చు. కానీ ఆయన చదువుసంధ్యలూ, విజ్ఞతా ఏమయ్యాయి? తాను వెలువరించే తీర్పులకు పూలు తప్ప రాళ్లు పడవని ఎలా అనుకున్నారు? తృణమూల్ సర్కారుపై వచ్చిన అవినీతి ఆరోపణల విషయంలో జస్టిస్ గంగోపాధ్యాయ కఠినంగా వ్యవహరించారన్న పేరు వుంది. మొత్తం 14 ఉదంతాల్లో ఆయన సీబీఐ దర్యాప్తు జరపాలని ఆదేశించారు. అందులో ఉపాధ్యాయ నియామకాల కోసం పెద్దయెత్తున ముడుపులు చేతులు మారాయన్న స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్సెస్సీ) కేసు ప్రధానమైనది. ఆయన ఉత్తర్వుల కారణంగా 2022లో ఉన్నత విద్యాశాఖమంత్రిగా వున్న పార్థా ఛటర్జీతోపాటు దళారులు, డబ్బులిచ్చి ఉద్యో గాల్లోకొచ్చిన కొందరు టీచర్లు అరెస్టయ్యారు. నిజానికి ఆ కేసులో జస్టిస్ గంగోపాధ్యాయ ఇచ్చిన ఆదేశాలు ఆయనకు పేరుప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. అవినీతిపై నిప్పులు కక్కే యోధుడిగా, సీఎం పదవికి అన్నివిధాలా అర్హతగల వ్యక్తిగా లోక్‌సభ కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌధురి అప్పట్లో కీర్తించారు. వామపక్షాలు సైతం ఆయన తీర్పులను ప్రశంసించాయి. కానీ అవి జస్టిస్ గంగో పాధ్యాయ చెవికి సోకినట్టు లేదు. ‘న్యాయమూర్తులుగా తమ తీర్పులు నచ్చకపోతే విమర్శించవచ్చు, అప్పీల్‌కు పోవచ్చు. కానీ దూషిస్తారా?’ అని ఆయన ప్రశ్నించటం సబబే. కానీ ఆయన చేయాల్సిందేమిటి? దూషణలకు జవాబుగా ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకోవటమా? ఇందువల్ల ఆయనకుగానీ, మొత్తంగా వ్యవస్థకుగానీ విశ్వసనీయత పెరుగుతుందా? నిరుడు జస్టిస్ గంగో పాధ్యాయ తృణమూల్‌ను విమర్శిస్తూ స్థానిక చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ దాన్ని తీవ్రంగా తప్పుబట్టి మందలించినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. న్యాయమూర్తి పదవిలో వుంటూ రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేయటం జస్టిస్ గంగోపాధ్యాయతోనే మొదలు కాలేదు. 1967లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ కోకా సుబ్బారావుతోపాటు జస్టిస్ రంగనాథ్ మిశ్రా, జస్టిస్ బహరూల్ ఇస్లాం, జస్టిస్ ఫాతిమా, జస్టిస్ సదాశివం, జస్టిస్ రంజన్ గొగోయ్ వరకూ ఎందరో వున్నారు. జస్టిస్ బహరూల్ ఇస్లాం 1983లో అప్పటి బిహార్ పీసీసీ(ఐ) అధ్యక్షుడు జగన్నాథ్ మిశ్రాపై వచ్చిన ఫోర్జరీ, నేరపూరిత ప్రవర్తన ఆరోపణలనుంచి ఆయన్ను విముక్తి చేసిన నెల రోజులకే అస్సాంలో ఎంపీగా పోటీచేసే అవకాశం వచ్చింది. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. రిటైర్మెంట్ అనంతరం లా కమిషన్, మానవహక్కుల సంఘం, కంపెనీ లా బోర్డు, వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ వంటి సంస్థలకు నేతృత్వం వహించే అవకాశం ఎటూ వుంటుంది. అది కూడా సరికాదని అభ్యంతరం చెప్పేవారున్నారు. రాజీనామా చేసిన వెంటనే బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటించటం, అంతకు వారంరోజుల ముందు ఆ పార్టీ నేతలను సంప్రదించినట్టు చెప్పటం జస్టిస్ గంగోపాధ్యాయ విజ్ఞతపై సందేహాలు రేకెత్తిస్తుంది. ఈ వారంరోజుల్లో కేసులేమీ చూడలేదన్నంత మాత్రాన ఈ సందేహాలు సమసిపోవు. మిమ్మల్ని ముందుగా బీజేపీ నేతలే సంప్రదించారా అన్న ప్రశ్నకు ఆయన లౌక్యంగా ‘మేమిద్దరం ఒకరినొకరం సంప్రదించుకున్నాం’ అని చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ నీతివంతమైన పాలన గురించి ఎవరికీ భ్రమల్లేవు. నాలుగైదేళ్ల క్రితం ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే తమ పార్టీలో అవినీతి నేతలు మితిమీరుతున్నారనీ, వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాల్సి వుంటుందనీ హెచ్చరించిన సంగతి అందరికీ గుర్తుంది. ఇలాంటి పరిస్థితి వున్నది గనుకే జస్టిస్ గంగోపాధ్యాయ వెలువరించిన తీర్పులను అనేకులు ప్రశంసించారు. తన రాజకీయ రంగ ప్రవేశ నిర్ణయంతో ఆ తీర్పులపై సందేహాలు తలెత్తటానికి ఆయనే కార కులయ్యారు. బీజేపీ నేతలు స్వర్గీయ అరుణ్ జైట్లీ, ప్రస్తుత కేంద్రమంత్రి నితీన్ గడ్కరి వంటివారు పదవీ విరమణ తర్వాత జడ్జీలు ఏ పదవీ తీసుకోరాదని అభిప్రాయపడ్డారు. అసలు సీవీసీ పదవికున్నట్టే జడ్జీలకు సైతం రిటైరయ్యాక పదవులు చేపట్టరాదన్న ఆంక్షలుండాలని చాలామంది చెబుతారు. అలా కాకపోయినా కనీసం రెండేళ్లపాటు ఏ పదవీ తీసుకోకుండా వుండటం శ్రేయస్కరం. రాజకీయాలకు అతీతంగా న్యాయవ్యవస్థ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగల స్థితిలో వుందనే సంకేతం మన దేశ గౌరవాన్ని మరింత పెంచుతుందని అందరూ గుర్తించాలి. -
న్యాయ వ్యవస్థపై ఒత్తిడి పెంచేలా ఎల్లో గ్యాంగ్ నానాయాగీ
అవినీతి ఆరోపణలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఏసీబీ కోర్టు ఆదేశాలతో జైలుకు వెళ్లారు. ఇది కక్ష సాధింపు చర్య అంటూ టీడీపీ నేతలు, బాబు కుటుంబ సభ్యులు ఆందోళనలకు పిలుపునిస్తున్నారు. ప్రజల నుండి స్పందన లేకపోయినా.. అర కొరగా టీడీపీ కార్యకర్తలు.. బాబు కుటుంబ సభ్యులు తాము పిలుపు నిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఎల్లో బ్యాచ్ నిరసనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబును న్యాయవ్యవస్థ జైలుకు పంపింది. మరి బాబు కుటుంబం, టీడీపీ నేతలు న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారా? అని నిపుణులు నిలదీస్తున్నారు. 371 కోట్ల రూపాయల దోపిడీ జరిగిన స్కిల్ స్కాంలో చంద్రబాబు ఆధారాలతో సహా దొరికిపోయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. జీవితంలో ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా.. ఏనాడూ కోర్టు గుమ్మం కూడా ఎక్కకుండా స్టేలు తెచ్చుకుని తనపై అసలు విచారణలే జరక్కుండా చేసుకుంటూ చంద్రబాబు ఇన్నాళ్లూ కాలక్షేపం చేస్తూ వచ్చారు. అయితే స్కిల్ స్కాంలో మాత్రం ఆయనకు ఏసీబీ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీన్ని చంద్రబాబు నాయుడు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. తన అవినీతిపై ఎన్నో కేసులు ఉన్నా ఏ ఒక్క కేసులోనూ అరెస్ట్ కాకుండా తప్పించుకున్న తాను.. ఇపుడు జైలుకెళ్లాల్సి రావడం ఏంటి? అని ఆయన కుత కుతలాడిపోతున్నారు. చంద్రబాబు ఇలా జైలుకెళ్లి అలా బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చేస్తారని బాబు బంధువులు, టీడీపీ నేతలు అనుకున్నారు. అసలు అరెస్టే కారని అంతకు ముందు అనుకున్నారు. అయితే తమ అంచనాలు తప్పేయడంతో జైలుకెళ్లిన తర్వాత టీడీపీ నేతల్లో కొద్ది పాటి కంగారు మొదలైంది. న్యాయ విచారణలో చంద్రబాబు దోషిగా తేలితే తాను నిప్పు నిప్పు అని ఇంతకాలం అంటూ వస్తోన్న నినాదానికి కాలం చెల్లినట్లే అవుతుందని చంద్రబాబు ఆందోళన చెందుతోన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బాబు అరెస్ట్ పైనా.. ఆయన్ను జైలుకు పంపడంపైనా నానా యాగీ చేయాలని టీడీపీ నేతలు డిసైడ్ అయ్యారు స్కిల్ స్కాం కేసులోనూ తనపై విచారణ జరపకుండా కేసునే క్వాష్ చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్లు వేశారు. మరో వైపు ముందస్తు బెయిల్‌కూ పిటిషన్లు వేసుకున్నారు. బెయిల్ రాకపోవడంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకోవడంతో పాటు ప్రజల్లో పార్టీ ప్రతిష్ఠ మరింతగా మసకబారుతుందని భయపడ్డ టీడీపీ నాయకత్వం బాబు అరెస్ట్‌కు నిరసనగా ఆందోళనలకు పిలుపు నిచ్చింది. న్యాయానికి సంకెళ్లు పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిస్తే ప్రజల నుంచి స్పందన రాలేదు. అక్కడక్కడా పార్టీ శ్రేణులో కార్యక్రమం చేశామంటే చేశాం అన్నట్లు మమ అనిపించేశారు. అయితే ఈ నిరసనలు ఎవరిపైనా? అని న్యాయరంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ అండ్ కో నినాదాలు చేస్తోంది. అయితే చంద్రబాబు నాయుడి కేసులో మొత్తం దర్యాప్తు చేసి అక్కడ అవినీతి జరిగిందని కనిపెట్టింది కేంద్ర దర్యాప్తు సంస్థలే. ఆ తర్వాత దోపిడీకి సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సాక్ష్యాధారాలతో చంద్రబాబును జైలుకు పింపింది ఏసీబీ న్యాయస్థానం. ఇపుడు చంద్రబాబు తరపున ఆందోళనలు చేస్తోన్న వారు కేంద్ర దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారా? లేక ఆయన్ను జైలుకు పంపిన ఏసీబీ కోర్టు తీర్పుకు నిరసనగా ఆందోళనలు చేస్తున్నారా? అని వారు నిలదీస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ నేతలకు అనుమానాలు ఉన్నా కేంద్రంలోని బీజేపీని ఏమీ అనలేకపోతున్నారు. ఏసీబీ కోర్టు మెజిస్ట్రేట్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి దిగజారిన టీడీపీ నేతలు ఎవరిపై నిరసన వ్యక్తం చేయాలో అర్ధం కాక సతమతమవుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ కు వెనుక ఉన్నది కేంద్రంలోని బీజేపీయే అని చంద్రబాబుకు మద్దతు తెలిపిన సమాజ్ వాది పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు ఆరోపించాయి. అయిటే టీడీపీ మాత్రం కేంద్రంలోని బీజేపీ పేరు చెబితేనే భయపడిపోతోంది. ఎవ్వరినీ ఏమీ అనలేక ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్‌పై విష ప్రచారం చేస్తోందని పాలక పక్ష నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలంటే న్యాయ స్థానాలు బెయిల్ ఇవ్వాలి. న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఏంటో అర్థం కావడం లేదంటున్నారు మేథావులు. బాబును తక్షణమే విడుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం వల్ల కానీ.. టీడీపీ నేతలు, బాబు కుటుంబ సభ్యులు ఆందోళనల పేరిట అక్కడక్కడా హడావిళ్లు చేయడం వల్లకానీ చంద్రబాబు నాయుడు విడుదల అయ్యే అవకాశాలు లేనే లేవంటున్నారు న్యాయ రంగ నిపుణులు. బాబు విడుదల కోసం ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తోంది టీడీపీ. న్యాయస్థానాలే చంద్రబాబు విషయంలో నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఉందని పదే పదే చెప్పుకునే చంద్రబాబుకీ ఈ విషయం తెలుసు. కాకపోతే ఏమీ తెలీనట్లు ఆయన డ్రామాలు చేయిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. -సీఎన్ఎస్ యాజులు, సీనియర్ జర్నలిస్టు -
లింగ, మతప్రమేయం లేని... ఉమ్మడి చట్టాలు చేయొచ్చా?
న్యూఢిల్లీ: శాసన వ్యవస్థ పరిధిలోని అంశాలపై న్యాయ వ్యవస్థ జోక్యంపై సుప్రీంకోర్టు సోమవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. పెళ్లిళ్లు, విడాకులు, మనోవర్తి, వారసత్వం వంటి అంశాల్లో లింగ, మతప్రమేయం లేకుండా పౌరులందరికీ సమానంగా వర్తించేలా ఉమ్మడి చట్టాలు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పి.ఎస్.నరసింహ, జె.బి.పార్డీవాలా ధర్మాసనం విచారణ జరిపింది. ‘‘వీటిపై శాసన వ్యవస్థకు కోర్టులు సలహాలు, సూచనలు ఇవ్వొచ్చా? ఈ మేరకు కేంద్రానికి నిర్దేశాలు జారీ చేయొచ్చా?’’ అంటూ సందేహాలు లేవనెత్తింది. శాసన వ్యవస్థ పరిధిలోని ఈ అంశాలపై న్యాయ జోక్యం ఏ మేరకు ఉండొచ్చన్నదే ఇక్కడ కీలక ప్రశ్న అని అభిప్రాయపడింది. ఇలాంటి అంశాల్లో ఉమ్మడి చట్టాలకు అభ్యంతరం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. విచారణను ధర్మాసనం నాలు గు వారాల పాటు వాయిదా వేసింది. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించాలో, వద్దో అప్పుడు తేలుస్తామని పేర్కొంది. ‘అందరికీ ఒకే వివాహ వయసు’ పిటిషన్ కొట్టివేత స్త్రీ, పురుషులందరికీ చట్టబద్ధంగా ఒకే కనీస వివాహ వయసుండేలా చట్టం తేవాలంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం కొట్టేసింది. ‘ఇది పార్లమెంటు పరిధిలోని అంశం. దానిపై మేం చట్టం చేయలేం. రాజ్యాంగానికి మేం మాత్రమే ఏకైక పరిరక్షకులం కాదు. పార్లమెంటు కూడా ఆ భారం వహిస్తోంది’ అని అభిప్రాయపడింది. కనీస వివాహ వయసు పురుషులకు 21 ఏళ్లు, మహిళలకు 18 ఏళ్లు. -
కొలీజియం కాక.. కేంద్రం, న్యాయ వ్యవస్థ మధ్య ముదురుతున్న వివాదం
సుప్రీంకోర్టు కొలీజియం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ నడుమ వివాదంగా మారిన అంశం. కొలీజియం వ్యవస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకం, బదిలీల్లో తమ పాత్ర లేకపోవడం ఏమిటంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కొలీజియం వ్యవస్థే రాజ్యాంగ విరుద్ధమంటూ పలువురు కేంద్ర మంత్రులు బాహాటంగా గళం విప్పుతున్నారు. కొలీజియం సభ్యులేమో సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకానికి తాము సిపార్సులు మాత్రమే చేస్తామని, తుది నిర్ణయం కేంద్రానిదేనని అంటున్నారు. ఏమిటీ కొలీజియం...? సుప్రీంకోర్టు న్యాయమూర్తుతో పాటు దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల నియామకం, బదిలీలను సిఫార్సు చేయడానికి ఉద్దేశించినదే కొలీజియం వ్యవస్థ. సుప్రీంకోర్టు కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తి, మరో నలుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. న్యాయమూర్తుల నియామకం, బదిలీల విషయంలో కొలీజియంలో భిన్నాభిప్రాయాలు ఉంటే మెజార్టీ సభ్యులదే తుది నిర్ణయం. అయితే ప్రధాన న్యాయమూర్తిని తప్పనిసరిగా సంప్రదించి, ఆయన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కొలీజియం తన సిఫార్సులను కేంద్రానికి పంపుతుంది. ఇక హైకోర్టు కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తి, ఇద్దరు సీనియర్ మోస్ట్ న్యాయమూర్తులు సభ్యులు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు పంపుతుంది. ముఖ్యమంత్రి వాటిని కేంద్ర న్యాయ శాఖ మంత్రికి పంపిస్తారు. వాస్తవానికి రాజ్యాంగంలో కొలీజియం ప్రస్తావన లేదు. కొలీజియం చేసే సిఫార్సులపై కేంద్రం తన విచక్షణ మేరకు నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఒకే పేరును కొలీజియం రెండోసారి సిఫార్సు చేస్తే కేంద్రం ఆమోదించాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలో తీర్పు వెలువరించింది. రాజ్యాంగం ఏం చెబుతోంది? రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిలను రాష్ట్రపతి నియమించాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే సీజేఐ మినహా మిగతా నియామకాల్లో సీజేఐ అభిప్రాయం తెలుసుకోవాలి. ఆర్టికల్ 217 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో సీజేఐ, గవర్నర్, హైకోర్టు సీజేలను సంప్రదించాలి. ఏమిటీ వివాదం? 1950 నుంచి 1973 వరకూ కేంద్రం, సీజేఐ కలిసి చర్చించుకుని ఏకాభిప్రాయంతో న్యాయమూర్తులను నియమించే విధానముండేది. సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిని సీజేఐగా నియమించడం ఆనవాయితీగా కొనసాగింది. 1973లో మాత్రం ముగ్గురు సీనియర్లను పక్కన పెట్టి జస్టిస్ ఎ.ఎన్.రేను సీజేఐగా అప్పటి ప్రభుత్వం నియమించింది. తర్వాత మరో సీజేఐ నియామకంలోనూ ఇలాగే జరగడం కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య వివాదానికి దారితీసింది. న్యాయమూర్తుల నియామకంలో కార్యనిర్వాహక వ్యవస్థ కంటే న్యాయ వ్యవస్థకే ఎక్కువ అధికారాలుంటాయని ఫస్ట్ జడ్జెస్ కేసు (1981), సెకండ్ జడ్జెస్ కేసు (1993), థర్డ్ జడ్జెస్ కేసు (1998)ల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎలా ఏర్పాటైంది? పార్లమెంట్ చట్టంగానీ, రాజ్యాంగ విధివిధానాలు గానీ లేకుండానే మన దేశంలో 1993లో కొలీజియం వ్యవస్థ మొదలైంది. న్యాయమూర్తుల నియామకంలో ఆర్టికల్ 124(2)లో ఉన్న ‘సంప్రదింపుల అనంతరం’ అర్థాన్ని ‘సమ్మతించిన తర్వాత’గా మారుస్తూ తొమ్మిది మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. తద్వారా న్యాయమూర్తుల నియామకం, బదిలీల అధికారం సీజేఐ నేతృత్వంలోని వ్యవస్థ అయిన కొలీజియానికి దక్కింది. ప్రత్యామ్నాయముందా? కొలీజియంకు ప్రత్యామ్నాయంగా నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్(ఎన్‌జేఏసీ)ని కేంద్రం తెరపైకి తెచ్చింది. ఇది స్వతంత్ర కమిషన్.దీనికి సీజేఐ చైర్‌పర్సన్‌గా ఉంటారు. మరో ఇద్దరు అత్యంత సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర న్యాయ మంత్రి ఎక్స్–ఆఫీషియో సభ్యులుగా ఉంటారు. పౌర సమాజం నుంచి ఇద్దరు ప్రముఖులను సభ్యులుగా సీజేఐ, ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ నామినేట్ చేయాలి. ఈ ఇద్దరిలో కనీసం ఒకరు ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/మైనార్టీ లేదా మహిళ అయి ఉండాలి. రాజ్యాంగ (99వ సవరణ) చట్టం–2014, నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్స్‌మెంట్ కమిషన్ చట్టం (2014) ద్వారా ఎన్ఏజేసీని కేంద్రం ప్రతిపాదించింది. సంబంధిత బిల్లులు 2014లోనే పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందాయి. కానీ ఈ బిల్లుల రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్‌జేఏసీని కోర్టు కొట్టేసింది. అయితే న్యాయమూర్తుల ఎంపికకు కొలీజియం స్థానంలో కేంద్రం మరో వ్యవస్థను తీసుకొస్తే అభ్యంతరం లేదని ఇటీవలే స్పష్టం చేసింది. కొలీజియంలో ప్రభుత్వ నామినీలు సీజేఐకి కేంద్ర న్యాయ మంత్రి రిజిజు లేఖ న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో చీఫ్ జస్టిస్‌లు, జడ్జిలను నియమించే కొలీజియం వ్యవస్థలో ప్రభుత్వం నామినేట్ చేసేవారికి సైతం చోటుండాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు పునరుద్ఘాటించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు ఆయన తాజాగా లేఖ రాశారు. ‘‘జడ్జిల నియామకంలో పారదర్శకత, జవాబుదారీతనం గురించి ప్రజలకు తెలియజేయడం అవసరం. అందుకే న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలి’’ అని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. కొలీజియం వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమని కిరణ్ రిజిజు ఇటీవల విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడానికి కొలీజియమే కారణమని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీజేఐకి ఆయన లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. న్యాయ వ్యవస్థకు విషగుళిక: జైరామ్ రమేశ్ న్యాయ వ్యవస్థను పూర్తిగా ఆక్రమించుకొనేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ సోమవారం ఆక్షేపించారు. న్యాయ వ్యవస్థను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. సీజేఐకి రిజిజు లేఖను తప్పు పట్టారు. మంత్రి సూచన న్యాయ వ్యవస్థకు విషగుళిక అన్నారు. అయితే కొలీజియంలో సంస్కరణలు అవసరమేనని జైరాం అభిప్రాయపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జడ్జీల నియామకం ప్రభుత్వ హక్కు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థ పట్ల ప్రభుత్వ అసహనం మరోసారి తేటతెల్లమయ్యింది. కొలీజియం విషయంలో ఇప్పటికే ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ రెండు వర్గాలుగా విడిపోయాయి. ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకంలో ప్రభుత్వం పాత్ర పరిమితంగానే ఉండడం ఏమిటని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన గురువారం రాజ్యసభలో మాట్లాడారు. కోర్టుల్లో పెండింగ్ కేసుల విషయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానామిచ్చారు. ఆయన ఏం చెప్పారంటే.. పెండింగ్ కేసులు ఆందోళనకరం ‘దేశవ్యాప్తంగా కోర్టుల్లో ఐదు కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో ఉండడం ఆందోళకరం. ఇందుకు ప్రధాన కారణం కోర్టుల్లో జడ్జి పోస్టులు ఖాళీగా ఉండడం. పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. కానీ, జడ్జి పోస్టుల భర్తీలో ప్రభుత్వం పాత్ర పరిమితమే. నియమించాల్సిన జడ్జీల పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన కొలీజియమే ప్రతిపాదిస్తుంది. అందులో ప్రభుత్వానికి ఎలాంటి హక్కు ఉండదు. మార్పులు చేయకపోతే.. న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు దేశ వైవిధ్యాన్ని, నాణ్యతను ప్రతిబింబించే పేర్లను ప్రతిపాదించాలని కొలీజియంకు ప్రభుత్వం తరచుగా విజ్ఞప్తి చేస్తూనే ఉంది. కానీ, ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవస్థ పార్లమెంట్, దేశ ప్రజల సెంటిమెంట్‌ను ప్రతిబింబించడం లేదు. ఎక్కువ మాట్లాడితే న్యాయ వ్యవస్థలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. అందుకే ఎక్కువ మాట్లాడడం నాకు ఇష్టం లేదు. రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం చూస్తే కోర్టుల్లో జడ్జీలను నియమించడం ప్రభుత్వ హక్కు. కానీ, 1993 తర్వాత ఈ పరిస్థితిని మార్చేశారు. జడ్జిల అపాయింట్మెంట్లలో ప్రభుత్వానికి భాగస్వామ్యం కల్పిస్తూ 2014లో నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్(ఎన్‌జేఏసీ) చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని 2015లో సుప్రీంకోర్టు రద్దు చేసింది. జడ్జిలను నియమించే ప్రక్రియలో మార్పులు చేయకపోతే ఉన్నత న్యాయస్థానాల్లో ఖాళీల సమస్య తలెత్తూనే ఉంటుంది’ అని రిజిజు తేల్చిచెప్పారు. కొలీజియం అనేది దేశ ప్రజలు కోరుకుంటున్న వ్యవస్థ కాదని ఆయన కొన్ని వారాలుగా గట్టిగా వాదిస్తున్న సంగతి తెలిసిందే. కొలీజియంకు వ్యతిరేకంగా పలువురు ప్రస్తుత, మాజీ కేంద్ర మంత్రులు గళం విప్పుతున్నారు. కానీ, కొలీజియం వ్యవస్థను పట్టాలు తప్పించేలా ఎవరూ మాట్లాడొద్దని సుప్రీంకోర్టు ఇటీవలే హెచ్చరించింది. 20 పేర్లను పునఃపరిశీలించండి కొలీజియంకు తిప్పి పంపిన కేంద్ర ప్రభుత్వం హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన 20 పేర్లను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపించింది. ఆ 20 పేర్లను మరోసారి పరిశీలించాలని కోరింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ 9వ తేదీ నాటికి హైకోర్టుల్లో 331 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. మొత్తం శాంక్షన్డ్ పోస్టులు 1,108 కాగా, 25 హైకోర్టుల్లో ప్రస్తుతం 777 మంది జడ్జీలు ఉన్నారని తెలిపారు. 30 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. పోస్టుల భర్తీ కోసం పలు హైకోర్టుల నుంచి అందిన 147 ప్రతిపాదనలు ప్రస్తుతం ప్రభుత్వం, సుప్రీంకోర్టు కొలీజియం మధ్య వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ 9 నాటికి వివిధ హైకోర్టుల్లో రికార్డు స్థాయిలో 165 మంది జడ్జిలను నియమించినట్లు కిరణ్ రిజిజు వివరించారు. ఒక సంవత్సరంలో ఇంతమందిని నియమించడం ఒక రికార్డు అని పేర్కొన్నారు. -
సముచిత న్యాయానికి...
నిత్య జీవనంలో న్యాయపరమైన సమస్య ఏదైనా వస్తే తమ దగ్గరి వాళ్లకి చెప్పుకొని, ఉపశమనం పొందుతుంటారు. అన్యాయం చేసినవారిని తిట్టుకుంటూ విలువైన సమయాన్ని, డబ్బును పోగొట్టుకుంటుంటారు. కానీ, న్యాయవ్యవస్థను సంప్రదించాలంటే మాత్రం భయపడతారు. లాయర్లకు బోలెడంత డబ్బు ఫీజుగా ఇచ్చుకోలేమనో, కోర్టు చుట్టూ తిరగలేమనో అనుకుంటారు. నేడు అంటే నవంబర్ 9న నేషనల్ లీగల్ సర్వీస్ డే. ఈ సందర్భంగా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో ఉచితంగా న్యాయం పొందగలిగే విధానాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడం అవసరం. పూర్ణకు పెళ్లయ్యి ఏడాదిన్నర అవుతోంది. ఆర్నెల్లుగా పుట్టింట్లోనే ఉంటోంది. తండ్రి కట్నంగా ఇస్తానన్న డబ్బు తీసుకునే ఇంటికి రావాలని అత్తింట్లో షరతు పెట్టారు, కూలి పనులు చేసే తండ్రి అంత డబ్బు ఇచ్చుకోలేడు. తనకు న్యాయం జరిగేదెలాగో పూర్ణకు తెలియడం లేదు. నీతు ఇంజనీరింగ్ చదువుతోంది. నెల రోజులుగా తెలియని వారు తన గురించి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తూ మానసికంగా వేధిస్తున్నారు. ఇంట్లో పెద్దలకు చెబితే తననే తప్పు పడతారేమో, పోలీసులను సంప్రదిస్తే ఇంటి పరువు పోతుందేమో అని భయం. ఎవరి నుంచి ఎలాంటి సాయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. ‘ప్రతి మనిషికి న్యాయపరమైన అవసరం ప్రతి దశలోనూ ఉంటుంది. అందుకు ముందుగా పోలీసులు సంప్రదించలేకపోవచ్చు. కానీ, న్యాయపరమైన సలహా తీసుకుంటే మాత్రం సరైన పరిష్కారం లభిస్తుంది’ అంటారు అడ్వకేట్ రాజేశ్వరి. ‘పెద్ద పెద్ద నేరాలు జరిగితే తప్ప అలాంటి చోటుకి మనకేం పని అన్నట్టుగా చాలా మంది ఆలోచిస్తారు. అంతేకాదు, న్యాయం పొందాలంటే చేతిలో దండిగా డబ్బు ఉండాలని కూడా భావిస్తారు. అయితే అవన్నీ పొరపాటు భావనలేనని, ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్‌కి వెళ్లినట్టే ఏదైనా న్యాయపరమైన అవసరం ఏర్పడితే లీగల్ సర్వీస్ సెల్‌ని సంప్రదించవచ్చు’ అనేది న్యాయ నిపుణుల మాట. ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టడానికి అన్ని అర్హతలు ఉండి, బ్యాంకు లోన్‌కు నిరాకరించినా అందుకు తగిన న్యాయ సలహా తీసుకోవడం అవసరం. వినియోగదారుడు ఏదైనా వస్తువును కొని మోసపోయినా అందుకు సంబంధించిన న్యాయం పొందడానికి అవగాహన తప్పనిసరి. గ్రామాల్లో పది మంది మహిళా సంఘ సభ్యులు కలిసి ఏదైనా కార్యక్రమం చేపట్టాలన్నా న్యాయపరమైన అవసరం ఉంటుంది. మన నిత్యజీవితంలో ప్రతి చిన్న విషయానికి ‘న్యాయం’అవసరం గుర్తించాలి. అంతేకాదు ప్రతీ చిన్న విషయానికి డబ్బు చెల్లిస్తేనే న్యాయం పొందుతామనే ఆలోచనను దూరం పెట్టాలి. సరైన పరిష్కారానికి.. సమస్య వచ్చినప్పుడు స్థానికంగా మండల లేదా జిల్లా లేదా రాష్ట్ర స్థాయిల్లో ఉన్న లీగల్ సర్వీస్ అథారిటీని సంప్రదించి, సలహా తీసుకోవచ్చు. లీగల్ సర్వీస్ అథారిటీ ప్యానెల్లో సివిల్, క్రిమినల్.. ఇలా ఒక్కో విభాగానికి ఒక్కో లాయర్ ఉంటారు. రాష్ట్రస్థాయి లీగల్ ప్యానెల్లో హైకోర్టు జడ్జి కూడా ఉంటారు. వీరిలో ఎవరిని సంప్రదించినా పరిష్కారం ఎక్కడ లభిస్తుందో అందుకు సంబంధించిన సమాచారం తప్పక తెలుస్తుంది. ఏ కేసులు ఎంత వరకు పరిష్కారం అవుతున్నాయనే విషయంలోనూ ఈ సెల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటుంది. వీటితోపాటు మధ్యవర్తిగా సమస్యలను పరిష్కరించే లోక్ అదాలత్ అనే మీడియేషన్ టెక్నిక్ కూడా అందుబాటులో ఉంది. మహిళలు.. పిల్లలు అత్యాచారం, కిడ్నాప్, వరకట్న వేధింపులు, మానసిక–శారీరక హింస, లైంగిక వేధింపులు మొదలైన వాటి నుంచి మహిళలు న్యాయ పొందడానికి లీగల్ సర్వీస్ సెల్‌ను ఆశ్రయించవచ్చు. అంతేకాదు సైబర్ బుల్లీయింగ్, మహిళా సాధికారతకు అవరోధం కలిగించే అంశాలేవైనా న్యాయపరమైన సలహా తీసుకోవచ్చు. కాలేజీలు.. పాఠశాలలు ఇటీవల యువతలో బాగా వినిపిస్తున్న మాట మాదకద్రవ్యాల వినియోగం. కాలేజీల్లో లీగల్ అడ్వైజ్ సెషన్స్ ఏర్పాటు చేయడానికి యాజమాన్యాలు ముందుకు రావాలి. లీగల్ సర్వీస్ అథారిటీ కూడా లీగల్ అవేర్నెస్ కార్యక్రమాలను చేపడుతుంది. వీటికి హాజరై అందుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. పారా లీగల్ వాలెంటీర్లు వీళ్లు పూర్తిస్థాయి లాయర్లు కాదు. న్యాయ సమాచారం తెలుసుకుని, జనాలకు స్వచ్ఛందంగా అందిస్తుంటారు. జనాల మధ్యన తిరుగుతూ, ఎవరికైనా న్యాయపరమైన సాయం చేసేవారుంటారు. ఎవరైనా ఆసక్తి గలవారు ‘న్యాయం’ కు సంబంధించిన సమాచారం తెలుసుకొని, ప్రజలకు స్వచ్ఛందంగా అవగాహన కలిగించవచ్చు. ఇది కూడా సామాజిక సేవలో భాగమే అవుతుంది. – నిర్మలారెడ్డి ఉచితంగా న్యాయ సేవ పేద పౌరుల కేటగిరీ కిందకు వచ్చే ప్రతి ఒక్కరూ ఉచిత న్యాయ సేవలను అందుకోవడానికి అర్హులు. 9–9–1995 నుంచి లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 అమల్లోకి వచ్చింది. ఇందులో అర్హులైన వ్యక్తులు తమ తరపున కేసులను దాఖలు చేయడానికి లేదా ఏదైనా కోర్టులో తమకు వ్యతిరేకంగా దాఖలైన కేసులలో తమను తాము రక్షించుకోవడానికి న్యాయ సేవలను ఉచితంగా పొందవచ్చు. ఉచిత న్యాయ సహాయం గురించి, దీనితోపాటు లీగల్ సర్వీసెస్ అథారిటీలు అందించే అనేక సేవలను ప్రజలకు తెలియజేయడానికి ప్రతియేటా ప్రచారాలు నిర్వహిస్తారు. చట్టపరమైన సహాయం కోరుకునే వ్యక్తి న్యాయ సేవల కోసం ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లోనూ సంప్రదించవచ్చు. అవగాహన తప్పనిసరి ఈ నవంబర్ నెల అంతా స్కూల్స్, కాలేజీల్లో న్యాయ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. చదువుకునే విద్యార్థులకు న్యాయవ్యవస్థకు సంబంధించిన ప్రాథమికాంశాల పట్ల అవగాహన ఉండాలనేది మా థీమ్. అమ్మాయిలకైతే శారీరక, మానసిక, లైంగిక హింసలు, గృహహింస, ఆస్తి హక్కుల గురించిన పూర్తి సమాచారం తెలిసుండాలి. వీటికి సంబంధించిన విషయాల మీద లీగల్ సర్వీస్ అథారిటీ కూడా మండల, గ్రామ, జిల్లా స్థాయిల్లోనూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తుంటుంది. – రాజేశ్వరి, అడ్వకేట్ -
ట్రయలనే శిక్ష ఏపాటిది?
అఖిల భారత జిల్లా న్యాయ సేవల అథారిటీస్ ప్రథమ సమావేశంలో భారత ప్రధాని మాట్లాడుతూ చాలామంది విచారణలో ఉన్న ఖైదీలు జైళ్లలో మగ్గిపోవడం గురించి ఆందోళన వెలి బుచ్చారు. వారి విడుదల కోసం న్యాయ సేవల అధికార సంస్థలు కృషి చేయాలని అన్నారు. న్యాయం వారికి సులభంగా అందుబాటులోకి రావాలనీ, అలా వస్తే వాళ్ల జీవించే హక్కు కుదుటపడుతుందనీ ప్రధాని అన్నారు. తీవ్రమైన నేరాలు చేయని వ్యక్తులూ, ఇదివరకే 1/3 వంతు శిక్షా కాలాన్ని అనుభవించినవాళ్లూ జెలు నుంచి బయటకు రావడానికి వారిపైన ఉన్న కేసులను రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆగస్టు 5వ తేదీన ప్రభుత్వానికి సూచించింది. అంతకుముందు జూలై 11వ తేదీన సుప్రీంకోర్టు కొత్తగా బెయిల్ చట్టం తీసుకొని రావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. కాగ్నిజబుల్ నేరం చేయని ఎంతోమంది వ్యక్తులు జైళ్ళలో ఉన్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అరెస్టు చేయడం అనేది చాలా క్రూరమైన చట్టమనీ, వ్యక్తి స్వేచ్ఛ దానివల్ల పోతుందనీ, అందుకని అత్యవసరమై నప్పుడు మాత్రమే ఈ అరెస్టులను చేయాలనీ సుప్రీంకోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించింది. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో 2020లో ప్రకటించిన వివరాల ప్రకారం 4,88,551 మంది జైళ్లలో బెయిల్ రాక ఉండి పోయారు. విచారణలో ఉన్న ఖైదీల సంఖ్య తగ్గించడం కోసం పోలీస్ కమి షన్, సుప్రీంకోర్టు అనేక సూచనలు చేసినప్పటికీ ఫలితం లేదు. అరెస్టు చేసే అధికారం ఉందని అరెస్టు చేయడం తగదనీ, అరెస్టు చేయడానికి న్యాయబద్ధత ఉండాలనీ జోగిందర్ కుమార్ కేసు(1994)లో సుప్రీంకోర్టు చెప్పింది. అయినా పోలీసుల పని విధానంలో మార్పు రాలేదు. అరెస్టులను తగ్గించాలని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో 41వ నిబంధనకు మార్పులను (2009) తీసుకొని వచ్చారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ మార్పులు చేసిన నిబంధన పోలీసులకు విశేష అధికారా లను కల్పించింది. ఈ అధికార నియంత్రణ కోసం ఆర్నేష్ కుమార్ కేసులో కొన్ని మార్గదర్శకాలను కోర్టు ఏర్పరిచింది. కానీ ఆ మార్గదర్శకాలను అమలు చేసే మేజిస్ట్రేట్లు ఎంతమంది మన దేశంలో ఉన్నారు? రాజద్రోహ నేరం పేరుతో దేశంలో ఎన్నో అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. హాని కలిగించని ట్వీట్లు చేసిన జర్నలిస్టు మహమ్మద్ జుబేర్‌ని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మధ్యే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అవమానకరమైన ట్వీట్ చేశాడన్న ఆరోపణ మీద ఓ నటుడు నెల రోజులపాటు జైల్లో ఉన్నాడు. ఆయన ఎవరి గురించి అయితే ఆ ట్వీట్ చేశాడో ఆ నాయకుడు ఆ ట్వీట్‌ని పట్టించుకోలేదు. బర్షశ్రీ బురగొహెయిన్ అనే స్టూడెంట్ ఏదో కవిత రాసినందుకు రెండు నెలలు జైల్లో ఉండిపోయింది. మన జైళ్లలో కూడా చాలా దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయి. సుఖేష్ చంద్రశేఖర్ అనే విచారణలో ఉన్న ఖైదీకి సకల సౌకర్యాలు జైల్లో లభిస్తాయి. స్టాన్‌స్వామి అనే ఖైదీ ఒక రూపాయి విలువ చేసే ‘స్ట్రా’ కోసం విలవిల లాడాల్సి వచ్చింది. ఇట్లా ఎన్నో ఉదాహరణలను చెప్పవచ్చు. 2018లో అరెస్టయిన ప్రముఖ కవికి సుప్రీంకోర్టు ఇటీవల మెడికల్ గ్రౌండ్స్ మీద బెయిల్ మంజూరు చేసింది. ఆయనకి 82 సంవత్సరాలు ఉన్నాయనీ, కస్టడీ విచారణ 2018లో జరిగిందనీ, ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలైనా కూడా విచారణ ఇంకా మొదలు కాలేదన్న కారణంగా బెయిల్ మంజూరు చేసినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చాయి. అరెస్టు విషయంలో ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను, మేజిస్ట్రేట్స్ కఠినంగా అమలు చేస్తే ఈ అరెస్టులకు అడ్డుకట్ట ఏర్పడుతుంది. అదే విధంగా రిమాండ్ చేసేటప్పుడు గుడ్డిగా కాకుండా జాగ్రత్తగా రిమాండ్ చేస్తే కూడా ఈ నిర్బంధాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ‘జైలు కాదు బెయిల్’ అన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యానం స్లోగన్ మాదిరిగా మారడం శోచనీయం. నేర నిరూపణ జరిగేవరకు ముద్దాయిని అమాయకుడిగా పరిగణించాలన్న నియమం కాస్త అమాయకుడిగా నిరూపణ అయ్యేంతవరకూ నేరస్థుడు అన్న చందంగా మారడం ఓ విషాదం. రిమాండ్ విషయంలో, అదే విధంగా బెయిల్ మంజూరు చేసే విషయంలో కోర్టులు న్యాయబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సీరియస్ నేరాలను, మామూలు నేరాలను వేరువేరుగా చూసే దృష్టి అలవర్చుకోవాలి. ఈ గందరగోళ పరిస్థితి నుంచి బయటపడటానికి క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లోని అన్ని వ్యవస్థలూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. న్యాయమూర్తుల పాత్ర గురించి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన మదన్ బి. లోకూర్ మాటలను ఇక్కడ ఉదహరించాలి. ‘‘అరెస్టు విషయంలో ట్రయల్ కోర్టు న్యాయమూర్తులు పోలీసుల రబ్బర్ స్టాంపు మాదిరిగా వ్యవహరించకూడదు. మీ మనస్సుతో చూడండి. ఓ నా ప్రియమైన న్యాయమూర్తులారా! స్వేచ్ఛ అనేది అత్యంత విలువైనది. అది ఎవరూ కోల్పోకూడదు. దేశ పౌరుల రాజ్యాంగ హక్కులవైపు మీరు నిలబడండి. నాకు తెలుసు. మిమ్మల్ని రాత్రికి రాత్రి బదిలీ చేస్తారన్న భయం కూడా ఉంటుంది. నిద్రలేని రాత్రులు మీకు ఏర్పడవచ్చు. మంచి రోజులు ఏదో ఒక రోజు వస్తాయి. అంతలోపు సంవత్సరాల తరబడి విచారణలో ఉన్న ఖైదీల వైపు చూడండి. అమాయకులు జైళ్లలో ఉండి పోకుండా చూడండి. ఇది సరైనదేనా? వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి గురించి ఆలో చించండి. ఇది న్యాయమా? అన్యాయమా? ఆలోచించండి. ఇది కష్టమైన ప్రశ్న కాదు.’’ (క్లిక్: రోజురోజుకూ పెరుగుతున్న వ్యత్యాసాలు) ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయ శాఖా మంత్రి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందరూ విచారణలో ఉన్న ఖైదీల గురించి ఆందోళనల వ్యక్తపరుస్తున్నారు. ఈ ఆందోళనలను తగ్గించే అవకాశం ఉన్న వ్యక్తులు ట్రయల్ కోర్టు న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించే బాధ్యత వారిమీద లేదా? ‘విచారణలో ఉన్న ఖైదీనా, విచారణే అవసరం లేని ఖైదీనా’ తెలియజెప్పమని విచారణలో ఉన్న ఖైదీలు కోరకుండా చూసు కోవాల్సిన బాధ్యత న్యాయమూర్తుల మీదే ఉంది. (క్లిక్: గొంతు చించుకొని అడగాల్సిందే!) - మంగారి రాజేందర్ మాజీ జిల్లా జడ్జి -
సత్వర న్యాయమే లక్ష్యం: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, అమరావతి: దేశంలోని న్యాయ స్థానాల్లో ఎన్నో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అవకాశం ఉన్నంత వరకు ప్రజలకు తక్కువ సమయంలో న్యాయం అందేలా న్యాయవాదులు పని చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతే ప్రజాస్వామ్యం మనుగడ కష్టమని, ఆ పరిస్థితి తలెత్తకుండా న్యాయ వ్యవస్థ వనిచేసేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. శనివారం ఆయన విజయవాడ సిటీ సివిల్ కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన బహుళ కోర్టు సముదాయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కలిసి ప్రారంభించారు. ‘ముఖ్యమంత్రి తెలుగులో మాట్లాడటం శుభపరిణామం.. అందువల్ల నేను కూడా తెలుగులో మాట్లాడటమే సముచితం’ అంటూ సీజేఐ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. 2013 మే 11న ఈ భవనానికి శంకుస్థాపన చేసినప్పటికీ.. రాష్ట్ర విభజన, ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిర్మాణం పూర్తవ్వడానికి ఆలస్యమైందన్నారు. అయితే మళ్లీ తన చేతుల మీదుగానే ఈ భవనం ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలపై అదనపు భారం పడకుండా న్యాయ వ్యవస్థకు ప్రత్యేక నిధులు ఇవ్వాలన్న తన ప్రతిపాదనలకు కేంద్రం అంగీకరించకపోయినా.. ఆంధ్రప్రదేశ్, బెంగాల్, తమిళనాడు ముఖ్యమంత్రులు మద్దతుగా నిలిచారని అభినందించారు. విజయవాడతో, బెజవాడ బార్ అసోíసియేషన్‌తో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. విజయవాడ సిటీ సివిల్ కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన బహుళ కోర్టు సముదాయాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు న్యాయమూర్తుల నియామకాల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం సమాజంలో మార్పు కోసం అపార అనుభవం గల సీనియర్ న్యాయవాదులు జూనియర్లకు అన్ని అంశాలపై శిక్షణ ఇవ్వాలని జస్టిస్ ఎన్వీ రమణ కోరారు. ఈ సందర్భంగా తన ఉన్నతికి, తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడి పోయిందని, అందరూ కష్టపడి పనిచేసి, రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం కూడా అవసరమైన నిధులు ఇచ్చి రాష్ట్రానికి సహకరించాలని కోరారు. తన పదవీ కాలంలో 240 మంది హైకోర్టు న్యాయమూర్తులను, 15 మంది ప్రధాన న్యాయమూర్తులను నియమించానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కూడా హైకోర్టు న్యాయ మూర్తులను నియమించామని గుర్తు చేశారు. ఈ నియామకాల్లో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామన్నారు. రూ.55 కోట్ల అంచనాతో మొదలైన విజయవాడ సిటీ సివిల్ కోర్టు భవన సముదాయం ప్రస్తుతం రూ.100 కోట్లు దాటిందని, ఏపీ ప్రభుత్వ సహకారంతో పనులు పూర్తి చేశామన్నారు. ఈ భవన నిర్మాణం కోసం కృషి చేసిన బెజవాడ బార్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులకు, పెద్దలరికీ ఆయన అభినందనలు తెలిపారు. విశాఖలో పెండింగ్‌లో ఉన్న కోర్టు సముదాయ భవన నిర్మాణానికి సీఎం సహకారం అందించాలని సీజేఐ కోరారు. భవన సముదాయంలో ఓ విభాగాన్ని ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఇది అరుదైన ఘట్టం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడ కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి 2013లో జస్టిస్ ఎన్వీ రమణ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిందని, ఇప్పుడు అదే భవన సముదాయాన్ని ఆయనే ప్రారంభించడం అరుదైన ఘట్టమని సీఎం వైఎస్ జగన్ అన్నారు. జ్యూడీషియరీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. విజయవాడలో అధునాతన భవనంలో కోర్టులు ఏర్పాటవ్వడం ఆనందంగా ఉందన్నారు. బహుళ అంతస్తుల భవనాలలో కోర్టు హాల్స్ ఏర్పాటుతో కేసుల విచారణలో వేగం పెరుగుతుందని, పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కారం అవుతాయని చెప్పారు. ఈ కోర్టుల భవన నిర్మాణానికి సహకరించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. నూతన కోర్టు భవన సముదాయాన్ని పరిశీలిస్తున్న సీజేఐ, హైకోర్టు సీజే, సీఎం ఇదిలా ఉండగా, కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయిన సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్‌ను సన్మానించాలని సభ్యులు చేసిన అభ్యర్థనను సీఎం సున్నితంగా తిరస్కరించారు. న్యాయ వ్యవస్థలో అనుభవజ్ఞులైన జస్టిస్ ఎన్వీ రమణను సత్కరించడం సముచితమని వారికి సూచించారు. వేదికపై ఈ సన్నివేశాన్ని గమనించిన న్యాయవాదులు సీఎం నిరాడంబరతను ప్రశంసించారు. సీఎం తన ప్రసంగంలో ప్రత్యేకంగా న్యాయవాదులకు కృతజ్ఞతలు చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు. సీజేఐని గజమాలతో సత్కరించినప్పుడు వేదికపై సీఎం.. అందరిలో ఒక్కడిగా కలిసిపోయి సూచనలు ఇచ్చిన తీరును కరతాళ ధ్వనులతో అభినందించారు. కాగా, తొలుత కోర్టు ప్రాంగణంలో సీజేఐ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ విజయలక్ష్మి, జస్టిస్ బి.దేవానంద్, జస్టిస్ కృపాసాగర్, జస్టిస్ శ్రీనివాస్, జిల్లా జడ్జి అరుణ సాగరిక, హైకోర్టు న్యాయమూర్తులు, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
శతమానం భారతి: లక్ష్యం 2047
స్వాతంత్య్రానికి పూర్వం భారత్‌లో బ్రిటిష్ న్యాయం ఎలా ఉండిందో తెలిసిందే. భగత్‌సింగ్, సుఖ్‌దేశ్, రాజ్‌గురు, తిలక్, మహాత్మాగాంధీ వంటి స్వాతంత్య్ర సమరయోధుల్ని విచారించి, శిక్షలు విధించడంలోని వివక్షకు ఆనాటి కోర్టులు ప్రతీకలు. స్వాతంత్య్రం వచ్చాక ప్రజాస్వామ్య పాలనలో ఆ దుస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వం, ప్రభుత్వాధీనంలోని సంస్థలు పౌరుల ప్రాణాలను, స్వేచ్ఛను హరించకుండా పరిరక్షించే స్వతంత్య్ర న్యాయ వ్యవస్థ రూపుదిద్దుకుంది. నవ భారత నిర్మాణానికి, ప్రజాస్వామ్య పాలనకు నియమ నిబంధల చట్రం ఏర్పడింది. మన న్యాయ వ్యవస్థ ఎంత స్వతంత్రమైనదంటే.. పాలక పక్షానికి పార్లమెంటులో సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ అది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విఘాతం కలిగించిన సవరణలను గానీ, మరే ఇతర మార్పు చేర్పులను కానీ చేయకూడదని 1973లో కేశవానంద భారత కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. చదవండి: సామ్రాజ్య భారతి: జననాలు ఏదైనా రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అత్యవసర పరిస్థితి ద్వారా రద్దు చేయాలని గవర్నర్ సిఫారసు చేస్తే దానిపై న్యాయ సమీక్ష జరిపి, గవర్నర్ నిర్ణయంలో సదుద్దేశం లేదని నిర్థారణ అయినట్లయితే బర్తరఫ్ అయిన ప్రభుత్వాన్ని పునరుద్దరించాలని ఎస్.ఆర్.బొమ్మై (1994) కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇక ఎన్నికల్లో పౌరుల ఓటు హక్కు వినియోగంపై న్యాయ వ్యవస్థ కల్పించిన ‘నోటా’ అవకాశం ఒక ప్రజాస్వామ్య సంస్కరణ అనే చెప్పాలి. వచ్చే 25 ఏళ్లల్లో మరిన్ని మెరుగైన మార్పులు రాగలవని ఆశించవచ్చు. -
న్యాయవ్యవస్థపై నమ్మకం పెంచాలి
నాయుడుపేట(తిరుపతి): న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంచాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సూచించారు. శనివారం హైకోర్టు నుంచి వర్చువల్ విధానంలో నాయుడుపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనాన్ని ఆయన ప్రారంభించారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ గొప్పతనం, ఔన్నత్యం, గౌరవం ఇనుమడించేలా వ్యవహరించాలని సూచించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. జిల్లా కోర్టుల్లో మౌలిక వసతుల కొరత ఉందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు త్వరలో చర్యలు చేపడుతామన్నారు. నెల్లూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి యామిని మాట్లాడుతూ.. జిల్లాలో 1,166 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయలక్ష్మిని న్యాయమూర్తులు, న్యాయవాదులు సన్మానించారు. నాయుడుపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి గీతావాణి తదితరులు పాల్గొన్నారు. -
గొటబయ ప్రభుత్వంపై అవిశ్వాసం
కొలంబో: దేశంలో నెలకొన్న సంక్షోభాలను తక్షణం పరిష్కరించే చర్యలు చేపట్టకుంటే గొటబయ రాజపక్సే ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని లంక ప్రధాన ప్రతిపక్షం ఎస్‌జేబీ పార్టీ ప్రకటించింది. దేశంలో అధ్యక్ష పాలన పోవాలని పార్టీ నేత సజిత్ ప్రేమదాస అభిప్రాయపడ్డారు. కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థల మధ్య అధికార పంపిణీ జరగాలన్నారు. గొటబయ తొలగాలన్న ప్రజా డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు. లేదంటే తామే అవిశ్వాసం తెస్తామని హెచ్చరించారు. మరోవైపు అవిశ్వాసానికి మద్దతుగా ఎంపీల సంతకాల సేకరణను ఎస్‌జేబీ ఆరంభించినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. అన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని గతంలో గొటబయ ఎస్‌జేపీని ఆహ్వానించారు. అయితే ఈ ఆహ్వానాన్ని పార్టీ తిరస్కరించింది. దేశంలో రాజపక్సేల ఆధిపత్యం పోవాలని ఎస్‌జేబీ కోరుతోంది. గొటబయ రాజీనామా చేయకపోతే అవిశ్వాసం తెస్తామని మరో విపక్షం జేవీపీ నేత విజేత హెరాత్ చెప్పారు. అయితే రాజీనామా డిమాండ్‌ను గొటబయ తోసిపుచ్చారు. పరిష్కారం దొరకలేదు దేశం ఎదుర్కొంటోన్న ఆర్థిక సంక్షోభపై చర్చ పార్లమెంట్లో మూడు రోజులు చర్చించినా తగిన పరిష్కారం లభించలేదు. పలువురు మంత్రులు రాజీనామా నేపథ్యంలో తక్షణం మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంక్షోభ నివారణా మర్గాలు అన్వేషించాలని అధికార కూటమి సభ్యులు కూడా కోరుతున్నారు. తమ ప్రభుత్వం ఐఎంఎఫ్, చైనా, ఇండియాతో సాయంపై చర్చలు జరుపుతోందని గొటబయ చెబుతున్నారు. ప్రజలు పొదుపుగా వ్యవహరించాలని సూచించారు. దేశంలోని విదేశీ దౌత్యవేత్తలతో విదేశాంగమంత్రి పెరిస్ చర్చలు జరిపారు. మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో పబ్లిక్ రంగ ఉద్యోగులు శుక్రవారం ఒక్కరోజు సమ్మె చేశారు. మరోవైపు దేశంలో ఔషధాలు, వైద్య పరికరాల కొరత తీవ్రస్థాయికి చేరింది. -
ఇది శుభపరిణామం: జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, అమరావతి: దేశంలో ప్రస్తుతం సామాన్యుడు సైతం రాజ్యాంగం గురించి చర్చించే పరిస్థితి వచ్చిందని, ఇది ఎంతో శుభ పరిణామమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ నూతలపాటి వెంకటరమణ అన్నారు. రాజ్యాంగం గురించి, హక్కుల గురించి ప్రజల్లో పెరుగుతున్న అవగాహనకు ఇది నిదర్శనమన్నారు. రాజ్యాంగం కేవలం గ్రంథాలయాలకు, బహిరంగ సభల్లో ప్రసంగాలకు పరిమితం కాకూడదని, దానిపై చర్చోప చర్చలు జరిగినప్పుడే ప్రజలకు తమ హక్కుల గురించి పూర్తి స్థాయి అవగాహన ఏర్పడుతుందని తెలిపారు. శనివారం విజయవాడ సిద్దార్థ కాలేజీ ఆడిటోరియంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆయనకు పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రోటరీ క్లబ్ ప్రతినిధులు జస్టిస్ రమణకు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. అనంతరం సీజేఐ మాట్లాడుతూ.. జీవిత సాఫల్య పురస్కారం ద్వారా తాను సాధించాల్సింది, చేయాల్సింది ఇంకా చాలా ఉందన్న విషయాన్ని గుర్తు చేశారని తెలిపారు. ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. తనపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా ఓ తెలుగువాడిగా శాయశక్తులా తన పరిధి మేరకు పని చేసి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తానని చెప్పారు. తెలుగువాడి గౌరవాన్ని ఏ మాత్రం తగ్గించకుండా తెలుగువాడి కీర్తిని ఎగురవేస్తానని, ఇది తాను ఇస్తున్న హామీ అని స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. కోర్టులో జరిగేది కక్షిదారుడికి అర్థం కావాలి ► రాజ్యాంగంపై ప్రజల్లో చర్చ మొదలైన నేపథ్యంలో వారికి వారి హక్కుల గురించి తెలియచేసి చైతన్య పరచాలి. ఇందులో రోటరీ క్లబ్ భాగస్వామ్యం కావాలి. ► దేశం ఎంత అభివృద్ధి సాధించినా.. నిరక్షరాస్యత, అనారోగ్యం, మౌలిక సదుపాయాల లేమి, ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం వంటి సమస్యలు పీడిస్తున్నాయి. ఇవి పరిష్కారం కావాలంటే ప్రజల్లో చైతన్యం అవసరం. ఈ దిశగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ► న్యాయ పాలన అన్నది చాలా ముఖ్యం. అది లేకపోతే అరాచకం పెరిగిపోతుంది. ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. న్యాయ పాలన అమలు కోసం న్యాయమూర్తులు, న్యాయవాదులు కృషి చేయాలి. న్యాయ పాలన గురించి ప్రజలకు తెలిసేలా మేధావి వర్గం పనిచేయాలి. ► కోర్టులు, పోలీసుల దగ్గరకు వెళ్లకూడదన్న నిశ్చిత అభిప్రాయంలో ప్రజలు ఉన్నారు. అయితే హక్కులకు భంగం కలిగినప్పుడు పౌరులు కచ్చితంగా న్యాయ స్థానాలను ఆశ్రయించాలి. అలాంటి పరిస్థితిలో న్యాయ స్థానాలు తప్పక జోక్యం చేసుకుంటాయి. ఇందులో మరో మాటకు తావు లేదు. ► కోర్టులో జరిగేది ప్రతిదీ కక్షిదారునికి అర్థమైనప్పుడే న్యాయ వ్యవస్థపై విశ్వాసం రెట్టింపు అవుతుంది. కోర్టుల్లో మౌలిక వసతులు పెరగాలి. కోర్టు భవనాల నిర్మాణాలు జరగాలి. ఇందు కోసమే జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో జ్యుడిషియల్ ఇన్ఫ్రా సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సంస్కరణలు అవసరమే ► న్యాయ వ్యవస్థలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. న్యాయ వ్యవస్థ గురించి అట్టడుగు వర్గాల ప్రజలు కూడా తెలుసుకునేలా సరళీకరణ, భారతీయీకరణ జరగాలి. ► ఓ వ్యక్తి దాఖలు చేసిన కేసులో ఏం వాదనలు జరుగుతున్నాయి.. కోర్టు ఏమంటోంది.. ఏం తీర్పు చెప్పింది.. అన్న విషయాలు అతనికి స్వయంగా అర్థమైనప్పుడే న్యాయ వ్యవస్థ సరళీకరణ అయినట్లుగా భావించాలి. న్యాయ వ్యవస్థ అర్థం కాని బ్రహ్మ పదార్థంలా ఉండకూడదు. ► న్యాయ వ్యవస్థకు సంబంధించిన వ్యవహారాలు అర్థం కానప్పుడు ప్రజలు న్యాయ స్థానాలకు బదులు ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతారు. ఇలా ప్రత్యామ్నాయాల వైపు వెళ్లడం బెజవాడ ప్రజలకు అలవాటు. ఆ దిశగా వెళ్లొద్దని కోరుతున్నా. పెండింగ్‌లో 4.60 కోట్ల కేసులు ► ప్రస్తుతం దేశంలో 4.60 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు 150 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఈ కేసుల సంఖ్య పెద్దది కాదు. వాయిదాలు వేయకుండా సత్వర పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలి. ఈ దిశగా ప్రభుత్వానికి సైతం పాత్ర ఉంది. ► ప్రతి ఒక్కరూ చట్ట పరిధికి లోబడి పనిచేస్తే కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం ఉందదు. అన్ని వ్యవస్థలు తమ పరిధులకు లోబడి పని చేయాలి. తప్పు జరిగినప్పుడు ప్రశ్నించేలా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలి. ► న్యాయ వ్యవస్థలో మార్పు దిశగా చర్యలు చేపట్టాం. భారీ స్థాయిలో ఖాళీలను భర్తీ చేస్తున్నాం. అవసరమైన చోట గట్టిగా మాట్లాడుతున్నా. తెలుగు శిథిలం కాకుండా చూడాలి ► తెలుగు భాష శిథిలం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మాతృభాషలో విద్య చాలా అవసరం. మాతృభాషలో ఆలోచనలు చేసినప్పుడే పనుల్లో విజయం సాధ్యమవుతుంది. ► మన విజయానికి మాతృభాషే పునాది. ఆ పునాదిని కూల్చేసే పరిస్థితి రాకూడదు. తెలుగు భాష గొప్పదనం, సంస్కృతి, సాహిత్యాన్ని ప్రపంచానికి చాటాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ► అనంతరం నిర్వాహకులు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మలను సన్మానించారు. జీవిత సాఫల్యం పురస్కారంతో పాటు ఇచ్చే నగదు బహుమతిని సీజేఐ జస్టిస్ రమణ.. అనాథ బాలల ఆశ్రమాలకు వితరణ కింద అందజేశారు. ► ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, రోటరీ క్లబ్ ప్రతినిధులు పట్టాభి రామయ్య, సుబ్బరామయ్య నాయుడు, ఎం.