దాదాపు దశాబ్ద కాలానికి పైగా ఫుట్‌బాల్ ప్రపంచంలో మకుటం లేని మహారాజులుగా వెలుగొందుతున్నారు పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo)- అర్జెంటీనా లెజెండ్ లియోనల్ మెస్సీ(Lionel Messi). అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకునే ఈ ఇద్దరికీ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అయితే, ఈ వీళ్లిద్దరిలో ఎవరు గొప్ప అన్న చర్చ ఎప్పుడూ ఆసక్తికరమే.
ఈ విషయంపై రొనాల్డో స్వయంగా స్పందించాడు. చాలా మంది మెస్సీకే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(GOAT) బిరుదు ఇచ్చేందుకు మొగ్గుచూపవచ్చని అభిప్రాయపడ్డాడు. అయితే, తాను మాత్రం పరిపూర్ణ ఫుట్‌బాలర్‌ని అని పేర్కొన్న రొనాల్డో.. ఫుట్‌బాల్ చరిత్రలో తన కంటే గొప్ప ఆటగాడు లేడని అనడం విశేషం.
నేనే ‘కంప్లీట్ ప్లేయర్’
స్పానిష్ మీడియా అవుట్‌లెట్ లాసెక్టా టీవీకి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిస్టియానో రొనాల్డో మాట్లాడుతూ.. ‘‘నాలాగా ప్రపంచంలో పరిపూర్ణమైన ఫుట్‌బాలర్ మరెవరూ లేరని అనుకుంటా. ఇప్పటి వరకు ఉన్న ఫుట్‌బాల్ ఆటగాళ్లందరిలో నేనే ‘కంప్లీట్ ప్లేయర్’. నేను అన్ని రకాలుగా ఫుట్‌బాల్ ఆడగలను. చాలా మంది మెస్సీ, మారడోనా లేదంటే.. పీలే పేరు చెప్తారేమో!
చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడిని
వాళ్ల అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. ఏదేమైనా మోస్ట్ కంప్లీట్ ప్లేయర్ మాత్రం నేనే! ఫుట్‌బాల్ చరిత్రలోనే నేను అత్యుత్తమ ఆటగాడిని. నా కంటే మెరుగ్గా ఆడే ఫుట్‌బాలర్‌ను ఇంత వరకూ చూడలేదు. ఇవి నా మనస్ఫూర్తిగా చెబుతున్న మాటలు’’ అని పేర్కొన్నాడు.
అదే విధంగా మెస్సీతో తన అనుబంధం గురించి చెబుతూ.. ‘‘మెస్సీతో నాకు ఎప్పుడూ ఎలాంటి సమస్యా లేదు. గత పదిహేనేళ్లుగా మేము అవార్డులు పంచుకుంటున్నాం. మా మాధ్య ఎలాంటి గొడవలు లేవు. అంతా సవ్యంగానే ఉంది.
తనకోసం నేను ఆంగ్లాన్ని తర్జుమా చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో భలే సరదాగా ఉండేవాళ్లం. ఇక ఆటగాళ్లుగా మేము ప్రత్యర్థులమే కదా. తను తన క్లబ్‌కి, నేను నా క్లబ్‌కి మద్దతుగా ఉంటాం. జాతీయ జట్ల విషయంలోనూ అంతే.
అయితే, ఆటతీరు ఎలా ఉందన్న అంశంపై పరస్పరం చర్చించుకుంటూ.. ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాం. మా మధ్య ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన పోటీయే ఉంటుంది’’ అని రొనాల్డో తెలిపాడు.
కాగా 2002లో పోర్చుగీస్ క్లబ్ స్పోర్టింగ్ జీపీ తరఫున ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా ఎంట్రీ ఇచ్చిన రొనాల్డో.. క్లబ్, అంతర్జాతీయ స్థాయిలో కలిపి ఓవరాల్‌గా 923 గోల్స్‌తో టాప్ గోల్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో రికార్డులు సాధించిన రొనాల్డోకు ఫిఫా వరల్డ్‌కప్ మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోయింది.
648 మిలియన్ల మంది ఫాలోవర్లు
అయితే, ఈ విషయంలో మెస్సీదే పైచేయి. కెప్టెన్‌గా అర్జెంటీనాకు ప్రపంచకప్ అందించిన ఘనత అతడికి దక్కింది. ఇక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఫాలోవర్ల విషయంలోనూ రొనాల్డో- మెస్సీ మధ్య పోటీ ఉంది. అయితే, ఇందులో పోర్చుగీస్ ఆటగాడిదే ఆధిపత్యం.
ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు రొనాల్డోకు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడికి ఏకంగా 648 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా.. మెస్సీకి 504 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
చదవండి: CT 2025: సమయం మించిపోలేదు.. అతడిని జట్టులోకి తీసుకోండి: అశ్విన్
Comments
Please login to add a commentAdd a comment