సంస్కరణలకు తక్షణ తరుణం | There Is An Urgent Need To Reform Indian Judicial system | Sakshi
Sakshi News home page

సంస్కరణలకు తక్షణ తరుణం

Published Tue, May 15 2018 2:20 AM | Last Updated on Tue, May 15 2018 2:20 AM

There Is An Urgent Need To Reform Indian Judicial system - Sakshi

కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థల స్వతంత్ర ప్రతిపత్తికి పూచీ పడుతూనే, ప్రభుత్వ, పార్లమెంట్‌ నిర్ణయాలను ప్రశ్నించడానికీ లేదా వ్యాఖ్యానించడానికీ న్యాయవ్యవస్థకు రాజ్యాంగం హక్కు కల్పించింది. ఈ ప్రతిపత్తిని కోర్టుకు దక్కనివ్వకుండా చేయడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే తీరులోనే వ్యవహరించిన సంగతిని విస్మరించలేం. కేవలం 540 మంది లోక్‌సభ సభ్యులు 125 కోట్ల మంది భారతీయుల మౌలిక ప్రయోజనాలను, రాజ్యాంగం స్పష్టంగా నిర్వచించి ఆదేశించిన కుల, మత, సామాజిక వ్యత్యాసాలు లేని, దోపిడీ వ్యవస్థకు తావులేని సెక్యులర్, సోషలిస్ట్‌ సమాజ నిర్మాణానికి, రక్షణకు ఎంతవరకు సహకరించే స్థితిలో ఉన్నారు?
‘భారత రాజ్యాం గంలో సుప్రీం కోర్టు స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. కానీ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం మసకబారుతూ ఉండడంతో న్యాయస్థానం విశ్వసనీయత హరించుకుపోతుంది.’
– ఫ్రంట్‌లైన్, 25–5–2018 (హిందూ గ్రూపు)

‘భావితరాల కోసం న్యాయ వ్యవస్థ హోదాను సంరక్షించుకుని కాపాడుకోవలసిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థ దృఢంగా, తగినంత స్వతంత్ర ప్రతిపత్తితో మెలగుతూ వర్తమాన సామాజిక సమస్యల పట్ల బాధ్యతతో ఉండాలి. ఈ దేశంలో ఎవరికీ భద్రత లేదు. ఈ పరిస్థితులలో పరిపాలనలో ఉన్న స్త్రీపురుషులను అదుపాజ్ఞలలో పెట్టగల యంత్రాంగం స్వతంత్ర న్యాయ వ్యవస్థ మాత్రమే. పదవులలో ఉన్నవారిని అధికారం అవినీతి పాల్జేస్తుందని మానవచరిత్ర నిరూపించింది. అధికారంలో ఉన్న పార్టీలు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లను దుర్వినియోగం చేస్తున్నాయి.’
– జస్టిస్‌ చలమేశ్వర్‌ (నాగ్‌పూర్‌ సభలో, 17–4–18)

ఇటీవల దేశ పరిపాలన క్రమంలో గొలుసుకట్టుగా సాగిన పరిణామాలు గణతంత్ర రాజ్యాంగ నిర్దేశిత లక్ష్యాలకే ప్రమాదకరంగా పరిణమించిన సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు దారితీసిన పరిణామాలు నాలుగు: 1. ఒక వైద్య కళాశాల ప్రవేశాల వ్యవహారంలో జరిగిన కుంభకోణంలో పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి ఒకరికి సంబంధం ఉన్న అంశాన్ని పరిశీలించాలని ఒక ఎన్జీవో (ప్రభుత్వేతర సంస్థ) సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఇందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా సిద్ధపడలేదు. దీనితో పిటిషనర్‌ నుంచి మరో పిటిషన్‌ దాఖలైంది. ఈసారి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా లేని ధర్మాసనానికి తన దరఖాస్తును నివేదించాలని పిటిషనర్‌ (ఎన్జీవో) కోరడం జరిగింది. ఆపై అత్యున్నత న్యాయస్థానంలో సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ చలమేశ్వర్‌ వేరే ధర్మాసనం ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. 2. ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేఎం జోసెఫ్, సీనియర్‌ న్యాయవాది ఇందు మల్హోత్రాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం (న్యాయ పాలనా నిర్వహణ వ్యవస్థ) సిఫారసు చేయడం. 3. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తిగా సొహ్రా బుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసును విచారిస్తున్న జస్టిస్‌ లోయా ఆకస్మికంగా మరణించారు. ఈ కేసులో ఒక బీజేపీ ప్రముఖ నేత అభియోగాలను ఎదుర్కొంటున్నారు. లోయా మరణం గురించి న్యాయవాదులు, పౌర సంఘాల ప్రతినిధులు, లోయా తోబుట్టువులు అనుమానాలు వ్యక్తం చేశారు. చివరకు కేసు సుప్రీం కోర్టుకు చేరినా సమగ్ర విచారణకు ఆదేశాలు ఇవ్వడానికి అంగీకరించక, కొట్టివేయడం జరిగింది. ఇంకొక అంశం– జస్టిస్‌ దీపక్‌ మిశ్రా మీద రాజ్యసభలో విపక్షం ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని చైర్మన్‌ వెంకయ్యనాయుడు ఏకపక్షంగా తోసిపుచ్చడం. 4. సుప్రీంకోర్టుకు వచ్చిన పిటిషన్లను సంబంధిత ధర్మాçసనాలకు కేటాయించడంలో ప్రధాన న్యాయమూర్తి సోదర న్యాయమూర్తులతో సంప్రతించడం అనివార్యమా అన్న ప్రశ్న తలెత్తింది. దీనిపైన న్యాయమూర్తులలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి.

