మార్తా వాషింగ్టన్, లేడీ ప్రెసిడెంట్
అమెరికాకు మహిళా ప్రెసిడెంట్లే లేరనుకుంటాం. కానీ ఉన్నారు. మార్తమ్మ! అమెరికా అధ్యక్షుడి భార్యను ‘ప్రథమ మహిళ’ అంటాం. కానీ బతికుండగా ప్రథమ మహిళ కాలేకపోయిన అధ్యక్షుడి భార్య ఉన్నారు. మార్తమ్మ! ఈరోజు యు.ఎస్.లో ‘ప్రెసిడెంట్స్ డే’. కొన్ని రాష్ట్రాల్లో సెలవు రోజు. అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ ఫిబ్రవరి మూడో సోమవారం జన్మించారు. ఆయన పేరుతో ప్రెసిడెంట్స్ డే మొదలైంది. ఆయన భార్యే మార్తమ్మ. మార్తా డాండ్రిడ్జ్. ‘ఫస్ట్ లేడీస్’లో బెస్ట్ లేడీ అంటారు మార్తాను. అమెరికా అధ్యక్షుడి భార్యంటే ఆమెలా ఉండాలని కూడా అంటారు. ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.. ప్రెసిడెంట్స్ డే సందర్భంగా.
భర్త జార్జి వాషింగ్టన్ కన్నా వయసులో తొమ్మిది నెలలు పెద్ద.. మార్తా. భర్త కంటేనే కాదు, తన జీవితం కంటే కూడా ఎల్తైన మనిషి. డెబ్భై ఒక్కేళ్లు జీవించారు. ఆమె కళ్ల ముందే మొదటి భర్త చనిపోయాడు. మొదటి భర్తకు పుట్టిన నలుగురు పిల్లలు చనిపోయారు. రెండో భర్త (జార్జి వాషింగ్టన్) చనిపోయారు. తన జీవితంలోని చివరి రెండున్నరేళ్లూ బైబిల్ మాత్రమే తోడుగా గడిపారు మార్తా. జార్జి వాషింగ్టన్‌కీ మార్తాకు పిల్లల్లేరు. మొదటి భర్త పిల్లల్నే తమ పిల్లలు అనుకున్నారు జార్జి వాషింగ్టన్.
తైలవర్ణ చిత్రంలో మార్తా, జార్జి వాషింగ్టన్‌ల వివాహ (1759) మహోత్సవం
రెండు వందల ఎనభై ఏళ్ల క్రితం వర్జీనియా అయినా, వీరభద్రపురం అయినా ఒకటే. ‘ఆడపిల్లకు చదువా!’ అనేసే ఆ కాలంలో పుట్టారు మార్తా. ఎనిమిది మంది పిల్లల్లో పెద్దమ్మాయి. కలిగిన కుటుంబం. వర్జీనియాలోని విలియమ్స్‌బర్గ్‌లో తోటలున్నాయి వాళ్లకు. వర్జీనియాలో పెద్దగా చదువుకున్న ఆడపిల్లలు కనిపించేవారు కారు. ఊళ్లో ఎవరైనా చదువొచ్చిన అమ్మాయిలున్నారా అంటే.. ‘జాన్ డాండ్రిడ్జ్‌గారి పెద్దమ్మాయి ఉంది కదా, చదవడమే కాదు రాయడం కూడా వచ్చు తనకి’ అనేంతగా మార్తాకు చిన్నప్పుడే గుర్తింపు వచ్చింది. ఆమె చేత ఉత్తరాలు రాయించుకునేవారు, పుస్తకాలు చదివించుకునేవారు. మార్తా రాసిన ఉత్తరాలు కొన్ని ఇప్పటికీ న్యూయార్క్‌లోని మౌంట్ వెర్నన్ పౌర గ్రంథాలయంలో భద్రంగా ఉన్నాయి. పుస్తకం చదవకుండా గడిచిన రోజు లేదు మార్తా జీవితంలో. భక్తి పుస్తకాలను గుండెలకు హత్తుకుని చదివేవారు.
∙∙
అమెరికాకు వలస వచ్చిన ఐరోపా మహిళల సగటు ఎత్తుకన్నా రెండు అంగుళాలు తక్కువగా.. ఐదడుగులు.. ఉండేవారు మార్తా. ఆకర్షణీయంగా ఉండేవారు. ప్రేమమయి అని పేరు. లోకమంతా నావాళ్లే అన్నట్లు చిరునవ్వుతో పలకరించేవారు. ఎవరితోనైనా చక్కగా కలిసిపోయేవారు. మాట ఉంది. రూపం ఉంది. గుణం ఉంది. వాటికి పడిపోయాడు డేనియల్ పార్క్ కస్టిస్. చర్చిలో తొలిసారిగా మార్తాను చూసి మనసు పారేసుకున్నాడు. అప్పుడామెకు పందొమ్మిదేళ్లు. ఆయనకు ముప్పై తొమ్మిదేళ్లు. ఇరవై ఏళ్ల వ్యత్యాసం! డేనియల్ తండ్రి ఒప్పుకోలేదు. వయసెక్కువని కాదు. సంపద తక్కువని. ఆ మాట నిజం. మార్తా వాళ్లు సంపన్నులే కానీ, డేనియల్ వాళ్లంత కాదు.
అప్పటికే చాలా సంబంధాలను డేనియల్ తండ్రి తిరగ్గొట్టేశాడు. ఈ సంబంధం కూడా వద్దన్నాడు. ‘సంబంధం కాదు నాన్నా.. హృదయబంధం ఇది’ అన్నాడు. ‘అయితే అనుభవించు.. ఆ పిల్లను చేసుకుంటే నా ఆస్తిలో నీకు వచ్చేదేమీ ఉండదు’ అన్నాడు. ఆస్తిని వద్దనుకుని మార్తాను చేసుకున్నాడు డేనియల్. నలుగురు పిల్లలు. అబ్బాయి, అమ్మాయి, అబ్బాయి, అమ్మాయి. పెళ్లయిన ఏడేళ్లకే డేనియల్ గుండెపోటుతో చనిపోయాడు. అప్పటికి మార్తా వయసు ఇరవై ఏడేళ్లు. పిల్లలు కూడా ఎక్కువ కాలం బతకలేదు. జబ్బులకు వైద్యం లేని కాలం అది. కొడుకు డేనియల్ (తండ్రి పేరే) మూడేళ్ల వయసులో, కూతురు ఫ్రాన్సిస్ నాలుగేళ్ల వయసులో, రెండో కొడుకు జాన్ ఇరవై ఏడేళ్ల వయసులో, రెండో కూతురు మార్తా (తల్లి పేరే) పదిహేడేళ్ల వయసులో.. అందరూ అనారోగ్యలతోనే చనిపోయారు.
∙∙
మార్తా.. జార్జి వాషింగ్టన్‌ని రెండో పెళ్లి చేసుకునే నాటికి ఆమె వయసు 28. వాషింగ్టన్‌తో పెళ్లయ్యాక చాలాకాలం పాటు డేనియల్ స్మృతులు మార్తాను వెంటాడాయి. అప్పటికే మొదటి పిల్లలిద్దరూ చనిపోయారు. మిగిలిన పిల్లలు ఇద్దరు, తను. పిల్లలకుండగా మళ్లీ పిల్లలెందుకని వాష్లింగ్టన్ వాళ్లనే దత్తత తీసుకున్నారు. వాషింగ్టన్, మార్తా తొలిసారి కలుసుకునే నాటికి వాషింగ్టన్ యువ సైనికాధికారి. ఆమె సంపన్నురాలైన వితంతువు. ఇద్దరూ ఒకే వయసులో ఉన్నారు. ఆమె అందగత్తె. అతడు చురుకైనవాడు. పుట్టింటి నుంచి మార్తా వాటాగా వచ్చిన తోటలు కొన్ని విలియమ్స్‌బర్గ్ సమీపంలో ఉన్నాయి. ఆ చుట్టపక్కలకు ఏవో లెక్కల కోసం వచ్చిన వాషింగ్టన్ ఆమెను చూసీ చూడగానే ఆమెతోనే తన జీవితం అనుకున్నారు. వాషింగ్టన్ ఆరు అడుగుల రెండు అంగుళాల ఎత్తు ఉండేవారు. మిలటరీ ఆఫీసర్‌గా అప్పటికే తెలిసిన పేరు. అది ఆమెను ఆకర్షించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే వాళ్ల పెళ్లి జరిగింది.
పెళ్లికి ముందు అతడు సైన్యంలోంచి బయటికి వచ్చాడు. అలాగని పూర్తిగా బయటికి రాలేదు. భార్యాభర్తలిద్దరూ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చాక వాషింగ్టన్ తొలి అమెరికా అధ్యక్షుడు అవడంతో మార్తా తొలి ‘ఫస్ట్ లేడీ’ అయ్యారు. భర్త పాలనా వ్యవహారాలకు అనుబంధంగా మార్తా కూడా నిత్యం తీరికలేని పనుల్లో ఉండేవారు. అధికారులకు సలహాలు, సూచనలు ఇస్తుండేవారు. ప్రతి శుక్రవారం సాయంత్రం విందు ఏర్పాటు చేస్తుండేవారు. అతిథులు ఆమెను ‘లేడీ వాషింగ్టన్’ అనీ, ‘అవర్ లేడీ ప్రెసిడెంటెస్’ అని గౌరవంగా సంబోధిస్తుండేవారు. ‘ఆయన కంటే ఆమె తెలివైన వారు’ అనుకున్నవారూ ఉన్నారు. ఇప్పుడంటే.. అమెరికా అధ్యక్షుడి భార్యను ‘ప్రథమ మహిళ’ అంటున్నాం. అప్పటికి ఆ మాటే పుట్టలేదు. మార్తా మరణానంతం.. ఫస్ట్ లేడీ అనే సంప్రదాయం మొదలైంది. మార్త తర్వాత లేడీ ప్రెసిడెంట్ అని అమెరికన్‌లు ఎవర్నీ అంత ఆపేక్షగా పిలుచుకోలేదు. అందుకే ఆమె తొలి మహిళా అధ్యక్షురాలు కూడా.
Comments
Please login to add a commentAdd a comment