రామారావు, డాక్టర్ మోహన్ ప్రసాద్, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా నివాసంలో ఏర్పాటు చేసిన విందులో జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. విజయవాడ చైతన్యం చూపాలి ► విజయవాడ ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం. ఇక్కడి నుంచి ఎంతో మంది నేతలు జాతీయ స్థాయిలో కీర్తి గడించారు. విజయవాడతో నాకు ఎన్నో గొప్ప స్మృతులు ఉన్నాయి. న్యాయ విద్యను పూర్తి చేసి హైదరాబాద్‌కు వెళ్లాను. అతికష్టం మీద విజయవాడను వీడాల్సి వచ్చింది. ► అయినప్పటికీ ప్రతి శుక్రవారం హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ వచ్చి శని, ఆదివారాలు ఇక్కడే గడిపే వాడిని. కళలు, సంస్కృతి, రచనలకు బెజవాడ ఎంతో పేరుగాంచింది. అయితే ఇప్పుడు నేను ఊహించిన విధంగా బెజవాడ లేదు. ఇందుకు నేను విచారిస్తున్నా. మరోసారి జూలు విదిల్చి చైతన్యం చూపాల్సిన సమయం ఆసన్నమైంది. నా ఉన్నతికి కారణమైన ఈ ప్రాంతాన్ని ఎన్నటికీ మరువను. -
న్యాయవ్యవస్థకూ పరిమితులున్నాయి
సాక్షి, అమరావతి/విజయవాడ లీగల్: మిగతా వ్యవస్థల మాదిరిగానే న్యాయ వ్యవస్థ క్కూడా పరిమితులున్నాయని మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, జైభీమ్ సినిమా ఫేం జస్టిస్ కె.చంద్రు తెలిపారు. తనకున్న పరిమితులను న్యాయమూర్తులు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం సమాజానికి మంచి న్యాయమూర్తులు, ప్రజల హక్కులను కాపాడే న్యాయమూర్తులు కావాలన్నారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడలో ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ (ఏపీసీఎల్ఏ)–కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ కె.చంద్రు ఈ వ్యాఖ్యలు చేశారు. మానవ హక్కులతో పాటు తన అనుభవాలను కొన్నిటిని వివరించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు తప్పని న్యాయమూర్తులు బహిరంగ వేదికలపై క్షమాపణలు చెప్పిన సందర్భాలున్నాయని, మరింత మంది జడ్జీలు ఇలా తప్పు ఒప్పుకునే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. ఇటీవల తాను ‘ది హిందూ’ పత్రికలో రాసిన వ్యాసాన్ని ఆయన ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొందరు న్యాయమూర్తులు పరిధి దాటుతున్నారంటూ కొన్ని సందర్భాలను దాన్లో ప్రస్తావించానని తెలియజేశారు. రాష్ట్ర హైకోర్టుకు సంబంధించి కొన్ని సునిశితమైన విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులతో కాకుండా న్యాయవ్యవస్థతో పోరాడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. హెబియస్ కార్పస్ పిటిషన్లలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుంటే జరిమానా విధించవచ్చునని ఈ సందర్భంగా చెప్పారాయన. అంతకు మించి ఉత్తర్వులివ్వటం సరికాదన్నారు. సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలకు సంబంధించి సీబీఐ దర్యాప్తునకు అప్పగించటం, నిందితులను పట్టుకోవటానికి విదేశాలకు దర్యాప్తు అధికారులను పంపటం వంటి చర్యలను తప్పుబట్టారు. కోర్టులు తమ పరిధులను తెలుసుకోవాలని జస్టిస్ చంద్రు అభిప్రాయపడ్డారు. ‘‘నేను కోరుకునేది ఒక్కటే. మానవ హక్కుల పరిరక్షణ. అది ఏ వ్యక్తికి సంబంధించినదైనా కావొచ్చు’’ అన్నారాయన. అంతకు ముందు ఏపీసీఎల్ఏ ప్రధాన కార్యదర్శి పొత్తూరి సురేశ్ కుమార్ మాట్లాడుతూ, న్యాయస్థానాల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తే తప్ప ఈ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కోర్టు ఆదేశాలతోనే పనులు అవుతున్నాయన్నారు. లాయర్లు హక్కుల కోసం పనిచేయాలి... అనంతరం విజయవాడ సివిల్ కోర్టుల ప్రాంగణంలోని బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ)లో ‘మానవ హక్కులు– న్యాయవాదుల పాత్ర’ అంశంపై జరిగిన సదస్సులో జస్టిస్ చంద్రు ముఖ్య అతిథిగా ప్రసంగించారు. న్యాయవాదులకు రాజ్యాంగమే ఆయుధమని, వారు డబ్బు కోసం కాకుండా హక్కుల కోసం పని చేయాలని జస్టిస్ చంద్రు చెప్పారు. బాధితుడికి న్యాయం చేస్తే ప్రశాంతంగా నిద్ర పోవచ్చన్నారు. డబ్బులు ముఖ్యం కాదని, సేవ చేయాలనే దృక్పథంతో వృత్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. మరో అతిథి హైకోర్టు డిజిగ్నేటడ్ సీనియర్ అడ్వకేట్ వేములపాటి పట్టాభి మాట్లాడుతూ ఎన్నో కేసులలో తీర్పులతో పాటు గతంలో వాదించిన ఎన్నో కేసులతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన జస్టిస్ చంద్రూని రోల్ మోడల్‌గా తీసుకుని యువ న్యాయవాదులు వృత్తిలో రాణించాలని సూచించారు. విశ్రాంత అదనపు జిల్లా జడ్జి ఎ.పార్థసారథి, ఏపీ ఏజీ ఎస్.శ్రీరామ్, బీబీఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.పి.రామకృష్ణ, బి.రవి మాట్లాడారు. -
సీబీఐ దర్యాప్తు తీరుపై హైకోర్టు తీవ్ర ఆక్షేపణ
సాక్షి, అమరావతి: న్యాయ వ్యవస్థ, న్యాయ మూర్తులను దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇప్పటికీ న్యాయమూ ర్తులను కించప రుస్తూ పోస్టులు పెడుతున్న పంచ్ ప్రభాకర్‌ను అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిని అరెస్ట్ చేసి తీరాల్సిందేనని సీబీఐకి తేల్చిచెప్పింది. ఇందుకు పది రోజుల గడువు నిస్తున్నట్లు తెలిపింది. తద్వారా దర్యాప్తు సరైన దిశలో సాగుతోందని రుజువు చేసుకోవాలని సీబీఐకి స్పష్టం చేసింది. లేని పక్షంలో సీబీఐ ఈ కేసులో సరైన దిశలో దర్యాప్తు చేయలేకపోతోందని పేర్కొంటూ, దర్యాప్తు బాధ్యతలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అప్పగిస్తామని మౌఖికంగా చెప్పింది. ఈ మొత్తం కేసును సుప్రీంకోర్టుకు నివేదించి తగిన ఆదేశాలు కోరుతామంది. 2020 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు ఈ కేసులో ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేయనున్నారో తెలియ చేస్తూ ఓ నివేదిక ఇవ్వాలని సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశిం చింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలితతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవ్యవస్థ, న్యాయ మూర్తులను దూషిస్తూ, కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నా పోలీసులు సరిగా స్పందించడం లేదంటూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ గతేడాది పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. చానెల్‌ను బ్లాక్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు.. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ జనరల్ తరఫు న్యాయ వాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు విని పిస్తూ.. పంచ్ ప్రభాకర్ యూట్యూబ్ చానెల్‌ను బ్లాక్ చేయడంతో పాటు అతడి పోస్టులను యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల నుంచి తొలగిం చారని తెలిపారు. యూట్యూబ్ తరఫు న్యాయవాది కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిం చారు. ఫేస్బుక్ తరఫు సీనియర్ న్యాయవాది కె.వివేక్ వాదనలు వినిపిస్తూ.. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్) ద్వారా వీడియోలను వీక్షిస్తున్నారని.. ఇలా చేయ డం చట్టవిరుద్ధమని తెలిపారు. యూఆర్ఎల్ వివరాలు ఇస్తే 36 గంటల్లో పోస్టులను తొలగిస్తామ న్నారు. ధర్మాసనం స్పందిస్తూ కేసు నమోదు చేసిన వెంటనే అభ్యంతరకర పోస్టులను తొలగించాల్సిన బాధ్యత సామాజిక మాధ్యమ కంపెనీలపై ఉందం ది. సీబీఐ తరఫు న్యాయవాది పోతిరెడ్డి సుభాష్ వాదనలు వినిపిస్తూ.. వీడియోల తొలగిం పునకు గూగుల్‌కు లేఖ రాశామన్నారు. పంచ్ ప్రభాకర్ విషయంలో ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేశామని తెలిపారు. అతడి అరెస్ట్ విషయంలో అమెరికా దర్యాప్తు సంస్థ సాయం కూడా తీసుకుం టున్నామన్నారు. దౌత్య మార్గాల ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఈ కేసులో తాము ఏమీ చేయడం లేదనడం ఎంత మాత్రం సరికాదన్నారు. -
మౌఖిక ఆదేశాలొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కేసుల విచారణ సందర్భాల్లో న్యాయమూర్తులు.. మౌఖిక ఆదేశాలు ఇచ్చే సంస్కృతికి చరమగీతం పాడాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సూచనచేసింది. ధర్మాసనాల అభిప్రాయాలు కేవలం తీర్పులు, ఉత్తర్వుల ద్వారా వ్యక్తంకావాలని, అప్పుడే జ్యుడీషియల్ రికార్డుల్లో ఆ అభిప్రాయాలు నమోదవుతాయని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. మౌఖిక ఆదేశాలు లెక్కలు మిక్కిలి పెరిగితే న్యాయవ్యవస్థ జవాబుదారీ తనంలోని మూలసూత్రాన్ని కోల్పోతామని, ఇలాంటి పద్ధతి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాల సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం వ్యాఖ్యానించింది. చీటింగ్, నమ్మకద్రోహం చేశానంటూ తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ గుజరాత్‌కు చెందిన సలీమ్‌భాయ్ హమీద్‌భాయ్ మీనన్ గుజరాత్ హైకోర్టును గతంలో ఆశ్రయించారు. ఈ విషయం హైకోర్టులో పెండింగ్‌లో ఉండగానే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో, చీటింగ్ కేసులో అరెస్ట్ చేయకూడదంటూ గుజరాత్ హైకోర్టు మౌఖిక ఆదేశాలిచ్చింది. రాష్ట్ర హైకోర్టు మౌఖిక ఆదేశాలివ్వడాన్ని తప్పుబడుతూ సుప్రీం బెంచ్ ఈ సూచనలు చేసింది. ‘రాతపూర్వక ఆదేశాలు మాత్రమే కార్యశీలకమైనవి. అరెస్ట్ చేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఇచ్చిన మౌఖిక ఆదేశాలు జ్యుడీషియల్ రికార్డులో భాగం కాబోవు. ఈ పద్ధతిని త్యజించండి. ధర్మాసనం తమ అభిప్రాయాలను తీర్పులు, ఉత్తర్వుల ద్వారానే వ్యక్తపరచాలి. మౌఖిక ఆదేశాలపై న్యాయవ్యవస్థలో విస్తృత చర్చ జరగాల్సి ఉంది’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. మౌఖిక ఆదేశాలతో అరెస్ట్‌ను అడ్డుకోవడం సక్రమ పద్ధతికాదని జడ్జీలు అన్నారు. ‘కేసులోని ఇరు పక్షాలు కోర్టు బయట సెటిల్ చేసుకునే అవకాశం కల్పించేందుకు నిందితుడి తరఫు లాయర్లకు మౌఖిక ఆదేశాలు ఇవ్వవచ్చు. అరెస్ట్ నుంచి నిందితుడికి తాత్కాలిక రక్షణగా ఆ ఆదేశాలు ఉపయోగపడాలంటే జడ్జీలు ఉత్తర్వులు ఇవ్వడం తప్పనిసరి. హైకోర్టు నుంచి సంబంధిత ఉత్వర్వు అందకుంటే అరెస్ట్‌ను పోలీసు అధికారి సైతం ఆపలేడు. అయినా, తీర్పు అనేది నిందితులు, బాధితుల వ్యక్తిగత విషయం కాదు. దేశంలో శాంతిభద్రతలతో ముడిపడిన అంశం. ఎవరి నడతపైనైనా అభిప్రాయాలు వ్యక్తంచేసే జడ్జీలు, ప్రభుత్వాధికారులు తమ నడవడికనూ ఒకసారి ఆత్మశోధన చేసుకోవాలి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆశారాంకు జైల్లోనే చికిత్స లైంగిక వేధింపుల కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురు ఆశారాం బాపూకి జైల్లోనే ఆయుర్వేద చికిత్స అందిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద చికిత్స తీసుకోవడం కోసం రెండు నెలలు శిక్షను సస్పెండ్ చేయాలని కోరుతూ ఆశారాం బాపూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. అతను చేసిన నేరం సాధారణమైనది కాదని, శిక్షను సస్పెండ్ చేయడం కుదరదని తేల్చి చెప్పింది. ఆశారాం బాపూకి అవసరమైన చికిత్స అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని రాజస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం దృష్టికి తెచ్చింది. దీనిపై జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వి రామసుబ్రమణియన్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన సుప్రీం బెంచ్ స్పందించింది. ‘‘ఆశారాం బాపూ చేసిన నేరం సాధారణమైనది కాదు. జైల్లోనే మీకు కావల్సిన చికిత్స లభిస్తుంది. అంతేకానీ శిక్షను కొంతకాలమైనా సస్సెండ్ చేయడం కుదరదు’’ అని చెప్పింది. ఆశారాం బాపూ తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ ఆర్ బసంత్ వాదిస్తూ అనారోగ్య సమస్యలన్నింటీకి సంపూర్ణమైన చికిత్స అందించడానికి రెండు నెలల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరినప్పటికీ అందుకు సుప్రీం నిరాకరించింది. -
న్యాయమూర్తులు ఆదర్శప్రాయమైన జీవితం గడపాలి
గుంటూరు ఎడ్యుకేషన్: న్యాయమూర్తులు విధి నిర్వహణలో నీతి, నిజాయితీతో పని చేసి ఆదర్శప్రాయ జీవితాన్ని గడపాలని ఏపీ ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. గుంటూరులో వైఎస్సార్ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ జి.శాంతమూర్తి అధ్యక్షతన ‘సుపరిపాలన సాధనలో న్యాయ వ్యవస్థ పాత్ర’ అంశంపై శనివారం ఆన్లైన్లో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నుంచి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు రాజ్యాంగానికి మూల స్తంభాలని, వాటి మధ్య ఘర్షణ ఉండకూడదన్నారు. ఎవరో ఒక వ్యక్తి అవినీతిపరుడు అయినంత మాత్రాన వ్యవస్థ ఎప్పటికీ కళంకం కాదన్నారు. పలువురు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. ప్రజలచే ఎన్నుకున్న ప్రభుత్వానికి ప్రతినిధిగా ఒక ముఖ్యమంత్రి వ్యవస్థలో చోటు చేసుకుంటున్న లోపాలపై ఆధారాలతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. -
తీవ్రమైన ఆ ఆరోపణలపై విచారణ జరగాలి
(ప్రవీణ్‌కుమార్ లెంకల) సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యాంగ బద్ధంగా విధులు నిర్వర్తించే ఒక ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఆరోపణలతో కూడిన లేఖ రాసినప్పుడు.. దానిపై విచారణ జరగాలని, ప్రజలకు తెలుసుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే గంగూలి పేర్కొన్నారు. ఆరోపణలపై తగిన విచారణ జరగాల్సి ఉందని, గౌరవ ప్రధాన న్యాయమూర్తి దీనిపై మౌనంగా ఉంటారని తాను భావించడం లేదన్నారు. ఆయన నిర్ణయానికి దీనిని వదిలిపెట్టాలని అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడారు. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ప్రశ్న: మీరు న్యాయ వ్యవస్థలో పారదర్శకత, జవాబు దారీతనం గురించి ఇటీవల మాట్లాడారు. అమరావతి భూ కుంభకోణంలో ఆరోపణలకు సంబంధించి తాజా పరిణామాలను మీరు ఎలా చూస్తారు? జస్టిస్ ఏకే గంగూలి: న్యాయ వ్యవస్థలో పారదర్శకత చాలా ముఖ్యం. నేను ఈ వ్యవహారంపై నిన్న (మంగళవారం)నే ఒక టీవీ చానల్ చర్చలో మాట్లాడాను. నా అభిప్రాయం అదే. సుప్రీంకోర్టు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ముఖ్యమంత్రి స్వయంగా రాజ్యాంగ విధులు నిర్వర్తించే వ్యక్తి. రాష్ట్రంలో అత్యున్నత కార్యనిర్వాహక హోదా కలిగిన వ్యక్తి. అలాంటి ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి కాగలిగిన సీనియర్ న్యాయమూర్తిపై పలు ఆరోపణలతో కూడిన లేఖను చీఫ్ జస్టిస్‌కు రాశారు. రాష్ట్ర హైకోర్టు న్యాయ పాలనలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రికి గల రాజకీయ విరోధులకు ప్రయోజనం చేకూర్చేలా ఒక ప్రణాళికతో ఆ న్యాయమూర్తి వ్యవహరించారని, అపవిత్రమైన భూ వ్యవహారాల్లో కుమ్మక్కయ్యారని ఆరోపణలు చేశారు. ఇది తీవ్రమైన ఆరోపణ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ ఆరోపణలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉంటారని నేను అనుకోను. ఆయన తప్పకుండా చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాను. ఎలాంటి విచారణ ఉంటుందో, ఏ చర్యలు తీసుకుంటారో నాకు తెలియదు. ఈ మొత్తం వ్యవహారంపై ఆయన మౌనంగా ఉండలేరు. ఇది చాలా తీవ్రమైన వ్యవహారం. ఆరోపణలపై తగిన రీతిలో దర్యాప్తు జరపాలి. నాకు అర్థమైనంత వరకు.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి కుమార్తెలు ఈ వ్యవహారంలో ఉన్నందున ఆరోపణలపై దర్యాప్తు జరగాలి. ప్రశ్న : ప్రభావవంతమైన వ్యక్తులపై ఆరోపణలు ఉన్నప్పుడు దర్యాప్తు ఆపాలా? జస్టిస్ ఏకే గంగూలి : విచారణ ఎలా జరగాలి? ఎవరు జరపాలి? అన్న అంశాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించాల్సి ఉంటుంది. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విస్మరించరని నా అభిప్రాయం. ప్రశ్న : హైకోర్టు మీడియాపై గాగ్ ఆర్డర్ జారీ చేయడాన్ని ఎలా చూస్తారు? జస్టిస్ ఏకే గంగూలి : గ్యాగ్ ఆర్డర్ జారీ చేయకూడదు. ఆరోపణలపై ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది. న్యాయస్థానం పబ్లిక్ ఇన్స్టిట్యూషన్. సిట్టింగ్ న్యాయమూర్తిపై ఆరోపణలు వచ్చినప్పుడు సాధారణ ప్రజలకు తెలుసుకునే అవసరం ఉంది. న్యాయమూర్తులు ప్రజాస్వామ్యంలో సభ్యులు. ప్రశ్న : తాజా పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక ముఖ్యమంత్రి భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడాన్ని, దానిని ప్రజల ముందు పెట్టడాన్ని ఎలా చూస్తారు? జస్టిస్ ఏకే గంగూలి : ఇలా ఆరోపణలు చేసిన సంఘటన ఇంతకుముందు ఎన్నడూ జరగలేదు. నేను ఎప్పుడూ చూడలేదు. అదే రాష్ట్రానికి చెందిన న్యాయమూర్తిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోపణలు చేశారు. ప్రశ్న : భారత ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యవహారంలో ఎలాంటి చర్య తీసుకునే అవకాశం ఉంది? జస్టిస్ ఏకే గంగూలి : నేను దానిని ఊహించలేను. ఈ దేశ పౌరుడిగా, మాజీ న్యాయమూర్తిగా నేను ఏం ఆశించగలనంటే.. చీఫ్ జస్టిస్ దీనిని పక్కన పెట్టేస్తారని అనుకోవడం లేదు. సాధారణ ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా న్యాయమూర్తులు పని చేయాల్సి ఉంటుంది. న్యాయ వ్యవస్థ సక్రమంగా నడిచేలా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆ మేరకు తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. ప్రశ్న : రాజ్యాంగాన్ని అనుసరించి ఎలాంటి విచారణ ఉండాలి? అది ఏ స్థాయిలో ఉండాలి? జస్టిస్ ఏకే గంగూలి : నేను దానిని చెప్పలేను. రాజ్యాంగ బద్ధంగా వ్యవస్థ నడిచేందుకు ప్రధాన న్యాయమూర్తి తగిన చర్యలు తీసుకుంటారు. విచారణ ఎలా ఉండాలని గానీ, ఉంటుందని గానీ నేను ఇండికేట్ చేయదలుచుకోలేదు. గౌరవ ప్రధాన న్యాయమూర్తి విచక్షణ అది. ఆయన నిర్ణయానికి వదిలిపెట్టాలి. ప్రశ్న : గతంలో ఇలాంటి æఫిర్యాదులు వచ్చాయా? వస్తే ఎలాంటి విచారణ జరిగింది? జస్టిస్ ఏకే గంగూలి : సిట్టింగ్ న్యాయమూర్తులపై ఇలాంటి ఫిర్యాదులు రావడం నా దృష్టిలో లేదు. అయితే ప్రధాన న్యాయమూర్తిపై ఆరోపణలు వచ్చినప్పుడు సిట్టింగ్ న్యాయమూర్తులతో కూడిన కమిటీ విచారణ జరిపింది. కానీ అది ఇలాంటి ఆరోపణ కాదు. -
న్యాయ చరిత్రలో బ్లాక్ డే: ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు భారతీయ న్యాయ చరిత్రలో బ్లాక్ డే అని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బుధవారం హైదరాబాద్ దారుస్సలాంలో ఒవైసీ విలేకరులతో మాట్లాడారు. అందరూ నిర్దోషులైతే మరి మసీదును ఎవరు కూల్చేశారు? దానంతట అదే కూలిపోయిందా? అని ప్రశ్నించారు. భారతీయ న్యాయ చరిత్రలో ఈ రోజు విషాద దినంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ‘కోర్టు తీర్పు తనకెంతో బాధ కలిగించింది. మసీదును ధ్వంసం చేశారనేందుకు ఆధారాలు లేవంటున్నారు. కానీ దాన్ని ఎవరు కూల్చారో ప్రపంచమంతా చూసింది. మసీదును కూల్చండి అని ఉమాభారతి రెచ్చగొట్టడం నిజం కాదా..? బాబ్రీ కూల్చివేతలో కుట్ర లేదని కోర్టు చెబుతోంది.. ఈ ఘటన అప్పటికప్పుడు జరిగిందని తేల్చేందుకు ఎన్ని నెలల సమయం పడుతుంది’అని ఆయన ప్రశ్నించారు. సరైన ఆధారాలు లేవని అందరిపై అభియోగాలు కొట్టివేయడం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. చట్టాలను అతిక్రమించారని, ప్రణాళిక ప్రకారమే ప్రార్థనా మందిరాన్ని ధ్వంసం చేశారని ఇప్పటి ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లు ఆయన గుర్తుచేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత అంశం న్యాయానికి సంబంధించినదని, మసీదు కూల్చివేతకు కారణమైన వాళ్లను దోషులుగా తేల్చాల్సి ఉందని, కానీ వారికి రాజకీయంగా లబ్ధి జరిగినట్లు ఒవైసీ ఆరోపించారు. -
ఈ రకమైన సెన్సార్షిప్ అసాధారణమైనది
-
‘హైకోర్టు అసాధారణంగా వ్యవహరిస్తోంది’
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. గురువారం ఆయన రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడారు. న్యాయ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత, పక్షపాతంతో ఉందని, ఈ ధోరణి వెంటనే మానుకోవాలని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ కారణంగా ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు ఎదుర్కొంటోందని సభలో వివరించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులపై న్యాయపరమైన అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని, హైకోర్టు అసాధారణంగా వ్యవహరిస్తోందని, మీడియా, సోషల్ మీడియాపై నిషేధం విధించిందని సభలో ప్రస్తావించారు. (బల్లి దుర్గాప్రసాద్‌కు వైఎస్సార్ సీపీ ఎంపీల నివాళి) మాజీ అడ్వకేట్ జనరల్‌పై నమోదైన ఎఫ్ఐఆర్ను రిపోర్టు చేయవద్దని నిషేధం విధించిందని ఎంపీ విజయసాయిరెడ్డి వివరించారు. ఈ చర్యలను సమర్ధించుకునే ఏ ఆధారమూ లేదని, ఈ రకమైన సెన్సార్షిప్ అసాధారణమైందని తెలిపారు. బ్రిటిష్ తరహాలో వ్యవహరిస్తూ.. దీనికి సంబంధించిన మరో కేసు పైన కూడా స్టే విధించారని, గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇలా వ్యవహరిస్తున్నారని అన్నారు. మీడియా కవరేజ్, పబ్లిక్ స్క్రూటినీ లేకుండా తప్పించుకోవాలని చూస్తున్నారని తెలిపారు. జ్యుడీషియల్ నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ కరోనా నియంత్రణలో ముందంజలో ఉందని తెలిపారు. (కేంద్ర మంత్రులు, రాహుల్ గాంధీ విషెస్) ప్రత్యేక రైళ్లు నడపండి.. అదే విధంగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడపాలని ఎంపీ విజయసాయిరెడ్డి రైల్వే మంత్రి పియూష్ గోయల్‌కు విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో స్పెషల్ మెన్షనింగ్ ద్వారా ఎంపీ కోరారు. ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదని తెలిపారు. వలస కార్మికులు, ప్రయాణికులకు ఉన్న రైళ్లు సరిపోవడం లేదన్నారు. కొత్తగా 80 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినా, అందులో హైదరాబాద్-విశాఖపట్నం, హైదరాబాద్-తిరుపతి మధ్య ఒక్క రైలు కూడా లేదని రైల్వే మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఏపీ, తెలంగాణ మధ్య అత్యధికంగా రాక పోకలు కొనసాగే మార్గాలివేనని తెలిపారు. ప్రత్యేక రైళ్లను వెంటనే ప్రవేశపెట్టి సహకరించాలని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. (ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు) -
హక్కుల కాలరాతే!
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి వరసలో ఉన్న ఎన్వీ రమణ కుమార్తెలు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్టు కేసు నమోదు కావడమా? భారత న్యాయ వ్యవస్థ ఎక్కడకు వెళ్తోంది? – వినోద్ కె.జోస్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, ద కారవాన్ సాక్షి, అమరావతి: అమరావతిలో భూ కుంభకోణంపై రాష్ట్ర ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ వివరాలను మీడియా ప్రచురించకూడదన్న రాష్ట్ర హైకోర్టు తీర్పుపై జాతీయ స్థాయిలో విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి ఇద్దరు కుమార్తెలతోపాటు మొత్తం 13మందిపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఈ కేసులో హైకోర్టు తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. దేశంలోని ప్రముఖ రాజ్యాంగ నిపుణులు, పాత్రికేయ ప్రముఖులు, జర్నలిస్టు సంఘాల నేతలు హైకోర్టు తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని కుండబద్దలు కొట్టారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తామని పేర్కొంటూనే.. ఈ ఉత్తర్వులు దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి, పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీరిలో దేశంలోనే ప్రముఖ రాజ్యాంగ కోవిదుడు, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌తోపాటు జాతీయ స్థాయి ప్రముఖ పాత్రికేయులు రాజ్‌దీప్ సర్దేశాయి, రాహుల్ శివశంకర్, సిద్ధార్థ్ వరదరాజన్, ఉమా సుధీర్, శ్రీరాం కర్రి, ధన్యా రాజేంద్రన్ తదితరులు ఉన్నారు. వారి స్పందనలు ఇలా ఉన్నాయి. ఆశ్చర్యం.. మీడియాను నియంత్రిస్తూ ఉత్తర్వులా? ఏపీ మాజీ అడ్వొకేట్ జనరల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ కుమార్తెలు ఇన్సై డర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని కేసు నమోదైంది. దాంతో ఆ మాజీ అడ్వకేట్ జనరల్ ఆ విషయాన్ని మీడియా ప్రచురించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. ఆశ్చర్యం.. హైకోర్టు ఆ పిటీషన్ విచారించింది. మరింత ఆశ్చర్యం.. వెంటనే ఉత్తర్వులు వెలువడ్డాయి. వాళ్లు మీడియాను నియంత్రిస్తారా? – ధన్యా రాజేంద్రన్, ఎడిటర్ ఇన్ చీఫ్, ద న్యూస్ మినిట్ అసాధారణ తీర్పు ఈ తీర్పు అసాధారణం. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్తెల భూ కొనుగోళ్ల కుంభకోణంపై ఏపీ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను మీడియా ప్రచురించొద్దని ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం అసాధారణం. ఉన్నత స్థానాల్లో ఉన్న వారు, బలవంతులు అన్నింటి నుంచి బయట పడతారు. – రాహుల్ శివశంకర్, ఎడిటర్ ఇన్ చీఫ్, టైమ్స్ గ్రూప్ ఈ ఉత్తర్వులు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయేమో న్యాయస్థానం ఉత్తర్వులను పాటించాల్సిందే. కానీ ఏపీ మాజీ అడ్వొకేట్ జనరల్, సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయ మూర్తి కుమార్తెలపై ఏసీబీ ఎఫ్ఐఆర్ను ప్రచురించొద్దన్న ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఎలాంటి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయోనన్నది విస్మయ పరుస్తోంది. – ఉమా సుధీర్, ఎన్డీటీవీ ప్రజల్లో సందేహాలకు తావిచ్చేట్టుగా ఉంది దేశంలో న్యాయ వ్యవస్థలోని ప్రముఖుల బంధువులపై ఏపీ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను మీడియా ప్రచురించకూడదని ఏపీ హైకోర్టు ఉత్వర్వులు ఇవ్వడం సాధారణ ప్రజలకు పలు సందేహాలు కలిగేందుకు అవకాశం ఇస్తోంది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ప్రజాస్వామ్యంలోని నాలుగో స్తంభమైన మీడియా హక్కులను కాలరాసేట్టుగా ఉంది. పత్రికా స్వేచ్ఛపై ఉన్నత న్యాయ వ్యవస్థ ఆంక్షలు విధించడం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులను బలహీన పరుస్తుంది. ఏపీ హైకోర్టు తన ఉత్తర్వులను పునఃసమీక్షించాల్సిందిగా కోరుతున్నాం.– కె.శ్రీనివాసరెడ్డి, బల్విందర్ సింగ్, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి స్థానం లేదు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ నిర్మించనున్నా రన్నది ముందే తెలుసుకుని ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన ఆరోపణలపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వివరాలను మీడియా ప్రచురించొద్దని న్యాయస్థానం ఉత్తర్వులు ఇవ్వడం నిజంగా ఆశ్చర్యకరం. ఈ కేసులో దర్యాప్తు నిలిపివేయాలని కూడా చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి స్థానం లేదు. – సునీల్జైన్, మేనేజింగ్ ఎడిటర్, ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు ఏపీ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ వివరాలను మీడియా ప్రచురించొద్దని ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగం కల్పించిన వాక్, పత్రికా స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నాయి.– ప్రముఖ వార్తా సంస్థ ‘ద వైర్’ కథనం ఈ ఎఫ్ఐఆర్ను తొక్కిపెట్టిన వారే అధికారం చలాయిస్తున్నారు ఏపీ భూ కుంభకోణాల ఎఫ్ఐఆర్కు నివాళి. ఈ ఎఫ్ఐఆర్ కొద్ది సేపే జీవించినా సరే ఉపయుక్తకరంగా జీవించింది. రోజూ వేలాది ఎఫ్ఐఆర్లు నమోదు అవుతాయి. కానీ ఈ ఎఫ్ఐఆర్ను తొక్కిపెట్టేశారు. మీడియాలో రిపోర్ట్ చేయనివ్వలేదు. దానిపై దర్యాప్తును అడ్డుకున్నారు. దేనిపై ఎప్పుడు ఎలా దర్యాప్తు చేయాలన్నది నిర్ణయిస్తున్న వారే భారతదేశంలో అసలైన అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు. – సిద్ధార్థ్ వరద రాజన్, ఎడిటర్ ఇన్ చీఫ్, ద వైర్ ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంది? ఏసీబీ ఎఫ్ఐఆర్ను మీడియా ప్రచురించకూడదనే ఉత్తర్వులకు ప్రాతిపదిక ఏమిటి? కోర్టులంటే గౌరవం ఉంది. కానీ మీడియాపై ఆంక్షలు విధిస్తే ఎలా? అలా అయితే ఉన్నత స్థానాల్లో ఉన్న వారు చేసిన అవినీతిపై ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు చేపట్టిన చర్యలు ప్రజలకు ఎలా తెలుస్తాయి? ప్రజాస్వామ్య వ్యవస్థకు అర్థం ఏముంది? – శ్రీరాం కర్రి, రెసిడెంట్ ఎడిటర్, దక్కన్ క్రానికల్ హైకోర్టు ఆదేశాలు దిగ్భ్రాంతికి గురిచేశాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ అడ్వొకేట్ జనరల్, ఇతర ముఖ్య వ్యక్తులపై ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వాస్తవాలను మీడియా, సోషల్ మీడియాలో ప్రసారం చేయకుండా హైకోర్టు జారీచేసిన ‘నిషేధిత’ ఉత్తర్వు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది రాజ్యాంగంలోని భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించే ఆర్టికల్ 19కు, సమాచార హక్కు చట్టానికి విరుద్ధం. హైకోర్టు ఉత్తర్వు సరైన పద్ధతిలో లేదు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛను హరించి వేయడమే. ప్రజలు సమాచారం తెలుసుకోకుండా చేయడం కూడా. ఇది రూమర్లకు దారి తీస్తుంది. – ప్రశాంత్ భూషణ్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు ప్రముఖులపై ఎఫ్ఐఆర్ అయితే ప్రచురించకూడదా? సామాన్యులపై ఎఫ్ఐఆర్ నమోదైతే ఎక్కడలేని హడావుడి చేసి తీవ్ర స్థాయిలో విరుచుకుపడొచ్చు. అదే ప్రముఖులపై ఎఫ్ఐఆర్ నమోదైతే మాత్రం వాటిని మీడియా ప్రచురించకూడదని ఉత్తర్వులు వస్తాయి. ఈ విషయం ఆశ్చర్యానికి గురిచేసింది.– రాజ్‌దీప్ సర్దేశాయి, కన్సల్టింగ్ ఎడిటర్, ఇండియా టుడే గ్రూప్