
బెంగళూరు: భారత యువ అథ్లెట్ గురీందర్‌వీర్ సింగ్ 100 మీటర్ల పరుగులో జాతీయ రికార్డు నెలకొల్పాడు. పంజాబ్‌కు చెందిన 24 ఏళ్ల గురీందర్‌వీర్ సింగ్.. ఇండియన్ గ్రాండ్ ప్రిలో ఈ ఘనత సాధించాడు. శుక్రవారం జరిగిన పోటీల్లో అతను10.20 సెకన్ల్లలో లక్ష్యాన్ని చేరాడు. గతంలో ఈ రికార్డు మణికంఠ హోబ్లిధార్ (10.23 సెకన్లు) పేరిట ఉండగా... తాజాగా గురీందర్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు.
2021లో 10.27 సెకన్లలో వంద మీటర్లు పరిగెత్తిన ఈ పంజాబ్ స్ప్రింటర్... ఇప్పుడు దాన్ని సరిచేశాడు. ఇదే పోటీల్లో మణికంఠ 10.21 సెకన్లలో గమ్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచాడు. అతడికిదే వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన.
గత కొంతకాలంగా ఈ ఇద్దరి మధ్య రసవత్తర పోరు సాగుతోంది. అమ్లన్ బొర్గోహై (10.43 సెకన్లు) మూడో స్థానంతో రేసును ముగించాడు. గురీందర్‌వీర్ సింగ్ 2021, 2024లో ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్‌లలో పసిడి పతకాలు సాధించాడు.
చెన్నై, మధురైలో జూనియర్ హాకీ వరల్డ్‌కప్
చెన్నై: ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న ఎఫ్‌ఐహెచ్ జూనియర్ పురుషుల హాకీ ప్రపంచకప్‌నకు సంబంధించిన వేదికలు ఖరారయ్యాయి. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు జరగనున్న ఈ టోర్నీని చెన్నై, మధురై నగరాల్లో నిర్వహించనున్నట్లు హాకీ ఇండియా (హెచ్‌ఐ) శుక్రవారం వెల్లడించింది. 24 జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వనుండటం ఇది మూడోసారి. 2016లో లక్నో వేదికగా, 2021లో భువనేశ్వర్‌లో జూనియర్ పురుషుల హాకీ ప్రపంచకప్ జరిగింది.
‘చెన్నై, మధురై నగరాల్లో పోటీలు నిర్వహిస్తాం. వరల్డ్‌కప్‌లో మొత్తం 24 జట్లు పాల్గొంటున్నాయి. మధురైలో అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగడం ఇదే తొలిసారి. భిన్నమైన నగరాలకు ఆటను విస్తరించాలనే ఉద్దేశంతోనే మధురైను వేదికగా ఎంపిక చేశాం’ అని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ పేర్కొన్నాడు.
భారత్‌లో చివరిసారిగా 2021లో జరిగిన ప్రపంచకప్‌లో అర్జెంటీనా జట్టు విజేతగా నిలవగా... 2023లో కౌలాలంపూర్‌లో జరిగిన వరల్డ్‌కప్‌లో జర్మనీ చాంపియన్‌గా నిలిచింది. సెమీఫైనల్లో ఓడిన భారత్ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. మరి ఈసారి స్వదేశంలో జరగనున్న టోర్నీలో అయినా యువభారత్ విజేతగా నిలుస్తుందా చూడాలి.
అనాహత్‌కు టైటిల్
ముంబై: జేఎస్‌డబ్ల్యూ ఇండియన్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో యువ క్రీడాకారణి అనాహత్ సింగ్ చాంపియన్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో భారత నంబర్‌వన్ ర్యాంకర్ అనాహత్ సింగ్ 3–0 (11–9, 11–5, 11–8)తో హలెన్ టాంగ్ (హాంకాంగ్)పై విజయం సాధించింది.
ఈ విజయంతో అనాహత్ 300 ర్యాంకింగ్ పాయింట్లు ఖాతాలో వేసుకుంది. 17 ఏళ్ల అనాహత్‌కు ఇది వరుసగా ఆరో టైటిల్ కాగా... ఓవరాల్‌గా 11వది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ ప్లేయర్ అభయ్ సింగ్ రన్నరప్‌గా నిలిచాడు. శుక్రవారం జరిగిన ఫైనల్లో అభయ్ సింగ్ 1–3 (10–12, 4–11, 11–7, 10–12)తో కరీమ్ (ఈజిప్ట్) చేతిలో ఓటమి పాలయ్యాడు.
పుణేలో మహిళల చెస్ గ్రాండ్ ప్రి
పుణే: ఫిడే మహిళల గ్రాండ్ ప్రి ఐదో అంచె పోటీలకు పుణే ఆతిథ్యమివ్వనుంది. వచ్చే నెల 13 నుంచి 24 వరకు జరగనున్న ఈ టోర్నీలో ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్ కోనేరు హంపి, ఒలింపియాడ్ స్వర్ణ పతక విజేతలు ద్రోణవల్లి హారిక, వైశాలి, దివ్య దేశ్‌ముఖ్ తదితరులు పాల్గొననున్నారు. మహారాష్ట్ర చెస్ సంఘం నిర్వహించనున్న ఈ టోర్నీలో చైనా గ్రాండ్‌మాస్టర్ జూ జినెర్, పొలినా షువలోవా (రష్యా), అలీనా కష్లిన్‌స్క్యా (పోలాండ్), సలిమోవా నుర్గుల్ (బల్గేరియా), బక్తుయాగ్ (మంగోలియా), మెలియా సలోమె (జార్జియా) పాల్గొననున్నారు.
ఫిడే గ్రాండ్ ప్రి సిరీస్‌లో 14 మంది టాప్ ప్లేయర్లతో పాటు... ఆరుగురు ప్లేయర్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పాల్గొంటారు. గత సిరీస్‌ల ఆధారంగా ప్లేయర్ల ఎంపిక జరుగుతుంది. భారత్ యువ ప్లేయర్ ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈ టోరీ్నలో పోటీపడనుంది.
శరత్ కమల్ జోరు
చెన్నై: భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) దిగ్గజం ఆచంట శరత్ కమల్... తన చివరి టోర్నీలో చక్కటి విజయాలతో దూసుకెళ్తున్నాడు. చెన్నై వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నమెంట్‌లో శరత్ కమల్ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో శరత్ 3–0 (11–8, 11–8, 11–9)తో పదో సీడ్ నికోలస్ లుమ్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. 42 ఏళ్ల శరత్... తనకంటే 23 సంవత్సరాలు చిన్నవాడైన ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం కనబర్చాడు.
దేశం తరఫున ఐదుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న శరత్ కమల్ బ్యాక్‌హ్యాండ్, ఫోర్ హ్యాండ్ షాట్లతో ఆకట్టుకొని వరుస గేమ్‌ల్లో విజయం సాధించాడు. శరత్‌తో పాటు పురుషుల విభాగంలో భారత్ నుంచి తెలంగాణ ప్యాడ్లర్ స్నేహిత్ సురావజ్జుల, మానవ్ ఠక్కర్ ప్రిక్వార్టర్స్‌కు చేరగా... మహిళల విభాగంలో కృతి్వక రాయ్ ముందంజ వేసింది.
స్నేహిత్ 3–2 (8–11, 11–13, 11–9, 11–7, 12–10)తో యుకియా ఉడా (జపాన్)పై, మానవ్ 3–1 (11–4, 7–11, 11–5, 11–8)తో పిన్ లూ (ఆస్ట్రేలియా)పై గెలిచారు. మహిళల విభాగంలో పదో సీడ్ తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ 2–3 (6–11, 9–11, 11–6, 11–4, 7–11)తేడాతో కృత్వికరాయ్ చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో శరత్–స్నేహిత్ జంట 1–3 (11–9, 8–11, 9–11, 6–11)తో ఆస్ట్రేలియా జోడీ చేతిలో ఓడింది.