అన్నింట్లో సగం అంటారు కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు విరుద్ధం. సగ భాగం కాదు కదా కనీసం కాలు మోపడానికి కూడా చోటు ఇవ్వడం లేదు. అవకాశాల్లోనే కాదు ఆటల్లోనూ ఆడవాళ్లపై వివక్ష కొనసాగుతోంది. ప్రతి క్రీడలోనూ మహిళల ప్రవేశానికే ఏళ్లకు ఏళ్లు పట్టింది. కొన్నిట్లో అయితే ఇప్పటికీ మహిళలకు ఎంట్రీ లేదు. అలాంటి సరిహద్దులను దాటి ఇద్దరు మహిళామణులు పురుషుల ఆటల్లో నిర్ణయాధికారం చెలాయించే సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ఇక ’మేము చెప్పినట్టు కూడా వినండి’ అంటూ నినదిస్తూ ఆడటమే కాదు ఆడించడమూ తెలుసంటున్నారు.
‘‘నా జీవితంలో ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు’’.. పురుషుల క్రికెట్ మ్యాచ్‌లో అంపైరింగ్ చేసిన తర్వాత క్లయిర్ పొలొసాక్ స్పందన ఇది. ఆస్ట్రేలియాకు చెందిన ఆమె పురుషుల అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. ఏప్రిల్ 27న నమీబియా, ఒమన్ పురుషుల క్రికెట్ జట్ల మధ్య జరిగిన ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్–2 ఫైనల్ మ్యాచ్ తర్వాత హాయిగా నిద్రపోయినట్టు క్లయిర్ చెప్పారు. తన అంపైరింగ్ పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ మాట అన్నారామె. ఈ మ్యాచ్‌కే ఆమె అంపైర్ గా వ్యవహరించి సరికొత్త చరిత్రకు మైలురాయిలా నిలిచారు.
‘‘మైదానంలో ఒక్కోసారి ఆటగాళ్ల భావోద్వేగాలు అదుపు తప్పుతుంటాయి. సంయమనంతో వ్యవహరించి సర్దిచెప్పాల్సిన బాధ్యత అంపైర్లపై ఉంటుంది. కానీ నేను అంపైరింగ్ చేసిన పురుషుల మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లో అందరూ బాగా సహకరించారు. ఆటగాళ్ల ప్రవర్తనతో నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఎల్బీడబ్ల్యూ ఔట్ల కోసం బౌలర్లు బాగా ఒత్తిడి చేస్తుంటారు. కచ్చితంగా ఔట్ అని నమ్మితేనే ఔట్ ఇస్తా. ఈ రోజు మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాను’’అని క్లయిర్ సంతోషం వ్యక్తం చేశారు.
పురుషుల మ్యాచ్‌కు అంపైరింగ్ చేయడం ఆమెకు ఇదే మొదటిసారి కాదు. 31 ఏళ్ల క్లయిర్ పేరిట మరో రికార్డు కూడా ఉంది. దేశవాళీల్లోనూ పురుషుల క్రికెట్ మ్యాచ్‌కు అంపైరింగ్ చేసిన తొలి మహిళగా రెండేళ్ల క్రితమే ఆమె గుర్తింపు పొందారు. 2017లో ఆస్ట్రేలియాలో లిస్ట్ ’ఎ’ మ్యాచ్‌లో అంపైర్‌గా వ్యవహరించి ఈ రికార్డు తన పేరిట లిఖించుకున్నారు. మహిళా క్రికెట్‌లోనూ తనదైన ముద్ర వేసిన క్లెయిర్ గత రెండున్నరేళ్లలో 15 వన్డే మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశారు. 2017 ప్రపంచకప్ మ్యాచ్‌లు, 2018 టి20 వరల్డ్‌కప్ సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లు ఆమె అంపైరింగ్ చేసిన వాటిలో ఉన్నాయి.
‘డబుల్’ రికార్డులోనూ భాగస్వామ్యం!
ఆస్ట్రేలియా గడ్డపై ఇద్దరు మహిళలు ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించిన చరిత్రాత్మక సందర్భంలోనూ క్లయిర్ పొలొసాక్ భాగస్వామిగా ఉన్నారు. తన దేశానికే చెందిన మరో అంపైర్ ఎలోసి షెరిడాన్‌తో కలిసి 2018 డిసెంబర్ 23న ఈ ఘనత సాధించారు. మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా అడిలైడ్ స్ట్రయికర్స్, మెల్‌బోర్న్ స్టార్ జట్ల మధ్య అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ అంపైరింగ్ చేసి ఔరా! అనిపించారు. ‘‘ఇది మరో చారిత్రక ఘట్టం. ఆస్ట్రేలియా క్రికెట్‌లో మహిళలు, బాలికలను ప్రోత్సహించే దిశగా ఇలాంటి ప్రయత్నాలు కొనసాగుతుండాలి. క్లయిర్, షెరిడాన్ ఎంతో కష్టపడి స్వశక్తితో అగ్రశ్రేణి మహిళా అంపైర్లుగా ఎదిగారు. వారు మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా’’ అని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో కెవిన్ రాబర్ట్స్ ఆకాంక్షించారు.
సాహోరే.. స్టెఫాని!
క్లయిర్ పొలొసాక్ సరికొత్త చరిత్ర సృష్టించిన మరుసటి రోజే ఐరోపాలో స్టెఫాని ఫ్రాపర్ట్ పతాక శీర్షికలకు ఎక్కారు. పురుషుల ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ప్రధాన రెఫరీగా వ్యవహరించిన రెండో యూరోపియన్ మహిళగా ఘనత సాధించారు. ఏప్రిల్ 29న అమియన్స్ స్పోర్టింగ్ క్లబ్, రేసింగ్ క్లబ్ స్ట్రాస్‌బర్స్ జట్ల మధ్య జరిగిన ఫ్రెంచ్ లీగ్ ఫస్ట్ డివిజన్ మ్యాచ్‌లో ఆమె రిఫెరీగా మైదానంలో ఆటగాళ్లతో పాటు పరిగెడుతూ నిర్ణయాధికారం చెలాయించారు. ఫలితం తేలకుండా(0–0) ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండు టీమ్‌లకు చెందిన ఇద్దరు ఆటగాళ్లను స్టెఫాని హెచ్చరించారు. ఇద్దరు స్ట్రాస్‌బర్స్ ఆటగాళ్లకు ఎల్లో కార్డులు చూపించారు.
35 ఏళ్ల స్టెఫాని ఇప్పటికే సెకండ్ డివిజన్ మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించారు. జూన్–జూలైలో జరగనున్న మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మ్యాచ్ రిఫెరీగా ఉండనున్నారు. ‘‘నా కష్టానికి తగిన గుర్తింపు లభించింది. పురుషుల లీగ్ –1 మ్యాచ్‌కు రిఫెరీగా ఉండే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మహిళ అన్న ఒక్క కారణంతోనే నాకు ఈ అవకాశం ఇచ్చారని అనుకోవడం లేద’ని స్టెఫాని అన్నారు. లీగ్ –1 మ్యాచ్‌కు స్టెఫానిని రిఫెరీగా నియమించడం పట్ల ఫుట్‌బాల్ అభిమానులు, ఫెమినిస్టులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. మరింతమంది మహిళలు ఈ రంగంలోకి రావడానికి స్టెఫాని స్ఫూర్తిగా నిలిచారని కితాబిస్తున్నారు.
తనకు అప్పగించిన బాధ్యతలను స్టెఫాని సమర్థవంతంగా నిర్వహించారని, ఆమె ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొనలేదని రేసింగ్ క్లబ్ స్ట్రాస్‌బర్స్ టీమ్ మేనేజర్ థీరి లారే కొనియాడారు. లీగ్ –1 మ్యాచ్‌కు రిఫెరీ వ్యవహరించడానికి స్టెఫానికి అన్ని అర్హతలు ఉన్నాయని, ఆమె పనితీరు చాలా బాగుందని అభినందించారు. పురుషుల ఫుట్‌బాల్ మ్యాచ్‌లో రిఫెరీగా వ్యవహరించిన తొలి మహిళ రికార్డు జర్మనీకి చెందిన బిబియనా స్టీన్‌హాస్ పేరిట ఉంది. 2017లో హెర్తా బెర్లిన్, వెర్డర్ బ్రెమెన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ద్వారా ఆమె ఈ ఘనత దక్కించుకున్నారు. బిబియనా బాటలో స్టెఫాని కూడా నడిచి పురుషుల మ్యాచ్‌లో మెయిన్ రెఫరీగా వ్యవహరించిన తొలి ఫ్రెంచ్ మహిళగా ఖ్యాతికెక్కారు. మనదేశ పురుషుల క్రీడల్లోనూ మహిళలకు నిర్ణయాధికారం దక్కడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు.
- పోడూరి నాగ శ్రీనివాసరావు
సాక్షి వెబ్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment