శ్రీనిధి డెక్కన్‌ ఎఫ్‌సీ హెడ్‌ కోచ్‌గా పోర్చుగల్‌ స్టార్‌ | I League Sreenidhi Deccan FC New Head Coach Rui Amorim | Sakshi
Sakshi News home page

శ్రీనిధి డెక్కన్‌ ఎఫ్‌సీ హెడ్‌ కోచ్‌గా పోర్చుగల్‌ స్టార్‌

Published Fri, Sep 27 2024 1:09 PM | Last Updated on Fri, Sep 27 2024 2:41 PM

I League Sreenidhi Deccan FC New Head Coach Rui Amorim

సాక్షి, హైదరాబాద్‌: దేశవాళీ ఐ–లీగ్‌ టోర్నీలో గత రెండు సీజన్‌లలో రన్నరప్‌గా నిలిచిన శ్రీనిధి డెక్కన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) జట్టుకు కొత్త హెడ్‌ కోచ్‌ వచ్చాడు. పోర్చుగల్‌కు చెందిన రుయ్‌ అమోరిమ్‌ తక్షణమే హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించి రాబోయే సీజన్‌ కోసం శ్రీనిధి జట్టును సిద్ధం చేయనున్నాడు. గత సీజన్‌లో హెడ్‌ కోచ్‌గా ఉన్న డొమింగొ ఒరామస్‌ ఇటీవల రాజీనామా చేయడంతో అతని స్థానంలో అమోరిమ్‌ వచ్చాడు.

ఇక.. 2008 నుంచి అంతర్జాతీయ క్లబ్‌ ఫుట్‌బాల్‌లో కోచ్‌గా పని చేస్తున్న 47 ఏళ్ల అమోరిమ్‌ ఇప్పటి వరకు 10 క్లబ్‌కు కోచ్‌గా వ్యవహరించాడు. చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన ఎస్‌సీ నోజ్మో క్లబ్‌ జట్టుకు ఈనెల 14 వరకు అమోరిమ్‌ కోచ్‌గా పని చేసి అక్కడి నుంచి శ్రీనిధి డెక్కన్‌ క్లబ్‌కు రానున్నారు. ‘శ్రీనిధి డెక్కన్‌ జట్టులో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నాను. నా అనుభవాన్ని పంచుకొని జట్టు మరింత ఉన్నతస్థితికి ఎదిగేందుకు కృషి చేస్తా’ అని అమోరిమ్‌ వ్యాఖ్యానించాడు.  

మొహమ్మదాన్‌ స్పోర్టింగ్‌ క్లబ్‌ బోణీ 
చెన్నై: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నీలో తొలిసారి బరిలోకి దిగిన మొహమ్మదాన్‌ స్పోర్టింగ్‌ క్లబ్‌ జట్టు మొదటి విజయాన్ని అందుకుంది. భారత్‌లోని అతి పురాతన ఫుట్‌బాల్‌ క్లబ్‌లలో ఒకటైన మొహమ్మదాన్‌ స్పోర్టింగ్‌ క్లబ్‌... గురువారం జరిగిన తమ మూడో లీగ్‌ మ్యాచ్‌లో 1–0 గోల్‌ తేడాతో చెన్నైయిన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ను ఓడించింది. ఆట 39వ నిమిషంలో లాల్‌రెమ్‌సంగా ఫనాయ్‌ గోల్‌ సాధించి మొహమ్మదాన్‌ జట్టుకు విజయాన్ని అందించాడు.

కోల్‌కతాలో 1889లో ఏర్పాటైన మొహమ్మదాన్‌ స్పోర్లింగ్‌ క్లబ్‌ గత ఏడాది భారత దేశవాళీ టోర్నీ ఐ–లీగ్‌లో విజేతగా నిలిచి ఐఎస్‌ఎల్‌లో పోటీపడే అవకాశాన్ని దక్కించుకుంది. మొత్తం 13 జట్లు పోటీపడుతున్న ఐఎస్‌ఎల్‌లో ప్రస్తుతం మొహమ్మదాన్‌ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడింది. ఒక మ్యాచ్‌లో గెలిచి, మరో మ్యాచ్‌లో ఓడి, ఇంకో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని నాలుగు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. కోల్‌కతా వేదికగా నేడు జరిగే మ్యాచ్‌లో గోవా ఎఫ్‌సీ జట్టుతో ఈస్ట్‌ బెంగాల్‌ ఎఫ్‌సీ జట్టు తలపడుతుంది.  

క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్‌లో స్నేహిత్‌ ఓటమి 
బీజింగ్‌: చైనా స్మాష్‌–2024 వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) టోర్నీలో  భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. గురువారం మొదలైన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్‌ క్వాలిఫయింగ్‌లో భారత్‌ తరఫున నలుగురు ప్లేయర్లు బరిలోకి దిగారు. మనుశ్‌ ఉత్పల్‌భాయ్‌ షా మినహా మిగతా ముగ్గురు తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు. 

తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో తెలంగాణ ప్లేయర్‌ సూరావజ్జుల స్నేహిత్‌ 11–6, 7–11, 3–11, 3–11తో మా జిన్‌బావో (అమెరికా) చేతిలో... హర్మీత్‌ దేశాయ్‌ 6–11, 11–9, 6–11, 11–8, 5–11తో కార్ల్‌సన్‌ (స్వీడన్‌) చేతిలో... సత్యన్‌ 9–11, 13–11, 6–11, 11–9, 4–11తో జు హైడాంగ్‌ (చైనా) చేతిలో ఓటమి చవిచూశారు. మనుశ్‌ షా 4–11, 11–5, 11–4, 3–11, 11–8తో చాన్‌ బాల్డ్‌విన్‌ (హాంకాంగ్‌)పై నెగ్గాడు. మహిళల క్వాలిఫయింగ్‌ సింగిల్స్‌లో తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో అహిక ముఖర్జీ, సుతీర్థ ముఖర్జీ తమ ప్రత్యర్థులను ఓడించి రెండో రౌండ్‌కు చేరారు.

సెమీఫైనల్లో రిత్విక్‌ చౌదరీ జోడీ
సాక్షి, హైదరాబాద్‌: బ్యాంకాక్‌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌కు చెందిన బొల్లిపల్లి రిత్విక్‌ చౌదరీ డబుల్స్‌లో సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. థాయ్‌లాండ్‌లోని నొంతాబురి పట్టణంలో ఈ టోర్నీ జరుగుతోంది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో రిత్విక్‌–అర్జున్‌ ఖడే (భారత్‌) ద్వయం 7–6 (7/3), 7–6 (7/5)తో గాబ్రియెల్‌ డియాలో (కెనడా)–సీటా వతనాబె (జపాన్‌) జోడీని ఓడించింది.

గంటా 47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జంటలు తమ సర్వీస్‌ను రెండుసార్లు చొప్పున కోల్పోయాయి. అయితే టైబ్రేక్‌లో రిత్విక్‌–అర్జున్‌ ద్వయం పైచేయి సాధించి విజయాన్ని దక్కించుకుంది. ఇదే టోర్నీలో ఆడుతున్న రామ్‌కుమార్‌ రామనాథన్‌ (భారత్‌)–తొష్‌హిడె మత్సుయ్‌ (జపాన్‌) జోడీ కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్‌ ఫైనల్లో రామ్‌–తొష్‌హిడె జంట 6–3, 6–4తో అలెజాంద్రో మొరో కనాస్‌ (స్పెయిన్‌)–మార్కో ట్రున్‌గెలిటి (అర్జెంటీనా) జోడీపై గెలిచింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement