referee
-
వరల్డ్‌కప్‌కు అంపైర్ల జాబితాను ప్రకటించిన ఐసీసీ.. భారత్ నుంచి ఒక్కడే
అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానున్న వన్డే వరల్డ్‌కప్ కోసం 16 మంది అంపైర్ల జాబితాను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్ 25) ప్రకటించింది. మెగా టోర్నీ కోసం నలుగురు రిఫరీల లిస్ట్‌ను కూడా ఐసీసీ ఇవాళే రిలీజ్ చేసింది. అంపైర్ల జాబితాలో భారత్ నుంచి నితిన్ మీనన్ ఒక్కడికే ప్రాతినిథ్యం లభించగా.. రిఫరీల్లో సైతం భారత్ నుంచి జవగల్ శ్రీనాథ్ ఒక్కడికే అవకాశం దక్కింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్-గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 5న జరిగే టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్‌కు భారత అంపైర్ నితిన్ మీనన్, శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార ధర్మసేన ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తారని ఐసీసీ పేర్కొంది. అక్టోబర్ 14న జరిగే భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు అంపైర్లు, రిఫరీల వివరాలను సైతం ఐసీసీ ఇవాళే వెల్లడించింది. ఈ మ్యాచ్‌కు రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, మరియాస్ ఎరాస్మస్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనుండగా.. రిచర్డ్ కెటిల్‌బోరో థర్డ్ అంపైర్‌గా, ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా ఉంటారు. అంపైర్ల వివరాలు.. క్రిస్ బ్రౌన్ (న్యూజిలాండ్) కుమార ధర్మసేన (శ్రీలంక) మరియాస్ ఎరాస్మస్ (సౌతాఫ్రికా) క్రిస్టోఫర్ గఫ్ఫానీ (న్యూజిలాండ్) మైఖేల్ గాఫ్ (ఇంగ్లండ్) అడ్రియన్ హోల్డ్‌స్టాక్ (సౌతాఫ్రికా) రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లండ్) రిచర్డ్ కెటిల్‌బోరో (ఇంగ్లండ్) నితిన్ మీనన్ (ఇండియా) ఎహసాన్ రజా (పాకిస్తాన్) పాల్ రీఫిల్ (ఆస్ట్రేలియా) షర్ఫుద్దౌలా ఇబ్నే షహీద్ (బంగ్లాదేశ్) రాడ్నీ టక్కర్ (ఆస్ట్రేలియా) అలెక్స్ వార్ఫ్ (ఇంగ్లండ్) జోయెల్ విల్సన్ (వెస్టిండీస్) పాల్ విల్సన్ (ఆస్ట్రేలియా) రిఫరీల జాబితా.. జెఫ్ క్రో (న్యూజిలాండ్) ఆండీ పైక్రాఫ్ట్ (జింబాబ్వే) రిచీ రిచర్డ్సన్ (వెస్టిండీస్) జవగల్ శ్రీనాథ్ (ఇండియా) -
కబడ్డీ... కబడ్డీ...
‘కబడ్డీ.. కబడ్డీ’.. అని కూత పెట్టే ఆటగాళ్లు పాయింట్ కోసం బరిలో దిగుతారు. వేగం, ఒడుపు ఉండే ఆ ఆటలో తప్పొప్పులను ఎంచే రిఫరీ పని చాలా కష్టమైనది. నేడు ప్రో కబడ్డీ లీగ్‌లో పని చేస్తున్న పది మంది మహిళా రిఫరీలలో సంధ్య అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా, గృహిణిగా, తల్లిగా ఉంటూనే ఆమె కబడ్డీ రిఫరీగా ఆ ఉపాధి పట్ల యువతులకు కుతూహలం రేపుతోంది. కూత ఆపకూడదు. ప్రత్యర్థి శిబిరానికి చిక్క కూడదు. ఒకరినో ఇద్దరినో చిరుతలా తాకి సొంత శిబిరానికి చేరుకోవాలి. కబడ్డీ అసలు సిసలు భారతీయ పల్లె క్రీడ. ప్రధానంగా పురుష క్రీడ. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ ఆట ఆ తర్వాత క్రికెట్ దెబ్బకు చతికిల పడింది. తిరిగి కార్పొరేట్ అవసరాల కొద్దీ ప్రాణం పోసుకుంది. ఇసుక మైదానాల నుంచి ఖరీదైన ఇండోర్ స్టేడియంలలోకి, లైవ్ టెలికాస్ట్లలోకి, స్పాన్సరర్ల పూనికలోకి మారిన ఈ ఆట నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులను అలరిస్తోంది. అందుకు కొత్త కొత్త మార్గాలను అవలంబిస్తోంది. 2014లో ‘ప్రో కబడ్డీ లీగ్’ మొదలైతే 2018 నుంచి మహిళా రిఫరీలను కూడా ఈ ఆటలో ఉపయోగిస్తున్నారు. అందుకు సాగిన సెలక్షన్లలో తమిళనాడు వెల్లూరు నుంచి ఎంపికైన రిఫరీయే ఎంకె. సంధ్య. సీజన్ 6తో మొదలయ్యి ప్రస్తుతం బెంగళూరులో డిసెంబర్ 22 నుంచి సాగుతున్న సీజన్ 8లో కూడా రిఫరీగా పని చేస్తున్న సంధ్య అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కబడ్డీ ప్లేయర్ ‘8వ తగతిలో ఉండగా మా స్కూల్ మైదానంలో కొంత మంది సీనియర్ అమ్మాయిలు కబడ్డీ ఆడటం చూశాను. నాకు ఆ ఆట నచ్చింది. అక్కా... నన్ను కూడా చేర్చుకోండి అని అడిగితే చిన్న పిల్లవు... వచ్చే సంవత్సరం టీమ్‌లోకి వద్దువులే అన్నారు. నేను వినలేదు. పీటీని అడిగి వెంటనే చేరిపోయాను’ అంటుంది సంధ్య. మరో ఇద్దరు అక్కచెల్లెళ్లు ఉన్న సంధ్య తాను మాత్రమే ఈ ఆటను ఎంచుకున్నందుకు ఎప్పుడూ నిరాశ పడలేదు. ఇంటర్లో చేరగానే సబ్ జూనియర్స్ నేషనల్ జట్టుకు ఆ తర్వాత జూనియర్స్ నేషనల్ జట్టుకు (2008) ఆడింది. ఆ తర్వాత కూడా ఆమె ఆట జోరుగా సాగేదేమో కాని జీవితం మారింది. ప్రేమ పెళ్లి సీనియర్ ఇంటర్లో ఉండగా సంధ్యకు కబడ్డీ క్రీడాకారుడు కాంతివరన్తో పరిచయమైంది. వెంటనే ప్రేమ ఆ వెంటనే పెళ్లి జరిగిపోయాయి. ‘మా పెళ్లి మా పెద్దలకు ఇష్టం లేదు. అందుకని మేము వెల్లూరు వదిలి చెన్నైకు వచ్చేశాము’ అంది సంధ్య. ఆ మరుసటి సంవత్సరమే ఆమెకు కొడుకు పుట్టాడు. జ్యూస్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న కాంతివరన్కు సంధ్య టాలెంట్ తెలుసు. ‘మళ్లీ నువ్వు కబడ్డీ ఆడు’ అని ఆమెతో చెప్పాడు. ఆమెను తీర్చిదిద్దే బాధ్యతను తీసుకున్నాడు. కాని వివాహం అయ్యి, బిడ్డకు జన్మనిచ్చాక తిరిగి పూర్వపు ఫిట్నెస్తో ఆడటం అంత సులభం కాదు. ‘మేమిద్దం చాలా కష్ట పడ్డాం. ఉదయం 5 నుంచి ఆరున్నర వరకూ కబడ్డీ ఆడేదాన్ని. తిరిగి నా భర్త సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్లీ ఆడేదాన్ని. అతను నా కోసం స్పెషల్ డైట్ కూడా ఫిక్స్ చేశాడు. కొత్తల్లో ఇదంతా చాలా కష్టంగా అనిపించేది. కాని పట్టుదలగా ఫిట్నెస్ సాధించి తిరిగి కబడ్డీ ప్లేయర్‌గా మారాను’ అంది సంధ్య. ఇప్పుడు సంధ్య దక్షిణ భారత మహిళ కబడ్డీ టీమ్‌లతో కలిసి కబడ్డీ ఆడటం మొదలెట్టింది. అంతే కాదు భర్త ప్రోత్సాహంతో డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, యోగాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా చేసింది. 2015 వరకూ మహిళా కబడ్డీ ప్లేయర్‌గా ఉన్న సంధ్య వెల్లూరులో తల్లి అనారోగ్యం వల్ల కొంత, పిల్లాణ్ణి ఒక్కణ్ణే వదిలేసి టోర్నమెంట్లకు వెళ్లే వీలు లేక కొంత కబడ్డీ ఆటకు దూరమైంది. తిరిగి ఆ దంపతులు వెల్లూరు చేరుకున్నారు. పిఈటీగా... వెల్లూరులో స్ప్రింగ్ డేస్ స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా చేరింది సంధ్య. వెల్లూరులో పని వెతుక్కున్న భర్త ‘కబడ్డీ రిఫరీలకు డిమాండ్ ఉంది. ఆ పరీక్షలు రాయి’ అని ప్రోత్సహించాడు. సంధ్య ‘అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ నిర్వహించే రిఫరీ పరీక్షను రాసి పాసైంది. ఆ వెంటనే ఆమెకు డిస్ట్రిక్ లెవల్, ఇంటర్ జోన్ మేచ్లకు రిఫరీగా ఉండే అవకాశాలు రావడం మొదలయ్యింది. స్కూల్లో పని చేస్తూనే, కొడుకు ఆలనా పాలనా చూసుకుంటూనే, మేచ్ ఉన్నప్పుడు రిఫరీగా బయలుదేరి వెళుతోంది సంధ్య. ప్రొ కబడ్డీ లీగ్ రిఫరీగా ప్రో కబడ్డీ లీగ్ మేచెస్ కోసం మహిళా రిఫరీల సెలక్షన్స్ జరుగుతున్నాయని తెలిసి వాటిలో పాల్గొని ఎంపికైంది సంధ్య. ఇది పెద్ద విజయమే. ఎందుకంటే ప్రో కబడ్డీ లీగ్ మేచెస్ చాలా ప్రొఫెషనల్‌గా సాగుతాయి. స్పాన్సర్‌షిప్‌లతో ముడిపడిన వ్యవహారం. లైవ్ టెలికాస్ట్ ఉంటుంది కనుక రిఫరీలు తప్పులు చేయడానికి లేదు. ‘టోర్నమెంట్ సాగుతున్నన్ని రోజులు మేము ఉదయాన్నే మా ఫిట్నెస్ను నిరూపించుకోవాలి. ఆ తర్వాత ముందు రోజు ఆటను అవలోకించాలి. ఆ రోజు జరిగే ఆటను అంచనా వేయాలి. అప్పుడు మేము మేచ్‌కు రెడీ అవుతాం’ అంటుంది సంధ్య. ప్రతి మేచ్‌కు ఒక మెయిన్ రిఫరీ, ఇద్దరు అంపైర్లు, ఇద్దరు లైన్ రిఫరీలు, ఇద్దరు అసిస్టెంట్ రిఫరీలు ఉంటారు. మెయిన్ రిఫరీగా వీరిని అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది సంధ్యకు. ‘మేచ్లలో సిగ్నల్స్‌ను సాధన చేస్తాం మేము. అలాగే ఒక్కోసారి ఆటగాళ్లు పాయింట్స్ కోసం వాదనకు దిగుతారు. వారికి మా నిర్ణయం సరైనదే అని చెప్పాల్సి వస్తుంది. వారు ఆగ్రహంలో ఉంటారు. మేము స్థిమితంగా మాట్లాడాలి. మేము కూడా కోప్పడితే అంతా రసాభాస అవుతుంది’ అంటుంది సంధ్య. మారుతున్న కాలానికి మారుతున్న మహిళా క్రీడా ప్రతినిధి సంధ్య. -
హైదరాబాద్ వాసికి అంతర్జాతీయ గుర్తింపు
సాక్షి,మణికొండ( హైదరాబాద్): రెజ్లింగ్‌లో అంతర్జాతీయ రెఫరీగా నార్సింగి మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన శ్రీకాంత్‌యాదవ్ ఎంపికయ్యారు. గత వారం రోజులుగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న ఆయన సత్తా చాటడంతో ఆయనను ఎంపిక చేశారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పోటీలకు రెఫరీగా పనిచేసే అవకాశం లబించిందని ఆయన విలేకరులతో పేర్కొన్నారు. అంతర్జాతీయ రెఫరీయింగ్ డైరెక్టర్ దుర్గే, ఒలంపిక్ రిఫరీ అశోక్‌ల చేతుల మీదుగా ఆయన తన అంతర్జాతీయ రెఫరీ దృవపత్రాన్ని అందుకున్నానని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు రెజ్లింగ్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసే అవకాశం మాత్రమే ఉండేదని, తన ఎంపికతో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసి అవకాశం లభించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: వరద బాధితులను రక్షిస్తూ.. ఆశల దీపం ఆరిపోయింది -
కరోనా కాటుకు మాజీ క్రికెటర్ బలి
న్యూఢిల్లీ: సౌరాష్ట్ర మాజీ క్రికెటర్, బీసీసీఐ రిఫరీ రాజేంద్రసిన్హ్ జడేజా(66) కరోనా కాటుకు బలయ్యారు. ఆదివారం ఉదయం ఆయన మహమ్మారితో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు.ఈ విషయాన్ని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ధృవీకరించింది. క్రికెటర్‌గా, కోచ్‌గా, రిఫరీగా వివిధ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించిన జడేజా మృతి చెందడం బాధకరమని, అతని మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. పాతతరం క్రికెటర్లలో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా పేరు గాంచిన జడేజా.. 1974-1987 మధ్యకాలంలో 50 ఫస్ట్క్లాస్మ్యాచ్లు, 11 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 1640 పరుగులతో పాటు 145 వికెట్లు పడగొట్టాడు. అనంతరం కొంతకాలం పాటు సౌరాష్ట్ర కోచ్‌గా, మేనేజర్‌గా, సెలెక్టర్‌గా విధులు నిర్వర్తించిన జడేజా.. బీసీసీఐ అధికారిక రిఫరీగా కూడా వ్యవహరించాడు. 53 ఫస్ట్క్లాస్మ్యాచ్లు, 18 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 34 టీ20 మ్యాచ్‌లకు అతను మ్యాచ్ రిఫరీగా పని చేశారు. జడేజా మృతి పట్ల బీసీసీఐ మాజీ కార్యదర్శి నిరంజన్ షా, ప్రస్తుత సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జైదేవ్ షా సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: ప్రముఖ నటితో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడి ప్రేమాయణం..? -
శ్రీనాథ్‌కు రూ. 52 లక్షలు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా పలువురు యువ ఆటగాళ్లు వెలుగులోకి రావడంతో పాటు ఆర్థికపరంగా కూడా వారికి మంచి స్థాయి లభించింది. ఇదే తరహాలో లీగ్‌తో భాగస్వామ్యం ఉన్న అనేక మందికి ఐపీఎల్ ద్వారా పెద్ద మొత్తాలు దక్కాయి. ఇందులో అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు కూడా ఉన్నారు. 2019 ఐపీఎల్లో ఎనిమిది మంది భారత అంపైర్లకు చేసిన చెల్లింపుల వివరాలను బీసీసీఐ వెల్లడించింది. ఈ జాబితాలో మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ కూడా ఉన్నారు. శ్రీనాథ్‌కు ఈ సీజన్ కోసం 52 లక్షల 45 వేల 128 రూపాయలు లభించాయి. శ్రీనాథ్‌తో సరిగ్గా సమానంగా అంపైర్ నితిన్ మీనన్‌కు కూడా 52 లక్షల 45 వేల 128 రూపాయలు లభించడం విశేషం. ఎస్. రవి రూ. 42.46 లక్షలు, మను నాయర్ రూ. 41.96 లక్షలు, షంషుద్దీన్ రూ. 41.00 లక్షలు... అనిల్ దండేకర్, యశ్వంత్ బెర్డే, నారాయణన్ కుట్టి తలా రూ.32.96 లక్షలు, నందన్ రూ. 37.04 లక్షలు అందుకున్నారు. -
ఆట ఆడిస్తున్నారు!
అన్నింట్లో సగం అంటారు కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు విరుద్ధం. సగ భాగం కాదు కదా కనీసం కాలు మోపడానికి కూడా చోటు ఇవ్వడం లేదు. అవకాశాల్లోనే కాదు ఆటల్లోనూ ఆడవాళ్లపై వివక్ష కొనసాగుతోంది. ప్రతి క్రీడలోనూ మహిళల ప్రవేశానికే ఏళ్లకు ఏళ్లు పట్టింది. కొన్నిట్లో అయితే ఇప్పటికీ మహిళలకు ఎంట్రీ లేదు. అలాంటి సరిహద్దులను దాటి ఇద్దరు మహిళామణులు పురుషుల ఆటల్లో నిర్ణయాధికారం చెలాయించే సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ఇక ’మేము చెప్పినట్టు కూడా వినండి’ అంటూ నినదిస్తూ ఆడటమే కాదు ఆడించడమూ తెలుసంటున్నారు. ‘‘నా జీవితంలో ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు’’.. పురుషుల క్రికెట్ మ్యాచ్‌లో అంపైరింగ్ చేసిన తర్వాత క్లయిర్ పొలొసాక్ స్పందన ఇది. ఆస్ట్రేలియాకు చెందిన ఆమె పురుషుల అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. ఏప్రిల్ 27న నమీబియా, ఒమన్ పురుషుల క్రికెట్ జట్ల మధ్య జరిగిన ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్–2 ఫైనల్ మ్యాచ్ తర్వాత హాయిగా నిద్రపోయినట్టు క్లయిర్ చెప్పారు. తన అంపైరింగ్ పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ మాట అన్నారామె. ఈ మ్యాచ్‌కే ఆమె అంపైర్ గా వ్యవహరించి సరికొత్త చరిత్రకు మైలురాయిలా నిలిచారు. ‘‘మైదానంలో ఒక్కోసారి ఆటగాళ్ల భావోద్వేగాలు అదుపు తప్పుతుంటాయి. సంయమనంతో వ్యవహరించి సర్దిచెప్పాల్సిన బాధ్యత అంపైర్లపై ఉంటుంది. కానీ నేను అంపైరింగ్ చేసిన పురుషుల మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లో అందరూ బాగా సహకరించారు. ఆటగాళ్ల ప్రవర్తనతో నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఎల్బీడబ్ల్యూ ఔట్ల కోసం బౌలర్లు బాగా ఒత్తిడి చేస్తుంటారు. కచ్చితంగా ఔట్ అని నమ్మితేనే ఔట్ ఇస్తా. ఈ రోజు మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాను’’అని క్లయిర్ సంతోషం వ్యక్తం చేశారు. పురుషుల మ్యాచ్‌కు అంపైరింగ్ చేయడం ఆమెకు ఇదే మొదటిసారి కాదు. 31 ఏళ్ల క్లయిర్ పేరిట మరో రికార్డు కూడా ఉంది. దేశవాళీల్లోనూ పురుషుల క్రికెట్ మ్యాచ్‌కు అంపైరింగ్ చేసిన తొలి మహిళగా రెండేళ్ల క్రితమే ఆమె గుర్తింపు పొందారు. 2017లో ఆస్ట్రేలియాలో లిస్ట్ ’ఎ’ మ్యాచ్‌లో అంపైర్‌గా వ్యవహరించి ఈ రికార్డు తన పేరిట లిఖించుకున్నారు. మహిళా క్రికెట్లోనూ తనదైన ముద్ర వేసిన క్లెయిర్ గత రెండున్నరేళ్లలో 15 వన్డే మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశారు. 2017 ప్రపంచకప్ మ్యాచ్‌లు, 2018 టి20 వరల్డ్‌కప్ సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లు ఆమె అంపైరింగ్ చేసిన వాటిలో ఉన్నాయి. ‘డబుల్’ రికార్డులోనూ భాగస్వామ్యం! ఆస్ట్రేలియా గడ్డపై ఇద్దరు మహిళలు ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించిన చరిత్రాత్మక సందర్భంలోనూ క్లయిర్ పొలొసాక్ భాగస్వామిగా ఉన్నారు. తన దేశానికే చెందిన మరో అంపైర్ ఎలోసి షెరిడాన్‌తో కలిసి 2018 డిసెంబర్ 23న ఈ ఘనత సాధించారు. మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా అడిలైడ్ స్ట్రయికర్స్, మెల్బోర్న్ స్టార్ జట్ల మధ్య అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ అంపైరింగ్ చేసి ఔరా! అనిపించారు. ‘‘ఇది మరో చారిత్రక ఘట్టం. ఆస్ట్రేలియా క్రికెట్లో మహిళలు, బాలికలను ప్రోత్సహించే దిశగా ఇలాంటి ప్రయత్నాలు కొనసాగుతుండాలి. క్లయిర్, షెరిడాన్ ఎంతో కష్టపడి స్వశక్తితో అగ్రశ్రేణి మహిళా అంపైర్లుగా ఎదిగారు. వారు మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా’’ అని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో కెవిన్ రాబర్ట్స్ ఆకాంక్షించారు. సాహోరే.. స్టెఫాని! క్లయిర్ పొలొసాక్ సరికొత్త చరిత్ర సృష్టించిన మరుసటి రోజే ఐరోపాలో స్టెఫాని ఫ్రాపర్ట్ పతాక శీర్షికలకు ఎక్కారు. పురుషుల ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ప్రధాన రెఫరీగా వ్యవహరించిన రెండో యూరోపియన్ మహిళగా ఘనత సాధించారు. ఏప్రిల్ 29న అమియన్స్ స్పోర్టింగ్ క్లబ్, రేసింగ్ క్లబ్ స్ట్రాస్బర్స్ జట్ల మధ్య జరిగిన ఫ్రెంచ్ లీగ్ ఫస్ట్ డివిజన్ మ్యాచ్‌లో ఆమె రిఫెరీగా మైదానంలో ఆటగాళ్లతో పాటు పరిగెడుతూ నిర్ణయాధికారం చెలాయించారు. ఫలితం తేలకుండా(0–0) ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండు టీమ్‌లకు చెందిన ఇద్దరు ఆటగాళ్లను స్టెఫాని హెచ్చరించారు. ఇద్దరు స్ట్రాస్బర్స్ ఆటగాళ్లకు ఎల్లో కార్డులు చూపించారు. 35 ఏళ్ల స్టెఫాని ఇప్పటికే సెకండ్ డివిజన్ మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించారు. జూన్–జూలైలో జరగనున్న మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మ్యాచ్ రిఫెరీగా ఉండనున్నారు. ‘‘నా కష్టానికి తగిన గుర్తింపు లభించింది. పురుషుల లీగ్ –1 మ్యాచ్‌కు రిఫెరీగా ఉండే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మహిళ అన్న ఒక్క కారణంతోనే నాకు ఈ అవకాశం ఇచ్చారని అనుకోవడం లేద’ని స్టెఫాని అన్నారు. లీగ్ –1 మ్యాచ్‌కు స్టెఫానిని రిఫెరీగా నియమించడం పట్ల ఫుట్‌బాల్ అభిమానులు, ఫెమినిస్టులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. మరింతమంది మహిళలు ఈ రంగంలోకి రావడానికి స్టెఫాని స్ఫూర్తిగా నిలిచారని కితాబిస్తున్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను స్టెఫాని సమర్థవంతంగా నిర్వహించారని, ఆమె ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొనలేదని రేసింగ్ క్లబ్ స్ట్రాస్బర్స్ టీమ్ మేనేజర్ థీరి లారే కొనియాడారు. లీగ్ –1 మ్యాచ్‌కు రిఫెరీ వ్యవహరించడానికి స్టెఫానికి అన్ని అర్హతలు ఉన్నాయని, ఆమె పనితీరు చాలా బాగుందని అభినందించారు. పురుషుల ఫుట్‌బాల్ మ్యాచ్‌లో రిఫెరీగా వ్యవహరించిన తొలి మహిళ రికార్డు జర్మనీకి చెందిన బిబియనా స్టీన్హాస్ పేరిట ఉంది. 2017లో హెర్తా బెర్లిన్, వెర్డర్ బ్రెమెన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ద్వారా ఆమె ఈ ఘనత దక్కించుకున్నారు. బిబియనా బాటలో స్టెఫాని కూడా నడిచి పురుషుల మ్యాచ్‌లో మెయిన్ రెఫరీగా వ్యవహరించిన తొలి ఫ్రెంచ్ మహిళగా ఖ్యాతికెక్కారు. మనదేశ పురుషుల క్రీడల్లోనూ మహిళలకు నిర్ణయాధికారం దక్కడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. - పోడూరి నాగ శ్రీనివాసరావు సాక్షి వెబ్ డెస్క్ -
మ్యాచ్ రిఫరీగా క్రిస్ బ్రాడ్ ‘ట్రిపుల్ సెంచరీ’...
భారత్–వెస్టిండీస్ మధ్య మూడో వన్డేతో రిఫరీ క్రిస్ బ్రాడ్ అరుదైన రికార్డు అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఎలైట్ ప్యానెల్ రిఫరీ అయిన బ్రాడ్... 300 వన్డేలకు రిఫరీగా వ్యవహరించిన రెండో వ్యక్తిగా నిలిచారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు క్రిస్ బ్రాడ్‌కు భారత కెప్టెన్ కోహ్లి జ్ఞాపిక అందజేశాడు. ఇంగ్లండ్‌కు చెందిన క్రిస్ బ్రాడ్ 2004లో ఆక్లాండ్‌లో జరిగిన మ్యాచ్‌కు తొలిసారి రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన కంటే ముందు రంజన్ మధుగలె (శ్రీలంక–336 మ్యాచ్‌లు) అత్యధిక మ్యాచ్‌లకు రిఫరీగా ఉన్నారు. -
రిఫరీగా లిమ్మేష్‌కుమార్
కవిటి(ఇచ్ఛాపురం): మండలంలోని పెద్దమెళియాపుట్టుగ జెడ్పీ ఉన్నత పాఠశాల పీఈటీ లిమ్మేష్‌కుమార్ పండా ఈ నెల ఎనిమిది నుంచి 12వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రం బెల్లంపల్లిలో జరగనున్న 62వ జూనియర్స్ జాతీయస్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీలకు రిఫరీగా ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయన సమాచారం వచ్చింది. పలుమార్లు రిఫరీగా ఎంపికైన తనకు మరోసారి అవకాశం లభించడంపై కవిటి పంచాయతీ సర్పంచ్ పాండవ చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. -
జాతీయ తైక్వాండో రెఫరీలుగా జిల్లా క్రీడాకారులు
కల్లూరు: జాతీయ తైక్వాండో రెఫరీలుగా జిల్లా క్రీడాకారులు దాదాబాషా (ఆదోని), ఎంబి రాముబాబు (నందికొట్కూరు), డిఎం బిలాల్ నూర్‌బాషా (నంద్యాల), ఓబులేసు (ఆళ్లగడ్డ) ఎంపికయ్యారు. విశాఖపట్నం ఏయూ జిమ్నాజియం ఇండోర్ స్టేడియంలో ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు జాతీయ స్థాయి తైక్వాండో సెమినార్ జరిగింది. ఈ సెమీనార్‌లో జిల్లా క్రీడాకారులు పాల్గొని ఉత్తమ ప్రతిభతో జాతీయ స్థాయి రెఫరీలుగా అర్హత సాధించారు. వీరిని తైక్వాండో సంఘం జిల్లా అధ్యక్షకార్యదర్శులు డీఎం గౌస్, శోభన్‌బాబు.. సోమవారం అభినందించారు. -
రిఫరీని కాల్చిచంపిన ప్లేయర్!
అర్జెంటీనా: ఓ ఫుట్ బాల్ మ్యాచ్ లో విషాదం చోటు చేసుకుంది. కార్బోడాలో ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా ఆగ్రహానికి గురైన యువ ఆటగాడు రిఫరీని కాల్చిచంపిన ఘటన కలకలం సృష్టించింది. సదరు ఆటగాడికి మ్యాచ్ రిఫరీ సీజర్ ఫ్లోర్స్ రెడ్ కార్డ్ చూపించడమే విషాదానికి కారణమైంది. రిఫరీ రెడ్ కార్డు చూపించడంతో తన కోపాన్ని ఆపుకోలేకపోయిన సదరు ఆటగాడు తన బ్యాగ్‌లో ఉన్న గన్ను తీసుకొని వచ్చి కాల్పులు జరిపాడు. వరుసగా మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో రిఫీర్ సీజర్ అక్కడిక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. తొలుత తలపై, ఆ తరువాత ఛాతీ మీద, మెడపైన కాల్పులు జరిపినట్లు వారు పేర్కొన్నారు. అయితే ఈ ఘటన జరుగుతున్నప్పుడు ఆపడానికి యత్నించిన మరో ఆటగాడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన ఆటగాడి కోసం అర్జెంటీనా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గత కొంతకాలంగా ఈ తరహా హింసాత్మకం ఘటనలు అర్జెంటీనా ఫుట్ బాల్ లో చోటు చేసుకోవడంతో అక్కడ ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది జూన్ లో ఎల్లో కార్డు చూపినందుకు రిఫరీపై ఇద్దరు ఆటగాళ్లు పిడిగుద్దులు కురిపించారు. దీంతో ఆ రిఫరీ స్పృహ కోల్పోవడం అప్పట్లో కలకలం రేపింది. -
గన్‌తో మైదానంలోకొచ్చిన రెఫరీ
బ్రెజిల్: ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతుండగా రెఫరీ మైదానంలోకి గన్ తీసుకు రావడం కలకలం సృష్టించింది. బ్రెజీలియన్ ఫుట్ బాల్ మ్యాచ్ లో చెలరేగిన గొడవ కాస్తా.. రెఫరీ మైదానంలోకి గన్ తీసుకు వచ్చే వరకు వెళ్లింది. ఈ సంఘటన బ్రెజిల్లో బెలో హోరిజెంటో సమీపంలోని బ్రుమాండినోలో చోటుచేసుకుంది. బ్రుమాండినో ఫుట్ బాల్ జట్టు అమాంటెస్ డ బోలా జట్టుతో తలపడుతుండగా ఈ ఘటన జరిగింది. ఫుట్ బాల్ మ్యాచ్‌లో భాగంగా ప్రత్యర్థి జట్టు ఆటగాడికి రెడ్ కార్డు జారీ చేయాలని ఆటగాళ్లు రెఫరీని డిమాండ్ చేశారు. అందుకు నిరాకరించిన రెఫరీపై ఆటగాళ్లు చేయిచేసుకున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన రెఫరీ చేంజింగ్ రూంకి వెళ్లి మైదానానికి గన్ను తీసుకు వచ్చాడు. ఇలా ప్రవర్తించినందుకు గాబ్రీ మూర్తా క్రమశిక్షణా చర్యలు ఎదుర్కోనున్నాడు. 'అమాంటెస్ డ బోలా జట్టు సభ్యులు మూర్తాని కాలితో తన్ని, చెంపపై కొట్టడం వల్లే అలా చేశాడు' అని లీగ్ ప్రెసిడెంట్ వాల్దెనిర్ తెలిపారు. 'తనని తాను కాపాడుకోవడం కోసమే గన్ను తీసుకొచ్చాడు' అని రెఫీరీస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొజోనో, రెఫరీ మూర్తాను వెనకేసుకోచ్చాడు. -
అడగండి చెబుతాం...
హాకీలో ఆటగాళ్లకు శిక్ష విధించే గ్రీన్, ఎల్లో, రెడ్ కార్డులను ఎప్పుడు వాడతారు? ప్రశ్న అడిగిన వారు: స్వరూప్ కుమార్, నెల్లూరు సాధారణంగా హాకీ మైదానంలో ఆటగాళ్లు క్రమశిక్షణ తప్పకుండా అదుపులో ఉంచేందుకు రిఫరీలు ఈ కార్డులను ఉపయోగించి హెచ్చరిస్తారు. ఇందులో అన్నింటికంటే తక్కువ రకమైన శిక్షగా గ్రీన్ కార్డును చెప్పవచ్చు. మైదానంలో ప్రత్యర్థి ఆటగాడిని ఆపే ప్రయత్నంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు భావిస్తే దీంతో హెచ్చరిస్తారు. గ్రీన్ కార్డు చూసిస్తే ఆటగాడు రెండు నిమిషాల పాటు మైదానం వీడాల్సి ఉంటుంది. ఆ తర్వాతి స్థాయిలో ఎల్లో కార్డ్‌ను జారీ చేస్తారు. ప్రత్యర్థి పట్ల దురుసుగా ప్రవర్తించడం, స్టిక్‌తో కాకుండా శరీరంతో అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఎల్లో కార్డు చూపించి ఆటగాడిని బయటికి పంపిస్తారు. ఇందులో కనీసం 5 నిమిషాల పాటు మైదానం వీడాలి. అంతకంటే ఎక్కువ సమయం కూడా శిక్షించవచ్చు. రెడ్ కార్డు అన్నింటిలోకి పెద్ద శిక్ష. ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి ఆటగాడిపై శారీరకంగా దాడి చేసేందుకు ప్రయత్నించడం, రక్తమోడటంలాంటిది ఏదైనా జరిగితే రెడ్ కార్డు చూపిస్తారు. రెడ్ కార్డు శిక్షకు గురైతే చూపిస్తే ఆ మ్యాచ్ మొత్తంలో అతను ఆడటానికి వీలుండదు. దాంతో పాటు తర్వాతి మ్యాచ్ కూడా ఆడకుండా నిషేధం విధిస్తారు. అయితే శిక్షల్లో స్థాయి భేదాలు అంతా రిఫరీ నిర్ణయంపైనే ఆధార పడి ఉంటుంది. ఏ కార్డు ద్వారానైనా ఆటగాడు బయటికి వెళితే మిగతా 10 మంది సభ్యులతోనే సదరు జట్టు మ్యాచ్‌ను ఆడాల్సి ఉంటుంది. ఇది ఆ మ్యాచ్ ఫలితంపై కూడా ప్రభావం చూపవచ్చు.