
స్థానిక భాగస్వాములతో సమస్యలు
జేవీల్లో వాటాలు పెంచుకోవడంలో ఇబ్బందులు
నెమ్మదిగా నిష్క్రమిస్తున్న సంస్థలు
న్యూఢిల్లీ: విదేశీ బీమా కంపెనీలు దేశీయంగా విస్తరించడానికి వెసులుబాటు కల్పిస్తూ ఇన్సూరెన్స్ రంగంలో పలు సంస్కరణలు ప్రవేశపెడుతున్నప్పటికీ పరిస్థితులు అంత అనుకూలంగా కనిపించడం లేదు. కార్యకలాపాలను విస్తరించడం మాట అటుంచి స్థానిక భాగస్వాములతో సరిగ్గా పొసగకపోతుండటంతో క్రమంగా అవి ని్రష్కమిస్తున్నాయి.
ఇటీవలి జర్మనీకి చెందిన అలయంజ్ గ్రూప్..తమ భారత భాగస్వామి బజాజ్ ఫిన్‌సర్వ్‌తో రెండు దశాబ్దాల అనుబంధానికి స్వస్తి చెప్పింది. జాయింట్ వెంచర్‌లో వాటాలను పెంచుకోవడం, మేనేజ్‌మెంట్‌పై నియంత్రణ దక్కించుకోవడం వంటి అంశాలపై వివాదం నెలకొనడమే ఇందుకు కారణం. బజాజ్ ఫిన్‌సర్వ్‌తో తెగదెంపులు చేసుకున్నా, మరో భాగస్వామితో పొత్తు కోసం కసరత్తు చేస్తోంది.
న్యూయార్క్ లైఫ్, ఐఎన్‌జీ, ఐఏజీ, ఓల్డ్ మ్యుచువల్ వంటి కంపెనీలు గత దశాబ్దన్నర కాలంలో భారత మార్కెట్ నుంచి ని్రష్కమించాయి. 2011లో దేశీ జీవిత బీమా రంగంలోకి ప్రవేశించిన టోకియో మెరైన్‌లాంటి కొన్ని గ్లోబల్ కంపెనీలు మాత్రమే ప్రస్తుతం దేశీయంగా వ్యాపారం సాగిస్తున్నాయి. కోటక్ జనరల్ ఇన్సూరెన్స్‌లో 70 శాతం వాటాను కొనుగోలు చేయడం ద్వారా అటు జ్యూరిక్ ఇన్సూరెన్స్ మాత్రం తమ వ్యాపారాన్ని విస్తరించింది. గత దశాబ్దకాలంగా కార్యకలాపాలు ప్రారంభించిన చాలా మటుకు ఇన్సూరెన్స్ సంస్థలకు ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ దన్నుగా నిలుస్తున్నాయి.
ఎఫ్‌డీఐ పరిమితి పెంచినా..
బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 100 శాతానికి పెంచాలని బడ్జెట్‌లో ప్రతిపాదించినప్పటికీ, దీనితో పెట్టుబడులు వెల్లువెత్తే అవకాశాలు తక్కువేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్ మార్కెట్‌పై ఆసక్తిగా ఉన్న కంపెనీలు ఇప్పటికే వచ్చేశాయని విదేశీ ఇన్సూరెన్స్ సంస్థల విస్తరణ వ్యూహాల గురించి అవగాహన ఉన్న వర్గాలు తెలిపాయి. ఎఫ్‌డీఐలపై పరిమితిని 49 శాతం నుంచి 74 శాతం వరకు పెంచినప్పటికీ చాలా మటుకు విదేశీ ఇన్వెస్టర్లు తమ వాటాలను 49 శాతం లేదా అంతకన్నా తక్కువగానే కొనసాగిస్తున్నాయి.
పంపిణీ, మార్కెట్‌లో కార్యకలాపాలు సాగించడం కోసం దేశీ భాగస్వాములపై ఆధారపడాల్సి ఉండటమే ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ‘‘ఎఫ్‌డీఐ పరిమితిని పెంచినంత మాత్రాన పెట్టుబడులు ఒక్కసారిగా వెల్లువెత్తబోవు. భారత్‌లో బీమా అంత సులువైన వ్యాపారం కాదు. విస్తరించాలంటే పంపిణీ నెట్‌వర్క్ చాలా పటిష్టంగా ఉండాలి, అపార నిర్వహణ అనుభవం ఉండాలి, స్థానికంగా సత్సంబంధాలు ఉండాలి. ఉద్యోగులను నియమించుకుంటే సరిపోదు. క్షేత్రస్థాయిలో బాగా కష్టపడాల్సి ఉంటుంది’’ అని విశ్లేషకులు తెలిపారు.
బీమా వ్యాపారం లిస్టింగ్ యోచనలో బజాజ్ ఫిన్‌సర్వ్..
అలయంజ్‌తో 24 ఏళ్ల భాగస్వామ్యం ముగిసిన తర్వాత బీమా విభాగాలను స్టాక్ మార్కెట్లలో లిస్ట్ చేయడంపై బజాజ్ ఫిన్‌సర్వ్ కసరత్తు చేస్తోంది. ఈ రెండు కంపెనీలు కలిసి .. బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ (బీఏజీఐసీ), బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ (బీఏఎల్‌ఐసీ) అని రెండు విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహించాయి. జాయింట్ వెంచర్‌లో అలయంజ్‌కి ఉన్న 26 శాతం వాటాల విలువను రూ. 24,180 కోట్లుగా లెక్కగట్టారు.
బీఏజీఐసీ విలువ సుమారు రూ. 53,000 కోట్లుగా, బీఏఎల్‌ఐసీ విలువ రూ. 40,000 కోట్లుగా లెక్కగట్టారు. డీల్ ప్రకారం రెండు బీమా కంపెనీల విలువ రూ. 93,000 కోట్లని, అలయంజ్ వాటాల కొనుగోలు పూర్తయ్యాక లిస్టింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని బజాజ్ ఫిన్‌సర్వ్.. నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐకి సమరి్పంచిన ప్రణాళికలో పేర్కొంది. చట్టప్రకారం లిస్టింగ్‌కి వెళ్లాల్సిన అవసరం లేకపోయినప్పటికీ, బీమా కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి రావడాన్ని ఐఆర్‌డీఏఐ ప్రోత్సహిస్తోంది.