కర్నూలు (లీగల్) : ప్రజలకు న్యాయ వ్యవస్థపై రోజు రోజుకు అపార నమ్మకం కలుగుతుండటంతో న్యాయస్థానాలను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆర్.మురళి అన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవా సదన్‌లో నిర్వహించిన జాతీయ ప్రజా న్యాయపీఠం (లోక్‌అదాలత్)ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించే సదుద్దేశంతో సుప్రీంకోర్టు ప్రజా న్యాయపీఠం (లోక్‌అదాలత్) చట్టం తెచ్చి కేసుల పరిష్కారం చేస్తుందన్నారు. జిల్లాలో లోక్ అదాలత్‌ల పట్ల ప్రజలకు చైతన్య పరిచేందుకు గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
► జిల్లా ఆరవ అదనపు జడ్జి వి.వి.శేషుబాబు మాట్లాడుతూ ప్రజాన్యాయ పీఠంలో పరిష్కారమైన కేసులకు అప్పిల్స్ ఉండవని, ఇక్కడ జరిగే పరిష్కారమే శాశ్వత పరిష్కారమన్నారు. న్యాయస్థానాల్లో ఓడిన వారు అక్కడే ఏడిస్తే.. గెలిచిన వారు ఇంటికెళ్లి ఏడుస్తారనేది పెద్దలు చెబుతుంటారన్నారు. కక్షిదారులు గెలుపు, ఓటమి సమస్య లేకుండా సామరస్యంగా పరిష్కారం చేసుకోవడమే లోక్ అదాలత్ ధ్యేయమన్నారు.
► జిల్లా ఎస్పీ రవికృష్ణ మాట్లాడుతూ దేశంలో ఎక్కువ పనిభారం ఉన్న వ్యవస్థ ఏదైనా ఉందంటే అది న్యాయ వ్యవస్థ అని, న్యాయ వ్యవస్థపై పనిభారం తగ్గించి, కేసుల పరిష్కారం చేస్తున్న న్యాయమూర్తులకు తాను సెల్యూట్ చేస్తున్నానన్నారు.
► కార్యక్రమంలో ఫ్యామిలీ కోర్టు జడ్జి ఎస్.ప్రేమావతి, సీనియర్ సివిల్ జడ్జిలు శివకుమార్, సి.కె.గాయత్రిదేవి, లోక్ అదాలత్ జడ్జి సోమశేఖర్, జూనియర్ సివిల్ జడ్జీలు రామచంద్రుడు, పి.రాజు, ఎం.బాబు, పద్మిని, సీనియర్ న్యాయవాదులు ఎ.చంద్రశేఖర్‌రావు, కోటేశ్వరరెడ్డి, పి.నిర్మల, ఆదినారాయణరెడ్డి, సీఐలు మొలకన్న, గౌతి, రామకృష్ణ, కక్షిదారులు, ఇన్సూరెన్స్ అధికారులు పాల్గొన్నారు.
రాష్ర్టంలో జిల్లా టాప్
జిల్లా వ్యాప్తంగా శపివానం నిర్వహించిన లోక్ అదాలత్‌లో 2442 కేసులను పరిష్కరించారు. కర్నూలులో 1,269 కేసులు, ఆదోనిలో 131, ఆత్మకూరులో 61, బనగానపల్లెలో 23, నందికొట్కూరులో 3, నంద్యాలలో 474, పత్తికొండలో 112, ఆళ్లగడ్డలో 38, ఆలూరులో 57, డోన్‌లో 100, కోవెలకుంట్లలో 53, ఎమ్మిగనూరులో 117 కేసులు పరిష్కారమయ్యాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాల్లో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. గత ఆరు మాసాలుగా నిర్వహిస్తున్న మెగా లోక్ అదాలత్‌లో వరుసగా 6వ సారి కేసుల పరిష్కారంలో జిల్లా అగ్రభాగాన నిలువగా, రెండో స్థానంలో గుంటూరు, మూడో స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లాలు నిలిచాయి.
► శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో దీర్ఘకాలంగా ఉన్న రోడ్డు ప్రమాద కేసులను పరిష్కరించాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలో 168 రోడ్డు ప్రమాద కేసులు పరిష్కరించి బాధితులకు రూ.4,10,26,000 నష్టపరిహారం అందించినట్లు లోక్ అదాలత్ జడ్జి సోమశేఖర్ తెలిపారు. ఇందులో నంద్యాలలో 106, కర్నూలు 57, ఆదోని 5 కేసులు ఉన్నాయి.
న్యాయ వ్యవస్థపై ప్రజలకు అపార నమ్మకం
Published Sun, Jun 14 2015 3:12 AM | Last Updated on Sun, Sep 3 2017 3:41 AM
Advertisement
Advertisement