
లండన్ మారథాన్ మహిళల విభాగంలో ఇథియోపియా రన్నర్ ఘనత
లండన్: ప్రతిష్టాత్మక లండన్ మారథాన్ రేసులో మహిళల విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఆదివారం జరిగిన ఈ రేసులో ఇథియోపియాకు చెందిన టిగ్స్‌ట్ అసీఫా విజేతగా అవతరించింది. 42.195 కిలోమీటర్ల దూరాన్ని 28 ఏళ్ల అసీఫా 2 గంటల 15 నిమిషాల 50 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని అందుకుంది. ఈ క్రమంలో 2 గంటల 16 నిమిషాల 16 సెకన్లతో పెరెస్ జెప్‌చిర్‌చిర్ (కెన్యా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును అసీఫా బద్దలు కొట్టింది. గత ఏడాది లండన్ మారథాన్‌లోనే పెరెస్ జెప్‌చిర్‌చిర్ ఈ ప్రపంచ రికార్డును సృష్టించి స్వర్ణ పతకాన్ని సాధించగా... అసీఫా రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకుంది.
ఈ సంవత్సరం పెరెస్ జెప్‌చిర్‌చిర్ లండన్ మారథాన్‌కు దూరం కాగా... అసీఫా అద్భుత ప్రదర్శనతో పసిడి పతకం సొంతం చేసుకోవడంపాటు ప్రపంచ రికార్డును లిఖించింది. జాయ్స్‌లిన్ జెప్‌కోస్గి (కెన్యా; 2గం:18ని:44 సెకన్లు) రజతం, సిఫాన్ హసన్ (నెదర్లాండ్స్; 2గం:19నిమిషాలు) కాంస్యం సాధించారు. గత ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం నెగ్గిన అసీఫా 2022, 2023 బెర్లిన్ మారథాన్ రేసుల్లోనూ విజేతగా నిలిచింది.
లండన్ మారథాన్ పురుషుల విభాగంలో సెబాస్టియన్ సావీ (కెన్యా) విజేతగా నిలిచాడు. సెబాస్టియన్ 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 2 నిమిషాల 27 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. జేకబ్ కిప్లిమో (ఉగాండా; 2గం:3ని:37 సెకన్లు) రజతం, అలెగ్జాండర్ ముతిసో (కెన్యా; 2గం:4ని:20 సెకన్లు) కాంస్యం సాధించారు.