సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. గురువారం ఆయన రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడారు. న్యాయ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత, పక్షపాతంతో ఉందని, ఈ ధోరణి వెంటనే మానుకోవాలని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ కారణంగా ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు ఎదుర్కొంటోందని సభలో వివరించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులపై న్యాయపరమైన అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని, హైకోర్టు అసాధారణంగా వ్యవహరిస్తోందని, మీడియా, సోషల్ మీడియాపై నిషేధం విధించిందని సభలో ప్రస్తావించారు. (బల్లి దుర్గాప్రసాద్‌కు వైఎస్సార్ సీపీ ఎంపీల నివాళి)
మాజీ అడ్వకేట్ జనరల్‌పై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రిపోర్టు చేయవద్దని నిషేధం విధించిందని ఎంపీ విజయసాయిరెడ్డి వివరించారు. ఈ చర్యలను సమర్ధించుకునే ఏ ఆధారమూ లేదని, ఈ రకమైన సెన్సార్షిప్ అసాధారణమైందని తెలిపారు. బ్రిటిష్ తరహాలో వ్యవహరిస్తూ.. దీనికి సంబంధించిన మరో కేసు పైన కూడా స్టే విధించారని, గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇలా వ్యవహరిస్తున్నారని అన్నారు. మీడియా కవరేజ్, పబ్లిక్ స్క్రూటినీ లేకుండా తప్పించుకోవాలని చూస్తున్నారని తెలిపారు. జ్యుడీషియల్ నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ కరోనా నియంత్రణలో ముందంజలో ఉందని తెలిపారు. (కేంద్ర మంత్రులు, రాహుల్ గాంధీ విషెస్)
ప్రత్యేక రైళ్లు నడపండి..
అదే విధంగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడపాలని ఎంపీ విజయసాయిరెడ్డి రైల్వే మంత్రి పియూష్ గోయల్‌కు విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో స్పెషల్ మెన్షనింగ్ ద్వారా ఎంపీ కోరారు. ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదని తెలిపారు. వలస కార్మికులు, ప్రయాణికులకు ఉన్న రైళ్లు సరిపోవడం లేదన్నారు. కొత్తగా 80 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినా, అందులో హైదరాబాద్-విశాఖపట్నం, హైదరాబాద్-తిరుపతి మధ్య ఒక్క రైలు కూడా లేదని రైల్వే మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఏపీ, తెలంగాణ మధ్య అత్యధికంగా రాక పోకలు కొనసాగే మార్గాలివేనని తెలిపారు. ప్రత్యేక రైళ్లను వెంటనే ప్రవేశపెట్టి సహకరించాలని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. (ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు)
Comments
Please login to add a commentAdd a comment