అధ్యక్ష పీఠంపై షేన్‌బామ్
తొలి మహిళగా రికార్డు
మెక్సికో సిటీ: మెక్సికో చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అంతా ఊహించినట్టుగానే అధికార మోరెనా వామపక్ష కూటమి అభ్యర్థి క్లాడియా షేన్‌బామ్ (61) ఘనవిజయం సాధించారు. 200 ఏళ్ల స్వతంత్ర మెక్సికో చరిత్రలో దేశ అధ్యక్ష పీఠమెక్కనున్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు. యూదు మూలాలున్న తొలి ప్రెసిడెంట్ కూడా ఆమే కానున్నారు!
షేన్‌బామ్‌కు ఇప్పటికే దాదాపు 60 శాతం ఓట్లు లభించినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రత్యర్థులిద్దరూ నాకిప్పటికే ఫోన్ చేసి అభినందించారు. ఓటమిని అంగీకరించారు. దేశానికి తొలి అధ్యక్షురాలిని కాబోతున్నా’’ అంటూ చిరునవ్వులు చిందించారు. ‘‘ఇది నేను ఒంటరిగా సాధించిన విజయం కాదు.
తల్లులు మొదలుకుని కూతుళ్లు, మనవరాళ్ల దాకా దేశ మహిళలందరి విజయమిది’’ అన్నారు. విపక్ష కూటమి మహిళకే అవకాశమిచి్చంది. రెండు ప్రధాన పారీ్టల నుంచీ మహిళలే తలపడటమూ మెక్సికో చరిత్రలో ఇదే తొలిసారి. విపక్ష కూటమి అభ్యర్థి సోచిల్ గాల్వెజ్‌కు 28 శాతం, మరో ప్రత్యర్థి జార్జ్ అల్వారిజ్ మైనేజ్‌కు 10 శాతం ఓట్లు వచి్చనట్టు ఈసీ పేర్కొంది.
షేన్‌బామ్ నూతన చరిత్ర లిఖిస్తున్నారంటూ అధ్యక్షుడు ఆంద్రెజ్ మాన్యుయెల్ లోపెజ్ అబ్రేడర్ అభినందించారు. ఆరేళ్ల పదవీకాలంలో ఆయన పలు చరిత్రాత్మక నిర్ణయాలతో ప్రజల మనసు గెలుచుకున్నారు. షేన్‌బామ్ విజయంలో లోపెజ్ పాపులారిటీదే ప్రధాన పాత్ర. ఒకసారికి మించి అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు మెక్సికో రాజ్యాంగం అనుమతించదు. దాంతో ఆయన రెండోసారి బరిలో దిగలేకపోయారు.
2018లో లోపెజ్ గెలిచినప్పటి మాదిరిగా ఈసారి ప్రజల్లో పెద్దగా హర్షాతిరేకాలు వ్యక్తం కాకపోవడం విశేషం. అధ్యక్ష పదవితో పాటు పాటు 9 రాష్ట్రాల గవర్నర్లు, 128 మంది సెనేటర్లు, 500 మంది కాంగ్రెస్ ప్రతినిధులు, వేలాది మేయర్లు, స్థానిక సంస్థల ప్రతినిధి పదవులకు కూడా ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలపై ఆసక్తి నెలకొంది. మొత్తం 32 గవర్నర్ పదవుల్లో మెరేనా పార్టీకి 23 ఉన్నాయి.
షేన్‌బామ్‌కు సవాళ్లెన్నో...
షేన్‌బామ్ అక్టోబర్ 1న అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమెకు సవాళ్ల స్వాగతమే లభించనుంది. మహిళలపై హింసకు మెక్సికో ప్రపంచంలోనే పెట్టింది పేరు. ఈ సమస్యను రూపుమాపాల్సి ఉంది.
సంక్షేమ పథకాలతో లోపెజ్ బాగా ఆకట్టుకున్నా అడ్డూ అదుపూ లేదని వ్యవస్థీకృత హింస, గ్యాంగ్ వార్లు, డ్రగ్ ట్రాఫికింగ్, పెట్రో ధరల పెరుగుదల తదితరాల కట్టడికి పెద్దగా చేసిందేమీ లేదన్న అసంతృప్తి ప్రజల్లో బాగా ఉంది. వీటిపై కొత్త అధ్యక్షురాలు దృష్టి పెట్టాలని వారు భావిస్తున్నారు. ప్రస్తుత పథకాలన్నింటినీ కొనసాగిస్తూనే దేశాన్ని పీడిస్తున్న అన్ని సమస్యలనూ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని షేన్‌బామ్ ప్రకటించారు. ఏ తారతమ్యాలూ లేకుండా ప్రజలందరినీ ఒకేలా చూస్తానన్నారు.
లా డాక్టోరా...
షేన్‌బామ్ విద్యార్హతలు అన్నీ ఇన్నీ కావు. ఎనర్జీ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేవారు. అందుకే ఆమెను అభిమానులు ముద్దుగా ‘లా డాక్టోరా’ అని పిలుచుకుంటారు. పర్యావరణవేత్తగా చాలా పేరుంది. నోబెల్ శాంతి బహుమతి పొందిన ఐరాస పర్యావరణ శాస్త్రవేత్తల బృందంలో షేన్‌బామ్ సభ్యురాలు. రాజధాని మెక్సికో సిటీ మేయర్‌గా చేసిన తొలి మహిళ కూడా ఆమే. షేన్‌బామ్ తాత, అమ్మమ్మ హిట్లర్ హోలోకాస్ట్ హింసాకాండను తప్పించుకోవడానికి యూరప్ నుంచి మెక్సికో వలస వచ్చారు. షేన్‌బామ్ మెక్సికో సిటీలోనే పుట్టారు. 2000లో రాజకీయ అరంగేట్రం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment