
నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు
ఐటీడీఏ పీవో సింహాచలం
రంపచోడవరం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం తెలిపారు. విద్యాశాఖ అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందించాలన్నారు. ప్రతి విద్యార్థిపై దృష్టి పెట్టి, ఎప్పటికప్పుడు సామర్థ్యాలను పరీక్షించాలని చెప్పారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన విద్యా విధానంపై దృష్టి పెట్టాలన్నారు. అంగన్‌వాడీ సెంటర్ నుంచి ప్రైమరీ, అక్కడ నుంచి ఉన్నత పాఠశాలకు వెళ్లే విద్యార్థుల జాబితా రూపొందించాలని, జాబితాలో ఉన్న విద్యార్థులు ఎక్కడ చదువుతున్నారో వివరాలు సేకరించాలని చెప్పారు. జెడ్పీ పాఠశాలల్లో మౌలిక వసతులపై సమీక్షించారు. ఐదు, పది తరగతుల విద్యార్థులు డ్రాప్ అవుట్ పై ఆరా తీశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు, ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి వంటి వివరాలు తెలుసుకున్నారు. ఏకలవ్య,గురుకుల పాఠశాలల్లో నూరుశాతం సీట్ల భర్తీకి చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన తరువాత విద్యార్థులకు బేస్‌లైన్ పరీక్ష నిర్వహించాలన్నారు. ఇంటర్ పాసైన విద్యార్థులకు ఇంజినీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ టెస్టులు రాసేందుకు ప్రత్యేక శిక్షణ కోసం ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. ఇంటర్‌లో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను ప్రోత్సహిస్తామన్నారు. సమావేశంలో డీడీ రుక్మాండయ్య, ఏజెన్సీ డీఈవో వై మల్లేశ్వరరావు, ఎంఈవోలు పాల్గొన్నారు.