
21,850 మంది విద్యార్థులతో 108 సూర్య నమస్కారాలు
సాక్షి, పాడేరు: అందాల అరకులోయలో అద్భుతం ఆవిష్కృతమయింది. మహా సూర్యవందనాల్లో స్థానిక గిరిజన విద్యార్థులు సత్తాచాటారు. ప్రపంచ రికార్డ్ సొంతం చేసుకున్నారు. అరకు లోయ డిగ్రీ కళాశాల మైదానం ఈ ఘట్టానికి వేదికగా నిలిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitarama Raju district) అధికారులు, శిక్షకుల మూడు నెలల కష్టానికి ఫలితం లభించింది.
ఐదు మండలాల పరిధిలోని గిరిజన విద్యాలయాలకు చెందిన 21,850 మంది విద్యార్థులు ఉత్సాహంగా 108 సూర్య నమస్కారాల కార్యక్రమంలో పాల్గొన్నారు. పతంజలి శ్రీనివాస్ శంఖం పూరించి యోగాసనాలను (Yoga Asanas) ప్రారంభించారు. ఒకే వేదికపై విద్యార్థులు 2 గంటల పాటు 108 సూర్య నమస్కారాలు చేయడంతో మైదానంలో ఆధ్యాత్మిక వాతావరణం శోభిల్లింది. ఈ యోగాసనాలను 200 మంది పీడీలు, ఉపాధ్యాయులు పర్యవేక్షించారు.
లండన్‌కు చెందిన ప్రపంచ రికార్డుల యూనియన్ మేనేజర్ అలిస్ రేనాడ్, ఇతర ప్రతినిధులంతా 108 సూర్య నమస్కారాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దృశ్యాలను తమ కెమెరాలలో బంధించారు. ఫ్లడ్‌లైట్ల వెలుగులో రాత్రి వరకు సూర్య నమస్కారాలు (surya namaskars) విజయవంతంగా కొనసాగాయి. అలిస్ రేనాడ్ సూర్య నమస్కారాల ప్రక్రియకు వరల్డ్ రికార్డును ప్రకటించారు. ఈ మేరకు ధ్రువపత్రాన్ని కలెక్టర్, జేసీలకు అందించారు.