సాక్షి, ఢిల్లీ: సమగ్ర శిక్షా అభియాన్ అనే కొత్త కేంద్ర ప్రభుత్వ పథకంపై గురువారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన స్టార్ ప్రశ్నకు మంత్రి ప్రకాష్ జవదేకర్ జవాబిచ్చారు. సర్వశిక్షా అభియాన్ విలీనం అంశంపై వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. సర్వశిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో నిర్వహిస్తున్న టీచర్ ట్రైనింగ్ కార్యక్రమాలను వీలీనం చేస్తూ ప్రభుత్వం సమగ్ర శిక్షా అభియాన్ అనే కొత్త పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నందున.. ఇప్పటి వరకు ఈ మూడు పథకాల కింద కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న వారి భవిష్యత్తు గురించి ప్రభుత్వం ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచించిందా? వీలీనం వల్ల వారంతా ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మిగిలిపోకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? అని ప్రశ్నించారు. దీనికి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ జవాబిస్తూ, విజయసాయి రెడ్డి కొత్త సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని, దీనిపై ప్రభుత్వం ఆలోచిస్తుందని జవాబిచ్చారు.
మంత్రికి మరో ప్రశ్న వేస్తూ.. ‘కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సమగ్ర శిక్షా అభియాన్ పథకం కింద ఖర్చు చేసే నిధులలో కేంద్ర ప్రభుత్వ వాటా 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా 40 శాతంగా నిర్ణయించారు.
అయితే ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేక దృష్టితో చూస్తామని, అందులో వివిధ పథకాల అమలుకోసం కేంద్రం రాష్ట్రానికి చేసే సాయంలో 90 శాతం కేంద్రం భరిస్తే, 10 శాతం మాత్రమే రాష్ట్రం భరించాల్సి ఉంటుందని ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, హోం మంత్రి వరకు అందరూ సభలో ప్రకటించినందున సమగ్రశిక్షా అభియాన్ పథకం కింద కూడా మిగిలిన రాష్ట్రాల మాదిరలా కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు 90:10 నిష్పత్తిలోనే ఆర్థిక సహాయం అందిస్తుందా’ అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. దీనికి మంత్రి జవదేకర్ సూటిగా సమాధానం చెప్పకుండా గతంలో ఏవిధంగా ఈ పథకానికి కేంద్రం సాయం చేస్తున్నదో అలాగే కొనసాగుతుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment