
సాక్షి, న్యూఢిల్లీ : వాల్తేరు రైల్వే డివిజన్‌ను విశాఖపట్నంలోనే కొనసాగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. అత్యధిక ఆదాయం గడిస్తున్న భారత రైల్వే డివిజన్లలో వాల్తేరు డివిజన్ ఐదో స్థానంలో ఉందని పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి విజయవాడకు వాల్తేరు డివిజన్‌ను మార్చడం వల్ల సమస్యలు తలెత్తుతాయని ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు.
అదే విధంగా ఈ రెండు ప్రాంతాల మధ్య 350 కిలోమీటర్ల దూరం ఉండటం వల్ల ప్రమాదాలు జరిగినపుడు సహాయక చర్యలకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. డివిజన్ మార్పు కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమన్నారు. కాబట్టి వాల్తేరు డివిజన్‌ను యథావిధిగా విశాఖపట్నంలోనే కొనసాగించి ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను గౌరవించాలని సభా ముఖంగా కేంద్ర ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment