
లిథువేనియా అథ్లెట్ మికోలస్ అలెక్నా ఘనత
రామోనా (అమెరికా): పురుషుల అథ్లెటిక్స్ డిస్కస్ త్రో క్రీడాంశంలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఒక్లాహోమా త్రోస్ సిరీస్ వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ బ్రాంజ్ లెవెల్ మీట్‌లో లిథువేనియాకు చెందిన మికోలస్ అలెక్నా (Mykolas Alekna- 75.56 మీటర్లు) ఈ ఘనత సాధించాడు.
స్వర్ణ పతకం గెలిచే క్రమంలో 22 ఏళ్ల అలెక్నా తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును రెండుసార్లు తిరగ రాయడం విశేషం. గత ఏడాది ఇదే మీట్‌లో అలెక్నా డిస్క్‌ను 74.35 మీటర్ల దూరం విసిరి... 1986 నుంచి జుర్గెన్ షుల్ట్ (జర్మనీ; 74.08 మీటర్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మికోలస్ రజత పతకం గెలిచాడు.
భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఒక్లాహోమో మీట్‌లో అలెక్నా తొలి ప్రయత్నంలో డిస్క్‌ను 74.89 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డును సవరించాడు. ఆ తర్వాత ఐదో ప్రయత్నంలో డిస్క్‌ను 75.56 మీటర్ల దూరం విసిరి మరో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా డిస్క్‌ను 75 మీటర్ల దూరం విసిరిన తొలి అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు.
తండ్రి బాటలో
మికోలస్‌కు ఘనమైన క్రీడా కుటుంబ నేపథ్యం ఉంది. మికోలస్ తండ్రి వర్జిలియస్ అలెక్నా కూడా విఖ్యాత డిస్కస్ త్రోయర్ కావడం విశేషం. 6 అడుగుల 7 అంగుళాల ఎత్తు, 130 కేజీల బరువున్న వర్జిలియస్ 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో స్వర్ణం, 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో సర్ణం, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించాడు.
2003 పారిస్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, 2005 హెల్సింకి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాలు నెగ్గిన వర్జిలియస్... 1997 ఏథెన్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, 2001 ఎడ్మంటన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాడు.
ఓవరాల్‌గా తన కెరీర్‌లో వర్జిలియస్ 12 స్వర్ణాలు, 6 రజతాలు, 3 కాంస్యాలు గెలిచాడు. 2014లో రిటైర్మెంట్ ప్రకటించిన 53 ఏళ్ల వర్జిలియస్ రాజకీయాల్లో ప్రవేశించి లిథువేనియా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.