ఇంత పెద్ద దేశాన్ని వారే శాసించాలా?
కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థల స్వతంత్ర ప్రతిపత్తికి పూచీ పడుతూనే, ప్రభుత్వ, పార్లమెంట్‌ నిర్ణయాలను ప్రశ్నించడానికీ లేదా వ్యాఖ్యానించడానికీ న్యాయవ్యవస్థకు రాజ్యాంగం హక్కు కల్పిం చింది. ఈ ప్రతిపత్తిని కోర్టుకు దక్కనివ్వకుండా చేయడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే తీరులోనే వ్యవహరించిన సంగతిని విస్మరించలేం. కేవలం 540 మంది లోక్‌సభ సభ్యులే 125 కోట్ల మంది భారతీయుల మౌలిక ప్రయోజనాలను, రాజ్యాంగం స్పష్టంగా నిర్వచించి ఆదేశించిన కుల, మత, సామాజిక వ్యత్యాసాలు లేని, దోపిడీ వ్యవస్థకు తావులేని సెక్యులర్, సోషలిస్ట్‌ సమాజ నిర్మాణానికి, రక్షణకు ఎంత వరకు సహకరించే స్థితిలో ఉన్నారు? ఏడు దశాబ్దాలుగా పాలకవర్గ ఆచరణ దీనిని నిరూపిస్తూనే ఉంది. అలాంటి వాతావరణంలో మనం నిర్వహించుకుంటున్న పెట్టుబడిదారీ వ్యవస్థలో న్యాయస్థానాలు కూడా తమ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోలేవని (తొలి రెండు దశాబ్దాల నాటి భారత న్యాయమూర్తుల తీర్పులను మినహాయిస్తే) నేటి చరిత్ర మరింత స్ఫుటంగా హెచ్చరిస్తున్నది. అనేక సందర్భాలలో సాక్ష్యాలు ఉన్నా వాటిని ‘నిర్దిష్టంగా లేవు’ అన్న సాకుతో నీరుగారుస్తున్నారు. బీజేపీ హయాంలో 2002లో గుజరాత్‌లో మైనారిటీల మీద జరిగిన దాడులు కావచ్చు, ఇప్పుడు ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఏదో ఒక పేరుతో దళితులు, మైనారిటీల మీద జరుగుతున్న దాడుల విషయంలో గానీ సాక్ష్యాలను, సాక్షులను మాయం చేస్తున్న ఘటనలు మీడియా ద్వారా వెలుగు చూస్తున్నాయి. ఐదుగురు సభ్యుల ధర్మాసనం 1964లోనే (కొలీజియంకు మచ్చలేని రోజులు) అన్ని కేసులలోను అన్ని సాక్ష్యాలను నమ్మలేకపోయినా సాక్ష్యాన్ని పూర్తిగా విచారించి బేరీజు వేయడంలో న్యాయస్థానం జాగరూకతతో మెలగాలని ఒక తీర్పులో పేర్కొన్నది. ‘ఇచ్చిన సాక్ష్యంలో కొన్ని వైరుధ్యాలు ఉన్నా, లేకపోయినా లేదా సాక్ష్యం సబబైనదేనని కోర్టుకు అనిపించినా లేదా సాక్ష్యం వల్ల బహిర్గతమై గాథ నిజమైనా లేకున్నా – ఇవన్నీ తప్పనిసరిగా గణనలోనికి తీసుకోవలసిందే. కానీ సాక్షులు ఇచ్చిన సాక్ష్యాలు సాక్షికమైనవీ, ప్రయోజనాలు ఆశించినవీ కాబట్టి, వాటిని సాక్ష్యాలుగా పరిగణించరాదన్న భావన మాత్రం హేతు విరుద్ధం. కేవలం ఫలానా సాక్ష్యాన్ని అది పాక్షికమైనదన్న కారణంగా యాంత్రికంగా (మెకానికల్‌ రిజెMý‡్షన్‌) తోసిపుచ్చడమంటే తరచూ అన్యాయానికే దారితీస్తుంది’’(మసల్తీ వర్సెస్‌ ఉత్తరప్రదేశ్‌ కేసులో సుప్రీం తీర్పు). న్యాయ నిపుణుడు జస్టిస్‌ వి.ఆర్‌. కృష్ణయ్యర్‌ ఒక సందర్భంలో చెప్పినట్టు ‘‘న్యాయమూర్తులు వివాదాలపై తీర్పులు చెబుతూంటారు. కానీ, సమాజాన్ని మార్చడం కూడా న్యాయమూర్తుల కర్తవ్యం కాగలిగినప్పుడు అసలైన మార్పుకు దోహ దం చేయగలుగుతారు!’’

సంస్కరణలకు తొందరపడాలి
ఈ అనుభవాలన్నింటిని రంగరించి, క్రోడీకరించుకున్న జస్టిస్‌ కృష్ణయ్యర్‌ న్యాయవ్యవస్థకు ఆరోగ్యకరమైన ఒక ‘సంస్కరణ పత్రాన్ని’(రిఫార్మ్‌ ఎజెండా) 1980లోనే అందజేశారు: అందులో: ‘‘మన న్యాయస్థానాలు నేడు క్లిష్ట దశలో ఉన్నాయి, మన జడ్జీలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. మన న్యాయ పాలనా వ్యవస్థ ఎంత గోప్యంగా, ఎంత ఆటంకంగా తయారైందంటే– అది సామాన్య ప్రజల నుంచి దూరంగా జరిగిపోయింది. అందుకనే ఈ మౌలికమైన లోటును సవరించాలి. ఇందుకు న్యాయ ప్రక్రియలోనే సంస్కరణ, కూలంకషమైన మార్పులు రావాలి. మన న్యాయ వ్యవస్థ రాజ్యాంగ దార్శనిక దృష్టి స్పష్టంగా, ప్రకాశమానంగా ఉండాలి. దాని లక్ష్యం రాజ్యాంగం ముందుమాటలో నిర్వచించిన ప్రజానుకూల విలువలకు కట్టుబడి ఉండాలి. కేంద్ర, రాష్ట్ర స్థాయి శాసన వేదికలు నేడు సమాజంలోని మోతుబరులకే అనుకూల వ్యవస్థలు. శ్రామిక ప్రజా బాహుళ్యంతో సంబంధం లేని వర్గాలు న్యాయ వ్యవస్థ తీరుతెన్నుల్ని నడిపిస్తున్నాయి. వీరి ఎంపిక ఆశ్రిత పక్షపాతం ఆదాయ వనరులపై ఆధారపడి జరుగుతుంటుంది. జడ్జీల ఎంపిక ప్రక్రియలో, సుప్రీం బెంచ్‌కి సోదర న్యాయమూర్తులను ఎంచుకోవడంలో చర్యలు కొన్ని సందర్భాలలో సెలక్షన్‌ తీరుకు విరుద్ధంగా ఉంటున్నాయి. చివరికి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌) సహితం పేదల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వాడుతున్నారు’’అన్నారు (ఫ్రం బెంచ్‌ టు బార్‌’ జస్టిస్‌ కృష్ణయ్యర్‌). ఎన్నికైన ప్రతినిధులూ, శాసనకర్తలూ ఎంతగా వంకర పద్ధతుల్లో ధన ప్రయోగానికీ అవి నీతికీ పాల్పడుతుంటారో ఇంటర్నెట్‌ ద్వారా ఒకరు తనకు ‘ఈ–మెయిల్‌’లో పంపిన వ్యంగ్య సందేశాన్ని జస్టిస్‌ కృష్ణయ్యర్‌ ప్రస్తావించారు. అందులో పేర్కొన్న ‘కంపెనీ’ ఏదో కాదు సుమా! ప్రభుత్వమే.

‘‘ఈ కంపెనీ కింద పనిచేసే ‘ఉద్యోగులు’ 500 మంది పైచిలుకు ఉంటారు. అందులో 29 మంది భార్యల్ని వేధించేవారని ఆరోపణ. మరి ఏడుగురు మోసాల కారణంగా అరెస్టయినవారు. 19 మంది పైన క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 117 మంది మీద హత్య, రేప్‌లు, దాడులు, దోపిడీ నేరాల మీద విచారణ సాగుతోంది. 71 మంది తీసుకున్న రుణాలు/అప్పులున్నందున పరపతి పుట్టనివారు. 21 మంది అనేక కోర్టు దావాల్లో ఇరుక్కున్నవారు. 84 మంది దాడుల కేసుల్లో జరిమానాలు చెల్లించారు. ఇంతకూ ఇంతటి ‘బడా కంపెనీ’ ఏదై ఉంటుందో ఊహించండి. ఆ ‘కంపెనీ’ భారత దిగువ సభ, ఇది నీ కోసం, నా కోసమే పనిచేస్తుంది సుమా! దిగువ సభలోని 545 మంది సభ్యులు నీ కోసం నా కోసమే పనిచేస్తారు. ఇదే ‘గ్రూపు’ మనల్నందర్నీ ఒక వరసలో నిలబెట్టి వందలాదిగా చట్టాలు చేస్తుంది. ఇంతటి భారీ ‘కంపెనీ’ గురించి మనమేమైనా చేయగలమా?!’’. ఆ ప్రశ్నార్థకంతో ఆ ఈ–మెయిల్‌ సందేశాన్ని జస్టిస్‌ ముగించారు.

-ఏబీకే ప్రసాద్‌,సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement