
పురుషుల 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో జర్మనీ స్విమ్మర్ లుకాస్ మార్టిన్ ఘనత
స్టాక్‌హోమ్ (స్వీడన్): పురుషుల స్విమ్మింగ్ 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో 16 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ప్రపంచ రికార్డు బద్దలైంది. స్విమ్ ఓపెన్ స్టాక్‌హోమ్ టోర్నీలో జర్మనీకి చెందిన లుకాస్ మార్టిన్ ఈ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం నెగ్గిన లుకాస్ మార్టిన్ 400 మీటర్లను 3 నిమిషాల 39.96 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు.
ఈ క్రమంలో 2009 నుంచి పాల్ బీడెర్మన్ (3ని:40.07 సెకన్లు; జర్మనీ) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును మార్టిన్ బద్దలు కొట్టాడు. 2009లో రోమ్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్‌లో ‘సూపర్ సూట్స్’ ధరించి బీడెర్మన్ ఈ రికార్డు నెలకొల్పాడు. 2010లో ప్రపంచ స్విమ్మింగ్ సమాఖ్య ‘సూపర్ సూట్స్’ను నిషేధించింది.