football coach
-
శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ హెడ్ కోచ్‌గా పోర్చుగల్ స్టార్
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ ఐ–లీగ్ టోర్నీలో గత రెండు సీజన్లలో రన్నరప్‌గా నిలిచిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టుకు కొత్త హెడ్ కోచ్ వచ్చాడు. పోర్చుగల్‌కు చెందిన రుయ్ అమోరిమ్ తక్షణమే హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించి రాబోయే సీజన్ కోసం శ్రీనిధి జట్టును సిద్ధం చేయనున్నాడు. గత సీజన్లో హెడ్ కోచ్‌గా ఉన్న డొమింగొ ఒరామస్ ఇటీవల రాజీనామా చేయడంతో అతని స్థానంలో అమోరిమ్ వచ్చాడు.ఇక.. 2008 నుంచి అంతర్జాతీయ క్లబ్ ఫుట్‌బాల్‌లో కోచ్‌గా పని చేస్తున్న 47 ఏళ్ల అమోరిమ్ ఇప్పటి వరకు 10 క్లబ్‌కు కోచ్‌గా వ్యవహరించాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన ఎస్సీ నోజ్మో క్లబ్ జట్టుకు ఈనెల 14 వరకు అమోరిమ్ కోచ్‌గా పని చేసి అక్కడి నుంచి శ్రీనిధి డెక్కన్ క్లబ్‌కు రానున్నారు. ‘శ్రీనిధి డెక్కన్ జట్టులో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నాను. నా అనుభవాన్ని పంచుకొని జట్టు మరింత ఉన్నతస్థితికి ఎదిగేందుకు కృషి చేస్తా’ అని అమోరిమ్ వ్యాఖ్యానించాడు. మొహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్ బోణీ చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో తొలిసారి బరిలోకి దిగిన మొహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్ జట్టు మొదటి విజయాన్ని అందుకుంది. భారత్‌లోని అతి పురాతన ఫుట్‌బాల్ క్లబ్‌లలో ఒకటైన మొహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్... గురువారం జరిగిన తమ మూడో లీగ్ మ్యాచ్‌లో 1–0 గోల్ తేడాతో చెన్నైయిన్ ఫుట్‌బాల్ క్లబ్‌ను ఓడించింది. ఆట 39వ నిమిషంలో లాల్రెమ్సంగా ఫనాయ్ గోల్ సాధించి మొహమ్మదాన్ జట్టుకు విజయాన్ని అందించాడు.కోల్‌కతాలో 1889లో ఏర్పాటైన మొహమ్మదాన్ స్పోర్లింగ్ క్లబ్ గత ఏడాది భారత దేశవాళీ టోర్నీ ఐ–లీగ్‌లో విజేతగా నిలిచి ఐఎస్ఎల్లో పోటీపడే అవకాశాన్ని దక్కించుకుంది. మొత్తం 13 జట్లు పోటీపడుతున్న ఐఎస్ఎల్లో ప్రస్తుతం మొహమ్మదాన్ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడింది. ఒక మ్యాచ్‌లో గెలిచి, మరో మ్యాచ్‌లో ఓడి, ఇంకో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని నాలుగు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. కోల్‌కతా వేదికగా నేడు జరిగే మ్యాచ్‌లో గోవా ఎఫ్‌సీ జట్టుతో ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ జట్టు తలపడుతుంది. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో స్నేహిత్ ఓటమి బీజింగ్: చైనా స్మాష్–2024 వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నీలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. గురువారం మొదలైన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో భారత్ తరఫున నలుగురు ప్లేయర్లు బరిలోకి దిగారు. మనుశ్ ఉత్పల్భాయ్ షా మినహా మిగతా ముగ్గురు తొలి రౌండ్లోనే ఓడిపోయారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో తెలంగాణ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ 11–6, 7–11, 3–11, 3–11తో మా జిన్బావో (అమెరికా) చేతిలో... హర్మీత్ దేశాయ్ 6–11, 11–9, 6–11, 11–8, 5–11తో కార్ల్సన్ (స్వీడన్) చేతిలో... సత్యన్ 9–11, 13–11, 6–11, 11–9, 4–11తో జు హైడాంగ్ (చైనా) చేతిలో ఓటమి చవిచూశారు. మనుశ్ షా 4–11, 11–5, 11–4, 3–11, 11–8తో చాన్ బాల్డ్విన్ (హాంకాంగ్)పై నెగ్గాడు. మహిళల క్వాలిఫయింగ్ సింగిల్స్‌లో తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో అహిక ముఖర్జీ, సుతీర్థ ముఖర్జీ తమ ప్రత్యర్థులను ఓడించి రెండో రౌండ్‌కు చేరారు.సెమీఫైనల్లో రిత్విక్ చౌదరీ జోడీసాక్షి, హైదరాబాద్: బ్యాంకాక్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్‌కు చెందిన బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ డబుల్స్‌లో సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. థాయ్‌లాండ్‌లోని నొంతాబురి పట్టణంలో ఈ టోర్నీ జరుగుతోంది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రిత్విక్–అర్జున్ ఖడే (భారత్) ద్వయం 7–6 (7/3), 7–6 (7/5)తో గాబ్రియెల్ డియాలో (కెనడా)–సీటా వతనాబె (జపాన్) జోడీని ఓడించింది.గంటా 47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జంటలు తమ సర్వీస్‌ను రెండుసార్లు చొప్పున కోల్పోయాయి. అయితే టైబ్రేక్‌లో రిత్విక్–అర్జున్ ద్వయం పైచేయి సాధించి విజయాన్ని దక్కించుకుంది. ఇదే టోర్నీలో ఆడుతున్న రామ్‌కుమార్ రామనాథన్ (భారత్)–తొష్‌హిడె మత్సుయ్ (జపాన్) జోడీ కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో రామ్–తొష్‌హిడె జంట 6–3, 6–4తో అలెజాంద్రో మొరో కనాస్ (స్పెయిన్)–మార్కో ట్రున్‌గెలిటి (అర్జెంటీనా) జోడీపై గెలిచింది. -
స్టిమాక్ కాంట్రాక్ట్ పునరుద్ధరణపై ఏఐఎఫ్ఎఫ్ విచారణ
న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్ కోచ్‌గా పని చేసిన ఐగర్ స్టిమాక్ కాంట్రాక్ట్ పునరుద్ధరణ, అతనికి చెల్లించాల్సి వచ్చిన నష్టపరిహారంపై అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో జరిగిన తప్పులు, స్టిమాక్‌కు అనుకూలంగా ఉన్న నిబంధనపై సమాఖ్య సర్వసభ్య సమావేశంలో చర్చ జరిగింది. దీనికి సంబంధించి స్వతంత్ర విచారణ జరపాలని ఏఐఎఫ్ఎఫ్ నిర్ణయం తీసుకుంది. ఎవరి కారణంగా స్టిమాక్‌కు భారీ మొత్తం చెల్లించాల్సి వచ్చిందనే అంశం విచారణలో తేలుతుందని ఏజీఎంలో సభ్యులు అభిప్రాయపడ్డారు.భారత జట్టు కోచ్‌గా ఐగర్ స్టిమాక్ పదవీకాలం 2023లో ముగిసింది. ఆ తర్వాత మళ్లీ దానిని జూన్ 2025 వరకు పునరుద్ధరించారు. అయితే స్టిమాక్ రెండోసారి కాంట్రాక్ట్‌పై సంతకం చేసినప్పుడు నిబంధనలు, షరతులు అతనికి అనుకూలంగా తయారు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఏఐఎఫ్ఎఫ్ కీలక పదవుల్లో పని చేసిన కొందరి పాత్ర ఉందని ఏజీఎంలో సభ్యులు ఆరోపించారు. ఈ ఏడాది జూన్‌లో ‘ఫిఫా’ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో సులువైన ‘డ్రా’ ఉన్నా భారత జట్టు చెత్త ప్రదర్శనతో రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. దాంతో వెంటనే స్టిమాక్‌ను కోచ్ పదవి నుంచి తొలగించారు.ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న స్టిమాక్ 9 లక్షల 20 వేల డాలర్లు (రూ. 7 కోట్ల 72 లక్షలు) నష్టపరిహారం కోరుతూ ఫిఫా ఫుట్‌బాల్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేశాడు. మరో ఏడాది తన పదవీకాలం మిగిలి ఉన్నా తనను తీసేయడం నిబంధనలకు విరుద్ధమంటూ సవాల్ చేశాడు. చివరకు మధ్యవర్తిత్వం ద్వారా ఏఐఎఫ్ఎఫ్ సమస్యను పరిష్కరించుకుంది. స్టిమాక్‌కు 4 లక్షల డాలర్లు (సుమారు రూ. 3.20 కోట్లు) నష్టపరిహారం ఇచ్చేందుకు అంగీకరించి గొడవను ముగించింది. ఈ అంశంపై ప్రస్తుతం ఏజీఎంలో చర్చ జరుగుతుంది.చదవండి: భారత ఫుట్‌బాలర్ అన్వర్ అలీపై నిషేధం -
Afshan Ashiq: 'ఆ రోజు నేను పోలీసుల మీద రాళ్లు రువ్వాను'
ఆ అమ్మాయి ఒకప్పుడు గుంపులో రాళ్లు విసిరే కశ్మీరీ అమ్మాయి. ఇప్పుడు జమ్ము–కశ్మీర్లో కేవలం బాలికల కోసం ఫుట్‌బాల్ అకాడెమీ నడుపుతున్న ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్. ఆమెలో వచ్చిన మార్పు ఆమెను ప్రధాని నరేంద్ర మోదీ చేత కూడా మాట్లాడించేలా చేసింది. విరాట్ కోహ్లీ కూడా ఆమెను మెచ్చుకున్నాడు. యువతకు సరైన దిశ ఉంటే వారు గెలిచి తీరుతారనడానికి అఫ్షాన్ ఆషిక్ ఒక ఉదాహరణ. కొన్నేళ్లు వెనక్కు వెళితే 2017 డిసెంబర్లో ఒక ఫోటో వైరల్ అయ్యింది. ఒకమ్మాయి... ముఖానికి దుపట్టా కట్టుకుని జమ్ము కశ్మీర్ పోలీసులపైకి రాళ్లు విసురుతున్న ఫొటో అది. ఆ అమ్మాయి పేరు అఫ్షాన్ ఆషిక్. ముఖం కనబడకుండా గుడ్డ కట్టుకోవడంతో తనను ఎవరూ గుర్తుపట్టరని అఫ్షాన్ భావించింది. కానీ తర్వాత ఆమె గురించి అందరికీ తెలిసిపోయింది. సమాజం ఆమెపై ‘స్లోన్ పెల్టర్’ ముద్ర వేసింది. అప్పటికే ఆ అమ్మాయి ఫుట్‌బాల్ ఆటలో ప్రతిభ కనపరుస్తూ ఉంది. కాని ఈ ఫోటోతో ఆమె తన ఆటకే దూరమయ్యే స్థితి వచ్చింది. ‘ఆ రోజు నేను పోలీసుల మీద రాళ్లు రువ్వాను. అది కోపంలో చేసిన పని. దానికి కారణం పోలీసులు అకారణంగా మమ్మల్ని వేధించారు. విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము కాపాడుకోవడానికి రాళ్లు విసరడం మినహా మాకు గత్యంతరం లేదు. నేనేమి ప్రొఫెషనల్ స్టోన్ పెల్టర్‌ను కాదు. కాని నా మీద ముద్ర పడింది. దాని నుంచి బయటపడాలంటే నేను నా చదువు మీద నా ఫుట్‌బాల్ ఆట మీద దృష్టి పెట్టి విజయం సాధించాలని అనుకున్నాను’ అంది అఫ్షాన్ ఆషిక్. ఈ ఘటన తర్వాత ఆ అమ్మాయి నెల రోజులు ఇంటికే పరిమితమైంది. అఫ్షాన్ తండ్రి ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లనీయలేదు. అరగంటపాటు ఆడుకుని వచ్చేస్తానని తల్లికి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. ‘ఒకరోజు చాలా ఏడుస్తుంటే నన్ను చూసిన నాన్న ఎందుకు ఏడుస్తున్నావని అడిగారు. ఇంట్లో కూర్చుని ఏం చేయాలని ప్రశ్నించాను. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించడంతో మళ్లీ ఆట మొదలుపెట్టాను’ అందామె. ముంబై వెళ్లి.. కశ్మీర్ యువత తమ చదువు, క్రీడల పట్ల దృష్టి పెట్టాలని భావించిన ప్రభుత్వం అఫ్షాన్ను తగిన ప్రోత్సాహం అందించింది. జమ్మూ కశ్మీర్ క్రీడాశాఖ చేయూతతో అఫ్షాన్ ముంబై వెళ్లి ఆటలో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత జమ్ము కశ్మీర్ నుంచి తొలిప్రొఫెషనల్ ఫిమేల్ ఫుట్‌బాల్ ప్లేయర్ అయ్యింది. ‘నువ్వు ఆడపిల్లవి. ఫుట్‌బాల్ నేర్చుకుని ఏం చేస్తావ్ అని అందరూ అడిగేవారు. నేను ఆడే సమయానికి ఆడపిల్లలు ఎవరూ మా ప్రాంతం నుంచి ఫుట్‌బాల్‌లోకి రాలేదు. కాని నేను ఆగలేదు. పట్టుదలగా ముందుకెళ్లాను. ఇండియన్ విమెన్స్ లీగ్‌లో ఆడాను. గోల్ కీపర్‌గా విశేష ప్రతిభ కనపరిచాను. ఆ సమయంలో విదేశీ మహిళా ఫుట్‌బాల్ ప్లేయర్లని గమనించాను. వాళ్లకు చాలా మంచిశిక్షణ ఆ దేశాల్లో లభిస్తోంది. మా ్రపాంతం బాలికలకు కూడా లభించాలని భావించాను. అందుకే జమ్ము కశ్మీర్ బాలికల కోసం యునీక్ ఫుట్‌బాల్ అకాడెమీ స్థాపించాను’ అని తెలిపింది అఫ్షాన్. మరింత గుర్తింపు.. నేడు జమ్ము కశ్మీర్లో మహిళా ఫుట్‌బాల్ పేరు చెప్తే అఫ్షాన్ పేరే అందరికీ గుర్తుకొస్తుంది. ఆమెకు అక్కడ ఒక సెలబ్రిటీ హోదా ఉంది. ’నేను నా గతాన్ని జయించాను. ఇప్పుడు నేను స్టోన్ పెల్టర్ని కాను. గోల్ కీపర్‌ని. ఇకపై నన్ను జనం అలాగే గుర్తు పెట్టుకుంటారు’ అంటుందామె. ఇవి చదవండి: సెలబ్రెటీలను సైతం పక్కకునెట్టి అంబాసిడర్ అయిన యువతి! -
'కోచ్ ఇబ్బంది పెడుతున్నారు.. తట్టుకోలేకపోతున్నాం'
కోచ్‌తో ఉన్న ఇబ్బంది కారణంగా 15 మంది మహిళా ఫుట్‌బాల్ ప్లేయర్లు జట్టు నుంచి వైదొలగడం కలకలం రేపింది. స్పెయిన్ ఫుట్‌బాల్‌లో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. స్పెయిన్ మహిళల ఫుట్‌బాల్ కోచ్‌గా జార్జ్ విల్డా వ్యవహరిస్తున్నాడు. తమ ఆరోగ్యంపై, మానసిక పరిస్థితిపై ప్రభావం చూపేలా కోచ్ విల్డా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ మహిళా ప్లేయర్లు ఆరోపించారు. తమ సమస్యలకు ప్రధాన కారణం కోచ్ విల్డా అంటూ స్పానిష్ సాకర్ ఫెడరేషన్‌కు ఈ-మెయిల్ పంపారు. కోచ్‌పై వేటు వేయాలని స్పష్టంగా పేర్కొనలేదు కానీ అతని వల్ల ఇబ్బంది కలుగుతుందని మాత్రం లేఖలో వెల్లడించారు. ఈ పరిస్థితిలో మార్పు వచ్చేంతవరకు జట్టుకు దూరంగా ఉంటామని 15 మంది తేల్చి చెప్పారు. కాగా కోచ్ విల్డా పనితీరుపై సంతృప్తిగా లేకపోవడం వల్లే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తెలిసింది. ఇంతకముందు కూడా మీడియా సమావేశంలోనూ ఇదే విషయాన్ని వెల్లడించారు. మరోవైపు తమకు ఎలాంటి లేఖ, ఈ-మెయిల్ అందలేదని స్పానిష్ సాకర్ ఫెడరేషన్ పేర్కొంది. కోచ్ విల్డా మహిళా ప్లేయర్లను ఇబ్బందికి గురిచేసినట్లు.. లైంగిక వేధింపుల పాల్పడినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. కోచ్ విల్డాకు క్షమాపణ చెప్పేవరకు 15 మంది మహిళా ప్లేయర్లను జట్టులోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. కాగా స్పెయిన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు వచ్చే నెల 7న స్వీడన్, 11న అమెరికాతో ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లకు ఆడే జట్టును కోచ్ విల్డానే ఎంపిక చేయాల్సి ఉంది. చదవండి: ఓటమితో కెరీర్‌కు వీడ్కోలు.. ఫెదరర్, నాదల్ కన్నీటి పర్యంతం బుమ్రా యార్కర్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్ ఫిదా -
ఐఎస్ఎల్లో తొలి భారతీయ హెడ్ కోచ్‌గా ఖాలిద్ జమీల్
గువాహటి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో ఓ ప్రాంచైజీకి తొలిసారి ఓ భారతీయుడు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. భారత్ తరఫున 11 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన 44 ఏళ్ల ఖాలిద్ జమీల్‌ను నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ జట్టు హెడ్ కోచ్‌గా ఆ ఫ్రాంచైజీ నియమించింది. గతేడాది జమీల్ జట్టు తలరాతను అసాధారణంగా మార్చేశాడు. వరుస పరాజయాలతో నార్త్ ఈస్ట్ డీలాపడగా... హెడ్ కోచ్ గెరార్డ్ నుస్ నుంచి తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన ఖాలిద్ వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో విజేతగా నిలిపాడు. -
అలసిన ‘ఆట’: కరోనాతో ప్రముఖ ఫుట్‌బాల్ కోచ్ మృతి
భువనేశ్వర్: రాష్ట్రంలో పేరొందిన ఫుట్‌బాల్ కోచ్ నంద కిషోర్ పట్నాయక్ కరోనా చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం ప్రకటించారు. ఫుట్‌బాల్ క్రీడారంగంలో రాష్ట్రం నుంచి పలువురు అంతర్జాతీయ క్రీడాకారుల్ని ఆవిష్కరించిన విశిష్ట వ్యక్తి అని సంతాప సందేశంలో పేర్కొన్నారు. 1956 మార్చి 16వ తేదీన జన్మించిన నంద కిషోర్ పట్నాయక్ రెండుసార్లు జాతీయ జూనియర్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌కు ఒడిశా జట్టుకు సారథ్యం వహించారు. 1992-93లో ఫుట్‌బాల్ కోచ్‌గా నియమితులయ్యారు. తర్వాత 1995లో మహిళా ఫుట్‌బాల్ కోచ్‌గా నియమితులయ్యారు. ఆయన కోచింగ్‌లో శ్రద్ధాంజలి సామంత్రాయ్, రంజిత మహంతి, ప్రశాంతి ప్రధాన్, సుదీప్త దాస్, సరిత జయంతి బెహరా, మమాలి దాస్, ప్రథమా ప్రియదర్శి వంటి అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారిణులు రాష్ట్ర కీర్తి కిరీటాలుగా వన్నె తెచ్చారు. చదవండి: కరోనాతో అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు మృతి తన విద్యార్థులతో కోచ్ నందకిశోర్ పట్నాయక్ (ఫైల్) -
మైదానంలోకి వస్తున్నారు
అజయ్ దేవగన్ హీరోగా అమిత్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘మైదాన్’. ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆయన పాత్రలో అజయ్ కనిపిస్తారు. ప్రియమణి కథానాయిక. బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. కోవిడ్ వల్ల ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. ఈ సినిమా కోసం వేసిన ఫుట్‌బాల్ స్టేడియం సెట్‌ని లాక్ డౌన్ టైమ్‌లో తొలగించారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణను మళ్లీ ప్రారంభించాలనుకుంటున్నారు. ఇంతకు ముందు తీసేసిన సెట్‌నే మళ్లీ కొత్తగా వేస్తున్నారు. జనవరిలో ఈ చిత్రీకరణలో పాల్గొంటారు అజయ్. ప్రస్తుతం అజయ్, ఈ సినిమాలో నటించేవాళ్లందరూ ఫుట్‌బాల్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. -
కోచ్‌గా తొలగించారనే కోపంతో..
న్యూఢిల్లీ: కోపం, కసి.. మనిషిని స్థిమితంగా ఉండనివ్వవు. ప్రశాంతంగా ఆలోచించనివ్వవు. ఏదో ఒక రూపంలో పగ తీర్చుకొమ్మని అవి రెండూ నిరంతరం మనిషిని ప్రేరేపిస్తుంటాయి. శేఖర్ పట్నాయక్‌ని కూడా అలాగే ప్రేరేపించాయి. పట్నాయక్ ఫుట్ బాల్ కోచ్. ఇప్పుడు కాదు. 2011–2013 మధ్య.. ఢిల్లీ యునైటెడ్ ఫుట్ బాల్ క్లబ్‌కి ఆయన సేవలను అద్దెకు తెచ్చుకున్నారు. కోచ్ అన్నాక ఒకరే ఉండరు. పక్కన ఇంకో సెమీ కోచో, క్వార్టర్ కోచో ఉంటారు. ఆ కోచ్ ఈ పట్నాయక్ కోచ్ మీద కంప్లయింట్ చేశాడు. పద్ధతి లేని మనిషి, బద్ధకపు మనిషి, టైమ్‌కి రాడు.. అని పై వాళ్లకు కాగితం పెట్టాడు. పై వాళ్లు వెంటనే స్పందించి పట్నాయక్‌ని తీసేశారు. అది మనసులో పెట్టుకున్నాడు. ఏడేళ్లుగా టీమ్ మీద కసి తీర్చుకోవాలని కాపు కాస్తున్నాడు. ఈ మార్చిలో అవకాశం వచ్చింది! జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో ఢిల్లీ ఫుట్ బాల్ లీగ్ మ్యాచ్ జరుగుతుంటే డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లాడు. అక్కడ టీమ్ మొత్తానివీ సెల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులు ఉంటాయి. ఆ సెల్ ఫోన్లన్నీ.. మొత్తం 12.. తీసుకెళ్లిపోయాడు. ఐదు నెలల తర్వాత ఇప్పుడు పోలీసులకు దొరికాడు. వాటిల్లో ఒక ఫోన్ స్విచ్చాన్ కాగానే పోలీసులు అక్కడికి వెళ్లారు. ఎవరు అమ్మారో తెలుసుకుని నేరుగా పట్నాయక్ ఇంటికి వెళ్లి మిగతా సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ‘నన్ను కోచ్ గా తొలగించారు. ఆ కోపంతోనే నేను ఈ పని చేశాను’ అని పట్నాయక్ అంటుంటే.. పాపం అనిపిస్తుంది. పేదవాడి ప్రతీకారం కూడా పేదవాడి కోపం లాంటిదేనేమో!! -
ప్రతి భారతీయుడు గర్వపడతాడు
‘‘ఆధునిక భారతీయ ఫుట్‌బాల్‌కి ఆద్యుడు సయ్యద్ అబ్దుల్ రహీం గొప్పతనం గురించి మా ‘మైదాన్’ సినిమాలో చూపించబోతున్నాం. ఫుట్‌బాల్ కోచ్‌గా 1950లో ఆయన ప్రస్థానం ప్రారంభమయింది. అప్పటినుండి 1963లో చనిపోయేంత వరకు ఆయన ఫుట్‌బాల్ కోచ్‌గా వ్యవహరించారు’’ అన్నారు అజయ్ దేవగన్. సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా రూపొందిన ‘మైదాన్’లో అజయ్ దేవగన్ సయ్యద్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా గురించి అజయ్ దేవగన్ మాట్లాడుతూ– ‘‘వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ వారాన్ని గుర్తు పెట్టుకోండి. ఒక రియల్ హీరో స్టోరీని భారతీయులందరూ గర్వపడేలా తీస్తున్నాం. ఆగస్టు 13న ‘మైదాన్’ను విడుదల చేస్తాం’’ అన్నారు. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్లో విడుదల కావాలి. ఈ స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కించటానికి 16 ఎకరాల విస్తీర్ణంలో ఓ సెట్‌ను మేలో నిర్మించారు. కరోనా కారణంగా షూటింగ్‌కి అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత వర్షాలకి ఈ సెట్ పాడయిపోయింది. మళ్లీ ఆ సెట్‌ను నిర్మించాలంటే రెండు నెలలు పడుతుంది. ఆ సెట్ పూర్తి చేసి, సెప్టెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి ‘బదాయి హో’ ఫేం రవీంద్రనా«థ్ శర్మ దర్శకుడు. ఫ్రెష్‌లైమ్ ఫిల్మ్ సహకారంతో బోనీ కపూర్, ఆకాశ్ చావ్లా, అరునవ్ సేన్ గుప్తా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల కానుంది. -
సలామ్ రహీమ్ సాబ్...
1964లో భారత ఫుట్‌బాల్ కోచ్‌గా ఉన్న ఆల్బర్టో ఫెర్నాండో ఆ సమయంలో శిక్షణకు సంబంధించి బ్రెజిల్లో నిర్వహించిన ప్రత్యేక వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. తిరిగొచ్చిన తర్వాత ఆయన ఒకే ఒక మాట అన్నారు. ‘ఏముంది అక్కడ కొత్తగా నేర్చుకోవడానికి. 1956లో రహీమ్ సర్ మాకు నేర్పించిందే ఇప్పుడు అక్కడ చెబుతున్నారు. ఆయన నిజంగా ఫుట్‌బాల్ ప్రవక్త’... ఈ మాటలు చాలు కోచ్‌గా సయ్యద్ అబ్దుల్ రహీమ్ చూపించిన ప్రభావం ఏమిటో చెప్పడానికి. నాటి తరంలోనే కొత్త తరహా టెక్నిక్‌లతో భారత ఫుట్‌బాల్‌ను పరుగెత్తించిన మన హైదరాబాదీ రహీమ్ సర్‌కు ఫుట్‌బాల్ ప్రపంచంలో స్థానం ప్రత్యేకం. భారత్ ఫుట్‌బాల్‌ను ఇప్పుడు చూస్తున్న వారికి పాతతరంలో మన జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చిందని, పలు చిరస్మరణీయ విజయాలు సాధించిందని చెబితే ఆశ్చర్యంగా ఉండవచ్చు. కానీ 1950, 1960లలో మన ఫుట్‌బాల్ టీమ్ ఉచ్చ దశలో నిలిచింది. నాడు ఆటగాళ్లతోపాటు వారిలో ఒకడిగా ఈ విజయాలలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి సయ్యద్ అబ్దుల్ (ఎస్ఏ) రహీమ్. హైదరాబాద్‌కు చెందిన రహీమ్ శిక్షకుడిగా వేసిన ముద్ర ఏమిటో నాటితరం ఆటగాళ్లంతా గొప్పగా చెప్పుకుంటారు. సరిగ్గా చెప్పాలంటే రహీమ్ సాబ్ కోచ్‌గా పని చేసిన కాలాన్ని భారత ఫుట్‌బాల్ స్వర్ణ యుగం అనడం అతిశయోక్తి కాదు. సుదీర్ఘ కాలం పాటు... 1909 ఆగస్టు 17న హైదరాబాద్‌లో జన్మించిన రహీమ్ కొన్నాళ్లు టీచర్‌గా పనిచేశారు. ఫుట్‌బాల్‌పై ప్రేమతో టీచర్ ఉద్యోగాన్ని వదులుకొని హైదరాబాద్ సిటీ పోలీస్ జట్టుకు కోచ్‌గా వచ్చారు. రహీమ్ శిక్షణలో హైదరాబాద్ సిటీ పోలీస్ జట్టు జాతీయ స్థాయిలో ఎన్నో గొప్ప విజయాలు సాధించింది. సిటీ పోలీస్ జట్టును అత్యుత్తమ జట్టుగా నిలిపిన రహీమ్ ఆ తర్వాత 1950 నుంచి ఏకంగా 13 ఏళ్ల పాటు భారత టీమ్ కోచ్‌గా తన స్థాయిని ప్రదర్శించారు. ఆయన శిక్షకుడిగా ఉన్న సమయంలోనే భారత్ 1951 ఢిల్లీ, 1962 జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించింది. 1952 హెల్సింకి, 1956 మెల్బోర్న్, 1960 రోమ్ ఒలింపిక్స్ క్రీడల్లోనూ భారత జట్టుకు రహీమ్ కోచ్‌గా వ్యవహరించారు. మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో భారత్ నాలుగో స్థానంలో నిలవడం విశేషం. ముఖ్యంగా 1962 జకార్తా ఆసియా క్రీడల్లో సుమారు లక్ష మంది ప్రేక్షకుల సమక్షం లో జరిగిన ఫైనల్లో కొరియా జట్టుపై భారత జట్టు సాధించిన విజయాన్ని ఏ ఫుట్‌బాల్ అభిమానీ మరచిపోలేడు. ఇదే కోచ్‌గా రహీమ్ సాబ్ కెరీర్లో మరపురాని క్షణం. కొత్త తరహా శైలితో... కోచ్‌గా రహీమ్ గొప్పతనం ఆయన దూరదృష్టిలోనే కనిపిస్తుంది. ఎంతో ముందుచూపుతో ఆలోచించి ఇచ్చే శిక్షణ, వ్యూహాలు జట్టుకు మంచి ఫలితాలు ఇచ్చాయి. అప్పటి వరకు భారత జట్టు ఆడుతూ వచ్చిన బ్రిటిష్ శైలి తరహా ఆట మనకు కుదరదంటూ చిన్న చిన్న పాస్‌లతో కొత్త టెక్నిక్‌ను ఆయన మన ఆటలో జోడించారు. మైదానంలో 4–2–4 వ్యూహాన్ని రహీమ్ చాలా ముందుగా అనుసరించారు. అదే శైలితో బ్రెజిల్ 1958, 1962 ప్రపంచకప్‌లలో ఆడి టైటిల్ గెలవడం విశేషం. ఫార్వర్డ్లు లేకుండా ఆరుగురు మిడ్ఫీల్డర్లతో ఆడించడం కూడా అప్పట్లో ఒక కొత్త వ్యూహం. మోటివేషన్ స్పీకర్ తరహాలో ఆయన ఇచ్చే స్ఫూర్తిదాయక ప్రసంగాలు తమలో విజయకాంక్షను నింపేవని ఆటగాళ్లు చెబుతారు. క్రమశిక్షణకు మారుపేరులా కనిపించే రహీమ్ సాబ్ స్ఫూర్తిగానే తర్వాతి తరంలో ఎంతో మంది కోచ్‌లు తయారయ్యారు. వీరిలో అమల్ దత్తా, పీకే బెనర్జీ, నయూముద్దీన్ తదితరులు ఉన్నారు. పురస్కారాల మాటే లేదు... 1962లో జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన తర్వాతి ఏడాదే జూన్ 11న, 1963లో హైదరాబాద్‌లో రహీమ్ ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా కన్నుమూశారు. ఆయన సహచర ఆటగాడు ఫ్రాంకో ఫార్చునాటో... ‘రహీమ్ సాబ్ తనతో పాటు భారత ఫుట్‌బాల్‌ను కూడా సమాధిలోకి తీసుకుపోయారు’ అని వ్యాఖ్యానించడం ఆయన చేసిన సేవలను చూపిస్తోంది. నిజంగా అదే జరిగింది. ఆ తర్వాత అంతకంతకూ దిగజారుతూ వచ్చిన భారత ఫుట్‌బాల్ ప్రమాణాలు ఇక కోలుకోలేని విధంగా మరింత పతనావస్థకు చేరిపోయాయి. గొప్పవాళ్ల ఘనతలను గుర్తించి వారిని తగిన విధంగా గౌరవించుకోవడంలో మన అధికారులు ఎప్పుడూ వెనుక వరుసలోనే ఉంటారు. కోచ్‌గా అజరామర కీర్తిప్రతిష్టలు దక్కినా రహీమ్ సాబ్‌కు ప్రభుత్వం మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. తన జీవితకాలంతో ఆయన ఆర్థికంగా పెద్దగా పొందింది ఏమీ లేదు. చనిపోయిన తర్వాత కూడా ఎలాంటి పురస్కారాలు దక్కలేదు. ఆటగాళ్ల వ్యక్తిగత కష్టాన్ని కూడా తమ ఖాతాలో వేసుకొని ‘ద్రోణాచార్య’ అవార్డులు సొంతం చేసుకునే కోచ్‌లున్న ఈ కాలంలో అసలైన గురువుకు అలాంటి అవార్డు ఏమీ లభించలేదు. ఏదో అభిమానం ఉన్నవారు అప్పుడప్పుడు తలచుకోవడం మినహా అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) కూడా వేర్వేరు రాజకీయ కారణాలతో రహీమ్‌ను గుర్తు చేసుకునే కార్యక్రమాలు, టోర్నీలు కూడా నిర్వహించలేదు. రహీమ్ కుమారుడు సయ్యద్ షాహిద్ హకీమ్ కూడా అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడే. హకీమ్ 1960 రోమ్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. 1960 రోమ్ ఒలింపిక్స్ తర్వాత భారత ఫుట్‌బాల్ జట్టు మళ్లీ ఒలింపిక్స్‌కు అర్హత సాధించకపోవడం గమనార్హం. అజయ్ దేవ్గన్ నటనతో... ఇన్నేళ్ల తర్వాత కోచ్ రహీమ్ జీవితం సినిమా కథకు పనికొస్తుందని బాలీవుడ్ గుర్తించింది. రహీమ్ పాత్రలో స్టార్ హీరో అజయ్ దేవ్గన్ నటిస్తూ ‘మైదాన్’ పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. ‘ద గోల్డెన్ ఎరా ఆఫ్ ఇండియన్ ఫుట్‌బాల్, 1952–1962’ ట్యాగ్‌లైన్‌తో ఉన్న సినిమా రహీమ్ కోచ్‌గా భారత్ సాధించిన విజయాలను ప్రేక్షకుల ముందు ఉంచనుంది. అమిత్ రవీంద్రనాథ్ శర్మ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఒక మంచి కథను చెప్పేందుకు మన దేశంలో సినిమా మాధ్యమానికి మించినది ఏముంది. ఈ సినిమా తర్వాతైనా రహీమ్ గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుందని ఆశించవచ్చేమో. -
ముంబై టు కోల్‌కతా
ముంబై మైదానంలో మ్యాచ్‌ని ముగించారు అజయ్ దేవగన్. కోల్‌కతాలో జరగనున్న తర్వాతి మ్యాచ్ కోసం రెడీ అవుతున్నారు. ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్ కమ్ మేనేజర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో ‘మైదాన్’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కీర్తీ సురేష్ కథానాయికగా నటిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అబ్దుల్ రహీమ్ పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ ముంబైలో ముగిసింది. అజయ్ దేవగన్, కీర్తీ సురేష్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ కోల్‌కతాలో నవంబరు 3న ప్రారంభం కానుందని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. -
అనంత టూ స్పెయిన్ వయా ఫుట్‌బాల్
సామాన్య కుటుంబానికి చెందిన ఓ క్రీడాకారుడు తన అసమాన్యమైన ఆటతీరుతో అందరి మన్ననలనూ పొందుతున్నాడు. అనంత నుంచి ఏకంగా స్పెయిన్‌కు వెళ్లి అక్కడి క్రీడాకారులకు శిక్షణ ఇచ్చాడు. జాతీయ కోచ్ కావడమే లక్ష్యంగా తన ఆటతీరుకు మరింతగా మెరుగులు దిద్దుకుంటున్నాడు. – అనంతపురం సప్తగిరి సర్కిల్ 2012లో అకాడమీకి ఎంపిక వైఎస్సార్ కడప జిల్లా యర్రగుంట్లకు చెందిన ఆనంద్‌రెడ్డి. 2012లో అనంత క్రీడా మైదానంలో నిర్వహించిన ఫుట్‌బాల్ అకాడమీ సెలెక్షన్స్‌లో స్పోర్ట్స్ అకాడమీకి ఎంపికయ్యాడు. గతంలో అనంత ఫుట్‌బాల్ అకాడమీకి రాయలసీమ స్థాయిలో ఎంపికలను నిర్వహించేవారు. అకాడమీకి ఎంపికైనప్పటి నుంచి తన ఆటతీరుతో ఉన్నత స్థాయికి ఎదిగాడు ఆనంద్‌రెడ్డి. ఆర్డీటీ సంస్థ అందించిన ఆర్థిక, క్రీడ ప్రోత్సాహంతో జాతీయస్థాయి పోటీలకు ఎంపికై సత్తాచాటాడు. గత రెండేళ్ల నుంచి అనంత క్రీడా మైదానంలో గత నాలుగేళ్లుగా ఫుట్‌బాల్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. రెండేళ్ల పాటు వలంటీర్‌గా కూడా వ్యవహరించాడు. రెండేళ్ల నుంచి ఆర్డీటీ ఫుట్‌బాల్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. డీ – క్లబ్ ద్వారా గుర్తింపు ఈ ఏడాది మేలో జరిగిన విస్సెంటీ డీ క్లబ్ సభ్యుల సమ్మర్ కోచింగ్ క్యాంపులో ఆనంద్ కూడా భాగస్వామిగా మారాడు. సెయింట్ విస్సెంటీ ప్రెసిడెంట్ సెర్జియో వర్తగాతో పాటు చిన్నారులకు ఫుట్‌బాల్ క్రీడను నేర్పించాడు. అతని ఆటతీరును గుర్తించిన క్లబ్ సభ్యులు ఈ ఏడాది స్పెయిన్‌లో నిర్వహించనున్న సమ్మర్ కోచింగ్ క్యాంపుకు అనంత నుంచి ఒకరికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఆనంద్‌రెడ్డి ఆటతీరు, క్రీడాకారులకు అందిస్తున్న శిక్షణను చూసి అతన్ని ఈ అవకాశం వరించింది. దీంతో ఈ ఏడాది జూన్ 30 నుంచి జూలై 24 వరకు స్పెయిన్‌లోని మోంటాల్ట్లో నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంపులో కోచ్‌గా వ్యవహరించాడు. ఇందులో 2 వారాల పాటు ఫుట్‌బాల్ కోచ్‌గా వ్యవహరించగా, చివరి వారం 3 ఏళ్ల నుంచి 14 ఏళ్ల లోపు చిన్నారులకు స్పోర్ట్స్ ఇంట్రడ్యూసర్గా వ్యవహరించాడు. స్పెయిన్‌లో శిక్షణనిస్తున్న ఆనంద్‌రెడ్డి మురళీ మాస్టర్ దగ్గర ఓనమాలు ఫుట్‌బాల్ ఆటలో యర్రగుంట్ల పీఈటీ మాస్టర్ మురళి ఓనమాలు నేర్పించారు. ఆయన అందించిన స్ఫూర్తితో అండర్–14 రాష్ట్రస్థాయి పోటీల్లో రెండుసార్లు స్కూల్ గేమ్స్ తరుపున ప్రాతినిధ్యం వహించాడు. కర్ణాటకలోని తుంకూరులో జరిగిన అండర్–16 జాతీయస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించాడు. తర్వాత అనంత అకాడమీకి ఎంపికయ్యాడు. అండర్–19 ఎస్జీఎఫ్ ద్వారా రెండు సార్లు రాష్ట్రస్థాయిలో రాణించాడు. అనంతరం మూడేళ్ల పాటు ఎస్కే యూనివర్సిటీ నుంచి ప్రాతినిధ్యం వహించాడు. అనంత నుంచి సీనియర్ ఫుట్‌బాల్ పోటీల్లో రాష్ట్రస్థాయిలో నాలుగేళ్ల పాటు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం ఆర్డీటీకి కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇదీ .. కుటుంబ నేపథ్యం ఆనంద్‌రెడ్డి అనంత అకాడమీలో చేరిన ఏడాదిలోనే ఆయన తండ్రి కొండారెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. తల్లి ఇందిర యర్రగుంట్లలో చిన్నపాటి హోటల్‌ను నడుపుతోంది. తమ్ముడు సతీష్‌రెడ్డి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారుపడే కష్టం తెలుసుకున్న ఆనంద్‌రెడ్డి తనకంటూ ప్రత్యేకత ఉండాలని అనుకున్నాడు. ఆదుకున్న ఆర్డీటీ ఏడేళ్ల క్రితం ఆర్డీటీ అకాడమీకి ఎంపికవడం ఆనంద్‌రెడ్డి దశ, దిశను మార్చేసింది. ఆర్డీటీ ప్రోత్సాహంతో స్థానిక ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీని పూర్తి చేశాడు. చదువు పూర్తయిన తర్వాత ఆర్డీటీ సంస్థ ఆనంద్‌రెడ్డి ఆటతీరును చూసి అనంత క్రీడా మైదానంలో కోచ్‌గా అవకాశాన్ని కల్పించింది. దీంతో వలంటీర్‌గానే ఉంటూ అనంత క్రీడాకారులకు కోచింగ్‌ను అందించాడు. అకాడమీలో వసతి, భోజనానికి ఆర్డీటీ సహకరించడంతో ఇక్కడే ఉంటూ తన ఆటతీరును ఉత్తమంగా మార్చుకున్నాడు. అలాగే సీనియర్ ఫుట్‌బాల్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించాడు. జాతీయ కోచ్‌గా రాణించడమే లక్ష్యం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అకాడమీలో చోటు సాధించడం ఒక ఎత్తు అనుకుంటే ఇక్కడి నుంచి స్పెయిన్‌కు కోచ్‌గా వ్యవహరించడం అనేది ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను. ఫుట్‌బాల్‌లో రాణించాలనేది నా లక్ష్యం. ఆ లక్ష్యానికి మించి ఈ స్థాయికి చేరానంటే అది ఆర్డీటీ సంస్థ అందించిన ప్రోత్సాహంతోనే సాధ్యమైంది. నా ఆటతీరే నన్ను విమానం ఎక్కేలా చేసింది. అనంత, స్పెయిన్లకు క్రీడా నైపుణ్యాలకు పెద్ద తేడా ఏమీ లేదు. ప్రస్తుతం జాతీయస్థాయిలో ప్రొఫెషనల్ కోచ్‌గా రాణించడమే లక్ష్యంగా పెట్టుకుని సాధన చేస్తున్నాను. – ఆనంద్‌రెడ్డి , ఫుట్‌బాల్ క్రీడాకారుడు, కోచ్ -
అలా పిలవొద్దు!
ఒక మనిషి మీద ఏదైనా ముద్ర పడితే అదే చట్రంలోంచి ఆ వ్యక్తిని చూడటం సమాజానికి అలవాటు. ఒకసారి ఈ చట్రంలో ఇరుక్కున్నాక ఆ ముద్ర నుంచి బయటపడటం చాలా కష్టం. కశ్మీరీ యువతి అఫ్షాన్ ఆషిక్ ఇప్పుడు అలాంటి పోరాటమే చేస్తోంది. స్టోన్ పెల్టర్ గా సమాజం వేసిన ముద్రను చెరిపేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా తనను తాను నిరూపించుకోవాలనుకుంటోంది. దేశానికి ప్రాతినిధ్యం వహించి తనపై పడిన ముద్రను శాశ్వతంగా తుడిచేసుకోవాలని ఆరాటపడుతోంది.రెండేళ్లు వెనక్కు వెళితే 2017, డిసెంబర్ లో అఫ్షాన్ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆ ఫొటో ఆమె జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పింది. ఆమె గురించి అందరికీ తెలిసేలా చేసింది. ‘ఆ సంఘటన తర్వాత నా జీవితం ఒకేలా లేదు. మంచికో, చెడుకో ప్రజలు నన్ను గుర్తు పడుతున్నార’ని అఫ్షాన్ అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటుంది. ముఖానికి దుపట్టా కట్టుకుని జమ్మూకశ్మీర్ పోలీసులపైకి వీరావేశంతో రాళ్లు విసురుతున్న ఆమె ఫొటో అప్పట్లో ప్రసారసాధనాలతో పాటు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా తిరిగింది. ముఖం కనబడకుండా గుడ్డ కట్టుకోవడంతో తనను ఎవరూ గుర్తుపట్టరని అఫ్షాన్ భావించింది. కానీ తర్వాత ఆమె గురించి అందరికీ తెలిసిపోయింది. సమాజం ఆమెపై ’స్లోన్ పెల్టర్’ ముద్ర వేసింది. దీని నుంచి బయటపడేందుకే ఆమె పోరాటం చేస్తోంది.తన స్థానంలో అప్పుడు ఎవరున్నా అలాగే చేసుండేవారని అఫ్షాన్ ఆనాటి ఘటనను గుర్తు చేసుకుంది. తాను స్థానిక పోలీసులకు వ్యతిరేకంగా మాత్రమే రాళ్లు రువ్వానని సైన్యానికి వ్యతిరేకంగా కాదని స్పష్టం చేసింది. ‘‘రెండేళ్ల క్రితం జరిగిన ఘటన ఇంకా నా కళ్ల ముందు కదలాడుతోంది. పోలీసులు అకారణంగా మమ్మల్ని వేధించారు. మా విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము కాపాడుకోవడానికి రాళ్లు విసరడం మినహా మాకు గత్యంతరం లేదు. నేనేమి ప్రొఫెషనల్ స్టోన్ పెల్టర్‌ను కాదు. నా మీద వేసిన ఈ ముద్రను దయచేసి తొలగించండి’’ అంటూ అఫ్షాన్ వేడుకుంది. ఈ ఘటన జరిగిన తర్వాత నెల రోజులు ఆమె ఇంటికే పరిమితమైంది. తనకెంతో ఇష్టమైన ఫుట్‌బాల్ ఆటకు దూరమైంది. అఫ్షాన్ తండ్రి ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లనీయలేదు. అరగంటపాటు ఆడుకుని వచ్చేస్తానని తల్లికి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. ‘‘పోలీసులపై నేను రాళ్లు విసిరిన విషయం మా నాన్నకు రెండు నెలల తర్వాత తెలియడంతో నన్ను కట్టడిచేశారు. నెలరోజుల పాటు కాలు బయట పెట్టకుండా చేయడంతో ఫుట్ బాల్ ఆడలేకపోడం నన్ను ఎంతోగానో బాధ పెట్టింది. ఒకరోజు భోజనం చేస్తుండగా నన్ను చూసిన నాన్న ఎందుకు ఏడుస్తున్నావని అడిగారు. ఇంట్లో కూర్చుని ఏం చేయాలని ప్రశ్నించాను. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించడంతో మళ్లీ ఆట మొదలుపెట్టాన’’ని చెప్పుకొచ్చింది. జమ్మూకశ్మీర్ క్రీడల శాఖ కార్యదర్శి ఆమెకు దన్నుగా నిలవడంతో ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. పోలీసులపై రాళ్లు విసిరిన విషయం తెలిసినప్పటికీ ఆయన తనను ఎంతగానో ప్రోత్సహించారని అఫ్షాన్ వెల్లడించింది. ‘‘ఈ ఘటన జరిగిన తర్వాత నన్ను ఎవరూ గుర్తు పట్టరన్న నమ్మకంతో శిక్షణకు వెళ్లాను. క్రీడల శాఖ కార్యదర్శి నా దగ్గరకు వచ్చి ‘సోషల్ మీడియాలో నువ్విప్పుడు పాపులర్ అయిపోయావ్’ అని చెప్పడంతో నేనేం చేశానని ఎదురు ప్రశ్నించాను. నాకేమీ తెలియదని బుకాయించాను. ‘నువ్వేమీ భయపడకు. నీకు అండగా నేనుంటాను. అసలేం జరిగిందో మీడియాతో చెప్పమనడం’తో ఒప్పుకున్నాను. నాకు ఆయన అండగా నిలిచార’’ని అఫ్షాన్ గుర్తు చేసుకుంది. 24 ఏళ్ల అఫ్షాన్ ఆషిక్ ప్రస్తుతం ముంబైలో క్రీడాజీవితం కొనసాగిస్తోంది. తాజాగా జరుగుతున్న భారత మహిళల లీగ్(ఐడబ్ల్యూఎల్)లో కొల్హాపూర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. గతేడాది జమ్మూకశ్మీర్ జట్టుకు ఆడిన ఆమె కోచ్ సత్పాల్ సింగ్ సూచన మేరకు కొల్హాపూర్ టీమ్‌లో చేరింది. దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్నదే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ముంబైరావడానికి ముందు శ్రీనగర్ లో ఫుట్ బాల్ కోచ్ గానూ అఫ్షాన్ వ్యవహరించింది. స్వంతంగా యూనిక్ ఫుట్ బాల్ గాల్స్ పేరుతో స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేసి దాదాపు 150 మంది బాలికలకు ఆట నేర్పించింది.దీనికి పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. బాలికలకు ఓపెన్ గ్రౌండ్ ఇవ్వడానికి స్థానిక ఫుట్‌బాల్ అసోసియేషన్ ఒప్పుకోలేదు. అఫ్షాన్ పట్టు వదలపోవడంతో ప్రభుత్వం దిగివచ్చింది. శ్రీనగర్ లోని టీఆర్సీ మైదానంలో బాలికలకు శిక్షణ ఇచ్చేందుకు సర్కారు నుంచి అనుమతి సాధించింది. ముంబై నుంచి తిరిగొచ్చేయాలని తన దగ్గర ఆట నేర్చుకుంటున్న బాలికలు అడుగుతుంటారని అఫ్షాన్ తెలిపింది. తన సహచర కోచ్ మసూద్ ప్రస్తుతం వీరికి శిక్షణ ఇస్తున్నాడని చెప్పింది.ఫుట్ బాలర్‌గా మారిన స్టోన్ పెల్టర్ గా తనను వర్ణించడాన్ని అఫ్షాన్ అస్సలు ఒప్పుకోదు. ఫుట్‌బాల్ క్రీడాకారిణిగానే తనను గుర్తించాలని ఆమె ఆరాటపడుతోంది. ‘‘ఎవరైనా నన్ను స్టోన్ పెల్టర్ అని పిలిస్తే కాదని గొంతెత్తి ఆరవాలనిపిస్తుంది. నేను గోల్ కీపర్‌ని. ఫుట్ బాల్ ఆడేటప్పడు బాగా త్రో చేయగలను. ఏదో ఒకరోజు ఫుట్‌బాల్ క్రీడాకారిణిగానే నన్ను అందరూ గుర్తు పెట్టుకుంటార’’ని అఫ్షాన్ అభిలషించింది. ఆమె అనుకున్నట్టుగా జరగాలని మనమంతా కోరుకుందాం. – పోడూరి నాగ శ్రీనివాసరావు సాక్షి వెబ్ డెస్క్ -
సంచలన తీర్పు; 180 ఏళ్ల జైలు శిక్ష
వాషింగ్టన్: బాలురుపై లైంగిక వేధింపులకు పాల్పడిన బాస్కెట్‌బాల్ కోచ్‌కు అమెరికాలోని ఓ కోర్టు 180 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. గ్రెగ్ స్టీఫెన్.. అమెరికాలోని లోవాకు చెందిన ఓ ప్రముఖ బాస్కెట్‌బాల్ క్లబ్‌కు కోచ్‌గా వ్యవహిస్తున్నాడు. బాస్కెట్ బాల్ కోచ్‌గా అతనికి మంచిపేరు ఉంది. దీంతో ఎక్కువ మంది అతని వద్దకే కోచింగ్‌కు వస్తుంటారు. ఆటలో పిల్లల్ని మెరికల్లా తీర్చిదిద్దగల సామర్థ్యం అతని వద్ద ఉంది. కానీ అతని అసలు స్వరూపం తెలిస్తే షాకవ్వల్సిందే.. అతనికి అబ్బాయిలంటే పిచ్చి. అమ్మాయి పేరిట సోషల్ మీడియాలో ఓ ఖాతా తెరిచి, అబ్బాయిలతో చాటింగ్ చేసేవాడు. తనను ప్రేమించాలంటూ వేధించేవాడు. తాను కోచ్‌గా ఉన్న బాస్కెట్‌బాల్ టీమ్ మెంబర్స్.. హోటళ్లలో నిద్రపోతున్నపుడు, వారి దుస్తులు విప్పి, పక్కనే పడుకొని సెల్ఫీలు తీసుకొనేవాడు. తర్వాత ఆ ఫోటోలు చూపించి వారిరి బెదిరింపులకు గురిచేసేవాడు. ఇలా 20 ఏళ్లపాటు ఎవరికీ తెలియకుండా రహస్య కార్యకలాపాలు సాగించిన 43 ఏళ్ల గ్రెగ్ స్టీఫెన్ చివరకు జైలుపాలయ్యాడు. గ్రెగ్ దాచుకున్న ఓ పెన్‌డ్రైవ్‌లో అతడు అబ్బాయిలతో ఉన్న చిత్రాలుండటం చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోచ్ వద్ద పాఠాలు నేర్చుకున్న పిల్లలు కూడా అతడి ప్రవర్తపై ఫిర్యాదు చేయడంతో అసలు కథ బయటకు వచ్చింది. దీనిపై విచారణ జరిపిన అధికారులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. గ్రెగ్ ఇప్పటివరకూ దాదాపు 440 మంది అబ్బాయిలను లైంగికంగా వేధించినట్లు ఆధారాలు లభించాయి. వారి ఫిర్యాదు మేరకు కేసును విచారించిన న్యాయమూర్తి ఆధారాలు చూసి ఖంగుతిన్నారు. గ్రేగ్ చేసిన నేరం క్షమించదగినది కాదని భావించిన కోర్టు.. అతనికి ఏకంగా 180 ఏళ్ల జైలుశిక్ష విధించింది. అతడు జైలు నుంచి విడుదల కావడం అసాధ్యమని, ఈ కేసులో ఇంతకుమించి శిక్ష విధించలేమని కోర్టు వ్యాఖ్యానించింది. -
ఫారిన్ కోచ్
బాలీవుడ్ నటులు తమిళంలో నటించడం కొత్తేం కాదు. ‘తుపాకీ’ సినిమాలో విద్యుత్ జమాల్ విలన్‌గా నటించారు. అజిత్ ‘వివేగమ్’ సినిమాలో వివేక్ ఒబెరాయ్ నటించారు. ‘2.ఓ’లో అక్షయ్‌కుమార్ నటించారు. రీసెంట్గా అమితాబ్ బచ్చన్ ‘ఉయంర్ద మణిదన్’(తమిళం, హిందీ) అనే సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా విజయ్ సినిమాలో జాకీ ష్రాఫ్ నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా ఫుట్‌బాల్ స్పోర్ట్స్ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో ఫారిన్ ఫుట్‌బాల్ టీమ్ కోచ్‌గా కనిపిస్తారట జాకీ ష్రాఫ్. ఇదివరకు ఆయన పలు తమిళ చిత్రాల్లో నటించారు. కాగా తాజా చిత్రంలో ఫుట్‌బాల్ ప్లేయర్ కమ్ కోచ్ మైఖేల్ పాత్రలో విజయ్ నటిస్తారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో వేసిన ఆరు కోట్ల భారీ సెట్లో జరుగుతోంది. -
సౌత్ టు నార్త్ ఫుల్ బిజీ
కీర్తీసురేశ్ బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇండియన్ ఫుట్‌బాల్ కెప్టెన్, మేనేజర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అజయ్ దేవగన్ హీరోగా ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇందులో అజయ్ భార్యగా కీర్తి నటించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కాకుండా ఆమె మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఓకే చేశారట. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని టాక్. తెలుగులో నూతన దర్శకుడు నరేంద్ర దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు కీర్తి. ఇలా.. సౌత్ టు నార్త్ కీర్తి డైరీ ఫుల్ బిజీ. -
ఫుట్‌బాల్ దిగ్గజం జుల్ఫికర్ అస్తమయం
సాక్షి, హైదరాబాద్: భారత ఫుట్‌బాల్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న మొహమ్మద్ జుల్ఫికరుద్దీన్ (83) ఆదివారం కన్ను మూశారు. సుదీర్ఘ కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమా ర్తెలు ఉన్నారు. 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో సెమీఫైనల్ చేరిన భారత జట్టులో జుల్ఫికర్ సభ్యుడుగా ఉన్నారు. ఈ టీమ్‌లో 17 ఏళ్ల జుల్ఫికర్ సహా మొత్తం ఆరుగురు హైదరాబాద్‌కు చెందిన వారు ఉండటం విశేషం. మలేసియాలో జరిగిన మెర్డెకా కప్‌తో తొలిసారి భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన జుల్ఫికర్ 1958 టోక్యో ఆసియా క్రీడల్లో కూడా పాల్గొన్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున... జుల్ఫికర్ 1954లో హైదరాబాద్ స్పోర్టింగ్ క్లబ్ తరఫున కెరీర్ ప్రారంభించి ప్రఖ్యాత కోచ్ సయ్యద్ అబ్దుల్ (ఎస్ఏ) రహీమ్ శిక్షణలో రాటుదేలారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ సిటీ పోలీస్ జట్టులో చేరారు. 1954 నుంచి 1967 మధ్య కాలంలో ఆయన వరుసగా అటు ఆంధ్రప్రదేశ్ జట్టుకు, ఇటు హైదరాబాద్ సిటీ పోలీస్ జట్టుకు కూడా కెప్టెన్‌గా వ్యవహరించారు. జుల్ఫికర్ నాయకత్వంలో ఏపీ మూడు సార్లు (1956, 1957, 1965) జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్ సంతోష్ ట్రోఫీని గెలుచుకుంది. ఓవరాల్‌గా ఆయన 15 గోల్స్ చేశారు. హైదరాబాద్ సిటీ పోలీస్ జట్టుకు కూడా కెప్టెన్‌గా ఐఎఫ్ఏ షీల్డ్, డ్యురాండ్ కప్, రోవర్స్ కప్వంటి ప్రఖ్యాత టైటిల్స్‌ను అందించారు. జుల్ఫికర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్... ఆటకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రఫత్ అలీ, జి.ఫల్గుణలతో పాటు మాజీ క్రీడాకారులు ఎస్ఏ హకీమ్, విక్టర్ అమల్‌రాజ్, అక్బర్, హబీబ్, అలీమ్ ఖాన్ సంతాపం ప్రకటించారు. -
ఉర్దూ పాఠాలు
అజయ్ దేవగన్ హైదరాబాదీలా కనిపిస్తే ఎలా ఉంటుంది? ఉర్దూ యాసలో డైలాగ్స్ పలికితే ఎలా ఉంటుంది? సూపర్ కదా. ప్రస్తుతం ఆయన దాని కోసమే శిక్షణ తీసుకుంటున్నారట. తన లేటెస్ట్ సినిమా కోసమే ఇదంతా. ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్ సయద్ అబ్దుల్ రహీమ్ పాత్రలో అజయ్ కనిపించనున్న సంగతి తెలిసిందే. అమిత్ శర్మ దర్శకత్వంలో జీ స్టూడియోస్, బోనీ కపూర్, ఆకాశ్ చావ్లా, జోయ్ సేన్ గుప్తా నిర్మించనున్నారు. సయద్ రహీమ్ హైదరాబాదీ. సో.. ఆయన పాత్రలో పూర్తిగా ఒదిగిపోవడానికి ఉర్దూ నేర్చుకుంటున్నారట అజయ్. రహీమ్ ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్‌గా చేసిన పదకొండేళ్ల ప్రాంతంలో ఈ సినిమా కథ నడుస్తుందట. -
బ్యాక్ టు బ్యాక్
ప్రస్తుతం ప్రపంచమంతా సాకర్ ఫుట్‌బాల్ ఫీవర్‌లో ఉంది. ఫుట్‌బాల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే మూవీని అనౌన్స్ చేయడానికి ఇలాంటి క్రేజీ టైమ్‌ను ఎవ్వరూ వదులుకోరు. అజయ్ దేవగన్ అండ్ టీమ్ కూడా వదులుకోలేదు. ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ఓ మూవీ తెరకెక్కంచనున్నట్లు ప్రకటించారు. 1950–1963 టైమ్‌లో ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్‌కి కోచ్, మేనేజర్‌గా సయ్యద్ సేవలు అందించారు. 1956 మెల్బోర్న్ ఒలిపింక్స్‌లో ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ సెమీ ఫైనల్స్‌కు, 1962 ఆసియన్ గేమ్స్‌లో టీమ్ గోల్డ్ మెడల్ సాధించడంలో సయ్యద్ పాత్ర ప్రముఖమైనది. సయ్యద్ బయోపిక్‌లో అజయ్ నటించనున్నారు. అమిత్ శర్మ దర్శకుడు. మరోవైపు రాజనీతి శాస్త్రజ్ఞుడు, ఆర్థికవేత్త చాణక్య బయోపిక్‌లోనూ నటించడానికి అజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు నీరజ్ పాండే దర్శకుడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ బయోపిక్స్‌లో నటించడానికి అజయ్ దేవగన్ అంగీకరించడం విశేషం. -
బాలుడిపై లైంగిక దాడి.. ఇండియన్ కోచ్ కు జైలు..
దుబాయ్: కోచింగ్ కోసం వచ్చిన ఓ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఫుట్ బాల్ కోచ్ కు మూడేళ్ల జైలుశిక్ష పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్ కు చెందిన విద్యార్థి గతేదాడి ఫేస్ బుక్ లో పరిచయమైన దేశానికే చెందిన కోచ్ ను కలుసుకున్నాడు. తనకు ఫుట్ బాల్ కోచింగ్ ఇవ్వాలని అడిగితే అంగీకరించాడు. అప్పటి నుంచి ప్రతిరోజూ మైదానంలో శిక్షణ ఇచ్చేవాడు. కొన్ని నెలల నుంచి బాలుడితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. టీనేజర్ న్యూడ్ గా ఉన్న సమయంలో ఫొటోలు తీశాడు. తనతో సెక్స్ లో పాల్గొనాలని బాలుడిని ఒత్తిడికి గురిచేస్తున్నాడు. అందుకు ఆ కుర్రాడు అంగీకరించకపోవడంతో అతడిపై కోచ్ కక్ష్య పెంచుకున్నాడు. ఫొటోలను ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. తనతో పాటు మరికొంత మంది విద్యార్థులతో అదేతీరుగా ప్రవర్తిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదుచేశాడు. గతంలో కూడా కోచ్ ప్రవర్తన ఇదే రీతిగా ఉండేదని తనకు ఈ మధ్యే తెలిసిందని అప్పటినుంచి అతనికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించాడు. తాను పిలిచినప్పుడు వచ్చి లైంగిక చర్యలు జరపాలని, లేనిపక్షంలో తాను మొబైల్ ఫోన్లో తీసిన న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానంటూ వేధింపులకు గురిచేస్తున్నట్లు చెప్పాడు. పోలీసులు కోచ్ ను సంప్రదించి అతడి మొబైల్ తీసుకుని చూడగా అసభ్యకర ఫొటోలు ఉన్నాయని, దీంతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కోర్టులో ప్రవేశపెట్టగా టీనేజర్స్ ను లైంగికంగా వేధించడంతో పాటు బ్లాక్ మెయిల్ చేసినందుకు ఫుట్ బాల్ కోచ్ కు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ స్థానిక కోర్టులో తీర్పు వెలువడింది.