
ఫస్ట్‌లేడీ పాత్రలో ట్రంప్ కూతురు!
వాషింగ్టన్: అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ ఇప్పట్లో వైట్ హౌస్‌లో ఉండాలని భావించడం లేదు. కొడుకు బారన్ చదువు కోసం తాను న్యూయార్క్‌లో ఉండటానికి ప్లాన్ చేసుకుంటున్నానని ఆమె ఇటీవల వెల్లడించారు. దీంతో వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్‌లో ప్రధమ మహిళ పోస్ట్‌కు వేకెన్సీ ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్ల మీద కామెంట్లు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే వైట్‌హౌస్‌లో మెలానియా నిర్వహించాల్సిన కొన్ని విధులను ఆమె స్థానంలో ట్రంప్ కూతురు ఇవాంకా నిర్వహించబోతున్నారని అక‍్కడి మీడియా సంస్థలు కొన్ని ఆసక్తికరమైన కథనాలను ప్రచురించాయి. ట్రంప్ కూడా తాను ఇంతకు ముందు అధ్యక్షుల వలే కాకుండా.. సాంప్రదాయేతర విధానాలు పాటించబోతున్నానని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దీంతో ట్రంప్‌కు ఇవాంకా అడ్మినిస్ట్రేషన్‌లో సలహాలు ఇవ్వబోతుందని మీడియా సంస్థ న్యూస్ కార్ప్ వెల్లడించింది. హీట్ స్ట్రీట్ అనే మరో మీడియా సంస్థ ఏకంగా ఇవాంకా, ఆమె భర్త కుష్నర్ వాషింగ్టన్ డీసీలో ఇంటి కోసం వెతుకుతున్నారని పేర్కొంది.
అయితే.. తండ్రి అడ్మినిస్ట్రేషన్‌లో తాను ఎలాంటి పదవిని ఆశించడం లేదని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసిన ఇవాంకా.. ప్రచారం సమయంలో తాను పేర్కొన్న అంశాలపై పోరాడుతానని వెల్లడించింది. ఫస్ట్‌లేడీ లేకుండానే వైట్ హౌస్‌కు వెళ్లిన అధ్యక్షుడు గ్రోవర్ క్లీవ్‌ల్యాండ్. 1885లో వైట్‌హౌస్‌లోకి బ్యాచ్‌లర్‌గా అడుగుపెట్టిన ఆయన 1886లో పెళ్లి చేసుకున్నారు.