
నెలల తరబడి విధులకు కార్యదర్శి గైర్హాజరు
చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన
పెదబయలు: మండలంలోని గోమంగి సచివాలయ కార్యదర్శి రెండు నెలల నుంచి విధులకు హాజరు కావడం లేదని సర్పంచ్ కొర్ర జెట్టో, ఉప సర్పంచ్ కూడ మత్స్యకొండబాబు ఆరోపించారు. విధులకు డుమ్మా కొడుతున్న పంచాయతీ కార్యదర్శి మనోజ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్యాలయం సోమవారం ఎదుట పలువురు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫోన్ చేస్తే సెలవులో ఉన్నానని చెప్పి, తరువాత స్విచ్‌ఆఫ్ చేస్తున్నారని తెలిపారు. పంచాయతీ కార్యదర్శి విధులకు రాకపోవడం వల్ల చాలా వరకు పనులు పెండింగ్‌లో ఉండిపోయాయన్నారు. తాగునీటి ఎద్దడి తదితర సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ఈ విషయంపై ఎంపీడీవో, ఈవోఆర్‌డీలకు ఫిర్యాదు చేసినా వారు స్పందించడం లేదని ఆరోపించారు. అనంతరం కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జెడ్పీటీసీ కొండబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పీసా కమిటీ సభ్యులు గల్లేలు కొండబాబు, జె.సునీల్‌కుమార్, జ్ఞానసుందర్, సిందేరి అనిల్‌కుమార్, కొర్ర మన్మధరావు తదితరులు పాల్గొన్నారు. ఈ విషయంపై స్థానిక ఎంపీడీవో ఎల్.పూర్ణయ్యను వివరణ కోరగా గతంలో గోమంగి పంచాయతీ కార్యదర్శి పనితీరు బాగాలేదని ఫిర్యాదు రావడంతో మెమో జారీ చేసి, జీతం నిలుపుదల చేశామని చెప్పారు. ఉన్నతాధికారులకు నివేదించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నెలల తరబడి విధులకు కార్యదర్శి గైర్హాజరు