ఓటింగ్‌పై ట్రంప్‌కార్డు  | Donald Trump Signs New Executive Order To Change Election Rules, Read Full Story For More Details | Sakshi
Sakshi News home page

ఓటింగ్‌పై ట్రంప్‌కార్డు 

Published Thu, Mar 27 2025 5:54 AM | Last Updated on Thu, Mar 27 2025 11:13 AM

Donald Trump signs new executive order to change election rules

ఇకపై అదీకృత గుర్తింపు కార్డుంటేనే అనుమతి 

పోలింగ్‌ తేదీ తర్వాత పోస్టల్‌ ఓట్లను లెక్కించరు 

ఎన్నికల సంస్కరణల ఉత్తర్వులపై సంతకం

న్యూయార్క్‌: అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికాలో ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత తెచ్చే లక్ష్యంతో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో సమూల సంస్కరణలు తెస్తూ బుధవారం మరో కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. 

ఇన్నాళ్లూ స్వీయప్రకటిత పత్రాన్ని సమర్పించి ఓటింగ్‌ కేంద్రంలో పౌరులు ఓటేస్తుండగా ఇకపై ఏదైనా అదీకృత గుర్తింపు పత్రం/కార్డును చూపించి అమెరికా పౌరుడిగా నిరూపించుకున్నాకే ఓటేసేందుకు అనుమతి ఇస్తామని ట్రంప్‌ తెగేసి చెప్పారు. దీంతో పెళ్లయ్యాక ఇంటి పేరు మారిన, సరైన డ్రైవింగ్‌ లైసెన్స్, కొత్త పాస్‌పోర్ట్‌లేని అమెరికా పౌరులకు ఓటింగ్‌ కష్టాలు మొదలుకానున్నాయి. 

భారత్, బ్రెజిల్‌ వంటి దేశాలు ఇప్పటికే ‘ఓటింగ్‌ కేంద్రం వద్ద గుర్తింపు కార్డు’ విధానాన్ని అవలంబిస్తుండగా ట్రంప్‌ సైతం అమెరికాను ఇదే బాటలో పయనింపజేయాలని నిశ్చయించుకున్నారు. వచ్చే ఏడాది మధ్యంతర ఎన్నికలున్న నేపథ్యంలో ఆలోపే ఎన్నికల సంస్కరణలను అమల్లోకి తేవాలని ట్రంప్‌ నిర్ణయించుకున్నారు. ఇందులోభాగంగా బుధవారం ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకంచేశారు. అయితే ఎన్నికల నిర్వహణ బాధ్యత రాష్ట్రాలకే ఉండటంతో ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ఏ మేరకు సమగ్రస్థాయిలో అమలవుతుందో తేలాల్సి ఉంది. ఈ కార్యనిర్వాహక ఉత్తర్వును కొన్ని రాష్ట్రాలు కోర్టుల్లో సవాల్‌చేసే అవకాశం ఉంది. 

గుర్తింపు కార్డు తప్పనిసరి 
ఇన్నాళ్లూ ఫెడరల్‌ ఎన్నికల్లో పౌరులు ఓటేసేటప్పుడు సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పత్రాన్ని అందజేసి తమ ఓటు హక్కును వినియోగించుకునేవారు. ఇకపై ఆ విధానానికి స్వస్తి పలికి భారత్‌లో మాదిరి ఏదైనా గుర్తింపు కార్డును చూపిస్తేనే ఓటేసేందుకు అనుమతించాలని ట్రంప్‌ యంత్రాంగం నిర్ణయించింది. పాస్ట్‌పోర్ట్, బర్త్‌ సర్టిఫికెట్‌ వంటి అ«దీకృత గుర్తింపు పత్రం/కార్డును ఓటింగ్‌ కేంద్రంలో చూపించాల్సి ఉంటుంది. అక్రమంగా అమెరికాలో ఉంటున్న వాళ్లను బహిష్కరిస్తూ, స్వదేశాలకు తరలిస్తూ ట్రంప్‌ సర్కార్‌ తీసుకుంటున్న చర్యలను అధికార రిపబ్లికన్‌ పార్టీ స్వాగతిస్తోంది. 

దీంతో నాన్‌–అమెరికన్లలో రిపబ్లికన్‌ పార్టీ పట్ల వ్యతిరేకత ఉంది. వీరిలో ఓటేసే అవకాశమున్న వాళ్లు విపక్ష డెమొక్రటిక్‌ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల గెలుపు అవకాశాలను దెబ్బతీసేందుకు, నాన్‌–అమెరికన్లు ఓటింగ్‌లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని అమెరికా మీడియాలో వార్తలొచ్చాయి. పౌరులుకాని వ్యక్తులను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు, తొలుత వారిని గుర్తించేందుకు హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ, సోషల్‌ సెక్యూరిటీ, స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌లు అన్ని రాష్ట్రాల అధికారులకు ఈ జాబితాను అందజేయనున్నాయి. 

వ్యతిరేకిస్తున్న హక్కుల సంఘాలు 
గుర్తింపు కార్డు ఉంటేనే ఓటేసేందుకు అనుమతిస్తామనడం ఓటింగ్‌ హక్కును కాలరాయడమేనని ఓటింగ్‌ హక్కుల సంఘాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ‘‘ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ను అమలుచేస్తే ఓటర్ల జాబితాలోని నాన్‌–సిటిజన్లు కొద్దిమంది మాత్రమే ఓటింగ్‌ను కోల్పోరు. సరైన పత్రాలు లేని లక్షలాది మంది అమెరికా పౌరులు సైతం తమ ఓటు హక్కుకు దూరమవుతారు. ఇది ఓటింగ్‌ శాతంపై పెను ప్రభావం చూపుతుంది. గెలుపుపైనా ప్రభావం పడొచ్చు’’ అని లాస్‌ఏంజెలెస్‌లోని కాలిఫోరి్నయా యూనివర్సిటీలో ఎన్నికల చట్టాల నిపుణుడు రిచర్డ్‌ హేసన్‌ అభిప్రాయపడ్డారు. ‘‘మహిళల బర్త్‌ సర్టిఫికెట్‌లో అసలైన పేరు ఉంటుంది. పెళ్లయ్యాక లాస్ట్‌నేమ్‌ మారుతుంది. పెళ్లయ్యాక తీసుకున్న పత్రాలు, బర్త్‌ సర్టిఫికెట్‌ ఒకలా ఉండవు. ఇలాంటి వాళ్లు ఓటేయడ కష్టమే’’ అని ఆయన ఉదహరించారు. 

14.6 కోట్ల మందికి పాస్‌పోర్ట్‌ లేదు 
పబ్లిక్‌ సిటిజన్‌ అనే సంస్థ గణాంకాల ప్రకారం అమెరికన్‌ పౌరుల్లో దాదాపు 14.6 కోట్ల మందికి పాస్‌పోర్ట్‌ లేదు. ఓటింగ్‌కు పాస్‌పోర్ట్, బర్త్‌ సర్టిఫికెట్‌నే అనుమతించే అవకాశముంది. ఈ నేపథ్యంలో కోట్లాది మంది ఓటింగ్‌కు దూరమయ్యే అవకాశముంది. ‘‘ట్రంప్‌ అతి చర్యల కారణంగా ప్రభుత్వ రికార్డులన్నింటిలో పేరు సరిపోలిన వాళ్లు మాత్రమే ఓటేసేందుకు అర్హులవుతారు. ఇంటి పేరు మారిన మహిళలు, కార్చిచ్చులు, తుపాన్లు, వరదల్లో ఇళ్లు కాలిపోయి డాక్యుమెంట్లు పోగొట్టుకున్న వాళ్లు ఇకపై ఓటు హక్కును వినియోగించుకోవడం అసాధ్యం’’ అని డెమొక్రటిక్‌ నేత, దిగువసభ సభ్యురాలు జాస్మిన్‌ ఫెలీసియా క్రోకెట్‌ ఆందోళన వ్యక్తంచేశారు.  

తర్వాత వచ్చే బ్యాలెట్‌ ఓట్లను పరిగణించరు 
కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే ఎన్నికల తేదీ తర్వాత వచ్చే పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను అనుమతించబోరు. ఓటింగ్‌ తేదీకి ముందే మార్కింగ్‌ చేసి పోస్ట్‌లో పంపినట్లు రుజువైతే మాత్రమే తర్వాతి తేదీన అందినా అనుమతిస్తారు. ప్రస్తుతం 18 రాష్ట్రాలు, ప్యూర్టోరీకో మాత్రమే తర్వాత తేదీ నుంచి వచి్చనా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను అనుమతిస్తున్నాయి. అత్యధిక ఓటర్లు ఉన్న కాలిఫోర్నియా రాష్ట్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను ఏకంగా ఏడు రోజుల తర్వాత కూడా అనుమతిస్తారు. 

ఎన్నికల విరాళాల మీదా ఆంక్షలు! 
రాజకీయ పార్టీలకు వ్యక్తులు నేరుగా విరాళాలు ఇచ్చే అవకాశం లేదు. పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీలను ఏర్పాటుచేసి వాటికి విరాళాలు అందించి వాటి ద్వారానే ఎన్నికల ఖర్చులకు సాయపడొచ్చు. ఈ ఎన్నికల విరాళాలపైనా కఠిన నియమాలను ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌లో పొందుపరిచినట్లు తెలుస్తోంది. అమెరికా పౌరులుగాని వ్యక్తులు విరాళాలు ఇవ్వకుండా నిషేధం విధిస్తున్నట్లు ట్రంప్‌ ఉత్తర్వులో పేర్కొన్నారు.

ఎన్నికల నిబంధనల్లో విఫలమయ్యాం: ట్రంప్‌ 
‘‘సుపరిపాలనలో మనం ఎన్నో దేశాలకు ఆదర్శంగా ఉన్నాం. కానీ ఎన్నికల ప్రాథమిక నిబంధనల పటిష్ట అమలులో విఫలమయ్యాం. ఈ విషయంలో అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలు ఎంతో ముందున్నాయి. భారత్, బ్రెజిల్‌ వంటి దేశాలు ఓటర్ల జాబితాను బయోమెట్రిక్‌ డేటాబేస్‌తో పోలి్చచూస్తూ ముందంజలో ఉంటే మనం ఇంకా సెల్ఫ్‌–అటెస్టేషన్‌ స్థాయిలోనే ఆగిపోయాం. జర్మనీ, కెనడా వంటి దేశాలు పేపర్‌ బ్యాలెట్లను అందరి సమక్షంలో లెక్కిస్తూ ఎలాంటి వివాదాలకు తావివ్వడం లేదు. మనం వేర్వేరు రకాల ఓటింగ్‌ విధానాలను అవలంభిస్తూ సుదీర్ఘ ఓటింగ్‌ ప్రక్రియలో మునిగిపోయాం. మెయిల్‌–ఇన్‌ ఓట్ల విషయంలో డెన్మార్క్, స్వీడన్‌ ముందున్నాయి’’.

బ్రెనాన్‌ సెంటర్‌ ఫర్‌ జస్టిస్‌ గణాంకాల ప్రకారం ఓటింగ్‌ వయసున్న అమెరికా పౌరుల్లో  9 శాతం మందికి, అంటే 2.13 కోట్ల మందికి పౌరసత్వాన్ని              నిరూపించుకునేఎలాంటి గుర్తింపు పత్రాలూ లేవు!  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement