
ఐ.టి. దిగ్గజ సంస్థ టి.సి.ఎస్. మే 1 నుంచి ఆర్తి సుబ్రహ్మణ్యానికి సి.ఓ.ఓ. బాధ్యతలు అప్పజెప్పింది. బహుశా దేశంలో ఐ.టి. రంగంలో సి.ఓ.ఓగా నియమితురాలైన
మొదటి మహిళ ఆర్తినే కావొచ్చు. ఆమె పరిచయం.
చిన్న చిన్న ఉద్యోగాలు, వర్తకాలు చేసే వారు కూడా ‘వాకింగ్‌కి టైమ్ దొరకలేదు’ అంటుంటారు. కాని టాటా సంస్థల్లో కీలకమైన బాధ్యతల్లో ఉంటూ వచ్చిన ఆర్తి సుబ్రహ్మణ్యం ఏ రోజూ వాకింగ్ మానేయరు. వాన వచ్చినా వరద ముంచెత్తినా వాకింగ్ చేయాల్సిందే.
‘రోజుకు 10 నుంచి 12 కిలోమీటర్లు నడవాలని నా ప్రయత్నం. కనీసం ఆరు నుంచి ఎనిమిదైనా నడుస్తుంటాను. నడక ఆలోచనకు చోటు ఇస్తుంది. ఆరోగ్యకరమైన శరీరం, ఆరోగ్యకరమైన ఆలోచన విజయానికి దోహదం చేస్తాయి’ అంటారామె. 58 ఏళ్ల ఆర్తి సుబ్రహ్మణ్యం 30 బిలియన్ డాలర్ల లావాదేవీలు ఉన్న దిగ్గజ ఐ.టి. సంస్థ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ (టి.సి.ఎస్.)కు మే 1 నుంచి సి.ఓ.ఓ. (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గా బాధ్యతలు స్వీకరించనున్నారు. సాధారణంగా మగవారే పై స్థానాల్లో ఉండే ఐ.టి. రంగంలో సి.ఓ.ఓ.గా మహిళ కనిపించడం అరుదు. టాటా సంస్థల్లో గాని, ఇతర ఐ.టి. దిగ్గజ సంస్థల్లోగాని ఇలా సి.ఓ.ఓ.స్థాయికి చేరిన స్త్రీలు బహు తక్కువ. అందుకే అందరూ అబ్బురంగా ఆర్తి వైపు చూస్తున్నారు.
ట్రయినీగా చేరి.. అంచెలంచెలుగా ఎదిగి...
ఆర్తి సుబ్రహ్మణ్యం మన వరంగల్ విద్యార్థి. వరంగల్ ఎన్.ఐ.ఐ.టి.లో బి.టెక్ కంప్యూటర్ సైన్స్ చేసి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్‌లో ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేశారు. 1989లో తన కెరీర్‌ని గ్రాడ్యుయేట్ ట్రయినీగా టాటాలో మొదలుపెట్టి్ట అంచెలంచెలుగా ఎదిగారు. దాదాపు టాటాలోని అన్ని కీలక సంస్థల్లో ముఖ్యహోదాల్లో పని చేశారు. మన దేశంలో పాస్‌పోర్ట్ డిజిటలైజేషన్ కోసం టాటా నిర్వహించిన ప్రాజెక్ట్‌లో చురుగ్గా పని చేశారు. టాటా ఏ.ఐ.జి.లో, అలాగే హెచ్.ఆర్‌లో చేస్తూ టాటా సన్స్‌లో ఎనిమిదేళ్లుగా గ్రూప్ చీఫ్ డిజిటల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. అక్కడి నుంచే టి.సి.ఎస్.కు సి.ఓ.ఓ.గా వస్తున్నారు.
మిసెస్ ఫిక్సిట్
ఆర్తి సుబ్రహ్మణ్యానికి సాటి ఉద్యోగులు ‘మిసెస్ ఫిక్సిట్’ అని సరదాగా పిలుచుకుంటారు. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా దానికి ఆమె దగ్గర సమాధానం ఉంటుంది. సవాళ్లను స్వీకరించే ఆమె తత్త్వమే ఆమెను ఈ స్థాయికి చేర్చింది. అయితే ఆమెకు ఉద్యోగమే జీవితం కాదు. వారాంతం వచ్చిందంటే కచ్చితంగా బాలీవుడ్ సినిమా చూడాల్సిందే. అమితాబ్ బచ్చన్‌కు పెద్ద ఫ్యాన్. అలాగే పాటలు వింటారు. మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన పుస్తకాలు చదువుతారు. ‘ఒక వ్యక్తి రాబోయే కాలంలో ఎక్కడ ఎలా ఉండాలో నిర్దేశించుకుని ఆ లక్ష్యాన్ని చేరొచ్చు. అయితే టీమ్ మీతో ఉండి మీకు సహకరించాలి. మీరు టీమ్‌కి సహకరించాలి. అది జరిగిన పక్షంలో ఉద్యోగంలో ఒక్క క్షణం కూడా మీకు బోరు కొట్టదు’ అంటారామె. టి.సి.ఎస్.కు ఐదేళ్ల పాటు సి.ఓ.ఓ.గా పని చేయనున్నారు ఆర్తి సుబ్రహ్మణ్యం. ఈ సమయంలో ఈ వార్త ఆ సంస్థ ఉద్యోగులకే కాదు ఐ.టి. రంగంలో పని చేస్తున్న స్త్రీలందరికీ స్ఫూర్తిదాయకమే.