న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్ కోచ్‌గా పని చేసిన ఐగర్ స్టిమాక్ కాంట్రాక్ట్ పునరుద్ధరణ, అతనికి చెల్లించాల్సి వచ్చిన నష్టపరిహారంపై అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో జరిగిన తప్పులు, స్టిమాక్‌కు అనుకూలంగా ఉన్న నిబంధనపై సమాఖ్య సర్వసభ్య సమావేశంలో చర్చ జరిగింది. దీనికి సంబంధించి స్వతంత్ర విచారణ జరపాలని ఏఐఎఫ్‌ఎఫ్ నిర్ణయం తీసుకుంది. ఎవరి కారణంగా స్టిమాక్‌కు భారీ మొత్తం చెల్లించాల్సి వచ్చిందనే అంశం విచారణలో తేలుతుందని ఏజీఎంలో సభ్యులు అభిప్రాయపడ్డారు.
భారత జట్టు కోచ్‌గా ఐగర్ స్టిమాక్ పదవీకాలం 2023లో ముగిసింది. ఆ తర్వాత మళ్లీ దానిని జూన్ 2025 వరకు పునరుద్ధరించారు. అయితే స్టిమాక్ రెండోసారి కాంట్రాక్ట్‌పై సంతకం చేసినప్పుడు నిబంధనలు, షరతులు అతనికి అనుకూలంగా తయారు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఏఐఎఫ్‌ఎఫ్ కీలక పదవుల్లో పని చేసిన కొందరి పాత్ర ఉందని ఏజీఎంలో సభ్యులు ఆరోపించారు. ఈ ఏడాది జూన్‌లో ‘ఫిఫా’ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో సులువైన ‘డ్రా’ ఉన్నా భారత జట్టు చెత్త ప్రదర్శనతో రెండో రౌండ్‌లోనే నిష్క్రమించింది. దాంతో వెంటనే స్టిమాక్‌ను కోచ్ పదవి నుంచి తొలగించారు.
ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న స్టిమాక్ 9 లక్షల 20 వేల డాలర్లు (రూ. 7 కోట్ల 72 లక్షలు) నష్టపరిహారం కోరుతూ ఫిఫా ఫుట్‌బాల్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేశాడు. మరో ఏడాది తన పదవీకాలం మిగిలి ఉన్నా తనను తీసేయడం నిబంధనలకు విరుద్ధమంటూ సవాల్ చేశాడు. చివరకు మధ్యవర్తిత్వం ద్వారా ఏఐఎఫ్‌ఎఫ్ సమస్యను పరిష్కరించుకుంది. స్టిమాక్‌కు 4 లక్షల డాలర్లు (సుమారు రూ. 3.20 కోట్లు) నష్టపరిహారం ఇచ్చేందుకు అంగీకరించి గొడవను ముగించింది. ఈ అంశంపై ప్రస్తుతం ఏజీఎంలో చర్చ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment