రిఫరీని కాల్చిచంపిన ప్లేయర్!
అర్జెంటీనా: ఓ ఫుట్ బాల్ మ్యాచ్ లో విషాదం చోటు చేసుకుంది. కార్బోడాలో ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా ఆగ్రహానికి గురైన యువ ఆటగాడు రిఫరీని కాల్చిచంపిన ఘటన కలకలం సృష్టించింది. సదరు ఆటగాడికి మ్యాచ్ రిఫరీ సీజర్ ఫ్లోర్స్ రెడ్ కార్డ్ చూపించడమే విషాదానికి కారణమైంది. రిఫరీ రెడ్ కార్డు చూపించడంతో తన కోపాన్ని ఆపుకోలేకపోయిన సదరు ఆటగాడు తన బ్యాగ్లో ఉన్న గన్ను తీసుకొని వచ్చి కాల్పులు జరిపాడు.
వరుసగా మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో రిఫీర్ సీజర్ అక్కడిక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. తొలుత తలపై, ఆ తరువాత ఛాతీ మీద, మెడపైన కాల్పులు జరిపినట్లు వారు పేర్కొన్నారు. అయితే ఈ ఘటన జరుగుతున్నప్పుడు ఆపడానికి యత్నించిన మరో ఆటగాడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన ఆటగాడి కోసం అర్జెంటీనా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
గత కొంతకాలంగా ఈ తరహా హింసాత్మకం ఘటనలు అర్జెంటీనా ఫుట్ బాల్ లో చోటు చేసుకోవడంతో అక్కడ ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది జూన్ లో ఎల్లో కార్డు చూపినందుకు రిఫరీపై ఇద్దరు ఆటగాళ్లు పిడిగుద్దులు కురిపించారు. దీంతో ఆ రిఫరీ స్పృహ కోల్పోవడం అప్పట్లో కలకలం రేపింది.