first lady
-
యుద్ధం–ప్రేమ..ఫ్యామిలీ లైఫ్
ఉక్రెయిన్‌పై రష్యా భీకర యుద్ధం, వెనక్కి తగ్గని దేశాధ్యక్షుడు జెలెన్స్కీ, భారత ప్రధాని నరేంద్రమోదీ ఉక్రెయిన్ చారిత్రక పర్యటన... ఇవి మాత్రమే మనకు కనిపించే దృశ్యాలు. యుద్ధ ప్రభావం దేశంపై సరే, కుటుంబంపై ఎలా ఉంటుంది? వైవాహిక జీవితంపై ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు తాజా ఇంటర్వ్యూలో సమాధానం చెప్పింది ఉక్రెయిన్ ప్రథమ మహిళ, జెలెన్స్కీ భార్య ఒలెనా...భర్త క్షేమంగా ఉండాలని ఏ భార్య అయినా కోరుకుంటుంది. భర్తను ఏ రోజు మృత్యువు కాటేస్తుందో అనే భయం మాత్రం భార్యకు క్షణ క్షణం నరకాన్ని చూపిస్తుంది. అలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొని తట్టుకొని గట్టిగా నిలబడించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భార్య ఒలెనా. ఉక్రెయిన్ భూభాగంలో గత రెండున్నర సంవత్సరాల యుద్ధ విషాదాలలో, జీవన్మరణ సమయాలలో వారి వివాహ బంధం పేకమేడలా కుప్పకూలి ΄ోవాల్సిన పరిస్థితి.‘ఈ యుద్ధం మీ వివాహబంధంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందా?’ అని అడిగిన ప్రశ్నకు ఒలెనా జెలెన్స్కీ చెప్పిన సమాధానం...‘రెండు దశాబ్దాల మా వివాహ బంధం గతంతో ΄ోలిస్తే మరింత దృఢమైంది. ఒకరికి ఒకరు అండగా నిలబడ్డాం’ అన్నది.‘యుద్ధప్రభావం కుటుంబ జీవితంపై ఉంటుందా?’ అని అడిగిన ప్రశ్నకు ‘కచ్చితంగా ఉంటుంది’ అని చెప్పింది ఒలెనా.యుద్ధ ఉద్రిక్తతల వల్ల గతంలో మాదిరిగా వారు తీరిగ్గా మాట్లాడుకునే రోజులు ΄ోయాయి. తన కుమార్తె ఒలెంక్సాండ్రా, కుమారుడు కైరీలోతో ΄ాటు ఒలెనా తన భర్తకు దూరంగా ఉండాల్సి వచ్చింది.‘ఈ విషయంలో ఎలాంటి అసంతృప్తీ లేదు. మేము ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాం. భార్యాభర్తల మధ్య ప్రేమ ఒక్కటే సరి΄ోదు. విశ్వాసం ముఖ్యం. నేను నా భర్త నిజాయితీని విశ్వసించక΄ోతే అ΄ారమైన ప్రేమ పంచినప్పటికీ అది వృథా అవుతుంది’ అంటుంది ఒలెనా.‘యుద్ధంలో మునిగితేలుతున్న దేశంలో ఏ వ్యక్తి అయినా సాధారణ జీవితం గడపలేరు. నిరంతరం మానసిక ఒత్తిడి అనేది సాధారణం’ అంటుంది.గత నెలలో కీవ్ శివార్లలోని పిల్లల ఆసుపత్రిపై రష్యా క్షిపణి దాడిలో ఇద్దరు పిల్లలు మరణించారు. ఎంతోమంది గాయపడ్డారు. తన సొంత పిల్లలపైనే దాడి జరిగినట్లు తల్లడిల్లి ΄ోయింది ఒలెనా.‘యుద్ధం వల్ల ప్రతి ఒక్కరూ అలిసి΄ోతారు. మిణుకు మిణుకుమనే ఆశ ఉజ్వలంగా వెలగాలనుకుంటారు. అయితే దీనికి ఎంతో సాహసం, అంతకుమించిన ఆత్మవిశ్వాసం కావాలి. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా రాక్షసంగా దాడులు జరుగుతున్నాయి. ఇలా జరుగుతుందేమిటి? అని నా భర్త ముందు ఎప్పుడూ కళ్లనీళ్లు పెట్టుకోలేదు. న్యాయం జయిస్తుంది అన్నట్లే మాట్లాడాను’ గతాన్ని గుర్తు చేసుకుంటూ అంటుంది ఒలెనా.ఒలెనాకు తన దేశ పౌరుల ధైర్యసాహసాల గురించి కథలు కథలుగా చెప్పడం అంటే ఇష్టం.ధైర్యం మంచిదేగానీ అన్నిసార్లూ కాక΄ోవచ్చు. ప్రమాదపు ఊబిలో దించవచ్చు. తిరుగులేని ధైర్యంతో ముందుకు వెళ్లిన జెలెన్స్కీపై ఎన్నోసార్లు హత్యాప్రయత్నాలు జరిగాయి. ఆ సమయంలో ఒలెనా మానసిక పరిస్థితి మాటలకందనిది. అయినా సరే, ప్రతికూల ఆలోచనలపై దృష్టి పెట్టేది కాదు. ‘అంతా మంచే జరుగుతుంది. ఆయన క్షేమంగా ఉండాలి’ అని ఒకటికి పదిసార్లు అనుకునేది.‘నిర్మొహమాటంగా చె΄్పాలంటే నా భర్త ధైర్యసాహసాలను చూసి నేను గర్విస్తున్నాను’ అంటుంది ఒలెనా.యుద్ధ విధ్వంసాన్ని కళ్లారా చూసిన ఒలెనా... ‘యుద్ధంలో మనం అత్యంత విలువైన వాటిని కోల్పోతాం’ అంటుంది.అయితే ఆమె కోల్పోనిది మాత్రం ధైర్యం. తన కుటుంబానికే కాదు దేశ ప్రథమ మహిళగా తనకు ఆ ధైర్యం ఎంతో ముఖ్యం. -
మెక్సికోలో కొత్త చరిత్ర
మెక్సికో సిటీ: మెక్సికో చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అంతా ఊహించినట్టుగానే అధికార మోరెనా వామపక్ష కూటమి అభ్యర్థి క్లాడియా షేన్‌బామ్ (61) ఘనవిజయం సాధించారు. 200 ఏళ్ల స్వతంత్ర మెక్సికో చరిత్రలో దేశ అధ్యక్ష పీఠమెక్కనున్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు. యూదు మూలాలున్న తొలి ప్రెసిడెంట్ కూడా ఆమే కానున్నారు! షేన్‌బామ్‌కు ఇప్పటికే దాదాపు 60 శాతం ఓట్లు లభించినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రత్యర్థులిద్దరూ నాకిప్పటికే ఫోన్ చేసి అభినందించారు. ఓటమిని అంగీకరించారు. దేశానికి తొలి అధ్యక్షురాలిని కాబోతున్నా’’ అంటూ చిరునవ్వులు చిందించారు. ‘‘ఇది నేను ఒంటరిగా సాధించిన విజయం కాదు. తల్లులు మొదలుకుని కూతుళ్లు, మనవరాళ్ల దాకా దేశ మహిళలందరి విజయమిది’’ అన్నారు. విపక్ష కూటమి మహిళకే అవకాశమిచి్చంది. రెండు ప్రధాన పారీ్టల నుంచీ మహిళలే తలపడటమూ మెక్సికో చరిత్రలో ఇదే తొలిసారి. విపక్ష కూటమి అభ్యర్థి సోచిల్ గాల్వెజ్కు 28 శాతం, మరో ప్రత్యర్థి జార్జ్ అల్వారిజ్ మైనేజ్‌కు 10 శాతం ఓట్లు వచి్చనట్టు ఈసీ పేర్కొంది. షేన్‌బామ్ నూతన చరిత్ర లిఖిస్తున్నారంటూ అధ్యక్షుడు ఆంద్రెజ్ మాన్యుయెల్ లోపెజ్ అబ్రేడర్ అభినందించారు. ఆరేళ్ల పదవీకాలంలో ఆయన పలు చరిత్రాత్మక నిర్ణయాలతో ప్రజల మనసు గెలుచుకున్నారు. షేన్‌బామ్ విజయంలో లోపెజ్ పాపులారిటీదే ప్రధాన పాత్ర. ఒకసారికి మించి అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు మెక్సికో రాజ్యాంగం అనుమతించదు. దాంతో ఆయన రెండోసారి బరిలో దిగలేకపోయారు. 2018లో లోపెజ్ గెలిచినప్పటి మాదిరిగా ఈసారి ప్రజల్లో పెద్దగా హర్షాతిరేకాలు వ్యక్తం కాకపోవడం విశేషం. అధ్యక్ష పదవితో పాటు పాటు 9 రాష్ట్రాల గవర్నర్లు, 128 మంది సెనేటర్లు, 500 మంది కాంగ్రెస్ ప్రతినిధులు, వేలాది మేయర్లు, స్థానిక సంస్థల ప్రతినిధి పదవులకు కూడా ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలపై ఆసక్తి నెలకొంది. మొత్తం 32 గవర్నర్ పదవుల్లో మెరేనా పార్టీకి 23 ఉన్నాయి. షేన్‌బామ్‌కు సవాళ్లెన్నో... షేన్‌బామ్ అక్టోబర్ 1న అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమెకు సవాళ్ల స్వాగతమే లభించనుంది. మహిళలపై హింసకు మెక్సికో ప్రపంచంలోనే పెట్టింది పేరు. ఈ సమస్యను రూపుమాపాల్సి ఉంది. సంక్షేమ పథకాలతో లోపెజ్ బాగా ఆకట్టుకున్నా అడ్డూ అదుపూ లేదని వ్యవస్థీకృత హింస, గ్యాంగ్ వార్లు, డ్రగ్ ట్రాఫికింగ్, పెట్రో ధరల పెరుగుదల తదితరాల కట్టడికి పెద్దగా చేసిందేమీ లేదన్న అసంతృప్తి ప్రజల్లో బాగా ఉంది. వీటిపై కొత్త అధ్యక్షురాలు దృష్టి పెట్టాలని వారు భావిస్తున్నారు. ప్రస్తుత పథకాలన్నింటినీ కొనసాగిస్తూనే దేశాన్ని పీడిస్తున్న అన్ని సమస్యలనూ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని షేన్‌బామ్ ప్రకటించారు. ఏ తారతమ్యాలూ లేకుండా ప్రజలందరినీ ఒకేలా చూస్తానన్నారు.లా డాక్టోరా... షేన్‌బామ్ విద్యార్హతలు అన్నీ ఇన్నీ కావు. ఎనర్జీ ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ చేవారు. అందుకే ఆమెను అభిమానులు ముద్దుగా ‘లా డాక్టోరా’ అని పిలుచుకుంటారు. పర్యావరణవేత్తగా చాలా పేరుంది. నోబెల్ శాంతి బహుమతి పొందిన ఐరాస పర్యావరణ శాస్త్రవేత్తల బృందంలో షేన్‌బామ్ సభ్యురాలు. రాజధాని మెక్సికో సిటీ మేయర్‌గా చేసిన తొలి మహిళ కూడా ఆమే. షేన్‌బామ్ తాత, అమ్మమ్మ హిట్లర్ హోలోకాస్ట్ హింసాకాండను తప్పించుకోవడానికి యూరప్ నుంచి మెక్సికో వలస వచ్చారు. షేన్‌బామ్ మెక్సికో సిటీలోనే పుట్టారు. 2000లో రాజకీయ అరంగేట్రం చేశారు. -
Mexico 2024 elections: మెక్సికో పీఠంపై తొలిసారి మహిళ!
మెక్సికో. లాటిన్ అమెరికాలో రెండో అతి పెద్ద దేశం. పురుషాధిపత్య భావజాలానికి పెట్టింది పేరు. మహిళలపై హింస, హత్య, యాసిడ్ దాడులు నిత్యకృత్యం. మెక్సికోలో ఇదే అతి పెద్ద సమస్య కూడా. అలాంటి దేశంలో తొలిసారి ఓ మహిళ అధ్యక్ష పదవి చేపట్టనున్నారు! ఆదివారం జరిగే ఎన్నికల్లో అధ్యక్ష పదవితో పాటు 128 మంది సెనేటర్, 500 మంది కాంగ్రెస్ ప్రతినిధులతో పాటు దాదాపు 20 వేల స్థానిక సంస్థల స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి పాలక, ప్రధాన సంకీర్ణాలు రెండింటి నుంచీ మహిళలే బరిలో ఉండటం విశేషం. పాలక ‘మోరెనా’ సంకీర్ణం తరఫున పోటీ చేస్తున్న క్లాడియా షేన్‌బామ్ గెలుపు ఖాయమేనని పరిశీలకులు చెబుతున్నారు. నేషనల్ యాక్షన్ పార్టీ సారథ్యంలోని విపక్ష కూటమి అభ్యర్థి సోచిల్ గాల్వెజ్పై ఆమె కనీసం 20 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్టు అన్ని సర్వేల్లోనూ తేలింది. మహిళలపై మితిమీరిన హింసకు పెట్టింది పేరైన ఆ దేశంలో వారికి రాజకీయ ప్రాతినిధ్యం కూడా నానాటికీ బాగా పెరుగుతుండటం విశేషం. దిగువ సభ (కాంగ్రెస్)లో అన్ని పారీ్టలూ మహిళలకు కనీసం 50 శాతం టికెట్లివ్వడాన్ని ఇప్పటికే తప్పనిసరి చేశారు. ఫలితంగా కాంగ్రెస్‌లో సగం మంది సభ్యులు మహిళలే ఉన్నారు. మెM్సకో జనాభా 13 కోట్లు కాగా దాదాపు 10 కోట్ల మంది ఓటర్లున్నారు. ఆదివారం పోలింగ్ ముగిశాక రాత్రికల్లా ఫలితాలు వెలవడే అవకాశముంది.సోచిల్ గాల్వెజ్61 ఏళ్ల గాల్వెజ్ సెనేట్ సభ్యురాలు. పారిశ్రామికవేత్త. ఎన్ఏపీ, పీఆర్ఐ, పీఏఎన్, ఆర్పీడీ సహా పలు పారీ్టలతో కూడిన విపక్ష కూటమి తరఫున బరిలో ఉన్నారు. లోపెజ్ ప్రవేశపెట్టిన పెన్షన్ పథకం వంటివాటిని తాను కూడా కొనసాగిస్తానని చెబుతూ పలు వర్గాలను ఆకట్టుకున్నారు. దాంతోపాటు మధ్య, దిగువ తరగతి ప్రజల కోసం సార్వత్రిక సామాజిక రక్షణ వ్యవస్థ తెస్తానంటున్నారు. పోలీస్ వ్యవస్థను పటిష్టపరిచి నేరాలపై ఉక్కుపాదం మోపుతానని చెబుతున్నారు.క్లాడియా షేన్‌బామ్ ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త. 2007లో నోబెల్ గ్రహీత. మెక్సికో సిటీ మాజీ మేయర్. గెలిస్తే తొలి అధ్యక్షురాలిగానే గాక యూదు మూలాలున్న తొలి వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించే అవకాశముంది. అధ్యక్షుడు ఆంద్రెజ్ మాన్యుయెల్ లోపెజ్ అబ్రేడర్కున్న విశేషమైన జనాదరణ ఉన్నా రెండోసారి పదవి చేపట్టేందుకు మెక్సికో రాజ్యాంగ ప్రకారం అనుమతించని కారణంగా పాలక సంకీర్ణ అభ్యరి్థగా షేన్‌బామ్ బరిలో దిగారు. కనీస వేతనాలను రెట్టింపు చేయడం, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల పెంపు, రైతులకు సబ్సిడీ, వర్సిటీ విద్యార్థులకు ప్రోత్సాహకాలు, నిరుద్యోగులకు భృతి వంటివి నేరుగా నగదు రూపంలో చెల్లించడం, సీనియర్ సిటిజన్లకు సార్వత్రిక పెన్షన్ సదుపాయం వంటివాటితో లోపెజ్ తన ఆరేళ్ల పదవీకాలంలో అందరి మన్ననలు పొందారు. ఇదంతా 61 ఏళ్ల షేన్‌బామ్‌కు బాగా కలిసి రానుంది. డ్రగ్ మాఫియా, వ్యవస్థీకృత నేరాలు మెక్సికో ఎదుర్కొంటున్న సమస్యల్లో ముఖ్యమైనవి. వీటి కట్టడికి లోపెజ్ పెద్దగా ప్రయత్నాలు చేయలేదన్న ఆరోపణలున్నాయి. తాను వాటిపైనా ప్రధానంగా దృష్టి సారిస్తానని ఆమె చెబుతున్నారు. లోపెజ్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఆయన ప్రభావానికి అతీతంగా పాలిస్తానంటున్నారు.జార్జే అల్వారిజ్ మైనేజ్ రాజకీయాలకు కొత్త ముఖం. స్మాల్ సిటిజన్ మూవ్మెంట్ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. నేరాలపై ఉక్కుపాదం మోపుతానని హామీ ఇచ్చారు. డ్రగ్స్‌ను నిర్మూలించడం అసాధ్యమని, వాటిని బాగా కట్టడి చేస్తానని చెబుతున్నారు. 38 ఏళ్ల మైనేజ్ ప్రతిపాదించిన పలు ఆర్థిక సంస్కరణలపై ప్రజల నుంచి మంచి స్పందన రావడం విశేషం. ఈసారి గెలవకపోయినా మున్ముందు మెక్సికో రాజకీయాల్లో ఆయన ప్రబల శక్తిగా ఎదగడం ఖాయమంటున్నారు. -
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
పల్లవి శ్రీనివాస్ డెంపో. దక్షిణ గోవా నుంచి బీజేపీ టికెట్‌పై లోక్‌సభ బరిలో ఉన్నారు. గోవాలో బీజేపీ తరఫున లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన తొలి మహిళగా నిలిచారు. అఫిడవిట్లో పల్లవి ప్రకటించిన ఆస్తులు చూసి అంతా నోరెళ్లబెట్టారు. భర్తతో కలిపి ఏకంగా రూ.1,361 కోట్ల ఆస్తులు వెల్లడించారు. మూడో దశలో రేసులో మొత్తం 1352 మంది అభ్యర్థుల్లో అత్యంత సంపన్నురాలిగా నిలిచారు. గోవా ఎన్నికల చరిత్రలో అత్యంత సంపన్న వ్యక్తి పల్లవే. ఏ రాజకీయానుభవం లేని కుటుంబానికి చెందిన ఆమెను ఎంపిక చేసుకోవడానికి ఆమె దాతృత్వ నేపథ్యమే కారణం కావచ్చంటున్నారు...దాతృత్వం నుంచి రాజకీయాలకు 49 ఏళ్ల పల్లవి స్వస్థలం గోవాలోని మార్గావ్. టింబ్లో కుటుంబంలో జని్మంచారు. రసాయన శాస్త్రంలో డిగ్రీ, పుణెలోని ఎంఐటీ నుంచి ఎంబీఏలో పీజీ చేశారు. 1997లో డెంపో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ శ్రీనివాస్ డెంపోను పెళ్లాడారు. వారి కుటుంబం ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో లేదు. డెంపో గ్రూప్ మైనింగ్ వ్యాపారంతో మొదలుపెట్టి ఫుడ్ ప్రాసెసింగ్, షిప్ బిల్డింగ్, న్యూస్ పేపర్ పబ్లిíÙంగ్, పెట్రోలియం, కోక్, రియల్ ఎస్టేట్ తదితరాలకు విస్తరించింది. పల్లవి ప్రస్తుతం డెంపో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మీడియా, రియల్ ఎస్టేట్ విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. డెంపో చారిటీస్ ట్రస్టీగా దశాబ్దాలుగా సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. ప్రత్యేకించి గోవాలో బాలికల విద్యను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. కొత్త ప్రదేశాలను చూడటం, కొత్త వంటకాలను ప్రయతి్నంచడం తన అభిరుచి అంటారామె. ఇప్పుడు రాజకీయాల్లోకి దిగి మరో ప్రయోగం చేయబోతున్నారు. ఎన్నికల బాండ్ల రగడ... 2022 జనవరిలో గోవాలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం నెల ముందు పల్లవి భర్త శ్రీనివాస్ వ్యక్తిగతంగా రూ.1.25 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసినట్లు వెల్లడవడం కలకలం రేపింది. ఇక గోవా కార్బన్ లిమిటెడ్, దేవశ్రీ నిర్మాణ్ ఎల్ఎల్పి, నవ్‌హింద్ పేపర్స్ అండ్ పబ్లికేషన్స్‌తో సహా డెంపో, గ్రూప్ అనుబంధ సంస్థలు 2019 నుంచి 2024 మధ్య రూ.1.1 కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేశాయి. ఇవన్నీ బీజేపీ ఖాతాలోకే వెళ్లాయి.బీజేపీ సిద్ధాంతాలు నమ్మి... దక్షిణ గోవా కాంగ్రెస్ కంచుకోట. 2019లో ఈ స్థానాన్ని బీజేపీ కేవలం 9 వేల పై చిలుకు ఓట్ల తేడాతో చేజార్చుకుంది. ఈ సారి ఎలాగైనా ఇక్కడ నెగ్గి తీరాలని పట్టుదలగా ఉంది. క్యాథలిక్ క్రిస్టియన్ల ఓట్లపై పల్లవి ప్రధానంగా దృష్టి పెట్టారు. కాంగ్రెస్ కూడా నాలుగు సార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ ఫ్రాన్సిస్కో సార్డినాను అనూహ్యంగా పక్కనబెట్టి మాజీ నేవీ అధికారి కెపె్టన్ విరియాటో ఫెర్నాండెజ్‌ను బరిలోకి దించింది. అయితే ఏకంగా 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ చేయడం వంటివన్నీ ఆ పారీ్టకి కలిసొచ్చేలా ఉన్నాయి. ఆప్, గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ) వంటి ఇండియా కూటమి భాగస్వాముల దన్నుతో బీజేపీని కాంగ్రెస్ ఢీకొంటోంది. స్థానిక రివల్యూషనరీ గోవన్స్ (ఆర్జీ) పార్టీ అభ్యర్థి రూబర్ట్ పెరీరియా ఆ రెండింటికీ సవాలు విసురుతున్నారు. అయినా పల్లవి మాత్రం విజయంపై ధీమాగా ఉన్నారు. ‘‘రాజకీయాలు నా మనసులో ఎప్పుడూ లేవు. మూడు దశాబ్దాలుగా కుటుంబ వ్యాపారాలు, సేవా కార్యకలాపాల్లో బిజీగా ఉన్నాను. అయితే దేనికైనా ఒక ఆరంభమంటూ ఉంటుంది. రాజకీయాల్లో ఇది నా తొలి అడుగు. బీజేపీ సిద్ధాంతాన్ని నమ్మి ముందడుగు వేస్తున్నాను’’ అంటున్న ఆమె కాంగ్రెస్‌కు కంచుకోటలో చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి! – సాక్షి, నేషనల్ డెస్క్ -
తల్లి బాటలో తనయ.. పాక్ రాజకీయాల్లో ఆమె ఒక సంచలనం
ఏ దేశంలో అయినా ప్రథమ పౌరురాలు అంటే.. ఆ దేశ అధ్యక్షుడో/సుప్రీమో/రాజుగారి భార్యకో ఆ హోదా కల్పిస్తారు. కానీ, బహుశా ప్రపంచంలోనే తొలిసారిగా ప్రథమ పౌరుడి కూతురికి ఆ స్థానం దక్కబోతోంది!. పాకిస్థాన్ ఈ తరహా నిర్ణయానికి వేదిక కానుంది. ఈ క్రమంలోనే అసీఫా భుట్టో పేరు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ తన కూతురు అసీఫా భుట్టో జర్దారీ(31)ని ఆ దేశ ప్రథమ పౌరురాలిగా ప్రకటించబోతున్నారు. నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడనుందని.. ఆ వెంటనే ప్రొటోకాల్ సహా ప్రథమ పౌరురాలికి దక్కే సముచితమైన అధికారాలు అసీఫాకు దక్కనున్నట్లు స్థానిక మీడియా ఛానెల్స్ కథనాలు వెలువరిస్తున్నాయి. ►అసీఫా భుట్టో జర్దారీ.. అసిఫ్ అలీ జర్దారీ-బెనజీర్ భుట్టోల చిన్నకూతురు. 1993లో జన్మించారామె. జర్దారీ-బెనజీర్‌ల మిగతా ఇద్దరు పిల్లలు బిలావల్ , బక్తావర్లు రాజకీయాల్లోనే ఉన్న సంగతి తెలిసిందే ►పాక్ తొలి మహిళా ప్రధాని బెనజీర్ భుట్టో తనయగా పాక్ ప్రజల్లో అసీఫాపై సానుభూతి ఉంది. బెనజీర్ భుట్టో 2007లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ►అసీఫా విద్యాభ్యాసం అంతా విదేశాల్లోనే సాగింది. ఆక్స్ఫర్డ్ బ్రూక్స్ యూనివర్సిటీ, యూనివర్సిటీ కాలేజీ లండన్, యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్లో విద్యాభ్యాసం పూర్తి చేశారామె. ►2020లో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(PPP) తరఫున ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారామె ►పాక్ పవర్ఫుల్ లేడీగా పేరున్న బెనజీర్ తనయగా.. పీపీపీలో అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు అసీఫా. ►బిలావల్ గతంలో విదేశాంగ మంత్రిగా పని చేసినా.. అసీఫానే తన తండ్రితో ఎక్కువగా కనపడతారు. ►తండ్రి అసిఫ్ జర్దారీకి ఆమె తొలి నుంచి వెన్నంటే నిల్చుంది. పలు కేసుల్లో జర్దారీ ఆభియోగాలు ఎదుర్కొన్నప్పుడు.. ఆయన తరఫున న్యాయపోరాటంలో పాల్గొంది అసీఫానే ►రాజకీయ ప్రసంగాలు, ర్యాలీలలో చురుకుగా పాల్గొనే అసీఫాను.. జూనియర్ బెనజీర్ భుట్టోగా అభివర్ణిస్తుంటుంది అక్కడి మీడియా ►2022లో ఖనేవాల్‌లో పీపీపీ ఊరేగింపు సందర్భంగా ఆసిఫా తన సోదరుడు బిలావల్‌తో కలిసి వెళుతుండగా మీడియా డ్రోన్ ఢీకొట్టింది. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ►పాక్ ఎన్నికల్లో పీపీపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా బిలావర్ భుట్టోను ప్రకటించింది. అసీఫా మాత్రం ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇక పీఎల్‌ఎం-ఎన్తో కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే క్రమంలో పీపీపీ పలు షరతులు విధించినట్లు తెలుస్తోంది ►ఇందులో భాగంగానే అసిఫ్ అలీ జర్దారీ కుటుంబానికి కీలక పదవులు, బాధ్యతలు దక్కనున్నట్లు స్పష్టమవుతోంది ►పోలియో నిర్మూలన కార్యక్రమానికి పాక్ అంబాసిడర్‌గా అసీఫా భుట్టో ఉన్నారు ►అసీఫా తండ్రి, పీపీపీ సహా వ్యవస్థాపకుడు అసిఫ్ అలీ జర్దారీ మార్చి 10వ తేదీన పాక్ అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. పాక్ చరిత్రలో రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తిగా(మిలిటరీ అధిపతుల్ని మినహాయించి) అసిఫ్ చరిత్ర సృష్టించారు. గతంలో 2008-13 మధ్య ఆయన పాక్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు -
ఖరీదైన బ్యాగ్ గిఫ్ట్.. దక్షిణ కొరియా రాజకీయాల్లో దుమారం
ఓ ఖరీదైన బ్యాగ్ దక్షిణ కొరియా రాజకీయాల్లో చిచ్చుపెట్టింది. దీనికి గల కారణం దక్షిణ కొరియా మొదటి మహిళ ఆ బ్యాగ్ గిఫ్ట్‌గా స్వీకరించటమని ఆరోపణలు వస్తున్నాయి. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ భార్య కిమ్ కియోన్ హీ(దక్షిణ కిరియా మొదటి మహిళా) రెవ్ అబ్రహం చోయ్ అనే ఓ పాస్టర్ నుంచి ఓ ఖరిదైన డియోర్ బ్యాగ్‌ను కానుకగా స్వీకరించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారం దక్షణి కొరియా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అక్కడి చట్టాల ప్రకారం ఒక మిలియన్ వాన్(రూ. 62,160) కంటే విలువైన వస్తువులు, కానుకలు, బహుమతుల స్వీకరించరాదు. అలా తీసుకుంటే దాన్ని అక్కడి చట్టాలు లంచంగా పరిగణిస్తాయి. దక్షిణా కొరియాలో లంచం వ్యతిరేక చట్టం చాలా కఠినంగా అమల్లో ఉంది. ఈ క్రమంలో దేశ మొదటి మహిళ సుమారు మూడు మిలియన్ వాన్స్( సుమారు రూ. 1,86,811) విలువైన డియోర్ బ్యాగ్‌ను అబ్రహం చోయ్ నుంచి ఆమె స్వీకరించటం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో దక్షిణ కొరియాలో జరగనన్ను అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ కిమ్ కియోన్ హీ ఖరిదైన బ్యాగ్ వ్యవహారం అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు తల నొప్పిగా మారింది. రెవ్ అబ్రహం చోయ్ నుంచి కిమ్ కియోన్.. ఓ ఖరిదైన డియోర్ బ్యాగ్‌ను బహుమతిగా తీసుకున్నట్లు గతేడాది నవంబర్‌లో ఓ రహస్య కెమెరా ఫుటేజీ ద్వారా బయటపడింది. అయితే రెవ్ అబ్రహం చోయ్ ఆ బ్యాగ్‌ను కొనుగోలు చేసి కిమ్ కియోన్కు తన ఆఫీసులో కలవటానికి వెళ్లి ఆమె ఇవ్వడాని ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఇక.. ఇలాంటి విలువైన వాటిని ఎందుకు తీసుకువస్తున్నారని ఆమె ప్రశ్నించినట్లు సమాచారం. మరోవైపు ఆమె ఆ బ్యాగ్‌ను కూడా తీసుకున్నట్లు ఆ వీడియోలో కనిపించటం లేదని స్థానిక మీడియా పేర్కొనటం గమనార్హం. అయితే ఈ బ్యాగ్ అధ్యక్ష కార్యాలయంలో గుర్తించబడింది. దీంతో ప్రతిపక్షాలు అధ్యక్షుడి భార్య చట్టవ్యతిరేకంగా బ్యాగ్ రూపంలో లంచం తీసుకుందని ఆరోపిస్తూ.. అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వటంతో పాటు క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇప్పటికే మైనార్టీ ప్రభుత్వంగా కొనసాగుతున్న అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది. అదీకాక ఈ వ్యవహారం.. ఏప్రిల్ 10న జరగబోయే అధ్యక్ష ఎన్నికలపై యూన్ సుక్ యోల్ చెందిన పీపుల్ పవర్ పార్టీ(PPP)పై ప్రతికూల ప్రభావం చూపనుందని చర్చ జరుగుతోంది. చదవండి: టెక్సాస్, ఫెడరల్ ప్రభుత్వాల మధ్య తీవ్రమవుతున్న సరిహద్దు గొడవ -
ఉక్రెయిన్‌లో ఆకస్మికంగా పర్యటించిన అమెరికా ప్రథమ మహిళ
కీవ్: అమెరికా ప్రథమ పౌరురాలు జిల్ బైడెన్ ఆదివారం పశ్చిమ ఉక్రెయిన్‌లో పర్యటించారు. ముందస్తు ప్రకటన లేకుండానే ఆమె ఇక్కడికి రావడం గమనార్హం. స్లొవేకియాలోని చిట్టచివరి గ్రామం వద్ద సరిహద్దును దాటి 10 నిమిషాలపాటు వాహనంలో ప్రయాణించి ఉక్రెయిన్‌లోని ఉజ్హొరోత్ పట్టణానికి చేరుకున్నారు. అక్కడ రెండు గంటలపాటు గడిపారు. ఉక్రెయిన్ ప్రథమ పౌరురాలు ఒలెనా జెలెన్స్కీతో సమావేశమయ్యారు. మాతృ దినోత్సవం సందర్భంగా అక్కడికి వచ్చినట్లు చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న క్రూరమైన యుద్ధం తక్షణమే ఆగిపోవాలని ఆకాంక్షించారు. ఉక్రెయిన్ ప్రజలకు అమెరికా ప్రజలు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూనే ఉంటారని పునరుద్ఘాటించారు. జిల్ బైడెన్, ఒలెనా జెలెన్స్కీ ఓ పాఠశాలలో కలుసుకున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సంభాషించారు. యుద్ధం వల్ల తాము ఎదుర్కొంటున్న కష్టనష్టాలు వివరిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వారిని జిల్ బైడెన్ ఓదార్చారు. అనంతరం జిల్ బైడెన్, ఒలెనా మీడియాతో మాట్లాడారు. యుద్ధ సమయంలో జిల్ రాక సాహసోపేతమైన చర్య అని ఒలెనా కొనియాడారు. జర్మనీ పార్లమెంట్ స్పీకర్ బెయిర్బెల్ బాస్ కూడా ఆదివారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో పర్యటించారు. అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. కెనడా ప్రధాని కూడా... రష్యా దాడులతో విలవిల్లాడుతున్న ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల అధినేతలు నైతిక మద్దతునిస్తున్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆదివారం ఉక్రెయిన్‌లోని ఇర్పిన్ పట్టణాన్ని సందర్శించారు. స్థానికులతో మాట్లాడారు. రష్యా దాడుల్లో ఈ పట్టణం ఇప్పటికే చాలావరకు ధ్వంసమయ్యింది. జస్టిన్ ట్రూడో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ కానున్నారు. -
పుతిన్‌ను ఆపకపోతే పెనువిధ్వంసమే: ఉక్రెయిన్ అధ్యక్షుడి భార్య
Olena Zelenska Open Letter: ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ భార్య, ప్రథమ మహిళ అయిన ఒలెనా జెలెన్స్కా.. రష్యా యుద్ధకాండను నిరసిస్తూ ప్రపంచ మీడియాకి ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ఉక్రెయిన్ పౌరులపై రష్యా చేసిన సామూహిక మారణకాండను తీవ్రంగా ఖండించారు. ఉక్రెయిన్ పై రష్యా నమ్మశక్యం కాని విధంగా దాడి చేస్తోంది. మాస్కో మద్దతుగల దేశాల హామీతోనే మా దేశాన్ని వ్యూహాత్మకంగా చట్టుముట్టి దాడి చేస్తున్నప్పటికి దీనిని ప్రత్యేక ఆపరేషన్ గా పిలుచుకుంటున్నారు. అంతేకాదు పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడిచేయనని రష్యా చెప్పింది. అది(రష్యా) చేస్తున్న పనులకు చెబుతున్న మాటలకు పొంతనే లేదు. మాస్కో పౌరులపై ఏ విధంగా దాడి చేసిందో నేను వివరిస్తాను. చాలామంది చిన్నారులు తమ తల్లిదండ్రులతోపాటు మృత్యువాత పడ్డారు. మరికొంతమంది అనాథలుగా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇది భారీ మొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టం కలిగించిన విధ్వంసకర యుద్ధం. పుతిన్ ను అడ్డుకోకుంటే ఎవరికీ రక్షణ ఉండదన్నారు. ‘‘అణు యుద్ధం మొదలు పెడతానంటూ బెదిరిస్తున్న పుతిన్ ను మనం నిలువరించకపోతే ప్రపంచంలో సురక్షిత ప్రదేశం అంటూ మనకు ఉండదు’’ అని ఆమె భావోద్వేగంగా రాశారు. View this post on Instagram A post shared by Olena Zelenska (@olenazelenska_official) ఈ యుద్ధ భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. పిల్లలతో పారిపోయి అలసటతో ఉన్న తల్లుల కళ్లలోకి చూడండి, అంతేకాదు కేన్సర్ రోగులు ఈ సంక్షోభం కారణంగా అవసరమయ్యే కీమోథెరఫీ వంటి అత్యాధునిక చికిత్సలు అందక మరణిస్తున్నవారు కొందరూ. అంతేకాదు భారీ అగ్ని ప్రమాదాల కారణంగా ఆస్మా వంటి దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడేవారిపరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. దయ చేసి మా గగనతలం మూయండి అంటూ ఉక్రెయిన్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చి ప్రేక్షపాత్ర వహించింది నాటో" అని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ లేఖ రాశారు. (చదవండి: నాటోపై ఆసక్తి లేదంటూనే.. జెలెన్స్కీ డబుల్ గేమ్!) -
పుతిన్ రహస్య ప్రేయసి జాడ లేదే!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న వేళ.. ఇరు దేశాల అధినేతలు, వాళ్ల వ్యక్తిగత జీవితాలు, అలవాట్లు.. వగైరా వగైరా విషయాలు తెర మీదకు వస్తున్నాయి. ఈ క్రమంలో పుతిన్ పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర అంశం ఇప్పుడు హాట్ హాట్ టాపిక్‌గా మారింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఓ రహస్య ప్రేయసి ఉందని, ఆమె పేరు అలీనా కబయేవా అని, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం ఆమె అజ్ఞాతంలో ఉందనే టాపిక్ నడుస్తోంది. అలీనా కబయేవా.. గతంలో జిమ్నాస్ట్‌గా ఉండేది. పుతిన్ విడాకుల తర్వాత ఆయనతో చనువుగా ఉంటోంది. ఆపై మీడియా మేనేజర్‌గా.. ప్రస్తుతం రష్యా రాజకీయాల్లోనూ ఆమె తన మార్క్ చూపిస్తోంది. ల్యూడ్మిలా అలెకస్సాంద్రోనా పుతినాతో 1983లో వ్లాదిమిర్ పుతిన్ వివాహం జరిగింది. ఈ జంటకు మరియా, కటేరినా అనే కూతుళ్లు ఉన్నారు. 2014లో ల్యూడ్మిలా నుంచి అధికారికంగా విడాకులు తీసుకున్నాడు పుతిన్. ఆపై రష్యా మీడియా మొఘల్ రూపర్ట్ మర్డోర్ మాజీ భార్య వెండి డెంగ్‌తో పాటు పలువురు టీనేజర్లతో పుతిన్ డేటింగ్ చేసినట్లు పుకార్లు ఉన్నాయి. అయితే ల్యూడ్మిలా అలెకస్సాంద్రోనాతో పుతిన్ వైవాహిక బంధం చెడిపోవడానికి కారణం కూడా అలీనా అనేది పుతిన్ సన్నిహితుల ఆరోపణ. 2008 నుంచే అలీనాకు పుతిన్‌తో పరిచయం ఉందని, వాళ్ల డేటింగ్ వ్యవహారం తెలిసే ల్యూడ్మిలా మనసు విరిగి విడాకులు తీసుకుందట!. అప్పటి నుంచి సీక్రెట్ ఫస్ట్‌లేడీగా అలీనా కొనసాగుతోంది. 1983లో తాష్కెంట్లో పుట్టిపెరిగిన అలీనా.. రిథమిక్ జిమ్నాస్ట్. పదిహేనేళ్ల వయసులో పోర్చుగల్‌లో జరిగిన యూరోపిన్ ఛాంపియన్‌షిప్‌లో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో అలీనా బ్రాంజ్ మెడలిస్ట్ కూడా. నాలుగేళ్ల తర్వాత గ్రీస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ కూడా గెల్చుకుంది. ఇప్పటిదాకా తన కెరీర్లో ఆమె రెండు ఒలింపిక్స్ మెడల్స్, 14సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ మెడల్స్, 21 యూరోపియన్ ఛాంపియన్షిప్ మెడల్స్ గెల్చుకుందామె. 2001లో డోపిండ్ స్కాండల్స్‌తో ఆమె జీవితం మలుపు తిరిగింది. రెండేళ్లపాటు నిషేధానికి గురైంది. పుతిన్‌తో కలిసి ఆమె నలుగురు పిల్లల్ని(ఇద్దరు కవలలు) కనిందనేది రష్యన్ యాంటీ మీడియా హౌజ్‌ల వాదన. ఎందుకంటే ఆమె ఏనాడూ తన వ్యక్తిగత జీవితం గురించి బయటపెట్టలేదు కాబట్టి. వైవాహిక జీవితాన్ని పెంట చేసుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. సీక్రెట్ ప్రేయసిని మాత్రం అపురూపంగా చూసుకుంటున్నాడు. ఇక పబ్లిక్ ప్లాట్‌ఫామ్స్‌లో వ్యక్తిగత ప్రశ్నలను దాటేసి పుతిన్.. తనకూ ఓ వ్యక్తిగత జీవితం ఉందని, దాని గురించి ప్రస్తావించిడం ఇష్టం లేదని, దానిని గౌరవిస్తే బాగుంటుందని మీడియాకు చురకలు అంటించిన సందర్భాలు ఎన్నో. అలీనా ఎక్కడ? ప్రస్తుతం అలీనా.. స్విస్(స్విట్జర్లాండ్) కొండల్లో సేద తీరుతున్నట్లు ఇతర దేశాల నిఘా వర్గాల ఆధారంగా కొన్ని మీడియా హౌజ్‌లు కథనాలు ప్రచురిస్తున్నాయి. యుద్ధం రోజురోజుకు భీకరంగా మారుతుండడంతో ముందుజాగ్రత్త చర్యగా పుతిన్ తన కుటుంబాన్ని అణుబంకర్లలో దాచి పెట్టారు. ఆమెతో తనకు జన్మించిన నలుగురు పిల్లలను కూడా అంతే భద్రంగా దాచిపెట్టారు. స్విస్ కొండల్లో అత్యంత సురక్షితమైన, రహస్యమైన ప్రాంతాల్లో వారు భద్రంగా ఉన్నట్లు ఆ కథనాల సారాంశం. -
పిరికిపందలం కాదు! కానీ..: ఉక్రెయిన్ అధ్యక్షుడి భార్య
ప్రియమైన ఉక్రెయిన్ ప్రజలారా. ఇది యుద్ధ సమయం. ఈ కష్టకాలంలో నా భర్త పక్కన కూడా నేనుండాలి. కానీ, అది వీలుపడడం లేదు. ఎందుకంటే.. నా పిల్లలు నా వైపే చూస్తున్నారు. నా అవసరం వీళ్లకు ఎంతో ఉంది. అయినా నా కళ్లు ఇప్పుడు మిమ్మల్నే గమనిస్తున్నాయి. మీ భద్రత గురించే నా ఆందోళనంతా. ప్రతిక్షణం టీవీల్లో, వీధుల్లో, ఇంటర్నెట్లో మీరు చేస్తున్న పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే. మీలాంటి ప్రజలతో కలిసి ఈ గడ్డపై కలిసి బతుకుతున్నందుకు గర్వంగా ఉంది. నాకిప్పుడు కన్నీళ్లు రావడం లేదు. ధృడంగా ఉన్నా. లవ్ యూ ఉక్రెయిన్.. ఉక్రెయిన్ ఫస్ట్ లేడీ ఒలెనా జెలెన్ స్కా. ఒకవైపు ప్రత్యర్థి సైన్యం విరుచుకుపడుతోంది. మరోవైపు మిత్రదేశాలు ఆశ్రయం ఇచ్చేందుకు చేతులు చాచాయి. అయినా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ శత్రువులకు వెన్నుచూపించడం లేదు. ఇది మూర్ఖత్వమో.. వీర పోరాటమో అని అనుకున్నప్పటికీ ఉక్రెయిన్ పౌరులు, సోషల్ మీడియాలో కొందరు యూజర్లు జెలెన్స్కీకి మద్దతు ప్రకటిస్తూ ‘శెభాష్’ అంటున్నారు. ఏదైనా తన దేశం తర్వాతే అంటూ సైనికుల్లో భర్త స్ఫూర్తిని రగిలిస్తుంటే.. భర్తను వెన్నుతట్టి ముందుకు సాగనంపడంతోనే సరిపెట్టకుండా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో మనోధైర్యం నింపుతోంది జెలెన్స్కీ భార్య, ఉక్రెయిన్ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్ స్కా. View this post on Instagram A post shared by Olena Zelenska (@olenazelenska_official) టార్గెట్.. అయినా కూడా జెలెన్స్కా Olena Volodymyrivna Zelenska ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె దేశం విడిచి పారిపోయిందా? రష్యా మీడియా లేవనెత్తిన ఈ అనుమానాన్ని తన స్టేట్మెంట్తో పటాపంచల్ చేసింది ఆమె. దేశం విడిచి పారిపోలేదని, ఉక్రెయిన్ లోనే ఉండి పోరాడుతున్నామని జెలెన్ స్కా గర్వంగా ప్రకటించుకుంది. నాలోనూ ఇక్కడి రక్తమే ప్రవహిస్తోంది. పిరికిపందలం కాదు. నా కన్నబిడ్డల కోసమే నా ఈ అజ్ఞాతం. అంటూ ప్రకటించింది. అధ్యక్షుడు జెలెన్స్కీకి ఇద్దరు పిల్లలు. పైగా రష్యా బలగాల మొదటి లక్క్ష్యం జెలెన్స్కీ కాగా, ఆపై ఆయన కుటుంబాన్ని లక్క్ష్యంగా చేసుకునే అవకాశాలూ ఉన్నాయి. ఈ హెచ్చరికల నేపథ్యంలోనూ.. ఉక్రెయిన్ ను కాపాడుకోవడమే తమ ప్రాధాన్యత అంటూ దేశం విడిచిపోకుండా, భర్తకు తోడుగా అక్కడే ఓ రహస్య బంకర్లో ఉండిపోయింది ఆమె. ఒకే ఊరిలో.. ఒకే బడిలో.. 44 ఏళ్ల ఒలెనా జెలెన్ స్కా ఆర్కిటెక్చర్ ఎక్స్పర్ట్. మంచి రచయిత. జెలెన్స్కా, జెలెన్స్కీ.. ఇద్దరూ పుట్టింది ఒకే ఊరిలో(Kryvyi Rih).. ఒకే సంవత్సరంలో. చిత్రం ఏంటంటే.. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు కూడా. అయితే కాలేజీ రోజుల్లోనే ఈ ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. ఆపై ప్రేమ.. 2003లో పెళ్లితో ఒక్కటయ్యారు. జెలెన్స్కీ పొలిటికల్ స్ఫూఫ్ వీడియోలు చేయడంలో సహకరించింది ఈమె రాతలే. ఓ దశలో నటుడిగా కెరీర్ మంచి దశలో ఉండగా, జెలెన్ స్కీ రాజకీయాలవైపు అడుగులేశారు. ఈ నిర్ణయం ఆమెకు ఇష్టం లేకున్నా.. భర్త నిర్ణయాన్ని కొన్నాళ్లకు గౌరవించారు. మొదటి నుంచి ప్రతి విషయంలో.. ఆఖరికి యుద్ధం వేళ కూడా ఆమె భర్తను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న తీరు ఉక్రెయిన్ ప్రజలను, సోషల్ మీడియాను ఆకట్టుకుంటోంది. స్టూడియో క్వార్టర్ 95 పేరుతో నిర్మాణ సంస్థను నడుపుతున్న జెలెన్స్కా.. జెండర్ఈక్వాలిటీ, చైల్డ్‌హుడ్ న్యూట్రీషియన్ కోసం కృషి చేస్తోంది. 2019 డిసెంబర్లో ఉక్రెయిన్ వుమెన్స్ కాంగ్రెస్‌లో ఆమె ఇచ్చిన ప్రసంగం.. అంతర్జాతీయంగా పలువురిలో స్ఫూర్తిని రగిల్చింది. ఇప్పుడు ఆమె పోస్టులు కూడా ఉక్రెయిన్లకు మనోధైర్యం పంచుతున్నాయి. View this post on Instagram A post shared by Olena Zelenska (@olenazelenska_official) -
ఫస్ట్ ఉమన్.. క్లిష్ట పరిస్థితుల్లో గట్టి పోలిస్ ఆఫీసర్
‘దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది ఇప్పుడు’ అనేది మన తెలుగు సినిమా డైలాగైతే కావచ్చుగానీ హరియాణాలోని గుర్‌గ్రామ్‌కు వెళితే ‘సిటీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు’ అనే రియల్ డైలాగ్ లోకల్ లాంగ్వేజ్‌లో అప్పట్లో తరచు వినిపించేది. సిటీ పరిస్థితి క్లిష్టస్థితిలో పడడానికి శాంతిభద్రతల నుంచి ట్రాఫిక్ అస్తవ్యస్తతల వరకు రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇలాంటి క్లిష్టసమయంలో గుర్‌గ్రామ్ తొలి మహిళా పోలిస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు కళారామచంద్రన్. రెవారి, ఫతేహబాద్, పంచ్‌కుల జిల్లాల సూపరిండెంట్ ఆఫ్ పోలిస్‌గా పనిచేసినా, ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసినా, మేఘాలయాలోని ఈశాన్య ప్రాంత పోలిస్ అకాడమీ హెడ్‌గా పనిచేసినా... కళా రామచంద్రన్ తనదైన ప్రత్యేకతను సృష్టించుకున్నారు. నిఖార్సయిన పోలిస్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు.గుర్‌గ్రామ్‌లో చూడచక్కని రోడ్లు ఉన్నాయి. కానీ ఏంలాభం? ‘వేగమే మా నైజం’ అన్నట్లుగా దూసుకుపోతుంటాయి వాహనాలు. దీనివల్ల యాక్సిడెంట్లు, మరణాలు. మరోవైపు డ్రంకెన్ డ్రైవింగ్. ఇంకోవైపు స్ట్రీట్క్రైమ్స్. సైబర్‌క్రైమ్, ఈవ్‌టీజింగ్ లాంటి సమస్యలు బోలెడన్ని ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల నిష్క్రియాపరత్వం మీద వేడివేడి విమర్శ లు కూడా వచ్చాయి.అలాంటి క్లిష్ట సమయంలో బాధ్యత లు తీసుకున్న కళారామచంద్రన్ ‘నగరాన్ని ఏ మేరకు భద్రంగా ఉంచగలరు?’ అనే సందేహాలు రాకపోవడానికి కారణం ఆమెకు ఉన్న వృత్తి నిబద్ధత, మంచిపేరు. ‘క్షేత్రస్థాయి నుంచి పోలిసు పర్యవేక్షణను బలోపేతం చేసే కార్యాచరణకు శ్రీకారం చుట్టాం’ అంటున్నారు కళా రామ చంద్రన్. రకరకాల ప్రాంతాలలో పనిచేసిన అనుభవంతో పాటు, భర్త ఇచ్చిన సూచనలు కూడా గుర్గ్రామ్ని ‘సేఫర్ అండ్ బెటర్’ సిటీగా మార్చడానికి ఉపయోగపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కళారామచంద్రన్ భర్త నవదీప్‌సింగ్ సీనియర్ ఐపీయస్ అధికారి. గుర్‌గ్రామ్ పోలిస్ కమిషనర్‌గా పనిచేశారు. -
లవ్ యూ అంబులెన్స్!
‘అంబులెన్స్ డ్రైవర్ కావాలనేది నా కల’ అని ఎవరైనా అంటే ఆశ్చర్యంగా చూస్తారు. నాన్సీ కట్నారియా (22) విషయంలోనూ ఇదే జరిగింది. ఎట్టకేలకు నాన్సీ తన కలను నెరవేర్చుకుంది. ఒకప్పుడు ఆమె పేరు పక్కన ఎలాంటి విశేషణాలు లేవు. ఇప్పుడు రెండు చేరాయి. అవి: హిమాచల్‌ప్రదేశ్ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్, మనదేశంలో రెండో మహిళా అంబులెన్స్ డ్రైవర్. ఒకరికి ఒక వృత్తి మీద ఎందుకు ఇష్టం ఏర్పడుతుందంటే బోలెడు కారణాలు చెప్పుకోవచ్చు. నాన్సీ అంబులెన్స్ డ్రైవర్ కావాలనుకోవడానికి ఒక కారణం ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం... దగ్గరి బంధువు ఒకరికి తన కళ్లముందే యాక్సిడెంట్ అయింది. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. దేవుడు పంపిన వాహనంలా మెరుపువేగంతో దూసుకువచ్చి బాధితుడిని హాస్పిటల్లో చేర్పించింది అంబులెన్స్. ‘గోల్డెన్ టైమ్‌లో తీసుకువచ్చారు. ఏమాత్రం ఆలస్యం అయినా ప్రాణాలు దక్కేవి కావు’ అన్నారు వైద్యులు. తన బంధువు బతికి ఉన్నాడంటే కారణం... అంబులెన్స్. అప్పటి నుంచి ఆమెలో అంబులెన్స్ అంటే ఒక ఆరాధన లాంటిది ఏర్పడింది. హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (హెచ్ఆర్టీసి) స్కూల్లో డ్రైవింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకున్న నాన్సీ నర్పూర్ సివిల్ హాస్పిటల్ 102 ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్ డ్రైవర్‌గా విధుల్లో చేరింది. ‘నేను చేస్తున్నది ఉద్యోగం మాత్రమే కాదు సేవ కూడా’ అంటోంది నాన్సీ. -
మహిళా సాధికారతకు ప్రతీక.. పాకిస్తాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఆయేషా మాలిక్
సంప్రదాయ ముస్లిం మెజారిటీ గల పాకిస్థాన్ దేశ న్యాయ చరిత్రలో ఒక మహిళ న్యాయమూర్తిగా జస్టిస్ ఆయేషా మాలిక్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీం కోర్టులోని సెరిమోనియల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ ఆహ్మద్ 55 ఏళ్ల జస్టిస్ మాలిక్‌తో ప్రమాణం చేయించారు. దీనికి పెద్ద సంఖ్యలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అటార్నీ జనరల్, లాయర్లు, లా అధికారులు.. హాజరయ్యారు. జస్టిస్ మాలిక్ 2012లో లాహోర్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇప్పుడు మొట్టమొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ విధంగా పాకిస్థాన్ న్యాయవ్యవస్థలో చరిత్ర సృష్టించారు ఆయేషా మాలిక్. జూన్ 2031లో పదవీ విరమణ పొందేవరకు ఆమె సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతారు. జస్టిస్ మాలిక్ పదోన్నతిని అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆమోదించినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ గత శువ్రారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. జూన్ 2030లో పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం కూడా ఆయేషా మాలిక్‌కు ఉంది. ఆ విధంగా ఆమె మళ్లీ పాకిస్థాన్ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి గా చరిత్రలో నిలిచిపోనున్నారు. ఆమె ఘనతను చెప్పే స్థాయి.. వేడుక ముగిసిన తర్వాత చీఫ్ జస్టిస్ అహ్మద్ విలేకరులతో మాట్లాడుతూ ‘జస్టిస్ మాలిక్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యేంత సమర్ధురాలు, ఆమె ఘనతను చెప్పేంత స్థాయి ఎవరికీ లేదు’ అన్నారు. సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి, జస్టిస్ మాలిక్ సాధించిన ‘మైలు రాళ్ల’కు అభినందనలు తెలిపారు. శ్రీ ఫవాద్ ట్వీట్ చేస్తూ ‘ఒక శక్తిమంతమైన చిత్రం. పాకిస్థాన్‌లో మహిళా సాధికారతకు ప్రతీక’ అని ప్రమాణ స్వీకారోత్సవ చిత్రంతో పాటు, జస్టిస్ ఆయేషా దేశ ‘న్యాయ వ్యవస్థ’కు ఒక ఆస్తిగా ఉంటారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. మహిళ అనే ఆశ్చర్యమా! లాహోర్ హైకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నప్పటికీ జస్టిస్ మాలిక్ అత్యుత్తమ స్థానానికి ఎంపికైనప్పుడు చాలామంది తమ కనుబొమలను పైకెత్తారు. ఆమె నామినేషన్‌ను పాకిస్థాన్ జ్యుడీషియల్ కమిషన్ (జేసీపీ) గతేడాది తిరస్కరించింది. కానీ, కమిషన్ ఈ నెల ప్రారంభంలో ఆమె పేరును రెండోసారి పరిశీలనకు తీసుకురాగా స్వల్ప మెజారిటీతో ఆమెదించింది. అత్యున్నత న్యాయవ్యవస్థకు న్యాయమూర్తులను నామినేట్ చేసే అత్యున్నత సంస్థ జెసీపీ సమావేశానికి చీఫ్ జస్టిస్ అహ్మద్ అధ్యక్షత వహించారు. సుపీరియర్ జ్యూడీషియరీ నియామకంపై జేసీపీ తర్వాత ద్వైపాక్షిక పార్లమెంటరీ కమిటీ ఆమోదం కోసం మాలిక్ నామినేషన్ ముందుకు వచ్చింది. మాలిక్ లాహోర్ హైకోర్ట్‌కి మొదటి మహిళా అత్యున్నత న్యాయమూర్తి కావడం వల్ల సీనియారిటీ సూత్రాన్ని పక్కన పెట్టి, కమిటీ ఆమె నామినేషన్‌ను ఆమోదించింది. సాధారణంగా హైకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు. సుప్రీంకోర్టుకు వారి పదోన్నతిని ఆమోదించేటప్పుడు, గత సంవత్సరం ఆమె పేరును జేసీపీ తిరస్కరించడానికి ఇదీ ఓ కారణం. 1966లో జన్మించిన మాలిక్ పారిస్, న్యూయార్క్, కరాచీలోని పాఠశాలల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆమె లాహోర్‌లోని పాకిస్థాన్ కాలేజ్ ఆఫ్ లా లో ‘లా’ చదివారు. హార్వర్డ్ లా స్కూల్ నుండి ఎల్ఎల్ఎమ్ చేశారు. జూన్ 2021లో లైంగిక వేధింపుల నుండి బయటపడిన వారి పరీక్ష కోసం కన్యత్వ పరీక్షలు ‘చట్ట విరుద్ధం, పాకిస్థాన్ రాజ్యాంగానికీ వ్యతిరేకం’ అని ఆమె ఇచ్చిన తీర్పు ఒక మైలురాయి. సోమవారం ఇస్లామాబాద్‌లోని సుప్రీంకోర్టు భవనంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేస్తున్న ఆయేషా మాలిక్. -
స్వీడన్‌కు తొలి మహిళా ప్రధాని.. గంటల వ్యవధిలోనే రాజీనామా
కోపెన్హగెన్: స్వీడన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎంపికై చరిత్ర సృష్టించిన 54 ఏళ్ల మాగ్డలినా అండర్సన్ గంటల వ్యవధిలోనే తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం పార్లమెంట్లో ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్ విఫలం కావడంతోపాటు రెండు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం నుంచి గ్రీన్స్ పార్టీ బయటకు వెళ్లిపోవడమే ఇందుకు కారణం. అంతకుముందు నూతన ప్రధానిగా మాగ్డలినా ఎంపికకు స్వీడన్ పార్లమెంట్ ‘రిక్స్‌డాగ్’ ఆమోదం తెలిపింది. దేశ ఆర్థిక శాఖ మంత్రిగా పని చేస్తున్న మాగ్డలినా ఇటీవలే సోషల్ డెమొక్రటిక్ పార్టీ నూతన అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. స్వీడన్ ప్రధానిగా, పార్టీ అధినేతగా వ్యవహరించిన స్టెఫాన్ లవ్ఫెన్ కొన్ని రోజుల క్రితం రెండు పదవుల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలోకి మాగ్డలినా వచ్చేందుకు రంగం సిద్ధం కాగా, ఆర్థిక మంత్రిగా ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం లభించలేదు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నట్లు గ్రీన్స్ పార్టీ తేల్చిచెప్పింది. దీంతో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాగ్డలినా ప్రకటించారు. రాజీనామా లేఖను పార్లమెంట్ స్పీకర్‌కు పంపించారు. స్వీడన్ పార్లమెంట్లో 349 మంది సభ్యులున్నారు. వీరిలో 117 మంది మాగ్డలినాకు అనుకూలంగా, 174 మంది వ్యతిరేకంగా ఓటేశారు. 57 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఒకరు గైర్హాజరయ్యారు. స్వీడన్ రాజ్యాంగం ప్రకా రం పార్లమెంట్లో సగం మంది.. అంటే 175 మంది వ్యతిరేకించనంత కాలం ప్రధానమంత్రి తన పదవిలో కొనసాగవచ్చు. స్వీడన్లో తదుపరి సాధారణ ఎన్నికలు వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్నాయి. -
Jyotsna Bose: కరోనా వారియర్.. సడలని పిడికిలి
కార్మిక సంఘాల పోరుబాటలో జీవిత చరమాంకం వరకు పిడికిలి బిగించి ముందు వరుసలో నడిచిన జ్యోత్స్న బోస్.. కరోనా పై పోరులో మరణానంతరం కూడా యోధురాలిగానే నిలిచిపోయారు. కరోనాతో మరణించిన జ్యోత్స్నపై ‘పేథలాజికల్ అటాప్సీ’ (వ్యాధి అధ్యయనం కోసం చేసే శవ పరీక్ష) జరగడంతో.. దేశంలోనే తొలిసారి కరోనా ప్రభావాల పరిశోధనలకు ఉపయోగపడిన తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందారు. జ్యోత్స్న కోల్‌కతాలోని బెలెఘటలో ఉంటారు. ఆమెకు కరోనా సోకినట్లు ఈ నెల 10న ఆమె కుటుంబం గుర్తించింది. ఆమె మనువరాలు తీస్తా బసు వైద్యురాలు. ప్రాథమిక చికిత్సతో నాలుగు రోజులైనా తగ్గకపోవడంతో జ్యోత్స్నను ఆమె మే 14 న బెలెఘటలోనే ఒక ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మే 16న ఆమె మర ణించారు. తను చనిపోతే తన అవయవాలను దానం చేయాలని పదేళ్ల క్రితమే ఆమె అనుమతి పత్రంపై సంతకాలు పెట్టారు. అయితే ఇప్పుడామె చనిపోయింది కరోనాతో. అవయవదానం కుదరదు. అలాగని ఆమె అంతిమ కోరికను నెరవేర్చకుండా ఎలా... అనుకున్నారు తీస్తా బసు. జ్యోత్స్న ఆసుపత్రిలో చేరిన రోజు వేరొక ఆసుపత్రిలో కరోనాతో మరణించిన బ్రోజోరాయ్ అనే వ్యక్తికి కోల్‌కతాలోని ఆర్.జి.కార్ మెడికల్ కాలేజీలో పేథలాజికల్ అటాప్సీ జరిగింది. అది స్ఫురించి, జోత్స్న మృతదేహాన్ని కూడా అక్కడికి పంపించారు తీస్తా బసు. మే 20 న అక్కడ ఆమెకు అటాప్సీ జరిగింది. దేశంలోనే తొలిసారి కరోనా పరిశోధనలకు తోడ్పడిన మహిళగా జోత్స్న చరిత్రలో నిలిచిపోయారు. ఆమె తర్వాత కోల్‌కతాలో ప్రముఖ నేత్ర వైద్యులు బిస్వజిత్ చక్రవర్తి (60) మృతదేహానికి అటాప్సీ జరిగింది. జోత్స్న కు ముందు అటాప్సీ జరిగిన బ్రోజోరాయ్.. కోల్‌కతాలోని ప్రసిద్ధ అవయవదాన స్వచ్ఛంద సంస్థ ‘గణదర్పణ్’ వ్యవస్థాపకులు. అవయవదానానికి అనుమతినిస్తూ పదేళ్ల క్రితం జ్యోత్స్న సంతకాలు పెట్టి ఇచ్చింది ఆ సంస్థకే. ఇప్పుడీ ముగ్గురి మృతదేహాలపై జరిగిన పరిశోధనల ఫలితాలు వస్తే కరోనాను నివారించేందుకు, నిరోధించేందుకు, నియంత్రించేందుకు దారేదైనా కనిపించవచ్చని ఈ పరీక్షలు నిర్వహించిన వైద్యుల కమిటీ ఆశిస్తోంది. కరోనాతో మరణించినవారిపై విదేశాల్లో అరకొరగా పరిశోధనలు జరుగుతున్నప్పటికీ మన దేశంలో ఇలా జరగడం ఇదే మొదటì సారి. పరిశోధనలకు ఉపయోగపడిన తొలి మహిళ జ్యోత్స్న.. మరణానంతరం కూడా కరోనా యోధురాలిగానే దేశానికి గుర్తుండిపోతారు. జ్యోత్స్న 1927లో చిట్టాగాంగ్ (నేడు బంగ్లాదేశ్‌లో ఉన్న ప్రాంతం) జన్మించారు. ఆనాటి సామాజిక, రాజకీయ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కార్మిక సంఘాల పోరాటాలలో పాలు పంచుకున్నారు. రాయల్ ఇండియన్ నౌకాదళ తిరుగుబాటుకు మద్దతుగా 1946లో తంతీతపాల కార్మికుల సమ్మెకు ‘నేను సైతం’ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆమె తండ్రి అదృశ్యం అయిపోవడంతో ఆ కుటుంబం ఆర్థికంగా కష్టాలు పడింది. జ్యోత్స్న చదువు కుంటుపడింది. బ్రిటిష్ టెలిఫోన్స్‌లో ఆపరేటర్‌గా చేరి బతుకుబండిని లాక్కొచ్చారు. -
చైనాకు చెక్..ఇంజినీర్ వైశాలి
‘తొలి మహిళ’ అనే మాట బాగా పాతబడిపోయిన భావనగా అనిపించవచ్చు. ‘అది ఇది ఏమని అన్ని రంగముల’ మహిళలు తమ ప్రతిభా ప్రావీణ్యాలను నిరూపించుకుంటూ రావడం ఇప్పుడు కొత్తేమీ కాకపోవచ్చు. అంతమాత్రాన తొలి మహిళ కావడం ఘనత కాకుండా పోదు. తాజాగా వైశాలి హివాసే అనే మహిళ ఇండో–చైనా సరిహద్దులో భారత సైన్యం నిర్మించబోతున్న వ్యూహాత్మక రహదారి ప్రాజెక్టుకు కమాండింగ్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు! ఒక మహిళ ఇలాంటి విధులను చేపట్టనుండడం భారత ఆర్మీ చరిత్రలోనే ప్రప్రథమం. ఆర్మీ విభాగమైన బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజొనీరుగా పని చేస్తున్న వైశాలికి ఇండియన్ ఆర్మీ ఈ ‘కఠినతరమైన’ పనిని అప్పగించడానికి కారణం గతంలో వైశాలి కార్గిల్ సెక్టార్లో ఇంజినీరుగా తనకు అప్పగించిన బాధ్యతల్ని సమర్థంగా నిర్వహించడమే. ‘బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్’ (బీఆర్వో).. భారత సైన్యానికి ఎంత కీలకమైనదో, బీఆర్వోలో పని చేసే ఇంజినీర్ల బాధ్యతలు అంత ముఖ్యమైనవి. మహారాష్ట్రలోని వార్థా ప్రాంతానికి చెందిన వైశాలి ఎం.టెక్ చదివి ఇటువైపు వచ్చారు. సరిహద్దుల్లో శత్రుదేశాలను వెనక్కు తరిమేందుకు, మిత్రదేశాలకు అవసరమైన సాధన సంపత్తిని అందచేసేందుకు వీలుగా ఎప్పటికప్పుడు శత్రు దుర్భేద్యంగా దారులను నిర్మించడం బీఆర్వో ప్రధాన విధి. ఇప్పుడు వైశాలీ కమాండింగ్ ఆఫీసర్‌గా ఉండబోతున్నది శత్రుదేశం చొరబాట్లను నియంత్రించే దారిని నిర్మించే ప్రాజెక్టుకే! గత ఏడాది లడఖ్ సెక్టార్లో భారత్–చైనా ఘర్షణల మధ్య కూడా బీఆర్వో సిబ్బంది శత్రువును కట్టడి చేసే పైకి కనిపించని మార్గాలను, సొరంగాలను నిర్మిస్తూనే ఉన్నారు. వాటికి కొనసాగింపుగా ఇప్పుడు సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో ప్రతికూల వాతావరణ, భౌగోళిక పరిస్థితుల్లో వైశాలి నేతృత్వంలోని ఇంజినీర్లు, నిర్మాణ కార్మికులు అక్కడి గండశిలల్ని పెకిలించి, భూభాగాలను తొలిచి.. భారత సైన్యం మాటువేసి శత్రువును తరిమికొట్టడానికి వీలుగా పోరాట మార్గాలను నిర్మించబోతున్నారు. అంత ఎత్తులో పని చేసేవారికి ఆక్సిజన్ సరిగా అందదు. తవ్వకాల్లో దుమ్మూధూళీ పైకి లేస్తుంది. డ్రిల్లింగ్ ధ్వనులు నిర్విరామంగా చెవుల్లో హోరెత్తుతుంటాయి. సాంకేతిక సమస్యలు తలెత్తవచ్చు. మధ్యలో కన్స్ట్రక్షన్ ప్లాన్‌ని మార్చవలసి రావచ్చు. వీటన్నిటినీ వైశాలే దగ్గరుండి పరిష్కరించాలి. ఇప్పటికే అక్కడికి రెండు ‘ఎయిర్–మెయిన్‌టైన్డ్ డిటాచ్మెంట్స్’ (అత్యవసర సేవల బృందాలు) చేరుకున్నాయి. ఇక వైశాలి వెళ్లి పనిని మొదలు పెట్టించడమే. శత్రువు ఆట కట్టించేందుకు ‘షార్ట్‌కట్’ మార్గాలను కనిపెట్టి, ‘పోరు దారులను’ నిర్మించడమే. ∙∙ బీఆర్వో ప్రస్తుతం లడఖ్, జమ్ము–కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో వ్యూహాత్మక దారుల్ని నిర్మిస్తోంది. చైనా సరిహద్దు వెంబడి ఉన్న 66 ప్రాంతాలలో ఇలాంటి దారుల్ని 2022 డిసెంబరు నాటికి నిర్మించాలన్న ధ్యేయంతో పని చేస్తోంది. కమాండింగ్ ఆఫీసర్ గా వైశాలి ఇప్పుడు ఎలాగూ కొండల్ని పిండి చేయిస్తారు కనుక తర్వాతి బాధ్యతల్లో కొన్నింటినైనా ఆమెకే అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి. ‘తొలి మహిళ’ అనే మాట పాతబడి పోయినట్లనిపిస్తోందా?! -
పాక్‌లో హిందూ డిఎస్పీ
కొద్ది రోజుల క్రితం వరకు మనీషా రూపిత కరాచీలోని జిన్నా పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్లో వైద్యురాలు. ఇప్పుడు ఆమె సిం«ద్ ప్రావిన్సులోని జకోబాబాద్ జిల్లా డిఎస్పీ! ‘డీఎస్పీలు వస్తుంటారు పోతుంటారు’ అనుకోవచ్చు. ఇక్కడ అలా అనుకోడానికి లేదు. పాకిస్తాన్‌లోనే తొలి హిందూ మహిళా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రూపిత! అయితే.. సర్వీస్ కమిషన్ విజేతగా సింద్ ప్రావిన్స్‌లోని హిందూ మహిళలకు తననొక ప్రతినిధిగా రూపిత భావించడం లేదు. సింద్ గ్రామీణ మహిళలందరికీ తన విజయం ఒక ప్రేరణ అవాలని మాత్రమే కోరుకుంటున్నారు! ‘సింద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్’ (ఎస్పీఎస్సీ) పరీక్షలో ర్యాంక్ సంపాదించి, ఈ ఘనతను సాధించారు రూపిత. మొదట ఆమె ‘సెంట్రల్ సుపీరియర్ సర్వీసు’ (మన దగ్గర యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) రాశారు. అదొక్కటే అత్యున్నతస్థాయి ఉద్యోగాలకు మార్గం అనుకున్నారు. ఆ తర్వాతే ఆమెకు.. సిం«ద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ర్యాంకు సాధించినా కూడా డైరెక్టు నియామకాలు ఉంటాయని తెలిసింది. పట్టుపట్టి బుక్స్ ముందు వేసుకుని కూర్చున్నారు. ఇప్పుడు డీఎస్పీ సీట్లో కూర్చోబోతున్నారు. నియామక ఉత్తర్వులు అందాయి. బాధ్యతలు చేపట్టడమే తరువాయి! మనీషా రూపిత, పాక్ పోలీస్ దళం ఎస్పీఎస్సీ ఫలితాలు వెల్లడై, ర్యాంకు సాధించి, డీఎస్పీ అయ్యాక గానీ రూపిత పాకిస్తాన్‌లోనే మొట్టమొదటి హిందూ మహిళా డీఎస్పీ అన్న సంగతి ఎవరి దృష్టికీ రాలేదు. పాకిస్తాన్లో కపిల్ దేవ్ అనే ఒక హక్కుల కార్యకర్త ‘ప్రథమ’ అనే ప్రత్యేకత కలిగిన ఈ నియామకం గురించి తన ట్విట్టర్లో వెల్లడించడంతో రూపితకు అభినందనలు మొదలయ్యాయి. ‘‘పాకిస్తాన్‌లోని హిందువులందరికీ ఇది గర్వకారణం’’ అని ఆయన ట్వీట్ చేశారు. రూపిత జకోబాబాద్‌లో బల్లో మాల్ అనే వ్యాపారి కుమార్తె. జిన్నా మెడికల్ సెంటర్లో మెడికల్ థెరపీ డాక్టర్‌గా పని చేస్తున్న రూపిత కు కంబైండ్ కాంపిటీటివ్ ఎగ్జామ్ (సి.సి.ఇ) అయిన ఎస్పీఎస్సీ రాసి గవర్నమెంట్లో డైరెక్ట్ గా అత్యున్నత స్థాయి ఉద్యోగానికి వెళ్లాలన్న ఆలోచన వచ్చిందే తడవుగా డాక్టర్‌గా సేవలు అందిస్తూనే సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. మంచి ర్యాంకుతో లక్ష్యాన్ని చేరుకున్నారు. ‘‘అయితే ఇదేమీ అంత తేలికైన ప్రయాణం కాదు. 2007 నాన్నగారు చనిపోయారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో పడిపోయాం. అయినా అమ్మ మా చదువును మాన్పించలేదు’’ అంటారు రూపిత. ఫీజులు, సర్వీస్ కమిషన్ పరీక్ష పుస్తకాలు కొనడం కోసం ఆమె ట్యూషన్ లు చెప్పారు. ‘‘గెలిచింది నేనే అయినా గెలిపించింది మా అమ్మే. ఆమె కలను నేను నెరవేర్చగలిగాను. అదే నా సంతోషం’’ అంటున్నారు రూపిత. తన విజయం సింద్‌లోని గ్రామీణ మహిళలందరికీ స్ఫూర్తిని ఇవ్వాలని ఆమె ఆశిస్తున్నారు. -
ఎడిటర్–ఇన్–చీఫ్ రాయిటర్స్‌కు తొలి మహిళ
వార్తా పత్రికల్లో అనేకమంది ఎడిటర్లు ఉంటారు. పత్రికా కార్యాలయంలో ఎన్ని ప్రత్యేకమైన వార్తా విభాగాలు ఉంటే అంతమంది ఎడిటర్లు. వాళ్లందరి పైనా మళ్లీ ఒక ఎడిటర్ ఉంటారు. వారే ఎడిటర్–ఇన్–చీఫ్. లేదా చీఫ్ ఎడిటర్. ‘రాయిటర్స్’.. ప్రపంచానికి ఎప్పటికప్పుడు వార్తల్ని, వార్తా కథనాల్ని అందిస్తూ వస్తున్న విశ్వసనీయ వార్తా సంస్థ. ఆ సంస్థకు ఇంతవరకు ఒక మహిళా చీఫ్ ఎడిటర్ లేనే లేరు. ఇప్పుడు తొలిసారి అలెస్సాండ్రా గలోనీ అనే మహిళ ఆ బాధ్యతల్ని స్వీకరించబోతున్నారు! 170 ఏళ్ల చరిత్ర గల రాయిటర్స్ని ఈ నెల 19 నుంచి 47 ఏళ్ల వయసు గల గలోనీ నడిపించబోతున్నారు! మహామహులకు మాత్రమే దక్కే ఇంత పెద్ద అవకాశం చిన్న వయసులోనే ఆమె సాధించగలిగారు! రాయిటర్స్ ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉంది. అక్కడ తన ‘ఎడిటర్–ఇన్–చీఫ్’ సీట్లో కూర్చొని దేశదేశాల్లోని 2,500 మంది సీనియర్ జర్నలిస్టులకు దిశానిర్దేశం చేయబోతున్నారు గలోని! రాయిటర్స్ న్యూస్ రూమ్ దాదాపుగా ఒక వార్ రూమ్. అక్కడ నిరంతరం తలపండిన పాత్రికేయుల సమాలోచనలు జరుగుతుంటాయి. వార్తని ‘ఛేదించడం’, ‘సాధించడం’ వారి ప్రధాన లక్ష్యాలు. వాళ్లందరికీ ఇక నుంచీ లీడర్.. గలోనీ. న్యూస్ రూమ్‌లో ప్రణాళికలను రూపొందిస్తూనే, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 200 ప్రాంతాలలో ఉన్న రిపోర్టర్లతో ఆమె ఎప్పుడూ అనుసంధానమై ఉండాలి. చిన్న పని కాదు. అలాగని పురుషులకే పరిమితమైన పని కాదని ఇప్పుడీ కొత్త నియామకంతో రాయిటర్స్ తేల్చి చెప్పింది. ఇప్పటికి వరకు ఎడిటర్–ఇన్–చీఫ్‌గా ఉన్న స్టీఫెన్ ఆల్డర్ వయసు 66. రాయిటర్స్ గ్లోబల్ మేనేజింగ్ ఎడిటర్ హోదాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అలెస్సాండ్రా గలోనీ. గత పదేళ్లుగా ఆయన న్యూస్ రూమ్‌కి సారథ్యం వహిస్తున్నారు. అనుభవజ్ఞుడు. ఆయన రిటైర్ అయితే తర్వాత ఎవరు అన్న ప్రశ్న వచ్చినప్పుడు.. రాయిటర్స్లోనే ‘గ్లోబల్ మేనేజింగ్ ఎడిటర్’గా ఉన్న గలోనీనే సరైన ఎంపికగా నిలిచారు! ఐదేళ్లుగా ఆ పదవిలో ఉన్న గలోనీదే న్యూస్ ప్లానింగ్ అంతా. 2015లో రాయిటర్స్లోకి రాకముందు వరకు మరొక ప్రఖ్యాత వార్తా సంస్థ ‘వాల్ స్ట్రీట్ జర్నల్’లో 2013 నుంచీ దక్షిణ ఐరోపా బ్యూరో లో ఉన్నారు. ఎడిటర్–ఇన్–చీఫ్‌గా గత సోమవారం అనేక ఊహాగానాల మధ్య గలోనీ పేరును బహిర్గతం చేస్తూ.. ‘‘ఈ పదవికి తగిన వ్యక్తి కోసం లోపల, బయట విస్తృత పరిధిలో అనేకమంది అత్యంత యోగ్యులైన వారిని దృష్టిలో ఉంచుకున్న అనంతరం మా వెతుకులాట అలెస్సాడ్రా గలోని దగ్గర ఆగింది’’ అని రాయిటర్స్ ప్రెసిడెంట్ మైఖేల్ ఫ్రైడెన్‌బర్గ్ ప్రకటించారు. గలోనీ రోమన్ మహిళ. నాలుగు భాషలు వచ్చు. బిజినెస్, పొలిటికల్ వార్తల్లో నిపుణురాలు. ప్రపంచ వాణిజ్య, రాజకీయ రంగాలలో ఏం జరగబోతోందీ, అవి ఎలాంటి మలుపులు తిరగబోతున్నదీ ముందే ఊహించగల అధ్యయనశీలి, అనుభవజ్ఞురాలు. ఆమె కెరీర్ ప్రారంభం అయింది కూడా రాయిటర్స్లోనే. ఇటాలియన్ లాంగ్వేజ్ న్యూస్ రిపోర్టర్‌గా చేరి, కొద్ది కాలంలోనే ‘ఎడిటర్–ఇన్–చీఫ్’గా ఎదిగారు! జర్నలిజంలో అత్యంత విశేష పురస్కారం అయిన ‘గెరాల్డ్ లోయెబ్ పౌండేషన్’ వారి 2020 మినార్డ్ ఎడిటర్ అవార్డు విజేత గలోనీనే! ఇంకా ఆమె ‘ఓవర్సీస్ ప్రెస్ క్లబ్ అవార్డు’, యు.కె. ‘బిజినెస్ జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ల విజేత కూడా. గలోనీ హార్వర్డ్ యూనివర్సిటీలోని ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్’లో చదివారు. తన బాధ్యతల గురించి మాట్లాడుతూ ‘‘ప్రతిభ, అంకితభావం గల జర్నలిస్టులతో నిండి ఉండే ప్రపంచ స్థాయి న్యూస్ రూమ్‌ను నడిపించే వకాశం రావడం నాకు లభించిన గౌరవం’’ అని అన్నారు గలోనీ. -
రిపోర్టర్లను, సిబ్బందిని ఫూల్స్ చేసిన జో బైడెన్ భార్య
వాషింగ్టన్: ఏప్రిల్ ఫస్ట్‌ని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఫూల్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. చిన్న చిన్న ఫ్రాంక్‌లు చేస్తూ.. స్నేహితులను, సన్నిహితులను సరదాగా ఆటపట్టిస్తారు. ఏప్రిల్ ఫూల్స్‌ని చేసే విషయంలో సెలబ్రిటీలు కూడా ముందుంటారు. తాజాగా ఈ జాబితాలోకి అమెరికా అధ్యక్షుడి భార్య, ఫస్ట్ లేడి జిల్ బైడెన్ కూడా చేరారు. ఎయిర్‌హోస్టెస్‌గా వచ్చి.. రిపోర్టర్లను, సిబ్బందిని ఏప్రిల్ ఫూల్స్ చేశారు. కాలీఫోర్నియా పర్యటన ముగించుకుని వస్తుండగా.. విమానంలో జిల్ బైడెన్ ఈ ప్రాంక్ చేశారు. ఎయిర్హోస్టెస్లాగా డ్రెస్ చేసుకుని.. నల్లటి మాస్క్ ధరించి.. జాస్మిన్ అనే నేమ్ ట్యాగ్ తగిలించుకుని క్యాబిన్లో ప్రవేశించారు జిల్ బైడైన్. అనంతరం అందులో ఉన్న వారందరికి స్వీట్ సర్వ్ చేశారు. ఐదు నిమిషాల తర్వాత మళ్లీ వచ్చిన ‘జాస్మిన్’ వారి ముందే విగ్, మాస్క్ తీసేసి చిరునవ్వులు చిందిస్తూ ‘ఏప్రిల్’ ఫూల్ అని అరిచారు. ఈ దృశ్యాన్ని చూసిన వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతసేపు తమ ముందు ఎయిర్‌హోస్టెస్‌గా తిరిగిన వ్యక్తి ఫస్ట్ లేడా అని ఆశ్చర్యపోయారు. ఇక జిల్ బైడెన్ సర్వ్ చేసిన స్వీట్లానే ప్రాంక్ కూడా సూపర్‌గా ఉందని ప్రశంసించారు సిబ్బంది. అయితే జిల్ బైడెన్ ఇలాంటి చిలిపి పనులు చేయడం ఇదే ప్రథమం కాదట. గతంలో ఇలా రెండు మూడు సార్లు తమతో ప్రయాణిస్తున్న వారిని ఆటపట్టించారట. చదవండి: విడాకులు తీసుకోకపోతే బైడెన్‌ను కలిసే అవకాశం వచ్చేది కాదు.. -
వాల్తేరులో పుట్టిన అగ్గిబరాటా
ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమాగా అందరూ కీర్తించే దేవికా రాణి మన వాల్తేరులో పుట్టింది. మరణించే నాటికి బెంగళూరులో 450 ఎకరాల విలువైన ఎస్టేట్‌ను వారసులు లేకపోవడం వల్ల ఎవరికి చెందాలో తేల్చక వదిలిపెట్టింది. ఆమె 1933లోనే తెర మీద ముద్దు సన్నివేశంలో నటించింది. దిలీప్ కుమార్‌ను స్టార్‌ను చేసింది. ఈ రాణి గురించి చాలామందికి తెలియని కొన్ని విశేషాలు... సాధారణంగా మగవాళ్లు లిఖించే చరిత్రలే నమోదవుతూ ఉండే సందర్భంగా హిందీ చిత్ర పరిశ్రమకు సంబంధించి కొత్తదార్లు, వేర్లూ వేసిన దేవికా రాణిని మాత్రం అందరూ మార్గదర్శిగా గుర్తించి గౌరవిస్తారు. ఆమెను ‘ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమా’గా అభివర్ణిస్తారు. అందుకు కారణం ఆమె చేసిన ఘనమైన పనులే. వాల్తేరులో సంపన్న బెంగాలీ కుటుంబానికి దేవికా రాణి జన్మించింది. ఆమె తండ్రి కల్నల్ మన్మథనాథ్ చౌదరి జన్మతః జమీందార్. తల్లి లీలాదేవి చౌదరి సాక్షాత్ రవీంద్రనాథ్ టాగూర్‌కు మేనకోడలు. అందుకని దేవికా రాణి 9 ఏళ్లకే లండన్ వెళ్లి అక్కడి బోర్డింగ్ స్కూల్లో చదువుకుంది. అక్కడే పరిచయమైన బారిస్టర్ చదువు చదివి సినిమా దర్శకుడైన హిమాంశును ప్రేమించింది. అతని కోరిక మేరకు సినిమా నటిగా మారింది. దానికి ముందే ఆమె సినిమా కళను అభ్యసించింది. మొత్తం మీద సినిమాకు సంబంధించిన అన్ని క్రాఫ్ట్‌ల అధ్యయనం తర్వాత ఆ జంట ఇండియా తిరిగి వచ్చి ముంబైలో ‘బాంబే టాకీస్’ను ప్రారంభించి సినిమాలు తీసి చరిత్ర సృష్టించారు. తెర మీద ముద్దు వెండి తెర మీద తొలి ముద్దు సన్నివేశంలో నటించిన భారతీయ నటి దేవికా రాణీయే. 1933లో తీసిన ‘కర్మ’ సినిమా కోసం భర్త హిమాంశును ఆమె నాలుగు నిమిషాలు ముద్దు పెట్టుకుంది. ఇప్పటికీ కూడా ఇది రికార్డు. ఆ తర్వాత అశోక్ కుమార్‌తో కలిసి ఆమె నటించిన ‘అఛూత్ కన్య’ సూపర్‌హిట్ అయ్యింది. ఆ తర్వాత అశోక్ కుమార్‌తో ఆమె చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది. అశోక్ కుమార్ ఆ సంస్థలో భాగస్వామి కూడా అయ్యాడు. దేవికా రాణి నటుడు దిలీప్ కుమార్‌ను హీరోను చేసింది. ఆ రోజుల్లో (1944) దిలీప్ కుమార్‌కు 250 రూపాయలు జీతం ఆఫర్ చేస్తే అతను అది నెలకా సంవత్సరానికా తేల్చుకోలేక సతమతమయ్యాడు. కాని ఆమె ఇచ్చింది నెలకే! అప్పటికి రాజ్ కపూర్‌కు సంవత్సరమంతా కలిపి ఆర్.కె. స్టూడియోలో 150 రూపాయల జీతం వచ్చేది. అలాంటి ప్రభావం దేవికా రాణిది. అశోక్ కుమార్, దేవికారాణి భర్తతో విడిపోయి భర్త హిమాంశు జీవించి ఉండగానే అతనితో వైవాహిక బంధంలో ఉండకుండా కేవలం ప్రొఫెషనల్ బంధంలోనే ఉండిపోయింది దేవికా రాణి. భర్త చనిపోయాక కొన్నాళ్లకు ఆమె రష్యన్ చిత్రకారుడు శ్వెతోస్లవ్ రోరిచ్‌ను వివాహం చేసుకుని మనాలిలో ఉండిపోయింది. ఆ సమయంలో ఆమెకు నెహ్రూ కుటుంబం సన్నిహితమైంది. ఆ తర్వాత ఆ జంట బెంగళూరు వచ్చి 450 ఎకరాల ఎస్టేట్ కొని అందులో ఎవరినీ కలవక జీవించారు. ఆమె దగ్గర పని చేసిన మేనేజర్ ఒకామె ఆమె ఎస్టేట్ విషయాలు గోల్మాల్ చేసిందనే విమర్శలు వచ్చాయి. దేవికా రాణి మరణించాక ఆ ఎస్టేట్‌ను సొంతం చేసుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం పెద్ద యుద్ధమే చేసింది. చివరకు సొంతం చేసుకుంది. వెండితెర గతిని మార్చిన దేవికా రాణి ముంబైకి, వెండితెర వ్యక్తులకు దూరంగా జీవించడం ఒక విచిత్రం. 1994లో ఆమె మరణించాక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. -
విడాకులు తీసుకోకపోతే బైడెన్‌ను కలిసే అవకాశం వచ్చేది కాదు..
పెళ్లయిన వాళ్ల జీవితంలోని పెద్ద విషాదం.. విడాకులు. స్త్రీకి ఆ బాధ ఇంకాస్త ఎక్కువేనేమో. ‘కానీ గైస్.. If you take one day at a time (రేపటి గురించి కూడా ఈరోజే ఆలోచించకుండా ఉంటే) things will be better' అని యూఎస్ ప్రథమ మహిళ జిల్ బైడెన్ ‘కెల్లీ క్లార్క్సన్ షో’ లో చెప్పడం ఇప్పుడు మహిళలకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చే మాట అయింది. ప్రథమ మహిళగా ఆమె ఇచ్చిన ఆ తొలి ఇంటర్వూలోనే.. మొదటి భర్త నుంచి తను వేరు పడటం గురించి మాట్లాడారు! అసలు అంత పర్సనల్ విషయం లోకి షో ఎందుకు వెళ్లింది! షో హోస్ట్ కెల్లీ కూడా ఈమధ్యే భర్తకు విడాకులు ఇచ్చారు. ఇంటర్వూలో జిల్ బైడెన్ తన విడాకుల అనంతర జీవితం గురించి ఇంకా ఏం చెప్పారు? ‘నేను విడాకులు తీసుకోకుండా ఉంటే ‘జో’ ని కలుసుకునే అవకాశం నాకు ఎప్పటికీ కలగకపోయేది‘ అని ఆమె అనడానికి కారణమైన ఆనాటి పరిణామాలు ఏమిటి? అవి మహిళలకు ఎలా ఆదర్శం? మన తెలుగు టీవీ ఛానెళ్లలో వస్తూ ఉండే బతుకు జట్కా బండి వంటి షో లను మీరు చూసే ఉంటారు. అలా.. దాంపత్య జీవితపు ఒడిదుడుకుల ఉద్వేగాలను ఒడిసిపట్టి, వాటిని వడకట్టకుండా ప్రసారం చేస్తుండే ఒక అమెరికన్ షో లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్ కనిపించారు! ప్రథమ మహిళ అయ్యాక ఒక టీవీ షో కు జిల్ బైడెన్ ఇంటర్వూ్య ఇవ్వడం ఇదే తొలిసారి. షో లో తొలిసారి మాట్లాడ్డంలో విశేషం ఏమీ లేదు. అయితే తన తొలి వివాహం గురించి జిల్ బైడెన్ ఆ షో లో మనసు విప్పారు. ‘ది కెల్లీ క్లార్క్సన్ షో’ అనే ఆ పగటి పూట షో గురువారం ప్రసారం అయింది. హోస్ట్ కెల్లీ (38). గెస్ట్ జిల్ బైడెన్ (69). హోస్టు, గెస్టు ఇద్దరికిద్దరూ సాధారణమైన వారేమీ కాదు. కెల్లీ గాయని. టెలివిజన్ పర్సనాలిటీ, నటి, రచయిత్రి. ‘ది కెల్లీ క్లార్క్సన్ షో’ను రోజూ కనీసం 10 లక్షల 80 వేల మంది టీవీ వీక్షకులు చూస్తుంటారు. ఎన్.బి.సి టీవీ తరఫున ఆమె ఈ డైలీ షో ను ఏడాదిగా నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో చిన్న బ్రేక్‌తో ఇటీవలే తిరిగి మొదలైంది. ఇక జిల్ బైడెన్ గురించి ఇంతే గొప్పగా చెప్పాలంటే ఆమెను ‘గృహిణి’ అని గానీ, ‘టీచర్’ అని గానీ చెబితే సరిపోతుంది. వైట్ హౌస్‌లోని ఈస్ట్ రూమ్‌లో ‘ది కెల్లీ క్లార్క్సన్ షో’ జిల్ బైడెన్, కెల్లీ ఇటువంటి షోలు ప్రసారం అవుతున్నప్పుడు సాధారణంగా ఒక ఉద్వేగ స్థితిలోకి గెస్టు చేరుకుంటారు. అప్పుడు గెస్టును హోస్టు ఓదారుస్తారు. కానీ గురువారం నాటి షోలో ఇందుకు భిన్నంగా జరిగింది. సాఫీగా సాగుతున్న సంసార నౌకను విడాకులనే ప్రతికూల గాలులు ఎంతగా అల్లకల్లోలానికి గురి చేస్తాయో చెబుతూ హోస్ట్ కెల్లీ గుండె తడితో మాట్లాడారు. అది ఆమె సొంత అనుభవం. ఆ అనుభవాన్ని స్క్రీన్‌పై జిల్ బైడెన్‌తో పంచుకున్నారు. కెల్లీ భర్త బ్రాండెన్ ట్యాలెంట్ మేనేజర్. అతణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కెల్లీ. అప్పటికే అతడు తన మొదటి భార్యతో విడిపోయి ఉన్నాడు. ఒక కూతురు. ఒక కొడుకు. వారిని కూడా తన పిల్లలుగా స్వీకరించారు కెల్లీ. తర్వాత వీళ్లిద్దరికీ ఒక కూతురు, ఒక కొడుకు పుట్టారు. కూతురు వయసిప్పుడు ఆరేళ్లు. కొడుకు వయసు నాలుగేళ్లు. 2012లో డేటింగ్, 2013 పెళ్లి, 2020 నవంబరులో లో విడాకులు. భర్తే విడాకులు కావాలన్నాడు. కోర్టుకు అతడు చెప్పిన కారణం.. తమ మధ్య ‘సమసిపోయే స్వభావం లేని మనస్పర్థలు’ ఎన్నో ఉన్నాయని. విడాకులు వచ్చాక కెల్లీ ఏడ్చింది. పిల్లల్ని తీసుకుని పక్కకు వచ్చేసింది. ఆమె జీవితం ఒక్కసారిగా తల్లకిందులు అయినట్లయింది. తనకున్న వ్యాపకాలు ఆమెకు ఆ జ్ఞాపకాలు రాకుండా సహాయపడ్డాయి. అయినా కష్టమే. భర్త నుంచి దూరంగా వచ్చి మూణ్ణెల్లయినా కాలేదు. భర్త విడిపోయినట్లనిపిస్తుందా! ఏదో ఊరెళ్లినట్లు అనిపిస్తుంది కానీ. షోలో కెల్లీ గుండె తడిని తుడిచే ప్రయత్నం ఏమీ చేయలేదు జిల్ బైడెన్. అది సోలో చాట్. వాళ్లిద్దరే మాట్లాడుకోవడం. కెల్లీ బాధను చూసి రెండు విషయాలు చెప్పారు జిల్. ఒకటి: విడాకులతో స్త్రీ జీవితమేమీ అంతమైపోదు. రెండు : రేపటి గురించి కూడా ఇవాళే ఆలోచించకపోతే జీవితం మెరుగ్గా ఉంటుంది. ఈ రెండు మాటల్ని కెల్లీ ఊరికే విన్నారు తప్ప, ఆమెకేమీ ఊరటనిచ్చినట్లు లేవు! ‘‘కెల్లీ చూడు.. నేను విడాకులు తీసుకోకుండా ఉంటే ‘జో’ని కలుసుకునే అవకాశం నాకు ఎప్పటికీ కలగకపోయేది’ అన్నారు. అదేదో నవ్వుతూ అనడం కాదు. నిజంగానే అన్నారు. గతాన్ని వెనకే వదిలేసి ముందుకు సాగిపోవాలని ఆ మాటలోని అంతరార్థం. విడాకుల తర్వాత స్త్రీలందరి జీవితం ఒకేలా ఉంటుంది. పురుషుడి సంగతి వేరే. ‘తట్టుకోలేకపోవడం’ అన్నది స్త్రీకి ఎక్కువగా ఉంటుంది. ఆ బలహీనత పైకి కనిపించి పోతుంటే మరింతగా జీవితం ఆ స్త్రీని హడలుకొడుతుంది. కెల్లీ జీవితంలో జరిగినట్లే జిల్ బైడెన్ జీవితంలోనూ జరిగింది. కాకపోతే, కెల్లీ తన మొదటి భర్త పిల్లలిద్దరికీ మారుతల్లి అయ్యారు. జిల్ తన రెండో భర్త బైడెన్ కొడుకులిద్దరికీ తల్లిగా ప్రేమను పంచారు. జిల్ 1970 ఫిబ్రవరిలో బిల్ స్టీవెన్సన్ని పెళ్లి చేసుకున్నారు. 1975 మే నెలలో విడాకులు తీసుకున్నారు. అందుకు ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. ‘జో బైడెన్‌తో తన భార్య పరిచయం తమ వివాహబంధాన్ని దెబ్బతీసిందని స్టీవెన్సన్ అంటాడు. ‘అతడివన్నీ మనసును బాధించే ఆరోపణలు’ అని జిల్ అంటారు. అతడితో విడాకులు తీసుకున్న రెండేళ్లకు 1977లో బైడెన్‌తో జిల్ పెళ్లి జరిగింది. బైడెన్ ఆమెకు పరిచయమైన తొలి రోజు జిల్ ఇంటికి వచ్చి రాగానే.. ‘మామ్, ఐ ఫైనల్లీ మెట్ ఎ జెంటిల్మన్’ అని చెప్పారట. ఆ సంగతిని ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు జిల్. ఆమె తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన బాధలో ఉన్నప్పుడు.. ‘రేపటి గురించి కూడా ఇవాళే ఆలోచించకపోతే జీవితం మెరుగ్గా ఉంటుంది’ అని తల్లి తనతో అన్నమాటనే ఇప్పుడు తను చెబుతున్నానని టీవీ షోలో కెల్లీతో అన్నారు జిల్ బైడెన్. షోలో ఇంకా చాలా విషయాలు మాట్లాడారు జిల్. విడాకుల టాపిక్కే షోకి హైలైట్ అయింది. సగటు మనిషి అయినా, సెలబ్రిటీ అయినా జీవితం ఒక దశలో ప్రతి ఒక్కరికీ ఇరుగ్గా అనిపిస్తుంది. అప్పుడే ధైర్యంగా గుండెల నిండా ఊపిరి పీల్చుకునే ప్రయత్నం చేయాలి. నిజమే కదా. రేపటికి ఊపిరెలా అని అలోచిస్తామా?! -
అదిగో ఆయేషా అజీజ్!
కొన్నింటిని అతిశయోక్తిగా చెప్పకపోతే, చెప్పడం మానడమే మేలు! అకాశంలో ఎగురుతున్న పక్షుల్ని చూస్తే తమక్కూడా రెక్కలు ఉంటే బాగుండుననుకుంటారు పిల్లలెవరైనా. శ్రీనగర్‌లోని ఆడపిల్లలు మాత్రం ఆయేషా అజీజ్ గురించి వినగానే పక్షులైపోయి ఆకాశంలో విహరిస్తారు! ఆయేషా కమర్షియల్ పైలట్. దేశంలోనే అతి చిన్న వయసులో పైలట్ అయిన అమ్మాయి! పదిహేనేళ్ల వయసుకే ఆమెకు పైలట్ లైసెన్స్ వచ్చింది. ఇప్పుడు ఆమె వయసు ఇరవై ఐదు. భారతదేశ ప్రసిద్ధ వార్తా సంస్థ ఎ.ఎన్.ఐ. (ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్) ఆయేషా పదేళ్ల పైలట్ జర్నీ గురించి ఇంటర్వ్యూ చేయడంతో తాజాగా ఆమె వార్తల్లోకి వచ్చారు. ఆయేషా అజీజ్ పేరు మొదటిసారి 2011 లో దేశానికి తెలిసింది. అది ఆమె పైలట్ లైసెన్స్ సాధించిన సంవత్సరం. శిక్షణ కోసం లైసెన్స్ అది. శిక్షణ రష్యాలోని సొకోల్ వైమానిక స్థావరంలో! ప్రారంభంలోనే ఎం.ఐ.జి.–29 జెట్‌ను నడపడం నేర్చుకున్నారు ఆయేషా. ఆ తర్వాత ఆమె సాధించవలసింది కమర్షియల్ లైసెన్స్. బాంబే ఫ్లయింగ్ క్లబ్లో చేరి విమానయానంలో డిగ్రీ సాధించాక ఆ లైసెన్స్ కూడా వచ్చేసింది. అది 2017లో. 2011లో లైసెన్స్ పొందాక తన ఈ పదేళ్ల ప్రస్థానం గురించి ఎ.ఎన్.ఐ. తో మాట్లాడుతున్నప్పుడు ఆయేషా తన గురించి కాక, కశ్మీర్లో ఇప్పుడు చక్కగా చదువుకుని పైకొస్తున్న ఆడపిల్లల గురించే ఎక్కువగా ప్రస్తావించారు. ‘వాళ్లలో పైలట్ అవాలనుకున్న అమ్మాయిలకు మీరే ఇన్స్పిరేషన్ అయుండొచ్చు కదా..’ అన్న మాటకు, ‘కావచ్చేమో!’ అని నవ్వారు ఆయేషా. పైలట్ గా ఆమె తన కెరీర్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు కూడా చెప్పారు. ‘‘ఎందుకంటే నాకు 9–5 ఉద్యోగం పడదు. నాకే కాదు.. అసలు ఏ అమ్మాయికీ అలాంటి ఉద్యోగం ఇష్టం ఉండదు. అవకాశం ఉండాలే కానీ, ఖండాలన్నీ తిరగాలనుకుంటుంది. అంతుకు తల్లిదండ్రులే లాంచింగ్ స్టెప్ అవాలి..’’ అంటారు ఆయేషా. ∙∙ ఆయేషాకు ఆకాశంలో ఎగరాలని మరీ చిన్న వయసులోనే మనసులో పడిపోయింది. వందల మంది ప్రయాణీకులను సురక్షితంగా గమ్యం చేర్చే ఉద్యోగం ఎంత థ్రిల్‌గా చెప్పడానికే ఆమె ఏ సమయంలోనైనా ఉత్సాహం చూపుతారు. తల్లిదండ్రులిద్దరూ రెండు చేతులతో భద్రంగా పైకి ఎగరేసిన పైలట్ పావురం ఆయేషా. వారు పెద్ద సపోర్ట్ ఆమె కెరీర్‌కు. ‘యంగెస్ట్ స్టూడెంట్ పైలట్’ అనే రికార్డు కూడా ఇప్పటికీ ఆమె పేరు మీదే ఉంది. ఆయేషా పుట్టింది కశ్మీర్లో. పెరిగింది ముంబైలోని వర్లీలో. తల్లితో కలిసి ముంబై నుంచి అమ్మమ్మ వాళ్లుండే జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాకు తరచు విమానంలో వెళ్లివస్తుండంతో తనూ విమానాన్ని నడపాలని అనుకుంది ఆయేషా! ఆ మాటే అమ్మానాన్నకు చెబితే.. ‘తప్పకుండా.. అయితే అందుకు కష్టపడి చదవాల్సి ఉంటుంది’ అని చెప్పారు. టెన్త్ పూర్తి చేయగానే ఆమె ఆశకు పైలట్ కోర్సుతో రెక్కలు కట్టారు. పైలట్ అయ్యాక తొలిసారి అమ్మానాన్న ఉన్న విమానాన్ని నడపడం ఆయేషా జీవితంలోని మరపురాని అపురూప ఘటన. ఇక తల్లిదండ్రులు గర్వ పడకుండా ఉంటారా.. కూతురు కూర్చోబెట్టి తమను, ఇంకా మరికొంతమందిని గాల్లో తేలియాడిస్తుంటే! బాంబే ఫ్లయింగ్ క్లబ్లో లైసెన్స్ సాధించాక 2012లో ‘నాసా’లో కూడా రెండు నెలల ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు ఆయేషా! అక్కడ ఆమెకు జాన్ మెక్‌బ్రైడ్ అనే నాసా రిటైర్డ్ వ్యోమగామి పరిచయం అయ్యారు. స్పేస్ షటిల్ మిషన్, మైక్రో గ్రావిటీ, మాన్డ్ మానోవరింగ్ (విన్యాసాలు), మల్టీ యాక్సిస్ ట్రైనింగ్, ఎక్స్ట్రా వెహిక్యులర్ యాక్టివిటీ.. వీటన్నిటిలో మెక్‌బ్రైడ్ ఆమెకు మెళకువలు నేర్పారు. ∙∙ జాన్ మెక్‌బ్రైడ్ తర్వాత ఆమెలో పూర్తి స్థాయి స్ఫూర్తిని నింపినవారు నాసాలోని భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్. స్వయంగా వెళ్లి సునీతను కలుసుకున్నారు ఆయేషా. నీటిలో స్కూబా డైవింగ్, నింగిలో మూన్ వాక్‌లలో తన అనుభవాలను ఆయేషాతో పంచుకుని ఆమె కలలకు ఇంధనాన్ని నింపారు సునీత. 1960లో ప్రైవేట్ పైలట్ లైసెన్స్‌తో ప్రయాణీకుల విమానాన్ని నడిపిన తొలి భారతీయ మహిళా పైలట్ రబియా ఫతే అలీ దగ్గర కూడా ఆయేషా ఆసక్తి కొద్దీ మరికొన్ని నైపుణ్యాలు నేర్చుకున్నారు. పైలట్ శిక్షణ లైసెన్స్ సంపాదించాక 2012లో శిక్షణలో భాగంగా తొలిసారి ఎం.ఐ.జి జెట్‌ను నడిపినప్పుడు ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేనని అంటారు ఆయేషా. ఆనాటి చిన్న పిల్ల ఇప్పుడు ‘ఇండియన్ ఉమెన్ పైలట్స్ అసోసియేషన్’ లో ప్రతిష్టాత్మక సభ్యురాలు. అయితే స్టూడెంట్ పైలట్‌గా, పైలట్‌గా, అసోసియేషన్ సభ్యురాలిగా ఘనమైన గుర్తింపు కలిగి ఉన్న ఆయేషాకూ కొన్ని ఒత్తిడిలు తప్పలేదు. సంప్రదాయ శిరోవస్త్రాన్ని (హిజబ్) ఎందుకు ధరించరనే ప్రశ్నను ఆమె ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉన్నారు! అందుకు ఆమె దగ్గర సమాధానం కూడా ఉంది. ‘‘ప్రవక్త భార్య హజ్రత్ ఆయేషా యుద్ధంలో ఒంటెను స్వారీ చేయించగా లేనిది, నేను విమానాన్ని నడిపేందుకు సంప్రదాయాలు ఎందుకు అడ్డపడాలి?’’ అంటారు ఆయేషా. 2018 జనవరిలో ఢిల్లీలోని రాజ్‌భవన్‌లో ఆర్మీ చీఫ్, రాష్ట్రపతి చేతుల మీదుగా ‘ఫస్ట్ లేడీస్’ టైటిల్‌ను అందుకున్న ఆయేషా.. పైలట్లు కావాలన్న ఉత్సాహం ఉండీ, ఆర్థికంగా వెలుసుబాటు లేని అమ్మాయిల్ని పైలట్లుగా ప్రోత్సహించేందుకు ఇండియన్ ఉమెన్ పైలట్స్ అసోసియేషన్ తరఫున కృషి చేస్తున్నారు. -
అమెరికా ఎన్నికలు.. అరుదైన దృశ్యం!
వాషింగ్టన్: అదో అరుదైన దృశ్యం.. చరిత్ర సృష్టించిన అపురూపమైన సందర్భం. అగ్రరాజ్యానికి తొలి మహిళా ఉపాధ్యక్షురాలు, తొలి నల్లజాతీయురాలు, తొలి ప్రవాస భారతీయురాలు ఇలా ఎన్నో ప్రత్యేకతల్ని సొంతం చేసుకున్న కమలా హ్యారిస్ జాతినుద్దేశించి ప్రసంగించినప్పుడు వెన్నెల కాంతులతో పోటీ పడే తెల్ల రంగు దుస్తుల్లో మెరిసిపోయారు. మహిళా హక్కుల కోసం ఉద్యమించడమే తన లక్ష్యమని చెప్పడానికే ఆ రంగు దుస్తులు వేసుకున్నారు. అమెరికాలో 1913లో ఏర్పాటైన రాజకీయ సంస్థ ది నేషనల్ వుమెన్ పార్టీ తెలుపు, వంగపండు, బంగారం రంగుల్ని మహిళా ఉద్యమానికి ప్రతీకగా ఎంచుకుంది. అందులో తెలుపురంగు స్వచ్ఛతకి ప్రతిబింబంగా నిలుస్తుంది. అలా తెల్లరంగులో రాజహంసలా ఈ దేశానికి తాను తొలి మహిళా అధ్యక్షురాలిని అని, కానీ తాను చివరి మహిళని కాదు అంటూ ఉద్వేగ భరిత ప్రసంగాన్ని చేశారు. స్ఫూర్తిని నింపే వీడియో అగ్రరాజ్యానికి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఇటీవల తన మేనకోడలిని ఒళ్లో కూర్చోబెట్టుకొని ముచ్చటించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో నాలుగేళ్ల చిన్నారి అమరా అజాగు తనకు అమెరికాకు అధ్యక్షురాలు కావాలని చెప్పింది. దానికి కమల నువ్వు కూడా అధ్యక్షురాలివి కావొచ్చని అయితే దానికి చాలా కష్టపడాలని, 35 సంవత్సరాలు నిండాలని చెప్పి ఆ చిన్నారిలో స్ఫూర్తిని నింపారు. అదే స్ఫూర్తిని కమల తనలో తాను చాలా ఏళ్లుగా నింపుకుంటూ వస్తున్నారు. ఆ కష్టపడే తత్వం, తల్లి చెప్పిన మాటల్ని జీవితంలో తుచ తప్పకుండా ఆచరించడం, అంతులేని ఆత్మవిశ్వాసం ఆమెని ఉపాధ్యక్ష పీఠానికి దగ్గర చేశాయి. నల్ల జాతీయురాలినని చెప్పడానికి గర్వపడతా కమల తండ్రి డేవిడ్ హ్యారిస్ జమైకా దేశస్తుడు. తల్లి శ్యామలా గోపాలన్ భారతీయురాలు. చెన్నైకి చెందిన కేన్సర్ పరిశోధకురాలు, పౌరహక్కుల ఉద్యమకారిణి. చిన్నతనంలో తల్లిదండ్రులు విడిపోవడంతో తల్లి సంరక్షణలోనే పెరిగారు. ఆమె గుణాలు పుణికిపుచ్చుకొని జాతి వివక్షపై ధిక్కార స్వరం, వలసవాదులపై ఉదారవాదం, చట్టసభల్లో ప్రశ్నించే తత్వం, అద్భుతమైన నాయకత్వ లక్షణాల్ని సొంతం చేసుకున్నారు. ‘‘అమెరికా మమ్మల్ని నల్లజాతివారిగానే చూస్తుందని మా అమ్మకి బాగా తెలుసు. అందుకే నన్ను, మా చెల్లెల్ని ఆత్మవిశ్వాసంతో పెంచారు. నల్లజాతీయురాలినని చెప్పుకోవడానికి నేను గర్వపడతాను’’అని కమలా హ్యారిస్ తన ఆటోబయోగ్రఫీ ది ట్రూత్స్ వి హోల్డ్‌లో రాసుకున్నారు. తన సహచర లాయర్ డగ్లస్ ఎమాఫ్‌ను పెళ్లాడారు. డగ్లస్‌కు మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలున్నారు. వారిని సొంత పిల్లల్లా పెంచారు. సమర్థవంతమైన నాయకురాలు న్యాయశాస్త్రంలో పట్టా తీసుకొని డిస్ట్రిక్ట్ అటార్నీగా. రాష్ట్ర అటార్నీ జనరల్‌గా తన సత్తా చాటారు. అద్భుతమైన వాక్పటిమతో మంచి లాయర్‌గా పేరు తెచ్చుకున్నారు. 2016లో డెమొక్రాటిక్ పార్టీ తరఫున సెనేట్‌కి ఎన్నికై జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత అమెరికాకి అధ్యక్షురాలు కావాలని కలలు కన్నారు. జో బైడెన్‌తో పోటీ పడి గత ఏడాది చివర్లో రేసు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కొద్ది నెలలకే బైడెన్‌కు మద్దతుగా నిలిచి ఉపాధ్యక్ష పదవిని చేజిక్కించుకున్నారు. ఒక సెనేటర్‌గా ఆమెలో నాయకత్వ లక్షణాలు ప్రపంచానికి ఎప్పుడో తెలిశాయి. ఇంటెలిజెన్స్, జ్యుడీషియరీ విభాగాల్లో మంచి పట్టున్న ఆమెకు మొదటి రోజు నుంచే ప్రభుత్వాన్ని నడిపించగల సామర్థ్యం ఉంది. నా ఫోన్ రింగ్ ఆగలేదు అగ్రరాజ్యం ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై కమలా హ్యారిస్ చరిత్ర తిరగరాయడంతో భారత్‌లోని ఆమె స్వగ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఢిల్లీలో ఉంటున్న ఆమె మేనమామ గోపాలన్ బాలచంద్రన్ కమల విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కమల విజయం సాధించిన దగ్గర్నుంచి తన ఫోన్ రింగ్ అవుతూనే ఉందని ఆయన చెప్పారు. తొలి మహిళనే కానీ... మీరు ఆశను, ఐక్యతను, మర్యాదను, శాస్త్రీయతను, నిజాన్ని ఎన్నుకున్నారు. అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్‌ను ఎన్నుకున్నారు. ఆయన గాయాలను మాన్పే శక్తి ఉన్న వ్యక్తి. నేను ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళనే కావచ్చు. కానీ చివరి స్త్రీని మాత్రం కాను. ఎందుకంటే ఈ ఎన్నికలను, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న చిన్నారులకు వారి ముందున్న అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. – కమలా హ్యారీస్ -
ఫస్ట్ ఉమన్ అంబులెన్స్ డ్రైవర్
అంబులెన్స్ అంటే ఆఘమేఘాల మీద నడపాలి. లోపల ఉన్న పేషెంట్ గగ్గోలు పెడుతున్నా బంధువులు కంగారులో రోదిస్తున్నా చెదరక గమ్యాన్ని చేరాలి. అవసరమైతే ఫస్ట్ ఎయిడ్ చేయాలి.ఊపిరికి పచ్చదీపం చూపాలి.ఇదంతా మగవారి పని అని అందరూ అనుకుంటారు.కాదని నిరూపిస్తోంది చెన్నై వీరలక్ష్మి. మొన్న రెండు రోజుల క్రితం ఆగస్టు 31న తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి 118 కొత్త అంబులెన్స్‌లకు పచ్చజెండా ఊపి ప్రజల వైద్యసేవలకు వాటిని అంకితం చేశారు. రాష్ట్రంలో వేయికి పైగా ఉన్న అంబులెన్స్‌లకు ఇవి కొత్త చేర్పు. ఇది ఒక విశేషమైతే ఈ కొత్త అంబులెన్స్‌లలో ఒకదానికి ఒక మహిళా డ్రైవర్‌ను ఆయన అపాయింట్ చేయడం మరో విశేషం. ఆ మహిళ పేరు వీరలక్ష్మి. ఈ నియామకంతో వీరలక్ష్మి తమిళనాడు తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్ అయ్యింది. బహుశా భారతదేశంలో ఈ కోవిడ్ కాలంలో డ్యూటీలో ఉన్న ఏకైక మహిళా డ్రైవర్ కూడా కావచ్చు. చెన్నైలో నివాసం ఉండే 30 ఏళ్ల వీరలక్ష్మి ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో డిప్లమా చేసింది. క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్న భర్తకు చేదోడు వాదోడుగా ఉండాలని ఆరేళ్ల క్రితం ఒక స్వచ్ఛంద సంస్థ సహాయంతో డ్రైవింగ్ నేర్చుకుంది. అప్పటి నుంచి తనూ క్యాబ్ డ్రైవర్‌గా మారి పని చేయడం మొదలెట్టింది. అంతే కాదు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకునే మహిళలకు శిక్షకురాలిగా కూడా మారింది. హెవీ వెహికిల్స్ డ్రైవింగ్ లైసెన్స్‌ను సంపాదించింది. అయితే కరోనా అందరికీ తెచ్చినట్టే వారి కుటుంబానికి ఇబ్బందులను తెచ్చింది. భర్తకు తగినంత పని లేదు. తనకు కూడా లేదు. ఈ సమయంలోనే కొత్త అంబులెన్స్ డ్రైవర్ల కోసం తమిళనాడు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. కావలసిన అర్హతలు అన్నీ ఉన్నాయి. కాని అంబులెన్స్ డ్రైవర్‌గా ఇప్పటి వరకూ స్త్రీలెవరూ పని చేయలేదు. ‘ఏం చేద్దామనుకుంటూ ఉంటే మా అమ్మ ధైర్యం చెప్పింది. గట్టిగా ప్రయత్నిస్తే సాధించలేనిది అంటూ ఉండదు అని చెప్పింది’ అంది వీరలక్ష్మి.అపాయింట్మెంట్ వచ్చాక కొన్నాళ్లు అంబులెన్స్ డ్రైవర్‌గా ఉండటానికి అవసరమైన ట్రైనింగ్ ఇచ్చారు. ప్రాక్టికల్ అనుభవం కోసం అంబులెన్స్ డ్రైవర్లతో పాటు పంపారు. ‘నాకు పాసింజర్లను కూచోబెట్టుకుని క్యాబ్ నడపడమే తెలుసు. కాని అంబులెన్స్‌లో ప్రయాణికులతో పాటు చాలాసార్లు రక్తం కూడా ఉంటుంది. ముందు భయం వేసినా తర్వాత అలవాటైంది. 108 అంబులెన్స్ అంటే కోవిడ్ పేషెంట్స్‌ను కూడా తీసుకురావాల్సి రావచ్చు. కాని మా జాగ్రత్తలు మాకున్నాయి అన్న ధైర్యం ఉంది. ఇటువంటి సమయంలో అవసరమైన వారికి సేవ చేయబోతున్నానన్న సంతృప్తి కూడా ఉంది’ అంది వీరలక్ష్మి. ఆమె మొదటిసారి యూనిఫామ్ వేసుకొని అన్ని అంబులెన్స్‌లతో పాటు నడుపుతుంటే చూడటానికి తండ్రితో పాటు వచ్చిన పదేళ్ల కూతురు, ఐదేళ్ల కొడుకు తమ తల్లివైపు గర్వంగా, ఆశ్చర్యంగా చూశారు. శక్తి సామర్థ్యాలను చూపి, పాత మూసలు పగులగొట్టే వీరలక్ష్మి వంటి వారిని ఎవరైనా అలాగే చూడాల్సిందే. -
శ్రీనగర్‌లో స్త్రీశక్తి
ఆమె తెలంగాణ కేడర్ 1996 బ్యాచ్ ఐ.పి.ఎస్ ఆఫీసర్. ఆంధ్రా, తెలంగాణ రెండు ప్రాంతాలలో పని చేశారు. చిత్తూరులో పని చేసేటప్పుడు హెచ్ఐవి బాధితుల ఆస్తి హక్కు కోసం కృషి చేశారు. ప్రకాశం జిల్లాలో పని చేసేటప్పుడు చెంచుల వికాసానికి దోహదపడ్డారు. తెలంగాణ జిల్లాల్లో మావోయిస్ట్‌ల కార్యకలాపాలను కట్టడి చేశారు. బిహార్‌లో కూడా తన సత్తాను చాటిన చారుసిన్హా ఇప్పుడు శ్రీనగర్‌కు మొదటి సిఆర్పిఎఫ్ మహిళా ఐజిగా నియమితులయ్యి చరిత్ర సృష్టించారు. ఆమె ఆలోచనలు కొన్ని.... సీనియర్ ఐ.పి.ఎస్ ఆఫీసర్ చారు సిన్హా ఇప్పుడు వార్తల్లో ఉన్నారు. ఆమె శ్రీనగర్‌లో నిలుచుని దేశం మొత్తం తన వైపు చూసేలా చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఆమె సి.ఆర్.పి.ఎఫ్ శ్రీనగర్ సెక్టార్‌కు ఇన్స్పెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇలా శ్రీనగర్‌లో ఐజిగా ఒక మహిళ బాధ్యతలు తీసుకోవడం ఇదే ప్రథమం. అందునా ఉగ్రవాదుల గురి ప్రధానంగా ఉండే శ్రీనగర్ సెక్టార్లో ఒక మహిళా అధికారి ఈ సవాలును స్వీకరించడం మరీ విశేషం. శ్రీనగర్ సి.ఆర్.పి.ఎఫ్ సెక్టార్ ‘బ్రయిన్ నిషత్’ అనే ప్రాంతంలో ఉంది. మూడు జిల్లాలు– బడ్గమ్, గండెర్బల్, శ్రీనగర్‌తో పాటు కేంద్రపాలిత లడాక్ కూడా దీని ఆపరేషనల్ జూరీ డిక్షన్ కిందకు వస్తాయి. ఈ అన్ని ప్రాంతాలలో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించే కీలక బాధ్యత ఇప్పుడు చారు సిన్హాది అవుతుంది. అక్కడి పాలనా వ్యవస్థతో, పోలీసులు విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించాలి. 2005లో శ్రీనగర్ సి.ఆర్.పి.ఎఫ్ సెక్టార్ మొదలైతే పురుష అధికారులే ఐ.జిలుగా బాధ్యతలు నిర్వరిస్తూ వచ్చారు. చారు సిన్హా ఇప్పుడు వారి స్థానంలో రావడం అమె దక్షతకు, ధైర్య సాహాసాలకు ఒక నిదర్శనం. హైదరాబాద్‌లో చదువుకుని చారు సిన్హా హైదరాబాద్‌లో చదువుకున్నారు. ఎనిమిదవ తరగతి నుంచి ఆమెకు దేశానికి సేవ చేయాలన్న ఒక ఆశయం మొదలైంది. హైదరాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజ్‌లో ఇంగ్లిష్ లిటరేచర్ డిగ్రీ చదివి, సెంట్రల్ యూనివర్సిటీలో పిజి చేశాక 1996లో ఐ.పి.ఎస్‌కు ఎంపిక అయ్యారు. ఒక మహిళగా కఠినమైన పోలీస్ ట్రయినింగ్‌ను ఎదుర్కొన్నారు. ‘ఎన్నో గాయాలు, ఎముకలు చిట్లడాలు అయ్యాయి. అయినా హార్స్ రైడింగ్ దగ్గరి నుంచి అన్ని శిక్షణలను విజయవంతంగా పూర్తి చేశాను’ అంటారామె. ట్రయినింగ్ అయ్యాక పులివెందుల ఏ.ఎస్.పిగా పని చేశారు. ఆ తర్వాత ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, మెదక్ ఇలా భిన్న ప్రాంతాలలో పని చేశారు. ‘నేను ఉద్యోగానికి చేరిన కొత్తల్లో ఇదంతా మగ ప్రపంచంగా ఉండేది. అందునా మీడియాకు ఇలా మహిళా పోలీస్ అధికారిని చూడటం ఇంకా కుతూహలంగా ఉండేది. నేను ఎక్కడికి వెళుతున్నాను... ఏం చేస్తున్నాను.. అని నా వెంటబడేవారు. ఒక దశలో నాకసలు పర్సనల్ లైఫ్ లేదా అని సందేహం కలిగేది. తర్వాత తర్వాత ఈ కుతూహలం తగ్గి వెసులుబాటు వచ్చింది’ అంటారామె. మనిషా? నేరమా? ‘కొత్తల్లో నేను నేరాలను చూసినప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి సమయం తీసుకునేదాన్ని. నిందితుల్లో, బాధితుల్లో ఎవరు చెప్పేది సత్యం అని డైలమాలో ఉండేదాన్ని. ఎందుకంటే చట్టానికి బాధ్యులుగా ఉన్నవారు తప్పు నిర్ణయాలు తీసుకుంటే వ్యక్తుల జీవితాలు నాశనమైపోతాయి. ఆ తర్వాత వ్యక్తులను కాదు నేరాన్ని మాత్రమే చూడాలి. జరిగిన నేరానికి శిక్ష మీద దృష్టి పెడితే వ్యక్తులు అప్రధానమైపోతారు అని తెలుసుకున్నాను’ అంటారామె. తనకు తనదైన పని విధానం ఉందనుకుంటారు చారు సిన్హా. ‘నా కింద పని చేసే వివిధ స్థాయుల అధికారులు ఉంటారు. కొందరు నాకు అంతా తెలుసు అనుకుంటారు. మరికొందరు నాకేమీ తెలియదు అనుకుంటారు. నేను ఒక బాధ్యత తీసుకున్నాక మొదట చేసే పని నా కింద పని చేసే సిబ్బందిని అంచనా వేయడం. వారి స్వభావాలు నాకు అర్థమవుతాయి. ఎవరు ఏమిటో అవగాహన వచ్చాక వారికి ఎలాంటి పని చెప్పాలో చూసి చెబుతాను. సాధారణంగా నా అంచనా తప్పదు’ అంటారామె. రైతుకు దొరికిన ఉంగరం ‘ఒక రైతు వ్యవసాయం చేసుకుని బతికేవాడు. అతనికి ఒకరోజు పొలంలో ఒక ఉంగరం దొరికింది. దానిని పెట్టుకుంటే తాను మాయం అయిపోతానని, ఎవరికీ కనపడడని అతనికి అర్థమైంది. వెంటనే అతడు దానిని పెట్టుకుని ఆ ఊరి భూస్వామి ఇంట్లో చొరబడి వజ్రాలు దొంగిలించి పారిపోతాడు. ఆ ఉంగరం వల్ల అతడు తనకు, ఆ భూస్వామికి చెడు తెచ్చాడు. ఆ ఉంగరాన్ని మంచికి ఉపయోగించి ఉంటే ఎంత బాగుండేది. పోలీసు విభాగాలలో ఉండే ప్రతి ఉద్యోగి అలాంటి ఉంగరం ఉన్నవాడి కిందే లెక్క. అధికారమే అతని ఉంగరం. దానితో మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి. నా కలీగ్స్ అందరికీ కొత్త అధికారులకూ ఈ కథే నేను చెబుతూ ఉంటాను’ అంటారు చారు సిన్హా. బిహార్‌లో, జమ్ములో చారు సిన్హాకు తీవ్రవాద కార్యకలాపాల నిరోధం కొత్త కాదు. తెలంగాణ జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో పని చేశారు. ఒకసారి ఆమె కింద పని చేసే నలుగురు పోలీసు సిబ్బంది కిడ్నాప్‌కు గురైనప్పుడు అవతలి పక్షం పెట్టిన డిమాండ్స్‌కు చారు లొంగలేదు. పది రోజుల తర్వాత గత్యంతరం లేక ఆ సిబ్బందిని వదిలిపెట్టాల్సి వచ్చింది. ఈ అనుభవాన్ని చూసి ఆమెకు బిహార్ నక్సల్ కార్యకలాపాల నిరోధానికి అక్కడి సి.ఆర్.పి.ఎఫ్ సెక్టార్‌కు ఐ.జిగా నియమించారు. అక్కడ ఆమె పని తీరును గమనించాక జమ్ము ఐ.జిగా నియమించారు. అక్కడా ఆమె తన ప్రతిభా సామర్థ్యాలను చూపింది. దాంతో జటిలమైన బాధ్యత అయిన శ్రీనగర్ ఐజి స్థానాన్ని అప్పగించారు. చారు సిన్హాను తెలిసినవారు ఆమె ఈ పని సమర్థంగా చేయగలరని అంచనా వేస్తున్నారు. సత్యసాయిబాబా భక్తురాలు చారు సిన్హా సత్య సాయిబాబా ఆరాధకురాలు. 19 ఏళ్ల వయసులో మొదటిసారి సత్య సాయిబాబాను కలిసి ఆ తర్వాత అనేకసార్లు ఆయన ఆశీర్వచనాలు పొందానని చెబుతారు. పుస్తకాలు చదవడం, విహారం, పెంపుడు శునకాలతో ఆటలు ఇవి ఆమెకు ఆటవిడుపు సమయాలు. – సాక్షి ఫ్యామిలీ -
ఫస్ట్ ఉమెన్ మెరైన్ ఇంజనీర్
పాతికేళ్ల కిందట.. మగవాళ్లు మాత్రమే పనిచేయగలరు అనే చోట.. ఓ ఇరవై రెండేళ్ల అమ్మాయి ‘నేను సైతం’ అంది. ఎంపిక చేసిన 1500 మందిలో తను ఒక్కతే అమ్మాయి. అయినా వెనకడుగు వేయలేదు. మొట్టమొదటి ఇండియన్ ఉమెన్ మెరైన్ ఇంజినీర్‌గా విధులకు సన్నద్ధమైంది. ఆమె వేసిన మార్గం మరికొందరు అమ్మాయిల్లో ధైర్యం నింపింది. ఆమే సోనాలీ బెనర్జీ. ‘నేను నా బాల్యంలోనే సముద్రంతో ప్రేమలో పడ్డాను’ అంటూ నవ్వుతూ చెబుతుంది సోనాలీ. చిన్నతనంలో మొదటిసారి ఓడలో ప్రయాణించినప్పుడు అదే ఓడలో పనిచేయాలని కన్న కల పెద్దయ్యాక సాకారం చేసుకుంది. కష్టమైన ఇష్టం సోనాలీబెనర్జీ అలహాబాద్‌లో పుట్టి పెరిగింది. ఆమెకు చిన్నప్పటి నుంచి సముద్రం, ఓడ ప్రయాణం అంటే మహా ఇష్టం. ఓడల ద్వారానే ప్రపంచం మొత్తం ప్రయాణించాలనుకుంది. ఆమె ఇష్టాన్ని కనిపెట్టిన మేనమామ కలను సాకారం చేసుకోవాలంటే మెరైన్ ఇంజినీర్ అవమని ప్రోత్సహించాడు. 1995లో ఐఐటి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి మెరైన్ ఇంజనీరింగ్‌లో ప్రవేశం పొందింది. మెరైన్ ఇంజనీరింగ్ పూర్తయ్యాక, షిప్పింగ్ సంస్థలో 6 నెలల ఫ్రీ కోర్సుకు ఎంపికయ్యింది. నాలుగేళ్ల కష్టం తర్వాత 27 ఆగస్టు 1999 న మెరైన్ ఇంజనీర్ అయ్యింది. మెరైన్ ఇంజనీర్ పని ఓడ మరమ్మత్తు, నిర్వహణ. ‘నేటి ఆధునిక నౌకలలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలను ఉపయోగిస్తున్నారు. ఒక మెరైన్ ఇంజనీర్ ఈ తాజా సాధనాలను అర్థం చేసుకోవాలి. ఈ పరికరాలను ఆపరేట్ చేయడానికి, రిపేర్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి’ అంటోంది సోనాలీ. తండ్రికి అయిష్టం సోనాలి మెరైన్ ఇంజినీర్ అవడం అప్పట్లో ఆమె తండ్రికి అస్సలు ఇష్టం లేదు. అది పురుషుల రంగం. అందులో ఓ ఆడపిల్ల వెళ్లి ఎలా పనిచేయగలదు అనేవాడు. కానీ, సోనాలి ఆడపిల్లలు కూడా పురుషుల రంగంలో పనిచేయగలరు అని తండ్రికి నిరూపించింది. అయితే, పురుషుల రంగంలో పనిచేయడం సోనాలీకి అంత సులభం కాలేదు. తనతో చదువుతున్న చాలా మంది అబ్బాయిలు కూడా ఆమె ఆత్మవిశ్వాసాన్ని తగ్గించడానికే ప్రయత్నించారు. కానీ అధ్యాపకులు మాత్రం ఎప్పుడూ ఆమె ప్రోత్సహించారు. ఏకైక మహిళ మెరైన్ ఇంజనీర్ అయినప్పుడు ఆమె వయసు 22 సంవత్సరాలు. కోల్‌కతా సమీపంలోని తారత్లాలో ఉన్న మెరైన్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ప్రవేశం పొందిన తరువాత, 1500 మంది క్యాడెట్లలో ఆమె ఏకైక మహిళ అని తెలిసింది. దీంతో మొదట్లో సోనాలికి ఇబ్బందిగా అనిపించింది. దానివల్ల ఆమెను ఎక్కడ ఉంచాలి అని ఇటు తల్లిదండ్రులు, అధ్యాపకులు చర్చించారు. సుదీర్ఘ చర్చల తరువాత ఆమెను ఆఫీసర్స్ క్వార్టర్లో ఉంచారు. కోర్సు పూర్తయ్యాక సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్, ఫిజి, ఆస్ట్రేలియాలో శిక్షణ పూర్తి చేసింది. నాలుగేళ్ల కృషి తరువాత 27 ఆగస్టు 1999 న మెరైన్ ఇంజనీర్ అయ్యింది. ఓడలోని మిషన్ రూమ్ బాధ్యతలు చేపట్టింది. సమర్థవంతంగా విధులను నిర్వరిస్తోంది. -
‘మేడమ్ ఎక్కడా!!’?
స్త్రీ పక్కన ఉంటే పురుషుడికి లభించే గౌరవమే వేరు! సీఎం అయినా, పీఎం అయినా, చక్రవర్తే అయినా. అంతవరకు ఎందుకు.. మనం వెళ్లే ఫంక్షన్లలోనే చూడండి.. అతను కనిపించి ఆమె జాడ లేకుంటే... ఠపీమని ‘అమ్మాయేదీ!’ అంటారు. ‘మేడమ్ ఎక్కడా!!’ అని చుట్టుపక్కలకు చూస్తారు. అమెరికా అధ్యక్షుడు కొద్ది గంటల్లో ఇండియాలో దిగుతున్నారు. ఆయనకు ఉండే గౌరవం ఆయనకు ఉంటుంది. సతీమణితో పాటు వస్తున్నారు కనుక సంపూర్ణ గౌరవం ఉంటుంది. ఇప్పటివరకు ఇలా జంటగా కలిసి ఇండియా వచ్చి, భర్తకు అపారమైన గౌరవ మర్యాదలను ప్రసాదింపజేసిన అమెరికా ప్రథమ మహిళల సందర్శన సమయాలు, సందర్భ చిత్రాలు... క్లుప్తంగా, మీ కోసం. 1962 జాక్వెలీన్కెన్నడీ సతీమణి జాక్వెలీన్ 1962లో ఇండియా వచ్చారు. ఇండియాను సందర్శించడం తన కల అని కూడా అన్నారు! ఇండియాలో హోలీ కూడా ఆడారు. 1969 పాట్ రిచర్డ్ నిక్సన్ సతీమణి పాట్ నిక్సన్ 1969లో ఇండియా వచ్చారు. ఒకే రోజు ఉన్నారు. పెద్దగా పర్యటనలేం చెయ్యలేదు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్ముడికి నివాళులు అర్పించారు. 1978 రోసలీన్జిమ్మీ కార్టర్ సతీమణి రోసలీన్ కార్టర్ 1978లో ఇండియా వచ్చారు. భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలకు ముగ్ధులయ్యారని అంటారు. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రామీణ మహిళలను కలిశారు. 1995-1997 హిల్లరీబిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్ 1995లో, 1997లో ఒక్కరే ఇండియా వచ్చారు. మొదటిసారి కూతురు చెల్సీతో కలిసి వచ్చారు. రెండోసారిమదర్ థెరిసాఅంత్యక్రియలకువచ్చారు. 2006 లారా జార్జి బుష్ సతీమణి లారా బుష్ 2006లో ఇండియా వచ్చారు. నోయిడాలోని ఫిల్మ్‌సిటీని సందర్శించారు. మదర్ థెరిసా మిషనరీస్ ఆఫ్ చారిటీలో కొంత సమయం గడిపారు. హైదరాబాద్ కూడా వచ్చారు. 2010- 2015 మిషెల్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామా 2010లో, 2015లో ఇండియా వచ్చారు. మహిళా సంక్షేమం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలను సందర్శించారు. బాలలతో కలిసి డాన్స్ చేశారు. -
ఫ్యాషన్ డిజైనర్ నుంచి ఫస్ట్ లేడీ
అయిదు అడుగుల 11 అంగుళాల ఎత్తు, పట్టుకుచ్చులా మెరిసిపోయే జుట్టు, చురుగ్గా చూసే కళ్లు.. అందానికి అందంలా ఉండే పుత్తడి బొమ్మ మెలానియా ట్రంప్. ఇప్పుడు అమెరికా ప్రథమ మహిళ. శ్వేత సౌధానికి మహారాణి. ఒకప్పుడు ఫ్యాషన్ డిజైనర్, ఆ తర్వాత సూపర్ మోడల్. మోడలింగ్ చేస్తూ అతి పెద్ద ప్రపంచాన్ని చూశారు. ఆరు భాషల్లో మాట్లాడగలరు. స్లొవేనియన్, ఫ్రెంచ్, సెర్బియన్, జర్మన్, ఇటాలియన్, ఇంగ్లిష్ బాగా వచ్చు. కానీ ఇంగ్లిష్ మాతృభాష కాకపోవడంతో తన యాక్సెంట్‌ని ఎక్కడ వెటకారం చేస్తారన్న బెరుకో, సహజంగానే మితభాషి అవడమో కానీ నలుగురులోకి వచ్చి మాట్లాడరు. ఆమె ప్రపంచం ఆమెదే. తను, తన కొడుకు బారన్లే ఆమెకు లోకం. కమ్యూనిస్టు దేశానికి చెందిన ఫస్ట్ లేడీ స్లొవేనియాలో చిన్న పట్టణంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో 1970 ఏప్రిల్ 26న మెలానియా జన్మించారు. తండ్రి విక్టర్ న్వాస్ కారు డీలర్. తల్లి అమలిజా పిల్లల బట్టల్ని డిజైన్ చేసేవారు. అలా ఆమెకి పుట్టుకతోనే ఫ్యాషన్ డిజైనింగ్‌పై మక్కువ ఏర్పడింది. 16వయేటే మోడలింగ్ రంగంలోకి వచ్చారు. ఇటలీలోని మిలాన్‌లో ఒక యాడ్ ఏజెన్సీకి మోడల్‌గా పని చేశారు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చదువుతూ యూనివర్సిటీ చదువు మధ్యలో ఆపేశారు. మోడలింగ్ మీదనే మొత్తం దృష్టి కేంద్రీకరించారు. 22 ఏళ్లు వచ్చాక మెలానియాకు కెరీర్లో బ్రేక్ వ చ్చింది. స్లొవేనియా మ్యాగజీన్ ‘జానా’లో ‘లుక్ ఆఫ్ ది ఇయర్’ పోటీలో రన్నరప్‌గా నిలిచారు. ఆ తర్వాత ఆమె వెనక్కి చూసుకోలేదు. తాను వేసుకొనే డ్రెస్‌లను తానే డిజైన్ చేసుకునేవారు. 2000 ఏడాదిలో బ్రిటన్‌కు చెందిన ‘జీక్యూ’ మ్యాగజీన్ ఫొటోలకు నగ్నంగా పోజులిచ్చారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఆ చిత్రాలు బయటికొచ్చి సంచలనమయ్యాయి. ట్రంప్‌తో డేటింగ్, పెళ్లి 1998లో అమెరికాకు వచ్చిన మెలానియాకు ట్రంప్‌తో ఒక పార్టీలో పరిచయమైంది. అప్పటికే రెండో భార్యతో విడాకులు తీసుకోవడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారు. కొన్నేళ్లు ట్రంప్‌తో డేటింగ్ చేశారు. 2005లో ట్రంప్‌తో వివాహమైంది. 2006లో మెలానియాకు కొడుకు బారన్ పుట్టాడు. ట్రంప్ తెంపరితనం, అమ్మాయిలు, వ్యవహారాలు, బహిరంగంగానే వారి పట్ల అసభ్య ప్రవర్తన ఇవన్నీ మెలానియాకు నచ్చినట్టు లేవు. అందుకే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని మెలానియా మధ్యలోనే వదిలేశారు. ట్రంప్ అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోకి మకాం మార్చినపుడూ ఆమె వెంట వెళ్లలేదు. నాడు న్యూయార్క్‌లో కొడుకు చదు వు కోసం ఉండిపోయారట. 2017లో కొడుకుతో కలసి వైట్‌హౌస్‌కు మారారు. వైట్‌హౌస్‌లో వారిద్దరి పడక గదులు వేర్వేరు అంతస్తుల్లో ఉండటం వంటి బెన్నెట్ రాసిన ఫ్రీ మెలానియా పుస్తకంలో బయటకొచ్చి సంచలనమయ్యాయి. -
‘ఫస్ట్ లేడీస్’లో బెస్ట్ లేడీ మార్తమ్మ
అమెరికాకు మహిళా ప్రెసిడెంట్లే లేరనుకుంటాం. కానీ ఉన్నారు. మార్తమ్మ! అమెరికా అధ్యక్షుడి భార్యను ‘ప్రథమ మహిళ’ అంటాం. కానీ బతికుండగా ప్రథమ మహిళ కాలేకపోయిన అధ్యక్షుడి భార్య ఉన్నారు. మార్తమ్మ! ఈరోజు యు.ఎస్.లో ‘ప్రెసిడెంట్స్ డే’. కొన్ని రాష్ట్రాల్లో సెలవు రోజు. అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ ఫిబ్రవరి మూడో సోమవారం జన్మించారు. ఆయన పేరుతో ప్రెసిడెంట్స్ డే మొదలైంది. ఆయన భార్యే మార్తమ్మ. మార్తా డాండ్రిడ్జ్. ‘ఫస్ట్ లేడీస్’లో బెస్ట్ లేడీ అంటారు మార్తాను. అమెరికా అధ్యక్షుడి భార్యంటే ఆమెలా ఉండాలని కూడా అంటారు. ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.. ప్రెసిడెంట్స్ డే సందర్భంగా. భర్త జార్జి వాషింగ్టన్ కన్నా వయసులో తొమ్మిది నెలలు పెద్ద.. మార్తా. భర్త కంటేనే కాదు, తన జీవితం కంటే కూడా ఎల్తైన మనిషి. డెబ్భై ఒక్కేళ్లు జీవించారు. ఆమె కళ్ల ముందే మొదటి భర్త చనిపోయాడు. మొదటి భర్తకు పుట్టిన నలుగురు పిల్లలు చనిపోయారు. రెండో భర్త (జార్జి వాషింగ్టన్) చనిపోయారు. తన జీవితంలోని చివరి రెండున్నరేళ్లూ బైబిల్ మాత్రమే తోడుగా గడిపారు మార్తా. జార్జి వాషింగ్టన్కీ మార్తాకు పిల్లల్లేరు. మొదటి భర్త పిల్లల్నే తమ పిల్లలు అనుకున్నారు జార్జి వాషింగ్టన్. తైలవర్ణ చిత్రంలో మార్తా, జార్జి వాషింగ్టన్ల వివాహ (1759) మహోత్సవం రెండు వందల ఎనభై ఏళ్ల క్రితం వర్జీనియా అయినా, వీరభద్రపురం అయినా ఒకటే. ‘ఆడపిల్లకు చదువా!’ అనేసే ఆ కాలంలో పుట్టారు మార్తా. ఎనిమిది మంది పిల్లల్లో పెద్దమ్మాయి. కలిగిన కుటుంబం. వర్జీనియాలోని విలియమ్స్బర్గ్లో తోటలున్నాయి వాళ్లకు. వర్జీనియాలో పెద్దగా చదువుకున్న ఆడపిల్లలు కనిపించేవారు కారు. ఊళ్లో ఎవరైనా చదువొచ్చిన అమ్మాయిలున్నారా అంటే.. ‘జాన్ డాండ్రిడ్జ్గారి పెద్దమ్మాయి ఉంది కదా, చదవడమే కాదు రాయడం కూడా వచ్చు తనకి’ అనేంతగా మార్తాకు చిన్నప్పుడే గుర్తింపు వచ్చింది. ఆమె చేత ఉత్తరాలు రాయించుకునేవారు, పుస్తకాలు చదివించుకునేవారు. మార్తా రాసిన ఉత్తరాలు కొన్ని ఇప్పటికీ న్యూయార్క్‌లోని మౌంట్ వెర్నన్ పౌర గ్రంథాలయంలో భద్రంగా ఉన్నాయి. పుస్తకం చదవకుండా గడిచిన రోజు లేదు మార్తా జీవితంలో. భక్తి పుస్తకాలను గుండెలకు హత్తుకుని చదివేవారు. ∙∙ అమెరికాకు వలస వచ్చిన ఐరోపా మహిళల సగటు ఎత్తుకన్నా రెండు అంగుళాలు తక్కువగా.. ఐదడుగులు.. ఉండేవారు మార్తా. ఆకర్షణీయంగా ఉండేవారు. ప్రేమమయి అని పేరు. లోకమంతా నావాళ్లే అన్నట్లు చిరునవ్వుతో పలకరించేవారు. ఎవరితోనైనా చక్కగా కలిసిపోయేవారు. మాట ఉంది. రూపం ఉంది. గుణం ఉంది. వాటికి పడిపోయాడు డేనియల్ పార్క్ కస్టిస్. చర్చిలో తొలిసారిగా మార్తాను చూసి మనసు పారేసుకున్నాడు. అప్పుడామెకు పందొమ్మిదేళ్లు. ఆయనకు ముప్పై తొమ్మిదేళ్లు. ఇరవై ఏళ్ల వ్యత్యాసం! డేనియల్ తండ్రి ఒప్పుకోలేదు. వయసెక్కువని కాదు. సంపద తక్కువని. ఆ మాట నిజం. మార్తా వాళ్లు సంపన్నులే కానీ, డేనియల్ వాళ్లంత కాదు. అప్పటికే చాలా సంబంధాలను డేనియల్ తండ్రి తిరగ్గొట్టేశాడు. ఈ సంబంధం కూడా వద్దన్నాడు. ‘సంబంధం కాదు నాన్నా.. హృదయబంధం ఇది’ అన్నాడు. ‘అయితే అనుభవించు.. ఆ పిల్లను చేసుకుంటే నా ఆస్తిలో నీకు వచ్చేదేమీ ఉండదు’ అన్నాడు. ఆస్తిని వద్దనుకుని మార్తాను చేసుకున్నాడు డేనియల్. నలుగురు పిల్లలు. అబ్బాయి, అమ్మాయి, అబ్బాయి, అమ్మాయి. పెళ్లయిన ఏడేళ్లకే డేనియల్ గుండెపోటుతో చనిపోయాడు. అప్పటికి మార్తా వయసు ఇరవై ఏడేళ్లు. పిల్లలు కూడా ఎక్కువ కాలం బతకలేదు. జబ్బులకు వైద్యం లేని కాలం అది. కొడుకు డేనియల్ (తండ్రి పేరే) మూడేళ్ల వయసులో, కూతురు ఫ్రాన్సిస్ నాలుగేళ్ల వయసులో, రెండో కొడుకు జాన్ ఇరవై ఏడేళ్ల వయసులో, రెండో కూతురు మార్తా (తల్లి పేరే) పదిహేడేళ్ల వయసులో.. అందరూ అనారోగ్యలతోనే చనిపోయారు. ∙∙ మార్తా.. జార్జి వాషింగ్టన్‌ని రెండో పెళ్లి చేసుకునే నాటికి ఆమె వయసు 28. వాషింగ్టన్‌తో పెళ్లయ్యాక చాలాకాలం పాటు డేనియల్ స్మృతులు మార్తాను వెంటాడాయి. అప్పటికే మొదటి పిల్లలిద్దరూ చనిపోయారు. మిగిలిన పిల్లలు ఇద్దరు, తను. పిల్లలకుండగా మళ్లీ పిల్లలెందుకని వాష్లింగ్టన్ వాళ్లనే దత్తత తీసుకున్నారు. వాషింగ్టన్, మార్తా తొలిసారి కలుసుకునే నాటికి వాషింగ్టన్ యువ సైనికాధికారి. ఆమె సంపన్నురాలైన వితంతువు. ఇద్దరూ ఒకే వయసులో ఉన్నారు. ఆమె అందగత్తె. అతడు చురుకైనవాడు. పుట్టింటి నుంచి మార్తా వాటాగా వచ్చిన తోటలు కొన్ని విలియమ్స్బర్గ్ సమీపంలో ఉన్నాయి. ఆ చుట్టపక్కలకు ఏవో లెక్కల కోసం వచ్చిన వాషింగ్టన్ ఆమెను చూసీ చూడగానే ఆమెతోనే తన జీవితం అనుకున్నారు. వాషింగ్టన్ ఆరు అడుగుల రెండు అంగుళాల ఎత్తు ఉండేవారు. మిలటరీ ఆఫీసర్‌గా అప్పటికే తెలిసిన పేరు. అది ఆమెను ఆకర్షించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే వాళ్ల పెళ్లి జరిగింది. పెళ్లికి ముందు అతడు సైన్యంలోంచి బయటికి వచ్చాడు. అలాగని పూర్తిగా బయటికి రాలేదు. భార్యాభర్తలిద్దరూ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చాక వాషింగ్టన్ తొలి అమెరికా అధ్యక్షుడు అవడంతో మార్తా తొలి ‘ఫస్ట్ లేడీ’ అయ్యారు. భర్త పాలనా వ్యవహారాలకు అనుబంధంగా మార్తా కూడా నిత్యం తీరికలేని పనుల్లో ఉండేవారు. అధికారులకు సలహాలు, సూచనలు ఇస్తుండేవారు. ప్రతి శుక్రవారం సాయంత్రం విందు ఏర్పాటు చేస్తుండేవారు. అతిథులు ఆమెను ‘లేడీ వాషింగ్టన్’ అనీ, ‘అవర్ లేడీ ప్రెసిడెంటెస్’ అని గౌరవంగా సంబోధిస్తుండేవారు. ‘ఆయన కంటే ఆమె తెలివైన వారు’ అనుకున్నవారూ ఉన్నారు. ఇప్పుడంటే.. అమెరికా అధ్యక్షుడి భార్యను ‘ప్రథమ మహిళ’ అంటున్నాం. అప్పటికి ఆ మాటే పుట్టలేదు. మార్తా మరణానంతం.. ఫస్ట్ లేడీ అనే సంప్రదాయం మొదలైంది. మార్త తర్వాత లేడీ ప్రెసిడెంట్ అని అమెరికన్లు ఎవర్నీ అంత ఆపేక్షగా పిలుచుకోలేదు. అందుకే ఆమె తొలి మహిళా అధ్యక్షురాలు కూడా. -
ఫస్ట్ లేడీ
అమెరికన్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తి భార్యను ఫస్ట్ లేడీ అని సంబోధిస్తారు. హాలీవుడ్లో ప్రస్తుతం ‘ఫస్ట్ లేడీస్’ అనే టైటిల్‌తో ప్రెసిడెంట్ సతీమణులపై ఓ సిరీస్ రూపొందబోతోంది. ఈ సిరీస్ మొదటి సీజన్లో అమెరికాకు ప్రెసిడెంట్లుగా వ్యవహరించిన ఇలియానోర్ రూజ్వెల్ట్ , బెట్టీ ఫోర్డ్, ఒబామా భార్యల కథలను చర్చించనున్నారు. ఇందులో ఒబామా భార్య మిచ్చెలీ ఒబామా పాత్రలో వయోలా డేవిస్ నటించనున్నారు. ‘మిచ్చెలీ లాంటి ధైర్యవంతురాలు, ఎక్స్ట్రార్డినరీ ఉమెన్ పాత్ర చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది’ అని డేవిస్ అన్నారు. -
తొలి మహిళా యుద్ధ పైలట్‌గా భావన
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం (ఐఏఎఫ్)లో విమానం ద్వారా యుద్ధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అర్హత సాధించిన తొలి మహిళగా భావనా కంఠ్ బుధవారం చరిత్ర సృష్టించారు. మిగ్–21 బైసన్ విమానంపై పగటిపూట యుద్ధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉద్దేశించిన సిలబస్‌ను భావన పూర్తి చేశారని వాయుసేన అధికార ప్రతినిధి గ్రూప్ కెప్టెన్ అనుపమ్ బెనర్జీ చెప్పారు. ప్రస్తుతం రాజస్తాన్‌లోని బికనీర్‌లోని వైమానిక స్థావరంలో భావన విధులు నిర్వర్తిస్తున్నారు. 2017 నవంబర్‌లో ఫైటర్ స్క్వాడ్రన్‌లో చేరిన భావన, గతేడాది మార్చిలో తొలిసారిగా సొంతంగా మిగ్–21 బైసన్ యుద్ధ విమానాన్ని నడిపారు. యుద్ధ విమానాలను నడిపేందుకు మహిళలకూ అవకాశమివ్వాలని మోదీ ప్రభుత్వం తొలి నాళ్లలో నిర్ణయం తీసుకుంది. -
ఆట ఆడిస్తున్నారు!
అన్నింట్లో సగం అంటారు కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు విరుద్ధం. సగ భాగం కాదు కదా కనీసం కాలు మోపడానికి కూడా చోటు ఇవ్వడం లేదు. అవకాశాల్లోనే కాదు ఆటల్లోనూ ఆడవాళ్లపై వివక్ష కొనసాగుతోంది. ప్రతి క్రీడలోనూ మహిళల ప్రవేశానికే ఏళ్లకు ఏళ్లు పట్టింది. కొన్నిట్లో అయితే ఇప్పటికీ మహిళలకు ఎంట్రీ లేదు. అలాంటి సరిహద్దులను దాటి ఇద్దరు మహిళామణులు పురుషుల ఆటల్లో నిర్ణయాధికారం చెలాయించే సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ఇక ’మేము చెప్పినట్టు కూడా వినండి’ అంటూ నినదిస్తూ ఆడటమే కాదు ఆడించడమూ తెలుసంటున్నారు. ‘‘నా జీవితంలో ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు’’.. పురుషుల క్రికెట్ మ్యాచ్‌లో అంపైరింగ్ చేసిన తర్వాత క్లయిర్ పొలొసాక్ స్పందన ఇది. ఆస్ట్రేలియాకు చెందిన ఆమె పురుషుల అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. ఏప్రిల్ 27న నమీబియా, ఒమన్ పురుషుల క్రికెట్ జట్ల మధ్య జరిగిన ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్–2 ఫైనల్ మ్యాచ్ తర్వాత హాయిగా నిద్రపోయినట్టు క్లయిర్ చెప్పారు. తన అంపైరింగ్ పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ మాట అన్నారామె. ఈ మ్యాచ్‌కే ఆమె అంపైర్ గా వ్యవహరించి సరికొత్త చరిత్రకు మైలురాయిలా నిలిచారు. ‘‘మైదానంలో ఒక్కోసారి ఆటగాళ్ల భావోద్వేగాలు అదుపు తప్పుతుంటాయి. సంయమనంతో వ్యవహరించి సర్దిచెప్పాల్సిన బాధ్యత అంపైర్లపై ఉంటుంది. కానీ నేను అంపైరింగ్ చేసిన పురుషుల మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లో అందరూ బాగా సహకరించారు. ఆటగాళ్ల ప్రవర్తనతో నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఎల్బీడబ్ల్యూ ఔట్ల కోసం బౌలర్లు బాగా ఒత్తిడి చేస్తుంటారు. కచ్చితంగా ఔట్ అని నమ్మితేనే ఔట్ ఇస్తా. ఈ రోజు మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాను’’అని క్లయిర్ సంతోషం వ్యక్తం చేశారు. పురుషుల మ్యాచ్‌కు అంపైరింగ్ చేయడం ఆమెకు ఇదే మొదటిసారి కాదు. 31 ఏళ్ల క్లయిర్ పేరిట మరో రికార్డు కూడా ఉంది. దేశవాళీల్లోనూ పురుషుల క్రికెట్ మ్యాచ్‌కు అంపైరింగ్ చేసిన తొలి మహిళగా రెండేళ్ల క్రితమే ఆమె గుర్తింపు పొందారు. 2017లో ఆస్ట్రేలియాలో లిస్ట్ ’ఎ’ మ్యాచ్‌లో అంపైర్‌గా వ్యవహరించి ఈ రికార్డు తన పేరిట లిఖించుకున్నారు. మహిళా క్రికెట్లోనూ తనదైన ముద్ర వేసిన క్లెయిర్ గత రెండున్నరేళ్లలో 15 వన్డే మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశారు. 2017 ప్రపంచకప్ మ్యాచ్‌లు, 2018 టి20 వరల్డ్‌కప్ సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లు ఆమె అంపైరింగ్ చేసిన వాటిలో ఉన్నాయి. ‘డబుల్’ రికార్డులోనూ భాగస్వామ్యం! ఆస్ట్రేలియా గడ్డపై ఇద్దరు మహిళలు ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించిన చరిత్రాత్మక సందర్భంలోనూ క్లయిర్ పొలొసాక్ భాగస్వామిగా ఉన్నారు. తన దేశానికే చెందిన మరో అంపైర్ ఎలోసి షెరిడాన్‌తో కలిసి 2018 డిసెంబర్ 23న ఈ ఘనత సాధించారు. మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా అడిలైడ్ స్ట్రయికర్స్, మెల్బోర్న్ స్టార్ జట్ల మధ్య అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ అంపైరింగ్ చేసి ఔరా! అనిపించారు. ‘‘ఇది మరో చారిత్రక ఘట్టం. ఆస్ట్రేలియా క్రికెట్లో మహిళలు, బాలికలను ప్రోత్సహించే దిశగా ఇలాంటి ప్రయత్నాలు కొనసాగుతుండాలి. క్లయిర్, షెరిడాన్ ఎంతో కష్టపడి స్వశక్తితో అగ్రశ్రేణి మహిళా అంపైర్లుగా ఎదిగారు. వారు మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా’’ అని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో కెవిన్ రాబర్ట్స్ ఆకాంక్షించారు. సాహోరే.. స్టెఫాని! క్లయిర్ పొలొసాక్ సరికొత్త చరిత్ర సృష్టించిన మరుసటి రోజే ఐరోపాలో స్టెఫాని ఫ్రాపర్ట్ పతాక శీర్షికలకు ఎక్కారు. పురుషుల ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ప్రధాన రెఫరీగా వ్యవహరించిన రెండో యూరోపియన్ మహిళగా ఘనత సాధించారు. ఏప్రిల్ 29న అమియన్స్ స్పోర్టింగ్ క్లబ్, రేసింగ్ క్లబ్ స్ట్రాస్బర్స్ జట్ల మధ్య జరిగిన ఫ్రెంచ్ లీగ్ ఫస్ట్ డివిజన్ మ్యాచ్‌లో ఆమె రిఫెరీగా మైదానంలో ఆటగాళ్లతో పాటు పరిగెడుతూ నిర్ణయాధికారం చెలాయించారు. ఫలితం తేలకుండా(0–0) ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండు టీమ్‌లకు చెందిన ఇద్దరు ఆటగాళ్లను స్టెఫాని హెచ్చరించారు. ఇద్దరు స్ట్రాస్బర్స్ ఆటగాళ్లకు ఎల్లో కార్డులు చూపించారు. 35 ఏళ్ల స్టెఫాని ఇప్పటికే సెకండ్ డివిజన్ మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించారు. జూన్–జూలైలో జరగనున్న మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మ్యాచ్ రిఫెరీగా ఉండనున్నారు. ‘‘నా కష్టానికి తగిన గుర్తింపు లభించింది. పురుషుల లీగ్ –1 మ్యాచ్‌కు రిఫెరీగా ఉండే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మహిళ అన్న ఒక్క కారణంతోనే నాకు ఈ అవకాశం ఇచ్చారని అనుకోవడం లేద’ని స్టెఫాని అన్నారు. లీగ్ –1 మ్యాచ్‌కు స్టెఫానిని రిఫెరీగా నియమించడం పట్ల ఫుట్‌బాల్ అభిమానులు, ఫెమినిస్టులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. మరింతమంది మహిళలు ఈ రంగంలోకి రావడానికి స్టెఫాని స్ఫూర్తిగా నిలిచారని కితాబిస్తున్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను స్టెఫాని సమర్థవంతంగా నిర్వహించారని, ఆమె ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొనలేదని రేసింగ్ క్లబ్ స్ట్రాస్బర్స్ టీమ్ మేనేజర్ థీరి లారే కొనియాడారు. లీగ్ –1 మ్యాచ్‌కు రిఫెరీ వ్యవహరించడానికి స్టెఫానికి అన్ని అర్హతలు ఉన్నాయని, ఆమె పనితీరు చాలా బాగుందని అభినందించారు. పురుషుల ఫుట్‌బాల్ మ్యాచ్‌లో రిఫెరీగా వ్యవహరించిన తొలి మహిళ రికార్డు జర్మనీకి చెందిన బిబియనా స్టీన్హాస్ పేరిట ఉంది. 2017లో హెర్తా బెర్లిన్, వెర్డర్ బ్రెమెన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ద్వారా ఆమె ఈ ఘనత దక్కించుకున్నారు. బిబియనా బాటలో స్టెఫాని కూడా నడిచి పురుషుల మ్యాచ్‌లో మెయిన్ రెఫరీగా వ్యవహరించిన తొలి ఫ్రెంచ్ మహిళగా ఖ్యాతికెక్కారు. మనదేశ పురుషుల క్రీడల్లోనూ మహిళలకు నిర్ణయాధికారం దక్కడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. - పోడూరి నాగ శ్రీనివాసరావు సాక్షి వెబ్ డెస్క్ -
నిర్భయోగ్రఫీ
రెండేళ్ల క్రితం భయం లేకుండా న్యూయార్క్ స్టాక్ స్టాక్ ఎక్స్చేంజ్ లోకి తొలి మహిళా ఈక్విటీ ట్రేడర్‌గా అడుగుపెట్టిన లారెన్స్ సైమన్స్ (24) సాహస ఉద్యోగ జీవితంపై హాలీవుడ్ చిత్రం తయారవుతోంది. లారెన్స్ సైమన్స్ పాత్రను యువ నటి కియర్సీ క్లెమన్స్ గర్వాతిగర్వంగా పోషించబోతున్నారు. ఇరవై రెండేళ్ల వయసులో వాల్‌స్ట్రీట్‌లోని ‘న్యూయార్క్ స్టాక్ స్టాక్ ఎక్స్చేంజ్’ గాజు గోడల్ని భళ్లున బద్దలు కొట్టుకుని లోనికి వచ్చిన లారెన్స్ సైమన్స్ని ‘ఎవరు బేబీ నువ్వు, ఎవరు కావాలి?’ అని అడిగాయి అక్కడ పండిన తలలు కొన్ని.. రెండేళ్ల క్రితం. ‘నాకు ఎవరో కావడం కాదు, నేనే మీకు కావాలి’ అన్నట్లు నవ్వింది సైమన్స్! ‘ఏం ధైర్యం ఈ పిల్లకు’ అని వాల్‌స్ట్రీట్ నివ్వెరపోయింది. ఫ్రెష్‌గా అప్పుడే డిగ్రీ పూర్తి చేసి, ‘ఈక్విటీల ట్రేడింగ్’ చెయ్యడానికి వచ్చానంటే.. అలవాటు లేని అరణ్యం లోకి వచ్చిన కుందేలు పిల్లను చూసినట్లే కదా ఉండేది. పైగా ఫుల్ టైమ్ జాబ్ చెయ్యడానికి వచ్చానంటోంది. అంతేనా! ‘రోజన్బ్లాట్ సెక్యూరిటీస్’ తరఫున వచ్చానంది. రోజన్బ్లాట్ సీఈవో రిచర్డ్ రోజన్బ్లాట్. మొదట ఆయనా ఇలాగే ఆశ్చర్యపోయారు. ‘‘జెనెటిక్స్‌లో ఇంజనీరింగ్ చేశానంటున్నావ్. వాల్స్ట్రీట్కి ఎందుకొచ్చావ్?’’ అని అడిగారు. ‘‘ఎందుకో ఇంట్రెస్ట్ అనిపించింది. న్యూయార్క్ ఫ్లయిట్ ఎక్కేశా. మీరు కనిపించారు’’ అంది. ‘‘మైక్రోసెకన్స్లో ఇక్కడ డెసిషన్స్ తీసుకోవాలి తెలుసా. ఎందుకొచ్చిన స్ట్రెస్. జార్జియా తిరిగి వెళ్లి నువ్వు చదివిన కెన్నసా యూనివర్సిటీ ల్యాబ్‌లోని మైక్రోస్కోపుల్లో పరిశోధనలు చేసుకో. ఈ పరుగులొద్దు’’ అని పితృవాత్సల్యంతో ఆయన సలహా ఇచ్చారు. ఆయనదీ పెద్ద వయసేం కాదు. యాభై. సైమన్స్తో పోలిస్తే పెద్దవాడే. ‘‘లేదు సర్. వెళ్లను’’ అంది. ‘‘సరే, నీ ఇష్టం. అయితే నీకు ఇష్టమైంది కదా అని ‘ఈక్విటీ ట్రేడర్’ ఉద్యోగం ఊరికే వచ్చేయదు. ఇంటెర్న్‌గా ఉండాలి. అందుకోసం ‘సిరీస్ 19’ ఎగ్జామ్ రాయాలి. ఫ్లోర్ బ్రోకర్ బ్యాడ్జి రావడానికి అది మినిమం క్వాలిఫికేషన్’’ అని చెప్పారు రిచర్డ్స్. ‘‘రాస్తాను సర్’’ అంది. ‘‘రాస్తే కాదు. పాస్ అవ్వాలి. రాసిన వాళ్లలో 20 శాతం మంది కూడా పాస్ కారు’’అన్నారు ఆయన. సైమన్స్ నవ్వింది. సిరీస్ నైన్టీన్ ఎగ్జామ్ పాస్ అయ్యాక కూడా అలాగే నవ్వింది. ‘‘చూశారా పాస్ అయ్యాను’ అని ఆ నవ్వుకు అర్థం కాదు. ‘‘కష్టపడి ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యాను సర్’’ అని చెప్పడం. వెంటనే జాబ్. జాబ్‌లో చేరింది. మైక్రో సెకన్స్‌లో డిసిషన్స్ తీసుకుంటోంది! సీనియర్స్‌ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది. వారి ప్రశంసలతో పాటు తనకో ముద్దుపేరును కూడా కొట్టేసింది. ‘లోన్ ఉమన్ ఆన్ వాల్ స్ట్రీట్’ అని! ఈక్విటీ ట్రేడర్‌గా ఇంతవరకు అక్కడ ఒక్క అమ్మాయి కూడా లేదు మరి. బాగుంది. ఇప్పుడెందుకు సైమన్స్ సీన్లోకి వచ్చింది. హాలీవుడ్ యువనటి కియర్సీ క్లెమన్స్ హీరోయిన్గా సైమన్స్ నిర్భయోగ్రఫీ ఓ సినిమా రాబోతోంది! సైమన్స్ ఇప్పుడక్కడ చెయ్యట్లేదు. ‘లోన్ ఉమన్ ఆన్ వాల్ స్ట్రీట్’ టైటిల్ ఇంకా అక్కడే ఉంది.. ఆమె పేరు మీద. -
మార్స్‌పై తొలి అడుగు ఈమెదే
వాషింగ్టన్: పెరిగి పెద్దయ్యాక అంతరిక్షయానం చేయాలని ఉందంటూ స్కూలు విద్యార్థులు చెబుతుండడం మనం వింటుంటాం. భవిష్యత్‌లో వారు ఏదో ఒక రంగంలో స్థిరపడి, చిన్నపుడు అనుకున్నది కలగానే మిగిలిపోయిన సందర్భాలే ఎక్కువగా ఉంటుంటాయి. అయితే దీనికి పూర్తి భిన్నంగా అమెరికాలోని లూసియానాకు చెందిన 17 ఏళ్ల అలెసా కార్సన్ మాత్రం అరుణ గ్రహం (మార్స్-అంగారకుడు)పై కాలుమోపబోయే తొలి మహిళగా (ఈ గ్రహంపై మొదట అడుగుపెట్టే వారిలో ఒకరిగా) రికార్డ్ సొంతం చేసుకోనుంది. అయితే అది ఇప్పుడప్పుడే కాదు ఆమె 32 ఏళ్ల వయసులో... 2033 సంవత్సరంలో.. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రయోగం కోసం కార్సన్ ఇప్పటికే నాసా పోలార్ ఆర్బిటల్ సైన్స్, జీరో గ్రావిటీ, అండర్‌వాటర్ సర్వయివల్, తదితర కార్యక్రమాల్లో ప్రాథమిక శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. పద్దెనిమిదేళ్లు నిండిన వారినే నాసా వ్యోమోగామి (ఆస్ట్రోనాట్) గా అధికారికంగా ప్రకటించే వీలుంటుంది కాబట్టి ఇప్పుడామే ’బ్లూ బెర్రీ’కోడ్‌నేమ్‌తో కొనసాగుతోంది. మార్స్ గ్రహానికి వెళ్లేందుకు అవసరమైన ఆరియన్ అంతరిక్షనౌక, స్పేస్ లాంఛ్ సిస్టమ్ రాకెట్‌పై వెళ్లేందుకు ఆమెను ఈ శిక్షణ సిద్ధం చేస్తుంది. ప్రస్తుత సాంకేతికతను బట్టి చూస్తే మార్స్‌పైకి వెళ్లేందుకు ఆరుమాసాల సమయం పడుతుంది. ఆ తర్వాత ఏడాది పాటు ఆ గ్రహంపైనే గడిపాక తిరుగుపయనమవుతారు. ఈ ట్రిప్ ముఖ్యోద్ధేశ్యం ఏమంటే..అక్కడ వనరుల అన్వేషణ, నీటి నమూనాల పరిశీలన, జీవజాతుల జాడలున్నాయా లేదా అన్నది పరిశీలించడంతో పాటు అక్కడ అవాసాలు అభివృద్ధి చేసుకునేందుకు ఉన్న అవకాశాలు ఏ మేరకు ఉన్నాయన్నది చూస్తారు. నికోల్ ఒడియన్ ఛానల్ ’ద బాక్యార్డిజాన్స్’ కార్టూన్ మిషన్ టు మార్స్ ఎపిసోడ్లో ఓ మిత్రుల బృందం అంగారకగ్రహంపై సాహసయాత్రకు వెళ్లడం కార్సన్‌కు మూడేళ్ల వయసులోనే బలమైన ముద్రవేసింది. ఆస్ట్రోనాట్‌గా మారడమే ఆమె జీవితాశయంగా మారింది. చిన్నతనమంతా కూడా నాసాకు చెందిన అంతరిక్ష ప్రయోగకేంద్రాలు సందర్శించింది. ముందుగా వ్యోమోగామిగా అరుణగ్రహం నుంచి తిరుగొచ్చాక, ఓ అధ్యాపకురాలిగా ఆ తర్వాత దేశాధ్యక్షురాలిని కావాలని కోరుకుంటున్నట్టు ఆమె వెల్లడించింది. -
మహిళా ఉద్యమ వారధులు
మారామనీ, మారుతున్నామనీ ఎంతగా చెప్పుకుంటున్నా.. సమాజంలో స్త్రీ, పురుషులింకా ఈక్వల్ ఈక్వల్ కాలేదు. లైంగిక సమానత్వం కోసం కలిసి ప్రయాణించవలసిన దూరం ఇంకా మిగిలే ఉంది! అయితే అసలంటూ ప్రయాణం మొదలైంది. ఆ ప్రయాణాన్ని మొదలు పెట్టినవారు కూడా మహిళలే కావడం స్ఫూర్తినిచ్చే విషయం. వారిని మన ప్రతి అడుగులోనూ గుర్తుచేసుకోవడం.. మన సమానత్వ ప్రయాణానికి చోదక శక్తి అవుతుంది. మహిళా సమాజానికి ప్రేరణను, శక్తిని ఇచ్చిన ఆ మహిళల్లో ఎక్కువమంది వర్కింగ్ ఉమెనే! వాళ్ల ప్రయత్నం, వాళ్ల సంకల్ప బలం కారణంగానే సమానత్వం వైపుగా ఇవాళ మనం ఇంతమాత్రపు ‘ఈక్వాలిటీ’నైనా సాధించగలిగాం. ‘ఫస్ట్ లేడీ’ సంప్రదాయ పాత్రను మార్చిన ఎలినార్ రూజ్వెల్ట్ దగ్గర్నుంచి, యు.ఎస్. కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి నల్లజాతి మహిళ షిర్లీ ఛిజమ్ వరకు.. ప్రపంచ గతిని మలుపు తిప్పిన పది మంది మహిళల వివరాలు, విశేషాలు ఇవి. రోజీ ది రివెటర్ ‘వియ్ కెన్ డు ఇట్’ అనే క్యాప్షన్ ఉన్న చిత్రం ప్రపంచ ప్రసిద్ధమైనది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో అమెరికన్ గృహిణుల్ని ఇళ్లలోంచి బయటికి రప్పించి.. పరిశ్రమల్లోకి, కర్మాగారాల్లోకి, సైనిక దళాల్లోకి ఉద్యోగినులుగా వచ్చేందుకు వాళ్లకు స్ఫూర్తినిచ్చిన ఈ పోస్టర్‌కు ప్రేరణ... నవోమీ పార్కర్ ఫ్రేలే అనే స్త్రీ మూర్తి ఫొటో. కాలిఫోర్నియాలో ఆమె వెయిట్రెస్‌గా పనిచేస్తుండగా ఓ ఫొటోగ్రాఫర్ ఫొటో తీసి ఓ పత్రికకు ఇస్తే, ఆ పత్రికలో నవోమీని చూసిన ఓ చిత్రకారుడు ‘వియ్ కెన్ డు ఇట్’ చిత్రాన్ని రూపొందించారు. దానిని అమెరికా ప్రభుత్వం తన అధికార మహిళా నియామకాలకు ఒక స్ఫూర్తిదాయకమైన చిత్రంగా ఉపయోగించుకుంది. రూస్ బేడర్ గిన్స్‌బెర్గ్ 1993లో బిల్ క్లింటన్ సుప్రీంకోర్టు అసోసియేట్ జస్టిస్‌గా రూస్‌ను నియమించారు. అప్పటికి సుప్రీంకోర్టుకు ఆమె రెండో మహిళా న్యాయమూర్తి. అంతకుముందు 1980లో జిమ్మీకార్టర్ రూస్‌ను కొలంబియా సర్క్యూట్ డిస్ట్రిక్ట్‌కు యు.ఎస్.అప్పీళ్ల న్యాయమూర్తిగా నియమించారు. అయితే రూజ్ ప్రతిభా సామర్థ్యాలు తన విధి నిర్వహణకు మాత్రమే పరిమితం కాలేదు. స్త్రీ, పురుష సమానత్వం, మహిళల హక్కుల కోసం ఆమె కృషి చేశారు. ‘ఉమెన్ రైట్స్ ప్రాజెక్టు’కు స్వచ్ఛంద న్యాయవాదిగా పని చేశారు. షిర్లీ ఛిజమ్ రాజకీయవేత్త, టీచర్, రచయిత్రి. యు.ఎస్. కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి నల్లజాతి మహిళ. డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసిన తొలి మహిళ కూడా. రాజకీయాల్లోకి వెళ్లే ముందు వరకు బ్రూక్లిన్‌లో, మన్హట్టన్లో స్కూళ్లు, డేకేర్ సెంటర్లు నిర్వహించారు. తన కెరీర్ మొత్తంలో, ఏడుసార్లు యు.ఎస్. ప్రతినిధుల సభలో సభ్యురాలిగా ఉన్న కాలంలో.. మహిళల, మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం పాటు పడ్డారు. విద్యకు, శిశు సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు. మేరీ టైలర్ మూర్ 1960లు, 70లు, 80లలో హాలీవుడ్ చిత్రాల్లోని మహిళల మూస పాత్రలు.. కాస్త వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిలుగా పరివర్తన చెందడంలో మేరీ టైలర్దే ప్రధాన పాత్ర. అలా దర్శకుల్ని, నిర్మాతల్ని ఆమె ‘ఎడ్యుకేట్ చెయ్యగలిగారు. అప్పట్లో టీవీలో ‘ది మేరీ టైలర్ మూర్ షో’ పెద్ద సంచలనం. పురుషాధిక్యంపై ఆ షోలో ఆమె పిడిగుద్దులు కురిపించేవారు. ఉద్యోగినులుగా, పరిశ్రమల నిర్వాహకులుగా మహిళల సామర్థ్యాన్ని చూపించే కార్యక్రమాలను రూపొందించారు. సామాజిక, రాజకీయ రంగాలలోనూ పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న మేరీ టైలర్.. ఆ రంగాలలోనూ మహిళ సమానత్వం కోసమే వ్యూహరచన చేశారు. గ్లోరియా స్టైనమ్ ఎనభై ఏళ్ల వయసులోనూ గ్లోరియా లైంగిక సమానత్వం కోసం పోరాడారు! గ్లోరియా ఫెమినిస్టు. యాక్టివిస్టు. 1960లు, 70లలో అమెరికన్ ఫెమినిస్టు ఉద్యమంలో ఆమెది సారథ్యగళం. ప్రసిద్ధ ‘ఎస్క్వెయర్’, ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికలకు ఫ్రీలాన్సర్‌గా పనిచేశారు. ప్రధానంగా మహిళా సమస్యల్యే రిపోర్ట్ చేశారు. ‘ఉమన్ యాక్షన్ అలయెన్స్’, ‘నేషనల్ ఉమెన్స్ పొలిటికల్ కాకస్’, ‘ఉమెన్స్ మీడియా సెంటర్’, ‘మిస్ ఫౌండేషన్ ఫర్ ఉమెన్’ వంటి సంస్థలకు సహ వ్యవస్థాపకురాలిగా, వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. బిల్లీ జీన్ కింగ్ ‘బ్యాటిల్ ఆఫ్ సెక్సెస్’తో బిల్లీ జీన్ కింగ్ ప్రసిద్ధురాలయ్యారు. ప్రపంచ చరిత్రలో స్త్రీ, పురుషుల మధ్య మొట్టమొదటిసారిగా జరిగిన ఆ టెన్నిస్ ‘యుద్ధం’లో ఓడిపోయింది ఎవరో తెలుసా? పురుషులు!! అధికులమని, అరివీరభయంకరులమని నిత్యం నిద్రలేవడంతోనే అహకరిస్తుండే పురుషులు ఆ రోజున తోక ముడిచి, మహిళల ఆత్మవిశ్వాసానికి మోకరిల్లారు. ప్రపంచ మహిళల పరువును నిలబెట్టడం కోసం టెన్నిస్ బరిలోకి దిగిన బిల్లీ జీన్ కింగ్... 6–4, 6–3, 6–3 తేడాతో మగ దురహంకార వరాహం... బాబీ రిగ్స్‌ను ఘోరాతిఘోరంగా ఓడించి మగవాళ్ల ఆధిక్యపు లోకాలను తిరగేసి, తలకిందులు చేశారు. టీవీల ముందు కూర్చుని సుమారు ఐదు కోట్లమంది, ప్రత్యక్షంగా ముప్పై వేల మంది చూస్తుండగా హోస్టన్‌లోని ఆస్ట్రోడోమ్ టెన్నిస్ కోర్టులో 1973 సెప్టెంబర్ 20న ‘బ్యాటిల్ ఆఫ్ సెక్సెస్’ సాగింది. పురుషాధిక్యపు ఓడలు తిరగబడిన రోజు అది. ఎలినార్ రూజ్వెల్ట్ అమెరికాను ‘గ్రేట్ డిప్రెషన్’ నుండి తప్పించే ప్రయత్నంలో అధ్యక్షుడు రూజ్వెల్ట్ డిప్రెషన్లో పడిపోకుండా చెయ్యి అందించిన గ్రేట్ ఉమన్.. మిసెస్ రూజ్వెల్ట్! దేశాన్ని గట్టెక్కించేందుకు రూజ్వెల్ట్కు వచ్చిన ‘న్యూ డీల్’ఐడియా.. డైనింగ్ హాల్లో మిసెస్ రూజ్వెల్ట్ ఇచ్చిందేనని డీల్‌కు కాళ్లడ్డు పెట్టిన కన్జర్వేటివ్‌ల అనుమానం. ఎవరేం అనుకున్నా. ప్రత్యక్షంగా అధ్యక్షుడికి, పరోక్షంగా అగ్రరాజ్యానికీ ఆమె.. కొత్త ఊపిరి, ఉత్సాహం ఇచ్చిన మాట వాస్తవం. ఇందుకోసం ఎలినార్ వ్యూహ సారథుల శ్వేతసౌధాన్ని సైతం అమెరికన్ పౌరుల అతిథిగృహంలా మార్చారు.ఎలినార్ ప్రత్యేకించి మహిళల స్థితిగతుల్ని మెరుగుపరచడానికి ప్రభుత్వానికి సూచనలు ఇచ్చారు. బెట్టీ ఫ్రైడే ఫ్రైడే 1963లో రాసిన ‘ది ఫెమినైన్ మిస్టిక్’ అనే పుస్తకంతో బెట్టీ మహిళా హక్కుల కార్యకర్తగా వెలుగులోకి వచ్చారు. ప్రసిద్ధ సంస్థ ‘నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్’ సహవ్యవస్థాపకులలో ఆమె ముఖ్యులు. ‘నేషనల్ అబార్షన్ రైట్స్ యాక్షన్ లీగ్’ ఆవిర్భావంలోనూ ఆమె కృషి ఉంది. తన జీవితకాలమంతా బెట్టీ మహిళల హక్కుల కోసమే పాటుపడ్డారు. అనేక పుస్తకాలు రాశారు. బార్బారా వాల్టర్స్ అమెరికన్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టు. టెలివిజన్ పర్సనాలిటీ. వ్యాఖ్యాత. సామాజిక కార్యకర్త. మహిళల కోసం అనేక ‘షో’లను రూపొందించారు. మహిళా సమస్యలపై డిబేట్లు నిర్వహించారు. వృత్తిధర్మంగానే కాక, వ్యక్తిగతంగా కూడా బార్బారా.. మహిళా సంక్షేమం దిశగా సమాజంతో చైతన్యం తెచ్చే అనేక సూచనలు, సలహాలను తన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. మాయా ఏంజెలో రచయిత్రి, కవయిత్రి, నాటకకర్త, నాట్యకారిణి, గాయని, హక్కుల కార్యకర్త. తన జీవితాన్ని సందేశంగా, సంకేతంగా తన సృజనాత్మక ప్రక్రియలతో మహిళలకు అందించారు. ఈజిప్టులో, ఘనాలో జర్నలిస్టుగా చేశారు. అక్కడి మహిళా సమస్యల్ని ప్రపంచం దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా లైంగిక వివక్ష, లైంగిక సమానత్వం అనే అంశాలపై జీవితకాల కృషి సల్పారు. -
ఐష్ ఫస్ట్ లేడీ
మాజీ ప్రపంచ సుందరి, కథానాయిక ఐశ్వర్యారాయ్ ‘ఫస్ట్ లేడీ’ పురస్కారం అందుకున్నారు. వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలకు ఏటా ఈ అవార్డులు ఇస్తుంటారు. ఇందులో భాగంగా ఇరవై ఏళ్లుగా ఐశ్వర్యారాయ్ సినీరంగానికి అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రకటించారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ‘ఫస్ట్ లేడీ’ అవార్డును ఐశ్వర్యకి అందజేశారు. 2002 నుంచి ప్రతి ఏటా కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పాల్గొంటున్న ఐశ్వర్య ఇటీవల జ్యూరీ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ‘కేన్స్’ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో జ్యూరీ సభ్యురాలిగా ఎంపికైన తొలి భారతీయ నటి ఐష్ కావడంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ ఆమెను ఘనంగా సత్కరించారు. కాగా, చిన్న వయసులోనే పైలెట్ అయిన ఆయేషా అజీజ్, కశ్మీర్‌కి చెందిన తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి రువేదా సలామ్‌లతో పాటు మరో 113 మందికి ‘ఫస్ట్ లేడీ’ పురస్కారాలు అందించారు. -
ఫస్ట్ లేడీ అవార్డు అందుకున్న ఐష్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఫస్ట్ లేడీ అవార్డును అందుకున్నారు. రెండు దశాబ్దాలుగా సినీరంగానికి ఆమె అందిస్తున్న సేవలకు గానూ ఈ ఈఅవార్డుకు ఎంపిక చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. పలు రంగాల్లో ఘనవిజయాలు సాధించిన మరికొంతమంది మహిళలకు కూడా ఈ ఫస్ట్‌లేడీ అవార్డులను అందజేశారు. 2002 నుంచి ప్రతీ సంవత్సరం కేన్స్ చలన చిత్రోత్సవాలకు హాజరవుతున్న ఐశ్వర్య ఇటీవల ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ జ్యూరీ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రి మేనకా గాంధీ ఐష్‌ను సత్కరించారు. ఐష్ తోపాటు చిన్న వయసులోనే పైలెట్ అయిన ఆయేషా అజీజ్, తొలి మహిళా ఐపీఎస్ రువేదా సలామ్‌లతో పాటు మరో 113 మందికి అవార్డు ప్రదానం చేశారు. -
ఫస్ట్‌లేడీ పాత్రలో ట్రంప్ కూతురు!
వాషింగ్టన్: అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ ఇప్పట్లో వైట్ హౌస్‌లో ఉండాలని భావించడం లేదు. కొడుకు బారన్ చదువు కోసం తాను న్యూయార్క్‌లో ఉండటానికి ప్లాన్ చేసుకుంటున్నానని ఆమె ఇటీవల వెల్లడించారు. దీంతో వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్‌లో ప్రధమ మహిళ పోస్ట్‌కు వేకెన్సీ ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్ల మీద కామెంట్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వైట్‌హౌస్‌లో మెలానియా నిర్వహించాల్సిన కొన్ని విధులను ఆమె స్థానంలో ట్రంప్ కూతురు ఇవాంకా నిర్వహించబోతున్నారని అక్కడి మీడియా సంస్థలు కొన్ని ఆసక్తికరమైన కథనాలను ప్రచురించాయి. ట్రంప్ కూడా తాను ఇంతకు ముందు అధ్యక్షుల వలే కాకుండా.. సాంప్రదాయేతర విధానాలు పాటించబోతున్నానని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దీంతో ట్రంప్‌కు ఇవాంకా అడ్మినిస్ట్రేషన్‌లో సలహాలు ఇవ్వబోతుందని మీడియా సంస్థ న్యూస్ కార్ప్ వెల్లడించింది. హీట్ స్ట్రీట్ అనే మరో మీడియా సంస్థ ఏకంగా ఇవాంకా, ఆమె భర్త కుష్నర్ వాషింగ్టన్ డీసీలో ఇంటి కోసం వెతుకుతున్నారని పేర్కొంది. అయితే.. తండ్రి అడ్మినిస్ట్రేషన్‌లో తాను ఎలాంటి పదవిని ఆశించడం లేదని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసిన ఇవాంకా.. ప్రచారం సమయంలో తాను పేర్కొన్న అంశాలపై పోరాడుతానని వెల్లడించింది. ఫస్ట్‌లేడీ లేకుండానే వైట్ హౌస్‌కు వెళ్లిన అధ్యక్షుడు గ్రోవర్ క్లీవ్‌ల్యాండ్. 1885లో వైట్‌హౌస్‌లోకి బ్యాచ్‌లర్‌గా అడుగుపెట్టిన ఆయన 1886లో పెళ్లి చేసుకున్నారు. -
మిషెల్ ఒబామా బట్టల బిల్లు కట్టేదెవరు?
మామూలుగానే అమెరికా అధ్యక్షుడి భార్యలు భలే హై ప్రొఫైల్ గా ఉంటారు. సందర్భోచిత దుస్తులతో దర్శనమిస్తారు. వాళ్ల స్టయిల్, వేసుకున్న దుస్తుల గురించి ఫాషన్ మాగజైన్ల నుంచి టాబ్లాయిడ్ల దాకా తెగ చర్చిస్తారు. ఇక ఒబామా శ్రీమతి మిషెల్ దుస్తుల గురించి చెప్పనే అక్కర్లేదు. ఆమె 'మోస్ట్ స్టైలిష్ ఫస్ట్ లేడీ' గా ఇప్పటికే పేరొందారు. గంటకో స్కర్టు, గడియకో గౌను తో ఆమె దర్శనమిచి, కెమెరామెన్లకు బోలెడంత పనిపెట్టారు. అయితే ఆమె దుస్తుల ఖర్చు ఎవరు భరిస్తారు? ఆమెకు జీతం లేదు. వార్డ్ రోబ్ అలవెన్స్ కూడా లేదు. అయితే ఆమె దుస్తుల ఖర్చు ఆమే భరిస్తారు. మామూలుగా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఫస్ట్ లేడీకి దుస్తులు గిఫ్ట్ ఇవ్వడమూ జరుగుతుంది. కానీ వాడిన తరువాత వాటిని వెంట తీసుకెళ్లడానికి వీలుండదు. అమెరికన్ జాతీయ వస్తు సంగ్రహాలయానికి పంపించాలి. అక్కడే వాటిని భద్రపరచి ఉంచుతారు.