ఫస్ట్‌ ఉమన్‌ అంబులెన్స్‌ డ్రైవర్‌ | M Veeralakshmi Is First Woman Ambulance Driver In Tamil Nadu | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌ ఉమన్‌ అంబులెన్స్‌ డ్రైవర్‌

Sep 3 2020 8:34 AM | Updated on Sep 3 2020 8:34 AM

M Veeralakshmi Is First Woman Ambulance Driver In Tamil Nadu - Sakshi

అంబులెన్స్‌ అంటే ఆఘమేఘాల మీద నడపాలి. లోపల ఉన్న పేషెంట్‌ గగ్గోలు పెడుతున్నా బంధువులు కంగారులో రోదిస్తున్నా చెదరక గమ్యాన్ని చేరాలి. అవసరమైతే ఫస్ట్‌ ఎయిడ్‌ చేయాలి.ఊపిరికి పచ్చదీపం చూపాలి.ఇదంతా మగవారి పని అని అందరూ అనుకుంటారు.కాదని నిరూపిస్తోంది చెన్నై వీరలక్ష్మి.

మొన్న రెండు రోజుల క్రితం ఆగస్టు 31న తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి 118 కొత్త అంబులెన్స్‌లకు పచ్చజెండా ఊపి ప్రజల వైద్యసేవలకు వాటిని అంకితం చేశారు. రాష్ట్రంలో వేయికి పైగా ఉన్న అంబులెన్స్‌లకు ఇవి కొత్త చేర్పు. ఇది ఒక విశేషమైతే ఈ కొత్త అంబులెన్స్‌లలో ఒకదానికి ఒక మహిళా డ్రైవర్‌ను ఆయన అపాయింట్‌ చేయడం మరో విశేషం. ఆ మహిళ పేరు వీరలక్ష్మి. ఈ నియామకంతో వీరలక్ష్మి తమిళనాడు తొలి మహిళా అంబులెన్స్‌ డ్రైవర్‌ అయ్యింది. బహుశా భారతదేశంలో ఈ కోవిడ్‌ కాలంలో డ్యూటీలో ఉన్న ఏకైక మహిళా డ్రైవర్‌ కూడా కావచ్చు. 

చెన్నైలో నివాసం ఉండే 30 ఏళ్ల వీరలక్ష్మి ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లమా చేసింది. క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తున్న భర్తకు చేదోడు వాదోడుగా ఉండాలని ఆరేళ్ల క్రితం ఒక స్వచ్ఛంద సంస్థ సహాయంతో డ్రైవింగ్‌ నేర్చుకుంది. అప్పటి నుంచి తనూ క్యాబ్‌ డ్రైవర్‌గా మారి పని చేయడం మొదలెట్టింది. అంతే కాదు డ్రైవింగ్‌ నేర్చుకోవాలనుకునే మహిళలకు శిక్షకురాలిగా కూడా మారింది. హెవీ వెహికిల్స్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ను సంపాదించింది. అయితే కరోనా అందరికీ తెచ్చినట్టే వారి కుటుంబానికి ఇబ్బందులను తెచ్చింది. భర్తకు తగినంత పని లేదు. తనకు కూడా లేదు. ఈ సమయంలోనే కొత్త అంబులెన్స్‌ డ్రైవర్ల కోసం తమిళనాడు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. కావలసిన అర్హతలు అన్నీ ఉన్నాయి. కాని అంబులెన్స్‌ డ్రైవర్‌గా ఇప్పటి వరకూ స్త్రీలెవరూ పని చేయలేదు.

‘ఏం చేద్దామనుకుంటూ ఉంటే మా అమ్మ ధైర్యం చెప్పింది. గట్టిగా ప్రయత్నిస్తే సాధించలేనిది అంటూ ఉండదు అని చెప్పింది’ అంది వీరలక్ష్మి.అపాయింట్‌మెంట్‌ వచ్చాక కొన్నాళ్లు అంబులెన్స్‌ డ్రైవర్‌గా ఉండటానికి అవసరమైన ట్రైనింగ్‌ ఇచ్చారు. ప్రాక్టికల్‌ అనుభవం కోసం అంబులెన్స్‌ డ్రైవర్‌లతో పాటు పంపారు. ‘నాకు పాసింజర్లను కూచోబెట్టుకుని క్యాబ్‌ నడపడమే తెలుసు. కాని అంబులెన్స్‌లో ప్రయాణికులతో పాటు చాలాసార్లు రక్తం కూడా ఉంటుంది. ముందు భయం వేసినా తర్వాత అలవాటైంది.

108 అంబులెన్స్‌ అంటే కోవిడ్‌ పేషెంట్స్‌ను కూడా తీసుకురావాల్సి రావచ్చు. కాని మా జాగ్రత్తలు మాకున్నాయి అన్న ధైర్యం ఉంది. ఇటువంటి సమయంలో అవసరమైన వారికి సేవ చేయబోతున్నానన్న సంతృప్తి కూడా ఉంది’ అంది వీరలక్ష్మి. ఆమె మొదటిసారి యూనిఫామ్‌ వేసుకొని అన్ని అంబులెన్స్‌లతో పాటు నడుపుతుంటే చూడటానికి తండ్రితో పాటు వచ్చిన పదేళ్ల కూతురు, ఐదేళ్ల కొడుకు తమ తల్లివైపు గర్వంగా, ఆశ్చర్యంగా చూశారు. శక్తి సామర్థ్యాలను చూపి, పాత మూసలు పగులగొట్టే వీరలక్ష్మి వంటి వారిని ఎవరైనా అలాగే చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement