నేడే కీలక అధ్యక్ష ఎన్నికలు
ప్రధాన అభ్యర్థులిద్దరూ మహిళలే
మెక్సికో. లాటిన్ అమెరికాలో రెండో అతి పెద్ద దేశం. పురుషాధిపత్య భావజాలానికి పెట్టింది పేరు. మహిళలపై హింస, హత్య, యాసిడ్ దాడులు నిత్యకృత్యం. మెక్సికోలో ఇదే అతి పెద్ద సమస్య కూడా. అలాంటి దేశంలో తొలిసారి ఓ మహిళ అధ్యక్ష పదవి చేపట్టనున్నారు! ఆదివారం జరిగే ఎన్నికల్లో అధ్యక్ష పదవితో పాటు 128 మంది సెనేటర్, 500 మంది కాంగ్రెస్ ప్రతినిధులతో పాటు దాదాపు 20 వేల స్థానిక సంస్థల స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.
ఈసారి పాలక, ప్రధాన సంకీర్ణాలు రెండింటి నుంచీ మహిళలే బరిలో ఉండటం విశేషం. పాలక ‘మోరెనా’ సంకీర్ణం తరఫున పోటీ చేస్తున్న క్లాడియా షేన్‌బామ్ గెలుపు ఖాయమేనని పరిశీలకులు చెబుతున్నారు. నేషనల్ యాక్షన్ పార్టీ సారథ్యంలోని విపక్ష కూటమి అభ్యర్థి సోచిల్ గాల్వెజ్‌పై ఆమె కనీసం 20 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్టు అన్ని సర్వేల్లోనూ తేలింది.
మహిళలపై మితిమీరిన హింసకు పెట్టింది పేరైన ఆ దేశంలో వారికి రాజకీయ ప్రాతినిధ్యం కూడా నానాటికీ బాగా పెరుగుతుండటం విశేషం. దిగువ సభ (కాంగ్రెస్)లో అన్ని పారీ్టలూ మహిళలకు కనీసం 50 శాతం టికెట్లివ్వడాన్ని ఇప్పటికే తప్పనిసరి చేశారు. ఫలితంగా కాంగ్రెస్‌లో సగం మంది సభ్యులు మహిళలే ఉన్నారు. మెM్సకో జనాభా 13 కోట్లు కాగా దాదాపు 10 కోట్ల మంది ఓటర్లున్నారు. ఆదివారం పోలింగ్ ముగిశాక రాత్రికల్లా ఫలితాలు వెలవడే అవకాశముంది.
సోచిల్ గాల్వెజ్
61 ఏళ్ల గాల్వెజ్ సెనేట్ సభ్యురాలు. పారిశ్రామికవేత్త. ఎన్‌ఏపీ, పీఆర్‌ఐ, పీఏఎన్, ఆర్‌పీడీ సహా పలు పారీ్టలతో కూడిన విపక్ష కూటమి తరఫున బరిలో ఉన్నారు. లోపెజ్ ప్రవేశపెట్టిన పెన్షన్ పథకం వంటివాటిని తాను కూడా కొనసాగిస్తానని చెబుతూ పలు వర్గాలను ఆకట్టుకున్నారు. దాంతోపాటు మధ్య, దిగువ తరగతి ప్రజల కోసం సార్వత్రిక సామాజిక రక్షణ వ్యవస్థ తెస్తానంటున్నారు. పోలీస్ వ్యవస్థను పటిష్టపరిచి నేరాలపై ఉక్కుపాదం మోపుతానని చెబుతున్నారు.
క్లాడియా షేన్‌బామ్
ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త. 2007లో నోబెల్ గ్రహీత. మెక్సికో సిటీ మాజీ మేయర్. గెలిస్తే తొలి అధ్యక్షురాలిగానే గాక యూదు మూలాలున్న తొలి వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించే అవకాశముంది. అధ్యక్షుడు ఆంద్రెజ్ మాన్యుయెల్ లోపెజ్ అబ్రేడర్‌కున్న విశేషమైన జనాదరణ ఉన్నా రెండోసారి పదవి చేపట్టేందుకు మెక్సికో రాజ్యాంగ ప్రకారం అనుమతించని కారణంగా పాలక సంకీర్ణ అభ్యరి్థగా షేన్‌బామ్ బరిలో దిగారు.
కనీస వేతనాలను రెట్టింపు చేయడం, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల పెంపు, రైతులకు సబ్సిడీ, వర్సిటీ విద్యార్థులకు ప్రోత్సాహకాలు, నిరుద్యోగులకు భృతి వంటివి నేరుగా నగదు రూపంలో చెల్లించడం, సీనియర్ సిటిజన్లకు సార్వత్రిక పెన్షన్ సదుపాయం వంటివాటితో లోపెజ్ తన ఆరేళ్ల పదవీకాలంలో అందరి మన్ననలు పొందారు.
ఇదంతా 61 ఏళ్ల షేన్‌బామ్‌కు బాగా కలిసి రానుంది. డ్రగ్ మాఫియా, వ్యవస్థీకృత నేరాలు మెక్సికో ఎదుర్కొంటున్న సమస్యల్లో ముఖ్యమైనవి. వీటి కట్టడికి లోపెజ్ పెద్దగా ప్రయత్నాలు చేయలేదన్న ఆరోపణలున్నాయి. తాను వాటిపైనా ప్రధానంగా దృష్టి సారిస్తానని ఆమె చెబుతున్నారు. లోపెజ్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఆయన ప్రభావానికి అతీతంగా పాలిస్తానంటున్నారు.
జార్జే అల్వారిజ్ మైనేజ్
రాజకీయాలకు కొత్త ముఖం. స్మాల్ సిటిజన్ మూవ్‌మెంట్ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. నేరాలపై ఉక్కుపాదం మోపుతానని హామీ ఇచ్చారు. డ్రగ్స్‌ను నిర్మూలించడం అసాధ్యమని, వాటిని బాగా కట్టడి చేస్తానని చెబుతున్నారు. 38 ఏళ్ల మైనేజ్ ప్రతిపాదించిన పలు ఆర్థిక సంస్కరణలపై ప్రజల నుంచి మంచి స్పందన రావడం విశేషం. ఈసారి గెలవకపోయినా మున్ముందు మెక్సికో రాజకీయాల్లో ఆయన ప్రబల శక్తిగా ఎదగడం ఖాయమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment