
భారత మహిళల ఫుట్‌బాల్ జట్టులో తెలంగాణ అమ్మాయి గుగులోత్ సౌమ్య చోటు
ఈనెల 20 నుంచి యూఏఈలో పింక్ లేడీస్ కప్ ఫుట్‌బాల్ టోర్నీ
టోర్నీ బరిలో భారత్, జోర్డాన్, కొరియా, రష్యా
న్యూఢిల్లీ: నాలుగు దేశాలు పాల్గొనే పింక్ లేడీస్ కప్ అంతర్జాతీయ మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంట్ కోసం భారత జట్టును ప్రకటించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాలో ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు ఈ టోర్నీ జరుగుతుంది. 23 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణ అమ్మాయి, నిజామాబాద్ జిల్లాకు చెందిన గుగులోత్ సౌమ్య చోటు సంపాదించింది.
ఈనెల 7 నుంచి అనంతపురంలో శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న భారత జట్టు నేడు యూఏఈకి బయలుదేరి వెళుతుంది. భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను ఈనెల 20న జోర్డాన్‌తో... రెండో మ్యాచ్‌ను 23న రష్యాతో... మూడో మ్యాచ్ 26న దక్షిణ కొరియా జట్టుతో ఆడుతుంది. ఈ ఏడాది మే–జూన్‌లలో జరిగే ఆసియా కప్–2027 క్వాలిఫయర్స్ టోర్నీకి సన్నాహాల్లో భాగంగా పింక్ లేడీస్ కప్‌లో భారత జట్టు బరిలోకి దిగుతోంది.
‘పింక్ లేడీస్ కప్ టోర్నీ ద్వారా భారత క్రీడాకారిణులకు తమ సామర్థ్యమేంటో తెలుస్తుంది. రష్యాతో పోలిస్తే దక్షిణ కొరియా జట్టు పూర్తి భిన్నంగా ఉంటుంది. రెండు జట్ల వీడియోలు పరిశీలించాను. రష్యా శైలితో పోలిస్తే కొరియా ఆటలో చాలా వేగం ఉంది. ఫలితంగా భారత జట్టు రెండు రకాలుగా వ్యూహాలు రచించి ఆడాల్సి ఉంటుంది’ అని భారత జట్టు హెడ్ కోచ్ క్రిస్‌పిన్ ఛెత్రి తెలిపాడు.
భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు: ఎలాంగ్‌బమ్ పంథోయ్ చాను, పాయల్ బసుదె, శ్రేయా హుడా (గోల్‌కీపర్లు), అరుణ బాగ్, కిరన్ పిస్దా, మార్టినా థోక్‌చోమ్, నిర్మలా దేవి ఫాన్‌జుబమ్, పూరి్ణమ కుమారి, సంజు, సిల్కీ దేవి హెమమ్, స్వీటీ దేవి ఎన్‌గాంగ్‌బమ్ (డిఫెండర్లు), బబీనా దేవి లిషామ్, గ్రేస్ డాంగ్‌మె, మౌసుమి ముర్ము, ప్రియదర్శిని సెల్లాదురై, ప్రియాంక దేవి నోరెమ్, రత్నబాల దేవి నోంగ్‌మైథెమ్ (మిడ్ ఫీల్డర్లు), కరిష్మా పురుషోత్తమ్, లిండా కోమ్ సెర్టో, మనీషా, రేణు, సంధ్య రంగనాథన్, సౌమ్య గుగులోత్ (ఫార్వర్డ్స్).
Comments
Please login to add a commentAdd a comment